పోస్టు చేసిన ఉత్తరాలు-1

23-10-2023, తెల్లవారు జాము మూడున్నర.

ప్రియమైన

చాలాకాలం తర్వాత ఉత్తరం రాయడానికి కూచున్నాను. ఒకప్పుడు ఎన్ని ఉత్తరాలు రాసేను. ఎమిలీ డికిన్ సన్ తన తోటలో కొత్త పువ్వు పూసినప్పుడల్లా, చిన్ని పువ్వుతో పాటు ఒక కవిత కూడా రాసి ఉత్తరంలో పంపేదట. తరువాత రోజుల్లో అలా పంపిన కవితలన్నీ Envelope Poems గా తీసుకొచ్చారు. మొదటిసారి ఆ సంగతి చదివినప్పుడు నేను రాజమండ్రిలో ఉండగా రాసిన ఉత్తరాలు గుర్తొచ్చేయి. అప్పుడు నాకో తోటలేదన్నమాటేగాని, ప్రతి ఉత్తరంలోనూ ఒక కవిత రాసిపంపేవాణ్ణి. నిర్వికల్ప సంగీతం పుస్తకం తెద్దామనుకున్నప్పుడు మళ్ళా మిత్రులదగ్గరికి వెళ్ళి ఆ రాసిన ఉత్తరాలేవేనా దొరికితే ఆ కవితలు తిరిగి రాసి తెచ్చుకున్నాను. కాని ఆమెకి రాసిన ఉత్తరాల్లో కవితలు మాత్రం వెనక్కి తేలేకపోయాను. వాటినేమని పిలవాలి? ‘Torn Down Poems’ అనాలా?

యవ్వనోధృతిలో రాసిన ఉత్తరాల్లో ఏవేవో రాసానుగాని, వాటి వెనక ఉన్నది యవ్వనోధృతి మాత్రమే. యవ్వనఝుంఝామారుతం లేని ఉత్తరాల్లో ఏముండేది? ఒకసారి రాజారామ్మోహనరావుకి పాతిక పేజీల ఉత్తరం రాస్తే, ఆయన చిన్న జవాబు రాసాడు. ‘నీ ఉత్తరం చదివాను, టాగోర్ నుంచి నీ దాకా..’అని. శేషేంద్రకి కూడా అలాంటివే ఉత్తరాలమీద ఉత్తరాలు రాస్తే ఆయనేమి రాసాడు! ‘కొమ్మల్లో, ఉషఃకాల జలాల్లో తిరిగే గాలిలాంటిది మీ జన్మ, మీ వాక్ స్పర్శ ఈ సత్యాన్నే తెలుపుతోంది’ అని కదూ.

కానీ అప్పుడు తెలీదు, ఉత్తరాలు ఎందుకు రాయాలో, ఎలా రాయాలో. ఇప్పుడు రాయాలనిపిస్తోంది. ఎమిలీ డికిన్ సన్ రాసుకున్నట్టుగా రాయాలనిపిస్తోంది. 1852 లో మొదటిసారిగా ఆమె సంపాదకుడు ఆమె కవిత్వం ప్రచురణ యోగ్యంగా లేదని చెప్పాక, అప్పుడు ఆమె ఏమని రాసుకుంది?

This is my letter to the World
That never wrote to Me—

మోహన్ ప్రసాద్ చెప్పగా విన్నాను మొదటిసారి, ఆమె రాసిన కవితలన్నీ ప్రపంచానికి రాసుకున్న ఉత్తరాలేనని. తనకి ఎన్నడూ జవాబు రాయని ప్రపంచానికి రాసిన ఉత్తరాలేననీ.

మోహన ప్రసాద్ చెప్పలేదుగానీ, ఆ తర్వాత తెలిసింది, ఆమె 1862 తర్వాత కూడా కవితలతో పాటు ఉత్తరాలు కూడా రాస్తోనేఉందని. ఆ ఉత్తరాల్లో చిన్న చిన్న పూలూ, కవితలూ పెట్టి పంపిస్తోనే ఉంది.

ఒకవైపు అమెరికా లో అంతర్యుద్ధం జరుగుతుంటే, ఆ 1861-65 మధ్య సంవత్సరాల్లో ఆమె అమ్హరెస్ట్ లోని తన ఇంట్లో, తన తోటలో, తన గదిలో కవితలూ, ఉత్తరాలు రాసుకుంటో ఉంది. ఆ చరిత్ర, ఆ సంక్షోభం, ఆ యుద్ధం అవేవీ ఆమెకి పట్టలేదు. మరొకవైపు ఎమర్సన్ లాంటి ఋషి, వాల్ట్ విట్మన్ లాంటి ప్రవక్త తమ జాతిదుఃఖాన్ని తమ దుఃఖంగా మార్చుకుని తమ హృదయాల్ని చీల్చి అందులో జాతికి చోటిచ్చారు. కాని ఎమిలీ డికిన్ సన్ తన తోటలో వయొలెట్లూ, గులాబులూ, కాలిఫోర్నియన్ పాపీలూ, ఆ తోటలో వచ్చివాలే బొబొలింకులూ, తేనేటీగలూ, సీతాకోకచిలుకలూ- అవే తన ప్రపంచంగా జీవించింది. తాను ఎవరికేనా ఏదన్నా ఉత్తరం రాస్తే వాటి గురించే రాసింది. తనకి జవాబు రాయని లోకానికి ఉత్తరాలుగా రాసుకున్న తన కవితల్లోనూ వాటిగురించే రాసింది.

ఆమె రాసిన కవితలు ప్రచురించడానికి తగినట్టుగా లేవని చెప్పిన సంపాదకుడు లోకోపకారం చేసాడు. ఎందుకంటే, అప్పుడే, ఆ 1862 లోనే, ఆమె నిశ్చయానికి వచ్చేసింది. తన కవిత్వం తన సమకాలిక అమెరికాకోసం కాదు, తన కోసం అని. ఆ ఎడిటర్ అలాంటి ఉత్తరం రాసి ‘తన జీవితాన్ని రక్షించాడని’ కూడా రాసుకుంది ఆమె. అలా అనుకోవడం ఎంత మంచిదైంది. ఆ కవితల్నీ ఎవరికీ పంపకపోవడం వల్ల కదా వాటిని ఎవరూ చింపేయకుండా మనకి దక్కాయి.

నేను కూడా కవిత్వం రాయడం మొదలుపెట్టి నలభయ్యేళ్ళు దాటింది. కాని నేను వాల్ట్ విట్మన్ నీ కాలేకపోయాను, ఎమిలీ డికిన్ సన్ నీ కాలేకపోయాను. కొంతసేపు నా గదిలో, మరికొంతసేపు వీథిలో. కొంతసేపు పూర్వకవులతో, మరికొంతసేపు ప్రజలతో. అటువాళ్ళకీ చేరువ కాలేకపోయాను, ఇటు వీళ్ళకీ చేరువకాలేకపోయాను. నేను రాసిన ఉత్తరాల్ని ఆమె కనీసం చింపి పారేసింది, ఈ ప్రపంచం అది కూడా చెయ్యలేదు. నా కవితాసంపుటి ‘కొండమీద అతిథి’ పుస్తకాలు అలానే మిగిలిపోయాయనీ, ఎవరూ కొనడంలేదనీ తిప్పి పంపెయ్యమంటారా అని అడిగాడు బలరాం. అనిల్ బత్తులకి చెప్తే యాభై కాపీలు కాకుమాని శ్రీనివాసరావుకి పంపించాడు. వాళ్ల కాలేజిలో సాహిత్యం అంటే ఆసక్తి ఉన్న పిల్లలకి పంచిపెట్టమని చెప్పానని చెప్పాడు.

‘ఏ యువకుడికో, భిక్షుడికో, deathbed present గానో ..’ చలంగారు 1950 లో చెప్పినా, ఆ మాటలు కవిత్వానికి ఎప్పటికీ వర్తించేమాటలే అని మరోసారి అర్థమయింది.

‘కవిత్వాన్ని ప్రేమిస్తే అమృతహృదయులకివ్వు లేదా అగ్నికెరజెయ్యి’ అని రాసుకున్నాను, నలభయ్యేళ్ల కిందట, అజంతాగారు నా కవితచదివినప్పుడు.

ఇన్నాళ్ళకి అర్థమయింది. కవిత్వమంటే ఉత్తరాలే. ఉత్తరాలతో పాటు పంపేది కాదు. ఇప్పుడు నాకెంత బలంగా అనిపిస్తోందో తెలుసా, నా తోటలో పూసిన ప్రతి కొత్తపువ్వుతోనూ నీకొక కవిత పంపాలని. ఇప్పుడు నేను రాయగలిగే కవితలు ఉత్తరాలే. ఇప్పుడు యవ్వనోధృతిలేదు. ఈ ప్రపంచాన్ని మార్చాలన్న అమాయికత్వమూ లేదు. ఎవరితోటీ వాదించే ఉత్సాహమూ లేదు. ఒకరిని అవుననాలని లేదు, ఒకరిని కాదనాలని లేదు. అసలు ఎవరో ఒకరితో ఏమీ మాట్లాడాలనీ లేదు.

మొన్ననేం జరిగిందో తెలుసా, మేడమీద మొక్కలకి నీళ్లు పోద్దామని వెళ్ళాను. తొలిమంచులో రాలిపడ్డ పారిజాతాల్ని చూస్తూ ఉన్నాను. ఇంతలో ఎక్కణ్ణుంచి వచ్చిందో రంగురంగుల సీతాకోక చిలుక, నేరుగా పోయి ఈజిప్షియన్ క్లస్టర్ మీద వాలింది. ఆ పువ్వుమీద అలా సీతాకోక చిలుకవాలగానే నాకు కలిగిన పులకింతను ఏమని చెప్పను? నేను ఈ ఇంటికొచ్చిన తరువాత నాలుగు కుండీలు తెచ్చి నాలుగు పూలమొక్కలు పెంచడం మొదలుపెట్టి ఏడాది దాటేక ఇప్పటికి ఆకాశం ఈ అతిథిని ఇక్కడకి పంపించింది. ఆ పువ్వుగుత్తి మీద వాలిన ఆ సీతాకోకచిలుకని ఫొటో తీద్దామని దగ్గరగా వెళ్ళాను, బెరుగ్గా, నా శ్వాస దానికెక్కడ తగుల్తుందో, కందిపోతుందేమో, ఎగిరిపోతుందేమో అనుకుంటూ.. కానీ ఆ పానోన్మత్తురాలు ఆ పువ్వుని వదలదే. అంత గాఢచుంబనం మనుషులకి చాతనయ్యేదికాదని చెప్పగలను. అది ఏకకాలంలో చుంబనం, పరిష్వంగం కూడా. ఆ చుంబనం ఎలా ఉందంటే ఆ పువ్వు అస్తిత్వసారాంశమంతటినీ ఆ సీతాకోకచిలుక తనలోకి పీల్చేసుకుంటుందన్నదా అనిపించింది. వెంటనే నువ్వు గుర్తొచ్చావు. ఎవరికి చెప్పను నీకు కాక.

ఆ సీతాకోకచిలుక ఆ పువ్వు మీద వాలినరోజున నేను సింపోజియం అనువాదం చేస్తూ ఉన్నాను. ఆ ప్రేమగోష్ఠిలో పాలుపంచుకున్నవాళ్ళు, చివరికి సోక్రటీస్ తో కూడా ఏ ఒక్కరూ ఆ సీతాకోకచిలుకని చూడలేకపోయారు కదా అనిపించింది. ఆ పానోన్మత్తత ఎలా ఉందంటే, అది చూస్తూనే నేను కూడా వివశుణ్ణయిపోయాను. కాని అప్పటి నా అనుభూతి ఏకకాలంలో ఉద్విగ్నం, శాంతం కూడా. అందుకే అంటున్నాను, అప్పుడు రాసిన ఉత్తరాల్లో ఉద్విగ్నత మాత్రమే ఉండేది, కాని ఇప్పుడు, శాంతం కూడా వచ్చిచేరింది. కాని ఈ శాంతం మాటున ఆ ఉద్విగ్నతను పోగొట్టుకోవాలని లేదు నాకు. అటువంటి చుంబనం, అటువంటి పరిష్వంగం చూసిన తరువాత నేను మామూలు మనిషిని కావటానికి చాలాసేపే పట్టింది..

డికిన్ సన్ తన కవితలో మొదటి చరణం మొత్తం గుర్తుచేయనివ్వు. ఆమె అంటున్నది:

This is my letter to the World
That never wrote to Me—
The simple News that Nature told—
With tender Majesty

ప్రకృతి చెప్పింది simple news, కాని with tender majesty. ఆ tender majesty పూలకీ, తుమ్మెదలకీ మాత్రమే సాధ్యమనుకుంటాను. నాకు ఈ క్షణాన ఒక సంగతి గుర్తొస్తోంది. ఇరవయ్యేళ్ల కిందట, నన్ను నిలువెల్లా కుదిపేసిన ఒక ఉద్విగ్నతలో దిక్కుతోచక ఏమి చెయ్యాలో తెలీనప్పుడు నా పక్కన దమ్మపదం ఉంటే బుద్ధుడేమైనా దారిచూపిస్తాడేమో అని పుస్తకం తెరిచాను. తెరవగానే కనబడ్డ మొదటి పద్యమే (4:49) ఇలా ఉంది:

పువ్వురంగునీ, పరిమళాన్నీ
కలవరపరచకుండా
తుమ్మెద తేనె తాగినట్టు
భిక్షువు భిక్ష స్వీకరించాలి.

ఆ రోజు ఆ సీతాకోక చిలుక చేసింది అదే. ఆ పువ్వు చెదరలేదు, ఒక్క రేక కూడా రాలలేదు. కాని ఆ తీవ్రచుంబనానికీ, ఆ గాఢపరిష్వంగానికీ ఏ లోటూ కలగలేదు.

చిన్నప్పణ్ణుంచీ మనకి నిజంగా చెప్పవలసిన చదువంటూ ఏదన్నా ఉంటే, అది ఇది. పువ్వు నలక్కుండా తేనె సంగ్రహించడమెలానో చెప్పే విద్య. కాని ఎంత వయొలెన్సు చూసాను ప్రేమలో. ఎంత వయొలెన్సుకు పాల్పడ్డాను ప్రేమ పేరిట. అది ఏ ప్రేమన్నా గానీ! ఇప్పుడు మనుషులు మనుషుల్ని వధించుకోవడంలేదూ, తాము మనుషుల్ని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ.

ఈ ఉత్తరం డబ్బాలో వేయడం లేదు. ఇక్కడే పోస్టు చేస్తున్నాను.

23-10-2023

30 Replies to “పోస్టు చేసిన ఉత్తరాలు-1”

 1. మీ ప్రతి వాక్యం ప్రపంచ ప్రేమే…అందుకే ఇలా పంచిపెడుతున్నారు.మేమూ అంతే భావోద్విగ్నత పొగలు చిమ్మే కమ్మని ప్రేమతో చదువుకుంటున్నాం.
  మాష్టారూ

  1. శుభోదయం🙏

   మీవంటి కవులు పంచిపెట్టిన జ్ఞానమే
   ఏమాత్రం నేర్వగలిగినా..
   నిన్నటి వరకు సొక్రటీస్… నేడు డికిన్సన్ కవితల్లో ప్రేమ, తాత్వికత..!

   “నేను నేర్చితి భాగ్యవశమున కవుల కృపగని”
   🙏

 2. పూవు ముట్టుకోకుండానే తేనె దక్కినట్టుంది…beautiful ❤️

 3. అనుభవం, వయసు, ఆలోచనా, పరిణితి చెందిన తర్వాత మనుషులు, కవులుగా, కవులు ఋషులుగా, ఋషులు మళ్ళీ మనుషులుగా ఇలానే వికసిస్తారేమో sir

 4. “పువ్వు రంగునీ పరిమళాన్ని
  కలవర పరచకుండా
  తుమ్మెద తేనె తాగినట్లు
  భిక్షువు భిక్ష స్వీకరించాలి”

  ఎంత తీయనైనది ప్రేమ. మాటలకు అందనిది.
  మనసుకు మాత్రమే
  స్వంతమైనది సాంతంగా

  Acid దాడుల్లో
  అంతస్తుల కోరల్లో
  చిక్కి శల్యమై ప్రేమ
  దారి తెలియక గోడుమంటున్నది.

 5. పూలపై యాసిడ్లు పోసే…వాటి కుత్తుకలను కర్కశంగా తెగనరికే రాక్షస ప్రేమికులకు మీ ఉత్తరం చేరితే ఎంత బావుణ్ణు!

 6. గాఢమైన అభివ్యక్తి అన్న. లోకం తో వాదించదలుచుకోలేదు, ఇది విసుగుతో వచ్చిన ఆలోచనా లేక జ్ఞానం తో వచ్చిన ఆలోచనా?తరచి చూసుకోండి.ఎలాగో లోపలి ప్రయాణం మొదలు పెట్టారు.ఇంకా లోతులకు వెళ్లి ఆ సీతాకోక చిలుక మీరే అయి నిలబడిపోతారు👌👌👌

 7. ఎంత సాధన, ఎంత అనుభూతి…. ఇది కదా జీవితం.ఇది కదా జీవన ఫలం. ఇది కదా జీవన్ముక్తి.
  మీరొక సజీవ సౌందర్య సాహిత్య ప్రవాహం గురువుగారు!! 💐

 8. అ సీతాకోక చిలుక పరిస్థితి మాదిను.. మీ కుటిరము (Blog) మా పాలిట Bermuda triangle అయింది సార్ 😊🙏

 9. మీ రచనల్ని ఇక్కడ చదివే అవకాశం కలిగిస్తున్నందుకు ధన్యవాదములు సర్.
  ఎన్నో విషయాలు సాహిత్యపరంగా తెలుసుకునే మహద్భాగ్యం కలిగింది మాకు.

 10. నమస్తే సర్

  కొన్ని
  ఉత్తరాల్లో నింపి పంపిన కవిత్వాన్ని తిరిగి పొందలేము…ఆ అమాయకపు ప్రేమ భావనను కూడా తిరిగి పొందలేము… పూరెక్కలు నలగకుండ చూసేంత గొప్ప మనసులు కావు కనుక…

  ఈ ఉత్తరాన్ని ఇక్కడ పోస్టు చేసి కాగితాన్ని కవిత్వం చేశారు.

 11. మానవమాత్రులకు చేతకాని ఏకకాల చుంబన పరిష్వంగనల సారాంశాన్ని లేఖగా మలిచారు కవితకు ఇంకేం కావాలి

 12. ఈ ఉత్తరాలు ప్రశాంతంగా చదవాలని వారం రోజులు వాయిదా వేసుకున్నాను. పండుగకు వచ్చి పరివారంతో గడపటం చిన్న చిన్న సమస్యల చిక్కు తీయడం. రోజుకో సంఖ్య పెరుగుతుంటే తాజాదనాన్ని మిస్సవుతున్నానే అనుకుంటున్నా.
  ఒకచో చక్కని మాట మనసును పట్టుకుంది. “
  ఒకప్పుడు ఉద్విగ్నత మాత్రమే ఉండేది . ఇప్పుడు దానికి ప్రశాంతత తోడుగా చేరింది . అవును. నిజం. ఒక దశలో మనకోసం రాసుకున్నవి ప్రపంచం కోసం , ప్రపంచం కోసం రాసినవి మనకోసం అన్నట్లు కలగలుస్తవి. మీ నుంచి మాకు తెలియవచ్చేదేమంటే ఈ దశను మీరు గుర్తించి దాన్ని సోపపత్తికం చేయగలగటం. అందుకే మీ రచనల్లో మమ్మల్ని మేము కూడా చూసుకోగలుగుతున్నాం. ఈ రోజు సూర్యోదయమంత భాసమానం ఈ ఉత్తరం

Leave a Reply

%d