ప్రేమగోష్ఠి-8

మన అభిప్రాయం దేన్నైనా హేతుబద్ధంగా వివరించలేకపోతే దాన్ని జ్ఞానం అనం. (హేతువు తెలియనిది జ్ఞానమెలా అవుతుంది?) అలాగే అజ్ఞానం కూడా. ఎందుకంటే అజ్ఞానం సత్యాన్నెప్పటికీ అందుకోలేదు. సరైన అభిప్రాయం అజ్ఞానానికీ, జ్ఞానానికీ మధ్యస్థంగా ఉండేది.

‘నిజమే’ అన్నాన్నేను.

‘కాబట్టి సవ్యంగాలేనంతమాత్రాన దాన్ని అపసవ్యం అనకు, మంచిది కాకపోతే చెడు అనకు, ప్రేమ అందమైందీ, మంచిదీ కాదుకాబట్టి అతడు అనాకారీ, దుష్టుడూ అని తొందరపడి నిర్ణయించకు. అతడు ఆ రెండింటికీ మధ్యస్థుడు.’

‘కాని ప్రేమ గొప్ప దేవత అని అందరూ ఒప్పుకున్నదే కద.’

‘ఎవరు అలా ఒప్పుకున్నవాళ్ళు? తెలిసినవాళ్ళా? తెలియనివాళ్లా?’

‘అందరూను’

ఆమె చిరునవ్వింది. ‘సోక్రటీస్, అసలు ప్రేమని ఒక దేవత అనే ఒప్పుకోనివాళ్ళు అతణ్ణి గొప్ప దేవత అని ఎలా అనగలుగుతారు?’

‘వాళ్ళెవరు’ అనడిగాను.

‘వాళ్ళల్లో నువ్వూ, నేనూ ఇద్దరమూ ఉన్నాం’ అందామె.

‘అదెలా’ అనడిగాను.

‘అర్థమవుతూనే ఉంది కదా. దేవతలు సుందరంగానూ, సంతోషంగానూ ఉంటారని నువ్వు ఒప్పుకుంటావు కదా. అటువంటప్పుడు ఏ దేవతైనా అందంగా లేడనీ, ఆనందంగా ఉండడనీ అనగలవా?’.

‘ఎప్పటికీ అనలేను ‘అని జవాబిచ్చాను.

‘ఎవరేనా ఆనందంగా ఉంటారని నువ్వంటున్నప్పుడు వారిదగ్గర మంచితనం, సంతోషం ఉన్నాయనే కదా అర్థం’.

‘అవును’.

‘కాని నువ్వే కదా అన్నావు, ప్రేమదేవత దగ్గర సంతోషం, సౌందర్యం కొరవడినందువల్లనే ఆయన వాటికోసం అన్వేషిస్తున్నాడని?’

‘అవును’ అన్నాను.

‘అలా అయితే తనలో సంతోషమో, సౌందర్యమో కొరవడినవాడు దేవత ఎలా అవుతాడు?’

‘అసంభవం’.

‘అయితే ప్రేమకు దైవత్వం లేదని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావన్నమాట’.

‘అలాగైతే మరి ప్రేమ ఎవరు’ అనడిగాను. ‘అతడు మర్త్యుడా?’

‘కాదు’.

‘మరెవరు?’

‘నేనింతకుముందు చెప్పినట్టుగా అతడు మర్త్యుడూ కాడు, అమర్త్యుడూ కాడు. ఆ రెండింటికీ మధ్యస్థంగా ఉండేవాడు’.

‘అయితే అతడెవరంటావు డయొటిమా?’

‘ అతడొక స్ఫూర్తి, ఒక భావన, ఒక దివ్యశక్తి. తక్కిన దివ్యశక్తులందరిలానే అతడు కూడా మర్త్యులకీ, అమర్త్యులకీ మధ్య ఒక రాయబారి.’

‘అతడి శక్తిసామర్థ్యాలేమిటి?’

‘అతడు మనుషులకీ, దేవతలకీ మధ్య ద్విభాషి. మనుషుల ప్రార్థనల్నీ, సమర్పణల్నీ దేవతలకు అందచేస్తాడు. వాటికి దేవతలు ఏమని బదులిచ్చారో, ఏ ఆదేశాలు సెలవిచ్చారో వాటిని మనుషులకు తీసుకొస్తాడు. బృందారకలోకాన్నుంచి నరసమూహాన్ని వేరుచేసే అగాధాన్ని కలిపే వంతెన అతడు, మధ్యవర్తి. కాబట్టి అతడిలో ఆ ఇరులోకాలూ కలిసే ఉంటాయి. అతడి ద్వారానే ప్రవక్తలూ, పూజారులూ తమ కార్యకలాపం నెరవేర్చగలుగుతారు. వారి వారి ఆహుతులు, తంత్రాలు, వశీకరణలూ, అన్ని రకాల భవిష్యవాణులు, మంత్రోచ్చాటనలు అతడి ద్వారానే దారి చేసుకుంటాయి. దేవుడెప్పటికీ నేరుగా మనుషుల్తో కలవడు. భగవంతుడికీ, మనిషికీ మధ్య జరిగే సంభాషణలన్నీ ప్రేమ ద్వారానే జరుగుతాయి. నిద్రలోనూ, మెలకువలోనూ కూడా ఆ సంభాషణ కొనసాగుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న జ్ఞానం ఆధ్యాత్మికం అవుతుంది. తక్కిన పరిజ్ఞానాలన్నీ అంటే కళలూ, చేతికళలూ లాంటివన్నీ, సాధారణం, లౌకికం అని చెప్పవలసి ఉంటుంది. ఇలా దేవతలకీ, మనుషులకీ మధ్య రాయబారులుగా ఉండే శక్తులెన్నో ఉన్నాయి. వాటిలో ప్రేమ కూడా ఒకటి’.

‘అయితే మరి అతడి తల్లిదండ్రులెవరు’ అనడిగాను.

‘ఆ కథ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది’ అందామె. ‘అయినా చెప్తాను. విను. ఒకసారి ఆఫ్రొడైట్ పుట్టినరోజు నాడు దేవతలకి విందు ఏర్పాటు చేసారు. ఆ విందుకి వచ్చినవారిలో పొరోస్ లేదా కలిమి అనే దేవత కూడా ఉన్నాడు.  మెటిస్ లేదా విచక్షణకి పుట్టినవాడతడు. ఆ విందుముగిసేక పెనియా లేదా లేమి అనే ఆమె మామూలుగా అలాంటి సందర్భాల్లో కనిపించేటట్టే గుమ్మం దగ్గర అడుక్కుంటూ నిలబడింది. ఈలోపు కలిమి దేవత  అమృతం సేవించినందువల్ల మత్తెక్కి (ఆ రోజుల్లో మధువు ఉండేది కాదు) సర్వేశ్వరుడైన జ్యూస్ ఉద్యానవనంలోకి వెళ్ళి అక్కడే నిద్రపోయాడు. లేమి తన గడ్డుపరిస్థితిని తలుచుకుని కలిమి వల్ల ఒక బిడ్డని కనాలని పన్నాగం పన్ని, అతడి పక్కన పోయి పడుకుని ప్రేమని కన్నది. ఆఫ్రొడైట్ మహాసౌందర్యవతికాబట్టి, ప్రేమ ఆమె పుట్టినరోజు నాడు పుట్టాడు కాబట్టి, సహజంగానే ప్రేమ కూడా  సౌందర్యారాధకుడు కాబట్టి అతడు ఆఫ్రోడైటుకు అనుచరుడుగా, పరిచారకుడిగా మారాడు. అతడి తల్లిదండ్రుల్లానే అతడి భాగ్యం కూడా నిమ్నోన్నతాలతో కూడుకుంది. మొదటిదేమంటే అతడెప్పుడూ పేదవాడిగానే ఉంటాడు. అందరూ అనుకునేట్టుగా అతడు సుకోమలుడూ, సుందరుడూ కాడు. మొరటుగానూ, మురిగ్గానూ ఉంటాడు. కాళ్లకి చెప్పులుండవు. తలదాచుకోడానికి ఇల్లుండదు. ఆరుబయట ఆకాశం కింద కటికనేలమీదా, వీథుల్లోనూ, ఇంటిగడపలదగ్గరా పోయిపడిఉంటాడు. తన తల్లిలాగానే తాను కూడా సదా వేదనలో కూరుకుపోయి కనిపిస్తాడు. అతడిలో తండ్రి పోలికలు కూడా లేకపోలేదు. కాబట్టి ఎప్పుడూ సుందరమైనవాళ్లమీదా, సంతోషంగా ఉండేవాళ్లమీదా ఒక కన్నేసి ఉంటాడు. సాహసుడు, చురుకైనవాడు, బలాఢ్యుడు, గొప్ప వేటగాడు, ఎప్పుడూ ఏదో ఒక తంత్రం పన్నుతూనే ఉంటాడు. జ్ఞానాన్వేషి, సారవంతుడు, సదా తాత్త్వికుడు, భయంకరమైన వశీకరణవేత్త, మాంత్రికుడు, వాక్చతురుడు.  స్వభావరీత్యా అతడు మనిషీ కాడు, అమరుడూ కాడు. కాని సదా సజీవుడు, తాను పుష్కలంగా ఉన్నప్పుడు వికసిస్తూ ఉంటాడు, మరొక క్షణం మృతుడై పడి ఉంటాడు, మళ్ళా మరుక్షణమే, అతడి తండ్రి స్వభావాన్ని అనుసరించి, సజీవుడై పైకి లేస్తాడు. ఎప్పటికీ లోపలకి వచ్చిపడుతున్నది అంతే వేగంగా బయటకి ప్రవహిస్తూ పోతుంటుంది కాబట్టి అతడెప్పుడూ లేమిలోనూ ఉండడు, అలానే కలిమిలోనూ ఉండడు. శూన్యతకూ, సంపదకూ, అజ్ఞానానికీ, జ్ఞానానికీ మధ్యస్థుడు అతడు. ఈ మొత్తం సంగతిలో సత్యమంటూ ఉంటే అది ఇది: ఏ దేవత కూడా ఋషి కావాలనో, దార్శనికుడు కావాలనో ఆరాటపడడు. ఎందుకంటే, అతడప్పటికే ఒక ఋషి కాబట్టి. అలాగే జ్ఞాని అయిన ఏ ఒక్క మనిషి కూడా తిరిగి మళ్లా జ్ఞానాన్ని అభిలషించడు. అలాగే అజ్ఞాని కూడా జ్ఞానం కోసం ఆరాటం చెందడు.’

27

‘అజ్ఞానంలో చెడుగు ఉందని ఇక్కడే మనం గమనించాలి. ఎవరైతే సజ్జనుడూ, వివేకీ కాడో అతడు సహజంగానే తనపట్ల తాను చాలా సంతృప్తిగా ఉంటాడు. తనకేదో లేదని అతడు అనుకోవడంలేదుకాబట్టి దానికోసం అతడికి కొత్తగా ఏ ఆరాటమూ కలగదు. ‘అలా అయితే డయొటిమా,  వాళ్ళు జ్ఞానులూ, అజ్ఞానులూ రెండూ కాకపోతే, మరి జ్ఞానాన్వేషులెవరు?’ ‘ఇది చిన్నపిల్లవాడు కూడా జవాబివ్వగల ప్రశ్న. జ్ఞానులకీ, అజ్ఞానులకీ మధ్యస్థంగా ఉండేవాళ్ళు కొందరుంటారు. ప్రేమ కూడా వాళ్ళల్లో ఒకడు. జ్ఞానం అత్యంత మనోహరం. ప్రేమ ఒక సౌందర్యపిపాసి. కాబట్టి ప్రేమ కూడా ఒక తత్త్వవేత్తనే, జ్ఞానప్రేమినే. కాబట్టి జ్ఞానప్రేమిగా ఉండటమంటే జ్ఞానానికీ, అజ్ఞానానికీ మధ్యస్థంగా ఉండటం. అతడి పుట్టుకకి కూడా ఇదే కారణం. ఒకవైపు అతడి తండ్రి కలిగినవాడు, విజ్ఞాని. మరొకవైపు అతడి తల్లి లేమీ, అజ్ఞానీనూ. ప్రేమ స్వభావం ఇటువంటిది సోక్రటీస్. అతడి గురించి నువ్వు ఊహించడంలో పొరపాట్లు దొర్లడం సహజం. ఈ పొరపాటుకి కారణం ప్రేమికుడికీ, అతడు ప్రేమిస్తున్నవాడికీ మధ్య నువ్వు పొరపడటం. అది చూసి నువ్వు ప్రేమంటే మహాసౌందర్యం అనుకున్నావు. ప్రేమించబడే వాడు నిజంగానే అందగాడు, లలితుడు, సంపూర్ణుడూ, ధన్యుడూను. కాని ప్రేమసూత్రం స్వభావరీత్యా వేరే. అది నేనిప్పటిదాకా వర్ణించానే అలానే ఉంటుంది.’

‘ఓ విచిత్ర వనితా! నీ మాటలు వినడానికి చాలా బావున్నాయి. కాని ప్రేమంటే నువ్వు చెప్పిందే అనుకో, అటువంటి ప్రేమవల్ల మనుషులకేమి ఉపయోగం?’ అనడిగాను.

‘అది కూడా వివరిస్తాను సోక్రటీస్. ఇప్పటిదాకా ప్రేమ ప్రాదుర్భావం గురించి చెప్పాను.  ప్రేమ ఒక సౌందర్యదాహం అని నువ్వు కూడా ఒప్పుకున్నావు. కాని ఎవరేనా అడగొచ్చు: సౌందర్యదాహం, నిజమే, కాని ఎవరి సౌందర్యం పట్ల? సోక్రటీసులోనా, లేక డయొటిమాలోనా? లేదా మరోలా అడగాలంటే, ఒక మనిషి అందాన్ని ప్రేమిస్తున్నప్పుడు, అతడు కోరుకుంటున్నదేమిటి?’

‘ఆ అందం తన స్వంతం కావాలని’ అని అన్నాను.

‘ఆ జవాబు వింటే మరో ప్రశ్న అడగాలనిపిస్తుంది. అందం స్వంతమైతే కలిగిదేమిటి?’

నువ్వడిగిన ప్రశ్నకు నా దగ్గర జవాబు సిద్ధంగా లేదన్నాను.

‘అయితే ఒక పనిచేస్తాను. అందం అనే పదం స్థానంలో మంచితనం అనే మాట పెట్టి, ఆ ప్రశ్న మరోసారి అడుగుతాను: ఎవరేనా మంచిని ప్రేమిస్తుంటే అతడేమి కోరుకుంటున్నట్టు?’

‘మంచివాడు కావాలని’.

‘మంచివాడైతే ఏం లాభం?’

‘సంతోషం’ అని జవాబిచ్చేను. ‘ఈ ప్రశ్నకు జవాబివ్వడం కొంత సులభంగా ఉంది నా అని కూడా అన్నాను.

28

‘అవును. ఒకరు సంతోషంగా ఉన్నారంటే కారణం వాళ్ళు మంచివాటిని పొందడం వల్ల సంతోషంగా ఉన్నారని. అలాగే ఒక మనిషి సంతోషాన్ని ఎందుకు కోరుకుంటాడని అడగడంలో అర్థం లేదు. అది అంతిమ సమాధానం కాబట్టి’.

‘నువ్వు చెప్పింది సబబే’ అని అన్నాను. 

‘అయితే ఈ కోరిక మనుషులందరికీ సమానమేనా? మనుషులంతా ఎల్లప్పుడూ తమ సంతోషాన్ని కోరుకుంటూనే ఉంటారా లేకపోతే కొంతమంది మాత్రమే కోరుకుంటూ ఉంటారా?’

‘మనుషులంతా. ఈ కోరిక అందరికీ సమానమే’ అన్నాన్నేను.

‘మరి అలాంటప్పుడు సోక్రటీస్. ఎందుకని మనుషులంతా ప్రేమికులు కావట్లేదు? వాళ్ళల్లో కొందరు మాత్రమే ప్రేమిస్తుంటారు? నువ్వేమో మనుషులంతా ఎల్లప్పుడూ ఒకటే కోరుకుంటారని అంటున్నావు?’

‘అవును. ఆలోచిస్తే నాక్కూడా ఇది ఆశ్చర్యంగానే ఉంది’ అన్నాను.

‘కాని ఇందులో ఆశ్చర్యపోడానికి ఏమీ లేదు. ఎందుకంటే మొత్తంలోంచి విడివడ్డ ఒక భాగాన్ని మాత్రమే మనం ప్రేమ అని పిలుస్తున్నాం, తక్కిన భాగాలకి రకరకాల పేర్లున్నాయి.’

‘ఏదీ ఒక ఉదాహరణ చెప్పు’ అనడిగాను.

ఆమె ఇలా చెప్పుకొచ్చింది. ‘ఉదాహరణకి కవిత్వం సంగతే చూడు. అది చాలా సంక్లిష్టంగా, పరిపరివిధాలుగా ఉంటుంది. సృష్టి మొత్తం, లేదా మరోలా చెప్పాలంటే, అనస్తిత్వం అస్తిత్వంలోకి చేసే ప్రయాణమే కవిత్వం లేదా సృజన1. సమస్త కళాప్రక్రియలూ సృజనాత్మకాలు. కళాకారులంతా కవులు లేదా సృజనకారులు.’

‘నిజమే’

‘కానీ వాళ్లందరినీ మనం కవులని పిలవం. వాళ్ళకి రకరకాల పేర్లున్నాయి. అయితే ఆ సృజనాత్మక కార్యకలాపంలో ఒక భాగాన్ని మాత్రమే, ఛందస్సుతోనూ, సంగీతంతోనూ ముడిపడి ఉన్నదాన్ని మాత్రమే కవిత్వం అని అంటున్నాం. అటువంటి కవిత్వానికి సంబంధించినవాళ్ళని మాత్రమే కవులని పిలుస్తున్నాం’.

‘భేషైన మాట’ అని అన్నాను.

‘ప్రేమకి కూడా ఇదే వర్తిస్తుంది. మంచినీ, సంతోషాన్నీ కోరుకునే కాంక్షనే ప్రేమతాలూకు మహిమోపేతసూక్ష్మశక్తి అని అంటున్నాం. కాని అతణ్ణి వేరే మార్గాల ద్వారా అంటే డబ్బు సంపాదించుకోవడంద్వారానో లేదా క్రీడామైదానంద్వారానో లేదా తత్త్వవివేచన ద్వారానో చేరుకోవాలని చూసేవాళ్లని ప్రేమికులని అనటం లేదు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో అనురాగం ద్వారా వ్యక్తమయ్యేదాన్ని మాత్రమే ప్రేమ అని పిలవడానికి అలవాటు పడ్డాం. అటువంటి ప్రేమ చూపించేవాళ్లనే ప్రేమికులని అంటున్నాం.’

‘నువ్వు చెప్తున్నది బాగానే ఉంది అనడానికి నాకు సంకోచం లేదు’అన్నాను.

‘ప్రేమికులు తమ అర్థభాగం కోసం వెతుక్కుంటూ ఉంటారని మనుషులు చెప్పగా వినే ఉంటావు. కాని ఆ అర్థభాగం స్వతహాగా మంచిది కాకపోతే  వాళ్ళు ఏ అర్థభాగంకోసంగాని, పూర్తిభాగం కోసం గాని వెతుక్కునే ప్రసక్తిలేదంటాను. తమ చేతుల్లో దోషముంటే వాళ్ళు తమ చేతుల్నే నరికి పక్కన పారేసుకోగలరు. తమది కానిదేదీ వాళ్ళు ప్రేమించలేరుగనక. తమకి సంబంధించిందంతా మంచిదీ, తమది కానిదంతా చెడ్డదీ అని ఎవరేనా అంటే మాత్రం చెప్పలేను.’

29

‘మనుషులు మంచిగా ఉండేదాన్ని తప్ప మరొకదాన్ని ప్రేమించడం అసాధ్యం. అటువంటిదేదన్నా ఉందా?’

‘అటువంటిదేదీ లేదన్నది నిశ్చయం’.

‘అయితే, మన సమాధానం చాలా సులభం, సరళం. మనుషులు మంచిని ప్రేమిస్తారు’.

‘అవును’ అన్నాను.

‘మంచిని పొందడాన్ని కూడా ప్రేమిస్తారని అనవచ్చునా?’

‘అనొచ్చును’.

‘కేవలం పొందడాన్ని మాత్రమే కాదు, మంచితనాన్ని శాశ్వతంగా కలిగి ఉండటాన్ని కూడా ప్రేమఅని అనవచ్చునా?’

‘అనవచ్చును’.

‘అయితే ప్రేమ అంటే మంచితనాన్ని శాశ్వతంగా కలిగి ఉండటమే అని నిర్వచించవచ్చునా?’

‘అవును, సత్యమే’.

‘ప్రేమ స్వభావం ఇటువంటిదైనప్పుడు ఆ ప్రేమాన్వేషణ ఎటువంటిదై ఉంటుంది? ప్రేమపేరిట మనుషులు చూపించే ఈ వేడీ, ఈ ఆరాటమూ చూపిస్తున్నప్పుడు మనుషులు నిజంగా ఏం చేస్తున్నాట్టు? వాళ్ళ దృష్టి దేనిమీద ఉందంటావు? జవాబు చెప్పు.’

‘ఏమో, డయొటిమా, నాకే గనుక ఇదంతా తెలిస్తే, నేను నిన్నిట్లా నోరువెళ్ళబెట్టుకుని చూస్తూ ఉండేవాణ్ణే కాను, ఈ విషయం నీనుంచి తెలుసుకోడానికి ఇంతదూరం వచ్చి ఉండేవాణ్ణే కాను’ అన్నాను.

‘సరే, నేనే చెప్తాను. వాళ్ళు అలా ఆరాటపడుతున్నప్పుడు వాళ్ళ దృష్టి సౌందర్యసృష్టి మీద ఉంటున్నది, అది దేహంలో గానీ, ఆత్మలోగానీ.’

‘నాకు అర్థం కావడంలేదు, ఈ దివ్యవాణికి మరికొంత వివరణ కావాలి.’

‘నా ఉద్దేశ్యం మరింత వివరించనివ్వు. నేనేం చెప్తున్నానంటే మనుషులు ప్రేమ పేరిట ఆరాటపడుతున్నప్పుడు తమ దేహాల్లోనూ, మనసుల్లోనూ సౌందర్యాన్ని పుట్టిస్తున్నారు. మానవప్రకృతి ప్రకారం ఒక వయసులో ప్రత్యుత్పత్తి కోసం కోరిక ఉంటుంది. అది కూడా సరూపంకోసం మాత్రమే, విరూపంకోసం కాదు. ఈ ప్రత్యుత్పత్తి కార్యకలాపమే స్త్రీపురుష సంయోగం, ఇదొక దైవీప్రక్రియ. తమ సంతతిని సంభావించడం, సంతతి సంభవం ఇవి మర్త్యప్రాణిలోని అమర్త్య నియమాలు. ఇది ప్రకృతి లోని అంతర్గత లయ, ఒక ఋతం. ఈ ఋతానికి విరుద్ధంగా వారెన్నటికీ నడుచుకోలేరు.


వివరణలు

1 గ్రీకు భాషలో poiesis అంటే అర్థం తయారుచేయడం, రూపొందించడం అని. మనం అల్లసానివాని అల్లిక జిగిబిగి అన్నట్టుగా అల్లిక. అలాగే ఒక కళ కూడా.


Featured image: A section of the Parthenon Marble frieze, c. 447-438 BC; Wikimedia Commons

15-10-2023

5 Replies to “ప్రేమగోష్ఠి-8”

  1. సత్యాన్వేషణ ఎంత చిత్రం ? ప్రసంగించిన అందరి మాటలు సబబే అనిపిస్తుంటాయి తత్త్వవిఒశ్లేషణ జరిగిన కొద్దీ స్పష్టత పెరుగుతుంది. Logic is a magic.

Leave a Reply

%d