పోస్టు చేసిన ఉత్తరాలు-2

24-10-2023, తెల్లవారు జాము మూడున్నర

ప్రియమైన

ఒకప్పుడు ఉత్తరాలు ఎలా సంబోధిస్తో మొదలుపెట్టాలన్నదగ్గరే ఎంతో ఉద్విగ్నంగా ఉండేది. ప్రియమైన అనే ఆ మాటకి ముందు ‘నా’ అని చేర్చాలని చెప్పలేనంత కోరిగ్గా ఉండేది. అలా అనుకోడమే చాలా అడ్వెంచరస్ గా ఉండేది. గుండె వేగంగా కొట్టుకునేది. ‘నా ప్రియమైన-‘ అని అనుకోవడంలో చెప్పలేని థ్రిల్. అది ఇరవయ్యేళ్ళప్పుడు.

కాని ఇప్పుడు తెలుసు, ఒక మనిషిని ‘నా’ అని పిలవడం అలా ఉంచు, ‘నా’ అని అనుకోవడంలో కూడా అపారమైన బాధ్యత ఉందని. అది వట్టి బాధ్యత మాత్రమే కాదు, నిమిషం కూడా నిన్ను నిశ్చింతగా నిలవనివ్వని యుద్ధానికి మొదలు కూడా. అబ్బ! ఆ స్నేహాలూ, ఆ ప్రేమలూ, అది స్నేహమా ప్రేమనా అనే నిశ్చయానికి రాలేని ఆ యుద్ధాలూ వాటన్నిటికీ స్వస్తిచెప్పేసాక మనసు ఎంత స్తిమితంగా ఉంది. ఇలాంటప్పుడు కదా చలంగారు చెప్పినట్టు ‘ఇంత ధ్యానానికీ, మౌనానికీ, విజయాలకీ వ్యవధి దొరికేది!’

విజయాలు- మళ్ళా ఈ మాట నన్నాపేస్తుంది. ఏ విజయాలతోనూ పనిలేని దేశానికి ఎంత తొందరగా చేరుకుందామా అని అనిపిస్తోంది. బాహ్యవిజయాలే కాదు, అంతరంగ విజయాలు కూడా. జయించవలసింది ఏమీ లేకపోవడమే నిజమైన విజయం అనుకుంటాను.

ప్రేమ చాలా గమ్మత్తు. అది నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావనే భ్రాంతితో మొదలుపెట్టి ఎదటిమనిషిని పూర్తిగా లొంగదీసుకునేదాకా విశ్రమించదు. ఇన్నాళ్ళకు అర్థమయిందేమంటే, ప్రేమంటే, ఒక సీతాకోకచిలుకని సీతాకోకచిలుకగా ఉండనివ్వటం. దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించకపోవడం. అదొక grace. నీ నిమిత్తం లేకుండా నీతోటలోకి వచ్చివాలే ఒక స్వర్గపు తునక. అది వచ్చి వాలిందా, సంతోషించు, చూడు, కళ్ళప్పగించి చూడు. ఎగిరిపోయిందా, చూడు, కళ్ళప్పగించి చూడు. ఆ ఒక్క క్షణం చాలదా, ఆ graceful moment!

డికిన్ సన్ ఉత్తరాల గురించి రాస్తున్నాను కదా. ఆమె కవిత్వం ఆమె ఉత్తరాల్లోంచి పుట్టిందని చెప్పొచ్చు. అసలు ఆ ఉత్తరాలు చదువుతుంటే నాకు మొదటిసారిగా మాటలు నేర్చుకుంటున్నట్టుగా ఉంది. ఉదాహరణకి, ఈ ఉత్తరం చూడు, 1858 లో రాసిన ఉత్తరం. ఎవరికి రాసిందో తెలియదు. ఆ ఉత్తరాన్ని ఆ మనిషి అందుకున్నారో లేదో తెలియదు. కాని ఆ వాక్యాలు-

Indeed it is God’s house-and these are gates of Heaven, and to and fro, the angels go, with their sweet postillions- I wish that I were great, like Mr. Michael Angelo, and could paint for you.

ఈ ఉత్తరం రాసినప్పటికి ఆమె వయసు 28 ఏళ్ళు. కాని ఆ వయసుకే, ఉద్వేగం కళ్లకి మసకలు కప్పే ఆ వయసుకి, ఆమె చూపులో ఎంత తేటదనం ఉంది! ఎంత పరిణతి ఉంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం స్వర్గంలా కనిపించడం సరే, దాన్ని చిత్రించడానికి తానొక మైకెలాంజిలో కావాలని కోరుకోడంలోని ఆ ఆకాంక్ష ఏదైనాగానీ, రొమాంటిక్ అని మాత్రం చెప్పలేను.

అసలు ఆ ఉత్తరాలు చదువుతుంటే నా చుట్టూ ఉండే ప్రపంచం, నాకేమీకాదనుకునే రోజువారీ ప్రపంచమ్మీద ఒక బంగారు వెలుగు కనిపించడం మొదలయ్యింది నాకు.

మా ఇంటికి రెండిళ్ళ అవతల ఒక పున్నాగ చెట్టు ఉంది. ఈ సారి శరత్కాలం రాకముందే ఆ చెట్టు విరబూసింది. మధ్యాహ్నాలవేళ నా గదిలో కూచుని రాసుకుంటూ ఉంటానా, ఒక పరిమళం ఆ కిటికీ పక్కనే తచ్చాడుతూ ఉంటుంది. ఎండ తగ్గి, సాయంకాలం నాలుగయ్యేటప్పటికి, లంగరు దించిన పడవలాగా ఆ సౌరభం మా వీథిలో ఆగి నిలబడుతుంది. అప్పణ్ణుంచి ఆరింటిదాకా ఆ సుగంధంకోసం నేను టెర్రేస్ మీదకు పోయి నిల్చుంటాను. ఒక్కొక్కప్పుడు గంటసేపేనా. ఆ సువాసన ఒక సాయంకాలీన రాగంలాగా వినిపిస్తూనే ఉంటుంది.

నాకేమీ కాని ఈ నగరం, ఇక్కడ ప్రవాసిగా బతుకుతున్నానని నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను. ‘నువ్వెక్కడ సెటిలవుతావు’ అని అడిగేవారు మిత్రులూ బంధువులూ. ‘ఎక్కడన్నా సరే, కానీ తలెత్తి చూస్తే ఒక కొండల వరస కనిపించాలి, లేదా ఒక నీలినదీరేఖ వంపు తిరిగే చోటనైనా ఉండాలి’ అనేవాణ్ణి. ఇంటినుంచి బయలుదేరి నాలుగైదు ఫర్లాంగులు నడవగానే అడివిగాలి గుప్పున ముఖాన్ని తాకే చోటే కనక దొరికితే, అది స్వర్గమనే అనుకునేవాణ్ణి. కాని జీవితం ఎంత చిత్రం, నాకేమీ కాని ఈ నగరంలోనే, ఈ పున్నాగపూలి గాలితో ప్రేమలో పడిపోయాను. సాయంకాలాలు ఎక్కడికైనా వెళితే ఈ సురభిళం మిస్సయిపోతానేమోనని ఎక్కడికీ వెళ్లడం మానేశాను. కిందటేడాది సరిగ్గా ఈ రోజుల్లోనే మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ చదువుతున్నాను. అప్పుడు ఆ భావాలతో పాటు పున్నాగపూల సౌరభాన్ని కూడా ఆఘ్రాణించేనని ఇప్పుడు గుర్తొస్తోంది. ఇప్పుడు మళ్లా ఈ గాలి నన్ను సోకగానే, మళ్లా అరీలియస్, ఆ భావాలు, వాటిని పంచుకుంటున్నప్పుడు, నా మనసులో ఒక పక్కన నిశ్శబ్దంగా కూచుని నా మాటలు ఆలకిస్తోన్న నువ్వూ కూడా గుర్తొస్తున్నారు.

ఇప్పుడు ఎమిలీ రాసిన ఈ వాక్యాలు చదవగానే నా ప్రపంచం మరింత మందగించిపోయింది. ఆలోచిస్తున్నాను, ఏమిటి ఈ ఉత్తరాల్లో ఉన్న మహత్యం అని. అనిపిస్తోంది నాకు, ఉత్తరాలకీ తక్కిన అన్ని రకాల కమ్యూనికేషన్ కీ మధ్య ప్రధానంగా ఒక తేడా ఉందని. ఉత్తరాలు రాస్తున్నప్పుడు నువ్వు ప్రతి ఒక్కమాటనీ, ముందు నీ హృదయానికి వినిపించి, అప్పుడు కాగితం మీద పెడతావు. నువ్వు ఎవరికి రాస్తున్నావో ఆ మనిషి నీ పక్కనే ఉన్నదని సంభావిస్తావు. ఈ మెయిళ్ళూ, వాట్సప్ లూ, ఎస్సెమ్మెస్ లూ అలా కాదు. అక్కడ నీకు స్పష్టంగా తెలుస్తుంది, నువ్వు ఎవరికి రాస్తున్నావో వాళ్లు నీ దగ్గర లేరనీ, ఎక్కడో ఉన్నారనీ, వాళ్లకి నువ్వు పంపే మెసేజి వీలైనంత తొందరగా చేరాలనీ-అక్కడ దూరాన్ని దగ్గరచేయడమొక్కటే ఆలోచన. ఉత్తరాలు అలాకాదు. అక్కడ అసలు దూరమే లేదు. కాగితం చేతుల్లోకి తీసుకోగానే ఆ మనిషి నీ పక్కన వచ్చి కూచున్నట్టే. ఉత్తరం రాస్తున్నంతసేపూ నువ్వు ఆ మనిషిని సన్నిధిని అనుభూతి చెందుతున్నట్టే.

ఆశ్చర్యమనిపిస్తుంది. ఆ పందొమ్మిదో శతాబ్ది ఉత్తరాలు చదువుతుంటే. ఇప్పుడు కమ్యూనికేషన్లలో మనం చూస్తున్న విప్లవం కన్నా ఆ యుగంలో సంభవించిన విప్లవం వాళ్ల జీవితాల మీద చూపించిన ప్రభావం మరింత పెద్దది. రైళ్ళు, పోస్టు, టెలిగ్రాము- వాటివల్లనే ప్రాచీన ప్రపంచం ఒక్కసారిగా ఆధునిక ప్రపంచంగా మారిపోయింది. కాని వాళ్ళు ఆ సౌకర్యానికి ఎంత సంతోషించారో, ఆ వేగానికి అంత భయపడ్డారని కూడా అనిపిస్తుంది. అందుకని వాళ్ళు ఉత్తరాలు రాసుకోడానికి కూచున్నప్పుడు పదిహేడో శతాబ్దంలో స్పినోజా రాసినట్టుగా ఉత్తరాలు రాసుకోవాలని అనుకున్నారనిపిస్తుంది. స్పినోజా చూడు, ఆయన తత్త్వశాస్త్రమంతా నాకు ఆ ఉత్తరాల్లోనే కనిపిస్తుంది. తన రోజువారీ జీవితంలో, తన ఇరుగుపొరుగు మిత్రులకి రాసిన ఉత్తరాల్లోనే ఆయన భగవంతుణ్ణి వెతకడానికి, పట్టుకోడానికీ, ప్రతిష్ఠించడానికీ ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. ఆ ఉత్తరాల గురించి మరోసారి ఎలానూ రాస్తాను. కాని ఇప్పుడు నాకనిపిస్తున్నదేమంటే పందొమ్మిదో శతాబ్దిలో ఒక కీట్సు, ఒక బ్రౌనింగ్, ఒక డికిన్ సన్, తమ జీవితాల్లో ఆ పూర్వయుగాల తీరికని మళ్లా తీరిగ్గా తెచ్చుకుందామని చూసారనిపిస్తుంది. చాలా తొందరగా, చాలా పొడిపొడిగా రాసారనుకున్న ఉత్తరాల్లో కూడా ఎంత తీరికదనం! వాళ్ళు తమ డ్రాయింగురూముల్లో స్వర్గాన్ని చూస్తున్నారా అనిపిస్తుంది. 1858 జూన్ లో సామ్యూల్ బావ్ల్స్ దంపతులకి ఎమిలీ రాసిన ఉత్తరంలో ఈ మొదటివాక్యాలు చూడు:

I would like to have you dwell here. Though it is almost nine O clock, the skies are gay and yellow and there ‘s a purple craft or so, in which a friend could sail. Tonight looks like ‘Jerusalem’.

ఆ మూడు వాక్యాల్లో ఆమె భూమ్మీదకు స్వర్గాన్ని దింపేసింది. ఆ సంధ్యాకాలపు ఆకాశంలో ఎవరేనా స్నేహితుడు ఒక ఊదారంగు పడవ ఎక్కి, పయనించవచ్చట! అసలు అటువంటి ఊహ వచ్చినప్పుడే, ఆమె మనసు ఒక జెరుసలేం గా మారిపోయింది. ఇక ఆ తరువాతి వాక్యంలో ‘ఈ రాత్రి ఇక్కడ యెరుషలేంలాగా ఉంది’ అని అనడం ఆ మనసుని వాక్యంగా మార్చడమే.

చలంగారి ఉత్తరాల్లో కనిపిస్తుంది, ఇలా భూమ్మీదకు స్వర్గం దిగడం. ఒక్క చిన్నకార్డుముక్కమీద రాసిన నాలుగైదువాక్యాల్లోనే, ‘ఈ వానలకి పల్లాకొత్తులో అంతా గడ్డిమొలిచింది’ అని రాయగానే, ఆయన తన చుట్టూ ఉన్న తపోవనాన్ని ఆ కార్డుమీద చిత్రించి పంపిస్తున్నాడా అనిపిస్తుంది. చిన్న చిన్న వాక్యాలు. గుండె ఏ క్షణాన చిట్లిపోతుందో తెలియని ఆందోళన, తనని వేధించే తలనొప్పులు, శారీరికంగానూ, మానసికంగానూ కూడా. కాని వాటిమధ్య, ఆ చిన్న చిన్న ఉత్తరాల్లో, ఎంత ప్రశాంతి. ఆ ఉత్తరాలు చదవడం మొదలుపెట్టి నువ్వు తలెత్తి చూస్తే, నీ కిటికీ పక్క ఒక కొండవాగు నెమ్మదిగా ప్రవహిస్తూ కనిపిస్తుంది. మళ్ళా సంజీవ్ దేవ్ గారి ఉత్తరాల్లో చూసాను. ఆయన ప్రతి ఒక్క ఉత్తరం ఒక చిత్రలేఖనం. ఎమిలీ ఉత్తరాల్తో పాటు కవితలు పంపితే ఆయన ఉత్తరాల్తో పాటు బొమ్మలు పంపించేవారు. కానీ ఆ ఉత్తరాలు వాటికవే కవితలు, ఆ ఉత్తరాలు వాటికవే బొమ్మలు.

చెప్పు, ఒక్క ఈ మెయిల్ అట్లాంటిది అందుకున్నావా నువ్వు? ఒక్క వాట్సప్ మెసేజి కనిపించిందా, అలా భూమ్మీదకు భాగీరథిని ప్రవహింపచేసేది?

ఇప్పుడు నాకు పందొమ్మిదోశతాబ్దిలోకి వెళ్ళిపోవాలని ఉంది. అప్పుడేనా నేను పొద్దున్నే మా ఇంటిమేడమీద వాలే మైనాల కూజితాలకి చేరువకాగలుతునానేమో. సాయంకాలాల్లో పశ్చిమాకాశంలో ప్రవహించే స్వర్ణనదీతీరం దగ్గర కాసేపు మౌనంగా కూచోగలుగుతానేమో. ఇదుగో, ఎమిలీ రాసిందే, ఇలాంటి వాక్యాలు రాయగలుగుతానేమో!

1859 జనవరిలో రాసిన ఒక ఉత్తరంలో ఈ వాక్యంలాంటి వాక్యం:

It’s quite a fairy morning, and I often lay down my needle, and ‘build a castle in the air’..

అలా.

ఈ వాక్యం చదవగానే నేను చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టేసి, అవశ్యం గాల్లో మేడలు కట్టే పని మొదలుపెట్టాలనిపించింది.

నిజానికి ఇటువంటి తీరిక పూర్తిగా మానసికం. మన జీవితాల్లో ఇటువంటి తీరికని గుర్తుపట్టగలగడమే సంస్కృతి అంటాన్నేను.

ఇంకా చాలారాయాలని ఉంది, కాని ఆగుతాను.

24-10-2023

30 Replies to “పోస్టు చేసిన ఉత్తరాలు-2”

  1. ఇంకా కావాలి! 😊

    అదేమి చిత్రమో తెలీదు, ఎందుకో నిన్నా ఈ రోజు ఈ ఉత్తరాలు చదువుతుంటే, డిసెంబరు నెల వచ్చినట్టు ఉంది…ఎందుకు డిసెంబర్? అదింకా నాకే బోధపడలేదు..

    సరే అదట్లా ఉంచితే, మీరు మెయిల్ రాసినా పక్కన ఉన్నట్టే ఉంటుందే! ప్రేమ భావన ఉండటంలో ఉందా, ఉన్నట్టు అనుకోవడంలోనా..

    రేపటి ఉత్తరం కోసం ఎదురుచూస్తూ…
    ప్రేమతో…

  2. కొండవాగు, ఏటిగట్టు
    చెట్టునీడ, ఒక విపినం
    గగన ఛత్రం, గహన హృదయం
    కొన్ని రంగులు, ఇంకొన్ని పువ్వులు
    కొన్ని నవ్వులు , ఇంకొన్ని మాటలు
    వేల శైశవాలు, కొన్ని యవ్వనాలు
    నాలుగక్షరాలు, రెండు పుస్తకాలు
    పుట్టతేనె, కొన్ని పుప్పొడులు
    కొన్ని తుమ్మెదలు, ఇంకొన్ని పక్షులు
    కొన్ని సమీరాలు, ఇంకొన్ని పిల్ల తెమ్మెరలు
    ఒక మలయ మారుతం, కొన్ని వసంతాలు
    కొన్ని హేమంతాలు, వేల ఋతువులు,
    కొన్ని చినుకులు, కొంత మట్టి
    కొన్ని విత్తులు, నాలుగు చివురులు
    కొన్ని ఫలాలు, కొంత రసం
    ఒక నిరీక్షణ , కొంత విరహం
    కొంత భ్రాంతి, కొంత చింతన
    కొన్ని ఉషస్సులు,
    ఇంకొన్ని వెన్నెలలు
    సాంధ్యపరాగమద్దిన
    నెచ్చెలి చెక్కిటద్దము,
    ప్రియవధూ సమాగమం
    కొన్ని స్నేహాలు, ఇంకొన్ని రహస్యాలు
    ఒక స్వప్నం, కొన్ని స్వర్గాలు
    ఒక ఆశ, కొన్ని కథలు
    ఒక జీవితం, వేల జ్ఞాపకాలు
    కొంత విభూతి,కొన్ని రుద్రాక్షలు
    కొంత ధ్యానం, ఇంకొంత భక్తి…..
    ఒక విడుదల, కొంత విముక్తి…..
    ఒక జన్మ, ఇంకొన్ని కోరికలు…..

    పరాశ్రీ……07032023

  3. మీ ఉత్తరాలు చదువుతుంటే సీతాకోకచిలుకనై మకరంద పానం చేస్తున్నట్టు ఉంది sir

  4. “కాగితం చేతిలో కి తీసుకోగానే ఆ మనిషివచ్చి నీ పక్కన కూచున్నట్లే., ఉత్తరం రాస్తున్నంతసేపు ఆ మనిషి సన్నిధిని అనుభూతి చెందుతున్నట్లే”👌👌👌హృదయాన్ని మరింత మెత్తపరచే మీ ఉత్తరాల కోసం ప్రతి ఉదయం ఎదురు చూస్తూంటాను! మీ అభిమాని

      1. మీరివన్నీ చెబుతుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తోంది గురువుగారు!!

        నాకు ఉత్తరాలు రాయడం అంటే చాలా ఇష్టం.చెప్పలేనంత ఉత్సుకత.రంగురంగులుగా రాయాలని. చదువుకునే రోజుల్లో వలస వెళ్లిన అమ్మవాళ్లకు, ఆయనెవారో తెలియకుండానే మా అన్నవాళ్ళు పనికి కుదిరిన యజమానికి, నా పక్కనే కూర్చున్న నా క్లాస్ మెట్ కి కూడా రాసేవాన్ని, ఎదో పిచ్చి. కాలేజీ చేరాక మా లెక్చరర్ జనార్దన్ సర్ కు, సుబ్రహ్మణ్యం సర్ కు, ఉత్తరాలు రాసేవాన్ని, క్లాస్ కి వచ్చి నన్ను చూసి నవ్వేవాళ్ళు. ఎందుకు రాసేవాన్నో తెలీదు.
        అలా ఒక అమ్మాయికి రాసి మా హెడ్ మిస్ట్రీస్ తో బాగా తిట్లు కూడా తిన్నాను.
        ఎన్ని రంగులతో కవిత రాసినా ఆమె దాన్ని పట్టుకెళ్లి మా హెడ్ మిస్ట్రీస్ కు ఇవ్వడం ఇప్పుడు నాకే నవ్వొస్తుంది.కానీ అప్పుడు బాగా ఏడ్చాను.
        అది చివరి ఇక, ఎవరికీ ఉత్తరాలు రాయలేదు.మనేశాను.నేను బాగా మాట్లాడలేను కానీ రాయగలను అని నా నమ్మకం.ఇప్పుడు నా భార్యకు కూడా ఏదైనా వివరంగా చెప్పాలనిపిస్తే రాస్తాను కాగితంపై, చెప్పలేను.

        కానీ ఇన్నాళ్లకు, మీరు రాస్తూ ఉన్నవి చూసాక, మనకు మనం ఎవరికీ పోస్ట్ చేయకుండానే ఉత్తరాలు రాసుకోవచ్చు అని తెలిసింది.
        మీరు రాస్తూ ఉన్నవి ఎంత అందమైనవి!
        మిమ్మల్ని ప్రేమించకుండా ఎలా ఉండగలను.మీరు అనుమతిస్తే మీకు ఒక ఉత్తరం రాస్తాను!! 💐

      2. నీలోని చిన్న పిల్లవాడు ఎప్పటికీ అలా సజీవంగా సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటాను.

  5. హృదయం పరవశించింది. కొన్నేళ్ల క్రితం ఉత్తరాలు రాసుకున్న సమయాలు తలుపు కొచ్చాయి. మనిషికి ఈ ఆధునిక యుగంలో కావలిసింది సమయం,అది వుంటే తనకు తాను గుర్తు కొస్తాడు. బ్రతుకు తెరువు అంటే మన సమయాన్ని , జీవితాన్ని ఇచ్చేయడం. చాలా మంది జీవితంలో ఇదే సమస్య. మీరు దీనికి అతీతులు. మరో ఉత్తరం కోసం …..

  6. నా ప్రియమైన అని రాయాలని ఉంది..
    నా మండలంలోని ఎంతో బాధ్యత ఉంది…

    మీ ప్రతి వాక్యము ఎంత బాగుందో…. మీ లేఖలు మరింత మృదుత్వపు తేనె మనసులోకి వంపి వెళుతుంది

    1. నా ప్రియమైన అని రాయాలని ఉంది..
      నా అనుకోవడంలోనే ఎంతో బాధ్యత ఉంది…

      మీ ప్రతి వాక్యము ఎంత బాగుందో…. మీ లేఖలు మరింత మృదుత్వపు తేనె మనసులోకి వంపి వెళుతుంది

  7. నేనిది చదవడం మొదలు పెట్టానో లేదో, మనసులొ సంజీవ్ దేవ్ గారు మెదిలారు ! నేను చదువుతూ కిందకి దిగానో లేదో మీరు వారి గురించిన రాసిన వాక్యపు తునక నన్ను ఆశ్చర్య చకితుడిని చేసింది! సంజీవ దేవ్ గారిని చదివినంత సేపు నాకు ఆయన అక్షరాల్లో మౌనం అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది! మధ్య యుగాల నాటి తీరికను అందరి ఉత్తరాలు తడిమి రుచి చూపించారు! చాలా బాగుంది సర్!🙏🏼🙏🏼

  8. ‘Post chesina Utharalu’ going to be your best sir. Sucha a Soulful wonderful starting. Pouring like a flower petals. How poor is my English… I am here battling for words to say anything!

  9. ఉత్తరాలు మన అంతరంగం లో కదిలే భావ వీచికలకు ప్రతీకలు.
    అనుభూతులకు ఆలంబనలు
    ముఖతః వ్యక్త పరచలేని ఉద్వేగాలకు వారధులు
    వేగానికి నియంత్రణ లేని కాలం లో
    వెసులుబాటు కోసం ,వెలితిని పూరించుకోవాడానికి చేసే జతనాలు
    మరచిపోలేని పసిప్రాయానికి ప్రయాణాలు
    పెద్దా చిన్నలను సమ్మేళన పరచే రసాయనాలు.

    నాకూ ఉత్తరాలు రాయడం అంటే ఎంత అపేక్ష నో…..

  10. ఉత్తరాలు రాసేటప్పడు ఉండే అనుభూతిని ఒడిసిపట్టి మాకు అందించారు సర్. నిజంగా ఆ అనుభూతులను భావిస్తూ చదవడం చాలా బాగా అనిపించింది.

  11. ప్రేమంటే, ఒక సీతాకోకచిలుకని సీతాకోకచిలుకగా ఉండనివ్వటం…. లేఖల ప్రేమలో పడిపోయా

  12. Satya Sai - Vissa Foundation సత్యసాయి - విస్సా ఫౌండేషన్ says:

    అయ్యా నమస్కారం! మీ ఇంటి దగ్గర ఒక పున్నాగ చెట్టు విరబూసి మీ కవి హృదయానికి ప్రేరణ అయితే నా ప్రేరణ ఇది
    మా ఇల్లు చేరే తోవలో కొండమల్లెల సౌరభ, సోయగాలు!
    https://www.youtube.com/watch?v=FsACZM00MqA
    కొండమల్లి, గిరిమల్లిక, పొన్న, పున్నాగ, మొల్ల, సన్నాయి పూలు, పొన్నాయి పూలు, కాగడా మల్లి, కాడమల్లి గుత్తులు గుత్తులుగా గమ్మత్తుగా మత్తుగా పరిమళాలు వెదజల్లుతూ, కొమ్మలకు తగిలించిన కొమ్మల సెమ్మెలా ఎంతో కనువిందు చేస్తూ మనం నడిచే దారిలో తివాచీలా పరచుకుని రా రమ్మని అహ్వానిస్తున్నాయి. రండి ప్రకృతిని పలకరిద్దాం! మనసారా పులకరిద్దాం!
    సత్యజిత్ రే చిన్నతనంలో ప్రతీ పుట్టినరోజున ఠాగూర్ గారి ఆశీస్సులు తీసుకునే వారు
    అలా ఓ సందర్భంలో ఠాగూర్‌ ఆయనకు ఈ కవిత ఇచ్చి ఇది ఈ వయసులో నీకు అర్ధం కాదు పెద్దయ్యాక చదివి అర్ధంచేసుకో అని అన్నారు.
    “నేను ఈ లోకంలో
    ఎన్నో దేశాలను సందర్శించాను
    గొప్పగా చెప్పుకునే నదులని తిలకించాను
    లోయల్ని చూశాను
    రకరకాల పక్షుల్ని చూశాను
    ప్రకృతి లో ఎన్నో ఎన్నెన్నో అందాలను చూశాను
    కానీ ఒక్క లోటు ఉండిపోయింది
    నా ఇంటి తోటలో
    పచ్చికను తడిపి ముద్దాడిన
    మంచు బిందువుల్ని చూడలేకపోయాను”
    ఈ కవిత ప్రేరణగా పెద్దయ్యాక సత్యజిత్‌ రే పధేర్‌ పాంచాలి తీసారు.
    ఇలా మన చుట్టు పక్కల ఎన్నో అందాలను, ఆనందాలను మనం గుర్తించలేక పోతున్నాం!
    నా ఉదయపు నడకలో మా ఇంటికి చేరే తోవలో ఈ కొండమల్లెల సౌరభ, సోయగాలు ఈ మాటల్ని పదే పదే గుర్తుచేస్తుంటాయి.

Leave a Reply

%d