ప్రేమగోష్ఠి-6

(ఏథెన్సుకి చెందిన అగధాన్ ఇచ్చిన విందులో సోక్రటీస్ తో పాటు మరికొందరు మిత్రులు కూచుని ప్రేమగురించి మాట్లాడుకున్న విశేషాలు అరిస్టొడెమస్ అన్నవాడిద్వారా విన్న అపొల్లోడోరస్ గ్లాకెన్ అనేవాడికి చెప్తున్నాడు. ఆ గోష్టిలో ముందు ఫేద్రోస్, ఆ తర్వాత పౌసనియస్, ఎరిక్సిమేకస్, అరిస్టొఫెనీస్ ప్రసంగించారు. ఆ తర్వాత మాట్లాడవలసిన వాళ్ళు ఇద్దరే మిగిలారు, సోక్రటీసూ, అగధాన్. ముందుగా అగధాన్ తన ప్రసంగం మొదలుపెట్టాడు.)

మనం దేవతల పట్ల విధేయంగా లేకపోతే మళ్లా రెండు ముక్కలైపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మనం శిల్పాల్లో చూస్తామే అలాగ సగం ముక్కుతో మాత్రమే తిరగాల్సి ఉంటుంది. అప్పుడు మనం మనవాళ్ళు ఒప్పందాలు చేసుకునేటప్పుడు చెరోముక్కా దగ్గర పెట్టుకుంటారే అలాగ రెండు ముక్కలై తలా ఒకచోటా తిరక్కతప్పదు. కాబట్టి మనుషులంతా ధార్మికంగా మసలుకోవడం అవసరమని నలుగురికీ బోధిద్దాం. చెడుని దూరంగా పెట్టమనీ, మంచిని పెంచమనీ చెప్దాం. మనకి ప్రేమనే అధినేతా, సలహాదారూ కావాలి. ఏ ఒక్కరూ అతణ్ణి వ్యతిరేకించకూడదు. ఆయన్ని ఎవరు వ్యతిరేకిస్తారో వారు దేవతలకి శత్రువుల్లాంటివారు. మనం భగవంతుడికి స్నేహితులమై ఆయనతో శాంతిగా ఉండగలిగితే మన యథార్థప్రేమల్ని మనం పొందగలుగుతాం. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఇలా జరగడం చాలా అరుదు. నేను గంభీరమైన ప్రసంగం చేస్తున్నాను. కాబట్టి నన్ను వేళాకోళం చెయ్యొద్దని ఎరిక్సిమేకస్ ని అడుక్కుంటున్నాను. అగధాన్, పౌసనియస్ ఇద్దరూ కూడా పురుషస్వభావాన్ని పుణికిపుచ్చుకున్నవాళ్ళే. కాబట్టి నేను ఏ తరహా మనుషుల గురించి మాట్లాడుతున్నానో అదంతా అగధాన్, పౌసనియస్ ల్ని ఉద్దేశించే చెప్తున్నానని అనుకోవద్దు. నేను మాట్లాడుతున్నది విస్తృతమానవాళి గురించి, అందులో సమస్త స్త్రీపురుషులూ వచ్చిచేరతారు. మనం మన ప్రేమల్ని పరిపూర్ణంగా పొందగలిగితే, మనలో ప్రతి ఒక్కరం మన అనాదిస్వభావానికి చేరుకోగలిగితే, మానవజాతి సుఖపడుతుందని నా నమ్మకం. ఇది మనం కోరదగ్గ అత్యున్నత స్థితి అనుకుంటే, ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో కోరుకోదగ్గ పరిస్థితి అటువంటి ప్రేమలకోసం వెతుక్కోవడమే. అప్పుడే మనం సానుకూలమైన ప్రేమని పొందగలుగుతాం. మనకి ఇటువంటి వరాన్ని ప్రసాదించినవారిని కీర్తించడమంటే, ప్రేమదేవతను స్తుతించడమే. మన నిజమైన వరప్రదాత ఆయనే. ఆయన ఒకవైపు మనల్ని మన అనాదిస్వభావం వైపు నడిపిస్తూ, మరొకవైపు భవిష్యత్తు పట్ల మనలో గొప్ప ఆశలు రేకెత్తిస్తున్నాడు. మనం పవిత్రంగా ఉండగలిగినట్టైతే మన అనాదిస్వభావానికి చేరుకోగలుగుతామనీ, తద్వారా మనం స్వస్థపడగలుగుతామనీ, ధన్యులమవుతామనీ వాగ్దానం చేస్తున్నాడు. ఇదీ, ఎరిక్సిమేకస్, నేను ప్రేమగురించి చెయ్యగలిగిన ప్రసంగం. ఇది నువ్వు మాట్లాడినదానికన్నా భిన్నంగా ఉంది నిజమేకాని, దాన్ని నీ వ్యంగ్యబాణాలతో తూట్లు పొడవకు. తక్కినవాళ్ళని కూడా మాట్లాడనివ్వు. ఇంకా మాట్లాడవలసినవాళ్లల్లో అగధాన్, సోక్రటీస్, ఇద్దరే మిగిలారు’ అని అన్నాడు అరిస్టోఫెనీస్.

20

‘నేను నిన్ను ఖండించబోవడంలేదులే’ అన్నాడు ఎరిక్సిమేకస్. ‘నిజానికి నువ్వు చాలాబాగా మాట్లాడేవు. సోక్రటీస్ కీ, అగధాన్ కి ప్రేమవ్యవహారాల గురించి అంతగా తెలుసనుకోను. కాబట్టి వాళ్ల దగ్గర మాట్లాడటానికేమీ ఉండకపోవచ్చు. ఇప్పటిదాకా చెప్పినవాటికన్నా అదనంగా వాళ్ళదగ్గర చెప్పడానికేమీ లేకపోవచ్చు. అలాగని నాకు ఆశ లేదని కూడా చెప్పను.’

‘నువ్వు నీ పాత్ర బాగానే పోషించావు, ఎరిక్సిమేకస్’ అన్నాడు సోక్రటీస్. ‘కానీ ఇప్పుడు నా పరిస్థితిలో నువ్వుంటే, లేదా అగధాన్ మాట్లాడాక నా పరిస్థితిలో నువ్వుంటే నా కష్టం నీకు తెలిసుండేది’ అని కూడా అన్నాడు.

‘నువ్వు నా మీద సమ్మోహనాస్త్రం ప్రయోగిస్తున్నావు సోక్రటీస్’ అని అన్నాడు అగధాన్. ‘శ్రోతలు నేనేదో మహాప్రసంగం చెయ్యబోతున్నానని ఎదురుచూస్తున్నారనే భ్రాంతికి లోనయ్యేట్టున్నాను నీ మాటలు వింటుంటే’ అని కూడా అన్నాడు.

‘ఆ రోజు రంగస్థలం మీద నీ నాటకం ప్రదర్శించబోతున్నప్పుడు నువ్వెంత ధీరత్వంతో, ఆత్మవిశ్వాసంతో నీ నాటకబృందంతో కలిసి ఆ మహాజనసమూహం ఎదట నిలబడ్డావో నాకు గుర్తులేకుండా ఎలా ఉంటుంది అగధాన్?’ అనడిగాడు సోక్రటీస్. ‘అంత జనసమూహం ముందే తొట్రుపడనివాడివి, ఈ నలుగురైదుగురు మిత్రులముందు మాట్లాడలేవని ఎలా అనుకుంటాను చెప్పు?’

‘అంటే ఏమిటి సోక్రటీస్? నన్ను రంగస్థలం మరీ అంత గుడ్డివాణ్ణి చేసిందా ఏమిటి? అసంఖ్యాకులైన మూర్ఖప్రేక్షకుల కన్నా నలుగురైదుగురు న్యాయనిర్ణేతల ముందు నిలబడటంలో కష్టమేమిటో నాకు తెలియదా?’ అనడిగాడు అగధాన్.

‘కానే కాదు’ అన్నాడు సోక్రటీస్. ‘నీ విషయంలో నాకు వేరే ఆలోచన ఏమీ లేదు. నువ్వు ఎవరిని వివేకవంతులుగా భావిస్తావో వారిని కలుసుకున్నప్పుడు వాళ్ళ అభిప్రాయానికి విలువనిస్తావని నాకు తెలుసు. అసంఖ్యాకులైన వివేకశూన్యులకన్నా ఆ ఒక్క వివేకీ నీకు ఎంతో ఎక్కువ. అయితే ఆ రోజు ఆ వివేకశూన్య ప్రేక్షక సమూహంలో మేం కూడా ఉన్నాం. కాబట్టి నువ్వు చెప్తున్న ఆ కొద్దిమంది వివేకవంతుల్లో మేము లేమని మాకు తెలుసు. అలాగని నువ్వు మాలో ఒకరిముందు కాదు, నువ్వు నిజంగానే వివేకవంతుడిగా భావించే వ్యక్తి సన్నిధిలో ఉన్నావనుకో, అతడి ముందు నిన్ను నువ్విలా కించపరుచుకోవు కదా?’ అన్నాడు సోక్రటీస్.

‘అవును’ అన్నాడు అగధాన్.

‘అదే జ్ఞానశూన్యులైన జనబాహుళ్యం ముందు నిలబడ్డప్పుడు అగౌరవమైన పని చేసినా కూడా సిగ్గుపడవు కదా.’

కాని ఫెద్రోస్ అతడి మాటలకు అడ్డుపడ్డాడు. ‘అగధాన్! ఆయన మాటలకి జవాబివ్వకు. ఆయనకి మాట్లాడటానికి ఒక మనిషి దొరికితే, అది కూడా అందమైన మనిషి దొరికితే, మన ప్రసంగాల సంగతి పూర్తిగా మర్చిపోతాడు. ఆయన మాట్లాడితే వినాలని నాక్కూడా ఉంది. కాని ముందు మనం ప్రేమ దేవత ప్రశంస పూర్తిచెయ్యాలి. మనం అనుకున్నట్టుగా ఆయనా, ప్రతి ఒక్కరూ కూడా ప్రసంగించాలి. ఇప్పుడు నువ్వూ, ఆయనా కూడా ప్రేమప్రసంగాలు పూర్తిచేసాక అప్పుడు మీరు తీరిగ్గా మాట్లాడుకోవచ్చు’ అని అన్నాడు ఫెద్రోస్.

‘బావుంది ఫేద్రోస్’ అన్నాడు అగధాన్. ‘ముందు నా ప్రసంగం పూర్తిచేస్తాను. సోక్రటీస్ తో ఇంకా చాలాసార్లు మాటాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానో చెప్పి అప్పుడు విషయంలోకి వెళ్తాను’ అని మొదలుపెట్టాడు.

‘నా ముందు మాట్లాడిన వక్తలు ప్రేమదేవతను స్తుతించడానికి బదులు, ఆయన స్వరూపస్వభావాల్ని వివరించడానికి బదులు, ఆయన అనుగ్రహం పొందినందుకు మానవాళిని అభినందనలతో ముంచెత్తారు. కాని నేను ముందుగా ప్రేమదేవతని ప్రశంసించాలనుకుంటున్నాను. అప్పుడు ఆయన మానవజాతికిచ్చిన వరాల గురించి మాట్లాడతాను. దేన్నైనా ప్రశంసించడానికి ఇదే సరైన పద్ధతి. మొత్తం దేవతానీకమంతటిలోనూ ఆయనే అందమైనవాడూ, సర్వశ్రేష్ఠుడూ అని చెప్పడంలో తప్పులేదు కదా. ఆయన గొప్ప అందగాడు. అందరిలోనూ ఆయనే చిన్నవాడు, ఆయన యవ్వనమేదానికి సాక్ష్యం. అతడి వేగంవల్ల వార్థక్యం అతణ్ని ఎప్పటికీ అందుకోలేదు. మనుషుల మీద ముసలితనం ఎలా విరుచుకుపడుతుందో మనకందరికీ తెలుసు. అది మామూలుగా కన్నా కూడా మరింత వేగంగా ముంచెత్తుతుంది. ప్రేమదేవతకి వార్థక్యమంటే సహజద్వేషం. ఎట్టిపరిస్థితిలోనూ దాని దగ్గరికే పోడు. ప్రేమదేవత చెలిమి ఎప్పుడూ యవ్వనంతోనే. ‘ఒక్కలాంటివాళ్ళే ఒక్కచోట చేరతారు’ అనే సామెత ఎలానూ ఉంది కదా’.

‘హెసియోదూ, పార్మెనిడిసూ దేవతల కార్యకలాపం గురించి చెప్పినమాటలు నిజమే అనుకుంటే, అవన్నీ దేవతలు అవసరం కొద్దీ చేసినవి తప్ప, ప్రేమతో చేసినవి కావనిపిస్తుంది. ఆ రోజుల్లో ప్రేమదేవత ఉండిఉంటే, దేవతలు సంకెళ్ళలో తగులుకుని ఉండేవారు కాదు, వికృతరూపులయ్యేవారు కాదు. లేదా ఇంకా అలాంటివే హింసాత్మక చర్యలుండేవి కావు. వాటి బదులు,  ప్రేమ సామ్రాజ్యం మొదలయ్యాక ఇప్పుడు స్వర్గంలో కనవస్తున్నట్టే, అప్పుడు కూడా శాంతీ, మాధుర్యమూ వెల్లివిరిస్తూ ఉండేవి. ప్రేమ దేవత యువకుడు మాత్రమే కాదు, సుకుమారుడు కూడా. అతడి లాలిత్యాన్ని ప్రశంసించడానికి హోమర్ లాంటి కవి పుట్టి ఉండవలసింది. ఎట్1 గురించి హోమర్ వర్ణించాడే, ఆమె యవ్వనవతి, కోమలి, అంటో, అలాగ. హోమర్ ఏమన్నాడో గుర్తుంది కదా

ఆమె చరణాలు ఎంత మృదువంటే, ఆమె నేలమీద కాదు, మనుషుల శిరస్సులమీద అడుగులు మోపుతుంది.’

అని అన్నాడు కదా, అలాగ. ఆమె ఎంత కోమలమైందో చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం లేదు. ఆమె మెత్తటివాటి మీద చరణాలు మోపుతుందిగాని, గట్టిగా ఉండేదానిమీద కాదట.’

21

‘ప్రేమ మృదుత్వాన్ని వర్ణించడానికి కూడా మనం ఇటువంటి ఒక ఉదాహరణ వెతుకుదాం. ప్రేమ దేవత కూడా నేలమీద నడవడు. అలాగని మనుషుల శిరస్సులమీద కూడా నడవడు. ఎందుకంటే మనుషుల తలకాయలు కూడా గట్టిగానే ఉంటాయి. వాటికి బదులు అతడు మనుషుల, దేవతల హృదయాలమీదా, ఆత్మల మీదా అడుగుమోపుతాడు. అంతకన్నా సున్నితమైనవి మరొకటి ఉండవు కదా. అతడు నడిచేది వాటిమీద, నివసించేది వాటిల్లో. ఏ ఒక్క హృదయంలో మెత్తదనం కరువైనా అతడు అక్కణ్ణుంచి వెళ్లిపోతాడు. ఇందుకు ఎటువంటి మినహాయింపు లేదు. మృదువైనవాటిలో మరింత మృదులతరమైన స్థలాల్లో అడుగులు వేసే ఆ దేవతకన్నా మృదువైన వారు మరొకరు ఎవరుంటారు?’

‘అతడు అందరికన్నా చిన్నవాడూ, సున్నితమైనవాడే కాదు, అత్యంత సరళస్వభావుడు కూడా. సర్దుబాటుతత్త్వం లేకుండా అతడు మరీ మొండిగా ఉండి ఉంటే, అన్నిట్నీ తనతో కలుపుకుపోగలిగేవాడు కాడు. అలాగే ఇంతదాకా ఎవరికీ తెలియని మనుష్యహృదయాల్లోకి అంత సులువుగా చొచ్చుకుపోగలిగేవాడు కూడా కాడు. అతడి సరళస్వభావానికీ, మానసిక సౌష్టవానికీ సాక్ష్యం అతడి దయార్ద్రహృదయమే. దయాగుణం ప్రేమతాలూకు ప్రత్యేక లక్షణమన్నది అందరూ ఒప్పుకున్నదే. దయారాహిత్యానికీ, ప్రేమకీ ఎప్పటికీ పొసగదు. అతడి నివాసం పూలమధ్య అన్నదాన్నిబట్టే అతడి శరీరలావణ్యం ఎటువంటిదో తెలుస్తున్నది. వాడిపోతున్నవాటిమధ్యా, వికసించని తోటల్లోనూ అతడెప్పటికీ నివసించడు. పూలమధ్య, పరిమళాల మధ్యనే అతడు స్థిరపడతాడు. ప్రేమదేవత సౌందర్యం గురించి నేను చాలానే చెప్పాను. ఇంకా చెప్పవలసింది ఇంకా మిగిలే ఉంది. అతడి గుణగణాల గురించి ఇప్పుడు చెప్పవలసి ఉంది. అతడిలోని అత్యంత విశిష్ట గుణమేమిటంటే అతడు ఏ మనిషికిగాని, దైవానికి గాని ఎన్నడూ హాని తలపెట్టడు, అలాగే వారినుంచి హానిపొందడు. అతడెప్పుడయినా బాధపడితే అది బలప్రయోగం వల్ల మాత్రం కానే కాదు. నిర్బంధం, బలప్రయోగాలు అతణ్ణి సమీపించలేవు. అతడు ఏ పనిచేసినా అందులో బలప్రయోగానికి తావే ఉండదు. మనుషులంతా కూడా ఆయన్ని సేవిస్తే అది తమ ఇష్టపూర్వకంగానే సేవిస్తారు. ఎక్కడైతే స్వేచ్ఛిత కష్టభోగం ఉంటుందో, అక్కడ మన నగరాధినేతలు చెప్పినట్టుగా, న్యాయం ఉంటుంది. ఆయన న్యాయశీలుడు మాత్రమే కాదు, సంయమనశీలి కూడా. సుఖాలకీ, కోరికలకీ సంయమనశీలినే నిజమైన నాయకుడు. ఏ సుఖం కూడా ప్రేమదేవతను శాసించలేదు. అందుకు బదులుగా ప్రేమదేవతనే సుఖసంతోషాల యజమాని. అవి ఆయన పరిచారికలు. వాటిని జయించాడంటేనే ఆయన తప్పకుండా సంయమన శీలుడన్నట్టు లెక్క. ధైర్యం విషయానికొస్తే యుద్ధదేవత కూడా ప్రేమదేవత ముందు నిలబడజాలడు. నిజానికి యుద్ధం కూడా ప్రేమచేతిలో బందీ. కథలో2 చెప్పినట్టుగా, ఆఫ్రొడైట్ ప్రేమనే యుద్ధాన్ని పరిపాలించేది. యజమాని సేవకుడికన్నా బలవంతుడైవుంటాడు. ధైర్యశాలులెందరినో జయించినవాడు అందరికన్న ధైర్యశాలి అయి ఉండక తప్పదు కదా.’

‘ఆయన ధైర్యం గురించీ, న్యాయశీలతగురించీ, సంయమనం గురించీ మాట్లాడేను. ఇక ఆయన వివేకం గురించి చెప్పాలి. ఆ విషయం కూడా నా శక్తికొద్దీ వివరిస్తాను. అన్నిటికన్నా ముందు ప్రేమదేవత ఒక కవి (ఎరిక్సిమేకస్ తన కళగురించి గొప్పగా చెప్పుకున్నట్టే, నేను కూడా నా కళగురించి చెప్పుకోవాలి కదా). అతడు కవి మాత్రమే కాదు, ఇతరుల్లో కవిత్వానికి ప్రేరణకలిగించేది కూడా అతడే. తను కవి కాకపోతే మరొకర్ని కవిగా ఎలా మార్చగలుగుతాడు? అతడి స్పర్శ తగిలితే చాలు, అంతకుముందు తమకి సంగీత జ్ఞానం లేకపోయినా కూడా, ప్రతి ఒక్కరూ కవులుగా మారిపోతారు. ప్రేమదేవత మంచి కవి అనీ, లలితకళలన్నిటిలోనూ సిద్ధహస్తుడనీ చెప్పడానికి ఇదే నిరూపణ. ఎందుకంటే ఎవరేనా తమలో లేనిదాన్ని మరొకరికి ఇవ్వలేరు కదా. తమకి ప్రావీణ్యం లేకుండా ఏ విద్యనీ మరొకరికి నేర్పలేరు కదా. సమస్త జంతుజాల సృష్టికీ ఆయనే కారణం కాదని ఎవరనగలరు? జీవకోటి మొత్తం ఆయన సంకల్పం వల్ల జనించిందే కదా.’

22

‘ఇక కళాకారుల్లో కూడా ప్రేమదేవతవల్ల ఎవరు ఉత్తేజితులవుతారో వారే కదా యశోవంతులవుతారు. ప్రేమ ఎవరిని స్పృశిస్తుందో వాళ్ళకి చీకటి లేదు. వైద్యశాస్త్రం, విలువిద్య, జ్యోతిష్యం అపోలో కానుకలు. కాని ప్రేమదేవత మార్గదర్శనంలోనే అపొలో వాటిని మనకు అందించాడు. అపోలో కూడా ప్రేమదేవత శిష్యుడే కదా. అలాగే సంగీతదేవత స్వరాలు, హెఫస్టస్ లోహకళ, ఎథినా3 చేనేత, మనుషులపైనా, దేవతలపైనా సర్వేశ్వరుడు జ్యూస్ నియంత్రణ- ఇవన్నీ కూడా ప్రేమవల్లనే సాధ్యమవుతున్నాయి. వాటిని కనుగొన్నది ప్రేమదేవతనే. అసలు దేవతావ్యవస్థనే ప్రేమ వల్ల జరిగిన ఏర్పాటు. ఎందుకంటే అవ్యవస్థ ప్రేమకి సంబంధించింది కాదు’.

‘నేను మొదట్లోనే చెప్పినట్టు పూర్వపురోజుల్లో దేవతలమధ్య భయంకరమైన విషయాలు జరిగాయి. అవన్నీ అవసరార్థం జరిగినవి. కాని ప్రేమదేవత ప్రభవించిన తర్వాత ప్రేమనుంచి సౌందర్యాభిలాష జనించింది. దాన్నుంచే ద్యావాపృథ్వుల్లోని సమస్తకల్యాణగుణాలూ జనించాయి. కాబట్టి ఫేద్రోస్, ప్రేమదేవత దేవతలందరిలోనూ బహుసుందరుడూ, శ్రేష్టుడూ మాత్రమే కాదు, తక్కిన వాటన్నిటిలోనూ సుందరమైందీ, శివంకరమైందీ ప్రతిఒక్కదానికీ ఆయనే కారకుడు. ఈ సందర్భంగా నాకో కవితావాక్యం గుర్తొస్తోంది.’

ఎవరు భూమికి శాంతిని ప్రసాదిస్తారో, తుపానుల్ని సద్దుమణిగేట్టు చేస్తారో, ఎవరు ఝంఝామారుతాల్ని నిశ్చలమొనరుస్తారో, ఎవరు వేదనాభరిత హృదయాలకు సాంత్వననివ్వగలుగుతారో, అతణ్ణే మనం దేవుడని పిలుస్తాం.’


వివరణలు:

1. ఎట్: గ్రీకు పురాణాల్లో ఒక దేవత. పొరపాట్లకీ, సర్వనాశనానికీ, మోసపోడానికీ అధిదేవత.
2. కథలో చెప్పినట్టు: హోమర్ ఒడెస్సీలో వర్ణించినట్టుగా
3. ఎథీనా: గ్రీకు పురాణగాథల్లో దేవత. వీరులకి సంరక్షకురాలు.

13-10-2023

2 Replies to “ప్రేమగోష్ఠి-6”

  1. ఒక ఉద్గ్రంధాన్ని ఇలా యధాతధంగా మాకు అందజేస్తున్నందుకు మీకు సదా ఋణపడి ఉంటాం మాష్టారూ.నమోనమః.

Leave a Reply

%d