ప్రేమగోష్ఠి-10

(ఏథెన్సుకి చెందిన అగధాన్ అనే యువకుడు నాటకరచనల పోటీలో తన నాటకానికి బహుమతి వచ్చిన సందర్భంగా ఒక విందు ఏర్పాటు చేసాడు. ఆ విందులో భాగంగా, అక్కడ చేరిన మిత్రులు సోక్రటీస్ తో సహా పానగోష్ఠికి బదులు ప్రేమగోష్ఠి చేపట్టారు. వారిలో ఫేద్రోస్, పౌసనియస్, ఎరిక్సిమేకస్, అరిస్టొఫెనీస్, అగధాన్ ప్రసంగించాక, సోక్రటీస్ ప్రసంగం మొదలయ్యింది. ఆయన తనకు ప్రేమ రహస్యాల్ని మంచినియా కి చెందిన డయోటిమ అనే యోగిని బోధించిందని చెప్తూ ఆమెకీ, తనకీ మధ్య జరిగిన సంభాషణను తిరిగి చెప్తున్నాడు.)

‘ఆ యోగిని డయొటిమా నాకు చెప్పిన మాటలివీ ఫేద్రోస్, నేన్నీకు ఒక్కడికే కాదు, అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే వాటిలో సత్యముందని నాకు నమ్మకం కలిగింది. ఆ మాటలు నన్ను ఒప్పించాయికనుక, నేను ఆ మాటల్తో తక్కినవాళ్లని కూడా ఒప్పించాలనుకుంటున్నాను. ఈ పురుషార్థాన్ని సాధించడంలో మానవస్వభావానికి ప్రేమని మించిన సహాయకుడు మరొకడు దొరకడు. కాబట్టి నేనతణ్ణి గౌరవించినట్టే ప్రతి ఒకరూ గౌరవించాలని కోరుకుంటాను. అతడి దారిలో నడవాలని కోరుకుంటాను, తక్కినవాళ్ళని కూడా అలా నడవమని ప్రోత్సహించాలంటాను. ఇప్పుడు కీర్తించినట్టే ప్రేమగుణగానాన్ని నేనెన్నటికీ ఇలానే కీర్తిస్తూ ఉండాలని కోరుకుంటాను.’

‘నేను చెప్పిన ఈ మాటల్ని, ఫేద్రోస్, నువ్వు ప్రేమదేవతా స్తోత్రమను లేదా నీకు నచ్చిన మరేపేరుతోనైనా పిలు’ అని అన్నాడు సోక్రటీస్.

సోక్రటీస్ తన ప్రసంగం ముగించగానే అందరూ కరతాళధ్వనుల్తో అభినందించారు. సోక్రటీస్ తన ప్రసంగంలో అరిస్టొఫెనీజ్ ప్రసంగంలోంచి ఎత్తిచూపినవాటికి అరిస్టొఫెనీస్ జవాబుగా ఏదో చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతలో ఎవరో బయటనుంచి తలుపు బాదడం వినిపించింది. పానోన్మత్తులసందడీ, పిల్లంగోవి ఊదే అమ్మాయి సంగీతమూ వినవచ్చాయి. అలా తలుపు తడుతున్నవాళ్ళెవరో చూసి రమ్మని అగధాన్ తన పరిచారకుల్ని పంపించాడు. ‘వాళ్లు మనవాళ్ళే అయితే లోపలకి తీసుకురండి. మనకు తెలియనివాళ్లయితే, ఇక్కడ పానగోష్ఠి ముగిసిపోయిందని చెప్పండి’ అని అన్నాడు. కొన్ని క్షణాల తర్వాత ఆ గోష్ఠిలో ఆల్సిబయడిస్ కంఠస్వరం పెద్దగా ప్రతిధ్వనించడం వినిపించింది. అతడు పూర్తిగా పానోన్మత్తుడై ఉన్నాడు. ‘ఏడి అగధాన్? నన్ను అగధాన్ దగ్గరికి తీసుకెళ్ళండి’ అని అరుస్తున్నాడు. మొత్తానికి, ఆ పరిచారకులూ, పిల్లంగోవి ఊదే అమ్మాయీ దారి చూపిస్తుండగా, అతడు అగధాన్ దగ్గరకు రాగలిగాడు. ‘అభినందనలు మిత్రులార!’ అన్నాడతడు గడప దగ్గర ప్రత్యక్షమవుతూ. అతడి గళసీమలో పెద్ద పూలమాల వేలాడుతూ ఉండి. శిరసుమీంచి రంగురంగుల పట్టీలు వేలాడుతున్నాయి. ‘ఇవాళ మీ బృందంలో ఒక పచ్చితాగుబోతుకి కూడా స్థానం కల్పించగలరా? లేదా అగధాన్ నెత్తిన ఒక పూలకిరీటం తగిలించి వెళ్ళిపొమ్మంటారా? నేనిక్కడికి వచ్చింది అగధాన్ ని సన్మానించడానికే అనుకోండి. నిన్న రాలేకపోయాను. అందుకని ఇవాళ వచ్చాను. ఇదుగో, నా నెత్తిన ఈ పట్టీలు తగిలించుకొచ్చాను. వీటిని నా తలమీంచి తీసి అగధాన్ శిరసుని అలంకరిస్తాను. అత్యంత సుందరుడు, జ్ఞానసంపన్నుడూ అని అతణ్ణి స్తుతిస్తాను.. నేను తప్పతాగి ఉన్నానుకాబట్టి మీరు నన్ను చూసి నవ్వుతున్నారా? నవ్వితే నవ్వండిగాని నేను నిజమే చెప్తున్నానని నాకు బాగా తెలుసు’.

35

‘కానీ ముందిది చెప్పండి, నేను లోపలకి రావచ్చా? అప్పుడే నేనింతకుముందు చెప్పినమాటలు బాగా అర్థమవుతాయేమో? మీరు నాతో కలిసి మధుపానం మొదలుపెడతారా?’

అతడి మాటలు వింటూనే ఆ మిత్రబృందమంతా ముక్తకంఠంతో అతణ్ణి లోపలకి రమ్మనీ, వచ్చి తమ మధ్య కూచోమనీ ఆహ్వానించేరు. అగధాన్ అతణ్ణి మరీ ప్రత్యేకంగా ఆహ్వానించేడు. అప్పుడు పరిచారకులు అతణ్ణి లోపలకి తీసుకువచ్చారు. అతడు తన శిరసుమీద ఉన్న రంగురంగుల తురాయిలు, పతకాలు తీసి తన కళ్ళముందు పెట్టుకుని చూసుకున్నాడు. అలా చూడటం వల్ల అతడికి అక్కడ సోక్రటీస్ ఉన్నట్టు కనబడలేదు. కాని సోక్రటీస్ పక్కకు తప్పుకుని అతడికి కూచోడానికి చోటుచేసాడు. ఆల్సిబయడిస్ అగధాన్ కీ, సోక్రటీస్ కీ మధ్య ఉన్న జాగాలో కూచుని అగధాన్ ని కౌగిలించుకుని అతడిశిరసును విజయలాంఛనాలతో అలంకరించాడు. ‘అతడి చెప్పులు తీసి పక్కన పెట్టండి, ఈ శయ్యమీదనే మూడోమనిషి కూచోడానికి సిద్ధం చెయ్యండి’ అని ఆదేశించాడు అగధాన్.
‘చాలా సంతోషం. కానీ మన ఉత్సాహంలో ఆ మూడో మనిషి ఎవరు’ అనడుగుతూ ఆల్సిబయడిస్ పక్కకి తిరిగి సోక్రటీస్ ని చూసాడు. ‘హా హెర్క్యులస్! ఏమిటిది? ఇక్కడ సోక్రటీస్ నాకోసం వేచి ఉండటమేమిటి? ఆయన ఎప్పుడూ ఇంతే, అనుకోని తావుల్లో అనుకోని విధంగా ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఇప్పుడేమి చెప్తావు? ఎందుకున్నావిక్కడ? ఈ బృందంలో నువ్వు కూడా ఎలానో చోటుసంపాదించావే. అది కూడా అరిస్టొఫెనీస్ లాగా హాస్య, వ్యంగ్య ప్రేమికుడి పక్కన కాదు, అత్యంత సత్సాంగత్యంలో కనబడుతున్నావే!’అని అరిచాడు.

సోక్రటీస్ అగధాన్ వైపు తిరిగి ‘అగధాన్, ఇవ్వాళ నువ్వు నన్ను రక్షించక తప్పదు. నా మీద ఈ మనిషికి మోహం నానాటికీ ముదిరిపోతోంది. ఇతణ్ణి నేను ఏ ముహూర్తాన అభిమానించడం మొదలుపెట్టానోగాని, అప్పణ్ణుంచీ నన్ను మరొకరెవరితోనూ మాటాడనివ్వడు, ఏ అందగాడి వంకా కన్నెత్తి చూడనివ్వడు. ఎవరినైనా చూసేనే అనుకో, అసూయతో రగిలిపోతాడు, నన్ను తిట్టడం మొదలుపెడతాడు, అక్కడితో ఆగడు, నన్ను పట్టుకునే ఉంటాడు, ఇంకేమి ఆఘాయిత్యం చేస్తాడో అని భయం కూడా వేస్తుంది. కాబట్టి మమ్మల్ని సమాధానపరుచు లేదా అతడేదన్నా అఘాయిత్యానికి పూనుకుంటే నన్ను రక్షించు. అతడి మోహవాలకం చూస్తే నాకు ప్రాణాలమీదకొచ్చినట్టే ఉంటుంది’అని అన్నాడు.

‘నీకూ నాకూ మధ్య శాంతికుదరడం పొసగని పని’ అని అన్నాడు ఆల్సిబయడిస్. ‘ప్రస్తుతానికైతే నేను నీ శిక్షను వాయిదా వేస్తున్నాను. అగధాన్ ఇప్పుడు నిన్ను అలంకరించిన ఆ తురాయిల్లో కొన్ని నాకు వెనక్కివ్వు, ఈ సార్వత్రిక నియంత అద్భుత శిరాన్ని అలంకరిస్తాను. లేకపోతే తనని పట్టించుకోకుండా నిన్నొక్కణ్ణే సన్మానించానని నామీద అలుగుతాడు. సంభాషించడం మొదలుపెడితే అతడు సమస్తమానవాళినీ పాదాక్రాంతం చేసుకోగలడు. ఏదో ఒక్కసారి కాదు, లేదా మొన్న నువ్వు చేసినట్టుకాదు, ఎప్పుడు మాట్లాడినా అతడే విజేత’ అని అగధాన్ శిరసుని అలంకరించిన తురాయిలు కొన్ని తీసి సోక్రటీస్ శిరసుని అలంకరించి, అప్పుడు శయ్యమీద విశ్రాంతిగా వెనక్కి ఆనుకున్నాడు.

మళ్ళా ఆ బృందం కేసి చూసి ‘ఏమిటిది మిత్రులారా మిమ్మల్ని చూస్తుంటే చాలా గంభీరంగా కనిపిస్తున్నారు? మీ వాలకం ఇలా ఉండకూడదే. మీరు తాగడం మొదలుపెట్టాలి కదా, నన్ను లోపలకి రమ్మన్నప్పుడు మన ఒప్పందం అదే కదా. మీరు పీకలదాకా తాగే దాకా, ఈ విందుకి అధినేతను నేనే. అగాధాన్, పెద్ద పానకలశం తెప్పించు, లేదా’ అని పరిచారకుడికేసి తిరిగి’ ‘ఆ పానపాత్ర ఇటు పట్టుకురా’ అని అన్నాడు. అతడి దృష్టిని ఆకర్షించిన ఆ పానపాత్ర చిన్నదేమీ కాదు. అతడు దాన్ని పూర్తిగా నింపుకుని, ఒక్క గుక్కలో ఖాళీ చేసి దాన్ని సోక్రటీస్ కోసం మళ్ళా నింపమని ఆ పరిచారకుణ్ణి ఆదేశించాడు.

36

‘గమనించండి మిత్రులారా నేనెంతో తెలివిగా ప్రదర్శిస్తున్న ఈ యుక్తి సోక్రటీస్ మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఆయన ఎంతైనా తాగనివ్వు, ఏమీ తాగనట్టే ఉండగలడు’ అని అన్నాడు. ఆ పరిచారకుడు తనకు అందించిన పానపాత్రను సోక్రటీస్ చవిచూసాడు.

‘ఆల్సిబయడిస్? ఏమిటిది? ఏదో దాహంపట్టినట్టు తాగుతూపోడమేనా? ఒక గోష్ఠి ఉండదా? ఒక గానం ఉండదా?’ అనడిగాడు ఎరిక్సిమేకస్.

‘హాహాహా! గొప్ప వంశానికి చెందిన గొప్ప మనిషికి తగ్గట్టే ఉన్నాయి నీ మాటలు’ అన్నాడు ఆల్సిబయడిస్.

‘నువ్వు కూడా గొప్పవాడివేలే కానీ ఇంతకీ ఏం చేద్దామంటావు’ అనడిగాడు ఎరిక్సిమేకస్.

‘అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను’ అన్నాడు ఆల్సిబయడిస్.

‘హోమర్ చెప్పినట్టుగా ఆ వైద్యుడు మన గాయాల్ని నయం చేయగలడు. కాబట్టి ఆ వైద్యుడెలా చెప్తే అలా నడుచుకుందాం మనం. చెప్పు, ఏం చేద్దామంటావు?’

‘సరే, విను, నువ్వు రాడానికి ముందు మేమొక తీర్మానం చేసుకున్నాం. మాలో ప్రతి ఒక్కరం ప్రేమదేవతను స్తుతిస్తూ ఒక్కొక్కరూ ఒక ప్రసంగం చెయ్యాలని అనుకున్నాం. ఎవరికి చాతనయినట్లు వాళ్ళు. ఇక్కడ కూచున్నవాళ్ళంతా ఎడమనుంచి కుడికి ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేరు. మేమంతా మాట్లాడేం. నువ్వు తప్ప. పానసంతోషం చవిచూసావుకాబట్టి నువ్వు కూడా మాట్లాడకతప్పదు. ఆ తర్వాత సోక్రటీస్ ఏం చెయ్యొచ్చో చెప్పు, ఆయన తన కుడివైపు ఉన్నాయనకి ఏం చెయ్యాలో చెప్తాడు, అలా వంతులవారీ మన గోష్ఠి సాగిద్దాం’ అని అన్నాడు ఎరిక్సిమేకస్.

‘ఇది చాలా బావుంది ఎరిక్సిమేకస్’ అన్నాడు ఆల్సిబయడిస్. ‘కాని ఒక తాగుబోతు ప్రసంగాన్ని, తక్కినపెద్దమనుషుల్తో ప్రసంగాల్తో పోలిస్తే మాత్రం అంతకన్నా అన్యాయం మరొకటి ఉండబోదు. అయితే ప్రియమిత్రమా, ఒకటి చెప్పు, సోక్రటీస్ ఇప్పుడే చెప్పాడే ఆ మాటలు నువ్వు నిజంగా నమ్ముతున్నావా? కానీ సత్యం అందుకు విరుద్ధం అని గట్టిగా చెప్పగలను. అతడి సన్నిధిలో నేను అతణ్ణి కాక మరెవర్ని ప్రశంసించినా, మనిషిగాని, దేవుణ్ణిగాని, అతడు నన్ను వదిలిపెట్టడు’ అని కూడ అన్నాడు.

‘నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా?’ అనడిగాడు సోక్రటీస్.

‘నీ మాటలు కట్టిపెట్టు. పొసైడన్ మీద ఒట్టు, నువ్విక్కడ ఉండగా నేను మరొకర్ని ప్రశంసించే ప్రసక్తేలేదు’ అన్నాడు ఆల్సిబయడిస్.

‘మంచిది, అలాగయితే సోక్రటీస్ నే స్తుతించు’ అన్నాడు ఎరిక్సిమేకస్.

‘ఏమంటున్నావు ఎరిక్సిమేకస్? మీ అందరిముందూ నేను నిజంగానే ఈ పెద్దమనిషి మీద దాడిచెయ్యగలననుకుంటున్నావా?’

‘ఇప్పుడేం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు? వీళ్ళందరిముందూ నన్ను నవ్వులపాలు చెయ్యబోతున్నావా? అదేనా నువ్వు స్తుతిస్తానంటే అర్థం?’ అన్నాడు సోక్రటీస్.

‘నువ్వనుమతిస్తే నేను సత్యం మాట్లాదామనుకుంటున్నాను.’

‘అనుమతించడం కాదు, సత్యం మటుకే చెప్పమని మొత్తుకుంటున్నాను’.

‘అయితే ఇదుగో ఇప్పుడే మొదలుపెడుతున్నాను’ అన్నాడు ఆల్సిబయడిస్. ‘నేను మాట్లాడబోయేది నిజంకాకపోతే నువ్వు వెంటనే నాకు అడ్డుపడి అది అబద్ధమని అప్పుడే చెప్పెయ్యి. కాని నేను సత్యమే చెప్పాలనుకుంటున్నాను. అయితే నా మనసుకి ఎలా తోస్తే అలా చెప్తాను. ఎందుకంటే నీ అద్వితీయ గుణగణాల్ని ధారళంగానూ, ఒక క్రమపద్ధతిలోనూ చెప్పుకుంటూ రావడం నేనున్నపరిస్థితిలో ఏమంత సులభం కాదు’.

37

‘మిత్రులారా నేనిప్పుడు సోక్రటీస్ గురించి చేపట్టబోయే ప్రశంస లో అతడు కొద్దిగా విచిత్రంగా కనిపించవచ్చు, కాని అది అతణ్ణి తక్కువచెయ్యడానికి కాదు, సత్యం చెప్పడంకోసమే మాత్రమే అని గ్రహించండి. అతణ్ణి చూస్తే అర్థాకృతిలో మలిచిన సిలనోస్ శిల్పాలు గుర్తొస్తాయి. చూడండి విగ్రాహలమ్మే దుకాణల్లో కనిపిస్తుంటాయి, నోట్లో పిల్లంగోవులూ, సన్నాయిలూ పెట్టుకుని ఊదుతున్నట్టుంటాయి. వాటిని మధ్యలో చీల్చి చూడవచ్చు. అలా చీల్చినప్పుడు ఆ విగ్రహాల మధ్యలో దేవతాప్రతిమలుంటాయి. అతడు మర్స్యాస్2 లాంటి శాటర్3. నీ ముఖం శాటర్ లాగా ఉంటుందంటే నువ్వు కూడా కాదనలేవు సోక్రటీస్. ఇలాంటి పోలికలు ఇంకా చాలా ఉన్నాయనుకో.’

‘మనుషుల్ని లొంగదీసుకోడంలో నిన్నుమించినవాళ్ళు లేరు. ఈ సంగతి నువ్వొప్పుకోకపోతే, సాక్షుల్ని పట్టుకొస్తాను. నువ్వు పిల్లంగోవి ఊదుతావు కదా. నువ్వు మర్స్యాస్ కన్న అద్భుతమైన గాయకుడివి. అతడు తన శ్వాసబలంతో మనుషుల ఆత్మల్ని మురిపించగలిగేవాడు. అతడి సంగీతాన్ని ఆలపించే గాయకులు ఇప్పటికీ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేయగలరు. ఒలింపస్ మధురగీతాలు4 అతడు నేర్పినవే. ఆ గీతాల్ని గొప్ప విద్వాంసుడు ఆలపించనివ్వండి లేదా అభం శుభం తెలియని పిల్ల5 ఆలపించనివ్వండి, ఎవరు ఆలపించినా వాటి ప్రభావం అద్వితీయమే. అవి దైవగీతాలు. దేవతలగురించీ, దేవతారహస్యాల గురించీ తెలుసుకోవాలనుకునేవారిని పట్టుకుని వారి అంతరంగాల్ని వారికే ఎరుకపర్చగల శక్తి వాటిది. కానీ, నువ్వో, నీకు వేణువు అవసరమే లేదు, వట్టి మాటలతోటే అలాంటి ప్రభావం చూపించగలవు. అతడికీ నీకూ తేడా అది. మేము మరెవరైనా వక్తని విన్నప్పుడు, అతడెంత మంచి వక్తగానీ, అతడి మాటలు మామీద ఎలాంటి ప్రభావం చూపించలేవు. అదే నువ్వయితేనా, నీ మాటలు, నీ సంభాషణాశకలాలు, అవి రెండోమనిషిద్వారా విన్నా కూడా, వాళ్ళు వాటిని సరిగ్గా చెప్పలేకపోయినా కూడా, వాటిని విన్న ప్రతి ఒక్కర్నీ, స్త్రీని, పురుషుణ్ణీ, శిశువునీ అవి సంభ్రమంలో ముంచెత్తుతాయి. నేను మరీ తప్పతాగి మాట్లాడుతున్నానని నువ్వెక్కడ అనుకుంటావో అని భయంగా ఉందిగానీ, లేకపోతే నీ మాటల ప్రభావం నా మీద ఎంత ఉందో మరింత గట్టిగా చెప్పి ఉండేవాణ్ణి. ఎందుకంటే నా హృదయం కోరిబంటియ ఉన్మత్త నర్తకుల6 కన్నా మిన్నగా నాట్యం చేస్తుంటుంది. నీ మాటలు విన్నప్పుడల్లా నా కళ్ళు ఆనందాశ్రువులు వర్షిస్తూనే ఉంటాయి. నాలాగే చాలామంది ఆ మాటలనియెడి మంత్రమహిమకు లోనవుతుంటారని నాకు తెలుసు. నేను పెరిక్లీస్7 ని విన్నాను, మరెందరో గొప్ప వక్తల్ని విన్నాను. వాళ్లని విన్నప్పుడు బాగానే మాట్లాడారనిపిస్తుంది. కాని నిన్ను విన్నప్పుడు కలిగేలాంటి అనుభూతి మాత్రం వారిని విన్నప్పుడు కలగలేదు. వాళ్ళ మాటలు నా ఆత్మని ఉద్రేకించలేదు. అలాగని నేను నీ వాక్సుధకి ఇంతలా బానిసగా మారిపోయానేమిటా అని నా పట్ల నాకెప్పుడూ కోపం కూడా కలగలేదు.’

38

‘ఈ మర్స్యాస్ నన్నెలాంటి స్థితిలోకి నెట్టాడంటే, నేనతడిపట్ల బధిరుణ్ణి కాకపోతే, సైరన్ల8 సంగీతం వినకుండా పారిపోయినట్టు పారిపోగలిగితే తప్ప నేను బతకలేనేమో, నాక్కూడా తక్కినవాళ్ళకి పట్టిన గతే పడుతుందేమో అనిపించేది (సోక్రటీస్, ఇది నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు). ఎందుకంటే అతడు నన్ను నిశ్చలుణ్ణి చేసేస్తాడు. అతడి పాదాల దగ్గర కూచుని ఉండగానే నా వయసు గడిచిపోతుందనిపిస్తుంది.’


వివరణలు

1. సిలనోస్: గ్రీకు పురాణాల్లో సిలనోస్ డయోనిసిస్ కి సహచరుడూ, గురువూ కూడా. కొద్ది వయసుమీదపడ్డట్టు కనబడే అతడి మూర్తిని చూస్తే సోక్రటీస్ ని చూసినట్టే ఉంటుంది.

2.మర్స్యాస్: గ్రీకు పురాణపాత్ర. మన గంధర్వుడి వంటివాడు. సంగీతానికి సంబంధించిన రెండు పురాణగాథల్లో అతడు ముఖ్యపాత్ర. ఒకసారి సాక్షాత్తూ సంగీత అధిదేవత అపోలోనే సంగీతంలో పోటీకి పిలిచాడు.

3. శాటర్. గ్రీకు పురాణాల్లో గంధర్వుల్లాంటివాళ్లు. బండముక్కు, జంతువుల్లాంటి ముఖాలు, సదా నగ్నంగా ఉండే రూపాలు వాళ్లవి. సంగీతాన్ని, మద్యాన్నీ, స్త్రీలనీ, నాట్యాన్నీ ఇష్టపడతారు. సాధారణంగా పచ్చికబయళ్ళలో, అడవుల్లో, కొండల దగ్గరా సంచరిస్తుంటారు.

4. ఒలింపస్: ఫ్రిగియా కి చెందిన సంగీతకర్త. సగం పురాణాలనుంచీ, సగం చరిత్రనుంచీ వచ్చిన పాత్ర. ట్రోజన్ యుద్ధం కంటే ముందటివాడు.

5. అభం శుభం తెలియని పిల్ల: మామూలుగా పానగోష్ఠుల్లో భాగంగా పిల్లంగోవి ఊదే పిల్లల గురించి ప్రస్తావన.

6. కోరిబంటియన్ నర్తకులు: ఫ్రిగియాకి చెందిన ఒక రహస్య క్రతువులకి చెందిన నర్తకగణం. మతిస్తిమితం లేనివారిని స్వస్థపరిచే గుణం ఆ నర్తకుల నాట్యానికి ఉందని నమ్మేవారు.

7. పెరిక్లీస్: అయిదవ శతాబ్దానికి చెందిన గ్రీకు రాజ్యాధినేత. సేనాని. గ్రీకు చరిత్రలో స్వర్ణయుగంతో అతడి పేరుముడివడి ఉంది. త్యూసిడైడ్స్ వంటివాడు అతణ్ణి ఏథెన్సు ప్రథమపౌరుడని కీర్తించాడు.

8. సైరన్లు: గ్రీకు పురాణాల్లో మనుషుల్ని పోలిన, మనుషుల్ని సమ్మోహితుల్ని చెయ్యగల గాయికలు. హోమర్ రాసిన ఓడెస్సీలో ఒడెస్యూస్ తన దేశానికి తిరిగివెళ్తున్నప్పుడు మార్గమధ్యలో సైరన్ల సంగీతం వినబడుతుందనీ, అది చెవినపడితే, నావికులు దారిమర్చిపోతారనీ, కాబట్టి వాళ్ల చెవుల్లో మైనం పెట్టమనీ ఒడెస్యూస్ కి ముందే హెచ్చరిక లభిస్తుంది. అతడు తన నావికుల చెవుల్లో మైనం పెడతాడుగానీ, తాను మాత్రం ఆ గానం వినాలనుకుంటాడు. అందుకని తనని ఆ తెరచాపకొయ్యకి తాళ్ళతో కట్టెయ్యమని చెప్తాడు. అలా ఆ గానం వింటాడుగాని, ఆ తాళ్ళు తెంచుకోకుండా ఉండటం అసాధ్యమనిపించిదని చెప్తాడు ఆ తర్వాత.

Featured image: PC: https://unsplash.com/photos/pA71QLi8Np0

17-10-2023

3 Replies to “ప్రేమగోష్ఠి-10”

  1. సోకికటీసు గురించి మనసులో ఏమీ దాచుకోకుండా చెప్పేమనిషిని ( స్థితి) సత్యమే చెప్పే అల్సిబయడిస్ పాత్రను ఎంచుకోవడం ప్లేటో రచనా కౌశలానికి మచ్చుతునక.

Leave a Reply

%d