ప్రేమగోష్ఠి-5

(ఏథెన్సుకి చెందిన అగధాన్ ఇచ్చిన విందులో సోక్రటీస్ తో పాటు మరికొందరు మిత్రులు కూచుని ప్రేమగురించి మాట్లాడుకున్న విశేషాలు అరిస్టొడెమస్ అన్నవాడిద్వారా విన్న అపొల్లోడోరస్ గ్లాకెన్ అనేవాడికి చెప్తున్నాడు. ఆ గోష్టిలో ముందు ఫేద్రోస్, ఆ తర్వాత పౌసనియస్, ఎరిక్సిమేకస్ ప్రసంగించారు. అరిస్టొఫెనీస్ కి మధ్యలో ఎక్కిళ్ళు రావడంతో అతడు ఎరిక్సిమేకస్ తర్వాత ప్రసంగం మొదలుపెట్టాడు)

ఆ మాటకొస్తే అన్ని యజ్ఞాలూ, మొత్తం దైవసంబంధమైన క్రతుకాండా, మనుషులకీ, దేవతలకీ మధ్య భావప్రసారం ఇవన్నీ కూడా మంచిని ఎలా కాపాడుకోవడం, చెడుకి ఎలా చికిత్స చేయడం అన్నదానిగురించే. తను చేసే పనులన్నిటిలోనూ మనిషి సామరస్యపూర్వకమైన ప్రేమని ఆమోదించి, పెంపొందింపచేయడానికి బదులు మరొక రకమైన ప్రేమ, అంటే లౌకిక ప్రేమని అనుసరించడమే, నా దృష్టిలో, అత్యంత అపవిత్ర కార్యక్రమం. అది తల్లిదండ్రులవిషయంలోగానీ, దేవతల విషయంలోగానీ; బతికున్నవాళ్ళ విషయంలోగానీ, మరణించినవాళ్ళ విషయంలోగానీ. కాబట్టి దైవశాసనాన్ని గుర్తుపట్టడమంటే ఇటువంటి లౌకిక ప్రేమల్ని గుర్తుపట్టడం, వాటిని సవ్యమొనర్చుకోవడం. దైవహృదయాన్ని తెలుసుకోవడమంటే మనుషులకీ, దేవతలకీ మధ్య సమాధానం కుదర్చడం, మానవప్రేమల్లోని ధార్మిక, అధార్మిక లక్షణాలపట్ల మరింత మెలకువ సంపాదించడం. ప్రేమలోని సర్వశక్తిమత్వం అది. దాని మహిమ అది.

శుభలక్షణసమన్వితమైన ప్రేమ సామరస్యంవల్లా, న్యాయదృష్టివల్లా బలపడుతుంది. మనుషుల్లోగానీ, దేవతల్లోగాని దాని శక్తి అపారం. మన సకల సంతోషాలకూ, మొత్తం సామరస్యానికే అదే ఆధారకేంద్రం. మనల్ని మనలో మరొకరితోనూ, పైనున్న దేవతలతోనూ స్నేహితులుగా మార్చగలిగేది అదే.

ప్రేమగురించి మరింత ప్రశంసిస్తూ చెప్పవలసిన మరెన్నో సంగతులు చెప్పకుండానే వదిలేసాను అని ఒప్పుకుంటున్నాను. కాని అది కావాలని చేసింది కాదు. నేను వదిలిపెట్టినదాన్ని, అరిస్టొఫెనీస్, నువ్వు పూరించు, లేదా నీకు నచ్చిన పద్ధతిలో ప్రేమప్రశంస చేపట్టు. చూడబోతే నీ ఎక్కిళ్ళు ఆగిపోయినట్టే ఉంది’ అని అన్నాడు ఎరిక్సిమేకస్.

15

‘అవును, ఎక్కిళ్ళు ఆగిపోయాయి’ అన్నాడు అరిస్టొఫెనీస్, ప్రసంగం మొదలుపెడుతూ. ‘అయితే, తుమ్మడం మొదలెట్టాకగానీ తగ్గలేదనుకో. బహుశా ఇలా పుల్లపెట్టి ముక్కులో తిప్పుకోడమంటేనూ, ఈ తుమ్ములంటేనూ మన దేహంలో ఉండే సామరస్యానికి బాగా ఇష్టంలాగా ఉంది. ఎందుకంటే ఇలా తుమ్మడం మొదలుపెట్టానో లేదో అలా ఎక్కిళ్ళు ఆగిపోయాయి’ అని కూడా అన్నాడు.

‘జాగ్రత్త మిత్రమా, నువ్వు మాట్లాడటానికి లేస్తూ, నన్ను ఆటపట్టిస్తున్నావు. నువ్వు బాగానే మాటాడొచ్చేమోగాని, చూస్తాను, నాకు మాత్రం అవకాశం దొరక్కపోదా, నిన్ను వేళాకోళం ఆడటానికి’ అని అన్నాడు ఎరిక్సిమేకస్.

‘సరే, మంచిది’ అన్నాడు అరిస్టొఫెనీస్ నవ్వుతూ. ‘నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, కాని మరీ అంతలా గుర్రుమంటూ చూడకు. తీరా నేను మాటాడబోయేటప్పుడు నలుగురినీ నవ్వించడానికి బదులు నేనే నవ్వులపాలవుతానేమోనని భయంగా ఉంది.’

‘నువ్వు ముందే ఈ మాటలు చెప్పేసి తప్పించుకుందాం అనుకుంటున్నావేమో, అరిస్టొఫెనీస్, జాగ్రత్త, నువ్వు మాట్లాడేది మొత్తం మాట్లాడేక, అప్పుడు చూస్తాను, నిన్ను వదిలిపెట్టాలో లేదో’ అన్నాడు ఎరిక్సిమేకస్.

అరిస్టొఫెనీస్ తన చర్చలో మరొక పార్శ్వానికి తెరతీసాడు. పౌసనియస్, ఎరిక్సిమేకస్ ల లాగా కాకుండా, అతడు ప్రేమని మరొక పద్ధతిలో ప్రశంసించాలనుకున్నాడు. ‘మనుషులు ప్రేమదేవతని నిర్లక్ష్యం చేసినదాన్ని బట్టి చూస్తే అసలు వాళ్ళు ప్రేమశక్తిని ఇప్పటిదాకా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు’ అని అనిపిస్తోంది అన్నాడు అరిస్టొఫెనీస్. ‘మనుషులే గనుక ప్రేమబలాన్ని సరిగా అర్థం చేసుకుని ఉంటే ఈ పాటికి దేవాలయాలు కట్టి ఉందురు, గొప్పగా అర్చావేదికలు ప్రతిష్ఠించి ఉందురు, గంభీరమైన పూజలూ, ప్రార్థనలూ మొదలుపెట్టి ఉందురు. కాని ఇవేవీ జరగలేదు. నిజానికి ఇవి తప్పకుండా చేసి తీరవలసినవి. ఎందుకంటే, దేవతలందరిలోనూ, ప్రేమ దేవత మనుషులకి సర్వశ్రేష్ఠ స్నేహితుడు. మానవాళి సంతోషానికి విఘాతం కలిగించే దోషాల్ని నయం చేసి వాళ్ళని స్వస్థపరచగల హితైషి అతడు. అతడి శక్తి ఎటువంటిదో ముందు వివరిస్తాను. ఇప్పుడు నేను మీతో చెప్పేదాన్ని రేపు మీరు మొత్తం ప్రపంచం వినేలాగా చెప్పండి. మొదట నా ప్రసంగంలో మనిషి మౌలిక స్వభావాన్ని వివరిస్తాను. ఆ స్వభావానికి ఏమి జరిగిందో కూడా చెప్తాను. అసలు మొదట్లో మానవస్వభావం ఇలా ఉండేది కాదు, వేరేలా ఉండేది.

ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా మనుషులు లైంగికంగా రెండువిధాలుగా ఉండేవారు కాదు. మూడు విధాలుగా ఉండేవారు. పురుషుడు, స్త్రీ, వారిద్దరూ కలిసి ఉండే మరొక రూపం. ఒకప్పుడు అస్తిత్వంలో ఉండి, ఇప్పుడు కనుమరుగైన, ఆ మిథున రూపాన్ని స్త్రీ-పురుషమూర్తి1 అని పిలిచేవారు. ఇప్పుడు ఆ పదం అర్థనారిగా గౌరవహీనంగా మిగిలిపోయింది. మరొకసంగతేమిటంటే ఆదిమమానవుడు గోళాకారంగా ఉండేవాడు. అతడి వీపూ, పక్కలూ కూడా ఒక గోళాకృతిలో ఒంపు తిరిగి ఉండేవి. అతడికి నాలుగు చేతులూ, నాలుగు పాదాలూ ఉండేవి. ఒకటే తల, కాని రెండు ముఖాలుండేవి. ఆ రెండు ముఖాలూ పరస్పర విరుద్ధదిశల్లో చూస్తుండేవి. మెడగుండ్రంగా ఉండేది. ఇంకా నాలుగు చెవులుండేవి. రెండు జతల జననాంగాలుండేవి. తక్కినవాన్నీ కూడా ఆ రూపాన్ని తగ్గట్టే ఉండేవి, అదంతా మీరూహించుకోవచ్చు.

16

ఇప్పుడు మనుషులు నడుస్తున్నట్టే అప్పుడు కూడా మనిషి నిటారుగానే నడిచేవాడు. ముందుకీ, వెనక్కీ, ఎలా కావాలంటే, అలా. మరీ వేగంగా పరుగెత్తాలనుకున్నప్పుడు తన నాలుగు చేతుల్తోనూ, నాలుగు పాదాలతోనూ వేగంగా దొర్లిపోగలిగేవాడు. పెద్ద పెద్ద గిన్నెలు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉండేది అలా దొర్లుతుండటం చూస్తే. ఇక లింగవిభజన విషయానికి వస్తే నేను ముందే చెప్పినట్టుగా మూడు లింగాలుండేవి, సూర్యుడూ, చంద్రుడూ, భూమీ-మూడున్నట్టుగా. మనిషి మౌలికంగా సూర్యపుత్రుడు. స్త్రీ అవనిజ. స్త్రీ-పురుషమూర్తి చంద్రజుడు. ఎందుకంటే చంద్రుడిలో సూర్యుడూ, భూమీ రెండూ ఉన్నాయి కదా. ఆ మూడు లింగమూర్తులూ కూడా మొదట్లో వారి తల్లుల్లాగే గుండ్రంగా ఉండేవారు. వాళ్ళ శక్తీ, సామర్థ్యం అపారంగా ఉండేవి. వాళ్ళ హృదయాల్లో భావాలు మహత్తరంగా ఉందేవి. హోమర్ అన్నట్టుగా ఒటస్, ఎఫియాల్టిస్2 ల కథ వాళ్ల గురించి చెప్పిందే. వాళ్ళు ద్యులోకం అంచులు తాకి, దేవతల్ని కూడా దాటిపోగలిగేట్టుగా ఉండేవారు. దాంతో దేవసభలో ఆందోళన చెలరేగింది. ఒకప్పుడు రాక్షస జాతిని సంహరించినట్టుగానే ఈ జాతిని అశనిపాతాల్తో సంహరించవచ్చుగానీ, అప్పుడు మనుషులు తమకి సమర్పిస్తున్న ఆరాధనలూ, నైవేద్యాలూ ఆగిపోతాయేమో అని అనుమానమొచ్చింది. మరొకవైపు ఈ మానవుల ఔద్ధత్యాన్నీ, విశృంఖలత్వాన్నీ దేవతలు ఇంకెంతమాత్రం సహించలేని స్థితికూడా నెలకొనింది. ఎట్టకేలకు, చాలా తీవ్రంగా మథనపడ్డాక, జ్యూస్ ఒక దారి కనుక్కున్నాడు. ‘ ‘వాళ్ళ గర్వాన్ని అణచివేసి వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి నాకో ఆలోచన తట్టింది. మనుషజాతి కొనసాగుతుందిగానీ, మనం వాళ్ళని రెండుగా విడదీద్దాం. అప్పుడు వాళ్ళు తమ శక్తిలో సన్నగిల్లి, సంఖ్యలో మాత్రం అధికమవుతారు. దానివల్ల వాళ్ళనుంచి మనకి ప్రయోజనం కూడా ఉంటుంది. వాళ్ళు రెండు కాళ్ళమీదా నిటారుగా నడుస్తారు. కాని తమ అహంకారం తగ్గించుకోకుండా ఇంకా పొగరుమోత్తనంతో నడిస్తే మాత్రం వాళ్ళని నేను మళ్ళా రెండు ముక్కలు చేసి ఒంటికాలిమీద గెంతేటట్టు చేస్తాను’ అని అన్నాడాయన. అప్పుడు మనుషుల్ని ద్విధావిభజించాడు.  పచ్చడి పెట్టడంకోసం బేరికాయని రెండుముక్కలు చేసినట్టు. లేదా ఒక సన్నటితాటితో గుడ్డుని రెండుముక్కలుగా తుంచినట్టు, వాళ్లని ఒకరివెనక ఒకరిని రెండేసి ముక్కలు చేసాడు. అప్పుడు వాళ్ళ మెడా, ముఖమూ దగ్గరగా చేర్చి వాళ్ల ఆకృతులు పూర్తిచేయమని అపోలో3ని ఆదేశించాడు. ఆ విధంగా ఆయన మనుషులకు వినయవిధేయతల పాఠం నేర్పాడు. ఆ ఖండితాంగాల్ని దగ్గరచేసి వాటికి సంపూర్ణాకృతినిచ్చి, ఆ గాయాల్ని స్వస్థపరిచే పని అపోలోకి అప్పగించాడు. దాంతో అపోలో మనిషి ముఖాన్ని ఒకవైపుకి తిప్పి, చుట్టూ ఉన్న చర్మాన్ని ఒకపక్కకు లాగేడు. మనం మన భాషలో పొట్ట అని పిలిచేది అదే. అదొక తోలుసంచిలాంటిది. దానికి మధ్యలో నోరులాగా ఒక బెజ్జం పెట్టి దాన్ని మళ్లీ ముడేసాడు. (ఆ ముడినే మనం బొడ్డు అని పిలుస్తున్నాం.)

17

ఆ తర్వాత అతడు వక్షస్థలాన్ని తీర్చిదిద్దాడు. చెప్పులు కుట్టేవాడు సానమీద తోలుని సాగదీసినట్టుగా ముడతల్ని చాలావరకూ సాపుచేసేసాడు. అయితే పూర్వం ఉండే ఆకారానికి గుర్తుగా పొట్టదగ్గరా, బొడ్డుదగ్గరా కొన్ని ముడతలు వదిలిపెట్టేసాడు. ఇలా రెండుగా విభజించాక, మనిషిలోని రెండు భాగాలూ, తన పూర్వపు అర్థభాగంకోసం తహతహలాడటం మొదలుపెట్టాయి. ఒకదానికొకటి చేరువగా వచ్చి, తమ బాహువుల్తో ఒకరినొకరు దగ్గరగా లాక్కుని, పరస్పరం కౌగిలింతల్లో ఒకరినొకరు చుట్టుకుపోవడం మొదలుపెట్టారు. వారిద్దరూ కలిసి ఒకటిగా ఎదగాలని ఆరాటపడటం మొదలుపెట్టారు. ఒకరిని వదిలి మరొకరు ఏమీ చెయ్యడానికి ఇష్టపడక, వారు ఆకలితో కృశిస్తూ తమ దేహాల్ని తాము పట్టించుకోకపోవడం వల్ల దాదాపుగా మరణావస్థకు చేరుకున్నారు. వారిద్దరిలో ఒకరు మరణించి, మరొకరు మిగిలి ఉంటే, ఆ మరొక భాగం మరొక అర్థభాగం- స్త్రీ లేదా పురుషుడు అని మనం పిలుస్తున్నామే, అది, పూర్తి స్త్రీదేహం లేదా పూర్తి పురుషదేహం కోసం వెతుక్కుంటూ దానికి కరుచుకుపోయేది. ఆ నలుగులాటలో వాళ్లు నశించిపోవడం మొదలుపెట్టారు. సర్వేశ్వరుడు జ్యూస్ కి వాళ్ల పరిస్థితి చూసి జాలికలిగింది. ఆయన మరొక కొత్త దారి ఆలోచించాడు. మనుషుల దేహాలు వెనకవైపు ఉన్నవాళ్ల జననాంగాల్ని ఆయన ముందువైపుకు తీసుకొచ్చాడు.. మొదట్లో ఇలా ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు చిమ్మెటల్లాగా వాళ్ళ శుక్రకణాల్ని నేరుగా భూమిలో విత్తడానికి బదులు ఒకరిలో మరొకరు వదిలిపెట్టే ఏర్పాటు చేసాడు. ఈ కొత్త ఏర్పాటు వల్ల స్త్రీలద్వారా పురుషులు కూడా పుట్టే అవకాశం ఏర్పడింది. స్త్రీపురుషులు తమ పరస్పర పరిష్వంగాల వల్ల సంతతిని కనగలిగే వీలుచిక్కింది, తద్వారా మనుష్య జాతి కొనసాగే అవకాశం కలిగింది. లేదా ఒక పురుషుడు మరో పురుషుణ్ని సమీపించినప్పుడు కూడా సంతోషం పొంది ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వీలు కలిగింది. కాబట్టి ఒకరిపట్ల మరొకరికి కలిగే ఈ ఆకాంక్ష మనలో అత్యంత ప్రాచీనకాలం నుంచీ వస్తున్న దాహం. ఆ కోరిక ద్వారా మనం మన మౌలిక స్వభావానికి తిరిగి చేరుకోగలుగాం, ఇద్దరం ఒకరు కాగలుతాం, మనిషి చిక్కుకున్న పరిస్థితి నుంచి అతణ్ణి స్వస్థపరుచుకోగలుగుతున్నాం. మనం ఇరువురం విడివిడిగా ఉన్నప్పుడు, సగానికి కోసిన చేపలాగా ఒక అర్థభాగంతోటే సరిపెట్టుకోవలసి రావడం తప్పనిసరి అమరిక అయి కూచుంది. కాబట్టే మనం ఎప్పుడూ మన రెండో భాగంకోసం వెతుక్కుంటూనే ఉంటాం. ఒకప్పుడు స్త్రీ-పురుషమూర్తిగా, ఒక మిథునంగా ఉన్న అస్తిత్వంలో, ఇప్పుడు పురుషులుగా విడిపోయినవాళ్ళు స్త్రీప్రేమికులుగా మారేరు. వ్యభిచారులైన పురుషులూ, కాముకులైన స్త్రీలూ కూడా ఈ కోవలోకే వస్తారు. అలా కాక, అప్పుడు పూర్తిగా స్రీలుగా ఉన్నవాళ్ళనుంచి ఇప్పుడు పూర్తిగా స్త్రీలుగా విడివడ్డవాళ్ళు పురుషులకోసం తపించకుండా స్త్రీలతోటే అనుబంధం పెంచుకోవాలనుకుంటారు. పరస్పర స్త్రీప్రేమికులంతా ఈ కోవలోకి వస్తారు. అలాగే ఒకప్పటి పురుషులనుంచి ఇప్పుడు పురుషులుగా విడివడ్డవారు ఇంకా యువకులు, పురుషుల వెంట పడి వాళ్ళని కావిలించుకోవాలనీ, కలిసిపడుకోవాలనీ కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ స్వభావంలో పురుషస్వభావమే అధికంగా ఉందికాబట్టి కౌమారదశలోనూ, యవ్వనదశలోనూ ఇటువంటి పురుషులే అత్యుత్తమ పురుషులని చెప్పవచ్చు.

18

అటువంటి మగవాళ్ళకి సిగ్గులేదని కొందరంటారుగాని అది నిజం కాదు. ఎందుకంటే వాళ్ళు అలా ప్రవర్తించేది సిగ్గులేకకాదు, వాళ్ళు పురుషులుగానూ, వీరోచితంగానూ ఉండాలనుకుంటున్నారుకాబట్టీ, పురుషసౌందర్యం వారిలో పొంగిపొర్లుతున్నదికాబట్టీ, వాళ్ళు తమలా కనిపించేవాళ్ళని దగ్గరగా తీసుకోవాలనుకుంటారు. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక మన నేతలుగానూ, రాజనీతివేత్తలుగానూ రూపొందుతున్నారు. నేను చెప్పేదానిలో సత్యముంది అనడానికి ఇదే సాక్ష్యం. వాళ్ళు యుక్తవయసురాగానే యువకుల్ని ప్రేమిచడం మొదలుపెడతారు, సహజంగానే పెళ్ళిమీదా పిల్లలమీదా ఆసక్తి చూపించరు. ఒకవేళ పెళ్ళిచేసుకున్నా, పిల్లల్ని కన్నా,  అది కేవలం సామాజిక బాధ్యతవల్ల మాత్రమే. కాని తమలాగా అవివాహితులైన మరొకరితో జీవించడానికి వీలైతే వారికదే ఎంతో తృప్తి. అటువంటి స్వభావం కలిగినవాళ్ళు ప్రేమించగలుగుతారు, తమకి లభిస్తున్న ప్రేమకి బదులివ్వగలుగుతారు. తమ లాంటి స్వభావంకలిగినవాళ్లనే హృదయానికి హత్తుకోడానికి సదా సంసిద్ధులుగా ఉండగలుగుతారు. వాళ్ళల్లో ఒకరు తమ సహభాగాన్ని కలుసుకున్నప్పుడు, ఆ సహభాగం నిజానికి వాళ్ల అర్థభాగమే కాబట్టి, వాళ్ళు యువకుల్ని ప్రేమించేవాళ్ళు కానీ, కాకపోనీ, అన్నిటికన్నా ముందు గొప్ప ప్రేమలోనూ, స్నేహంలోనూ, సాన్నిహిత్యంలోనూ మునిగిపోతారు. ఒకరు మరొకరి దృష్టిపథం నుంచి పక్కకు తప్పుకోవాలనుకోరు. ఇంకా చెప్పాలంటే, ఒక్క క్షణం కూడా పక్కకు జరగాలనుకోరు. తమ జీవితాలు మొత్తం కలిసిగడిపెయ్యగలవాళ్ళు ఇటువంటివాళ్ళే. కానీ తమలో ఒకరిపట్ల మరొకరికి అంత కాంక్ష ఎందుకు చెలరేగుతున్నదో వారు వివరించలేరు. అలా వాళ్ళల్లో పరస్పరం ఒకరిపట్ల మరొకరికి కలుగుతున్న ఆరాటం మామూలుగా స్త్రీపురుషుల్లో కలిగే లైంగికాభిలాషలాంటి కాదు. అది మరేదో తరహాది, ఇద్దరి ఆత్మలూ దానికోసమే కొట్టుకుపోతున్నప్పటికీ దాన్ని వారు వివరించి చెప్పలేరు. కాని దాని గురించి వాళ్ళ వాళ్ళ ఆత్మల్ని మాత్రం ఏదో ఒక అనుమానం, ఒక సందేహం తొలిచివేస్తూనే ఉంటుంది. వాళ్ళు ప్రేమైకచిత్తులై ఒకరిపక్కన ఒకరు పడుకున్నప్పుడు,  హెఫిస్టస్4 తన పనిముట్లు పట్టుకొచ్చి ‘చెప్పండి, మీకు ఒకరినుంచి ఒకరి ఏం కావాలి?’ అనడిగితే వాళ్ళేమీ చెప్పలేరు. సరే, వాళ్ళలా అయోమయంలో పడిపోవడం చూసి అతగాడు వాళ్ళతో ఇలా అన్నాడనుకుందాం: ‘మీరిద్దరూ ఒకరిగానే ఉండాలనుకుంటున్నారా? ఎప్పటికీ, పగలూ, రాత్రీ, ఒకరి సన్నిధిలో మరొకరు ఉండాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు కోరుకునేదిదే అయితే నేను మీ ఇద్దర్నీ కరిగించి ఒక్కటిగా పోతపొయ్యడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు మీరిద్దరూ ఒకరుగా, ఒకే ఒక్క మనిషిలాగా, ఒకటే జీవితం జీవించగలుగుతారు. మీరు మరణించినా కూడా పాతాళలోకానికి ఒకే ఆత్మగా ప్రయాణిస్తారే తప్ప వేరువేరుగా పయనించరు. మీ ప్రేమానురాగమంతటితోనూ మీరు కోరుకునేది ఇదేనా, నేను చెప్పినట్టు చేస్తే మీకిష్టమేనా తెలుసుకోడానికే ఇలా అడుగుతున్నాను’ అని అడిగాడనుకోండి. అప్పుడు వాళ్ళిద్దరిలో ఒక్కరు కూడా ఆ ప్రతిపాదనని తిరస్కరిస్తారని అనుకోను. ఎందుకంటే ఇలా ఇద్దరూ రెండుగా కరిగిపోయి ఒకరుకావడం, ఒకరిలో ఒకరు ఒదిగిపోవడం, ఇదే, తమ ప్రాచీన కాంక్ష ఇదే అని ఒప్పుకోడానికి ఎంతమాత్రం సందేహించరు. ఎందుకంటే మానవస్వభావం మౌలికంగా ఒకటే, మనం ఏకంగానే ఉండేవాళ్లం, ఇలా ఆ ఏకత్వంకోసం మనలో చెలరేగుతున్న ఆ ప్రాచీన దాహాన్నే నేను ప్రేమ అని పిలుస్తున్నాను.’

19

అరిస్టోఫెనీస్ ఇంకా ఇలా చెప్తున్నాడు: ‘మనం ఏకంగా ఉండే కాలం ఒకటుండేది. కాని మన కుటిలత్వం వల్ల దేవుడు మనల్ని విడదీసేసాడు. అర్కాడియన్లని స్పార్టన్లు చెల్లాచెదురుగా గ్రామాల్లోకి తరిమేసినట్టు5.’


వివరణలు

1. స్త్రీపురుషమూర్తి: ఇంగ్లిషులో androgyne. ఇది ప్లేటో అరిస్టొఫెనీస్ ద్వారా చెప్పించిన ఒక పురాణకథ. ఈ కథని ప్లేటోనే కల్పించాడు. కాని, స్త్రీ-పురుషులిద్దరూ ఒకే దేహంలో ఉండే భావన ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని నాగరికతల్లోనూ, ఆదిమసంస్కృతుల్లో కూడా కనిపిస్తుంది. స్త్రీ-పురుషులిద్దరూ ఒకే దేహంలో, horizontal గా అంటే, పైన వక్షోజాలు, కింద శిశ్నం ఉండే రూపంలోనూ లేదా vertical గా, అంటే, సగం భాగం స్త్రీగానూ, సగంభాగం పురుషుడిగానూ ఉండే రూపాలు వివిధ సంస్కృతుల్లో కనిపిస్తున్నాయి. మన అర్థనారీశ్వరమూర్తి కూడా ఇటువంటి స్త్రీపురుషమూర్తినే. అయితే, సృష్ట్యాదిలో ప్రజాపతికూడా ఒకడుగానే అంటే androgyne గానే ఉన్నాడనీ, తర్వాత అతడులో రెండుగా మారి, సృష్టి మొదలుపెట్టాడనీ బృహదారణ్యకం చెప్తున్నది. బైబిలు కూడా ఆడం మొదట ఒకడే ఉన్నాడనీ, ఆ తర్వాత తననుంచి ఈవ్ ను వేరుచేసుకున్నాడనీ చెప్తున్నది. స్త్రీ-పురుషులిద్దరూ ఒకేదేహంలో ఉండి ఆ తర్వాత విడివడ్డ ఈ భావనల్ని splitting androgyne అనీ, అలాకాక, స్త్రీపురుషులిద్దరూ ఒకేదేహంగా కలిసిపోయి ఉండే స్థితిగురించిన భావనల్ని fusing androgyne అనీ అంటారు. ఉదాహరణకి, మన శివలింగం fused androgyne కి ఉదాహరణ అని చెప్పవచ్చు. లింగ పరంగా స్త్రీ,పురుషవిభేదాలవల్ల మానవ జీవితంలో తలెత్తిన ఆందోళనకి అతీతమైన స్థితి పూర్వం ఉండేదనీ లేదా రాగలదనీ అనుకోవడంలోంచే స్త్రీ-పురుషమూర్తి భావన రూపుదిద్దుకుంది.

2. ఒటస్, ఎఫియాల్టస్: గ్రీకు పురాణకథల్లో అలావోడే అనే జీవులు అతృప్తజీవులు, దుస్స్వప్నసమానులు. వాళ్ళు అలోఇయస్ భార్య ఇఫిమేడియాకీ, సముద్రాధిదేవత పొసైడన్ కీ పుట్టినవాళ్ళు. రాక్షసకాయులు. వాళ్ళు ప్రతినెలా తొమ్మిదేసి అంగుళాల చొప్పున పెరుగుతూ దేవతలకి ప్రమాదకరంగా మారారు.

3. అపోలో: గ్రీకు దేవత. గ్రీకు ద్వాదశ ఆదిత్యుల్లో ఒకడు. కవిత్వానికీ, స్వస్థతకీ, సంగీతానికీ, జ్ఞానానికీ, సౌందర్యానికీ, యవ్వనానికీ, వ్యవస్థానిర్మాణాలకీ అధిదేవత. అతడు గ్రీకు స్వభావంలోని సౌకుమార్యానికీ, నైతికతకీ, క్రమశిక్షణకీ ప్రతీక కాగా, విశృంఖలత్వానికీ, అడ్డులేని భావోద్వేగాలకీ డయోనిసిస్ ప్రతీక.

4. హెఫిస్టస్: గ్రీకు దేవత. అగ్నికి అధిదేవత. దేవతలకమ్మరి. అతని చేతిలో ఎప్పుడూ సుత్తి, పట్టకారు ఉంటాయి.

5. స్పార్టన్లు అర్కాడియన్లని గ్రామాల్లోకి తరిమేసినట్టు: ఇది సింపోజియం కథాకాలం ( క్రీ. పూ. 416) కన్నా తర్వాతా, కాని సింపోజియం రచనకన్నా ముందూ, అంటే క్రీ. పూ. 385 లో జరిగిన సంఘటన. కాని పొరపాటున రచయిత, కథాకాలం కన్నా తర్వాతి సంఘటనని కథలో పేర్కొన్నాడు. ఈ ప్రస్తావన వల్లనే సింపోజియం రచనాకాలం క్రీ. పూ. 385 తర్వాత అని చెప్పడానికి ఆధారం దొరికింది.

Featured image: The Birth of Venus by Botticelli (-1510).

12-10-2023

4 Replies to “ప్రేమగోష్ఠి-5”

  1. చాలా విబ్రాంతినీ కలిగించిందీ భాగం. పురుషునిలో స్త్రీ.. స్త్రీలో పురుషుడు.. శరీరాల ఏకత.. భావనల ఏకత.. అందులో కలిగే కొంత ఆనందం.. తృప్తి..
    గొప్ప అంశాలు.
    వీటి గురించి ఆలోచించడం ఈ రోజంతా నా పని.. 🙏🙏

  2. కొత్త కొత్త దారుల్లో నడక కుతూహలంగా ఉంది. దీని సారాంశాన్ని కాచి వడబోసి కొంత ఆధునికత మేళవించి ఒక గొప్ప నాటకం రూపొందించేందుకు
    అవకాశం కనుపిస్తూంది. ఫుట్ నోట్స్ లో అపోలో ,
    హెఫిస్టస్ ఇరువురుకీ ఒకే మ్యాటర్ ఉంది . అర్థం కాలేదు.

Leave a Reply

%d