ప్రేమగోష్ఠి-11

(ఏథెన్సుకి చెందిన అగధాన్ ఏర్పాటు చేసిన విందులో భాగంగా, అక్కడ చేరిన మిత్రులు సోక్రటీస్ తో సహా పానగోష్ఠికి బదులు ప్రేమగోష్ఠి చేపట్టారు. వారిలో ఫేద్రోస్, పౌసనియస్, ఎరిక్సిమేకస్, అరిస్టొఫెనీస్, అగధాన్ లతో పాటు సోక్రటీస్ కూడా ప్రసంగించాక, ఆల్సిబయడిస్ అక్కడ అడుగుపెట్టాడు. అతణ్ణి కూడా ప్రసంగించమని అడిగినప్పుడు తాను ప్రేమదేవత గురించికాక సోక్రటీస్ గురించి ప్రసంగిస్తానని చెప్పి, తన ప్రసంగం మొదలుపెట్టాడు)

నేను ప్రస్తుతం బతుకున్న పద్ధతి సరైంది కాదని ఆయన నాకు పరోక్షంగా పదేపదే గుర్తుచేస్తుంటాడు. నా ఆత్మిక అవసరాల్ని నిర్లక్ష్యం చేసి ఎథీనియన్ల గొడవల్లో నేను కూరుకుపోతున్నానని నాకు గుర్తుచేస్తుంటాడు కాబట్టే నేను నా చెవులు మూసుకుని అతణ్ణుంచి దూరంగా పారిపోతుంటాను. సిగ్గుపడటం నా స్వభావంలోనే లేదని మీరనుకోవచ్చు, కాని ఈ ప్రపంచంలో నన్ను సిగ్గుపడేట్టు చేసిందంటూ ఎవరన్నా ఉంటే అతడొక్కడే. నాకు తెలుసు నేనతడిమాటకి ఎదురుచెప్పలేనని. ఆయన చెప్పినట్టు చెయ్యడం నాకు చాతకాదని చెప్పలేను. కాని అతని దగ్గరనుంచి బయటిరాగానే ప్రజాదరణా, ప్రజామోదం పొందాలన్న కోరిక వరదలాగా నన్ను ముంచెత్తుతుంది. అందుకని నేనతణ్ణుంచి పారిపోతాను, తీరా అతణ్ణి చూడగానే అతడిముందు ఏమేం చెప్పానో అదంతా గుర్తొచ్చి సిగ్గనిపిస్తుంది. అతడు చచ్చిపోతే బాగుణ్ణని చాలా సార్లు అనిపించింది. కాని నాకు ఇది కూడా తెలుసు, నిజంగా అతడు మరణిస్తే నాక్కలిగేది సంతోషంకాదు, అంతులేని దుఃఖం. అందుకని నాకేమీ పాలుపోదు.

ఈ గంధర్వుడి వేణుగానం విని నేనూ నాలాంటి వాళ్లం మరెందరమో అనుభవిస్తున్న నరకం ఇది. అయినా కూడా అతడి మూర్తిమత్వం ఎటువంటిదో, అతడి శక్తిసామర్థ్యాలు ఎటువంటివో మరొకమారు చెప్పనివ్వండి. అవును, నేను చెప్పితీరాలి, ఎందుకంటే మీకెవ్వరికీ ఆయన ఏమిటో నిజంగా తెలియదు. కాబట్టే నేను ఆయన్ని మీముందు ఆవిష్కరించాలనుకుంటున్నాను. ఎలానూ మొదలుపెట్టాను కాబట్టి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. సౌందర్యమంటే అతడికెంత మక్కువనో మీరందరూ చూసారు కదా. అందగాళ్ళ అందం తనని కాటువేస్తోందా అన్నట్టు వాళ్ల దగ్గరే తిష్టవేసుక్కూచుంటాడు. కాని మళ్లా తనకేమీ తెలియదన్నట్టూ, అసలు అటువంటి విషయాల పట్ల ధ్యాసనే లేదన్నట్టూ కనిపిస్తాడు. అతడు పైకి కనిపించే రూపం అది. ఈ విషయంలో అతడు సిలనస్ లాంటివాడే కాదంటారా? నిజంచెప్పాలంటే అతడి బాహ్యాకృతి సిలనస్ అర్థాకృతిప్రతిమలాగా ఉంటుంది. కానీ, ఓ నా పానగోష్ఠిమిత్రులారా, అతడి గుండె చీల్చి చూడండి! ఎటువంటి జితేంద్రియుడు సాక్షాత్కరిస్తాడు మీకక్కడ! తక్కిన ప్రపంచం ఏ సౌందర్యం ఎదట, సిరిసంపదల ఎదట, గౌరవప్రతిష్టల ఎదట సాష్టాంగ పడిపోతుందో, వాటిపట్ల అతడికి కించిత్తు కూడా దృష్టిలేదు. ఇంకా చెప్పాలంటే వాటి పట్ల అతడికి చెప్పలేనంత ఏహ్యత. అందం, సంపద, హోదా ఉన్నవారిని భాగ్యశాలురని అతడు ఎన్నటికీ అనుకోలేడు. అసలు మానవాళిని తృప్తిపరచడం పట్ల అతడికెటువంటి ఆసక్తీ లేదు. పైగా వాళ్ళని ఎగతాళిచెయ్యడంలోనూ, తీసిపక్కన పారెయ్యడంలోనే అతడు జీవితమంతా గడిపేసాడు.’

39

‘కాని నేనతడి హృదయాన్ని చీల్చి చూసాను. అందులో దాగిఉన్న గంభీర ప్రయోజనాన్ని దర్శించాను. ఆయన మహాకర్ష సౌందర్యాన్ని నేనెటువంటి దైవీయ, స్వర్ణాకృతుల్లో గమనించానంటే ఆ క్షణాన సోక్రటీస్ నన్నేం చెయ్యమని ఆజ్ఞాపిస్తే అది చేసేసి ఉండేవాణ్ణి. తక్కినవాళ్ళు ఆ సౌందర్యదర్శనాన్ని చూడకపోయి ఉండవచ్చు, కాని నేను చూసాను. అప్పుడు ఆయన నా అందాన్ని చూసి మోహితుడై ఉన్నాడని అనుకునేవాణ్ణి. నా యవ్వనం మనుషుల మీద చూపించే ఆకర్షణ పట్ల నాకు గొప్ప నమ్మకం ఉండేది కాబట్టి, అతడు నాతో సంభాషించే అవకాశం నాకు లభించిందని అనుకునేవాణ్ణి. ఆ ఉద్దేశ్యంలోనే ఉన్నాను కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నాతో పాటు ఉన్న పరిచారకుణ్ణి వెళ్ళిపొమ్మని చెప్పాను (ఈ సందర్భంగా నేను మొత్తం సత్యం చెప్పాలనుకుంటున్నాను, కాబట్టి దయచేసి వినండి, నేనేదైనా తప్పు చెప్తే, సోక్రటీస్, వెంటనే చెప్పేసెయ్యి).’

“సరే. అప్పుడు మేమిద్దరమే ఉన్నాం. మరొకరెవరూ మా పక్కన లేరు కాబట్టి, ఆలాంటి ఏకాంతంలో ఆయన నాతో ప్రేమికులు మాట్లాడుకునేమాటలు మాట్లడతాడనిపించి సంతోషం కలిగింది. కాని అటువంటిదేమీ లేకపోగా, ఆయన ఎప్పటిలానే మామూలుగానే మాటలాడేడు. ఆ తర్వాత నేనాయన్ని కుస్తీపడదాం రమ్మని పిలిచాను. అతడు నాతో మల్లయుద్ధానికి తలపడ్డాడు, ఆ కుస్తీలో నన్ను చాలాసార్లు చుట్టుముట్టాడుగానీ, అక్కడెవరు మేమిద్దరమే తప్ప మరెవరూ లేనప్పుడైనా నాతో ప్రేమసంభాషణ మొదలుపెడతాడేమోనని చూసాను. ఒక్కపిసరు కూడా అలాంటి పనిచెయ్యలేదు. ఇప్పటిదాకా నేనీ విషయంలో నెగ్గలేదుకాబట్టి, ఇకమీదట మరింతగా తెగించాలనుకున్నాను. ఎలానూ ఈ ప్రయత్నాలు మొదలుపెట్టానుకాబట్టి, సంగతేమిటో చూసేదాకా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టకూడదనుకున్నాను. అందుకని ఒక సాయంకాలం ఆయన్ని మా ఇంటికి భోజనానికి ఆహ్వానించేను. ఆయనొక అందగాడైన యువకుడన్నట్టూ, నేనతడి వెంటపడుతున్న ప్రేమికుడిలానూ ఊహించుకుని పిలిచానుగాని, అతడు రాడానికి ఇష్టపడలేదు. ఏమయితేనేం చివరికి ఒప్పుకున్నాడుగాని, మొదటిసారి వచ్చినప్పుడు, భోజనం పూర్తవగానే వెళ్ళిపోడానికి సిద్ధమయ్యాడు. ఆయన్ని ఆపడానికి నాకు శక్తి చాలింది కాదు. రెండోసారి వచ్చినప్పుడు, నా మనసులో ఇంకా నా ప్రణాళిక బలంగానే ఉందికాబట్టి, భోజనం పూర్తయ్యాక, రాత్రి చాలాసేపటిదాకా నేనతణ్ణి సంభాషణల్తో కట్టిపడేసాను. ఇక అతడు వెళ్ళొస్తానని చెప్పగానే, అప్పటికే బాగా పొద్దుపోయిందనీ, అంతరాత్రివేళ వెళ్లడం కన్నా ఉండిపోతేనే మంచిదనీ అనునయించాను. ఇక ఆయన చేసేదేమీ లేక, అక్కడే శయ్యమీద నా పక్కనే కూచున్నాడు. మేము భోంచేసింది కూడా అక్కడే. ఆ గృహంలో ఆ రాత్రివేళ మేమిద్దరం తప్ప మరెవరూ లేరు. ఇక్కడిదాకా ఈ విషయమంతా ఎవరికేనా చెప్పడానికి సంకోచపడవలసిన పనిలేదు, సిగ్గపడవలసిన అవసరం అంతకన్నా లేదు. కాని ఇవాళ నేను తాగకుండా మామూలుగా ఉండి ఉంటే ఆ తర్వాత ఏమి జరిగిందో ఎంతమాత్రం చెప్పలేకపోయేవాణ్ణి. కాని ఏదో సామెత చెప్పినట్టు, పిల్లలముందూ, మద్యం ముందూ నిజందాగదని, అలాగ, సరే, ఇప్పుడు పిల్లల్ని పక్కనపెట్టండి, మద్యం ప్రభావంలో నేను నిజం చెప్పక తప్పదు. అందులోనూ సోక్రటీస్ ఉదాత్తత గురించి ప్రసంగించడానికి సిద్ధపడ్డప్పుడు ఇలాంటి విషయాలు అస్సలు దాచలేను. అదీకాక నేను ప్రేమసర్పం కాటుతిన్నవాణ్ణి. గాయపడ్డవాడు తన గాయాన్ని తనలాగా గాయపడ్డవాడితోటే కదా పంచుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే కదా, అతడి బాధ అర్థం చేసుకోగలుగుతారు. అతడి వేదనలోంచి తమతో చెప్పుకున్నమాటల్ని బట్టి అతడిమీద తీర్పు తీర్చడానికి ఇష్టపడరు కదా వాళ్ళు.’

40

‘సరే, మోహసర్పాన్ని మించినకోరలు కాటువేసి ఉన్నవాణ్ణి. యవ్వనంపెట్టే హింసని మించిన క్రూరమైన దంష్ట్రల కాటు ఎలా ఉంటుందో నా ఆత్మలోనో, నా హృదయంలోనో లేదా నాలోపల ఎక్కడో నాకు తెలుసు. అది తత్త్వశాస్త్రం తాలూకు దంష్ట్రల కాటు. అది తిన్నవాడు ఏదైనా చెయ్యగలడు, ఏమైనా చెప్పగలడు. నా చుట్టూ నాకు కనిపిస్తున్నవాళ్ళు, ఫేద్రోస్, అగధాన్, ఎరిక్సిమేకస్, పౌసనియస్, అరిస్టొడెమస్, అరిస్టొఫెనీస్ మీరంతా, ఇక సోక్రటీస్ సంగతి చెప్పనవసరం లేదు, మీరంతా కూడా జ్ఞానాన్వేషణలోని ఉన్మాదాన్నీ, వ్యామోహాన్నీ చవిచూసినవారే. కాబట్టి అప్పటి నా చేష్టల్ని క్షమించి ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఇక్కడున్న పరిచారకులూ, ఇలాంటి విషయాల్ని అర్థం చేసుకునేశక్తిలేనివాళ్లూ కొంతసేపు చెవులు మూసుకోండి.’

‘ఆ రాత్రి దీపాలు ఆర్పేసి పరిచారకులు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక ముసుగులో గుద్దులాట మాని నేరుగా నా మనసులో ఉన్న విషయం బయట పెట్టేద్దామనుకున్నాను. అందుకని నా పక్కన పడుకున్న సోక్రటీస్ ని ఒకసారి కుదిపి ‘ సోక్రటీస్, నిద్రపోతున్నావా? ‘అనడిగాను. లేదు అన్నాడు. నా మనసులో కదలాడుతున్నదేమిటో తెలుసా అనడిగాను. దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాడు. నేనింతదాకా నా జీవితంలో చూసిన ప్రేమికులందరిలోనూ నాకు తగినవాడివి నువ్వే. కాని చూడబోతే నువ్వు నీ ప్రేమని మాటల్లో పెట్టడానికి సిగ్గుపడుతున్నట్టుంది. కాని ఇప్పుడు నువ్వు నన్ను ఏమి కోరినా కాదనేటంత మూర్ఖుణ్ణి కానని మాత్రం చెప్పగలను. అందుకని ఇదుగో ఈ క్షణాన నాకూ, నా స్నేహితులకీ ఉన్నదంతా కూడా నీ పాదాలదగ్గర పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చెప్పే ఆ ప్రేమమార్గాన్ని అందుకోడానికి నాకు చెయ్యగల సాయమంతా చెయ్యమని కోరుకుంటున్నాను. ఈ విషయంలో నాకు నీకన్నా చక్కగా దారిచూపించగలవాడు మరొకడు లేడు అని అన్నాను. ఈ సమయంలో నువ్వు నన్నేమి కోరినా నేను తిరస్కరిస్తే, వివేకవంతులూ, జ్ఞానులూ నన్ను తప్పుపడతారేమోనని భయంగా ఉంది. ఇక ప్రపంచం సంగతంటావా, మూర్ఖజనసందోహం, వాళ్ళేమనుకుంటే నాకేమిటి? అని అన్నాను. నా మాటలకి అతడిలా జవాబిచ్చాడు. అతడి మాటల్లో అదే సూక్ష్మవ్యంగ్యం. ‘ మిత్రమా, ఆల్సిబయడిస్, నువ్వు చెప్పే మాటలేగనక నిజమైతే, నిన్ను మరింత ఉన్నతివైపు నడిపించగల ఆ శక్తి ఏదో నిజంగా నాలో ఉంటే, నీ ఉద్దేశ్యాలు ఘనమైనవే అని ఒప్పుకుని తీరాలి. నేను నీలో చూస్తున్న అందాన్ని మించిన అరుదైన సౌందర్యాన్ని దేన్నో నువ్వు నాలో చూస్తున్నావన్నమాట. నువ్వు నానుంచి దాన్ని అందుకోవాలని అనుకుంటున్నట్టయితే, సౌందర్యాన్ని సౌందర్యంతో వినిమయం చెయ్యబోతున్నట్టయితే, అది నీకే ఎక్కువ లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు మామూలు అందాన్నిచ్చి యథార్థసౌందర్యాన్ని ప్రతిఫలంగా పొందబోతున్నావన్నమాట. ఇత్తడినిచ్చి పుత్తడికైవసం చేసుకోబోతున్నావు’.

41

‘కాని చూడు మిత్రమా, నన్ను చూసి మోసపోతున్నావేమో మరోసారి చూసుకో. మానవదృష్టి మందగించినప్పుడు మటుకే మనోనేత్రం పనిచెయ్యడం మొదలుపెడుతుంది. కాని, చూడబోతే ఇప్పటిప్పట్లో నీకు వార్థక్యం ముంచుకొచ్చే సూచనలేవీ లేవు’ అని అన్నాడు. ఆ మాటలు విని ‘నా ఉద్దేశ్యమేమిటో నీకు స్పష్టంగా చెప్పాను. అందులో ఎటువంటి దాపరికం లేదు. కాబట్టి ఆలోచించి నీకూ, నాకూ ఏది మంచనిపిస్తే, అలా చెయ్యి’ అని అన్నాను. ‘బావుంది అన్నాడాయన. ‘మనం మరోసారి తీరిగ్గా కూచుని, ఈ విషయంలోనూ, ఇంకా ఇలాంటి విషయాల్లోనూ ఏది మంచిదో నిదానంగా నిర్ణయిద్దాం’ అని అన్నాడు.

ఆయనలా అనడం విని, అతడు కూడా మోహోద్రిక్తుడయ్యాడనీ, నా మాటలు అతణ్ణి వలపుశరాలుగా తాకాయనీ అనుకుని, ఇంక ఆయన్ని మరేమీ మాటాడనివ్వక, నేను నా అంగీ తీసి పక్కనపారేసి, అతడి అంగీకిందకు చొరబడ్డాను. అది నడిశీతాకలం కాబట్టి, ఆ రాత్రంతా నేను ఆ అద్భుతరాక్షసుణ్ణి నా చేతుల్తో బంధించే ఉన్నాను. సోక్రటీస్, ఈ విషయం నువ్వు కాదనలేవు, నాకు తెలుసు.’

‘అయినా కూడా నా వేడికోళ్ళు అతడిని ఇసుమంతైనా కదిలించలేదు. అంతదాకా అతణ్ణి సమ్మోహితుణ్ణి చేస్తూ వచ్చిందనుకున్న నా అందంపట్ల అతడెంత తూష్ణీంభావం వహించాడంటే, ఆ రాత్రి అంతకుమించి మరేమీ జరగలేదు. ఆ మర్నాడు పొద్దున్నే నేను ఆ శయ్యమీంచి మేల్కొన్నప్పుడు ఒక అన్నపక్కన పడుకుని లేచినట్టో లేదా తండ్రిపక్కన పడుకుని నిద్రలేచినట్టో నిద్రలేచాను. (నా మాటలకి సమస్త దేవీదేవతలు సాక్ష్యముందురుగాక!) ఓ న్యాయవేత్తలారా, ఇప్పుడు చెప్పండి మీరు సోక్రటీస్ శీలమ్మీద తీర్పు!.’

‘అటువంటి తిరస్కారం పొందిన తరువాత, నా గౌరవం నా కళ్ళముందే అలా కుప్పకూలిపోయిన తర్వాత నా భావాలేమై ఉండవచ్చనుకుంటున్నారు? కాని నేనతడి స్వాభావిక నిగ్రహాన్నీ, సంయమనాన్నీ, వ్యక్తిత్వాన్నీ చూసి అబ్బురపడకుండా ఉండలేకపోయాను. తన వివేకంలోనూ, తన సహిష్ణుతలోనూ అంత స్థితప్రజ్ఞుడిగా ఉండగల ఒక మనిషిని నేను నా జీవితంలో చూస్తానని ఎన్నడూ అనుకోలేదు. కాబట్టి నాకు అతని మీద కోపమూ రాలేదు సరికదా, అతడి స్నేహాన్ని తెంచుకోవాలని కూడా అనిపించలేదు. కాని అతణ్ణి గెలుచుకోవడమూ నాకు సాధ్యం కాలేదు. ఆ ఎయాస్ ని ఆయుధంతోనూ గెలవలేం, డబ్బుతోనూ కొనలేం, ఇక నా అందాన్ని ఆకర్షణగా పెట్టి గెలుచుకోగల ప్రయత్నం కూడా విఫలమైపోయింది. నేను పూర్తిగా ఓడిపోయాను. నేనతడికి లొంగిపోయినంతగా ఎవరూ ఎవరికీ పాదాక్రాంతం కారేమో. ఇదంతా కూడా మేమిద్దరం కలిసి పొటిడియా కి వెళ్ళకముందు జరిగింది. అక్కడ మేమిద్దరం కలిసే భోంచేసేవాళ్ళం. ఎటువంటి కష్టానికైనా ఓర్చగల అతడి ఓపిక ఎంత అసాధారణమో అక్కడ ప్రత్యక్షంగా చూసాను.’

42

‘అక్కడ మాకు ఆహారపదార్థాలు దొరక్కపోయినా, మామూలుగా యుద్ధకాలంలో జరిగేటట్టే, రోజుల తరబడి పస్తులుండవలసి వచ్చినా కూడా, తితిక్షలో అతడు నాకన్నామాత్రమే కాదు, ప్రతి ఒక్కరికన్నా కూడా ఎంతో మిన్నగా కనిపించాడు. అటువంటి ఓపికలో అతడికి ఎవరితోటీ పోలికలేదు.’


వివరణలు

1. ఎజాక్స్ లేదా ఎయాస్: గ్రీకు ఇతిహాసాలు ఇలియడ్ లో ఒక ముఖ్యపాత్ర. వీరాధివీరుడు. శౌర్యంలో అకిలిస్ తర్వాత అతడే గుర్తొస్తాడు.

2. పొటిడియా: కోరింత్ కు చెందిన ఒక వలసనగరం. కొరింత్ కూ, ఏథెన్సుకూ మధ్య జరిగిన యుద్ధంలో ఏథెన్సు ఆ నగరాన్ని పూర్తిగా వశపర్చుకునేముందు రెండేళ్ళపాటు ముట్టడికొనసాగించింది. ఆ ముట్టడిలో పాల్గొన్నప్పటి విషయాల్ని ఇక్కడ గుర్తుచేసుకుంటున్నాడు.


Featured image: PC:https://unsplash.com/photos/ZIQb1OkI7Ss

4 Replies to “ప్రేమగోష్ఠి-11”

  1. గొప్పగా ఉంది. అసలు ఈ సంభాషణ, చర్చ .. అప్పుడెప్పుడో పూర్వకాలానివి అనుకుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఖచ్చితమైన వర్తమాన కాలానికి చెందినవే .. సందేహం లేదు.

  2. అతి సన్నిహితులకు మాత్రమే ఒక వ్యక్తి బాగా అర్థమౌతాడు, రచనలు , ప్రసంగాల కంటే వైయక్తిక స్వభావం తెలుసుకోవడానికి సాన్నిహిత్యం చాలా అవసరం.
    సోనా ఖస్ కే దేఖ్నా -సొహబత్ కర్ కే దేఖ్నా

Leave a Reply

%d