ప్రేమగోష్ఠి-4

(ఏథెన్సులో తాను రాసిన నాటకానికి బహుమతి వచ్చిన సందర్భంగా అగధాన్ ఒక విందు ఏర్పాటు చేసాడు. సోక్రటీస్ తో సహా మరికొందరు మిత్రులు ఆ విందుకు హాజరయ్యారు. విందుముగిసాక, వారు పానగోష్ఠికి బదులు ప్రేమ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ముందు ఫేద్రోస్ ప్రేమదేవత ఘనతను కీర్తిస్తూ ప్రసంగించాడు. ఆ తర్వాత ఎరిక్సిమేకస్ రెండు రకాల ప్రేమలున్నాయని చెప్తూ, వాటిల్లో ఏదో ఒక విలువకోసమో, శీలనిర్మాణంకోసమో అన్వేషించే ప్రేమ మెరుగైన ప్రేమ అని ప్రతిపాదిస్తాడు. అతడి తర్వాత ప్రసంగించిన పౌసనియస్ ఆ రెండుప్రేమల గురించిన చర్చను మరికొంత ముందుకు తీసుకువెళ్ళాడు.)

కాబట్టి మన ఏథెన్సు పద్ధతుల ప్రకారం ఒక ప్రేమికుడికి దేవతలూ, మానవులూ కూడా పూర్తి స్వాతంత్య్రాన్నిచ్చారనే చెప్పాలి. దాన్నిబట్టి చూస్తే ఈ నగరంలో ఒకరితో ప్రేమలో పడటంగాని, ఒకరిని ప్రేమించడం గాని ఇరుపక్షాలకీ అద్భుతమైన అనుభవం. మరొకవైపు తండ్రులు తమ పిల్లలకి ఉపాధ్యాయుల్ని నియమించినప్పుడు, ఆ పిల్లలు ప్రేమికుల ఆకర్షణలో తగులుకున్నప్పుడు, ఆ పిల్లల్ని తమ ప్రేమికుల్తో మాట్లాడకుండా తండ్రులు ఎటువంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నారో కూడా గమనించండి. పిల్లలు అట్లాంటి ప్రేమలో పడ్డారని తెలిసినప్పుడు వాళ్ల స్నేహితులూ, సమవయస్కులూ వాళ్ళనెట్లా ఎగతాళిచేస్తుంటారో కూడా చూడండి. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా అలా ఎగతాళి చేసేవాళ్లని వారించవలసిందిపోయి ఆ జరుగుతున్నదేదో ఎంతమాత్రం సరైంది కాదన్నట్టుగా ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. ఇదంతా ఎవరేనా చూస్తే, మనం ముందు చెప్పుకున్నదానికి విరుద్ధంగా అసలు ఈ సంప్రదాయం మొత్తం దోషపూరితమని అనుకోకుండా ఉండలేరు. కాని సంగతేమిటంటే, నేను ముందే చెప్పినట్టుగా ఇది చూడ్డానికి కనిపించినంత సరళవ్యవహారం కాదు. నిజానికి ఈ ఆచారం దానికదే మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. అది సరిగ్గా నడిస్తే మంచిది, చెడ్డదారిలో నడిస్తే చెడ్డదీను. అదొక చెడ్డవాణ్ణి తృప్తిపరచడంకోసం జరిగినా, చెడ్డదారిలో జరిగినా చెడ్డది. అదే ఒక మంచి మనిషిని తృప్తి పరచడంకోసం జరిగితే, మంచి దారిలో జరిగితే, మంచిది.

సాధారణంగా ఇలాంటి విషయాల్లో చెడ్డవాళ్ళెవరంటే మామూలు తరహా ప్రేమికులు. అంటే దేహాన్ని తప్ప ఆత్మని ప్రేమించనివాళ్ళు. వాళ్ళు ప్రేమించేది స్థిరమైంది కాదు కాబట్టి వాళ్ళ ప్రేమ కూడా స్థిరంగా ఉండదు. అతడు ఏ రూపవికాసాన్ని చూసి ప్రేమలో పడతాడో, ఆ తళతళ వెలిసిపోడం మొదలవగానే అతడు కూడా ‘నెమ్మదిగా జారుకుంటాడు.’ అతడప్పటిదాకా చేస్తూ వచ్చిన వాగ్దానాలూ, వేడికోళ్ళూ అన్నీ గాల్లో తేలిపోతాయి. అలాకాక శీలవంతమైన వ్యక్తిత్వాన్ని ప్రేమించే ప్రేమికుడు తన జీవితాంతం తన ప్రేమలో స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే అతడు ప్రేమిస్తున్నది కూడా స్థిరంగా ఉండేది కాబట్టి.

10

ఇక్కడ ఏథెన్సులో మనం రెండు రకాల ప్రేమికుల్ని కూడా పరీక్షకు పెట్టి చూస్తాం. ఆ ప్రేమికుడు మంచివాడా, సంతోషపెడతాం. చెడ్డవాడా, అభిశంసిస్తాం. మనం చేసేదేమిటంటే ఒకవైపు ప్రేమికుణ్ణి తన ప్రేమని కొనసాగించమని ప్రోత్సహిస్తాం, కాని, అతడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అతణ్ణి తనని ప్రేమిస్తున్న వాడి నుంచి దూరంగా పారిపొమ్మంటాం. అప్పుడు ఆ ప్రేమికుడూ, ఆ ప్రేమకు నోచుకున్నవాడూ ఇద్దరూ కూడా ఆ రెండు రకాల ప్రేమికుల్లో ఏ తరహాకి చెందినవాళ్ళో బయటపడుతుంది. ఎవరేనా ప్రేమికుడు తాను ఎవరిని ప్రేమిస్తున్నాడో అతడి ప్రేమని మరీ సత్వరమే పొందగలిగితే అదేమంత గౌరవప్రదం కాదని మనం భావించేది ఇందువల్లనే. ప్రేమబలం నిగ్గు తేలడానికి  కొంత సమయం గడవాలి. చాలావిషయాల్లో కాలపరీక్షని మించింది లేదు. అలాగే ప్రేమించబడుతున్న వ్యక్తి ధనప్రభావానికో, లేదా రాజకీయ ప్రభావానికో తలొగ్గి ఆ ప్రేమని అంగీకరిస్తే అది కూడా మన దృష్టిలో నీచమే. అలాగే అతడు ఎలాంటి ప్రతిఘటనాలేకుండా బెదరింపులకి లొంగిపోయినా లేదా ఆర్థికంగానో, రాజకీయంగానో ఆశచూపుతున్న ప్రలోభాల్ని అసహ్యించుకోకపోయినా కూడా దాన్నీ నీచమైన ప్రేమగానే లెక్కగడతాం. ఒకటి, అటువంటి ప్రలోభాలేవీ శాశ్వత భద్రతని చేకూర్చగలిగేవి కావు కాబట్టి. రెండోది, అసలు అటువంటి ప్రాతిపదికమీద నిజమైన స్నేహాలు ఎప్పటికీ వికసించవు కాబట్టి.

కాబట్టి ఒక ప్రేమికుడికి తాను ప్రేమిస్తున్నవాడిపట్ల ప్రేమానుబంధం కొనసాగించడానికి ఒకే ఒక్క దారి మిగిలి ఉంది. అది శీలంతో కూడి ఉన్న దారి. ఒక ప్రేమికుడు తాను ప్రేమిస్తున్నవాడికి ఎటువంటి సేవచేసినా అది అగౌరవం కాదనీ, ఊడిగం కింద లెక్కకు రాదనీ ఇంతకు ముందు చెప్పుకున్నాం. కాబట్టి ఒక ప్రేమికుడికి గౌరవప్రదంగా తన ప్రేమ ప్రకటించడానికి మిగిలింది ఒకే ఒక్క దారి, అది శీలవంతమైన సేవ మాత్రమే. ఇష్టపూర్వకంగా చేసే ఊడిగం. దాన్ని మటుకు మనం నిందించకుండా అంగీకరిస్తాం. ఎందుకంటే అది శ్రేష్ఠతకోసం చేసే ఊడిగం. ఎవరేనా ఒక మనిషికి సేవచెయ్యడంద్వారానో, శుశ్రూషవల్లనో మరింత వివేకవంతుడైన మానవుడిగా మారగలమన్న ఉద్దేశంతో ఎవరికేనా ఊడిగం చేస్తే దాన్ని కూడా మనం తక్కువగా భావించం. ఆ శ్రేష్ఠత ఎందులోనైనా గానివ్వండి. అది తప్పూ కాదు, అలాంటి సేవ దాస్యమూ కాదు. కాబట్టి యువకుల్ని ప్రేమించడమూ, జ్ఞానాన్ని సముపార్జించడమూ- ఈ రెండూ కూడా ఇద్దరిలోనూ తగినంతగా ఉన్నప్పుడే ప్రేమపొందుతున్నవాడు తనని ప్రేమిస్తున్నవాణ్ణి సంతోషపరచగలుగుతాడు.

11

ఈ రెండు పద్ధతులూ, ఒకటి యువకుల్ని ప్రేమించడమూ, రెండోది తత్త్వశాస్త్రంకోసమో లేదా ఏదైనా ఒక జీవితవిలువకోసమో శుశ్రూషా- ఈ రెండూ ఒకరే పాటిస్తున్నట్లయితే, అప్పుడు ఆ ప్రేమికుణ్ణి, అతడు ఎవరి ప్రేమను కోరుతున్నాడో ఆ వ్యక్తి సంతోషంగా అంగీకరించవచ్చు. ఆ ఇద్దరూ, అంటే ప్రేమికుడూ, అతడు ప్రేమిస్తున్నవాడూ ఇద్దరూ కూడా వారిని వారు స్వీయనియంత్రణలో పెట్టుకుని నడుచుకుంటున్నప్పుడు, తాను ఎవరిని ప్రేమిస్తున్నాడో అతడికి ఎటువంటి సేవచేయడానికేనా తాను సిద్ధమని ప్రేమికుడు అనుకోవడమూ సబబుగానే ఉంటుంది, తనకి వివేకమో, జీవితపు విలువలో ఒనగూడతాయన్న ఉద్దేశంతో అతడి ప్రేమను పొందుతున్న వ్యక్తి ఆ ప్రేమను అంగీకరించడమూ సబబే అవుతుంది. వారిద్దరిలో ఒకరు వివేకాన్నీ, విలువల్నీ అందించేవాళ్ళవుతున్నారు, మరొకరు తన విద్యలో భాగంగా, శీలనిర్మాణంలో భాగంగా దాన్ని స్వీకరించేవాళ్ళవుతున్నారు. ఆ విధంగా ఒకరిలో మాత్రమే ప్రేమా, వివేకమూ రెండూ కలిసి కనిపించినప్పుడు, అప్పుడు మాత్రమే, ఆ ప్రేమికుణ్ణి, అతడి ప్రేమపొందుతున్నవాడు స్వీకరించవచ్చు. ఇటువంటి అనాసక్తప్రేమ ప్రసారం జరిగినప్పుడు మాత్రమే అందులో మోసపోతామేమోనన్న అనుమానానికీ, అవమానానికీ తావుండదు. అలాకాకపోతే మాత్రం మోసపోయినా, మోసపోకపోయినా కూడా ఆ ప్రేమ గౌరవనీయప్రేమగా పరిణమించదు. ఎందుకంటే ఒకడు సంపన్నుడనే కారణం వల్ల అతడి ప్రేమని అంగీకరించడం మొదలుపెట్టి, తీరా అతడు పేదవాడని తెలిసేటప్పటికి, తన ప్రయోజనాలు నెరవేరవని నిరాశచెందేవాడు ఎప్పటికీ గౌరవహీనుడే అవుతాడు. ఎందుకంటే అతడు డబ్బుకోసం ఎవరిప్రేమనేనా అంగీకరిస్తాడనే ప్రవర్తనని నలుగురికీ చూపించడమే అవుతుంది. అది నిస్సందేహంగా సిగ్గుమాలిన పని. అలాకాక, ఎవరేనా తనని ప్రేమిస్తున్నవాడు మంచివాడని నమ్మి, అతడి సాంగత్యం వల్ల తాను మెరుగుపడగలనని భావించినప్పుడు, తీరా అతణ్ణి ప్రేమిస్తున్నవాడు దుష్టుడనీ, విలువల్లేనివాడనీ తర్వాత తెలిసినా కూడా, అతణ్ణి సజ్జనుడిగానే పరిగణిస్తాం. ఒకవేళ అతడు మోసపోతే, అది అతడికి సంబంధించి ఒక ఉదాత్త వైఫల్యంగానే లెక్కకొస్తుంది. ఎందుకంటే అతడేం చేసినా అదంతా కూడా తనని తాను మెరుగుపర్చుకోడంకోసమో, ఉన్నతవిలువల్ని సముపార్జించుకోవడం కోసమో చేసాడు తప్ప మరో ఉద్దేశంతో కాదని అతడు నిరూపించుకోగలిగాడు. అంతకన్నా ఉదాత్తమైన విషయం మరొకటి ఉండబోదు. కాబట్టి ఏ విధంగా చూసినా, శీలసముపార్జనకోసమో, విలువలకోసమో ఒకరు మరొకరి ప్రేమను అంగీకరించడమే ఉదాత్తమైంది అనిపించుకుంటుంది.  ఇటువంటి ప్రేమనే ద్యులోకప్రేమ అని అనగలుగుతాం. అటువంటి ప్రేమ స్వర్గంతో సమానం. తమ అభ్యున్నతికోరుకునే ప్రేమికుల్నీ, వారు ప్రేమించేవారినీ కూడా ఉత్సుకుల్ని చెయ్యగల ఇటువంటి ప్రేమ కన్నా వ్యక్తులకీ, నగరాలకూ అమూల్యమైంది మరొకటి ఉండబోదు.  తక్కిన అన్ని రకాల ప్రేమలూ మరొక రకమైన ప్రేమ, అంటే సాధారణ ప్రేమవికారాలే. ప్రేమదేవతగురించి ఇప్పటికిప్పుడు ఆశువుగా నేను చెప్పగలిగిన మాటలివి. ఈ ప్రసంగాన్ని, ఫేద్రోస్, నీకు కానుక చేస్తున్నాను.

ఆ విధంగా పౌసనియస్ విరమించాడు. (వక్తృత్వశాస్త్రం గురించి నాకు చెప్పినవాళ్ళు ఇలా ఏది చెప్పినా సమతూకంగా ఉండేలాగా చెప్పాలని నేర్పారు1) అప్పుడు ప్రసంగించడానికి అరిస్టొఫెనీస్ వంతు వచ్చిందని అరిస్టొడెమస్ చెప్పాడు. కాని అతడప్పటికే బాగా భోంచేసి ఉన్నందునో లేకమరేకారణం వల్లనోగాని, అతడికి ఎక్కిళ్ళు రావడం మొదలయ్యింది. దాంతో అతడు వైద్యుడు ఎరిక్సిమేకస్ వైపు తిరిగి, ‘నువ్వు నా ఎక్కిళ్ళేనా ఆపు లేదా నా ఎక్కిళ్ళుతగ్గేదాకా నువ్వేనా మాట్లాడు’ అనడిగాడు.

‘నేను రెండూ చేస్తాను’ అన్నాడు ఎరిక్సిమేకస్: ‘నీ బదులు నేను మాట్లాడతాను. నా వంతొచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. ఈలోగా నువ్వు కొద్దిగా ఊపిరి బిగబట్టి చూడు, అప్పటికి కూడా ఎక్కిళ్ళు తగ్గకపోతే, నోట్లోకి నీళ్లు తీసుకుని పుక్కిలించు. అయినా కూడా ఎక్కిళ్ళు ఆగకపోతే, నీ ముక్కులో ఏదైనా పుల్లపెట్టితిప్పుకుని తుమ్మిచూడు. అలా ఒకటి రెండు సార్లు తుమ్మితే ఎలాంటి ఎక్కిళ్ళేనా ఆగిపోకతప్పదు’ అని అన్నాడు. ‘నువ్వు చెప్పినట్టే చేస్తాను, నీ ప్రసంగం మొదలుపెట్టు’ అన్నాడు అరిస్టొఫెనీస్.

ఎరిక్సిమేకస్ ఇలా ప్రసంగించాడు: పౌసనియస్ తన ప్రసంగం మొదలుపెట్టడం బాగా మొదలుపెట్టినా చివరకొచ్చేటప్పటికి తేలిపోయాడు. అది చూసాక, అతడు చెప్పలేకపోయింది నాకు చెప్పాలనిపిస్తోంది.’

12

‘ప్రేమలు రెండురకాలని చెప్తున్నప్పుడు అతడు విషయాన్ని సరిగ్గా పట్టుకున్నాడు. అయితే నేను చదువుకున్న శాస్త్రం నాకేం చెప్తున్నదంటే, ప్రేమలోని ఈ ద్వైదీవిభాగం, అంటే చూడచక్కగా ఉన్నవాటిపట్ల కలిగే ఈ అనురాగం, మనుషులకి మాత్రమే పరిమితం కాదనీ, ఈ భూమ్మీద మనుగడసాగిస్తున్న సకల జంతురాశిలోనూ, సమస్త జీవకోటిలోనూ కనిపించేదే అనీ. నా వైద్యశాస్త్రం వల్ల నేను తెలుసుకున్నదేమంటే, ప్రేమదేవత సామ్రాజ్యం దైవ, మానవ అస్తిత్వాలన్నిటికీ కూడా వర్తిస్తుందనీ, అది అద్భుతమనీ, ఘనతరమనీ, సార్వత్రికమనిన్నీ. నా ప్రసంగానికి న్యాయం చెయ్యడానికి నేను వైద్యశాస్త్రంతోటే మొదలుపెడతాను. అసలు మానవదేహంలోనే రెండు రకాల ప్రేమలున్నాయి. అవి విభిన్నమే కాదు, పరస్పరవిరుద్ధాలు కూడా. అవి ఒకదానికన్నా మరొకటి భిన్నంకాబట్టి వాటి ఇష్టాలూ, కోరికలూ కూడా పరస్పరభిన్నాలే. వాటిలో ఆరోగ్యవంతులకోరిక ఒకలాంటిదైతే, వ్యాధిగ్రస్తుల కోరిక మరొకలాంటిది.   పౌసనియస్ ఇప్పుడే చెప్పాడు, మంచివాళ్ల సాంగత్యాన్ని కోరుకోడం గౌరవప్రదమనీ, చెడ్డవాళ్ళ స్నేహం లజ్జాకరమనీ- అలాగే శరీరంలో కూడా ఆరోగ్యప్రదమైనవాటిని మనం పట్టించుకోవాలి, పెంచిపోషించుకోవాలి. రోగకారకమైనవాటినీ గుర్తుపట్టాలి, మొగ్గలోనే తుంచెయ్యాలి. ఈ సందర్భంగా వైద్యుడు చెయ్యవలసింది ఇదే., వైద్యశాస్త్రం లక్ష్యం కూడా ఇదే. వైద్యశాస్త్రమంటేనే, శరీరంతాలూకు ఇష్టాయిష్టాల, కోరికల పరిజ్ఞానం. ఆ కోరికల్ని తీర్చాలా తీర్చకూడదా అన్న వివేచన. సవ్యమైన ఇష్టాలనుంచి అపసవ్యమైనవాటిని వేరుచేయగలిగినవాడే ఉత్తమ వైద్యుడు. అపసవ్యమైనవాటిని సవ్యమైనవిగా మార్చగలగాలి. అనవసరమైనవాటిని తొలగించి, దేహంలో ప్రేమను పాదుకొల్పడం ఎలానో తెలిసినవాడు దేహనిర్మాణంలోని పరస్పర విరుద్ధ శక్తుల్ని సమన్వయపరచగలుగుతాడు. వాటిని స్నేహితులుగా మార్చగలుగుతాడు. అటువంటివాణ్ణే నిపుణుడైన వైద్యుడని అనగలుగుతాం. దేహంలో ఉన్న ప్రవృత్తుల్లో ఏవి మరీ పరస్పరవ్యతిరేకాలో అవే పరస్పర శత్రువులుగా ఉంటాయి. ఉదాహరణకి, మరీ వేడి, మరీ చల్లన, మరీ చేదు, మరీ తీపి, మరీ పొడి, మరీ తడి, ఇంకా ఇలాంటివి. ఇటువంటి పరస్పర విరుద్ధ శక్తులపట్ల మిత్రత్వాన్ని ఎలా సాధించాలో తెలిసినవాడు అస్క్లిపియస్2. అతడు మా వైద్యశాస్త్రానికి పితామహుడని ఇదుగో ఇక్కడున్న మన కవులూ, మిత్రులూ చెప్తుంటారు. నేను వాళ్ల మాటలు నమ్ముతాను. వైద్యశాస్త్రమే కాదు, వ్యాయామశాస్త్రం, వ్యవసాయశాస్త్రం కూడా అతడి పరిథిలోవే.’

13

‘అలాగే ఈ విషయాన్ని పైపైన పరిశీలించినా కూడా, సంగీతశాస్త్రంలో కూడా, పరస్పరవిరుద్ధశక్తుల సమన్వయమే పనిచేస్తుందని గుర్తుపట్టగలరు. విడిపడిఉన్నప్పుడు కూడా అవి కలిసే ఉంటున్నాయని హెరాక్లిటస్ అంటున్న మాటల్లో సత్యం ఇదే అనుకుంటాను. అయితే ఆయన ఆ విషయం అంత స్పష్టంగా చెప్పలేదనుకోండి. కాని తంత్రీవాద్యానికీ, దాన్ని వాయించడానికి వాడే కమానుకీ మధ్య ఉన్న సమన్వయం అటువంటిదే అని హెరాక్లిటస్3 ఒక ఉదాహరణ కూడా చూపించకపోలేదు. అలాగని పరస్పరం అనంగీకారంలో ఉన్న శక్తుల మధ్య సమన్వయం సాధ్యమని చెప్పినా, లేదా అనంగీకారమే అంగీకారమని చెప్పినా కూడా అది హాస్యాస్పదమే అవుతుంది. ఉదాత్త, అనుదాత్త స్వరాలు శ్రుతిస్థాయిలో విభేదిస్తున్నప్పటికీ, సంగీతంకావడం ద్వారా సమతూకాన్ని సాధ్యమవుతున్నదని చెప్పడమే బహుశా అతడి ఉద్దేశ్యమై ఉంటుంది. ఎందుకంటే స్వరాలు ఎప్పటికీ విభేదిస్తూనే ఉంటే వాటిమధ్య సుశ్రావ్యత ఎప్పటికీ సాధ్యం కానేకాదు. ఎందుకంటే స్వరాలు సాధించే సుశ్రావ్యతనే మనం సంగీతం అంటాం. సంగీతం ఒక అంగీకారం. కాని విభిన్న స్వరాలు ఎప్పటికీ విభేదిస్తూనే ఉంటే, వాటిమధ్య అంగీకారం సాధ్యం కాదు. విభేదించేవాటిని నువ్వెప్పటికీ ఏకతాటిమీదకు తీసుకురాలేవు. అలాగే తాళం కూడా. అది హ్రస్వం, దీర్ఘం రెండు రకాలుగా ఉంటుంది. అవి ఒకసారి విభేదిస్తాయి, ఒకసారి ఏకీభవిస్తాయి. ఇటువంటి అంగీకారాన్నే ఇంతకుముందు వైద్యశాస్త్రం అని కూడా చెప్పుకున్నాం. మనం చెప్పుకున్న తక్కిన విషయాల్లో సంగీతం పరస్పరం విభేదిస్తున్న శక్తుల మధ్య ఒక ప్రేమనీ, ఐక్యాన్నీ పెంపొందేలా చేస్తున్నది. కాబట్టి సంగీతం కూడా ప్రేమసూత్రాల్ని అనువర్తింపచేసే శాస్త్రమే అని చెప్పవలసి ఉంటుంది. సమతౌల్యతలోగానీ, లేదా లయలోగానీ ప్రేమని గుర్తుపట్టడం ఏమంత కష్టం కాదు. ఎందుకంటే, ప్రేమ అక్కడింకా రెండుగా విడిపోలేదు. కాని ఆ సూత్రాల్ని నిజజీవితంలో ఉపయోగించవలసి వచ్చినప్పుడు, అంటే, గీతాలకి స్వరకల్పన చెయ్యవలసి వచ్చినప్పుడుగానీ లేదా అప్పటికే స్వరపరిచిన గీతాల్ని ఆలపించవలసి వచ్చినప్పుడుగానీ, అప్పుడు కష్టం మొదలవుతుంది. అలాంటప్పుడే మంచి కళాకారుడితో పనిపడుతుంది. అప్పుడు మళ్ళా మన పాత కథ మరోసారి చెప్పుకోవలసి ఉంటుంది. ద్యులోక ప్రేమదేవత కథ. శుభప్రదమైన స్వర్గలోకపు దేవత కథ మళ్లా చెప్పుకోవలసి ఉంటుంది. జీవితంలో సమతూకం తాలూకు అవసరం తెలిసేది అప్పుడే. సమతూకం తెలియని వాళ్లకి సామరస్యం నేర్చుకోవాలనీ, తద్వారా తమ ప్రేమను కాపాడుకోవాలనీ చెప్పవలసి ఉంటుంది. మరొకవైపు కవిత్వాదిసకల లలితకళలకూ ఆధారమైన కళాధిదేవత విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కళారాధన ద్వారా మనం సంతోషం పొందవచ్చు, కాని స్వైరప్రవర్తనని దూరంపెట్టవలసి ఉంటుంది. తినడంపట్లా తాగడం పట్లా మక్కువ చూపించేవాళ్ల విషయంలో వైద్య శాస్త్రం చేసినట్టే- అది వాళ్ళ కోరికల్ని తీర్చుకోడానికి అనుమతిస్తుందిగాని, అదే సమయంలో వాళ్ళు తిండిబోతులుగానూ, తాగుబోతులుగానూ మారకుండా జాగ్రత్త తీసుకుంటుంది. కాబట్టి సంగీతంలోనూ, వైద్యంలోనూ, అలాగే దైవ, మానుష రంగాలన్నింటిలోనూ కూడా రెండు రకాల ప్రేమలున్నాయని మనం గమనింపులోకి తీసుకోక తప్పదు.

14

అలాగే ఋతుపరిభ్రమణం కూడా ఇటువంటి సూత్రాల ప్రకారమే నడుస్తూ ఉంది. వేడి, చలి, తడి, పొడి లాంటి ప్రాకృతిక ధర్మాలు ఒకదానిపట్ల మరొకటి ఆకర్షితమై, సమతౌల్యతలో సామరస్యంగా కుదురుకున్నప్పుడు, అవి మనుషులకీ, జంతువులకీ, వృక్షాలకీ ఆరోగ్యాన్నీ, పుష్కలత్వాన్నీ తీసుకొస్తాయి. అవి జీవకోటికి ఎలాంటి హానీ చెయ్యవు. అదే సమయంలో ఏదో ఒక గుణాన్ని మాత్రమే అతిశయింపచేసే ప్రేమవల్ల ఏదో ఒక ధర్మం మాత్రమే పైచేయి సంపాదించి ఋతుప్రస్థానాన్ని భంగపరుస్తుంది. అది విధ్వంసకారకంగానూ, ప్రమాదకరంగానూ పరిణమిస్తుంది. దాంతో వృక్ష, జంతుజాలాన్ని వ్యాధులు చుట్టుముడతాయి. హిమపాతాలూ, వడగళ్లూ, చీడపీడలూ పుట్టుకొస్తాయి. ప్రకృతిలో సంభవించే ఇటువంటి ప్రేమవైపరీత్యాలకీ, గ్రహ, నక్షత్రగతులకీ, ఋతుపరిభ్రమణానికీ మధ్య ఉండే సంబంధాన్ని అర్థం చేసుకోవడమే ఖగోళశాస్త్రమంటాం.


వివరణలు

1. ఇక్కడ రెటారిక్ సూత్రాల్ని పేర్కోడానికి కారణం గ్రీకు మూలంలో ‘పౌసనియస్ విరమించాడు’ అనే వాక్యంలోని రెండు పదాలూ సమంగా నాలుగేసి అక్షరాలతో కూడుకుని ఉండటం. ఆ అందం ఇంగ్లిషులోనూ, తెలుగులోనూ తేగలిగింది కాదు.

2. అస్క్లిపియస్: మన ధన్వంతరిలాగా పురాణపురుషుడు. వైద్యశాస్త్ర ప్రదాత. ముఖ్యంగా వైద్యంలోని స్వస్థతకు అతడు అధిదేవత.

3. హెరాక్లిటస్: క్రీ.పూ. అయిదవశతాబ్దానికి చెందిన గ్రీకు తత్త్వవేత్త. సోక్రటీస్ కన్నా పూర్వుడు. వైరుధ్యాల మధ్య ఏకతని చూడటం అతని దర్శనప్రత్యేకత. ప్రవహిస్తున్న నదిలో ఎవరూ రెండు సార్లు అడుగుపెట్టలేరు అనేది అతడి వాక్యమే.

4. ఈ ప్రసంగాల్లో వక్తలు మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు ప్రేమికుల్నీ పురుషులుగానే ప్రస్తావించడం పాఠకుల్ని కొంత అయోమయానికి గురిచేయడంలో ఆశ్చర్యం లేదు. అందుకని ఈ విషయాన్ని మరికొంత వివరించాలి. ప్రాచీన గ్రీసులో స్త్రీలని పురుషుల్తో సమానంగా గుర్తించలేదు. స్త్రీలకీ, పురుషులకీ మధ్య ఉండే సంబంధాలు ప్రధానంగా ప్రత్యుత్పత్తి కోసం ఏర్పరుచుకునే లైంగికసంబంధాలుగానే ఉండేవి. కాబట్టి చైతన్యవంతుడైన ప్రాచీన గ్రీకు పురుషుడు తన సత్యాన్వేషణనీ, సౌందర్యదృష్టినీ మరొకరితో పంచుకోవాలనుకున్నప్పుడు స్త్రీలు అందుకు తగినవారు కారని భావించడంతో మరొక పురుషుడివైపు చూసేవాడు. అందులో వయసులో పెద్దవాడైన పురుషుడు అటువంటి సహచరుడికోసం తనకన్నా వయసులో చిన్నవాడు, అప్పుడప్పుడే కౌమారదశదాటి యవ్వనంలోకి అడుగుపెడుతున్న యువకుడివైపు చూసేవాడు. దాన్ని ప్రేమానుబంధంగా మలుచుకునేవాడు. అందులో వయసులో పెద్దవాడైన పురుషుణ్ణి ప్రేమికుడనీ (erastes), చిన్నవాడైన యువకుణ్ణి ప్రేమపొందుతున్నవాడనీ (eromenos) వ్యవహరించేవారు. వారిద్దరి మధ్యా ఏర్పడే ఆ అనుబంధంలో శారీరిక సంతోషానికి అవకాశం లేకపోలేదు. అందుకని ఆ అనుబంధాన్ని pederasty అని పిలిచేవారు. ప్రాచీన గ్రీకు ప్రేమకవిత్వమంతా దాదాపుగా ఒక పురుష ప్రేమికుడు తాను ప్రేమిస్తున్న యువకుణ్ణి ఉద్దేశించి చెప్పేదిగానే ఉంటుంది. దాదాపుగా ప్రాచీన రోమ్ లో కూడా ఇదే పరిస్థితి. పర్షియాలో కూడా ఈ సంప్రదాయం ఉన్నందువల్లనే పారశీక ప్రేమకవిత్వంలో సాఖీ అంటే మద్యశాలలో మద్యంపోసే యువకుడు అనే అర్థం వచ్చింది. అయితే, మధ్యయుగాల్లోనూ, ఆధునిక యుగం ప్రారంభంలోనూ ప్రాచీన గ్రీకు, రోమన్, పర్షియన్ కవిత్వాల్ని ఇంగ్లిషులోకి లేదా తక్కిన యూరపియన్ భాషల్లోకి అనువదిస్తున్నప్పుడు, ఈ అంశాన్ని అస్పష్టంగా అనువదిస్తూ వచ్చారు. కానీ ప్రాచీన గ్రీకు సంస్కృతిలో, విద్యావ్యవస్థలో ఈ అనుబంధం చాలా కీలకపాత్ర పోషించింది. అలాగని అన్ని గ్రీకు రాజ్యాలూ దీన్ని సమానంగా అనుసరించాయని చెప్పడానికి లేదు. ఉదాహరణకి ఉదాహరణకి స్పార్టా ఈ అనుబంధంలో పూర్తి స్వేచ్ఛని అనుమతిస్తే, ఏథెన్సు దీన్ని నియంత్రిస్తూ చట్టాలు చేసింది. ఒకవైపు ఈ అనుబంధాన్ని అంగీకరిస్తూనే మరొకవైపు దీనిలోని పర్యవసానాలపట్ల మెలకువ చూపిస్తుండటం ఈ ప్రసంగాల్లో మనం గమనించవచ్చు.

11-10-2023

2 Replies to “ప్రేమగోష్ఠి-4”

  1. కింది వివరణతో ప్రేమికులిద్దరూ పురుషులనే ప్రస్తావన లోని అసంబద్ధత తొలగి పోయింది. ప్రేమ యొక్క వ్యాప్తత వైద్య సంగీత సామాజిక రంగాలన్నిటిలోనా విస్తరించిన వివరణ బాగుంది.

Leave a Reply

%d