
ఇప్పుడు సింపోజియంలో తత్త్వశాస్త్రం ఎంతవరకూ ఉందో, అది ఎక్కడ సాహిత్యరచనగా మారుతున్నదో చూద్దాం.
మామూలుగా మనకి ప్రపంచం గురించిన ప్రాథమిక సమాచారం మన ఇంద్రియాలవల్ల వస్తుంది, ఇది ప్రత్యక్షజ్ఞానం. కాని దీని ద్వారా మనకి కలిగే పరిజ్ఞానం ప్రాథమికంగా పరిమితం. ఇది వట్టి అభిప్రాయం (గ్రీకులో doxa) మాత్రమే. ఈ అభిప్రాయాన్ని నిశితపరిశీలనకు, తార్కిక వివేచనకు పెట్టి, అందులో నిజమెంతో తెలుసుకోడం ద్వారా లభించేది జ్ఞానం (గ్రీకులోepisteme).
తత్త్వశాస్త్రం ఈ జ్ఞానం రెండు రకాలుగా వస్తుందని చెప్తుంది. ఒకటి, ఇంద్రియసంవేదనల్ని పరిశీలించుకోవడం ద్వారా. మనం చెప్పే శాస్త్రీయ వివేచన, వైజ్ఞానిక పరిజ్ఞానం ప్రధానంగా అనుభవాన్ని పరిశీలించడం ద్వారా, దానిలోని సార్వత్రిక అంశాల్ని వడగట్టడం చేస్తాయి. అంటే ఒక వ్యక్తికి ఒక నిర్దిష్టపరిస్థితుల్లో లభ్యమైన అనుభవం అదే నిర్దిష్టపరిస్థితుల్లో మరొక వ్యక్తికి కూడా లభ్యమైతే, అప్పుడు ఆ అనుభవం వాస్తవికం అనిపించుకుంటుంది. అయితే జ్ఞానం అన్నివేళలా అనుభవం ద్వారానే రాదు. హేతువివేచనద్వారా, తర్కంద్వారా, ఊహాగానాలద్వారా కూడా రావచ్చు. అంటే బుద్ధి ద్వారా లభిస్తుందన్నమాట.
ప్లేటో చెప్పేదేమంటే మనకి ఇంద్రియాలద్వారా లభిస్తున్న సంవేదనల్ని బుద్ధి ఒక జ్ఞానంగా మారుస్తున్నప్పుడు కూడా అదే చివరి జ్ఞానం కాదు. బయటి ప్రపంచం గురించి మనకి ఇంద్రియాల ద్వారా తెలుస్తున్న విషయాల్ని బుద్ధితో సరిదిద్దుకుంటున్నా కూడా, అది కూడా ఎంతోకొంతమేరకు పరిమిత జ్ఞానమే. మార్పుకి లోనయ్యే జ్ఞానమే. కానీ ఎటువంటి మార్పుకీ లోనుకాని, ‘యథార్థమైన’ సత్యం ఒకటి ఉంటుందని ప్లేటో భావించాడు. దాన్ని బయటిప్రపంచంలో చూస్తున్న వాస్తవం తాలూకు ఆదర్శవంతమైన భావంగా అతడు పిలిచాడు. ఉదాహరణకి మనం ఒక బల్ల చూసామనుకోండి. దాని పొడుగు, వెడల్పు, ఎత్తు, మందం, ఉపరితలాన్ని బట్టి దాన్ని బల్ల అని గుర్తుపట్టడానికి లేదా మొదటగా దాన్ని తయారుచేసినవాడు బల్ల అని పిలవడానికి బల్ల అనే ఒక భావం ఉండి ఉండాలి. కాని వాస్తవంగా తయారైన ఏ ఒక్క బల్లా కూడా ఆ బల్ల అనే భావాన్ని పూర్తిగా సంతృప్తి చెందించలేదు. కాబట్టే కాలం గడిచేకొద్దీ బల్లలు తయారుచేయడంలో మరింత మెరుగుతనం, మరింత నాణ్యత వచ్చిచేరుతున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. కాని ఒక బల్లని తయారుచేయడంలో మనిషి సాధిస్తున్న ఈ అభివృద్ధి పరిణామం వల్ల జరుగుతున్నది తప్ప, అతడి మనసులో నిరపేక్షంగా ఒక ఆదర్శవంతమైన బల్ల ఉందని ఎలా నమ్మడం? ఆ ఆదర్శభావనని తార్కికంగా ఎలా నిరూపించడం? ఈ ప్రశ్నమీదనే తత్త్వశాస్త్రం గత రెండున్నరవేల ఏళ్ళుగా తలపట్టుకుంటూనే ఉంది.
ఇక్కడ సింపోజియంలో చర్చ కూడా ఇదే. ఇక్కడ బల్ల అనే వస్తువు స్థానంలో సౌందర్యం అనే భావనని పెట్టి చూడండి. ఈ చర్చ మొత్తం కంటికి కనిపించే సౌందర్యం నుంచి మనం కంటితో చూడలేని ఒక నిరపేక్ష, అప్రమేయ సౌందర్యం దిశగా ప్రయాణించడమని మనకు సునాయాసంగా అర్థమవుతూనే ఉంటుంది. ఇలా దృగ్గోచర సత్యం నుంచి ఇంద్రియాలు అందుకోలేని సత్యం వైపుగా మనిషి ప్రయాణించాలని చెప్పే భావన కూడా మనకి కొత్తగా అనిపించదు. ఎందుకంటే దాదాపుగా ఉపనిషత్తులు మాట్లాడింది కూడా అదే కాబట్టి.
కాని ప్లేటో చెప్తున్నట్టుగా ఆ ఆదర్శవంతమైన భావనని, ఆ అంతిమసత్యాన్ని మనం హేతుబద్ధంగా ఎలా చేరుకోగలమో మనకి అంత స్పష్టంగా తెలియదు. కంటికి కనిపిస్తున్న పరిమిత సత్యం ద్వారా కొన్ని సార్వత్రిక సూత్రాల్ని మనం హేతువుద్వారా ఏర్పరచుకోగలం, కానీ, ఆ సార్వత్రికాల్ని కూడా దాటిన ఒక నిరపేక్షసత్యాన్ని హేతువు ద్వారా ఎలా అందుకోగలమనేది ప్లేటో తన రచనల్లో ఎక్కడా సంతృప్తికరంగా వివరించలేదు.
ప్లేటో రచనలన్నిటిలోనూ ప్రతిపాదించిన తత్త్వశాస్త్రం స్థూలంగా ఆ పరమసత్యం గురించిన అన్వేషణనే. అయితే సింపోజియంలో అదనంగా ప్రతిపాదించిన విషయమేమిటంటే, ఆ అంతిమసత్యం మంచిది అని కూడా చెప్పడం. దాన్ని తెలుసుకోవడం మనకి శుభప్రదం అని చెప్పడం.
ఇక్కడ మనకి వచ్చే ప్రశ్న ఏమిటంటే, మనం ఇంద్రియాలద్వారా చూస్తున్న దానికన్నా అతీతంగా ఉండే ఆ పరమసత్యం మన ఆలోచనలకీ, ఇష్టాయిష్టాలకీ అతీతమైంది కదా. ఈ సృష్టిక్రమాన్ని, ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ అంతర్గత తర్కం లేదా ఆ సూత్రం, అంటే ఆ సత్యం ప్రధానంగా మంచికోసమే, అని ఎలా భావించగలం? అంతేకాదు, ఆ మంచి మన వల్లనే మనకి సత్యం గురించిన జ్ఞానం కూడా కలుగుతోందంటాడు ప్లేటో.
రెండవ సమస్య, ఆ అత్యున్నత జ్ఞానం స్వతహాగా మంచిదే అని భావించడానికి నిరూపణ ఏమిటి? అంటే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న అంతర్గత తర్కం మంచిదే అయితే అది ప్రతి ఒక్కసారీ మానవుడికి మేలు చేసేదిగా ఎందుకుండదు?ఉదాహరణకి తుపాన్లు, అగ్నిపర్వతవిస్ఫోటనాల్లాంటి ప్రాకృతిక వైపరీత్యాలు మనుషులకీ లేదా తక్కిన ప్రాణులకీ మేలుచేసేవి కావుకదా. వాటివల్ల కూడా ఏదో ఒక మేలు ఉండేఉంటుంది, కాని మనం గ్రహించలేకపోతున్నాం అని చెప్పవచ్చుగాని, అప్పుడది అభిప్రాయమే అవుతుంది తప్ప, జ్ఞానంగా నిలబడదు. ఇక్కడే దర్శనాలకీ, మతాలకీ మధ్య విభజనరేఖ కూడా. చాలా దర్శనాలు ఆ పరమసత్యం లేదా ఆ పరమసూత్రం మంచిచెడులకి అతీతమని భావిస్తాయి. కాని ఆ పరమసత్యం స్వయంగా దయాపూరితమని భావించడం మతాలకి కీలకం.
మూడో సమస్య, అటువంటి ఒక నిరపేక్ష సత్యం ఉందని తెలుసుకోడం జ్ఞానం, సరే, కాని ఆ జ్ఞానం ద్వారా మనకి సత్యం తెలుసుకున్న సంతోషం కలగవచ్చు, నిజమే, కానీ, ఆ సంతోషం మానవజీవితాన్ని సార్థకం చేసే అత్యున్నత సంతోషం (గ్రీకులో eudaimonia) అని ఎలా చెప్పగలం? అసలు అటువంటి జ్ఞానం ఒకటి ఉందనిగాని, దాన్ని తెలుసుకోవడంలో సంతోషం ఉందనిగాని తెలియకుండానే అసంఖ్యాక మానవులు పుట్టిగిట్టుతున్నప్పుడు అదే మానవుడు అభిలషించే అత్యుత్తమ సంతోషం అని ఎలా చెప్పగలం? అసలు సత్యాన్ని తెలుసుకోడంలో సంతోషమంటూ ఉంటే ఆ సంతోషం ఎందుకు కలుగుతోంది?
ప్లేటో తక్కిన రచనల్లో ఈ ప్రశ్నలకి తార్కికంగా జవాబులు చెప్పడానికి ప్రయత్నించాడు. కాని సింపోజియంలో మాత్రం సాహిత్యరూపంలో జవాబివ్వడానికి పూనుకున్నాడు. అది రెండు స్థాయిల్లో చేసాడు. మొదటిది అరిస్టొఫేనీస్ ద్వారా ఒక కథ చెప్పించడం ద్వారా. మనం మరొక మనిషి తో కలయికని ఎందుకు కోరుకుంటాం అనే ప్రశ్నకి ముందుగా ప్లేటో అరిస్టొఫెనీస్ ద్వారా చెప్పించిందేమంటే, మనం జీవులుగా అపరిపూర్ణులమనీ, మనలో అర్థభాగం విడివడి ఉందనీ, రెండుగా విడివడ్డ ఆ అర్థభాగాలు ఒకదానితో ఒకటి కలిసిపోవాలని కోరుకుంటూ ఉంటాయనీ చెప్పించాడు.
కాని ఆ తర్వాత సోక్రటీస్ తో ఆ మెటఫర్ ని తార్కికంగా పూర్వపక్షం చేయిస్తాడు. అరిస్టొఫెనీస్ చెప్పిన మెటఫర్ మన కోరికని పూర్తిగా వివరించలేదని చెప్పిస్తాడు. మనిషిలో కలిగే కోరిక తనలోని అసంపూర్ణతని భరించలేక, మరొక అర్థభాగంకోసం, ప్రాకృతికంగా పడే వేదన కాదనీ, అది స్పష్టంగా, తన మంచికోసం మనిషి చేపట్టే అన్వేషణ అనీ చెప్పిస్తాడు. మనిషి కోరిక వెనక ఉన్నది ప్రధానంగా తన మంచి అనీ, ఆ మంచి వెనక ఉన్నది తన సంతోషమనీ చెప్పిస్తాడు. తనకి మంచి చెయ్యకపోతే, అవసరమైతే, తన శరీరంలోని భాగాన్ని కూడా తీసెయ్యడానికి మనిషి సిద్ధపడతాడని కూడా చెప్తాడు. కాబట్టి సంతోషంకోసం కోరిక మంచికోసం కోరికగా, మంచికోసం కోరిక ఆ మంచి ఏదో తెలుసుకునే జ్ఞానంకోసం కోరికగా పరిణమిస్తోందనీ చెప్తాడు. ఇక్కడ సోక్రటీస్ చెప్పిన విషయానికి చివరలో ఆల్సిబయడిస్ చేసిన ప్రసంగం ఒక దృష్టాంతపూర్వక వ్యాఖ్యానం అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఆల్సిబయడిస్ తనకి ప్రజాదరణ పట్లా, ప్రజామోదం పట్లా కోరిక ఉన్నప్పటికీ, సోక్రటీస్ సన్నిధిలో మాత్రమే సత్యం అనుభవంలోకి వస్తోందని చెప్తాడు. అలా ఒక అంతిమ సత్యాన్ని మనకు అనుభవంలోకి తెస్తున్నదాన్నే ప్రేమ అంటాడు ప్లేటో. ప్రేమ గురించి మొదట్లో మాట్లాడిన వక్తలు ప్రేమ మనిషిలోని ఉత్తమ లక్షణాల్ని బయటకు తెస్తుందని చెప్పారుగానీ, అది మనిషిని సత్యంవైపుగా నడిపిస్తుందని చెప్పలేదు. కాని సోక్రటీస్ మాత్రమే, ప్రేమ వల్ల మనిషి lower mystery నుంచి higher mystery కి ప్రయాణిస్తాడని చెప్పాడు.
ప్లేటో చెప్పినదాని ప్రకారం కోరికకీ, ప్రేమకీ తేడా ఉంది. కోరిక (గ్రీకులో epithumia) మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కాని ప్రేమ (గ్రీకులో eros) పూర్తిగా శుభప్రదం. ఎందుకంటే eros ఎప్పటికీ శ్రేష్ఠత (గ్రీకులో arete) నే కోరుకుంటుంది.ఆ శ్రేష్ఠతకోసం తపనవల్లనే మనిషి సుందరమైనవాటిపట్ల (గ్రీకులోkalos) ఆసక్తుడవుతున్నాడు. అక్కణ్ణుంచి మరింత మరింత ముందుకు ప్రయాణించి పరమసౌందర్యాన్ని భావించడానికి చేరుకుంటాడు. (ఈ కాలోస్ కీ, సంస్కృతంలోని ‘కల్యాణ’ అనే పదానికీ మూలధాతువు ఒకటే.) సత్యాన్ని తెలుసుకోదగ్గదిగా, జ్ఞానాన్ని సంతోషించదగ్గదిగా చేస్తున్నది ఆ కోరికనే. శ్రేష్ఠమైంది సిద్ధించడంవల్ల కలిగే సంతోషం కూడా శ్రేష్ఠ సంతోషమే (గ్రీకులో eudaimonia) అవుతుంది. అయితే ఆ సంతోషమెందుకు అని కూడా ప్రశ్నించవచ్చుగాని, ఏ మనిషీ నాకు సంతోషమెందుకు అని అడగడు, అది ప్రశ్నల్తో పనిలేని స్థితి అంటాడు ప్లేటో.
ఇది మనం నమ్మదగ్గదిగానే వినిపిస్తుంది. అలా వినిపించడానికి కారణం ప్లేటో దాన్ని తార్కిక పదజాలంతో కాక, కవితాత్మక పదజాలంతో వివరించడమే కారణం. డయొటిమా అత్యున్నత సంతోషం గురించీ, సౌందర్యం గురించీ సోక్రటీస్ కు చెప్తున్నప్పుడు, ఆ ఉత్తేజకరప్రసంగాన్ని వింటున్నప్పుడు మనకు తెలీకుండానే మన హృదయంలో కలిగే ఆమోదంలాంటి ఆమోదం మనలో కలగడం మనం గమనించవచ్చు. ఇక్కడ మనలో కలిగిన ఆమోదం, సంభాషణ చివరకు వచ్చేటప్పటికి, ఆల్సిబయడిస్ తన ప్రసంగంలో సోక్రటీస్ సన్నిధిలో తనకు కలిగిన అనుభవం గురించి చెప్పేటప్పటికి ఒక epiphany గా మారిపోతుంది. అది ప్రశ్నల్తో పనిలేని ఒక సాక్షాత్కార క్షణం. ఒక epiphany. ఇటువంటి epiphany సాధారణంగా కథల్లోనో, నాటకాల్లోనో పతాకస్థాయిలో ప్రేక్షకుడు పొందే అనుభూతిలాంటిది. అందుకనే నేను దీన్ని సాహిత్యకృతి అని అంటున్నది.
అయితే, ప్లేటో చెప్పిన అంశాల్ని మనం తార్కికంగా ప్రశ్నించకపోయినా కూడా, ఆయన చెప్పినవన్నీ చెప్పినట్టే నమ్మినా కూడా ఒక ప్రశ్న మిగిలిపోతుంది. అదేమంటే, మనిషి అత్యున్నత సౌందర్యాన్ని సంభావించినప్పుడు, అది మరొక మనిషితోనో, మరొక అస్తిత్వంతోనో సంబంధంలేని నిరపేక్ష సౌందర్యం అయినప్పుడు, ఆ మనిషికి తోటిమనిషితో లేదా ఈ ప్రపంచంతో లేదా చరాచరజీవకోటితో ఇంక నిమిత్తం లేదా? రిపబ్లిక్ లో ప్లేటో ఈ ప్రశ్నకి చెప్పిన జవాబేమిటంటే, సత్యాన్ని కనుగొన్న తర్వాత తత్త్వవేత్త తిరిగి సాధారణప్రపంచంలోకి అడుగుపెట్టి పౌరజీవితాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తాడు అని. సింపోజియంలో ఆ జవాబు వాచ్యంగా చెప్పకుండా సూక్ష్మంగా సాహిత్యపద్ధతిలో చెప్పాడు.
డయోటిమా ద్వారా అత్యున్నత సత్యం తెలుసుకున్న తరువాత కూడా సోక్రటీస్ అగధాన్ పానగోష్ఠికి రావడమే అందుకు నిరూపణ. అంటే ఏమిటి? సత్యం తెలుసుకున్న తరువాత తత్త్వవేత్త తన తోటిమనుషులకు దాన్ని అందించే ప్రయత్నం, సత్యానికి అనుగుణంగా జీవించడాన్ని అలవర్చే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సింపోజియం ఒక విద్యాసంబంధమైన రచన కూడా. ప్రాచీన గ్రీసులో పురుషుల మధ్య ఏర్పడే ప్రేమ ప్రధానంగా వయసులో పెద్దవాడైన పురుషుడు తనకన్నా చిన్నవాడికి జ్ఞానం అలవర్చడంకోసమే సాంఘిక సమావేశాలూ, పానగోష్ఠులూ కోరుకునేవాడు కాబట్టి, ప్లేటో తన పుస్తకానికి అటువంటి సందర్భాన్నే నేపథ్యంగా తీసుకున్నాడు. అంతే కాదు, సత్యం తెలిసినవాడు దాన్ని కేవలం మాటల్తో మాత్రమే కాదు, ప్రవర్తన ద్వారా కూడా బోధిస్తాడు. సంభాషణ చిట్టచివరలో ఆల్సిబయడిస్ సోక్రటీస్ కీ తనకీ మధ్య జరిగిన ఉదంతం గురించి చెప్పడమే సాక్ష్యం. ఇందులో మరొక సంగతి కూడా ఉంది. సంభాషణ మొదలవుతూనే అగధాన్ సోక్రటీస్ ని తన దగ్గరికి వచ్చి కూచోమని, అతణ్ణి తాకుతూ కూచుంటే, జ్ఞానం తనలోకి నేరుగా ప్రసరిస్తుందనీ అంటే సోక్రటీస్ నవ్వుతూ తాకినంతమాత్రాన ప్రసరించేది జ్ఞానం కానేకాదంటాడు. సంభాషణ ముగిసేముందు, సోక్రటీస్ ఆల్సిబయడిస్ ని తాకకుండానే అతణ్ణి సత్యానికి ఎలా చేరువగా తీసుకుపోగలిగేడో మనం చూస్తాం. గొప్ప సాహిత్యకృతి లక్షణం ఇది. ఎక్కడ మొదలవుతుందో అక్కడ ముగియడం.
అంతేకాదు, తక్కిన సంభాషణల్లో సోక్రటీస్ చర్చ మొదలుపెట్టి, తనకీ, ఎదటివాడికీ కూడా ఏదీ నిశ్చయంగా తెలియదని చెప్తాడు. కాని ఇక్కడ ఆయన చర్చ మొదలుపెట్టాడుకానీ, దాన్ని మధ్యలోనే వదిలేసి డయొటిమా తనకు బోధించిన రహస్యాన్ని తన మిత్రుల్తో పంచుకున్నాడు. కాని ఆ మాటల్ని తన వ్యక్తిత్వంలో ఇంకించుకున్నాడనీ, సత్యం, చర్చలద్వారాకన్నా కూడా వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మరింత స్పష్టంగా బోధపడుతుందనీ అతడు ఆల్సిబయడిస్ తో ప్రవర్తించిన తీరుని బట్టి మనకి అర్థమవుతుంది. అందువల్ల సింపోజియం సత్య సౌందర్యాల చర్చగా కనిపించినా నిజానికి ఇది అత్యున్నత నైతిక రచన, శీలనిర్మాణ వాచకం. సోక్రటీస్ యువతరాన్ని పాడుచెయ్యకపోగా వాళ్లని నిజమైన జీవితాదర్శాల వైపుగా నడిపించాడని చెప్పడమే ప్లేటో ఉద్దేశ్యమైతే, ఈ రచన నూటికి నూరుపాళ్ళు సఫలమైదనే చెప్పాలి.
4
సింపోజియంలో డయోటిమా సోక్రటీస్ కి వివరించిన సౌందర్య ప్రయాణాన్ని ascent of desire అని అంటూంటారు. అంటే ఒక సౌందర్య శిఖరారోహణ అన్నమాట. అందులో అత్యున్నత శిఖరానికి చేరుకున్న ఆ సత్యాన్వేషి ఋషిగా మారి ఆ సోపానమార్గంలో కిందకి దిగి తన తోటిమనుషులకు తిరిగి ఆ దారిగురించి బోధిస్తాడని మనకి సింపోజియం చెప్పకనే చెప్తుంది. మనుషుల పట్ల ప్రేమలేకపోతే ఆ ఋషి తిరిగి మళ్ళా ఈ సాధారణ జీవితంలో అడుగుపెట్టవలసిన పనే లేదు. ఇది దాదాపుగా తైత్తిరీయ ఉపనిషత్తులో పంచకోశ జాగృతి పొందిన తర్వాత, సాధకుడు ఆనందమే బ్రహ్మం అని తెలుసుకున్నాక, మరలా అన్నాన్ని స్తుతించడం లాంటిది.
ప్రేమ అంటే అది. సత్యాన్ని తెలుసుకోడానికి చేసే ప్రయాణానికి కోరిక, లేదా కాంక్ష, లేదా ప్రేమ ఎలా కారణమో, తెలుసుకున్న సత్యాన్ని తిరిగి తనతోటిమనుషుల్తో పంచుకోవాలనుకోడానికి కూడా ప్రేమనే కారణం. ఆ ప్రేమనే సోక్రటీస్ ను ఏథెన్సు వీథుల్లో తిప్పింది. చివరకు మృత్యువు ఎదట నిలబెట్టింది.
కంటికి కనిపిస్తున్న సత్యమే సత్యమని సోక్రటీస్ నమ్మనందువల్లనే ఆయన మృత్యుముఖంలో ధీరుడిగా నిలబడ్డాడని మనం చెప్పుకుంటాం. కాని ఆ ధీరత్వానికి కారణం ప్రేమ కూడా. ఎందుకంటే, తాను తెలుసుకున్న జ్ఞానం తన శీలంగా పరిణమించకపోతే, తన సత్యానికి విలువ ఉండదు. అప్పుడు తాను అంతదాకా తన శిష్యులకి ఏ విలువల గురించి, ఏ సౌందర్యం గురించి, ఏ నైతికత గురించి బోధించాడో అవన్నీ అబద్ధాలైపోతాయి. కాబట్టి ఆయన తన తోటిమనుషుల పట్ల ఉన్న అపారమైన ప్రేమవల్లనే మృత్యువును ధీరుడిగా స్వాగతించాడు.
నా జీవితంలో మృత్యువును అంత ధీరత్వంతో స్వగతించినవాళ్లను మా నాన్నగారిని, మా అమ్మని చూసాను. ఈ మధ్యనే కల్యాణి నీలారంభంగారిని చూసాను.
కల్యాణిగారు నాకు ఫేస్ బుక్ ద్వారా 2015 లో పరిచయమయ్యారు. కాని రెండేళ్ళ కిందట ఆమె విశాఖపట్టణం నుండి విజయవాడ వచ్చిన తరువాత ఆమెని ప్రత్యక్షంగా కలుసుకోగలిగాను. చాలాసార్లు మాట్లాడుకునే అవకాశం కూడా లభించింది. విజయవాడలో ఆమె ఉంటున్న గ్రీన్ స్పేస్ ఎంక్లేవ్ అపార్ట్ మెంటులోనే మా అక్కా, వసుధారాణిగారు కూడా ఉంటున్నందువల్ల, వారు ముగ్గురూ ఈ రెండేళ్ళుగా ఎంతో ఆత్మీయంగా సాహిత్యచర్చలు చేస్తూ ఉండేవారు. ఆ సంభాషణల్లో ఎంతో గాఢతా, ఆత్మీయతా కలగలసి ఉండేవి.
నేను విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఆ ఆత్మీయగోష్ఠి నాకు కన్నులపండువలాగా ఉండేది. కిందటేడాది నేను మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ మీద నా ఆలోచనలు రోజూ నా బ్లాగులో పోస్టు చేస్తున్నప్పుడు, ఆమె దాదాపుగా ప్రతి ఒక్కరోజూ స్పందిస్తూనే వచ్చారు. ‘నేను ఆ వ్యాఖ్యానాన్ని ఒక పుస్తకంగా తేవాలనుకుంటున్నాను. మీరు దానికొక ముందుమాట రాయండి’ అని అడిగాను. అప్పుడు చెప్పింది మా అక్క, కల్యాణిగారు కేన్సర్ బారినపడ్డారని, ఆమె ఎక్కువ కాలం బతికే అవకాశం తక్కువనీ. ఆ వార్త నాకు తెలిసిన తర్వాత కూడా ఆమెని చూసాను, మాట్లాడేను. కాని ఆమె వదనంలోగాని, హృదయంలోగాని మృత్యువు ఇంటిముందు నిలబడి ఉన్న సూచనలు ఎక్కడా కనిపించలేదు.
కానీ కల్యాణిగారు నా అభ్యర్థనని మర్చిపోలేదు. నాలుగైదు నెలలకిందట నేను నా బ్లాగులో ఆ వెన్నెల రాత్రులు నవల సీరియల్ గా రాసినప్పుడు ఆమె ఆ పుస్తకానికి ముందుమాట రాసి పంపించారు. ఆమెనుంచి ఈ మెయిల్లో ఆ ముందుమాట అందుకున్నప్పుడు ‘శీతవేళ రానీయకు, శిశిరానికి చోటీయకు’ అన్న మహాకవి మాటలు గుర్తొచ్చాయి.
తాను మరెంతో కాలం, ఇంకా చెప్పాలంటే మరెన్నో రోజులు, బతకనని తెలిసినా కూడా ఆమె జీవితోత్సాహంలోగాని, మనుషుల పట్ల ఆమె ప్రేమలోగాని ఎటువంటి మార్పూ కనబడలేదు. ఆమె ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి మూడు రోజులముందు మా అక్క నన్ను ఆమెదగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ ముందు రోజే వైద్యులు ఆమె ఏ క్షణాన్నైనా కన్నుమూయగలదని చెప్పారని ఆమెకి తెలుసు. కాని ఆరోజు ఆమె నాతో తన తల్లిగారి గురించి ఎంత ప్రశాంతంగా, ఎంత గర్వంగా, ఎంత సంతోషంగా మాట్లాడేరంటే, ఆ మాటలు విన్నవాళ్ళు ఆమె మూడురోజుల తర్వాత ఈలోకం నుంచి కనుమరుగు కాగలదని నమ్మలేరు.
మాటల మధ్యలో ‘నాకొక చిన్న సహాయం చెయ్యగలరా?’ అనడిగారు ఆమె. ఏమిటన్నాను. ఆమె రెండునెలలకిందట బెంగుళూరు లో ‘రంగశంకర’కు వెళ్లారట. సాధారణంగా అక్కడ నాటక ప్రదర్శన పూర్తయ్యాక నిర్వాహకులు మైసూరు మల్లెమొక్కని ఒకదాన్ని ప్రేక్షకుల్లో ఎవరికేనా బహుమతిగా ఇస్తుంటారట. ఆ రోజు ఆ మల్లెమొక్క కల్యాణిగారి చేతుల్లో పెట్టారుట. అది అనుకోకుండా ఆమెకి లభించిన కానుక. ‘ఆ మొక్కని మీకు ఇవ్వాలనుకుంటున్నాను, దాన్ని తీసుకుంటారా?’ అనడిగారు ఆమె.
నాకు ఆ క్షణాన, ప్లేటో రాసిన ఫీడోలో సన్నివేశం గుర్తొచ్చింది.అక్కడ సోక్రటీస్ చివరిక్షణాల్లో తన శిష్యుడు క్రీటో వైపు తిరిగి తాను గ్రీకుల ఆరోగ్యదేవత అక్లిపియస్ కు ఒక కోడిపుంజుని మొక్కుకున్నాననీ, ఆ మొక్కుతీర్చమనీ అడుగుతాడు. అవే ఆయన చివరిమాటలు.
మృత్యువు ఎదట కల్యాణి గారు చూపించిన ధీరత్వం ఆ చివరి రోజులకీ, ఆ చివరి క్షణాలకీ మాత్రమే పరిమితం కాదు. నిజానికి గత రెండేళ్ళుగా ఆమె విజయవాడలో గ్రీన్ స్పేస్ ఎంక్లేవ్ అపార్ట్ మెంటులో రెండో ఫ్లోరు, మూడో ఫ్లోరుల్ని ఏథెన్సు వీథులుగా మార్చేసారు. ఆమెని ప్రాణప్రదంగా, కంటికి రెప్పలాగా చూసుకున్న వసుధారాణిగారితో పాటు మా అక్కతో కూడా కలిపి ఆ ముగ్గురూ ఎడతెగని ప్రేమగోష్ఠి సాగించారు. సాహిత్యాన్ని ప్రేమించేవారందరికీ ఈ రెండేళ్ళ పాటు అదొక అమృతపానగోష్ఠిగా నడిచింది.
ఆమెని నేను చూసిన ఆ చివరిరోజు కూడా ఆమె మృత్యువుని ఇంట్లోకి అడుగుపెట్టనివ్వకుండా గడప దగ్గరే ఉండిపొమ్మని శాసించినట్టే ఉన్నారు. ఆమె ఈలోకం నుండి సెలవుతీసుకున్నాక తన శరీరాన్ని ఒక మెడికల్ కాలేజికి ఇచ్చెయ్యమని అడిగారనీ, అదే ఆమె చివరికోరిక అనీ విన్నాను. ఒక మనిషి జీవిస్తే అలా జీవించాలి, నిష్క్రమిస్తే అలా నిష్క్రమించాలి.
సింపోజియంలో డయొటిమా సోక్రటీస్ తో చెప్పిన ఒక మాట చాలా కీలకం. ప్రేమ మనమనుకున్నట్టుగా కేవలం సౌందర్యంపట్ల ప్రేమ మాత్రమే కాదు, అది సౌందర్యసృష్టికి సంబంధించింది అని చెప్పింది ఆమె. అంటే మనిషి సౌందర్యాన్ని సృష్టించగలడు. ఏ మర్త్యప్రాణి ఐనా సౌందర్యానికి జన్మనివ్వడం ద్వారా మాత్రమే అమరత్వాన్ని పొందగలడు. మామూలు మనుషులు తమలాంటి మర్త్యులైన మనుషుల్ని పుట్టించడంతో ఆగిపోతే, సత్యాన్వేషులూ, నిజమైన ప్రేమాన్వేషులూ పరిపూర్ణసౌందర్యానికి జన్మనిస్తారని డయోటిమా చెప్తున్నది.
ప్రేమగోష్ఠిలో డయొటిమా చేసిన ఈ ప్రసంగం చదవగానే మిత్రులు సుమలత సత్తూరు గారు ‘సౌందర్యలహరి’ అని అనకుండా ఉండలేకపోయారు.
ఈ సౌందర్యలహరిని కల్యాణి నీలారంభంగారిస్మృతికి కానుక చేస్తున్నాను.
Featured photo: Fragment of a Female Head (Greek, S Italy, 440-430 BC).PC: Wikicommons
20-10-2023
ఎక్కడిగ్రీసు దేశపు ఏథెన్సు ,ఎక్కడి విజయవాడ గ్రీన్ స్పేస్ ఎన్ క్లైవు. ఎక్కడి డయొటిమా , ఎక్కడి
కళ్లాణీ నీలారంభం, ఎక్కడి సోక్రటీసు ఎక్కడి వీరభద్రుడు.🙏
ప్రేమగోష్టి ఎంత అదుపు గా చదువుదామనుకున్నా
మొదటి సారి కనుక ముందు ఏంచెబుతారోనని సహజమైన ఆత్రుత తో చదివాను. మళ్లీ మళ్లీ చదవాల్సిన పుస్తకం.పాఠకులు గ్రహించవలసిన విషయాలను అరటిపండు ఒలిచినట్లు చివరి భాగంలో విశదీకరించారు. మంచి హృదయానికి ప్రతీక మల్లెచెట్టు.మల్లెమొక్క కానుకతో ముగింపు
గురజాడ మంచి అన్నది పెంచుమన్నా అని ప్రేమతో మీకు ఇచ్చిన కానుక. ప్లేటోను, సోక్రటీసును, గ్రీకుల తత్త్వ మూలాలను, ప్రేమ పారమ్యాలను, సోక్రటీసు మరణశిక్ష , గాంధీ హత్యోదంతం వంటి సాంఘిక దుష్పరిణామాలవెనుక గల సహేతుక కారణాలు అన్నిటికన్నా మిన్నగా జ్ఞాన విచికిత్స సౌందర్య దర్శనం,వీటన్నిటికి ఉపనిషత్తుల అనుమేలనం-అపూర్వ అనుసంధాన అనువాద రచన.
తెలుగు భాషామతల్లికి కంఠాన రత్నమాల మీ రచనలహారం . హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు.
ఈ పుస్తకం అనువాదం చేస్తూ ఉండగా నా పోస్టులు చదివే పాఠకుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. కానీ పాఠకుల కోసం కాదు, నా కోసం నేను ఈ పుస్తకం తెలుగు చేయవలసింది అని అనుకుని పూర్తి చేశాను. కానీ ఇప్పుడు ఈ పుస్తకం మీద మీ ప్రతిస్పందన చదివాక నా అనువాదం పూర్తిగా సఫలం అయిందని భావిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
🙏