
(ఏథెన్సుకి చెందిన అగధాన్ అనే యువకుడు నాటకరచనల పోటీలో తన నాటకానికి బహుమతి వచ్చిన సందర్భంగా ఒక విందు ఏర్పాటు చేసాడు. ఆ విందులో భాగంగా, అక్కడ చేరిన మిత్రులు సోక్రటీస్ తో సహా పానగోష్ఠికి బదులు ప్రేమగోష్ఠి చేపట్టారు. వారిలో ఫేద్రోస్, పౌసనియస్, ఎరిక్సిమేకస్, అరిస్టొఫెనీస్, అగధాన్ ప్రసంగించాక, సోక్రటీస్ ప్రసంగం మొదలయ్యింది. ఆయన తనకు ప్రేమ రహస్యాల్ని మంచినియా కి చెందిన డయోటిమ అనే యోగిని బోధించిందని చెప్తూ ఆమెకీ, తనకీ మధ్య జరిగిన సంభాషణను తిరిగి చెప్తున్నాడు)
కాని విరూపానికీ దైవత్వానికీ మధ్య ఎన్నటికీ పొసగదు. సుందరమైంది మాత్రమే సమరసంగా ఉంటుంది. కాబట్టి ప్రసూతి సౌందర్యం ఒక అధిదేవతగా ఉండి ప్రసవవేళ మంత్రసానిగా పనిచేస్తుంది. బిడ్డను కనడానికి ముందు గర్భం దాల్చినప్పుడు, సౌందర్యదేవత సన్నిధిలో, ఆ గర్భందాల్చే శక్తి అనుకూలంగానూ, వ్యాకోచశీలంగానూ, దయాళువుగానూ ఉండి, గర్భంధరించి సఫలమవుతుంది. అనాకారితనం ఎదట ఆ శక్తి ధుమధుమలాడుతూ ముడుచుకుపోతుంది. చెప్పలేని బాధకు లోనై పక్కకు తప్పుకుపోతుంది. శుష్కించిపోయి గర్భందాల్చడానికి విముఖత చెందుతుంది. గర్భం తాల్చే తరుణం ఆసన్నమైనప్పుడు గర్భిణీ స్త్రీ ప్రకృతి సంపూర్ణతపొంది సౌందర్యంకోసం తహతహలాడుతూ ఒక భావోద్వేగాన్ని పొందటానికి కారణం ఇదే. ఆ సందర్భంలో సౌందర్యదేవత అక్కడ అడుగుపెట్టగానే ప్రసవవేదన ఉపశమిస్తుంది. ఎందుకంటే, సోక్రటీస్, ప్రేమ నువ్వనుకున్నట్టుగా కేవలం సౌందర్యానికి సంబంధించింది మాత్రమే కాదు.’
‘అదేమిటి?’
‘అది సౌందర్యప్రజనానినికీ, ప్రసవానికీ సంబంధించింది’.
‘అవును’ అన్నాను.
‘అవును, అంతే’ అందామె. ‘కాని ప్రజనానికీ, పుట్టుకకీ మాత్రమే ఎందుకు సంబంధించిందై ఉండాలి? ఎందుకంటే ఒక మర్త్యప్రాణికి, నశ్వరజీవికి, ప్రజనననం ఒక శాశ్వతత్వం, ఒక అమరత్వం కాబట్టి. కాబట్టి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ప్రేమ అంటే ఒక శాశ్వత శుభం అనుకునేట్లయితే, మనుషులంతా ఆ శుభంతోపాటు అమరత్వాన్ని కూడా కోరుకుని తీరాలి.’
30
‘అంటే ప్రేమ అమరత్వానికి సంబంధించిందన్నమాట.’
ఆమె ప్రేమ గురించి మాట్లాడినప్పుడల్లా నాకు చెప్పిన విషయమిదే. ఆమె మరోసారి ఈ మాటలు కూడా చెప్పడం గుర్తుంది. ఆమె అంది కదా: ‘సోక్రటీస్, ప్రేమకీ, దాన్ని అనుసరించి వచ్చే కోరికకీ, కారణమేమై ఉండొచ్చంటావు? పశుపక్ష్యాదులూ, మృగాలూ కూడ ప్రత్యుత్పత్తికి పూనుకున్నప్పుడు, ప్రేమ జ్వరం వాటిని తగులుకున్నప్పుడు అవి ఎంత ఆందోళనకి లోనవుతాయో నువ్వు చూడలేదా? పరస్పరం ఏకం కావాలనే కోరికతో మొదలైన ఆ ప్రేమ తమ సంతతిని సంరక్షించుకోవాలనే కోరికదాకా, తమసంతతిలో బలహీనమైనవాటికోసం ఎంత బలవంతుల్నైనా ఎదిరించిపోరాడటం దాకా, అవసరమైతే వాటికోసం మరణించడం దాకా, తమ పిల్లలు మనుగడ సాగించడంకోసం తాము ఆకలితో మగ్గుతూ, నరకయాతన అనుభవించడందాకా- ప్రయాణించడం చూడలేదా? మనిషైతే ఏదో ఒక కారణం చెప్పుకుని అటువంటి కష్టాల్ని స్వీకరిస్తున్నాడని చెప్పవచ్చు. కాని జంతువులకి కూడా అటువంటి ప్రేమావేశం ఎందుకుండాలి? చెప్పగలవా? ఎందుకుండాలి?’.
ఈసారి కూడా నాకు తెలియదనే చెప్పాను.
‘ఈ విషయం తెలీకుండానే నువ్వు ప్రేమశాస్త్రంలో పండితుడివి కావాలని కోరుకుంటున్నావా?’ అనడిగిందామె.
‘నేనింతకుముందే చెప్పాను కదా, డయొటిమా, నాకు ఈ విషయాలు తెలియవు కాబట్టే నేన్నీదగ్గరకు వచ్చానని. నాకు ఈ విషయంలో ఒక గురువు కావాలని స్పష్టంగా తెలుసుకాబట్టే వచ్చాను. కాబట్టి దీనికి కారణం చెప్పు, అలానే తక్కిన ప్రేమరహస్యాలు కూడా తెలియచెయ్యి.’
‘ప్రేమ అమరత్వానికి చెందిందని మనం ఇంతకు ముందు చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి ఆశ్చర్యపోకు. ఇక్కడ కూడా అదే సూత్రం. మర్త్యస్వభావం వీలైనంతవరకూ శాశ్వతాన్నీ, అమరత్వాన్నీ కోరుకుంటూ ఉంటుంది కాబట్టి అది ప్రత్యుత్పత్తి వల్లనే సాధ్యపడుతుంది కాబట్టి, ప్రత్యుత్పత్తి ఎప్పుడూ పాతదాని స్థానంలో కొత్త అస్తిత్వాన్ని ప్రతిష్ఠిస్తూనే ఉంటుంది కాబట్టి. ఆ మాటకొస్తే ఒక్క వ్యక్తి జీవితంలో కూడా కేవలం ఒకే ఒక్క అస్తిత్వం ఉండదు. అస్తిత్వక్షణాల పరంపర ఉంటుంది. మనిషిని మనం అన్ని దశల్లోనూ ఒకే పేరుతో పిలిచినప్పటికీ, అతడి యవ్వనానికీ, వృద్ధాప్యానికీ మధ్య, ప్రతి ఒక్క జంతువూ తన జీవితానికీ, గుర్తింపుకీ మధ్య, సదా ఒక వినష్టాన్నీ, ఒక పునరుద్ధరణనీ అనుభవంలోకి తెచ్చుకుంటూనే ఉంటాడు. అతడి జుత్తు, ఎముకలు, రక్తం, మొత్తం శరీరమంతా కూడా నిత్యం మార్పుకి లోనవుతూనే ఉంటుంది. ఇది కేవలం దేహానికి మాత్రమే చెందిన విషయం కాదు, ఆత్మకి సంబంధించింది కూడా. అలవాట్లు, గుణగణాలు, అభిప్రాయాలు, కోరికలు, సంతోషాలు, దుఃఖాలు, భయాలు మనలో ఏ ఒక్కరిలోనూ కూడా ఎల్లప్పుడూ ఒక్కలానే ఉండవు. అవి సదా వస్తూ, పోతూనే ఉంటాయి. జ్ఞానానికి కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. ఇంకా మనుషులుగా మనకి ఆశ్చర్యం కలిగించేదేమంటే, ఈ పరిజ్ఞానాలన్నీ, అందరికీ సంబంధించి పుట్టి, నశిస్తూండటంతో పాటు, మనలో ప్రతి ఒక్కరం, విడివిడి వ్యక్తులుగా కూడా మన పరిజ్ఞానంలో ఎప్పటికప్పుడు ఈ మార్పుని అనుభూతి చెందుతూనే ఉంటాం.
31
‘మనం గుర్తుతెచ్చుకుంటున్నాం అని అంటూ ఉంటామే, ఆ పునఃస్మరణ అనే మాటలో ఉన్నదేమిటి? మనం ఒకప్పుడు తెలుసుకున్న జ్ఞానం మననుంచి దూరంగా జరిగిపోయిందనేగా, మనం దాన్ని ఎప్పటికప్పుడు మర్చిపోతున్నామనేగా, అలా మర్చిపోయినదాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుంటూ కాపాడుకుంటున్నామనేగా. అది ఎప్పుడూ ఒకలానే ఉంటోందని అనిపించవచ్చుగానీ, నిజానికి దాన్ని మనం మళ్లా కొత్తగా తెలుసుకుంటున్నట్టే. నశించే వస్తువుల్ని మనం పరిరక్షించుకుంటున్నప్పుడు, పారంపర్య సూత్రాల ప్రకారం, ఆ పాతవే ఎల్లప్పటికీ కొనసాగుతాయని లేదు, వాటిని మనం ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూనే ఉంటాం. జీర్ణమైపోయిన ఆ పాతమర్త్యత్వం స్థానంలో, అటువంటిదే, మరొక కొత్త అస్తిత్వం ఉనికిలోకి వస్తూంటుంది. కాని దైవత్వం అలాకాదు. అది ఎప్పటికీ మార్పులేకుండా అద్వితీయంగా నిలిచి ఉంటుంది. కాదా? ఈ పద్ధతిలో సోక్రటీస్, మర్త్యదేహంగానీ, లేదా మరే మర్త్య అస్తిత్వంగానీ ఎంతోకొంత అమరత్వాన్ని సముపార్జించుకుంటుంది. కానీ అసలు అమరత్వం అనేది దీనికన్నా భిన్నం. కాబట్టి, మనుషులు తమ సంతతిపట్ల చూపించే ప్రేమని చూసి మురిసిపోకు. అది అమరత్వంకోసం జీవులన్నిటిలోనూ సార్వత్రికంగా కనవచ్చే ఒక ఆసక్తి మాత్రమే.’
ఆమె మాటలు విని నేను నివ్వెరపోయాను. ‘ఓ వివేకచూడామణీ, ఇదంతా నిజమేనా?’ అనడిగాను.
పరిపూర్ణమైన సోపిస్టుకుండే సాధికారిక స్వరంతో ఆమె ‘ఆ విషయంలో నువ్వు సందేహించనక్కరలేదు సోక్రటీస్, మనుషుల తాలూకు అహమిక, ఆశాపరత్వం చూడు, కాని అదంతా అమరత్వంకోసం, శాశ్వత యశంకోసం వాళ్ళు పడే పాట్లు అని తెలియకపోతే, వాళ్ళ మతిమాలిన చేష్టలు చూసి నువ్వు ఆశ్చర్యపోతూనే ఉంటావు. వాళ్ళు తమ పిల్లలకోసం పడే పాట్లకన్నా మించిన కష్టాలు కూడా కొని తెచ్చుకోడానికి సిద్ధంగా ఉంటారు, ఎటువంటి యమయాతన పడటానికేనా డబ్బు ఖర్చుపెట్టడానికి తయారుగా ఉంటారు, చివరికి చావడానికి కూడా సిద్ధమవుతారు, ఎందుకో తెలుసా, తాము మరణించాక, తమ పేరు శాశ్వతంగా మిగిలిపోవాలని. తమ పేరు జనస్మృతిలో మిగిలిపోతుందని అనుకోకపోతే ఆల్సస్టిస్ అడ్మటస్ కోసం మరణించి ఉండేదా? పెట్రాక్లాస్ కోసం అకిలిస్ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకునేవాడా? అంత దాకా ఎందుకు? మీ కాడ్రస్1 తన పిల్లల కోసం తన రాజ్యాన్ని రక్షించుకోవాలని అనుకుని ఉండేవాడా? లేదు. నాకు బాగా నమ్మకం కుదిరింది. అందరు మనుషులూ అన్ని పనులూ చెయ్యగలరుగానీ, శాశ్వత విలువలకోసం నిలబడ్డారనే పేరు వస్తుందని నమ్మితే మాత్రం వాళ్ళు చెయ్యగల పనులకి హద్దే ఉండదు. వాళ్లు కోరుకునేదొక్కటే, అమరత్వం.’
‘తమ దేహంలో మాత్రమే అమరత్వ కాంక్ష ఉన్నవాళ్ళు స్త్రీలని సమీపించి పిల్లల్ని కంటారు. వాళ్ల ప్రేమ స్వభావం ఇంతే. తమ సంతతిద్వారా తమ స్మృతి నిలిచి ఉంటుందనీ, తమ పిల్లలద్వారా భవిష్యత్తులో తమకి అమరత్వం లభించి తాము ధన్యులు కాగలుగుతామనీ నమ్ముతారు. కాని ఆత్మలో అమరత్వం కోరుకునేవారుంటారు. వాళ్లు దేహంలో కన్నా, ఆత్మలోనే ఎక్కువ సృజనాత్మకంగా ఉంటారు. వాళ్ళు తమ ఆత్మలద్వారా తాల్చడానికి సముచితమైన గర్భమేదో వెతుక్కుని దాన్నే తాలుస్తారు. అటువంటి కానుపులు ఏవైఉండవచ్చు? జ్ఞానమూ, శీలమూనూ. అలా గర్భం దాల్చే వారెవరు? సమస్త కవులూ, సకల కళాకారులూను. నవీన రూపకర్తలని అనిపించుకునేది వారే. అటువంటి జ్ఞానంలో అత్యున్నత జ్ఞానం కుటుంబాల్నీ, రాజ్యాల్నీ చక్కదిద్దడానికి పనికొచ్చే జ్ఞానం. దాన్నే మనం న్యాయమనీ, నిగ్రహమనీ పిలుస్తాం. ఎవరిహృదయాల్లో తమ యవ్వనకాలంలో ఇటువంటి ప్రేమబీజాలు నాటి ఉంటాయో, అందువల్ల ఉత్తేజితులై ఉంటారో, అతడు పరిణత వయస్కుడుకాగానే ఆ కాంక్షాబీజం అంకురించి మొగ్గతొడగడం మొదలుపెడుతుంది. తాను కూడా గర్భందాల్చి నూతన జన్మని ప్రసవించాలనే ఉద్దేశ్యంతో అతడు సౌందరాన్ని వెతుక్కుంటూ బయలుదేరతాడు. సౌందర్యాన్ని మాత్రమే. ఎందుకంటే విరూపంద్వారా అతడేదీ కొత్తగా సృష్టించలేడు. కాబట్టి సహజంగానే అతడు విరూపుల్ని బదులు సురూపుల్నే హృదయానికి హత్తుకుంటాడు. ఆ అన్వేషణలో అతడికి ఏకకాలంలో సుందరుడూ, ఉదాత్తుడూ అయిన మనిషి లభించాడనుకో, ఆ రెండూ ఏకవ్యక్తిలో కనిపించినప్పుడు ఆ మనిషిని అతడు మరింత సంతోషంతో స్వాగతిస్తాడు. ఆ వ్యక్తి సన్నిధిలో అతడి వాక్కులో శీలం, సౌందర్యం ఉప్పొంగి ప్రసరిస్తాయి. ఎటువంటి సదాచరణ ఒక మనిషిని సజ్జనుణ్ణి చేస్తుందో, అటువంటి విద్యాభ్యాసం అతడు మొదలుపెడతాడు. ఆ సౌందర్యానికి తనని తాను అనుసంధానించుకోవడం ద్వారా అతడు ఆ సన్నిధిలో లేనప్పుడు కూడా ఆ సౌందర్యాన్ని గుర్తుపెట్టుకుంటాడు, తద్వారా తన ఆత్మలో సౌందర్యానికి జన్మనిస్తాడు. అప్పుడు వారిద్దరూ కలిసి తాము జన్మనిచ్చిన ఆ సౌందర్యాన్నీ, ఉదాత్తతనీ పెంచిపోషించుకుంటారు. మామూలు మనుషులు మామూలు కలయికలద్వారా కనే సంతతికన్నా వారిద్దరూ కనే సంతతి మరింత సుందరంగానూ, మరింత శాశ్వతంగానూ ఉంటుంది కాబట్టి మామూలు అనుబంధాల కన్నా ఈ అనుబంధం మరింత దగ్గరగానూ, మరింత గాఢంగానూ ఉంటుంది. హోమర్ నీ, హెసియోద్ నీ తలుచుకున్నప్పుడు వారి సంతతిలాంటి సంతతి2 కావాలని అనిపించనిదెవరికి? వారి సంతతిలాంటి సంతతిని కనాలని కోరుకోనివాళ్ళెవరుంటారు? ఎందుకంటే వారి సంతతి వల్లనే కదా వారు ప్రజాస్మృతిలో నిలిచి, శాశ్వత యశోవైభవాన్ని పొందగలిగారు. లేదా స్పార్టానీ, ఆ మాటకొస్తే ఏథెన్స్నీ కూడా రక్షించడానికి లైకాగస్3 వదిలిపెట్టాడే అటువంటి సంతతి కావాలని ఎవరు కోరుకోరు? ఎథీనియన్ శాసనాలకు రూపకర్త అని చెప్పదగ్గ సోలన్4 సంగతే తీసుకోండి, అలాంటివాళ్ళే మరెంతమందో మరెన్నో చోట్ల ఉన్నారు, గ్రీకుల్లోనూ ఉన్నారు, అనాగరికుల్లోనూ ఉన్నారు, ఈ ప్రపంచానికి ఉత్తమకృతుల్ని కానుకచేసినవారు, శీలప్రదాతలు. వారి సంతతి గౌరవార్థం ఎన్నో దేవాలయాలు నిర్మించబడ్డాయి. కానీ మామూలు మర్త్యసంతతికోసం అటువంటి దేవాలయాల్ని ఎవరూ ఎక్కడా నిర్మించినట్టు చూసామా?’
32
‘ఇవన్నీ ప్రేమ తాలూకు మామూలు రహస్యాలు. వీటిని నీ అంతట నువ్వు అర్థం చేసుకోగలవు సోక్రటీస్. కాని వీటన్నిలోనూ మకుటాయమాన మహారహస్యంలోకి సరైన మనఃస్తితితో ప్రయాణిస్తే చేరగలంగాని, దాన్ని నువ్వు అందుకోగలవో లేదో నేను చెప్పలేను. కాని చెప్పడానికి మాత్రం నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వాటిని అర్థం చేసుకోగలవేమో చూడు. ఈ మార్గంలో ప్రయాణించాలనుకున్నవాడు మొదట తన యవ్వనంలో సౌందర్యదర్శనంతో మొదలుపెట్టాలి. అప్పుడు అతడి గురువు మొదటగా ఏదో ఒక్క సుందరాకృతిని ప్రేమించడం నేర్పితే, దాన్నుంచి అతడికి సుందరమైన భావాలు కలగడం మొదలవుతుంది. నెమ్మదిగా అతడికి ఒక ఆకృతిలోని సౌందర్యమూ, మరొక ఆకృతిలోని సౌందర్యమూ కూడా ఒక్కలాంటివే అని తేటపడుతుంది. ఆకృతిసౌందర్యాన్నే గనక అతడు అన్వేషిస్తూన్నట్టయితే అన్ని ఆకృతుల్లోని సౌందర్యం కూడా ఒక్కలాంటిదే అని తెలియకుండా ఎలా ఉంటుంది? ఏదో ఒక్క ఆకృతిసౌందర్యాన్నే సౌందర్యంగా భావించడంలోని హింసనుంచి ఆ మెలకువ అతణ్ణి బయటపడేస్తుంది. అప్పుడతడు అన్ని ఆకృతుల్లోని సౌందర్యాన్నీ ప్రేమించగలుగుతాడు. ఆ తర్వాత దశలో అతడు బాహ్యాకృతుల్లో కనిపించే సౌందర్యం కన్నా ఆ సౌందర్యాన్ని దర్శించగల మనసు మరింత సౌందర్యమయమని గ్రహించగలుగుతాడు.’
‘కాబట్టి శీలవంతమైన ఒక ఆత్మకి ఏ మాత్రం సొగసు ఉన్నా, అతడు దాన్ని ఎంతో ఇష్టంగా పెంచిపోషించుకుని, యువతని సరైన దారిలో పెట్టగల భావాలకు జన్మనివ్వడం మొదలుపెడతాడు. నెమ్మదిగా అతడు సంస్థల్లోనూ, శాసనాల్లోనూ ఉన్న సౌందర్యాన్ని దర్శించి, ఆ సౌందర్యాలన్నీ కూడా ఒకే కుటుంబానికి చెందినవని గ్రహిస్తాడు. వాటితో పోలిస్తే వ్యక్తిసౌందర్యం చాలా అల్పమైన విషయమని అర్థం చేసుకుంటాడు. చట్టాల, సంస్థల సౌందర్యాన్ని గుర్తించిన తరువాత అతడు విజ్ఞాన శాస్త్రాల్లోని సౌందర్యాన్ని చూడడం మొదలుపెడతాడు. ఆ దర్శనం, ఆ ప్రేమ ఒక సంకుచితమనస్కుడు మరొక యువకుడికో, పురుషుడికో, సంస్థకో బానిసగా మారే సేవకుడి ప్రేమలాంటిది కాదు. అది అపారసౌందర్యపారావారాన్ని తన రెండుబాహువుల్తోనూ దగ్గరగా తీసుకునే లాంటి ప్రేమ. అటువంటి ప్రేమలో అతడు ఎన్నో ఉదాత్త, గంభీర సత్యాల్ని కనుగొనగలుగుతాడు. అతడి జ్ఞాన ప్రేమకు ఎల్లలుండవు. ఆ తీరమ్మీదనే అతడు నానాటికీ మరింత వికసించి బలోపేతుడయ్యాక ఒకనాటికి అతడికి విశ్వరూప సాక్షాత్కారం సంభవిస్తుంది: ఒకే ఒక్క విజ్ఞానం, కంటికి కనిపించే ప్రతి ఒక్కదానిలోనూ సౌందర్యాన్ని చూడగలిగే ప్రజ్ఞానం సిద్ధిస్తుంది. దీని గురించే ఇప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను.’
33
‘ఈ విధంగా ప్రేమదీక్ష పొందినవాడు, ఒక క్రమవికాసంలో, పద్ధతిలో సౌందర్యదర్శనం సిద్ధించినవాడు, చివరికి హటాత్తుగా ఒక మహాద్భుత సౌందర్యాన్ని చూడగలుగుతాడు (మన మొత్తం వెతుకులాటకి చివరి గమ్యం ఇదే సోక్రటీస్)- ఆ సౌందర్యం ఎటువంటిదంటే, అన్నిటికన్నా ముందు, అది శాశ్వతం, అమరం. దానికి వికాసం, వినాశం రెండూ లేవు, పొంగడం, కుంగడం రెండూ తెలియదు. రెండోది, అది ఒక దృక్పథంలోంచి చూస్తే గొప్పదిగానూ, మరొక దృక్పథంలోంచి చూస్తే నీచంగానూ కనిపించేది కాదు. లేదా ఏదో ఒకచోట, ఏదో ఒకసారి, లేదా ఏదో ఒకదానికి సంబంధించి సవ్యంగానూ, మరొకసారి, మరొకచోట, మరొకరివిషయంలో అపసవ్యంగానూ కనిపించేది కాదు. అది కొందరికి ఉన్నతంగానూ, మరొకరికి అధమంగానూ గోచరించేది కాదు, ఏదో ఒక ముఖాన్నో, కరచరణ్యాదవయవాల్నో లేదా ఏదో ఒక శరీరభాగాన్నో పోలి ఉండేది కాదు, లేదా అది ఏదో ఒక్కలానో, లేదా జ్ఞానంలోనో, లేదా ఎవరిఒకరిలో ఉన్నదిగానో, అంటే ఒక జంతువులోనో లేదా స్వర్గంలోనో లేదా భూమ్మీదనో లేదా మరెక్కణ్ణో ఉండేది కాదు. ఆ సౌందర్యం నిరపేక్షం, ప్రత్యేకం, సరళం, శాశ్వతం, హెచ్చుతగ్గులేనిది, మార్పులేనిది, పైగా ఈ ప్రపంచంలో వికసిస్తున్న, కృశిస్తున్న సకల సౌందర్యాలకూ అదే ఆధారభూతమైంది5. నిజమైన ప్రేమ ప్రభావంలో తన శిఖరారోహణ మొదలుపెట్టినవాడు, ఆ సౌందర్యాన్ని చూడటం మొదలుపెట్టినవాడు, గమ్యానికి ఎంతో దూరంలో లేడు. ఆ ప్రయాణం, ప్రేమసామ్రాజ్యం వైపు ఒకరి మార్గదర్శనంలో జరిగే ఆ ప్రయాణం, సాధారణ పార్థివ సౌందర్యంతోటే మొదలై నెమ్మదిగా దాన్ని మించిన మరొక సౌందర్యంకోసం ఆరోహణగా కొనసాగుతుంది. ఆ ఆరోహణలో ఇవి మెట్లు మాత్రమే. ఒకటినుంచి రెంటికి, రెండునుంచి సమస్త సౌందర్యాలకూ, సౌందర్య ఆకృతులనుంచి సౌందర్యోపేతమైన జీవనవిధానానికీ, సౌందర్యభరితమైన ఆచరణనుంచి సౌందర్యోపేతమైన అభిప్రాయాలకూ, సౌందర్యభరిత భావాలనుంచి అప్రమేయసౌందర్యదర్శనానికీ కొనసాగి అంతిమంగా, సౌందర్యసారాంశమేమిటో తెలుసుకోవడంతో ముగుస్తుంది. ఇదీ సోక్రటీస్, తక్కినవాటన్నిటినీ పక్కనపెట్టి మనిషి జీవించవలసిన జీవితం. ఆ అప్రమేయ సౌందర్యధ్యానంలో గడపడం. ఒకసారి ఆ సౌందర్యాన్ని నువ్వు చూడగలిగావా, ఇంక బంగారం, వస్త్రాలు వేటిమీదా నీ దృష్టి లగ్నం కాదు. ఇప్పుడు నిన్ను ఆకర్షిస్తున్న అందమైన యువతీయువకులు అప్పుడు నిన్ను ఆకర్షించడం మానేస్తారు. ఇప్పుడు నీగ్గాని మరెవరికైనాగానీ వాళ్లని చూస్తేనే తృప్తి కలుగుతుంటుంది. వీలైతే వాళ్లతో సంభాషిస్తే చాలనిపిస్తుంది, మద్యమాంసాలు అక్కర్లేని ఆ సమావేశాల్లో మీరు కేవలం అక్కడ ఉండగలిగితే చాలు, వాళ్లని చూస్తూ కూచోగలిగితే చాలనిపిస్తున్నది, కాని ఆ యథార్థసౌందర్యాన్ని చూడటానికి కళ్ళుండాలేగాని, ఆ దివ్యసౌందర్యం, ఆ నిర్మల, స్ఫటికస్వచ్ఛసౌందర్యం- మర్త్యత్వపు మాలిన్యాలంటని, మానవజీవితపు వన్నెచిన్నెలు, హంగుపొంగులు దరిచేరలేని ఆ సౌందర్యాన్ని చూడటానికి నోచుకోగలిగితే, సదా ఆ సరళ, సత్య, దివ్యసౌందర్యంతోటే సంభాషిస్తో ఉండిపోగలిగితే!’
34
‘అటువంటి దివ్యయోగంలో, మనోనేత్రంతో ఆ సౌందర్యాన్ని సంభావిస్తో, అతడు సౌందర్యాకృతుల్ని కాక, సౌందర్య సత్యాల్ని సృజించగలిగే సామర్థ్యానికి చేరుకుంటాడు (ఎందుకంటే, అతడికింక ఆకృతితో పనిలేదు, యథార్థాన్నే అతడు దర్శించాడు కాబట్టి). దేవుడికి స్నేహితుడిగా మారే క్రమంలో అమరుడయ్యే ప్రస్థానంలో, నిజమైన విలువల్ని పెంచిపోషించగలవాడు మర్త్యుడయితే మాత్రమేమి? ఆ జీవితమేమన్నా తక్కువపాటి జీవితమా?’
వివరణలు
1.కాడ్రస్: ఏథెన్సుని పరిపాలించాడని చెప్పుకునే ఒక పురాణపాత్ర. ఒక శత్రువు తనమీద చేసే దాడిని తాను తట్టుకుని బతికితే ఏథెన్సు పరపాలనలోకి పోతుందని ఒక భవిష్యవాణి చెప్పడంతో, ఏథెన్సు క్షేమం కోసం, తన సంతతి మాత్రమే ఏథెన్సు పాలకులుగా కొనసాగడం కోసం అతడు ఐచ్ఛికంగా మరణించాడు.
2. హోమర్, హెసియోద్ ల సంతతి: అంటే వాళ్ళు రాసిన ఇతిహాసాలూ, కావ్యాలూనూ.
3. లైకాగస్: స్పార్టాకు రాజ్యాంగాన్నీ, శాసనాల్నీ రూపొందించాడని భావించే ఒక పురాణచక్రవర్తి. అతడి శాసనాలు మొత్తం గ్రీసుకే మేలు చేసాయికాబట్టి, ఏథెన్సుని డయొటిమా ప్రస్తావించింది.
4. సోలన్: ఏథెన్స్ కి చెందిన పూర్వ శాసనకర్త, సంఘసంస్కర్త, కవి. అతడి పేరుమీద అథీనియన్ శాసనాల్ని సోలన్ శాసనాలని వ్యవహరిస్తారు.
5. ఈ అద్భుతమైన దర్శనాన్ని మాండూక్య ఉపనిషత్తులోని ఈ దర్శనంతో పోల్చుకోకుండా ఉండలేకపోతున్నాను.
నాన్తః ప్రజ్ఞం న బహిః ప్రజ్ఞః నోభయతః ప్రజ్ఞ న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞమ్ నా ప్రజ్ఞమ్
అదృష్టమ్ అవ్యవహార్యమ్ అగ్రాహ్యమ్ అలక్షణమ్ అచిన్త్యమ్ అవ్యపదేశ్యమ్
ఏకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యన్తే స ఆత్మా సి విజ్ఞేయః ||7||
(అది అంతఃప్రజ్ఞ కాదు. బహిః ప్రజ్ఞ కాదు. రెండూ కలిసిన ప్రజ్ఞ కూడా కాదు. అది ప్రజ్ఞానఘనమూ కాదు. ప్రజ్ఞాకాదు, అప్రజ్ఞా కాదు. కనిపించేదికాదు, పనుల్తో గుర్తుపట్టగలిగేది కాదు, అసలు గ్రహించగలిగేదీ కాదు, దాన్ని కనుక్కోడానికి గుర్తులుండేదీ కాదు. ఆలోచిస్తే అర్థమయ్యేది కాదు, ఫలానా అని పేరుపెట్టగలిగేది కాదు, ఒకే ఒక్క సత్యాన్ని గ్రహించినప్పుడు తెలిసే సారాంశం అది. అక్కడ ప్రపంచం సద్దుమణిగిపోతుంది. అది శాంతం, శివం, రెండుకానిది. ఆ నాలుగవ స్థితినే ఆత్మ అని తెలుసుకో)
https://unsplash.com/photos/nNEQpPZF8Ko
Featured image: PC:16-10-2023
చాలా గొప్ప గా వివరిస్తున్నారు..గందరగోళం లేకుండా..
ధన్యవాదాలు సార్
ప్రేమగోష్ఠిలో ఇది మకుటాయమానం.ప్రేమ పరాకాష్ట. శాశ్వత సౌందర్యం , ఇదే కదా బ్రహ్మానందం. ఋషులు చెప్పినా తత్త్వవేత్తలు వివరించినా అంతిమ పరమపదం అదే . కానీ
సోక్రటీసుకు డయోటిమా వివరించిన తీరు
అద్వితీయం. కేవలం రెండు ఆత్మల సంయోజనం
జ్ఞానోత్పత్తికి మూలం అన్న ప్రతిపాదన ఎంత గొప్పగా ఉందంటే జీవితాన్ని ప్రయోగానికి పణంగా పెట్టుకున్నవారికి అది ఆత్మానుభవమౌతుంది.
ధన్యవాదాలు సార్