ప్రేమగోష్ఠి-3

(అగధాన్ ఇచ్చిన విందుకి బయల్దేరిన సోక్రటీస్ మధ్యలో పరధ్యానంలో పడి ఆలస్యంగా చేరుకుంటాడు. విందుముగిసాక, తర్పణలూ, ప్రార్థనలూ అయ్యాక, ఆనవాయితీగా అందరూ మద్యపానం చేసే బదులు ఏదైనా విషయం మీద మాట్లాడుకుంటే బాగుంటుందని ఎరిక్సిమేకస్ ప్రతిపాదిస్తాడు. ప్రేమదేవత గురించి ఎందుకోఎవరూ స్తుతించరని ఫేద్రోస్ అంటూ ఉంటాడనీ, కాబట్టి ప్రేమదేవత గురించి మాట్లాడుకుంటే బాగుంటుందనీ, ఆ చర్చ ఫేద్రోస్ నే మొదలుపెట్టమనీ ఎరిక్సిమేకస్ సూచిస్తాడు.)

ఫేద్రోస్ తన ప్రసంగం ప్రారంభిస్తూ ప్రేమ ఒక మహిమాన్వితమైన దేవత అనీ, మనుషుల్లోనూ, దేవతల్లోనూ కూడా అత్యద్భుతమైన దేవత అనీ, అతడు దేవతలందలందరికీ అగ్రజుడనీ, అది అతడికి గౌరవకారణమనీ, అటువంటి గౌరవాన్ని పొందడానికి కూడా సాక్ష్యమనీ, కాని అతడి తల్లిదండ్రులకంటూ ఎటువంటి స్మారకచిహ్నాలూ లేవనీ, ఏ కవిగానీ, వచనరచయితగానీ అతడికి తల్లిదండ్రులున్నట్టుగా ఎక్కడా రాయలేదనీ అన్నాడు. హెసియోదు చెప్పినట్టుగా అన్నిటికన్నా ముందు అవ్యవస్థ ఉండింది, దాన్నుంచి విశాలవక్షంతో పృథ్వి ప్రభవించింది. అప్పణ్ణుంచీ సమస్త అసిత్వానికీ శాశ్వత ఆవాసంగా ప్రేమ వర్ధిల్లుతోంది. ఈ విషయమే మరోలా చెప్పాలంటే ముందు అవ్యవస్థ, ఆ తర్వాత భూమీ, ప్రేమా మనుగడలోకి వచ్చాయి. ఆ ప్రాదుర్భావం గురించి పార్మెనిడిస్ ఇలా గానం చేసాడు: ‘దేవతాపరంపరల కోవలో అతడు ముందుగా ప్రేమని తీర్చిదిద్దాడు’.

అచుసిలాస్ కూడా హెసియోద్ నే అనుసరించాడు. ప్రేమ దేవత దేవతలందరిలోనూ ముందు పుట్టాడని సాక్ష్యం చెప్పిన కవులు చాలామందే ఉన్నారు. అతడు అందరికన్నా ముందు పుట్టినవాడు మాత్రమే కాదు, మానవాళికి గొప్ప మేలు చేకూర్చేవాడు కూడా. శీలవంతుడైన ప్రేమికుడిగా జీవితం మొదలుపెట్టడంకన్నా లేదా ఒక ప్రేమికుడికి తనని ఇష్టపడే ప్రియవయస్కుడు కావడం కన్నా మించిన గొప్ప అనుగ్రహం ఒక యువకుడికి మరొకటి ఉంటుందనుకోను. మనుషులు తమ జీవితాల్ని తీర్చిదిద్దుకోడానికి దారిచూపించే జీవనసూత్రం బంధువర్గమో, గౌరవమర్యాదనో లేదా సిరిసంపదలో లేదా మరే ఆదర్శాలో కానే కాదు. ప్రేమకన్నా మనిషికి దారి చూపించగల దీపం మరొకటి లేదు. నేను దేనిగురించి ప్రసంగిస్తున్నాను? ఏ మానావమానాల ప్రోద్బలం లేకుండా మనుషులుగానీ, రాజ్యాలుగానీ ఏ ఒక్క మంచిపనిగానీ, గొప్పపనిగానీ చేపట్టడానికి పూనుకోరు. అయితే ఒక అగౌరవప్రదమైన పని చేస్తూ ఒక ప్రేమికుడు పట్టుబడ్డాడే అనుకోండి, లేదా మరొకరెవరేనా అతడికేదైనా అన్యాయం చేయబోతున్నప్పుడు పిరికితనం వల్ల లొంగిపోయేడే అనుకోండి, కాని అట్లాంటి క్షణాల్లో అతడు తన తండ్రి కంటపడ్డప్పటికన్నా లేదా తన సహచరుల కంటపడినదానికన్నా లేదా మరెవరు చూసినప్పటికన్నా కూడా తన ఇష్టసఖుడు చూసినప్పుడే ఎక్కువ వ్యథకి లోనవుతాడు. అలాగే ప్రేమికుడు కూడా ఏదేనా లజ్జాకరమైన సంఘటనలో ఇరుక్కున్నప్పుడు తన ప్రేమికుడి గురించి కూడా అలాంటి బాధకే లోనవుతాడు. మనమేదో ఒకలా ఒక రాజ్యం మొత్తాన్ని లేదా మొత్తం సైన్యాన్ని ప్రేమికులతోటీ, వాళ్ళని ఇష్టపడేవాళ్ళతోటీ నింపేసామనుకోండి. వాళ్ళు వాళ్ళ నగరాలకి అత్యుత్తమ పరిపాలకులుగా మారతారు. అన్ని రకాల అవమానాలకీ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అలాగే మరొకర్ని చూసి తాము కూడా అంతే గౌరవప్రదంగా మసులుకుంటారు.

6

అలాగే ఒకరి పక్కన ఒకరు నిలుచుండి యుద్ధానికి సిద్ధమైనప్పుడు వారు లెక్కపెట్టగలిగేటంత స్వల్ప సంఖ్యలో ఉన్నా కూడా ప్రపంచాన్ని జయించితీరుతారు. ఎందుకంటే తాను తన బాధ్యతలనుంచి తప్పించుకోడమో లేదా తన ఆయుధాలు పక్కన పారెయ్యడమో ప్రపంచంలో ఎవరేనా చూడ్డానికి ఒప్పుకుంటాడేమోగాని తన ప్రేమికుడు చూడ్డానికి ఎవరు ఇష్టపడతారు కనుక? ఆ అవమానాన్ని భరించడం కన్నా వెయ్యి సార్లు చావడమే మేలనుకుంటారు. అలాగే తన ప్రేమికుణ్ణి వదిలిపెట్టిపారిపొయ్యేవాడూ, ప్రమాదం ముంచెత్తినప్పుడు అతడి చేయి వదిలిపెట్టేసేవాడూ ఎవరుంటారు? ఆ క్షణాల్లో అత్యంత భీరువు కూడా అత్యంత వీరోచితంగా మారిపోతాడు. సాహసవంతుడైపోతాడు. అటువంటి క్షణాల్లో ప్రేమ అతణ్ణి ఉత్తేజితుణ్ణి చేస్తుంది. కొందరు వీరుల ఆత్మల్లో దేవుడు సాహసాన్ని ఊపిరులూదుతాడని హోమర్ అంటాడే అలా ప్రేమికుడు తన ప్రేమస్వభావాన్నే తన ప్రేమికుడిలో ఊపిరులూదుతాడు.

తాము ప్రేమిస్తున్నవాళ్ళకోసం మనుషులు దేనికైనా తెగించేలా ప్రేమ పురికొల్పుతుంది. ప్రేమకి మాత్రమే ఆ శక్తి ఉంది. అది స్త్రీలుగానీ, పురుషులుగానీ. గ్రీకు స్త్రీజాతిమొత్తానికి ఈ విషయంలో చిరస్మరణీయురాలు పీలియాస్ కూతురు ఆల్స్టస్. మరొకరెవరూ ముందుకు రానప్పుడు ఆమె తన భర్తకోసం ప్రాణాలు త్యజించడానికి సిద్ధపడుతుంది. తన భర్త తల్లిదండ్రులింకా జీవించే ఉన్నారు. కాని అతడి పట్ల ఆమె ప్రేమ ఆ తల్లిదండ్రులప్రేమను మించిపోయింది. తమ రక్తసంబంధంలో ఆ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లవాడికి పరాయివాళ్ళేనా, వాళ్ళది కేవలం నామమాత్రబంధమేనా అనేటంతగా ఆమె తన భర్త పట్ల అవధుల్లేని ప్రేమ చూపించగలిగింది. ఆమె చూపించిన ఆ సాహసం దేవతల్ని ఎంతగా కదిలించిందంటే, మరెందరో వీరులు కూడా సాహసం చూపించివున్నా, తిరిగి మళ్ళా పునరుజ్జీవితుడు కాగలిగే అవకాశం ఆమె భర్తకి మాత్రమే దక్కింది. ఆమె ప్రేమబలానికి దేవతలు చూపించిన అపురూపమైన గౌరవం అది.

అదే యాగ్రస్ కొడుకు ఆఫియస్ సంగతి తీసుకోండి. ఆ వాద్యకారుడు. అతణ్ణి దేవతలు వట్టిచేతుల్తో వెనక్కి పంపేసారు, అతడు ఎవరికోసం వెతుక్కుంటున్నాడో ఆమెని ఒక నీడలాగా మటుకే అతడికి చూపించారుగాని ఆమెని మాత్రం తిరిగి అతడికి అప్పగించలేదు. ఎందుకంటే అతడు ఆమెని కోరుకున్నప్పుడు ఆ ఆరాటంలో ఎటువంటి భావోద్వేగం లేదు. అతడు కేవలం సంగీతవాద్యకారుడు మాత్రమే. అంతే తప్ప ఆల్సస్టస్ లాగా తన ప్రేమకోసం ప్రాణత్యాగం చెయ్యడానికి సిద్ధపడలేదు. పైగా నరకలోకంలోకి ఎలా ప్రవేశించడమా అని పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. దేవతలు తర్వాత కాలంలో అతడికి స్త్రీల చేతిలో మరణం రాసిపెట్టారు. అతడు చూపించిన పిరికితనానికి విధించిన శిక్ష అది. ఇక తన ప్రేమికురాలు పెట్రాక్లస్ పట్ల అకిలస్ చూపించిన ప్రేమకి దక్కిన బహుమానం మరింత ప్రత్యేకమైంది. (పెట్రాక్లస్  అకిలిస్ ని ప్రేమించాడే తప్ప ఆమె అతణ్ణి ప్రేమించలేదనే పొరపాటు అభిప్రాయంలోకి ఎందుకోగాని ఎస్కిలస్ పడిపోయాడు. వాళ్ళిద్దరిలోనూ కూడా అకిలస్ మరింత అందగాడు. తక్కినవీరులందరికన్నా అందగాడు. హోమర్ చెప్పిందాని ప్రకారం అతడికి అప్పటికింకా గడ్డం కూడా మొలవలేదు. ఇంకా పాలుగారే పసివదనమే).

ప్రేమగుణాన్ని దేవతలు గొప్పగా సన్మానిస్తారు. అయితే ప్రేమించబడ్డవాళ్ళు తమ ప్రేమికుల్ని తిరిగి ప్రేమిస్తే ఆ గుణాన్ని దేవతలు మరింత లెక్కల్లోకి తీసుకుంటారు, ఆరాధిస్తారు, బహుమానిస్తారు. ఎందుకంటే ప్రేమికుడిలో మరింత దైవత్వం ఉంది. అతడు దైవ ప్రేరితుడు. ఒకవేళ హెక్టర్ ని గాని వధించకపోతే అకిలస్ మరణం తప్పించుకుని, యుద్ధభూమినుంచి క్షేమంగా ఇంటికి రాగలడనీ, వార్థక్యపు చివరిదినాలు సంతోషంగా వెళ్ళదీయగలడని, అకిలిస్ కి వాళ్ళమ్మ చెప్పింది. ఆ విషయం అతడికి బాగా గుర్తుంది. అయినా కూడా అతడు తన స్నేహితుడి పగ చల్లారడం కోసం తన ప్రాణాలు వదిలిపెట్టేయడానికి సిద్ధపడ్డాడు. తన స్నేహితుడి పట్ల అతడు చూపిన ఈ విధేయత అతడు మరణించాక కూడా కొనసాగింది. అందుకని దేవతలు అతణ్ణి ఆల్స్టస్ కన్న ఎక్కువగా గౌరవించారు. అతణ్ణి అనుగ్రహీతుల ద్వీపానికి పంపించారు. ప్రేమదేవత అందరికన్నా ముందుపుట్టినవాడు మాత్రమే కాదు, అందరికన్నా బలవంతుడూ, ఉదారుడూ అని చెప్పడానికి నేను చెప్పగలిగిన కారణాలు ఇవి. నా దృష్టిలో ప్రేమదేవత మన జీవితాలకు యథార్థ కర్త, శీలప్రదాత, చివరికి మనం మరణించినతర్వాత కూడా అతడే మన ఆనందప్రదాత.

ఇదీ లేదా దాదాపుగా ఈ పద్ధతిలో సాగింది ఆ రోజు ఫేద్రోస్ ప్రసంగం. అతడి తర్వాత మరికొందరు మాట్లాడేరుగానీ అదేదీ అరిస్టొడెమస్ కి గుర్తులేదు. ఆ తర్వాత అతడు నాకు చెప్పిన ప్రసంగం పౌసనియస్ ది. అతడు తన ప్రసంగం మొదలుపెడుతూ ఫేద్రోస్ తన వాదనని సరైన పద్ధతిలో మనముందు ప్రతిపాదించలేదు అని అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు ‘ఎందుకంటే ప్రేమని మనం మరీ అంత విచక్షణారహితంగా ప్రశంసించవలసిన పనిలేదు. ఒకవేళ ప్రేమ అంటూ ఒకే ఒక్కటి ఉండిఉంటే బహుశా నువ్వు చెప్పింది సరిపోతుంది. కాని ప్రేమలు ఒక్కటికాదు, చాలా ఉన్నాయి. వాటిల్లో ఏ ప్రేమ మన ప్రశంసలకు పాత్రమైందో నువ్వు ముందే నిర్ణయించి ఉంటే బాగుండేది. నేనీ దోషాన్ని ఇలా సవరిద్దామనుకుంటున్నాను. ప్రేమలన్నిటిలోనూ మన ప్రశంసకు అర్హమైన ప్రేమ ఏదో నేను ముందు ఎంచి చూపిస్తాను. అప్పుడు ఆ ప్రేమకు తగ్గట్టుగా నా స్తోత్రపాఠం కొనసాగిస్తాను. మనందరికీ తెలుసు, ఆఫ్రొడైట్ నుంచి ప్రేమని విడదీసి ప్రత్యేకంగా చూపించలేమని. కాబట్టి ఒకే ఒక్క ఆఫ్రొడైట్ ఉన్నట్టయితే ప్రేమ కూడా ఒకే ఒక్కటి ఉంటుంది. కాని ఆ దేవతలు ఇద్దరున్నారుకాబట్టి ప్రేమలు కూడా రెండు ఉండి తీరాలి. ఆ దేవతలు ఇద్దరున్నారని నేనడం సరైందేకదా. ఆ ఇద్దరు దేవతల్లోనూ పెద్దామె, ఆమె అయోనిజ, యురేనస్ కూతురు, ద్యులోక దేవత. చిన్నామె, జ్యూస్ కీ, డయోని కీ పుట్టినామె. ఆమెనే మనం మామూలుఆఫ్రొడైట్ అని వ్యవహరించేది. మనం సాధారణంగా ప్రేమ అని పిలిచేది ఆమెకి సంబంధించిన మామూలు ప్రేమనే. ఆ రెండో సహచరుడు ద్యులోక ప్రేమదేవత. దేవతలందరూ స్తోత్రాలకి అర్హులే గాని, వాళ్ల స్వబావాల్లో ఉన్న వ్యత్యాసాల్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఇద్దరు ప్రేమదేవతలమధ్యా తేడా ఉందని నేను చెప్పితీరాలి. అలాగే వారి స్వభావాల్ని బట్టే వారి కార్యకలాపం కూడా మారుతుంటుంది.

7

ఉదాహరణకి మనల్నే చూడండి, మనమిప్పుడు తాగుతున్నాం, పాడుకుంటున్నాం, మాటాడుకుంటున్నాం-ఇవేవీ కూడా వాటంతట అవి మంచివీ కాదు, చెడ్డవీ కాదు. కాని మనం వాటిని ఎలా చేపడుతున్నాం అన్నదాన్నిబట్టి వాటిమంచిచెడులు రూపుదిద్దుకుంటాయి. మనం వాటిని బాగా చేసామా, అవి మంచివవుతాయి. సరిగ్గా చెయ్యలేదా, చెడ్డవవుతాయి. అలాగే ప్రతి ఒక్క ప్రేమా ప్రశంసార్హం కాదు. వాటిల్లో ఏది సరైన దారికి మనల్ని నడిపిస్తుందో అది మాత్రమే మన ప్రశంసకి పాత్రమవుతుంది. మామూలు ఆఫ్రొడైట్ కి పుట్టిన ప్రేమ మామూలు ప్రేమనే అయితీరుతుంది. ఆ ప్రేమకి విచక్షణ ఉండదు. అది సాధారణంగా మనుషులు లోనయ్యే ప్రేమ, స్త్రీలపట్లా, యువతీయువకులపట్లా కలిగే ప్రేమ, ఆత్మ పట్ల కాక దేహాల పట్ల కలిగే ప్రేమ- ఆ ప్రేమ మామూలుగా వివేకహీన విషయాలపట్లనే లగ్నమవుతూ ఉంటుంది. వేటినైనా ఏదో ఒక ప్రయోజనం కోసమే అభిలషిస్తూ ఉంటుందిగాని, తాను కోరుకున్నదాన్ని ఉదాత్తంగా మలుచుకోవాలని అనుకోదు. అందువల్ల అది చేసే పనుల్లో మంచీ చెడూ కలగాపులగమైపోతాయి. ఆ ప్రేమకి కారణమైన ఆఫ్రొడైట్ మరొకామెకన్నా చాలా యవ్వనవతి. ఆమె ఒక స్త్రీపురుష సంయోగంలోంచి పుట్టిందికాబట్టి ఆ రెండు లక్షణాల్నీ పుణికిపుచ్చుకుంది.

ద్యులోకవాసి అయిన ఆఫ్రోడైట్ పుట్టుకలో ఏ స్త్రీకీ పాత్రలేదు. ఆమె పురుషుడి నుంచి మాత్రమే పుట్టింది. యువతీయువకుల ప్రేమ లో మనకు కనిపించేది ఈ ఆఫ్రొడైట్ నే. ఆమె వయసులో పెద్దదికాబట్టి ఆమె ప్రవర్తనలో ఏ దోషం ఎంచలేం. ఆ ప్రేమవల్ల ఉత్తేజితులైనవాళ్ళు పురుషుల వైపు ఆకర్షితులవుతారు. ఏ పురుషుడు స్వభావరీత్యా ప్రతిభావంతుడిగా, వీరుడిగా ఉంటాడో అతడిపట్ల వాళ్ళు ఆకర్షితులవుతారు. వాళ్ళు ఎవరిపట్ల అనుబంధం పెంచుకోవాలని చూస్తున్నారో మనం ఇట్టే పసిగట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రేమించేది చిన్నకుర్రాళ్ళని కాదు, తెలివైనవాళ్ళని, ఎవరిలో వివేచనాశక్తి వికసించడం మొదలుపెడుతున్నదో వాళ్ళని. తమకి సహచరులుగా ఎంచుకున్న యువకులపట్ల వాళ్ళు విశ్వసనీయులుగా ఉండటమే కాక, తమ మొత్తం జీవితాన్ని వాళ్ళ సాంగత్యంలోనే గడపాలనుకుంటారు. అంతే తప్ప వాళ్ళ అనుభవరాహిత్యాన్ని ఆసరాచేసుకుని వాళ్ళని మోసం చెయ్యాలనిగానీ, ప్రలోభపరచాలనిగానీ లేదా ఒకళ్ళని వదిలిపెట్టి మరొకళ్ళని వెతుక్కోవాలని గానీ అనుకోరు. మరీచిన్నకుర్రాళ్ళపట్ల చూపించే ప్రేమని చట్టరీత్యా నిషేధించాలంటాను. ఎందుకంటే అలా ప్రేమలో పడ్డ యువకుల భవిష్యత్తు అనిశ్చితంగా మారిపోతుంది. అది వాళ్లకి దేహంలోగాని, ఆత్మలోగాని మంచి చెయ్యవచ్చు లేదా చెరుపు చేయవచ్చు, ఎంతో ఉదాత్తమైన ఆకర్షణ వాళ్లని ముంచెత్తవచ్చుకూడా. ఇలాంటి విషయాల్లో మంచివాళ్ళు తమకి తమే ఒక శాసనంలాగా తమని తాము నియంత్రించుకుంటారు. కాని మరీ మొరటుగా ఉండే ప్రేమికుల్ని బలప్రయోగంతో అదుపుచెయ్యవలసి ఉంటుంది. మన ఇళ్లల్లో మన స్త్రీలపట్ల వాళ్ళు తమ అభిమానాన్ని, అనురాగాన్ని చూపించడాన్ని మనమెట్లా నియంత్రిస్తామో, అలానే.

8

ఇలాంటి మనుషులు ప్రేమని అభాసుపాలుచేస్తారు. కొంతమంది విషయంలో వాళ్ళ అనుబంధాలు అసంగతంగానూ, దుష్టంగానూ ఉంటాయికాబట్టి అవి నిషేధానికి గురికాకతప్పదు. ఎందుకంటే చట్టసమ్మతంగానూ, సంఘసమ్మతంగానూ ఉండేదేదీ కూడా అభిశంసనకి గురయ్యే అవకాశం ఉండదు.

ఇక్కడా, స్పార్టాలోనూ ప్రేమ నియమాలు కొద్దిగా సంక్లిష్టంగా ఉంటాయి. కాని చాలా నగరాల్లో అవి సరళంగానూ, మనం అర్థంచేసుకోగలిగేటట్టూ ఉంటాయి. ఎల్లిస్ లోనూ, బొవొతియో లోనూ, వాక్చాతుర్యం మరీ అభివృద్ధి చెందని చోటా ప్రేమసూత్రాలు చాలా సూటిగా ఉంటాయి. అవి ఆ ప్రేమానుబంధాల్లో తగుల్కున్నవాళ్లకి అనుకూలంగా ఉంటాయి. పెద్దవాళ్ళుగానీ, చిన్నవాళ్ళుగాని ఏ ఒక్కరూ కూడా ఆ అనుబంధాల్ని తక్కువచేసి మాట్లాడటానికి ఉండదు.  అక్కడ మనుషులు తక్కువగా మాట్లాడుతుండటమే అందుకు కారణమనుకుంటాను. కాబట్టి ప్రేమికులకి అక్కడ తమ ప్రేమ గురించి వాదించి ఒప్పించుకోవలసిన అవసరం ఉండదు. అయోనియాలోనూ అలాగే మరీ అనాగరికుల పాలనలో ఉండే తక్కిన చోట్లా ఇటువంటి పద్ధతుల్ని మరీ చిన్నచూపు చూస్తారు. అక్కడ తత్త్వశాస్త్రానికీ, క్రీడలకీ గౌరవం లేనట్టే యువకుల పట్ల ప్రేమకి కూడా ఏమంత గౌరవం లేదు. వాళ్ళ నియంతృత్వపు పోకడలే దానికి కారణం. తాము పాలించేవాళ్ళు చైతన్యవంతులుగా ఉండకూడదనే వాళ్ళ పాలకులు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ సమాజాల్లో ప్రజలమధ్య బలమైన స్నేహబంధాలుగాని, సామాజికబంధాలుగాని పెంపొందకూడదని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. మనుషుల మధ్య అనుబంధాన్ని ప్రేమ బలపరిచినట్టుగా మరేదీ బలపర్చదనేది ఏథెన్సు నియంతలు అనుభవరీత్యా తెలుసుకున్న సత్యం. గుర్తుంది కదా. అరిస్టొజిటన్ ప్రేమా, హార్మోడియస్ స్థిరచిత్తమే వాళ్ళని పదవీభ్రష్టుల్ని చేసాయి. కాబట్టి మనుషుల మధ్య ప్రేమానుబంధాలకి చెడ్డపేరు వచ్చిందంటే దానికి కారణం కొందరు కావాలని మరీ వాటికి చెడ్డపేరు తేవడానికి చూడటమే. ఇంకా చెప్పాలంటే పాలకుల స్వార్థప్రయోజనాలూ, పాలితుల పిరికితనమూను. ఇదిలా ఉండగా కొన్ని దేశాల్లో ఆ ప్రేమానుబంధాలకి విచక్షణారహితంగా మరీ పెద్ద పీట వేసారంటే అందుకు కారణం అక్కడ వాటి పట్ల గౌరవం చూపిస్తున్నవాళ్ళ సోమరితనమే అని చెప్పవలసి ఉంటుంది. కాని మన దేశంలో అంతకన్నా ఉన్నతసూత్రాలు అమల్లో ఉన్నాయి. దానికి కారణమేమిటా అని ఆలోచిస్తే ముందొక పట్టాన అర్థం కాదు. చూడండి, మనం రహస్యప్రేమలకన్నా బహిరంగ ప్రేమలు ఎక్కువ గౌరవనీయమని భావిస్తుంటాం. అలాగే ధీరులూ, ఉదాత్తులూ అయినవాళ్ళని, వాళ్లు ఏమంత అందంగా లేకపోయినా కూడా, వాళ్ళ ప్రేమని ప్రత్యేకంగా గౌరవిస్తుంటాం.

ఆలోచించండి. ప్రపంచమంతా ప్రేమికుడి పట్ల చూపుతున్న మన్నన, ప్రోత్సాహం ఎంత గొప్పవి. అతడు తనకిస్తున్న గౌరవానికి తగనిదేదీ చేయకూడదని ఆశించడమే కాక, అతడు తన గౌరవాన్ని నిలబెట్టుకోడంలో నెగ్గాడా అతణ్ణి ప్రశంసిస్తారు, అదే, ఓడిపోయాడా, నిందిస్తారు. తన ప్రేమసాధనలో అతడు ఎన్నో విచిత్రమైన పనులు చెయ్యడానికి కూడా మానవాళి అంగీకరిస్తుందిగాని, అదే, అతడు ఏదైనా  స్వప్రయోజనాన్ని ఆశించి చేస్తే మాత్రం, ఏదైనా పదవికోసమో, అధికారం కోసమో చేస్తే మాత్రం తత్త్వశాస్త్రం అతణ్ణి తీవ్రాతితీవ్రంగా మందలిస్తుంది.

9

అతడు తన ప్రేమ కోసం వేడుకోవచ్చు, అడుక్కోవచ్చు, బతిమిలాడవచ్చు, ఒట్టుపెట్టుకోవచ్చు, తన ప్రేమికుడి గుమ్మం దగ్గర ఒక చాపపరుచుకుని పడి దొర్లవచ్చు, ఒక బానిసకన్నా హీనమైన బానిసలాగా జీవించవచ్చు- అదే మరొక సందర్భంలో అయితే అతడి స్నేహితులూ, శత్రువులూ కూడా అతడట్లా చెయ్యడానికి అడ్డుపడతారుగాని, ఇప్పుడు మాత్రం అతడలా చేస్తుంటే ఎవరికీ సిగ్గనిపించదు సరికదా, ఎవరూ అతణ్ణి మందలించాలని కూడా అనుకోరు. అతడి ప్రవర్తన మరీ లేకిగా ఉందనిగానీ, అతడు తన ప్రేమికుడిని మరీ పొగిడేస్తున్నాడనిగానీ అతణ్ణి ఏ శత్రువు కూడా వేలెత్తి చూపడు. ప్రేమికుడు ఏ పని చేసినా ఆ పనికే అందాన్నిచ్చే హుందాతనమేదో వాటిల్లో ఉంటుంది. ఆ పనులు బహుథా ప్రశంసనీయాలని సంప్రదాయమే అంగీకరించింది. ప్రేమికుడు అలా ప్రవర్తించడంలో తక్కువదనమేదీ లేదని నమ్మడం మనకి అలవాటుగా మారింది. ఇంకా విచిత్రమేమిటంటే, అతడు ఆ సమయంలో ఎన్ని ఒట్లు పెట్టుకున్నా, ఎన్ని దొంగ ఒట్లు పెట్టుకున్నా కూడా దేవతలు కూడా వాటిని చూసీచూడనట్టుపోవడం. ఎందుకంటే ప్రేమికుడు పెట్టుకునే ఒట్టుని ఎవరూ గట్టిగా పట్టించుకోనే పట్టించుకోరు.


వివరణలు

హెసియోద్: మన వ్యాసవాల్మీకుల్లాగా గ్రీకు సాహిత్యానికి, సంస్కృతికి రూపురేఖలిచ్చిన ఇద్దరు సాహిత్యకారుల్లో ఒకరు హోమర్, మరొకరు హెసియోద్. అతడు రాసిన గ్రంథాల్లో Works and Days, Theogony అనే రెండు రచనలు మాత్రమే లభ్యమవుతున్నాయి.

పార్మనెడిస్: ఏలియాకి చెందిన తత్త్వవేత్త. అతడు క్రీ.పూ.450 లో ఏథెన్స్ కి వచ్చి సోక్రటీస్ ని కలిసాడు. ఈ సంభాషణలో సృష్టిక్రమాన్ని వివరించినట్టుగా పార్మెనిడిస్ గురించి చెప్పినప్పటికీ అతడు ఆ రకమైన వివేచన చేసినట్టుగా మనకి అంతగా తెలియదు. అతడి పేరుమీద లభ్యమవుతున్న గ్రంథంలో నమ్మకాలకు బదులు ఆలోచనకూ, తర్కానికీ ప్రాధాన్యతనిచ్చినవాడిగా కనిపిస్తాడు.

అకుసిలాస్: ఆరవశతాబ్దికి చెందిన గ్రీకు వచన రచయిత. వంశవృక్షాల సంకలనకర్త.

ఎస్కిలస్: ఆరవశతాబ్దానికి చెందిన గ్రీకు విషాదాంత నాటకకర్త. ప్రసిద్ధి చెందిన ముగ్గురు మహానాటకకర్తల్లో ఒకడు. తక్కినవారిద్దరూ సోపోక్లీస్, యురిపిడిస్.

ఆల్స్టస్: గ్రీకు పురాణగాథల్లో అడ్మిటోస్ అనేవాడి భార్య. విధివశాత్తూ అతడికి మరణం తప్పనప్పుడు అతడి బదులు మరొకరు మరణిస్తే అతణ్ణి రక్షించవచ్చనే ఉద్దేశ్యంతో ఆమె ప్రాణత్యాగం చేస్తుంది. ఇదే ఇతివృత్తంతో యురిపిడిస్ కూడా ఒక నాటకం రాసాడు.

ఆఫియస్: ఒక పురాణ పాత్ర. అతడొక తంత్రీవాద్యకారుడు. తన ప్రియురాలు యురీడైస్ మరణించినప్పుడు ఆమెని పాతాళలోకం నుంచి బయటకు తీసుకురాడానికి ప్రయత్నించాడు. పాతాళలోకాధిపతి ఆమెని తిరిగి అతడితో పంపడానికి ఒప్పుకుంటాడుగాని అతడు వెనుదిరిగి చూడకూడదని షరతు పెడతాడు. కాని తన ప్రయాణంలో ఆఫియస్ ఆ షరతుని ఉల్లంఘించి ఆమెను శాశ్వతంగా కోల్పోతాడు. ఇక్కడ ఫేద్రోస్ ఆమెకి బదులు ఆమె నీడని మాత్రమే అతడికి చూపించినట్టుగా చెప్తాడు.

పెట్రాక్లస్: ఇలియడ్ లో ఒక ముఖ్యపాత్ర. గ్రీకువీరుడు. అకిలిస్ స్నేహితుడు.

అకిలిస్: హోమర్ రాసిన ఇతిహాసం ఇలియడ్ లో గ్రీకుల తరఫున పోరాడిన మహావీరుడు.

హెక్టర్: హోమర్ రాసిన గ్రీకు ఇతిహాసం ఇలియడ్ లో ప్రధాన పాత్ర. ట్రోజన్ సేనాధిపతి. అతడు గ్రీకు వీరుడు పెట్రాక్లస్ ని చంపినప్పుడు అకిలిస్ అతణ్ణి చంపేస్తాడు. అంతకుముందే అకిలిస్ ఆగమెమ్నాన్ తో గొడవపడి యుద్ధానికి దూరంగా ఉంటాడు. కాని తన మిత్రుణ్ణి హెక్టర్ చంపాడని విన్నాక వెంటనే యుద్ధంలో అడుగుపెడతాడు. తను హెక్టర్ ని చంపితే తనకి ప్రాణాపాయమని తెలిసికూడా స్నేహితుడి కోసం అతడు యుద్ధం చేసి ప్రాణాలు త్యజిస్తాడు.

అనుగ్రహీతుల ద్వీపం: గ్రీకు పురాణగాథల్లో వీరులు చేరుకునే వీరస్వర్గం. అది గ్రీసుకు పశ్చిమంగా దూరంగా ఉండే ఒక ద్వీపం. పాతాళలోకానికి భిన్నంగా శాంతి, సంతోషం దొరికే మరణానంతర జీవితానికి అది ఆవాసం.

ఎల్లిస్: గ్రీసుకి వాయవ్యప్రాంతంలో ఉండే ఒక గ్రామీణ రాజ్యం. అయిదో శతాబ్ది రాజకీయ పరిణామాలకు దూరంగా గడిపిన రాజ్యం.

బొవొతియా: మధ్యగ్రీసులో ఉండే ఒక స్వతంత్ర రాజ్యం.

అయోనియా: గ్రీకు పశ్చిమతీరంలో మధ్యభాగంలో ఉన్న వివిధ రాజ్యాల సమాహారం. మొదట్లో గ్రీకులు వాటిని ఆక్రమించారు. తర్వాత పర్షియన్ పాలనలోకి వెళ్ళాయి. సింపోజియం లోని కథాసందర్భం నాటికి అవి ఏథెన్స్ పాలనలోకి వచ్చాయి. ప్లేటో సింపోజియం రాయడానికి కూచున్నప్పుడు అవి మళ్ళా పర్షియన్ పాలనలోకి వెళ్లిపోయాయి.

అరిస్టోజిటన్, హార్మొడియస్: అరిస్టొజిటన్ హార్మోడియస్ ప్రియుడు. ఏథెన్సు నియంతా, హిపియస్ సోదరుడూ హిపార్కస్ అతడి వెంటపడ్డాడు. ఆ ప్రేమికులిద్దరూ ఆ అన్నదమ్ములిద్దర్నీ హతమార్చాలనుకున్నారుగాని, హిపార్కస్ ని మాత్రమే వధించారు. దాంతో హిపియస్ వాళ్ళిద్దర్నీ పట్టుకుని మరణశిక్ష విధించాడు. కాని నియంతృత్వాన్ని ఎదిరించినవాళ్లుగా ఆ ప్రేమికులు అమరులయ్యారు. చివరికి హిపియస్ ని కూడా ప్రజలు ఏథెన్స్ నుంచి వెళ్ళగొట్టారు.

Featured image: Zeuxis Selecting Models for His Painting of Helen of Troy (c. 1778) by Angelica Kauffmann; Wikimedia Commons.

Leave a Reply

%d