
(ఏథెన్సుకి చెందిన అగధాన్ ఇచ్చిన విందులో సోక్రటీస్ తో పాటు మరికొందరు మిత్రులు కూచుని ప్రేమగురించి మాట్లాడుకున్న విశేషాలు అరిస్టొడెమస్ అన్నవాడిద్వారా విన్న అపొల్లోడోరస్ గ్లాకెన్ అనేవాడికి చెప్తున్నాడు. ఆ గోష్టిలో ముందు ఫేద్రోస్, ఆ తర్వాత పౌసనియస్, ఎరిక్సిమేకస్, అరిస్టొఫెనీస్ ప్రసంగించారు. ఆ తర్వాత అగధాన్ ఉత్తేజకరంగా ప్రసంగిస్తున్నాడు.)
మనుషుల్లో ప్రేమరాహిత్యాన్ని తొలగించి వారి హృదయాల్ని అనురాగంతో నింపేవాడి కథ ఇది. ఇటువంటి విందుబల్లలదగ్గర, యాగశాలల్లో, నాట్యశాలల్లో మనుషుల్ని కలిపేది అతడే. మనల్ని ఒకరిపట్ల మరొకర్ని సుప్రసన్నుల్ని చేసేది అతడే. మన జీవితాల్లో అమర్యాద లేకుండా చేసేది అతడే. దయని పంచేదీ, దయారాహిత్యాన్నీ దూరం పెట్టేదీ, మంచివాళ్ళకు స్నేహితుడూ, వివేకవంతుల సంతోషం, దేవతల ఆశ్చార్యాతిశయం ఆయన. అతడిలో భాగంకాని వాళ్ళు కూడా అతణ్ణి కోరుకుంటారు. ఇక అతడిలో భాగమైనవాళ్ళకి అతడు ప్రియాతిప్రియుడు. సౌకుమార్యానికీ, విలాసానికీ, కోరికలకీ, ఇష్టానికీ, మృదుత్వానికీ, దయకీ పుట్టినిల్లు. ప్రతి ఒక్క మాటలో, పనిలో, కోరికలో మంచిని పట్టించుకుంటాడు, చెడుని దూరం పెడతాడు. భయం నుంచి రక్షిస్తాడు, మనుషుల్ని ముందుకు నడిపిస్తాడు, సహచరుడు, సహాయకుడు, మనుషులా, దేవతలా వైభవం అతడే. ఉత్తముల, ఉన్నతుల నాయకుడూ అతడే. మనుషుల, దేవతల హృదయాల్ని సమ్మోహపరిచే మధురగానంలో గొంతెత్తి గానం చేస్తో ప్రతి ఒక్కరూ అనుసరించేది అతడి అడుగుజాడల్నే. కాబట్టి, మధ్యలో అక్కడక్కడ కొంత సరదాగా ఒకటి రెండు మాటలు మాట్లాడినా మొత్తం మీద ప్రేమ గురించి నా శక్తికొలదీ నేను చేసిన ఈ గంభీర ప్రసంగాన్ని, ఫేద్రోస్, ప్రేమదేవతకు అంకితం చేస్తున్నాను’ అని అన్నాడు అగధాన్.
23
అగధాన్ తన ప్రసంగం ముగించగానే అక్కడొక ఉల్లాసం నెలకొనిందని అరిస్టొడెమస్ నాతో అన్నాడు. అగధాన్ తనకీ, తాను స్తుతించిన దేవతకీ తగ్గట్టుగానే చక్కగా మాట్లాడేను అనుకున్నాడు. అప్పుడు సోక్రటీస్ ఎరిక్సిమేకస్ వైపు తిరిగి ‘అకుమెనస్ పుత్రుడా, ఇప్పుడు చెప్పు, నేనిందాకా భయపడటంలో అర్థం లేదా? అగధాన్ అద్భుతమైన ప్రసంగం చేస్తాడని నేను చెప్పినప్పుడు జరగబోయేది ముందే చెప్పగలిగే ప్రవక్తని కాలేదా? అతడు ప్రసంగించాక నేను ఇబ్బందిలో పడతానని అన్నమాట నిజమయ్యింది కదా’ అని అన్నాడు
‘నిజమే, అగధాన్ ప్రసంగం గురించి నువ్వు చెప్పిన జోస్యం కొంత వరకూ నిజమయినట్టే ఉంది’ అని జవాబిచ్చాడు ఎరిక్సిమేకస్, ‘కాని ఆ ప్రసంగం నిన్ను ఇబ్బందిలో పడేస్తుందని అనడం మాత్రం నిజం కాదు.’ ‘ఎందుకు కాదు మిత్రమా? అటువంటి రసరమ్యప్రసంగం విన్నాక లేచి మాట్లాడవలసి వస్తే నేనుగానీ, మరెవరైనా గానీ ఇబ్బందిలో పడకుండా ఎలా ఉంటారు?’ అన్నాడు సోక్రటీస్, ‘ముఖ్యంగా ఆ ప్రసంగంలో ఆ చివరి వాక్యాలు, వాటిని విని ముగ్ధులు కానివారెవరుంటారు? అటువంటి ప్రసంగంతో పోలిస్తే, నా శక్తిసామర్థ్యాలు ఏపాటివో నాకు తెలుసుకాబట్టి, నేను సిగ్గుతో పలాయనం చిత్తగించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అలా పారిపోడానికి వీలు చిక్కాలే గాని’ అని కూడా అన్నాడు. ‘నాకు గోర్గియాస్1 గుర్తొచ్చాడు. తన ప్రసంగంలో చివరికి వచ్చేసరికి అగధాన్ వాక్చాతుర్య మాంత్రికుడు గోర్గియాస్ లాగా నావైపు చూస్తున్నాడా అనిపించింది. హోమర్ చెప్పినట్టు ఆ గోర్గాన్ చూపు నా వాక్కుని మూగబోయేలా చేసి నన్ను శిలగా మార్చేసేటట్టే ఉంది. అప్పుడు అర్థమయింది నాకు ప్రేమ గురించిన ఈ ప్రసంగకార్యక్రమంలో నేను కూడా పాలుపంచుకోవడంలో ఎంత తెలివితక్కువ తనం ఉందో. నేను కూడా వక్తనే అని అనుకున్నానుగాని, నిజంగా ఒక అంశాన్ని ఎలా ప్రశంసించాలో నాకు తెలియనే తెలియదని ఇప్పుడు తెలిసింది.’
‘మనం దేన్నైనా ప్రశంసించబోతున్నప్పుడు, మన వక్తవ్యాంశాలు సత్యమై ఉండాలి అని అనుకునే అమాయకత్వం నాది. సత్యంగా ఉండే ఆ అంశాల్లోంచి ఉత్తమమైనవాటిని తీసుకుని ఉత్తమరీతిలో ప్రసంగించాలన్నది నా భావన. యథార్థమైన ప్రశంస ఎలా ఉండాలో నాకు తెలుసు కాబట్టి నేను బాగా ప్రసంగించగలనని నాకు గర్వంగా కూడా ఉండింది. కానీ తీరా ఇప్పుడు ప్రసంగాలు వింటూ ఉంటే ప్రపంచంలోని సమస్త వైభవాల్నీ, శ్రేష్టతల్నీ, అవి నిజంగా ప్రేమదేవత గుణగణాలైనా కాకపోయినా కూడా, ఆయనకు ఆపాదించడమే ఉద్దేశ్యంగా కనబడుతోంది. అందులో సత్యమెంతో, అసత్యమెంతో పట్టించుకునే ఉద్దేశ్యమేమీ ఉన్నట్టు లేదు. చూడబోతే ఈ గోష్ఠి ఉద్దేశ్యం మనం ప్రేమదేవతని నిజంగా ప్రశంసించడం కాదు, ప్రశంసిస్తున్నట్టుగా కనిపించడమేనా అని అనుమానమొస్తున్నది. మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రేమదేవతని ప్రశంసించడానికి ఎక్కడ ఎటువంటి ప్రశంస కనబడితే అవన్నీ ఏరుకొచ్చీ మరీ ఆయన్ని పొగడ్తల్తో ముంచెత్తారు. ‘ఆయన ఇవన్నీను’, ‘ఆయన వల్లనే ఇవన్నీను’ అంటో మీరు ఆయన గురించి చెప్తున్నమాటలెలా ఉన్నాయంటే, ప్రేమ అంటే తెలియనివాళ్ళకి ఆయన్ని మించిన మంచివాడూ, అందగాడూ మరెవరూలేరనిపించేట్టుగా ఉన్నాయి. సరే, ప్రేమ గురించి తెలిసినవాళ్ళని మీరెలానూ ప్రభావితం చెయ్యలేరు.’
‘అయితే మీరు చేసిన ప్రసంగాలు మాత్రం గంభీరంగానూ, ఉదాత్తంగానే ఉన్నాయి. కాని నేను ఆ ప్రశంసాపద్ధతిని సరిగ్గా అర్థం చేసుకోనందువల్ల నా వంతువచ్చేటప్పటికి నా వాగ్దానం నుంచి నన్ను తప్పించమనీ, నా అజ్ఞానాన్ని మన్నించమనీ అడిగాను. నేను కూడా ప్రసంగిస్తాను అని చెప్పిన మాట, యురిపిడిస్2 అన్నట్టుగా, పెదాల నుంచి వచ్చిందే తప్ప, మనసులోంచి పుట్టిన మాట కాదు. కాబట్టి ఆ తరహా ప్రసంగధోరణికి సెలవు. నేను ఆ విధంగా ప్రశంసించబోవడం లేదు. నిజానికి నేనలా ప్రసంగించలేను కూడా. కానీ మీకు నిజంగా ప్రేమ గురించి వినాలని ఉంటే, తెలుసుకోవాలని ఉంటే, నా ధోరణిలో నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. అలాగని మీతో వాదోపవాదాలకి దిగి నన్ను నేను చులకన చేసుకోవడం నాకిష్టం లేదు. చెప్పు ఫేద్రోస్, నువ్వు ప్రేమ గురించి సత్యం వినాలనుకుంటున్నావా? నాకు ఆ సమయానికి ఎలా స్ఫురిస్తే అలా చెప్పాలనుకుంటున్నాను. నీకది అంగీకారమేనా?’
ఫేద్రోస్, అక్కడున్న మిత్రులూ సోక్రటీస్ ని ఆయనకు ఎలా తోస్తే అలా మాట్లాడమని అడిగారని అరిస్టొడెమస్ చెప్పాడు. ‘అయితే ముందుగా అగధాన్ ని కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతించండి. అతను చెప్పిన జవాబుల్ని బట్టి నా ప్రసంగాన్ని ముందుకు తీసుకువెళ్తాను’ అని అన్నాడట సోక్రటీస్.
‘నువ్వు కోరినట్టే నీ ప్రశ్నలు మొదలుపెట్టు’ అని అన్నాడు ఫేద్రోస్. అప్పుడు సోక్రటీస్ ఇలా అడగడం మొదలుపెట్టాడు: ‘నువ్విప్పుడు చేసిన గంభీరమైన ప్రసంగంలో ముందు ప్రేమ స్వభావం గురించి మాట్లాడి, ఆ తర్వాత ప్రేమమార్గం గురించి మాట్లాడతాను అని అన్నావు, అది చక్కని మాట, ఏదైనా ప్రసంగాన్ని ప్రారంభించే పద్ధతి అలాగే ఉండాలని నేను కూడా అనుకుంటాను. అలాగే నువ్వు ప్రేమస్వభావం గురించి అనర్గళంగా మాట్లాడేవు కూడా. అయితే నేనిన్నొక మాట అడగాలనుకుంటున్నాను. ప్రేమ అని మనం అంటున్నప్పుడు అది ఏదో ఒకదానిపట్ల ప్రేమనా లేక దేనిగురించీ కాదా? ఇక్కడ మరికొంత స్పష్టంగా చెప్పాలి. నేనిలా అడుగుతున్నప్పుడు, నువ్వు ప్రేమ దేనిపట్ల అంటే, తండ్రిపట్ల, తల్లిపట్ల అని చెప్పకు3. అలాంటి జవాబు హాస్యాస్పదంగా ఉంటుంది. తండ్రి దేనికి తండ్రిగా ఉంటున్నాడు అని అడిగితే ఎలా జవాబిస్తావో అలా జవాబివ్వు. తండ్రి దేనికి తండ్రి అంటే కొడుక్కో, కూతురికో తండ్రి అని జవాబిస్తావు చూడు, అలాగ. అలాంటి జవాబు సరైన జవాబే కదా’.
‘అవును, సరైన జవాబే’ అని అన్నాడు అగధాన్.
‘తల్లి గురించి కూడా అదే మాట చెప్తావా?’
అవునన్నాడు.
‘నా ఉద్దేశ్యం మరింత తేటతెల్లంకావడానికి మరో ప్రశ్న అడుగుతాను. ఒక సోదరుడు ప్రధానంగా ఎవరో ఒకరికి సోదరుడవుతాడు కదా.’
అవును అన్నాడతడు.
‘సోదరుడుగానీ, సోదరి గానీ.’
‘అవును’ అని అన్నాడు.
‘ఇప్పుడు ప్రేమ గురించి అడుగుతాను. ప్రేమ ఏదో ఒకదాని పట్ల ప్రేమనా లేక దేనిపట్లా కాదా?’
24
‘అది తప్పకుండా ఏదో ఒకదాని పట్లనే అవుతుంది’ అని జవాబిచ్చాడు.
‘అయితే ఈ విషయం మనసులో పెట్టుకుని నేనడిగినదానికి జవాబు చెప్పు- ప్రేమ ప్రేమనే కోరుకుంటుందా?’
‘అవును, అదే.’
‘అది దేన్ని ప్రేమిస్తున్నదో, అది దాని దగ్గర ఉన్నట్టా లేనట్టా?’
‘బహుశా లేదనే అనుకుంటాను.’
‘కాదు, అక్కడ నువ్వు ‘బహుశా’ అని కాకుండా ‘ఎంతమాత్రం కాదు’ అని చెప్పొచ్చేమో చూడు. ఎవరైనా ఏదైనా కోరుకుంటున్నారంటే అర్థం అది వాళ్ళ దగ్గర లేదన్నట్టే కదా, అంటే ఎవరూ దేన్నీ కోరుకోవటం లేదంటే దాని అర్థం వాళ్ళకి దేనికీ కొరతలేదన్నట్టే కదా, కాబట్టి నా దృష్టిలో, అగధాన్, ప్రేమ దేన్ని కోరుకుంటున్నదో అది దాని దగ్గర నిశ్చయంగా లేనట్టే. ఏమంటావు?’ అనడిగాడు సోక్రటీస్.
‘ఒప్పుకుంటున్నాను’ అన్నాడు అగధాన్.
‘మంచిమాట. అయితే ఇది చెప్పు, ఎవరన్నా గొప్పవాడు గొప్పవాడు కావాలనికోరుకుంటాడా, బలశాలి బలవంతుడు కావాలని కోరుకుంటాడా?’
‘మనం ఇప్పుడు చెప్పుకున్నదాన్నిబట్టి చూస్తే వాళ్ళు అలా అనుకునే అవకాశం లేనట్టే.’
‘అవును, ఎందుకంటే, అప్పటికే ఒకడికి ఆ గుణగణాలున్నాయంటే వాడు వాటిని మరింకెంతమాత్రం కావాలని అనుకోడు కదా!’
‘అవును.’
‘అయినా సరే ఒక బలశాలి బలం కావాలని కోరుకుంటుంటే, చురుకైనవాడు చురుగ్గా ఉండాలని కోరుకుంటూ ఉంటే, ఆరోగ్యవంతుడు ఆరోగ్యంగా కావాలని కోరుకుంటూ ఉంటే, తనకి అప్పటికే ఉన్నదాన్నే అతడు కోరుకుంటూ ఉన్నట్టు కదా.’
‘మన ఆలోచనలో పొరపాటు దొర్లకుండా ఉండటానికి నేనో ఉదాహరణ చెప్తాను. ఈ గుణగణాలున్నవాళ్ళకి, అగధాన్, వాళ్ళు కోరుకున్నా కోరుకోకపోయినా వాటివల్ల అప్పటికి ఒనగూడే ప్రయోజనాలు వాళ్ళు పొందుతూ ఉండాలి కదా. కాబట్టి ఎవరేనా నేను బాగా ఉన్నాను, బాగా ఉండాలని కోరుకుంటున్నాను అనో లేదా నేను ధనవంతుడిగా ఉన్నాను, ధనవంతుడిగా ఉండాలని కోరుకుంటున్నాను అనో అంటే నేను నాకేవి ఉన్నాయో అవి ఉండాలని కోరుకుంటున్నాను అనో చెప్తే-అతడికి మనమిలా చెప్పొచ్చు: ‘చూడు, మిత్రమా, సంపదలూ, ఆరోగ్యం, బలం ఉండి, అవి కొనసాగుతూ ఉండాలనికోరుకుంటున్నావు, అయితే నువ్వు అనుకున్నా, అనుకోకపోయినా నీకిప్పటికే ఆ గుణాలున్నాయి. నేను నాకేవి ఉన్నాయో వాటినే కోరుకుంటున్నాను, మరేమీ కాదు, అని అంటావనుకో, అప్పుడు నీ ఉద్దేశ్యం, ఇప్పుడు నాకేమున్నాయో, అవి భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటున్నావు, అంతేనా? అనడిగామనుకో, అతడు ఒప్పుకుంటాడా లేదా?’
‘ఒప్పుకుంటాడు’ అన్నాడు అగధాన్.
‘అంటే అతడు ఇప్పుడు తనకున్నవి భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే ఏమిటి? అతడు తనకి లేనిదేదో, అంటే ఇప్పటికింకా పొందనిదేదో కోరుకుంటున్నాడన్నట్టే కదా.’
‘నిజమే’ అన్నాడతడు.
‘అంటే, వాళ్ళు ప్రతి ఒక్కరూ తమకు ప్రస్తుతం లేనిదేదో కోరుకుంటున్నారు, అంటే వర్తమానంలో లేనిది కాదు, భవిష్యత్తులో లేనిది కోరుకుంటున్నారు. అంటే అతడు కోరుకునేది అతడికి లేదన్నమాట, అతడికి అది కొరవడింది, ఇలాంటివే కదా, ప్రేమా, కాంక్షా కోరుకునేవి?’
‘నిజమే’ అని అన్నాడు.
‘అయితే, మనమొకసారి ఇంతకు ముందు చర్చించుకున్నవి గుర్తుచేసుకుందాం. మొదటిది, ప్రేమ ఏదో ఒక దానిపట్ల, అందులోనూ మనిషికి కొరవడినదానిపట్ల ఉంటుందనేగా?’
25
‘అవును’ అని జవాబిచ్చాడతడు.
‘నువ్వు నీ ప్రసంగంలో మొదట ఏమి చెప్పావో గుర్తుతెచ్చుకో. నీకు గుర్తులేకపోతే, నేను గుర్తు చేస్తాను. నువ్వేమన్నావంటే, ప్రేమ దేవతల సామ్రాజ్యంలో సౌష్ఠవాన్నీ, సౌందర్యాన్నీ తీసుకొచ్చిందనీ, వికృతమైనవాటిపట్లా, విరూపవస్తువుల పట్లా ఎవరికీ ప్రేమ ఉండదనీ-అటువంటిదేదో అన్నావు కద?’
‘అవును’ అన్నాడు అగధాన్.
నిజమే, నువ్వన్నమాట సమంజసమైందే. ఈ మాటే కనక నిజమైతే, ప్రేమ అంటే సౌందర్యాన్ని ప్రేమించడం తప్ప విరూపాన్ని ప్రేమించడం కాదు కదా.’
అతడు తలూపాడు.
‘మనుషులకి తమలో ఏది కొరవడిందో, దేన్ని కోరుకుంటున్నారో దానిపట్లనే కదా ప్రేమ ఉంటుందని ఇంతకు ముందు అనుకున్నాం?’
‘అవును’ అని అన్నాడు.
‘అంటే దాని అర్థం ప్రేమలో సౌందర్యం కొరవడింది, కాబట్టే దాన్ని కోరుకుంటోందా?’
‘అవును, అంతే.’
‘అలా అయితే దేనిలో అందం కొరవడిందో, అందం కోసం అర్రులు చాస్తోందో దాన్ని సౌందర్యం అని అనగలవా?’
‘అనలేను.’
‘అలాంటప్పుడు ప్రేమ అందమైంది అని ఇంకా అనగలవా?’
‘నేనేం చెప్తున్నానో నాకు తెలియట్లేదేమో అని అనుమానంగా ఉంది’ అన్నాడు అగధాన్.
‘నువ్వు చాలా చక్కటి ప్రసంగం చేసావు అగధాన్’ అని అన్నాడు సోక్రటీస్. ‘కాని ఇంకో చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మంచితనం అందమైది కూడానా?’
‘అవును.’
‘అంటే, సౌందర్యాన్ని కోరుకుంటున్నప్పుడు ప్రేమ మంచితనాన్ని కూడా కోరుకుంటున్నట్టేనా?’
‘నీ మాటలు ఖండించలేను సోక్రటీస్, సరే, నువ్వన్నట్టే అనుకుందాం’ అన్నాడు అగధాన్.
‘ప్రియమిత్రమా, నువ్వు చెప్పవలసిన మాట అది కాదు, ఇది: నేను సోక్రటీస్ ని ఖండించగలనేమోగాని, సత్యాన్ని ఖండించలేను’ అని చెప్పు’.
సరే, ప్రస్తుతానికి నిన్నిక్కడ వదిలిపెట్టి, మంచినియా వాసి డయోటిమా4 ద్వారా ప్రేమ గురించి నేను విన్న కథ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఇలాంటి మరికొన్ని జ్ఞానరహస్యాలు తెలిసినామె. పూర్వపు రోజుల్లో ఒకసారి ఎథీనియన్లు పూజలు చేస్తే ప్లేగు వ్యాధి పదేళ్ళపాటు రాకుండా కాపాడింది. ప్రేమవిషయాలకు సంబంధించి ఆమె నా గురువు. ఆమె నాకేమి చెప్పిందో నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆమె నన్ను ప్రేమ గురించి అడిగినప్పుడు ఇప్పుడు అగధాన్ చెప్పినమాటల్లాంటివే నేను కూడా ఆమెతో చెప్పాను. కాబట్టి ఇప్పుడు రెండు పక్షాలూ నేనే తీసుకుని ఆ రోజు మా మధ్య జరిగిన సంభాషణని మీముందుంచటానికి ప్రయత్నిస్తాను.’
‘నువ్వు నీ ప్రసంగంలో చెప్పినట్టే, అగధాన్, నేను కూడా ముందు ప్రేమ స్వభావం ఎటువంటిదో నిర్వచించి, అప్పుడు ప్రేమ లీల ఎటువంటిదో వివరిస్తాను. ప్రేమ గురించి అగధాన్ ఎటువంటి మాటలు ప్రయోగించాడో దాదాపుగా అటువంటి మాటలే నేను ఆమెతో మొదట చెప్పాను. ప్రేమ ఒక మహాబలశాలి అనీ, సుందరుడనీ చెప్పాను. ఆమె కూడా నేనిప్పుడు అగధాన్ తో ఎట్లా చెప్పించానో అలానే ప్రేమ అందమైందికాదనీ, మంచిదేమీ కాదనీ నాతోనే నా మాటల్లో చెప్పించింది. ‘అంటే ఏమిటి డయోటిమా, ప్రేమ అనాకారీ, దుష్టుడూ అంటావా?’ అని అన్నాను. ‘హుష్, సుందరంగా లేదంటే అర్థం అనాకారి అనేనా?’ అని అనడిగిందామె.
26
‘అంతే కదా! జ్ఞానం లేదంటే అజ్ఞాని అనే కదా’ అని అన్నాను. ‘ఏమి? జ్ఞానానికి, అజ్ఞానానికీ మధ్య ఒక స్థితి ఉండటం నీకు కనిపించడలేదా?’ ‘ఏమిటది? అనడిగాన్నేను.
వివరణలు
1. గోర్గియాస్: హోమర్ రాసిన ఒడెస్సీలో ఒడెస్యూస్ పాతాళలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ గోర్గాన్ మెడుసా శిరసుని చూడవలసి వస్తుందని భయపడి చూడకుండా వచ్చేస్తాడు. ఆ శిరసు చూసినవారిని ఆమె శిలగా మార్చేస్తుందని ప్రతీతి. ఇక్కడ సోక్రటీస్ గోర్గాన్ అనే పేరుకీ, సిసిలీకి చెందిన గ్రీకు వక్త, వాక్చాతుర్యానికి పెట్టింది పేరైన గోర్గియాస్ కీ మధ్య ఉన్న పోలిక మీద శ్లేష చేస్తున్నాడు. అగధాన్ తన వక్తృత్వంలో గోర్గియా ని తలపిస్తున్నాడని ఆయన భావం.
2.యురిపిడిస్ చెప్పినట్టుగా: యురిపిడిస్ రాసిన నాటకంలోని ఒక పంక్తిని గుర్తు చేసుకుంటూ.
3. గ్రీకు నుడికారం ప్రకారం love is of అంటే, love is the child of అనే అర్థం వస్తుంది. కాబట్టి సోక్రటీస్, తాను కోరుకుంటున్న జవాబు ఆ అర్థంలో కాకుండా, ప్రేమ దేనికో ఒకదానికి సంబంధించిన అనే అర్థంలో జవాబిమ్మని చెప్తున్నాడు.
4.డయోటిమా: డయోటిమా అనే ఆమె ప్లేటో సృష్టించిన ఒక పాత్ర అని కొందరు వ్యాఖ్యాతల ఉద్దేశ్యం. ఆమె ప్లేటో తాత్త్వికచింతనని సోక్రటీస్ కి నేర్పి ఉంటుందని మనం అనుకోలేం కదా అని వాళ్ళ భావన. ఆమె మంచినియా నుంచి వచ్చింది అని అనడంలో గ్రీకులో mantis అనే పదానికి ఋషి అనే అర్థం కూడా ఉండటం ఒక కారణం. డయోటిమా అంటే ‘జ్యూస్ చేత గౌరవించబడ్డ’ అని అర్థం. ఈ కథనంలోని నిజానిజాలు ఎలా ఉన్నా, స్త్రీలు పురుషుల్తో సమానంగా సత్యాన్వేషణ చెయ్యలేరు అని నమ్మే గ్రీకు కులీన సమాజానికి సోక్రటీస్ తాను ఒక స్త్రీ ద్వారా శిక్షణ పొందాను అని చెప్పడం చిన్న విషయం కాదు. నేనేమనుకుంటానంటే సోక్రటీస్ జీవితంలో అటువంటి సంఘటన ఏదో ఒకటి సంభవించి ఉండకపోతే ప్లేటో సింపోజియం లాంటి సంభాషణలో ఆమెకి అంత కీలకమైన స్థానాన్ని ఇచ్చి ఉండడు. ఆమె చెప్పిన మాటలు సోక్రటీస్ ద్వారా విన్నవి ప్లేటో తన శైలిలో రాసి ఉండి ఉంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఒక స్త్రీ ద్వారా ప్రేమ గురించీ, తాంత్రిక విద్యల గురించీ తెలుసుకోవడానికి మనకి తెలిసిన మరొక ఉదాహరణ రామకృష్ణ పరమహంస. ఆయన జీవితంలో తంత్రసాధనకు ఒక భైరవి తోడ్పడి, ఆ సాధన ముగియగానే ఆయన జీవితంలోంచి అదృశ్యమైపోయింది.
Featured image: Marble anaglyph of the ancient symposium. A couple in love time. Archaeological Museum of Nikopolis, Nikopoli, Preveza, Greece PC: Wikicommons
రసరమ్య చర్చ
ధన్యవాదాలు సార్