పోస్టు చేసిన ఉత్తరాలు-5

26-10-2023, మధ్యాహ్నం 3.40

ప్రియమైన

ఇప్పుడే అసర్ నమాజ్ ప్రార్థన ముగిసిన నిశ్శబ్దం ఈ గాలంతటా పరుచుకుంది. కొద్దిసేపట్లో బళ్ళు విడిచిపెడతారు. పిల్లల్తో, తల్లుల్తో మళ్లా రోడ్లని మేల్కొల్పుతారు. కాని ఆ సంరంభానికి ఇంకా మరికొంతసేపు పడుతుంది. ఈలోపు పున్నాగపూల పరిమళం ఒకసారి తన తీగల్లాంటి చేతులు చాపి కిటికీలోంచి నా చుబుకాన్ని స్పృశించివెళ్ళిపోయింది.

నీకు ఉత్తరం రాసి పన్నెండుగంటలు కాలేదు, ఇంతలోనే మళ్ళా కూచున్నానేమిటి అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు నా ఇరవయ్యేళ్ళప్పుడు పరిచయమై ఉండాల్సింది. అప్పుడు రోజంతా ఉత్తరాలు రాస్తోనే ఉండేవాణ్ణి. ఆ టెలిఫోన్స్ ఆఫీసులో, టెలిఫోన్ టికెట్లమధ్య, ఆ చిట్టాలమధ్య గంటగంటకీ కొత్త ఉత్తరం మొదలుపెడుతూనే ఉండేవాణ్ణి.

నా ఇరవయ్యేళ్ళప్పుడు నువ్వెక్కడున్నావు? అప్పుడు నన్నెందుకు కలవలేదు? ప్రతిరోజూ నీకోసమే కదా ఎదురుచూసేవాణ్ణి. పోస్ట్ మేన్ అడుగులచప్పుడు విన్నబడగానే నీ ఉత్తరమే తెచ్చాడేమోనని ఆశపడేవాణ్ణి. నువ్వు అప్పుడు కలిసి ఉంటే, ఆ గోదావరి ఒడ్డున ఎన్ని సాయంకాలాలు గడిపి ఉండేవాళ్ళమో కదా. సాయంకాలాలు పడవలు రేవుకి చేరుతున్నప్పడు, పక్షులు గూటికి మరలుతున్నప్పుడు, అప్పుడు కదా మనం కలుసుకోవలసింది. ‘రేవులో నవ్యపురుషుడెవరో వీణ వాయిస్తున్నాడు’ అన్న వాక్యం మదిలో మెదిలినప్పుడల్లా, ‘ఒక యువతి ఆ మెట్ల మీద నవ్య రాగం ఆలపిస్తోంది’ అని ఆ వాక్యాన్ని మళ్లా నా భాషలోకి అనువదించుకునేవాణ్ణి. నువ్వు కలుస్తావనీ, ఏ కొత్తలోకాలవో, ఏ పరిణతసస్యాలవో నువ్వు వార్తలు పట్టుకొస్తావనీ, మనిద్దరం ఆ లాంచీల రేవుదగ్గర ఆ సంతోషాన్ని పంచుకుంటూ ఉంటామనీ ఎన్నో కలలుగనేవాణ్ణి. అది కూడా ఎటువంటి సంతోషం? పంచుకునేకొద్దీ రెట్టింపు అయ్యే సంతోషం!

పోనివ్వు, అప్పుడు కనబడలేదు. కనీసం నా నలభయ్యేళ్ళప్పుడన్నా నువ్వు కనబడి ఉండవలసింది. అప్పటికింకా అడవిగాలి నా జుత్తుని వదిలిపెట్టనిరోజులు. నువ్వు నా ఇంటికొచ్చి ఉంటే, తెల్లవారి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు నడయాడిన ప్రతి తావుముందూ పడిపడి పరిపరివిధాల మోకరిల్లేటంత ఉద్వేగభరితమైన రోజులు. ఎందుకని, ఎందుకని నేను నా జీవితమంతా, ఇన్నేళ్ళూ, నువ్వు కనబడతావనీ, నాకోసం అడుగులో అడుగువేసుకుంటో నడిచివస్తావనీ, ఎందుకంత నమ్మకం?

ఎవరు నువ్వు? ఇంతకీ నువ్వు ఒకరా, ఇద్దరా లేక నా యవ్వనోదయకాలం నుంచీ నా సన్నిహితవదనాలు ధరించి ప్రతి రాత్రీ నన్ను కలల్లో వెంటాడుతూ వచ్చిన అస్పష్టవేదనవా, సంవేదనవా?

ఎమిలీ డికిన్ సన్ ఉత్తరాల్లో దాదాపు వెయ్యికి పైగా ఉత్తరాల్లో మూడు ఉత్తరాలు, 1865 నుంచి 1881 మధ్యకాలంలో రాసిన మూడు ఉత్తరాలు పరిశోధకుల్ని కలవరపెడుతూనే ఉన్నాయి. ఎందుకంటే, ఆ ఉత్తరాల్లో ఆమె master అని మాత్రమే సంబోధించింది. ఆ మాస్టర్ ఎవరో ఎవరికీ తెలియదు. కనీసం మూడు నాలుగుపేర్లు ఆ అభ్యర్థిత్వానికి పోటీపడుతున్నాయి. ఒకటి ఆమె తొలిరోజుల్లో కలిసిన ఒక మతాచార్యుడు వాడ్స్ వర్త్. తన ఇరవయ్యల్లో ఆమె తన తండ్రికూడా ఫిలడెల్ఫియా వెళ్ళినప్పుడు ఆయన్ని చూసింది. ఆ తర్వాత జీవితంలో బహుశా మరొకసారి కలిసిఉంటుంది. ఆమె ఉత్తరాల సంకలనకర్త జాన్సన్ దృష్టిలో ఆ మాస్టర్ వాడ్స్ వర్త్ కావడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. కాని అది సరళంగా చెప్పెయ్యగల విషయం కాదు. మారియా పొపోవా అనే భావుకురాలు, తన Figuring (2019) లో ఈ విషయమ్మీద కూడా చాలా చర్చించింది. ఆమె ఆమె రకరకాల ఆధారాలు చూపించి ఆ మాస్టర్ ఎమిలీ మరదలు సుసాన్ గానీ లేదా మరొక మిత్రురాలు కేట్ గానీ ఎందుకు కాకూడదు అని ప్రశ్నిస్తుంది. ఎమిలీ తన చివరిసంవత్సరాల్లో ఓటిస్ అనే జడ్జితో ప్రేమలో పడింది. ఆయన ఆమె కన్నా కనీసం ఇరవయ్యేళ్ళు పెద్ద. వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకుందామని అనుకున్నారని కూడా చెప్పుకుంటారు. ఆయన కూడా ఆ మాస్టర్ అయి ఉండవచ్చునని వాదించేవాళ్ళు లేకపోలేదుగానీ, ఆయన పరిచయం కాకముందే ఎమిలీ మాస్టర్ కి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టింది. మరికొందరు ఆమె మిత్రుడు సామ్యూల్ బౌల్స్ కూడా ఆ మాస్టర్ కావొచ్చని అనేవారున్నారు.

ఇలా వ్యక్తుల, మరీ ముఖ్యంగా రచయితల వ్యక్తిగత జీవితాల్లో మనకి పూర్తిగా తెలియని రహస్యాల గురించి మాట్లాడుకోవడం మొన్నమొన్నటిదాకా ఇంగ్లిషు సాహిత్యంలో ఒకతీరిక సమయపు వ్యాపకంగా ఉండేది. నేననుకుంటాను, ఆ మాస్టర్ ఎవరై ఉండొచ్చు అనే ఆలోచన కలగడం సహజమే కాని, ఆ కుతూహలం ఎవరి మనసుల్లో అక్కడే అణగిపోవడం మంచిదని. ఎమిలీ డికిన్ సన్ ఉత్తరాల్లో ఈ ఉత్తరాలు బయటపడ్డప్పుడు ఆమె అన్నని అడిగారట, ఈయన ఎవరో మీకేమన్నా తెలిసి ఉండవచ్చునా అని. అతడు భుజాలు ఎగరేసి ‘మా చెల్లెలు చాలామందిని ప్రేమించింది. వాళ్ళల్లో ఎవరేనా కావొచ్చు’ అని అన్నాడట. సరే, ఇంతకీ ఈ విషయం మీద, చేసినంత ఊహాగానం చేసి, చివరికి పొపోవా ఏమంటుందంటే, ఆ మాస్టర్ ఒక మనిషి కాకపోవచ్చు, ఆమె ప్రేమించినవారందరి సమాహారం కావచ్చు లేదా ఆమె ఊహామూర్తి కూడా అయి ఉండవచ్చు అని.

నేననుకుంటాను, ప్రతి ప్రేమికుడికీ, ప్రేమికురాలికీ ప్లేటో చెప్పినట్టుగా ఒక ఆదర్శమూర్తి మనసులో ఉంటారు. కాని ఆ ఆదర్శమూర్తి పోలికలు అంత స్పష్టంగా గుర్తుపట్టేట్టు ఉండవు. అది చిన్నప్పుడు తప్పిపోయిన మిత్రుడి ఫొటో లాంటింది. ఇక ప్రేమికులు ఎవరిని కలిసినా, ఎవరితో ప్రేమలో పడ్డా, మాటిమాటికీ ఆ ఫొటో తీసి చూసుకుంటూ, ఇతడే కదా, ఈమే కదా అనుకుంటూ ఉంటారు. కాని నాకు తెలిసి, వాళ్ళకి తారసపడ్డ ఏ ప్రేమమూర్తికూడా నూటికి నూరుశాతం ఆ చిన్నప్పటి ఫొటోలోలాగా ఉండనే ఉండరు.

ఈలోపు మరో సమస్య ఏమిటంటే కాలం గడుస్తున్నకొద్దీ ఆ చిన్నప్పటి ఫొటోలో రూపురేఖలు కూడా మారిపోతుంటాయి. చూడబోతే అదంతా ఒక మాజికల్ రియలిస్టు కథలాగా ఉంటుంది. ఒకప్పుడు ఆ ఫొటోలో కళ్ళు మనల్ని నిలవరించేట్టుగా ఉంటాయి. కొన్నాళ్ళకు కళ్ళు మామూలైపోయి, చిరునవ్వు ధగధగా మెరుస్తూ కనిపిస్తుంది. అప్పుడు ఎవరి చిరునవ్వు మనమీద మందుజల్లితే వాళ్ళే మనం వెతుక్కుంటున్న మనిషననుకోడం మొదలుపెడతాం.

ఎమిలీ డికిన్ సన్ దీనికి అతీతురాలు కాదు సరికదా, ఇటువంటి మనిషినే అనుకోడం నాకు ఎంత రిలీఫ్ నిస్తున్నదో చెప్పలేను.

ఫేబర్ అండ్ ఫేబర్ కోసం Emily Dickinson: The Complete Poems (1970) కూడా థామస్ జాన్సన్ నే సంకలనం చేసాడు. ఆ పుస్తకానికి ముందుమాట రాస్తో, ఆయన పందొమ్మిదో శతాబ్దంలో అమెరికాలో మూడు ముఖ్యమైన సంఘటనలు జరిగాయని చెప్తాడు. అవి అమెరికన్ సాహిత్యచరిత్ర రూపురేఖల్ని మార్చేసాయని చెప్పవచ్చు. మొదటిది, 1837 లో ఎమర్సన్ మసాచుసెట్స్ లో చేసిన ప్రసంగం. అమెరికన్ స్వాతంత్య్రప్రకటన 1776 లో రాసుకున్నప్పటికీ, నిజమైన declaration of intellectual independence ఎమర్సన్ ప్రసంగమే అని జాన్సన్ గుర్తుచేస్తాడు. రెండో సంఘటన, 1855 లో వాల్ట్ విట్మన్ తన Leaves of Grass ప్రచురించడం. మూడోది, 1862 లో ఎమిలీ డికిన్ సన్ తన కవితలు నాలుగింటిని హిగిన్ సన్ కు ప్రచురణకోసం పంపించడం.

ఈ ముగ్గురూ మహాప్రేమికులేగాని ఆ ప్రేమల్లో స్పష్టమైన తేడా ఉంది. ఎమర్సన్ ది ఋషుల ప్రేమ. విట్మన్ ది ప్రవక్తల ప్రేమ. ఎమిలీ ప్రేమని కూడా ఋషి ప్రేమా, ప్రవక్త ప్రేమా అనవచ్చుగానీ, అది ఆ దివ్యప్రేమ పారవశ్యానికి ఒక చీటీ తగిలించి అలమారులో సర్దేయడమే అవుతుంది. అది సాధారణ ప్రేమ కాదు, అసాధారణ ప్రేమ కూడా కాదు.

ఎమిలీ డికిన్ సన్ కవిత్వంతో నాకు నలభయ్యేళ్ళ పరిచయం ఉంది. ఇన్నాళ్ళూ నేను ఆమెది ఒక saintly love అనుకున్నాను. కాని, ఇప్పుడు, ఈ ఉత్తరాలు చదవడం మొదలుపెట్టాక అది చాలా చాలా మానుషప్రేమ అని తెలుస్తోంది. ఎంత మానుష అంటే, ఆ ప్రేమ తనకి కలిగించే ప్రతి సంవేదననీ ఆమె ముందు భౌతిక, శారీరిక స్థాయిలోనే గుర్తుపడుతుంది. దాన్ని పోల్చుకోడానికి ఆమె వాడే పదప్రయోగాలు చాలా కోసుగా, పదునుగా ఉంటాయి. ఉదాహరణకి ఓటిస్ కి రాసిన ఒక ఉత్తరంలో The Air is soft as Italy. .. అంటుంది. చలంగారు గీతాంజలి అనువాదానికి రాసుకున్న ముందుమాటలో టాగోర్ మామూలుగా అందరూ అనేటట్టు వేసవిలో సాయంకాలపు గాలి వీచింది అనడు, దక్షిణమారుతం నీ ప్రేమసందేశాన్ని తీసుకొచ్చింది అంటాడు అని రాస్తారు. కాని ఈ వాక్యమేమిటి! ఈ గాలి ఇటలీలాగా ఉంది అంటే, ఇటలీ ఇక్కడ metonymy. దాని అర్థం ఈ గాలి మధ్యధరా సముద్రం మీంచి వీచే గాలిలాగా మృదువుగా ఉందని చెప్పడం. ఒక కవి మనతో పంచుకుంటున్న అనుభూతి నిజమైదనీ, authentic అనీ నమ్మడానికి ఇటువంటి పదప్రయోగాలు కనబడాలి. అప్పుడు ఆమె ఆ అనుభూతిని తన దేహంతో గుర్తుపట్టాక దాన్ని మనసుతో వేర్పాటు చేసి చూసి, ఇలా రాస్తుంది: .. .but when it touches me, I spurn with a Sigh, because it is not you అని.

ఉత్తరాల పేరిట వ్యాసాలు రాస్తున్నాను అనుకుంటున్నావా? ఇవి నీతో కాక మరెవరితో పంచుకోగలుగుతాను? ప్రేమావస్థ చాలా చిత్రమైంది. మనం అలాంటి అవస్థలో ఉన్నప్పుడు, మనలాగా ఇలాంటి అవస్థల్ని ఎదుర్కొన్నవాళ్ల గురించి మాట్లాడుకోవడమే కదా, మనకి దారి చూపించేది. ‘ఎరుకగల వారి చరితలు కరచుచు..’అని కవి అన్నది లోకాతీతుల గురించే అన్నాడని ఎందుకనుకోవాలి? అలా అనుకుని ఉంటే, ఆది కవి, కచదేవయానుల కథని అంత రసవిసృమరంగా చెప్పి ఉండేవాడు కాదు కద!

ఇప్పుడు ఎమిలీ డికిన్ సన్ ప్రేమల గురించీ లేదా ప్రేమ గురించీ చదువుతున్నాక, ఆ కవిత్వం సహజంగానే మళ్లా కొత్తగా కనిపించడం మొదలుపెట్టాక, నాకో సంగతి అర్థమవుతోంది. ఇన్నాళ్ళూ నేను కూడా ఇస్మాయిల్ గారిలాగా ప్రేమ మనుషుల్ని పైకి లేపుతుందనీ, విహాసయంలోకి ఎగరేసేది మాత్రమేననీ అనుకున్నాను. కానీ, కాదు. ప్రేమ నీకు రెక్కలిస్తుంది, నిజమే, కాని శాశ్వతంగా ఎగిరిపోడానికి కాదు. నువ్వు ఎక్కడెక్కడ విహరించినా తిరిగి నేలమీదకు రావాలని కూడా ప్రేమ కోరుకుంటుంది. ఈ మట్టిలో, ఈ వీథుల్లో, ఈ టీషాపుల దగ్గర, తొలివానజల్లులు పడేవేళ మొక్కజొన్న కండెలు కాల్చే బళ్ళ దగ్గర నువ్వు తిరగాలని కోరుకుంటుంది. అది ఎంత అమర్త్యమో, అంత మర్త్యం కూడా. నువ్వు ప్రేమని ఒక జ్ఞాపికగా మార్చి గాజుషోకేసులో అట్టేపెట్టుకోలేవు. నువ్వట్లా భద్రంగా దాచగానే అది చిట్లిపోతుంది. అప్పుడు నువ్వు కిందకు వంగి కన్నీళ్ళతో ఆ ముక్కలు చేతిలోకి ఏరుకోగానే అమాతం అతుక్కుపోతుంది, బీటలు కనబడనంత దగ్గరగా.

అందుకని ఎమర్సన్ ప్రేమ ఋషుల ప్రేమ, విట్మన్ ప్రేమ ప్రవక్తల ప్రేమ అని అనుకున్నట్టే, ఎమిలీ డికిన్ సన్ ప్రేమ పిల్లలప్రేమ అని అనుకోకుండా ఉండలేకపోతున్నాను. పిల్లలు చూడు, లేదా మన చిన్నప్పుడు చూడు. మనింటికి ఎవరొచ్చినా మనం వెంటనే వాళ్ళతో ప్రేమలో పడిపోయేవాళ్లం. చిన్నప్పుడు మా ఊళ్ళో రోడ్డుమీద బస్సు అగి అందులోంచి మా చుట్టాల పిల్లలు దిగుతుండటం కళ్లారా చూసినా కూడా నాకు వాళ్ళు అప్పుడే ఆకాశంలోంచి దిగినట్టుగా అనిపించేది. వాళ్ళూ, మనమూ ఎప్పటికీ విడిపోమనీ, మన ఆటలు ఎప్పటికీ ముగిసిపోవనీ అనుకునేవాళ్ళం కదా. అందరూ అనుకుంటారు, ప్రేమలు యవ్వనంలో అంకురిస్తాయని. కాదు, యవ్వనంలో ప్రేమలు అంతరించి, ఒకే ఒక్క ప్రేమగా మారడానికి తహతహలాడతాయి. అప్పుడు కూడా చిన్నప్పటి అమాయకత్వం కొంత ఉంటుంది గాని, కొంత మాత్రమే. అప్పటికి మనకి చాలా విషయాలు తెలిసిపోతాయి. మనకి తారసపడ్డ ప్రతి ఒక్కరినీ ప్రేమించకూడదనే ‘జ్ఞానం’ కూడా వచ్చేస్తుంది. ఇక ఆ యవ్వనం కూడా గడిచిపోయేక, మనం జీవితంలో ఏ ఒక్కర్ని కూడా ప్రేమించకూడదనే ‘వివేకం’ పుట్టుకొస్తుంది.

కానీ ఒకరుంటారు, ఎమిలీ డికిన్ సన్ లాంటి వాళ్లు. సదా బాలికగా మిగిలిపోగల వాళ్ళు. అందుకనే ఆమె ఒకరిని కాదు, ఎందరినో ప్రేమించింది. అందరినీ ప్రేమించకూడదనీ, ఎవరో ఒకరిని మాత్రమే ప్రేమించాలనే జ్ఞానం ఆమెకి కలక్కపోవడం వల్లనే ఆ కవిత్వంలో అంత సుగంధం, అంత ప్రకాశం, అంత స్వతంత్రం.

ఇన్నేళ్ళుగా నన్ను వేధిస్తున్న, నేనింక పోరాడలేనని చేతులు పైకెత్తేసిన ప్రశ్నలన్నీ ఇప్పుడు పక్కకి తప్పుకున్నాయి. ఇప్పుడు నా చుట్టూ గాలి ఏ నదీతీరంలోనో విరబూసిన రెల్లుపొదల వెచ్చదనాన్ని మోసుకొస్తోంది.

26-10-2023

16 Replies to “పోస్టు చేసిన ఉత్తరాలు-5”

 1. కఒకరుంటారు,….బాలికగా మిగిలిపోగల వాళ్ళు. అందుకనే ఆమె ఒకరిని కాదు, ఎందరినో ప్రేమించింది. అందరినీ ప్రేమించకూడదనీ, ….

  ఒకరిని మాత్రమే ప్రేమించాలనే జ్ఞానం ఆమెకి కలక్కపోవడం … ఎంత నిఖచ్చితపు వాక్యాలు …నిజమే కదా

  మీరు రాసే ఈ ఆర్టికల్స్ అన్ని ఎంత బాగున్నాయో నాలుగు మాటల్లో చెప్పలేను తెల్లవారుగానే ప్రేమ పుష్పాలు గుత్తి చేతికందినట్టు.
  Thank you 💐

 2. నువ్వు ప్రేమని ఒక జ్ఞాపికగా మార్చి గాజుషోకేసులో అట్టేపెట్టుకోలేవు. నువ్వట్లా భద్రంగా దాచగానే అది చిట్లిపోతుంది. అప్పుడు నువ్వు కిందకు వంగి కన్నీళ్ళతో ఆ ముక్కలు చేతిలోకి ఏరుకోగానే అమాతం అతుక్కుపోతుంది, బీటలు కనబడనంత దగ్గరగా. వాహ్ అద్భుతం సర్

 3. ♥️♥️ ఎమిలీ డికెన్స్ లా, సదా బాలిక లా, ఉండే పోయో,, అదృష్టం కలిగితే బాగున్ను!sir!

 4. ఎమిలీ డికిన్సన్ ఉత్తరాల్లోని ప్రేమ అత్తరును
  ఉత్తరం సీసాలో నింపడం బాగుంది. ఆ మూత తీస్తూ మూస్తూ చిరుచిరు పరిమళాలను ఆఘ్రాణింపజేయడం మరీ బాగుంది. ముఖ్యంగా చదువరుల కళ్లు అక్షరాల వెంబడి మనసు స్వీయానుభవాల వెంబడి కదలటం , కదిలేట్టు చేయడం, అసలు ఉత్తరం కవిత్వాన్ని మించిపోయిందనిపిస్తుంది.

Leave a Reply

%d