
ఎన్నో ఏళ్ళుగా అనుకుంటూ వస్తున్న పని ఇన్నాళ్ళకు పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే, మొత్తం పాశ్చాత్య తత్త్వశాస్త్రమంతా ప్లేటో రచనలకు ఒక ఫుట్ నోట్ లాంటిది అని వైట్ హెడ్ అన్న మాట మనం మరవలేం. ఆయనిలా అన్నాడు:
‘యూరపియన్ తత్త్వశాస్త్రం గురించి పెద్దగా పొరపడకుండా మనం చెప్పగల మాట ఏమిటంటే, ఆ సంప్రదాయం మొత్తం ప్లేటో రచనలకి వరసగా రాసుకుంటూ పోయిన ఫుట్ నోట్స్ మాత్రమే. అతడి రచనలనుంచి పండితులు పిండుతూ వచ్చిన ఆలోచనా వ్యవస్థ గురించి నేనీ మాటలు చెప్పడంలేదు. ఆ రచనలనుంచి వాళ్ళేమేరకు పిండివడగట్టారన్నది అంతనిశ్చయమైన సంగతేమీ కాదు. నేను మాట్లాడుతున్నది ఆయన రచనలంతటా విస్తారంగా కనిపించే భావాల గురించి. ఆయన వ్యక్తిగత ప్రజ్ఞా పాటవాల గురించి. ఒక నాగరికత అనుభవించిన అత్యున్నతదశలో ఆయనకి లభించిన అవకాశాల గురించీ, అనుభవాల గురించీ, తనకి వారసత్వంగా లభించిన ఒక జ్ఞాన సంప్రదాయాన్ని ఆయన మరీ కరడుగట్టిన వ్యవస్థగా మార్చకపోవడం గురించీను. వాటివల్ల ఆయన తన సాహిత్యాన్ని ఒక అక్షయ ధ్వనికోశంగా మార్చేసాడు.’
ఈ మాటల సారాంశమేమిటంటే, ప్లేటోని చదివి అర్థం చేసుకోడానికీ, ఆయన వెలిబుచ్చిన భావాల గురించి ఆలోచించడానికీ లేదా ఇద్దరు మిత్రులు కూచుని మాటాడుకోడానికీ, వాళ్ళు అకడమిక్ సంప్రదాయానికి చెందినవాళ్ళే కానక్కరలేదని. ప్లేటో రచనలు తత్త్వశాస్త్రరచనలు అన్న మాట ఎంత నిజమో, అవి సాహిత్యకృతులు అన్న మాట కూడా అంతే నిజం. అందుకనే ‘ప్లేటోని చదివి ఆనందించే ప్రతి పాఠకుడిలోనూ ప్లేటో ఉన్నాడు’ అని అన్నాడు రాధాకృష్ణన్.
మరొక సంగతేమిటంటే, ఆధునిక యూరపియన్ తత్త్వశాస్త్రవిద్యార్థికన్నా, మనకి ప్లేటో మరింత సన్నిహితంగా వినిపిస్తాడు. ఎందుకంటే, మనకు తెలిసినా తెలియకపోయినా మనలో ఉపనిషత్తుల ఆలోచనా స్రవంతి సజీవంగా ప్రవహిస్తూనే ఉంది. మనల్ని నిర్ఘాంతపరిచే జీవితవాస్తవాల ఎదట నిలబడి ఉన్నప్పుడు కూడా, మనకి జీవితం పట్లా, మానవుడి పట్లా, సత్యం, శివం, సౌందర్యాల పట్ల ఆశ ఇంకా నిలబడటానికి కారణం మనలో యుగయుగాలుగా ఒక జీవితస్తోత్రం మన హృదయధ్వనితో మిళితమైపోయి వినిపిస్తూ ఉంది. మన పైపై అనుభవాల్ని దాటిన ఒక జీవితానంద స్పృహ మన రక్తంలో భాగమైపోయిందని మనకి ఇటువంటి రచనలు చదివినప్పుడు మరింత బాగా అనుభవానికొస్తుంది.
బహుశా, అకడమిక్ నేపథ్యం లేకుండా తత్త్వశాస్త్రం చదవలేమోననే సంకోచం వల్ల కొంతా, ఆధునిక తెలుగు సాహిత్యాన్ని, ఆలోచననీ ఎదగనివ్వకుండా చేసిన యాంత్రికభౌతికవాదుల వల్ల కొంతా తెలుగుపాఠకుల్లో ప్లేటోపట్ల కుతూహలం కలగవలసినంతగా కలగలేదు.
అలాగని కృషి చేసినవారు లేరని చెప్పలేను. ఉదాహరణకి జి.వి.కృష్ణారావుగారు 1949 లోనే ప్లేటో దర్శనాన్ని వివరిస్తూ ‘జేగంటలు’ అనే గ్రంథం వెలువరించారు. అందులో ఆయన చేసి కృషి నిరుపమానం. ఆయన ప్లేటో రచనలతో పాటు తన సమకాలిక ప్లేటో పండితుల రచనలు కూడా చదివి ఎంతో సాధికారికంగా ఆ పుస్తకం రాసినట్టుగా మనకి కనిపిస్తుంది. కాని ఎందుచాతనో, ఆ కృషికి తెలుగులో కొనసాగింపు లేకపోయింది.
ప్లేటో సంభాషణలు కూడా తెలుగులో పూర్తిగా అనువాదం కాలేదు. నాకు తెలిసినంతవరకూ తెలుగు అనువాదాల్ని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. వాటిని మనం వరసగా చూస్తే ఇలా ఉన్నాయి.
ప్లేటో మొదటి దశలో (క్రీ.పూ.399-90) రాసిన సంభాషణలు: అపాలజి, చార్మిడెస్, క్రీటో, యుథైప్రో, గోర్గియాస్, హిప్పియాస్ మైనర్, హిప్పియాస్ మేజర్, అయోన్, లాచెస్, లైసిస్, ప్రొటాగరస్. వీటిల్లో పిలకాగణపతి శాస్త్రిగారు అపాలజీని ‘సమర్థన’ పేరిట, క్రీటో ని ‘క్రీటో’ పేరిట తెలుగు చేసారు. ఆ రెండు సంభాషణల్నీ కలిపి ‘సోక్రటీస్ అమరవాణి’ పేరిట దక్షిణ భాషా పుస్తక సంస్థవారు 1959 లో ప్రచురించారు. తిరిగి ఈ సంభాషణల్లోంచి అపాలజిని’ ‘సోక్రటీస్ ఆత్మరక్షణ’ పేరిట, వాటితో పాటు ‘అయోన్’, ‘క్రిటో’లను కూడా కలిపి ఎ.గాంధిగారు ‘ఐదు సుప్రసిద్ధ ప్లేటో రచనలు’ పేరిట లోక్ సత్తా సంస్థతో కలిసి పీకాక్ క్లాసిక్స్ తరఫున 2003 లో వెలువరించారు. అంటే ప్లేటో మొదటిదశలో రాసిన 11 సంభాషణల్లో మూడు మాత్రమే తెలుగులోకి వచ్చాయి. రెండు సంభాషణలు రెండు సార్లు వచ్చాయి.
ప్లేటో మధ్య దశలో (క్రీ.పూ.388-67) రాసిన సంభాషణలు: క్రెటాలైస్, యుథిడెమస్, మెనో, మెనెక్సినస్, పార్మెనిడిస్, ఫీడొ, ఫేడ్రస్, రిపబ్లిక్, సింపోజియం, థియెటటస్. వీటిలో సుప్రసిద్ధ ‘రిపబ్లిక్’ గ్రంథాన్ని జి.వి.కృష్ణారావుగారు ‘ఆదర్శరాజ్యం’ పేరిట అనువదించినదాన్ని సాహిత్య అకాదెమీ 1962 లో ముద్రించింది. మిగిలినవాటిలో ‘మెనో’, ‘ఫీడొ’ లు గాంధిగారి అనువాదంలో చోటుచేసుకున్నాయి. అంటే మధ్య దశ పది సంభాషణల్లో మొత్తం మూడు మాత్రమే తెలుగులోకి వచ్చాయి.
ప్లేటో చివరిదశలో (క్రీ.పూ.360-47) రాసిన సంభాషణలు: క్రిషస్, సోఫిస్ట్, స్టేట్స్ మన్, టిమేయస్, ఫిలబస్, లాస్. ఈ ఆరింటిలో ఒక్క సంభాషణ కూడా తెలుగులోకి రాలేదు.
ఈ 27 సంభాషణల్లోనూ (ఈ లెక్కలో ఒకటి రెండు తేడాలుండవచ్చు, ఎందుకంటే కొన్ని సంభాషణలు ప్లేటో రాసినవి అవునా కాదా అన్న చర్చ ఉంది) అత్యుత్తమమైనవిగా చెప్పదగ్గవి రిపబ్లిక్, సింపోజియం. కృష్ణారావుగారి వంటి పెద్దలు రిపబ్లిక్ ని అనువదించి సింపోజియం ని వదిలిపెట్టడం నా భాగ్యంగా భావిస్తున్నాను.
2
ఇప్పటికి 2439 ఏళ్ళ కిందట ఏథెన్సులో ఒక రాత్రి కొంతమంది మిత్రులు మాట్లాడుకున్న మాటల్ని ఈ రోజు చదవడం అవసరమా? చారిత్రిక ప్రాధాన్యత తప్ప ఆ సంభాషణకేమైనా సమకాలీన ప్రాసంగికత ఉందా? ఈనాటి మనిషి, ఈనాటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకి ఆ సంభాషణలో లేశమాత్రమైనా సాంత్వన లభిస్తుందా?
ఈ ప్రశ్నలు కలగడం సహజం. మరీ ముఖ్యంగా ఇజ్రాయిల్, పాలస్తీనా ఒకరిమీద ఒకరు క్షిపణులు కురిపించుకుంటూ ఉన్న రోజుల్లో, జాతి, మత ద్వేషం చివరికి ఆసుపత్రుల్నీ, నిరపరాధుల్నీ కూడా వదిలిపెట్టని దృశ్యాలు మన కళ్ళముందు కనిపిస్తున్న కాలంలో, ఇంత తీరుబాటుగా ఎప్పుడో గ్రీసులో కొంతమంది కూచుని ప్రేమ గురించీ, సౌందర్యం గురించీ మాట్లాడుకున్న మాటలు మనకి దారి చూపించడం అలా ఉంచి, అసలు అవి చదవడం అవసరమా? నీ కళ్ళముందు కురుస్తున్న అగ్నివర్షం గురించి మాట్లాడకుండా ఎప్పుడో ఎక్కడో ఒక సాయంకాలం కొంతమంది పానోన్మత్తుల మాటల గురించి మాట్లాడుకోవడం సమంజసమేనా అని కూడా అడగవచ్చు.
కానీ పైకి చాలా తీరుబాటుగా, సంతోషంగా, పరస్పరం పరాచికాలాడుకుంటూ మాట్లాడుకున్న ఈ మాటలు రాయడానికి కూచున్నప్పుడు ఏథెన్స్ ప్రశాంతంగా లేదనీ, ఒక సుదీర్ఘ, మహాయుద్ధంలో కూరుకుపోయి ఉందనీ తెలిస్తే మనం ఈ రచన మీద హడావిడిగా తీర్పు ఇవ్వడం పక్కన పెట్టి ఒక క్షణం ఆలోచనలో పడతాం.
ప్లేటో ఈ రచన ఏ సంవత్సరంలో రాసాడో ఇతమిత్థంగా చెప్పలేకపోయినా, ఆయన దీన్ని దాదాపుగా క్రీ.పూ.385 ప్రాంతంలో రాసాడని ఒక అంచనా. అప్పటికి, దాదాపు నలభై ఏళ్ళకింద మొదలైన పెలిపొనీషియన్ యుద్ధాలు ముగిసి సుమారు ఇరవయ్యేళ్ళయింది. ప్లేటో రాసిన ఈ సంభాషణ (క్రీ.పూ.416) మొదటి పెలిపొనీషియన్ యుద్ధం జరుగుతూ ఉండగా (క్రీ.పూ.431-421) సంభవించిన సంఘటన. ఆ యుద్ధంలో స్పార్టా ఏథెన్స్ మీద దాడిచేసినప్పటికీ ఏథెన్స్ నావికాబలం ముందు నిలబడలేక ఓడిపోయింది. అప్పటికి ఏథెన్స్ ని ఇంకా క్రీ.పూ. ఆరవ-అయిదవశతాబ్ది విలువలు కాపాడుతూ ఉన్నాయి. గ్రీకు స్వర్ణయుగం అనగానే అందరికన్నా ముందు గుర్తొచ్చే పెరిక్లీజ్ ఉత్తేజమింకా ఏథెన్స్ ని నిలబెడుతూనే ఉంది. అంటే ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉండగా, ఆ యుద్ధవాతావరణంలో, కొంతమంది భావుకులు కూచుని ఇలా సంగీతం, సాహిత్యం, సౌందర్యాల గురించి మాట్లాడుకున్నారన్నది మనం మరవకూడదు.
కాని ఈ సంభాషణ జరిగిన మరుసటి ఏడాది (క్రీ.పూ.415) నుంచి ఏథెన్స్ అదృష్టం తల్లకిందులు కావడం మొదలయ్యింది. స్పార్టా మిత్రరాజ్యమైన సిరాక్యూజ్ ముట్టడిలో (క్రీ.పూ.415-413) ఏథెన్స్ తన నౌకాబలాన్ని పూర్తిగా పోగొట్టుకుంది. ఈ సంభాషణలో ప్రముఖ పాత్ర వహించిన ఆల్సిబయడిస్ సిసిలీ దండయాత్రలో ప్రధాన పాత్ర పోషించాడుగానీ ఆ తర్వాత అతడు స్పార్టాకూటమిలోనూ అక్కణ్ణుంచి పర్షియాకి అనుకూలంగానూ మారిపోయాడు. ఏథెన్స్ ఓటమి వెనక మరొక రెండు దుర్ఘటనలు కూడా ఉన్నాయి. ఒకటి, ప్రాచీన ఏథెన్స్ లో అత్యంత పవిత్రంగా భావించే ఎల్స్యుసినియన్ పూజాక్రతువుల్ని కొందరు అవహేళన చేసారు. రెండవది ఏథెన్సు రహదారుల్లోనూ, చతుష్పథాల్లోనూ రక్షణసూచకాలుగా నిలబట్టే హెర్మస్ ప్రతిమల్ని ఎవరో ధ్వంసం చేసారు. ఈ రెండింటివెనకా ఆల్సిబయడిస్ తో పాటు మరికొందరు యువకుల హస్తముందనీ, వాళ్ళు తాగినమత్తులో ఈ దురాగతాలకి ఒడిగట్టారనీ, వాళ్ళట్లా చెడిపోవటానికి సోక్రటీస్ కారణమనీ ఏథెన్స్ పాలకమండలి సోక్రటీ మీద విచారణ చేపట్టింది. ఆ విచారణలో సోక్రటీస్ తన వంతు వివరణ తానిచ్చుకున్నప్పటికీ పౌరన్యాయస్థానం దాన్ని అంగీకరించలేదు. ఆయనకి మరణశిక్ష విధించింది. క్రీ.పూ.399 లో ఆయనకి ఆ మరణశిక్ష అమలు చేసారు. దానికి అసలైన కారణం క్రీ.పూ. 404 నాటికి ఏథెన్స్ స్పార్టా చేతుల్లో పూర్తిగా ఓడిపోయి ధ్వంసమైపోయింది. ఒక నగరం లేదా రాజ్యం తన రాజకీయ ఓటమిని భరించలేనప్పుడు చేసే మొదటిపని తన జాతిని నడిపిన మహాత్ములెవరో వాళ్లని బలివ్వడం. అది క్రీ.పూ 399 లో అయినా జరిగేది అదే, క్రీ.శ.1948 లో అయినా జరిగేది అదే.
పెలిపొనీషియన్ యుద్ధాలు మొదలు కావడం స్పార్టా రాజ్యకాంక్షతో మొదలయ్యాయి. కాని ఆ యుద్ధాలు ముగిసేటప్పటికి గ్రీకు చరిత్రమొత్తం మారిపోయింది. అప్పటిదాకా గ్రీకు విలువలకు ఒక అత్యున్నత పతాకగా నిలబడ్డ ఏథెన్సు ఆ యుద్ధాలు పూర్తయ్యేటప్పటికి పూర్తిగా పతనమైపోయింది. తిరిగిమళ్ళా ఆ తర్వాత మరొక పదేళ్ళు జరిగిన కొరింథియన్ యుద్ధాల తర్వాత (క్రీ.పూ.394-386) ఏథెన్స్ తన స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోగలిగింది. కానీ రాజకీయంగా మాత్రమే. ఆ ప్రాచీన స్వర్ణయుగాన్ని మాత్రం ఏథెన్స్ తిరిగి కళ్లారా చూడలేకపోయింది.
దాదాపు ఇరవయ్యేళ్ళ కిందట, స్పార్టా చేతిలో ఓడిపోయినప్పుడు, ఏథెన్స్ తన ఓటమికి కారణాల్ని తన దేవతలకీ, తన క్రతువులకీ జరిగిన అవమానాల్లో వెతుక్కుని దానికి సోక్రటీస్ కారణమని ఆయన మరణానికి కారణమయ్యింది. ఆ వెనువెంటనే ప్లేటో సోక్రటీస్ నిర్దోషిత్వాన్ని సోక్రటీస్ ముఖతః నే చెప్పిస్తూ అపాలజి రాసాడు. తాను యువతను పెడదోవపట్టించడం లేదని సోక్రటీస్ చాలా వివరంగా తన అపాలజి లో చెప్పుకున్నాడు. సోక్రటీస్ కి మరణశిక్ష అమలు చేసిన వెంటనే, బహుశా ఆ తర్వాత పదిపన్నెండేళ్లలో (క్రీ.పూ.399-387) ప్లేటో ఆ సంభాషణ రాసి ఉంటాడు. ఒకసారి ఆ యుద్ధాలు ముగిసేక, తిరిగి మళ్ళా ఏథెన్స్ తన అవమానం నుంచి కోలుకుని ఎంతో కొంత స్వాతంత్య్రాన్ని మళ్లా సాధించుకున్నాక, అప్పుడు (క్రీ.పూ.386) ప్లేటో సింపోజియం రచనకు పూనుకున్నాడని మనకు అర్థమవుతుంది. అపాలజి, ఫీడొ వంటి సంభాషణలు రాసి ఉన్నప్పటికీ ప్లేటో తృప్తి చెందలేదనీ, సోక్రటీస్ నిర్దోషి అని పదే పదే మరింత బిగ్గరగా చెప్పాలని అనుకుంటూనే ఉన్నాడనీ మనకి అనిపిస్తుంది. సోక్రటీస్ కి జరిగిన అన్యాయం దాదాపు పదిహేడేళ్ళుగా ఆయన్ని కలచివేస్తూనే ఉన్నప్పటికీ, కొరింథియన్ యుద్ధాల్లో ఏథెన్సు తిరిగి తన పరాక్రమాన్ని చూపించి తన గౌరవాన్ని నిలబెట్టుకున్నాక గానీ ఆయనకు వీలు కాలేదు.
చూడండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయమో? ఎంత విషాదభరితమైన విషయమో! మద్యంగాని, లైంగికవ్యామోహంగానీ, అందచందాలూ, గౌరవప్రతిష్టలూ గాని సోక్రటీస్ ని ఏ విధంగానూ ప్రలోభపర్చలేవనీ, ఒక్క సత్యం ముందు మాత్రమే ఆయన మోకరిల్లుతాడనీ చెప్పటానికి ఇంత హృద్యమైన, ఇంత సజీవమైన, ఇంత సంఘర్షణాభరితమైన సంభాషణ ప్లేటో రాయవలసి వచ్చింది. కాని సోక్రటీస్ నిర్దోషిత్వాన్ని సోక్రటీస్ ముఖతః కన్నా, ఏథెన్స్ మతధార్మిక మనోభావాల్ని గాయపరిచిన ఆల్సిబయడిస్ ముఖతః చెప్పించడమే సమంజసమని ప్లేటో భావించాడనీ, అందుకుగాను సింపోజియం రాసాడనీ మనం సులభంగానే గ్రహించవచ్చు. అందుకనే తక్కిన సంభాషణల్లోలాగా ఇందులో నేరుగా సోక్రటీస్ మాట్లాడడు. అరిస్టొడెమస్ అనే వాడు తనతో చెప్పాడని అపొల్లొడొరస్ అనేవాడు ఒకప్పుడు తన సహచరుడికి చెప్పినమాటలు మళ్ళా గ్లోకన్ అనేవాడికి చెప్పినట్టుగా ఈ సంభాషణ రాసాడు. పైగా ఏథెన్సు నగరవీథులున్నది సంభాషణలకోసమేగా అని అనిపిస్తాడు. అపాలజి సోక్రటీస్ జూరీ ముందు వినిపించిన వాదన. అంటే నాలుగ్గోడలకి పరిమితమైన సమర్థన. కానీ సింపోజియం అలా కాదు. ఇది ఏథెన్సు నగరవీథులు మొత్తం వినబడేట్టుగా ఏథెన్సు పౌరులు మళ్ళా మళ్ళా ఒకడికొకడు చెప్పుకున్నట్టుగా నడిచిన సంభాషణ. అప్పటికి గాని ప్లేటో మనసు శాంతించలేదనిపిస్తుంది.
ఇందులో సోక్రటీస్ శీలం ఎటువంటిదో చెప్పడమే కాదు, ఆల్సిబయడిస్ చెప్పిన మరొక ముఖ్యమైనమాట, అన్నిటికన్నా ముఖ్యమైనమాట, తనకి సోక్రటీస్ సమక్షంలో ఉన్నప్పుడు సత్యం ముఖ్యమనిపిస్తుందనీ, ఆయన్నుంచి బయటకు రాగానే ప్రజాదరణా, ప్రజామోదమూ ముఖ్యమనిపిస్తాయనీ చెప్పడం. ఆ రెండు విరుద్ధ శక్తుల మధ్యా తానెంత నలిగిపోయాడంటే, సోక్రటీస్ చచ్చిపోతే బాగుణ్ణని తనకి చాలా సార్లు అనిపించిందని కూడా చెప్తాడు. ఈ మాటల్లో అతిశయోక్తి లేదని మనం చెప్పగలం. ఎందుకంటే బుద్ధుడు నిర్వాణం చెందినవెంటనే, ఆయన శిష్యుల్లో ఒకడు సుభద్రుడనేవాడు ‘ఈయన బతికున్నంతకాలం అది చెయ్యకండి, ఇది చెయ్యకండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని ప్రతిదానికీ ఆంక్షలు పెట్టేవాడు, ఇప్పుడు ఆయన మరణించాడుకాబట్టి, ఇక మనం స్వేచ్ఛగా ఉండొచ్చు’ అని అన్నాడని మనకు తెలుసు. మన కాలంలోనే, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత, చాలామందికి మహాత్ముడు ఒక మానసిక భారంగా ఎలా పరిణమించాడో మనం చూసాం. తన కాలం నాటి ఏథెన్స్ మానసిక దాస్యాన్ని సోక్రటీస్ కలవపరిచాడనీ, తన రాజకీయ దాస్యాన్ని భరించలేని ఏథెన్స్, తమ మధ్య మానసికస్వతంత్రుడిగా ఉన్న సోక్రటీస్ ని బలిగొన్నదనీ ప్లేటో మరింత సూక్ష్మంగా, మరింత సాహిత్యప్రతిభతో సింపోజియం ద్వారా వివరిస్తున్నాడని మనం గ్రహించినప్పుడు ఈ రచన మరింత ఔన్నత్యాన్ని సంతరించుకుంటుంది.
కాబట్టి, ఇది శాంతికాలపు రచన కాదు, యుద్ధకాలపు రచన. నగరాలూ, జాతులూ, రాజ్యాలూ ఒకరినొకరు జయించాలని తలపడ్డప్పుడల్లా ముందు బలిచ్చేది నిరపరాధుల్నేనని ఆ నాటి ఏథెన్సు నుంచి నేటి గాజా దాకా సాక్ష్యం పలుకుతున్నాయి.
నిజానికి సింపోజియం వంటి రచన, సంతోషసమయంలోకన్నా, మృత్యుముఖం ఎదటనే మరింత సార్థంకంగా తోచే రచన. అరేబియన్ నైట్స్ గురించి రాస్తూ ప్రసిద్ధ రచయిత్రి ఎ.ఎస్.బయట్ ఒక ఉద్విగ్నకరమైన సంగతి చెప్పింది. సెర్బియా-క్రొయేషియా అంతర్యుద్ధ సమయంలో, 1994 లో సారజెవో మీద బాంబులు వర్షిస్తున్నప్పుడు, ప్రతి శుక్రవారం సాయంకాలం, సారజెవోలోనూ, ఇతర యూరపియన్ నగరాల్లోనూ, అమస్టర్ డామ్ కి చెందిన నాటకబృందం ఒకటి యూరపియన్ కథల్ని చెప్పుకునే ప్రదర్శన ఒకటి నడిపిందట. ప్రతి శుక్రవారం కథకులు సమావేశమై మహత్తరమైన యూరపియన్ కథల్ని చదువుకోవడమో లేదా నాటకీకరణ చెయ్యడమో చేసేవారట. విధ్వంసం ఎదట, మృత్యువు ఎదట మానవాళికి ఆశనివ్వగల వాగ్దానం సాహిత్యం ఒకటే అని ఆ నాటకబృందం నమ్మి చేసిన పని అది. అరేబియన్ నైట్స్ కథల నేపథ్యం అదే కదా అని బయట్ గుర్తుచేస్తుంది. తన మీద పొంచి ఉన్న మృత్యువుని ప్రతి ఒక్కరాత్రీ వాయిదా వేసుకుంటూ పోవడమే కదా, షహ్రాజాదే చేసిన పని. అలా కథలు చదువుకోవడం వల్ల ప్రాణాలు రక్షించలేం. నిజమే, కాని ఒక ప్రాణశక్తిని పరస్పరం పంచుకోగలం కదా అంటుంది బయట్.
3
సింపోజియాన్ని ప్లేటో ఒక తత్త్వశాస్త్ర రచనగాకన్నా ఒక సాహిత్యకృతిగా తీర్చిదిద్దడం మీదనే దృష్టిపెట్టాడనడానికి రెండు కారణాలు కనిపిస్తాయి. మొదటిది, ప్లేటో తక్కిన రచనలు, రిపబ్లిక్ తో సహా, ఏవీ చదవకపోయినా, ఒక్క సింపోజియం చదివితేచాలు ఆయన దర్శనంలోని కీలకాంశాలతో మనకి పరిచయం కలిగినట్టే. ఆయన తన దర్శనాన్ని మనముందుంచడమ్మీదనే ఎక్కువ దృష్టిపెట్టాడు తప్ప వాటిని వాదోపవాదాలద్వారా చర్చించడం మీద దృష్టిపెట్టలేదు. అంటే ఆయన తనకాలం నాటి సాధారణపాఠకుడు కూడా, సోఫిస్టు, ఫిలో-సోఫీ సంప్రదాయాల గురించి తెలియనివాడుకూడా, ఆ రచనను ఆద్యంతం చదివేలాగా రాసినట్టుగా మనకి అనిపిస్తుంది. అది ఆనాటి సాధారణ ఏథెన్సు పౌరుడికి ఎంత సులభగ్రాహ్యంగా ఉండిందో ఇనాటి సాధారణ పాఠకుడికి కూడా అంతే సన్నిహితంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు.
రెండవది, మనం ఇంతకు ముందు వైట్ హెడ్ చెప్పినట్టుగా, అసలు, ప్లేటో దర్శనంలోనే, తాత్త్విక, అంటే తార్కికంగా ఋజువు చెయ్యగల సత్యాలమీదకన్నా, మనం, ఇదీ అని నిరూపించలేకపోయినా, మన హృదయానికి సత్యం అనిపించే సత్యమే ఎక్కువ. ఇలా బుద్ధితోకాక, హృదయం ద్వారా సత్యాన్ని సమీపించేట్టు చెయ్యడం సాహిత్యలక్షణం. సాహిత్య సత్యానికీ, శాస్త్రసత్యానికీ మధ్య ప్రాయికంగా ఉన్న ఈ తేడా వల్లనే, ఒక యుగాన్ని, ఒక జాతిని, ఒక జాతిహృదయస్పందనని అర్థం చేసుకోడానికి చరిత్రకారులకన్నా, సైంటిస్టులకన్నా, ఆ కాలం నాటి సాహిత్యకారులే ఎక్కువ దారిచూపించగలుగుతారు. అందుకనే ప్రాచీన ఏథెన్సుగురించి అర్థం చేసుకోడానికి మనకి అరిస్టొఫెనీస్, ప్లేటోలకన్నా మరెవ్వరూ ఎక్కువ విశ్వసనీయంగా కనిపించరని ఎడిత్ హామిల్టన్ రాసింది.
(ఇంకా ఉంది)
Featured image: PC: https://unsplash.com/photos/topless-woman-statue-utAMCFc1-SY
20-10-2023
Excellent సర్.. ప్లేటో ఎంత గొప్పగా అరిస్టాటిల్ ను ప్రకటించడానికి కృషి చేశాడో మీరు చెబుతుంటే ఆనందంగా ఉంది.
తెలుగులో తత్వశాస్త్ర రచయితల్లో నాకు నచ్చినవారు gv కృష్ణారావు గారు.. నండూరి రామమోహనరావు గారు. ( కారణం.. కాస్త అర్థమయ్యేటట్లు రాస్తారు)
సింపోజియం మీకు వదలినందుకు నేనూ సంతోషిస్తున్నాను. ముగింపు గొప్పగా చెబుతున్నారు. 🙏🙏
ధన్యవాదాలు సార్