ప్రేమగోష్ఠి-12

అయినా కూడా ఒక పండగ వచ్చిందంటే, ఆ వేడుకని మనః పూర్వకంగా స్వాగతించేది ఆయనొక్కడే ఉండేవాడు. తాగడం పట్ల అతడికి ఇష్టం లేకపోయినా, ఒకవేళ తాగితీరాలని నిర్బంధిస్తే మాత్రం మా అందర్నీ మించిపోయేవాడు. ఇవన్నీ తలచుకుంటూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. సోక్రటీస్ తప్పతాగిపడిఉండటం చూసినవాడొక్కడూ లేడని చెప్పగలను. నేను చెప్తున్న మాటల్లో నిజమేమిటో ఈ రాత్రి గడిచేలోపే మీకు తెలిసిపోతుంది. అలాగే చలిని తట్టుకోడంలో కూడా అతడి ధృతి అమోఘం. ఒకసారి తట్టుకోలేనంత హిమపాతం సంభవించింది. ఆ ప్రాంతాల్లో శీతాకాలం భయంకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ తమ గదుల్లోనే గడియలు బిగించుకు కూచున్నారు. ఒకవేళ బయటికి వెళ్ళవలసి వస్తే రకరకాల దుస్తులు కప్పుకుని మరీ వెళ్ళేవాళ్ళు, పాదాల్ని పూర్తిగా ఉన్నితో కప్పుకోకుండా బయటకి అడుగుపెట్టేవారు కాదు. కాని అటువంటి పరిస్థితిలో కూడా సోక్రటీస్ కాళ్లకి చెప్పుల్లేకుండానే ఆ మంచులో తిరుగాడుతుండేవాడు. నిండా వస్త్రాలూ, ఉన్నీ, మేజోళ్ళూ ధరించిన సైనికుల కన్నా వేగంగా, అతడు, తన మామూలు దుస్తుల్తోనే నడిచేవాడు. తమని చిన్నచూపు చూస్తున్నాడని ఆ సైనికులకి ఆయనంటే కడుపులో మంటగా ఉండేది.

ఇంతకు ముందు నేను మీకో సంఘటన చెప్పాను. ఇప్పుడు మరొకటి చెప్పాలని ఉంది. అది మీరు వినదగ్గది.

యుద్ధరంగంలో ఉన్నప్పుడు ‘స్థితప్రజ్ఞుడి భాషా, సమాధి’ ఎలా ఉంటాయో చెప్పే కథ అన్నమాట. ఒకరోజు పొద్దున్నే ఆయనేదో సమస్యగురించి ధ్యానిస్తూ ఉన్నాడు. బహుశా ఆ చిక్కుముడి ఎలా విప్పాలా అని ఆలోచిస్తూండవచ్చు. దాన్ని వదిలిపెట్టలేదు. ఆ రోజు తెల్లవారకముందే ఆలోచనలో పడ్డవాడు, మధ్యాహ్నం దాకా కూడా అదే ఆలోచనలో కూరుకుపోయి ఉన్నాడు. మధ్యాహ్నమయ్యేటప్పటికి ఆ చోద్యం అందరి కళ్ళల్లోనూ పడింది. తెల్లవారినప్పణ్ణుంచీ సోక్రటీస్ దేనిగురించో ఆలోచనలో పడి ఎక్కడ నిలబడ్డవాడు అక్కడే నిలబడిపోయి ఉన్నాడని ఒక పుకారు చెలరేగింది. ఎలాగైతేనేం, సాయంకాలం భోజనం పూర్తయ్యేక కొంతమంది అయోనియన్లు1 కుతూహలం కొద్దీ (నేనింతకుముందే చెప్పినట్టు, అది వేసవి కాదు, శీతాకాలం అని గుర్తుపెట్టుకోవాలి) ఆ రాత్రంతా కూడా ఆయనలానే నిలబడిఉంటాడో లేదో చూద్దామని, తమ చాపలు తెచ్చుకుని ఆరుబయట పడుకున్నారు. ఆయన మర్నాడు పొద్దున్నదాకా కూడా అక్కడే నిలబడ్డాడు. పొద్దున్న తెల్లవారగానే సూర్యోదయ ప్రార్థనలు చేసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు.’

‘మీరు వింటానంటే యుద్ధరంగంలో ఆయన సాహసం గురించి కూడా చెప్తాను. చెప్పితీరాలి. ఎందుకంటే నా ప్రాణాల్ని రక్షించింది ఆయన కాక మరెవరు? నా శౌర్యానికి బహుమతి లభించిన యుద్ధఘట్టం అదే. నేను గాయపడి ఉన్నాను, ఆయన నన్ను విడవకుండా కనిపెట్టుకుని ఉన్నాడు. నన్నూ, నా భుజాల్నీ కాచిరక్షించాడు. ఆరోజు సాహస సత్కారం నాకు లభించడానికి కొంతవరకూ నా సైనిక హోదా కారణం. కాని నిజానికి ఆ సత్కారం అందించవలసింది ఆయనకి. ఆ మాటే నేను సైనికాధికారులకి చెప్పాను కూడా (ఈ మాటలు కూడా సోక్రటీస్ తప్పని చెప్పలేడు). కాని ఆ సత్కారం నేను పొందాలని సైనికాధికారులకన్నా కూడా ఆయనే ఎక్కువ ఆత్రుత కనపరిచాడు.’

43

‘ఆయన తీరు కొట్టొచ్చినట్టు కనబడిన మరో సంఘటన కూడా ఉంది. డేలియా2 లో యుద్ధమైనతర్వాత సైన్యం పలాయనం చిత్తగిస్తున్నప్పుడు, పొటిడియా దగ్గర కన్నా ఆయన్ని మరింతబాగా చూడగలిగాను. అప్పుడు ఆయన ఒంటినిండా ఆయుధాలు ధరించి పోరాడే కాల్బలంలో ఉన్నాడు. నేను అశ్వదళంలో ఉన్ననౌ కాబట్టి ప్రమాదానికి దూరంగా ఉన్నాను. ఆయనా, లాచెస్3 యుద్ధభూమి నుంచి వెనక్కి మరలుతున్నారు. అప్పటికే సైన్యం చెల్లాచెదురైపోయింది. నేను వాళ్లని కలిసి నిరుత్సాహపడవద్దనీ, నేను కూడా వాళ్లతో పాటే ఉంటాననీ చెప్పాను. అప్పుడు నువ్వు ఆయన్ని చూసి ఉండాల్సింది, అరిస్టొఫెనీస్, అచ్చం నువ్వు వర్ణించినట్టే ‘గంభీరంగా, అటూ ఇటూ చూస్తో’ కొంగలాగా నడిచిపోతున్నాడు. శత్రుమిత్రులిద్దరినీ కూడా జాగ్రత్తగా కనిపెడుతో, దూరం నుంచి చూసినా కూడా పోల్చుకోగలిగేట్టుగా, ఎవరేనా తనమీద దాడిచేస్తే తీవ్రంగా ప్రతిఘటించడానికి సిద్ధంగా, ఆయనా, ఆయనతోటి సైనికుడూ నెమ్మదిగా తప్పించుకుపోయేరు. ఇలాంటి మనుషుల్ని యుద్ధం ఏమీ చేయజాలదు కదా. ఎవరు యుద్ధభూమినుంచి పారిపోతుంటారో శత్రువు కూడా వాళ్ళవెనకనే పడుతుంటాడు. సమయస్ఫూర్తి విషయానికి వచ్చేటప్పటికి లాచెస్ కన్నా కూడా ఆయన ఎంత చురుకైనవాడో మరీ స్పష్టంగా చూసాను. సోక్రటీస్ ని స్తుతిస్తూ ఇలా నేను చెప్పగల అద్భుతాలెన్నో ఉన్నాయి. చాలావారకూ అతడు చేసే పనుల్లో మనం ఆయన్ని మరెవరితోనైనా పోల్చగలం. కానీ, ఆయన అద్వితీయత ఉందే, అందులో మాత్రం ఆయనలంటి మనిషి మరొకడు కనబడడు. మీరు బ్రసీడసూ4, ఇంకా అతనిలాగే మరికొంతమంది కూడా అకిలస్ లాగా ఉన్నారని అనుకోవచ్చు. నెస్టరూ5, అంటేనర్లు6 పెరిక్లీస్ లాగా ఉంటారని ఊహించవచ్చు. ఇంకా సుప్రసిద్ధులైనవాళ్ల గురించి కూడా ఇలాంటి పోలికలే తేవచ్చు. కానీ ఈ విచిత్రవ్యక్తిని పోల్చడానికి మాత్రం మీకు ఎంత వెతికినా ఎవరూ కనబడరు. ఇప్పుడు మనమధ్య ఉన్నవాళ్ళల్లోగానీ, గతంలో ఉన్నవాళ్ళల్లోగాని. ఎంత ఆలోచించినా ఇద్దరే మనకు పోలిక స్ఫురిస్తారు. నేనింతకుముందే చెప్పినట్టుగా సలేనిసూ, శాటర్లూ- వాళ్ళతో ఆయనకి రూపంలోనే కాదు, మాటల్లో కూడా పోలిక తేవచ్చు.’

‘నేనింతకుముందు మీకు చెప్పడం మర్చిపోయాను. సోక్రటీస్ మాట్లాడుతుంటే, సిలనస్ ప్రతిమల్ని తెరుస్తున్నట్టు ఉంటుంది. ఆ చప్పుడు మొదట్లో వినడానికి నవ్వుపుట్టించేట్టుగా ఉంటుంది. ఆయన కావాలనే తన భాషని ఒక అల్లరిచిల్లరి గంధర్వుడి తొడుగుతో కప్పిపుచ్చుకుంటాడు. ఆయన నోరుతెరిస్తే చాలు, గాడిదబరువు గురించీ, వడ్రంగులగురించీ, చెప్పులుకుట్టేవాళ్ల గురించీ, తోళ్ళు సాపుచేసేవాళ్ల గురించీ మాట్లాడుతుంటాడు. ఎప్పుడూ అవే విషయాలు, అవే మాటలు. విషయం తెలియనివాళ్ళు అదాటుగా ఆయన మాటలు వింటే నవ్విపోవడం ఖాయం. కాని ఒక సారి ఆ ప్రతిమవక్షం చీల్చి అందులో ఏముందో చూసారా, ఇక నిజంగా అర్థవంతమైన మాటలంటూ ఉంటే అవి మాత్రమే అనిపిస్తుంది. అంతకన్నా దివ్యభాష, అంతకన్నా శీలసమన్వితమైన భాష మరొకటి లేదనిపిస్తుంది. అంత సమగ్ర అవగాహనతో, ఆ మాటకొస్తే, ఒక సజ్జనుడు, వందనీయుడు మాట్లాడవలసిన పద్ధతి అదే అనిపిస్తుంది.’

44

‘మిత్రులారా, ఇదీ సోక్రటీస్ గురించిన నా ప్రశంస. ఇందులో కొంత నింద కూడా కలిపాను, ఎందుకంటే ఆయన నన్ను తీసిపారేసాడు కాబట్టి. ఆయన నన్ను మాత్రమే కాదు, గ్లోకన్ కొడుకు చార్మిడెస్7 నీ, డయోక్లీజ్ కొడుకు యుథిడెమస్8 నీ, ఇంకా చాలామందిని ఇలాగే కించపరిచాడు. ముందేమో వాళ్ల ప్రేమికుడన్నట్టు మొదలుపెడతాడు, కాని చివరికొచ్చేసరికి వాళ్ళని తన పాదాక్రాంతుల్ని చేసేసుకుంటాడు. ఇంతకీ నేను చెప్పొచ్చేదంటే అగధాన్, ఆయన మాటలు వినిమోసపోకు. నా సంగతి చూసి నేర్చుకో. నా కథ ఒక హెచ్చరికగా తీసుకో. అనుభవం మీంచి నేర్చుకొమ్మనే కదా పెద్దవాళ్ళు చెప్పింది.’

ఆల్సిబయడస్ ప్రసంగం పూర్తవుతూనే అక్కడున్నవాళ్ళంతా గొల్లుమని నవ్వారు. చూడబోతే అతడింకా సోక్రటీస్ తో పీకల్లోతుదాకా ప్రేమలో కూరుకుపోయినట్టే కనిపిస్తున్నాడు. ‘నువ్వు చాలా నిబ్బరంగా మాట్లాడేవు అల్సియడస్’ అన్నాడు సోక్రటీస్. ‘లేకపోతే నువ్వు ఈ శాటర్ ని ఎందుకింతలా ప్రశంసిస్తున్నావో ఆ ఉద్దేశాన్ని మాత్రం ఇంతలా మరుగుపర్చగలిగి ఉండేవాడివి కావు. నువ్వు చెప్పిన ఈ సుదీర్ఘప్రసంగమంతా ముక్కెక్కడుందో చూపించడానికి చుట్టూ తిప్పి చూపించినట్టే ఉంది. నువ్వు చెప్పాలనుకున్నదేదో చిట్టచివరికి బయటపెట్టావు. నాకూ, అగధాన్ కీ మధ్య కలహం రేపిపెట్టడానికి కాకపోతే మరిదేనికి ఇదంతా? నేను నిన్ను తప్ప మరెవరినీ ప్రేమించకూడదు, నువ్వు, నువ్వు మాత్రమే, నువ్వొక్కడివే అగధాన్ ని ప్రేమించాలి. ఇంతే కదా. కాని ఈ గాంధర్వరూపక రహస్యం, ఈ సిలనీయ నాటక సారాంశం బయటపడిపోయింది. కాబట్టి అగధాన్, ఇతగాడు మనమధ్య చిచ్చుపెట్టకుండా చూడు’ అని కూడా అన్నాడు.

‘నీ మాటలు నమ్మదగ్గట్టుగానే ఉన్నాయ’న్నాడు అగధాన్. ‘ఈయనొచ్చి మనిద్దరి మధ్యా ఎందుకు కూచున్నాడో ఇప్పుడర్థమవుతోంది, మనల్ని విడదీయడానికే అని. కాని ఆ పప్పులేమీ ఉడకవు. నేనిప్పుడొచ్చి నీ పక్కనే కూచుంటాను’ అని కూడా అన్నాడు.

‘రా, రా, వెంటనే వచ్చి ఇదుగో నా పక్కన కూచో’ అన్నాడు సోక్రటీస్.

‘అయ్యో, ఈ పెద్దమనిషి చేతుల్లో మళ్ళా మోసపోయాను. ఆయన ప్రతిసారీ నాకన్నా తనే ఎక్కువ లాభం మూటగట్టుకోడానికే కంకణం కట్టుకున్నాడు. అగధాన్, దయ ఉంచి మా మధ్యలో కూచో, నన్ను వదిలిపెట్టకు’ అని వేడుకున్నాడు ఆల్సిబయడిస్.

‘ఎంతమాత్రం ఒప్పుకోను’, అన్నాడు సోక్రటీస్, ‘నువ్వు నన్ను పొగిడినట్టే నేను నా కుడిపక్కన కూచున్నాయన్ని పొగడాలి కదా. ఇప్పుడొచ్చి అగధాన్ మన మధ్య కూచుంటే ఆయన మళ్ళా నన్ను పొగడటం మొదలుపెడతాడు. కాబట్టి అసూయపడకు, దయ ఉంచి ఇందుకొప్పుకో. ఎందుకంటే యువతరాన్ని ప్రశంసించాలని నాకు చాలా కోరిగ్గా ఉంది’ అని అన్నాడు సోక్రటీస్.

45

‘ఆహా! అలా అయితే వెంటనే పరుగెత్తుకొస్తాను. సోక్రటీస్ తో పొగిడించుకోడం కన్నా కావలసిందేముంది’ అన్నాడు అగధాన్.

‘మళ్లా ఎప్పటి కథనే అన్నమాట. సోక్రటీస్ ఉన్నాడంటే అక్కడింక మరొకడికి అవకాశమే ఉండదు. చూడండి, అగధాన్ ని తన దగ్గరికి రప్పించుకోడానికి ఎంత సొగసైన కారణం వెతికాడో’ అని అన్నాడు ఆల్సిబయడిస్.

ఆ తల్పమ్మీద సోక్రటీస్ పక్కన కూచోడానికి అగధాన్ లేచాడు. ఇంతలో ఒక తాగుబోతుల గుంపు ఆ ఇంట్లో చొరబడి ఆ విందుసందడిని కలగాపులగం చేసేసారు. ఎవరో ఆ ఇంట్లోంచి బయటికి వెళ్తూ తలుపు మూయడం మర్చిపోయారు, దాంతో ఆ గుంపు ఆ ఇంట్లోకి చొరబడి తమ ఇష్ఠం వచ్చినట్టు తందనాలాడటం మొదలుపెట్టారు. అంతా గందరగోళంగా తయారయ్యింది. ప్రతి ఒక్కరూ అడ్డూఅదుపూ లేకుండా తాగడం మొదలుపెట్టారు. ఎరిక్సిమేకస్, ఫెద్రోస్, తక్కినవాళ్ళు కూడా అక్కణ్ణుంచి వెళ్ళిపోయారని అరిస్టొడెమస్ చెప్పాడు. తను కూడా నిద్రలోకి జారుకున్నానని చెప్పాడు. ఆ రాత్రులు దీర్ఘమైనవి కావడంతో బాగా నిద్రపట్టేసిందని కూడా చెప్పాడు. తెల్లవారి కోళ్ళు కూసేటప్పటికి తనకి మెలకువ వచ్చిందనీ, లేచి చూసేటప్పటికి రాత్రి వెళ్ళిపోయినవాళ్ళు వెళ్ళిపోగా, అక్కడే నిద్రలోకి జారుకున్నవాళ్ళు నిద్రలోకి జారిపోయి ఉండటం కనిపించిందని చెప్పాడు. అక్కడ మిగిలి ఉన్నవాళ్ళు సోక్రటీస్, అరిస్టొఫెనీస్, అగధాన్ లు మాత్రమే. వాళ్ళు పెద్ద కలశంలోంచి మధువు తాగుతూనే ఉన్నారు, సోక్రటీస్ వాళ్ళతో సంభాషిస్తోనే ఉన్నాడు.

అరిస్టొడెమస్ ఇంకా నిద్రమత్తులోంచి పూర్తిగా బయటపడనందువల్ల ఆ సంభాషణ ఎక్కడ మొదలయ్యిందో అతడు వినలేదు. కాని ఆ చర్చలో సోక్రటీస్ ప్రధానంగా మోదాంతనాటకాలు కూడా ప్రతిభలో విషాదాంతనాటకాలకీ ఏమీ తీసిపోవనీ, నిజమైన నాటకకర్త రెండింటిలోనూ సమానమైన శిల్పచాతుర్యమే చూపిస్తాడనీ తన తక్కిన ఇద్దరు శ్రోతలతో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమయింది. ఆ శ్రోతలిద్దరూ కూడా ఆయనమాటల్ని అంగీకరిస్తున్నట్టే కనబడింది. కానీ మరీ నిద్రమత్తులో ఉన్నందువల్ల ఆ చర్చ ఎటునడిచిందో అరిస్టొడెమస్ పూర్తిగా గ్రహించలేకపోయాడు. వాళ్ళల్లో ముందు అరిస్టొఫెనీస్ నిద్రకి ఉపక్రమించాడు. ఇక తూర్పు తెల్లవారుతుండగా, అగధాన్ కి కూడా కళ్ళు మూతలు పడటం మొదలయ్యింది. వాళ్ళిదరూ నిద్రకి ఉపక్రమించాక, సోక్రటీస్ అక్కణ్ణుంచి సెలవుతీసుకోడానికి లేచాడు. ఎప్పట్లానే అరిస్టొడెమస్ కూడా ఆయన్ని అనుసరించాడు. అక్కణ్ణుంచి సోక్రటీస్ నేరుగా లైసియం9 కి వెళ్ళి స్నానం చేసి తన యథావిధి దినచర్యలో మునిగిపోయాడు. సాయంకాలమయ్యాక ఇంటికి పోయి హాయిగా నిద్రపొయ్యాడు.


వివరణలు

1. అయోనియన్లు: అయోనియాకి చెందిన సైనికులు. ఆ ద్వీపం కొన్నాళ్లు ఏథెన్స్ పాలనలోనూ, కొన్నాళ్లు పర్షియా ఆధిపత్యం కిందా, మరికొన్నాళ్ళు ఏథెన్స్ కిందా ఉంటూ వచ్చింది.

2. డేలియా: బొవొతియన్లకీ, ఎథీనియన్లకీ మధ్య యుద్ధం జరిగిన చోటు.

3. లాచెస్: పెలొప్పొనీసియన్ యుద్ధాల్లో పోరాడిన సేనాధిపతి. సోక్రటీస్ మిత్రుడు. అతడి పేరు మీద ప్లేటో ఒక సంభాషణ కూడా రాసాడు.

4. బ్రసీడస్: పెలొప్పొనీసియన్ యుద్ధాల తొలిరోజుల్లో సాహసోపేతంగా పోరాడిన స్పార్టన్ సేనాధిపతి.

5. నెస్టర్: ఇలియడ్ లో ఒక కురువృద్ధుడి వంటి పాత్ర. గ్రీకుల తరఫున పోరాడేడు.

6. ఆంటెనర్: ఇలియడ్ లో పాత్ర, ట్రోజన్ల తరఫున పోరాడేడు.

7. చార్మిడస్:అందమైన యువకుడు, సోక్రటీస్ అభిమానుల్లో ఒకడు, ప్లేటో అతడి పేరుమీద ఒక సంభాషణ కూడా రాసాడు.

8. యుథిడెమస్: అందమైన యువకుడు, సోక్రటీస్ అభిమానుల్లో ఒకడు. అదే పేరుతో ఒక సోఫిస్టు కూడా ఉన్నాడు.

9. లైసియం: ఏథెన్సులో తూర్పుపక్కన, నగర ప్రాకారానికి ఆవల ఉండే ఒక వ్యాయామశాల, ప్రజాస్నానశాల.


Featured image: PC: Bust of Socrates by Lysippos, Wikimedia Commons.

19-10-2023

2 Replies to “ప్రేమగోష్ఠి-12”

  1. పానగోష్టిలో .. అంటే మందు కొట్టి ఇలాంటి అద్భుత చర్చలు చేస్తారని నాకు తెలియదు. గొప్పగా రాశారు సర్.

Leave a Reply

%d