పోస్టు చేసిన ఉత్తరాలు-4

26-10-2023, తెల్లవారు జాము 3.40

ప్రియమైన

రోజూ పొద్దున్నే ఒకేవేళకి కూచుని ఉత్తరాలు రాయడం కూడా ప్రార్థనలాంటిదే కదా. రోజూ ఒకేవేళకి నువ్వు ధ్యానానికి కూచున్నట్టే కదా. అప్పుడు ప్రకృతిమొత్తం నీవైపు తొంగిచూస్తుంది కదా.

నువ్వేం చేస్తున్నావిప్పుడు? బహుశా ఇంకా నిద్రలేవని చెట్లలానే, పక్షుల్లానే నువ్వు కూడా నీ కలల్లో నా వైపు తిరిగి చూస్తున్నావా?

రాత్రంతా ఇక్కడ ఏవో పాటలు, బాజాలు, ఎవరో వీథుల్లో డాన్సు చేస్తూనే ఉన్నారు. హైదరాబాదులో రెండు నగరాలున్నాయనిపిస్తుంటుంది నాకు. ఒక నగరం అందరికీ కనిపించేదే. రోజురోజుకీ విస్తరిస్తున్న మహానగరం. ఆకాశహర్మ్యాల నగరం. కానీ మరోనగరం, నిజానికి నగరం కాదు, పల్లె. తెలంగాణా పల్లె. పండగలొచ్చినప్పుడు ఆ పల్లెలో మా పల్లె కనిపిస్తుంది. మొన్నటిదాకా గణపతి నవరాత్రులు. ఆ వేడుక ముగిసిందో లేదో బతుకమ్మ, బోనాలు, దేవీనవరాత్రులు. మరి నిన్నటి వేడుక దేనికో తెలియలేదు. మా కాలనీ పక్కనే చిన్న గుట్ట ఉంది. బోజగుట్ట అంటారు. ఆ గుట్టమీద ఒక గుడి. ఈ పండగల్లో పగలు పూజలూ, రాత్రి భజనలూ. ఇలాంటి తెల్లవారుజాముల్లో కూడా ఆ కొండమీంచి భజనపాటలు వినబడుతూనే ఉంటాయి. పరాకుగా ఉన్నప్పుడు నేను రాజవొమ్మంగిలో ఉన్నానా అనిపిస్తుంది. అక్కడా ఇలానే ఏవో సప్తాహాలు నడుస్తూనే ఉంటాయి.

మంది జీవితాన్ని పండగచేసుకునే పద్ధతి అది. నాలాంటివాడి జీవితోత్సవం మరోలా ఉంటుంది. నాకొక కొత్త కావ్యం దొరికన రోజు వేడుక. ఇదుగో, ప్రస్తుతం ఎమిలీ డికిన్ సన్ ఉత్తరాలు చదువుతున్నాను కదా, కాబట్టి, నేను ఎమిలీ సప్తాహం చేస్తున్నానన్నమాట. ఏ కవి తన జీవితాన్ని నిండుగా జీవిస్తాడో, తన హృదయద్వారాలు బార్లా తెరిచిపెట్టి మనుషులకోసం ఆకాశాన్ని కానుక చేస్తాడో అటువంటి కవిని చదివినప్పుడల్లా నాకు ఒక జీవనవ్రతకథ పూర్తిచేసినట్టే ఉంటుంది. ఆ కవి ఎన్ని యుగాల కిందనేనా జీవించి ఉండనీ, కాని అతడే నాకు అత్యంత సన్నిహితుడనిపిస్తాడు.

ఇప్పుడు, ఈ తెల్లవారుజామున కోటిన్నర మంది నిద్రిస్తున్న ఈ నగరంలో, ఈ క్షణాన, ఎమిలీ డికిన్ సన్ కన్నా నాకు మరెవరూ సన్నిహితులు లేరు. ఆమె గురించి చెప్పుకోడానికి నువ్వు తప్ప మరెవరూ లేరు.

కాని ఒక్కమనిషి చాలదా ఈ జీవితాన్ని రసవంతం చేయడానికి! తేజోమయం కానివ్వడానికి! నువ్వు చాలు నాకు, నా ప్రభాతాల్ని పరిపూర్ణం చేయడానికి. నిన్నిట్లా పొద్దున్నే పలకరించాక, ఆ రోజంతా ఎంత సంపద్వంతమవుతుందని! ఎమిలీనే రాసింది ఒక ఉత్తరంలో Confidence in Daybreak modifies Dusk అని.

ఆమెకైతే, మనుషులతో మాట్లాడటంకన్నా ఉత్తరాలు రాసుకోవడమే ఎక్కువ ఇష్టం. 1869 లో హిగిన్ సన్ కి ఇలా రాసింది:

A letter always feels to me like immortality because it is the mind alone without corporeal friend.

అంటే నువ్వు నాకొక ఉత్తరం రాసావనుకో. అది నా చేతులకి అందగానే దానితో పాటు నువ్వు కూడా ఒక వైదేహిగా నా ఇంటికొచ్చినట్టు. మరికాసేపట్లో నువ్వీ ఉత్తరం చదవడం మొదలుపెట్టగానే నేను నీ పక్కనే కూచున్నట్టు. ఉత్తరాలు రాసుకోవడమంటే దేహాలతో పనిలేని గోష్ఠి మొదలుపెట్టడం.

ఆమె మరో మాట రాసింది. ముఖ్యమైన మాట. Immortality. చిన్నమాట కాదు. ఉత్తరం మృత్యువుని జయిస్తుందన్నమాట. ఎమిలీ డికిన్ సన్ జీవితంలోనూ, కవిత్వంలోనూ కూడా అమరత్వాన్నే అన్వేషించింది. హిగిన్ సన్ కి రాసిన ఒక ఉత్తరంలో immortality ని ఆమె తన flood subject అంది. ఆ flood అనే మాటలో అనాదికాలం నుంచీ మానవస్మృతిని వెంటాడుతున్న ప్రళయం అనే మాట స్ఫురించడంలో ఆశ్చర్యం లేదు. తాను ఒక నోవాలాగా ఈ ప్రళయం నుంచి మానవజాతిని తప్పించడానికి తన కవిత్వాన్ని ఒక నావగా తీసుకుని బయలుదేరాననే సూచన కూడా ఉందందులో.

ఎమిలీ కవిత్వమంతా బైబిల్ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆమె తండ్రి ఆమెకి ఎన్నో పుస్తకాలు కొనిపెట్టేవాడటగానీ బైబిల్ తప్ప మరే పుస్తకం చదవనిచ్చేవాడు కాడని ఒక ఉత్తరంలో రాసింది. కింగ్స్ జేమ్స్ వెర్షన్ ఆమె రక్తంలోకీ ఇంకిపోయింది. ఆమె మామూలుగా రాసిన ఉత్తరాల్లో కూడా బైబిల్ వాక్యాలు మనం గుర్తుపట్టలేనంతగా కలిసిపోయి ఉంటాయి. ఆమె కవిత్వానికీ, ఉత్తరాలకీ సంశోధిత ప్రతులు తయారుచేసిన థామస్ ఎచ్.జాన్సన్ ఆమె కవిత్వంలో కనీసం ముప్ఫై బైబిలు అధ్యాయాల ప్రస్తావనలు కనిపిస్తాయని లెక్కగట్టాడు. వాటిలో మరీముఖ్యంగా మత్తయి సువార్త, కొత్త నిబంధనలోని చివరి అధ్యాయం అయిన ప్రకటన గ్రంథం, పాత నిబంధనలోని మొదటి అధ్యాయం ఆదికాండం- ఈ మూడూ ఇదే వరసలో ఆమెని గాఢంగా ప్రభావితం చేసాయని చెప్తాడు. వాటి తర్వాత యోహాను సువార్త, కొరింథీయులకు రాసిన పత్రికలు, నిర్గమకాండము, సామగీతాలూను. కాళిదాసు వాల్మీకిని చదివినట్టు, కీట్సు షేక్ స్పియర్ ని చదివినట్టు ఆమె బైబిల్ చదివింది. అందుకనే ఆ కవిత్వంలో నేరుగానూ, ఏటవాలుగానూ కూడా బైబిల్ కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఆ బైబిలు సాధారణంగా విశ్వాసులు ప్రతి ఆదివారం పారాయణం చేసాక పక్కన పెట్టేసే బైబిలు కాదు. అది మనిషికీ, దేవుడికీ మధ్య నడిచిన రెండు ఒప్పందాల కథగా, తన ఆత్మకీ, ఆకాశానికీ మధ్య నడిచిన ప్రణయోద్వేగంగా ఆమె కవిత్వంలో కనవస్తుంది.

హిగిన్ సన్ కి రాసిన రెండో ఉత్తరంలో ఆమె ఒక మాట రాసింది.

Perhaps you smile at me. I could not stop for that-My Business is circumference- An ignorance, not of customs, but if caught with the Dawn- or the Sunset me- Myself the only Kangaroo among the Beauty.

ఆమె ఇంగ్లీషు శైలినే ఇలా ఉంటుంది. Packedగా, crypticగా. ప్రతి ఒక్క మాటా ఒక ఐస్ బెర్గ్ లాగా. పైకి కనిపించేదీ, వినిపించేదీ చాలా స్వల్పం. మరెంతో ఆ గుండెలోపలే కుక్కుకుపోయినట్టూ, నొక్కుకుపోయినట్టూ ఉంటుంది. ఇందులో my business is circumference అనేది అట్లాంటి మాట. నాలుగు పదాల ఈ చిన్న వాక్యం వందేళ్లకు పైగా డినిక్ సన్ పండితుల్ని సంభ్రమానికి గురిచేస్తూనే ఉంది. ఏ ఒక్కరూ ఈ వాక్యాన్ని సంతృప్తికరంగా వివరించలేకపోయారు.

Circumference అంటే చుట్టుకొలత, పరిధి. Business అంటే వ్యాపకం, కార్యకలాపం లేదా ఆలోచిస్తున్న విషయం అని అనుకుందాం. అప్పుడు వాచ్యార్థం ఏమన్నట్టు? నా వ్యాపకం పరిధికి సంబంధించింది అని కదా. పరిధి దేనికి?

డికిన్ సన్ పండితుల్లో అగ్రగణ్యుడు అని చెప్పదగ్గ థామస్ జాన్సన్ ఆమె మీద ఒక పుస్తకం రాసాడు. Emily Dickinson: An Interpretive Biography(1967) అని. ఆయనే నేను చదువుతున్న ఉత్తరాల సంకలన కర్త కూడా. ఆయన తన పుస్తకంలో ఈ ఒక్క వాక్యానికీ ఏకంగా ఒక అధ్యాయమే కేటాయించాడు. Circumference అని అనడం ద్వారా ఆమె ఏమి సూచిస్తున్నదో వివరంగా అర్థం చేసుకోడానికీ, తాను అర్థం చేసుకున్నది మనతో పంచుకోడానికీ ప్రయత్నించాడు. కాని ఆ అధ్యాయం మొత్తం చదవుతుంటే ఎంత ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ఆ వాక్యం మొదటిసారి వినగానే నాకేది స్ఫురిస్తుందో దాన్నుంచి ఒక్క అడుగుకూడా ముందుకి వెళ్లలేకపోయాను.

కాని ఒకమాట గుర్తుచేసినందుకు మాత్రం జాన్సన్ కి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆమె ఒక మిత్రురాలికి రాస్తూ The Bible dealt with the Centre, not with Circumference అని అన్నదట. ఈ వాక్యంతో నాకు మబ్బు విడిపోయింది. ఆమె భారతదేశంలో పుట్టవలసిన భక్తి కవయిత్రి, అమెరికాలో కాదు అని అనిపించింది. ఎందుకంటే, వేదఋషుల దగ్గరనుంచి భక్తికవుల దాకా మన కవులు చూసిందీ, గానం చేసిందీ ఆ circumference నే. ఇక్కడ వృత్తపరిధి అంటే ఆ కేంద్రం నుంచి చిట్టచివరి అంచు దాకా వ్యాపిస్తున్న కాంతి అనుకోవచ్చు. లేదా ఒక్కమాటలో చెప్పాలంటే లీల అనవచ్చు. కాంతిలీల అన్నమాట. అగ్నిపరివేషం.

ఆమె కవిత్వంలో రెండు మాటలు అటువంటి మాటలు, పదే పదే మనల్ని నిలవరించే మాటలున్నాయంటాడు జాన్సన్. ఒకటి circumference, ఇప్పుడు చూసావు. రెండవది awe. ఈ awe కూడా నిర్వచనానికి లొంగనిది. కానీ దాన్ని ఆమె ఎక్కడెక్కడ వాక్యాల్లో ప్రయోగించిందో ఆ సందర్భాన్ని బట్టీ, స్ఫూర్తిని బట్టీ గుర్తుపట్టవచ్చంటాడు. అతను చెప్పిన దాని ప్రకారం awe అంటే ఒక నివ్వెరపాటు, ఒక నిబిడాశ్చర్యం, నోటమాటరాని స్థితి. గాఢమైన ఏ ఉద్వేగంలోనైనా, లేదా గొప్ప సౌందర్యం దృగ్గోచరమైన ఏ క్షణాన్నైనా ఆమె నిశ్చేష్టురాలైపోతుంది. ఆ నిశ్చేష్టతనుంచి తేరుకున్నాక ఒక కవిత రాయడం మొదలుపెడుతుంది. కొన్నిసార్లు వట్టి embarrassment కూడా ఆమెని నిశ్చేష్టురాల్ని చేసేదనీ, అప్పుడు కూడా ఆ awe ని ఆమె అనుభూతి చెందేదనీ ఆయన రాస్తాడు.

ఇక అన్నిటికన్నా గొప్ప వాక్యం Circumference thou Bride of Awe.. అంటో మొదలుపెట్టిన ఒక కవితలో మొదటివాక్యం. అంటే ఆ పరిధి ఆ నివ్వెరపాటుకి వధువు వంటిదట. అస్పష్టంగా ఉన్నా, ఏదో అర్థమవుతూ ఉంది కదా. యూరపియన్ అలంకారికులూ, రొమాంటిక్ కవులూ sublime అని చెప్తూ ఉన్నది ఇటువంటి awe లోంచి కలిగే, ఒక అమేయపారవశ్యం గురించే కాదా? కాని జాన్సన్ తన వ్యాసంలో ఎక్కడా sublime అనే మాటని గుర్తుచేయలేదు. ఎమిలీ డికిన్ సన్ అనుభవంలోని అద్వితీయతను మామూలు అలంకారశాస్త్రాలతో వ్యాఖ్యానించడానికి ఆయన ప్రయత్నించలేదు. ఆయనిలా రాస్తున్నాడు:

The Circumference that Emily Dickinson wishes to make her business is somewhat difficult to explain because she intends to move it from the context of logic. అని చెప్తూ ఆమె కవితలోంచి ఈ పంక్తులు ఉదాహరించాడు:

By intuition, Mightiest Things
Assert themselves-and not by terms.

ఇటువంటి మాటలు మనకి బాగా అర్థమవుతాయి. దీన్నే మనవాళ్ళు అపరోక్షానుభూతి అన్నారు. యోగానికీ కవిత్వానికీ మధ్య భేదం గురించి చెప్తూ మా మాష్టారు యోగం కన్నా కవిత్వం దగ్గరిదారి అన్నారు. ఒక లల్ల, ఒక అక్కమహాదేవి, ఒక ఆండాళ్ కవిత్వాలు చదివిన నీకూ, నాకూ ఎమిలీ డికిన్ సన్ ఏమి చూసిందో, దేన్ని గానం చేస్తున్నదో స్ఫురించకుండా ఎలా ఉంటుంది?

తానొక విశాలవలయాన్ని దర్శిస్తున్నదని తెలిసుకున్నదికాబట్టే ఆమె మామూలు ప్రపంచాన్ని పక్కకు నెట్టేయగలిగింది. రాను రాను మనుషుల్ని కూడా పూర్తిగా దూరంపెట్టగలిగింది. మనం అటువంటివాళ్లని యోగిని అంటాం. జీవనసౌందర్యాన్ని దర్శించడానికీ, అనుభూతి చెందడానికీ ఆమెలాంటివాళ్ళకి ఒక పువ్వూ, ఒక తేనెటీగా చాలు. ప్రతి సాయంకాలం కవిసమ్మేళనానికి పోవలసిన పనిలేదు.

అందుకనే ఆ కవిత్వంలో, ఆ ఉత్తరాల్లో ఆ వాక్యాలు అంత నిండుగా, అంత భావగర్భితంగా కనిపిస్తాయి. నీ వాక్యం అమరత్వం పొందాలంటే నువ్వు చెయ్యవలసిన మొదటిపని నీ మాటల్ని నువ్వు గౌరవించుకోవడం. పొద్దున్నలేచి మన సంభాషణల్లో, మన టెలిఫోన్ కాల్స్ లో, మన సోషల్ మీడియాలో మనం ఎంత flippantగా, hurriedగా, shallow గా మాట్లాడుకుంటూ ఉన్నాం. నాకైతే ఈ ప్రపంచం మరీ ఉక్కపోతగా అనిపిస్తోంది. వర్డ్స్ వర్త్ అనుకున్నట్టుగా

The world is too much with us; late and soon,
Getting and spending, we lay waste our powers;—

అమరత్వమంటే ఏదో మరణించాక కూడా ఈ భూమ్మీద ఏదో ఒక రూపంలో, కనీసం మన కవిత్వరూపంలోనేనా కొనసాగాలని కాదు. నాకు అటువంటి భయమూ లేదు, కోరికా లేదు. ఒక బౌద్ధ సన్యాసిలా నేను కూడా మరణించిన మరుక్షణమే నా శ్వాస ఒక మేఘంగానూ, నా దేహం ఒక పువ్వుగానూ మారిపోతాయని నమ్ముతాను. కాని నేను మాట్లాడుతున్న అమరత్వం మాటల్ని బతికించే అమరత్వం. నువ్వు ఒక మాట మాట్లాడితే ఎలా ఉండాలంటే, అది ఏసు ‘లాజరసూ లేచి రా’ అంటే ఆ మృతమానవుడు లేచి నడుచుకుంటూ వచ్చేసేడే, అలా ఉండాలి.

ఎదుటిమనిషి సంగతి వదిలిపెట్టు, కనీసం నా మాటలు నాకేనా ప్రాణం పోసేట్టు ఉండాలి. ఎప్పటికప్పుడు నివురు కమ్ముతున్న ఈ జీవితాగ్నిని ప్రజ్వరిల్ల చేసుకునేట్టుగా ఉండాలి. బహుశా అందుకేనేమో, ఈ ఉత్తరాలిట్లా రాసుకుంటున్నది.

25-10-2023

14 Replies to “పోస్టు చేసిన ఉత్తరాలు-4”

 1. నా హృదయాకాశంలో
  అమలిన దేశంలో
  ఒక రాగం వినిపించింది,
  మీ ప్రభాత గీతకైవారంతో
  ఒక కుసుమం వికసించింది
  మీ మధురాక్షరరస ప్రవాహంతో..

 2. మీ వాక్యాలు అలాంటివే నండీ…బతుకు బాటలో జారవిడుచుకున్న అమృత ఘడియలు…
  పరిమితుల నడుమ ఊగకుండా వదిలేసిన ఊయలలు.
  దాచుకున్నా ఎవరి కంటో పడతాయని పారేసిన ప్రేమలేఖలు.
  తలచుకుని చిరునవ్వు తో మనల్ని మనమే క్షమించేసుకునే అందమైన క్షణాలు.
  ఏ ముఖకవిశికలూ లేని ప్రపంచ మానవుని ప్రతి మనిషిలో దర్శించేలా మనసును విస్తృత పరిచే బుల్డోజర్ లు.మీకు జేజేలు.

 3. “రోజూ పొద్దున్నే ఒకేవేళకి కూచుని ఉత్తరాలు రాయడం కూడా ప్రార్థనలాంటిదే కదా. రోజూ ఒకేవేళకి నువ్వు ధ్యానానికి కూచున్నట్టే కదా. అప్పుడు ప్రకృతిమొత్తం నీవైపు తొంగిచూస్తుంది కదా”

  ఇంతకు మించిన మాట ఉంటుందా మనం ఏదైనా రాయడం గురించి….

  మీకు నా ప్రేమలు 💐

 4. ఎవిటేవిఏవిటి.. ఓ పువ్వూ.. ఓ తేనెటీగ చాలా.. ఓయమ్మో.. మిమ్మల్ని తట్టుకోవడం కష్టం సార్..

 5. నువ్వు ఒక మాట మాట్లాడితే ఎలా ఉండాలంటే, అది ఏసు ‘లాజరసూ లేచి రా’ అంటే ఆ మృతమానవుడు లేచి నడుచుకుంటూ వచ్చేసేడే, అలా ఉండాలి.(ఈ మధ్యనే చూసిన
  ఒక మంచి సినిమా METRO @8AM ఒక మంచి మాట ,మంచి కవిత్వం ఒక్కోసారి చనిపోవాలనుకున్న వారి ప్రాణాలు నిలబెడుతుంది అని దర్శకుడు చక్కగా చూపించాడు) అదిగో అలా వుంటాయి మీ వ్రాతలు.మీకు హృదయూర్వక ధన్యవాదాలు

 6. మేము కుడా ChinaVeerabhadruduని సప్తాహం చేస్తున్నామను మాట.. 😍

 7. గురువు గారూ

  ఒక్కటంటే ఒక్క మాటా రావట్లేదు

  ఏదో తృప్తి
  బైట నుంచీ లోపలికి

  మీరు లభించడం అలాంటి ధ్యానాన్ని పొందటం వంటిదే

  ధన్యోస్మి

Leave a Reply

%d