ప్రేమగోష్ఠి-2

(ఏథెన్సుకి చెందిన అగధాన్ తను రాసిన ఒక నాటకానికి బహుమతి వచ్చిన సందర్భంగా ఒక విందు ఏర్పాటు చేసాడు. ఆ గోష్ఠిలో సోక్రటీస్ ప్రేమ గురించి చేసిన ప్రసంగం  గురించి చెప్పమని అపొల్లోదోరస్ అనే అతణ్ణి గ్లోకెన్ అనేవాడు అడిగాడు. ఆ గోష్ఠి జరిగినప్పుడు తాను చాలా చిన్నవాణ్ణనీ, ఆ వివరాలన్నీ సోక్రటీస్ అభిమాని అరిస్టొడెమస్ అనే వాడిద్వారా విన్నాననీ, ఆ విన్న విషయాలు ఇంతకు ముందు తన స్నేహితుడొకడికి చెప్పాననీ అపొల్లోదోరస్ అంటాడు. అయితే ఆ కథనం తనకోసం మరోసారి చెప్పమని గ్లోకెన్ అడుగుతాడు. ఆ సంగతులు అరిస్టొడెమస్ చెప్పినమాటల్లోనే అపొల్లోదోరస్ తిరిగి గ్లోకెన్ కు చెప్పడం మొదలుపెడతాడు)

అతడలా హోమర్ పద్ధతిలో జవాబిచ్చాక, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒక సాకువెతుక్కుటూ, మాట్లాడుకుంటో ముందుకు సాగారు. ఇంతలో సోక్రటీస్ ఏదో ధ్యానంలో పడిపోయి వెనకబడ్డాడు. తనతో పాటు వస్తున్న అరిస్టొడెమస్ ను తన కోసం ఆగకుండా ముందుకు పదమన్నాడు. అతడు అగధాన్ ఇంటికి చేరుకునేటప్పటికి ఆ ఇంటి తలుపులు బార్లా తెరిచి వున్నాయి. అప్పుడే ఓ తమాషా సంఘటన జరిగింది. అతణ్ణి స్వాగతించడానికి వచ్చిన సేవకుడు అతణ్ణి విందుగదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ అప్పటికే చేరుకున్న అతిథులు తమ తమ ఆసనాల మీద వెనక్కి జారగిలి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఇంకా విందు మొదలు కావలసి ఉంది. అతణ్ణి చూస్తూనే అగధాన్ ‘స్వాగతం అరిస్టొడెమస్, సరిగ్గా సమయానికి వచ్చావు, నువ్వింకేధన్నా పనిమీద వచ్చి ఉంటే, కాసేపు ఆ విషయం మర్చిపో. నేను నిన్ననే నిన్ను తలుచుకున్నాను. నువ్వు నాకు కనబడి ఉంటే రమ్మని పిలిచి ఉండేవాణ్ణి కూడా. ఇంతకీ సోక్రటీస్ ని ఏం చేసావు?’ అని అడిగాడు.

‘నేను వెనుదిరిగి చూద్దును కదా, సోక్రటీస్ కనిపించడే. ఆయన క్షణం కిందటిదాకా నాతోనే ఉన్నాడనీ, ఆయన రమ్మంటేనే నేను ఆయనతో కలిసి విందుకు బయల్దేరాననీ చెప్పాను.’

‘నువ్వొచ్చి మంచిపనిచేసావు’ అన్నాడు అగధాన్,

‘కాని ఆయనేడీ?’

2

‘నేను ఇంట్లో అడుగుపెడుతున్నప్పుడు ఆయన నా వెనకనే ఉన్నాడు. ఇంతలోనే ఏమయ్యిందో నాకు అర్థం కావడం లేదు.’

‘అబ్బాయీ, పోయి ఆయన ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని కూడా తీసుకురా’ అని అగధాన్ తన పరిచారకుడికి పురమాయించి నాతో ‘ఈలోగా అరిస్టోడెమస్, ఇప్పటిదాకా  ఎరిక్సిమేకస్ కూచుని వెళ్ళిన చోట నువ్వు కూచో’ అని అన్నాడు . అప్పుడు ఒక పరిచారకుడు అతడికి కాళ్ళూ చేతులూ కడుక్కోడానికీ, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోడానికీ దగ్గరుండి సాయం చేసాడు. ఈలోపు మరొక పరిచారకుడు లోపల అడుగుపెట్టి సోక్రటీస్ పక్కింటి గుమ్మం దగ్గర కనబడ్డాడని చెప్పాడు. ‘ఆయనేమిటో అక్కడే దిగబడిపోయాడు. ఎంత పిలిచినా ఉలకడం లేదు, పలకడం లేదు’ అని చెప్పాడు.

‘చిత్రంగా ఉందే’ అన్నాడు అగధాన్, ‘అయినా సరే నువ్వు పోయి ఆయన్ని పిలుచుకురా, నీకు జవాబిచ్చేదాకా పిలుస్తూనే ఉండు’.

‘ఆయన్ని కొంతసేపు ఆయన మానానికి ఆయన్ని అలానే వదిలెయ్యండి’ అని అన్నాడు నా మిత్రుడు. ‘ఏ కారణం లేకుండానే అప్పుడప్పుడు అలా ఆగిపోతూండటం ఆయనకి అలవాటే. తొందరలోనే వస్తాడు లెండి. ఆయన్నిప్పుడేమీ కదిలించకండి’ అని అన్నాడు.

‘సరే. నువ్వు చెప్పినట్టే కానివ్వు’ అని అన్నాడు అగధాన్. అప్పుడు తన సేవకుల వైపు తిరిగి ‘విందు మొదలుపెడదాం. ఆయన కోసం ఆగొద్దు. నేనిప్పటిదాకా మిమ్మల్ని మీ ఇష్టానికి వదిలిపెట్టింది లేదుగాని, ఇప్పుడు మాత్రం మీకు ప్రత్యేకంగా ఆజ్ఞలిచ్చేవాళ్లెవరూ లేరు. అదీకాక, ఈ సందర్భంలో మీరే ఈ విందు ఏర్పాటు చేస్తున్నట్టుగా ఊహించుకోండి. నాతోపాటు ఈ మిత్రులంతా మీ అతిథులని అనుకోండి. మమ్మల్ని బాగా  చూసుకోండి. మా ప్రశంసలకి పాత్రులు కండి’ అని అన్నాడు. ఇంకా విందు వడ్డన మొదలయ్యింది. కాని సోక్రటీసు ఇంకా రాలేదు. విందునడుస్తున్నంతసేపూ అగధాన్ సోక్రటీస్ ని వెతికిపట్టుకుని తీసుకురాడానికి ఎవరో ఒకరిని పంపాలని అనుకుంటూనే ఉన్నాడుగాని, అరిస్టొడెమస్ వారిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు, విందు దాదాపు సగం గడిచిపోయేక సోక్రటీసు ప్రవేశించాడు. అతణ్ణి కమ్మేసిన ధ్యానం ఈసారి మరీ ఎక్కువసేపు అతణ్ణి ఆవహించినట్టులేదు. విందుబల్లకి మరీ ఆ కొసన తీరిగ్గా కూచుని విందారగిస్తున్న అగధాన్ అతణ్ని చూస్తూనే తన పక్కన వచ్చి కూచోమని అర్థించాడు. ‘నువ్విక్కడ కూచుంటే నేన్నిన్ను దగ్గరగా స్పృశించినట్టుగా ఉంటుంది. నువ్వు గుమ్మందగ్గర ఉన్నప్పుడు నీలో ప్రవేశించిన ఆ మంచిఅలోచనలేవో, ఇప్పుడు నీ నీ లోపలకి ఇంకిపోయి ఉంటాయి. అవెవో నాక్కూడా కొంత దొరికినట్టు ఉంటుంది. నువ్వు వెతుక్కుంటున్నదేదో నీకు దొరక్కపోతే నువ్వు ఇక్కడికి వచ్చి ఉండేవాడివే కావని నాకు తెలుసు’ అన్నాడు.

‘ఒక సంపూర్ణమానవుడు తాకితేచాలు ఒక బోలుమనిషిలోకి వివేకం ప్రవేశించేమాట నిజంగా నిజమైతే ఎంతబాగుణ్ణు’ అన్నాడు సోక్రటీస్, అగధాన్ కోరుకున్నట్టే అతడి పక్కన కూచుంటో. ‘నిండుకలశంలోంచి ఖాళీపాత్రలోకి నీళ్ళు వడగట్టినట్టు, అలా వివేకం ప్రవహించే మాటనే నిజమైతే, నీ పక్కన కూచునే అదృష్టానికి నేనెంత సంతోషిస్తానని!’ ఎందుకంటే అలా ప్రవహించడమే గనక జరిగితే నీ వల్ల నాలోకి మరింత శుభప్రద జ్ఞానస్రవంతిని ప్రవహింపచేసి ఉండేవాడివి. నా జ్ఞానమంటావా, అది మరీ తేలికపాటిది, అనిశ్చయం కూడా. స్వప్నసదృశం. కానీ నీ జ్ఞానం ప్రకాశమానం, ఆశాభరితం, తన యవ్వనవైభవంలో అదెంత అలరారుతున్నదో మొన్ననే కదా చూసాం. మేమొక్కళ్ళమేనా? ముప్ఫై వేలమంది యవనులు కూడా తిలకించారు ఆ వైభవాన్ని’ అని అన్నాడు.

‘నువ్వు నన్ను ఆటపట్టిస్తున్నావు సోక్రటీస్’ అన్నాడు అగధాన్. ‘లేదంటే మనలో ఎవరి అరచేతిలో జ్ఞానరేఖ ఉందో తేల్చమని ఇదుగో ఈ డయోనిసస్ ని అడుగుదాం. కాని ముందు నువ్వు భోంచెయ్యి’ అని అన్నాడు.

3

సోక్రటీస్ అక్కడ ఆసీనుడై తక్కినవారితో కలిసి విందు ఆరగించాడు. ఆ తర్వాత  తర్పణలు ఇచ్చారు. దేవుడికి ప్రార్థనాగీతం ఆలపించాక, మామూలుగా నడిచే క్రతుకాండ అంత నడిచాక, ఇక మధుపానానికి సమాయత్తులవుతుండగా, పౌసనియస్ అన్నాడు కదా ‘మిత్రులారా, చెప్పండి, మనల్ని మనం మరి ఇబ్బంది పెట్టుకోకుండా తాగే మార్గమేదన్నా ఉందా? నిన్న తాగినదానికే ఇవాళంతా నా కడుపులో ఎలానో ఉంది. దాన్నుంచి తేరుకోడానికి కొంత సమయం పట్టేట్టు ఉంది. నిన్న విందుకు వచ్చినవాళ్ళల్లో మీలో చాలామంది పరిస్థితి కూడా అదేనని నా అనుమానం. కాబట్టి ఆలోచించండి. మరీ ఇబ్బందిపడకుండా తాగడమెట్లాగు?’ అని అడిగాడు

‘అవును. నాక్కూడా అదే అనిపిస్తోంది’ అన్నాడు అరిస్టొఫెనీజ్. ‘మనం మరీ ఎక్కువగా తాగడకుండా ఉంటే మంచింది. నిన్న నిన్న పీకలదాకా తాగేసాను’ అని కూడా అన్నాడు.

‘నువ్వు సరిగ్గానే చెప్పావు’ అన్నాడు ఎరిక్సిమేకస్. అకుమెనస్ కొడుకు అతడు. ‘ఇంకొకళ్ళెవరైనా కూడా తమ అభిప్రాయం చెప్తే బాగుంటుంది. అగధాన్ కి పర్వాలేదా తాగితే ఏమీ అవదా?’ అని అడిగాడు. నాకు అంత చేతకాదన్నాడు అగధాన్.

‘అలా అయితే మనలాంటి బలహీనులు, అంటే అరిస్టొడెమస్, ఫేద్రోస్ లాంటివాళ్ళు, అస్సలు తాగలేనివాళ్ళు అదృష్టవంతులన్నమాట’ అని అన్నాడు ఎరిక్సిమేకస్. ‘ఎందుకంటే బాగా తాగగలిగినవాళ్లు ఇవాళ తాగాలన్న ఉత్సాహంలో లేరు. (నేనిందులో సోక్రటీసుని చేర్చడం లేదు. ఆయన తాగగలడూ, తాగకుండా ఉండనూగలడు, ఏదైనా అతడికి సమానమే).  కాబట్టి ఇవాళ మన బృందం తాగడం పట్ల ఏమంత మొగ్గు చూపడం లేదుకాబట్టి, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను వైద్యుణ్ణి కాబట్టి ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. మరీ అతిగా తాగడం మంచి అలవాటు కాదు. నేను అతిగా తాగను, ఎవరినీ తాగమని అస్సలు చెప్పను. ఇంకా నిన్నటి మత్తులోంచి తేరుకోనివాళ్ళకైతే ససేమిరా చెప్పను’ అని అన్నాడు. ‘నేను కూడా నువ్వు చెప్పినట్టే చేస్తాను’ అన్నాడు మిరునియన్ కి చెందిన ఫేద్రోస్. ‘అదీకాక నువ్వు వైద్యుడివి కూడాను. తక్కినవాళ్ళు కూడా తెలివైనవాళ్ళయితే నువ్వు చెప్పినట్టే వింటారు’ అని కూడా అన్నాడు. దాంతో ఆ పూటకి తాగడం పక్కన పెట్టాలనీ, అయినా ఎవరైనా తాగాలనుకుంటే, తమకి చాతనయినంతమాత్రమే తాగాలనీ తీర్మానించుకున్నారు.

‘కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మర్యాదకి తాగవలసిన పనిలేదనీ, ఎవరికిష్టమైతే వారు తాగొచ్చనీ అనుకున్నాం కాబట్టి, ఇదుగో, ఈ పిల్లంగోవి ఊదుతున్న అమ్మాయిని కూడా ఇక్కణ్ణుంచి వెళ్ళిపొమ్మని చెప్దాం. ఆమె పాడుకుంటే తనకోసం తను పాడుకోవచ్చు లేదా అంతఃపురంలోకి పోయి అక్కడ ఊదుకోవచ్చు. ఏమంటారు?’ అని అన్నాడు ఎరిక్సిమేకస్. ‘ఈరోజు మనం హాయిగా మాట్లాడుకుందాం’ అని కూడా అన్నాడు.

4

‘మీరొప్పుకుంటే ఈరోజు మనం ఏం మాట్లాడుకోవాలో కూడా మీకు చెప్తాను’ అని అన్నాడు. అతడి ప్రతిపాదనకి అందరూ ఒప్పుకున్నాక అతడిట్లా అన్నాడు:

‘సంభాషణ నేను మొదలుపెడతాను. కాని యురిపిడిస్ నాటకంలో మెలనిప్పె లాగా,

‘నా మాట కాదు’

నేను మాట్లాడదామనుకున్న మొదటిమాట నాది కాదు, ఫేద్రోస్ ది. ఎందుకంటే అతనెప్పుడూ నాతో ఒక మాట అంటూ ఉంటాడు, ఆ మాట చెప్తున్నప్పుడు అతని కంఠంలో ఒకింత అసహనం చికాకు కూడా కనిపిస్తూ ఉంటాయి. అతను ఏమంటాడంటే- చూడు ఎరిక్సిమేకస్ ఇదెంత విడ్డూరంగా ఉందో, ప్రతి ఒక్క దేవుడికీ దేవతకీ వాళ్ళని స్తుతించడానికి ఏదో ఒక పద్యమో, స్తోత్రమో ఉందిగాని, దేవతలందరిలోనూ దేవాధిదేవత, శ్రేష్ఠదేవత ప్రేమదేవతకంటూ ఒక్కడంటే ఒక్కడు కూడా స్తోత్రకారుడు లేడు చూడు. ఎంతమంది కవులున్నారో, సోఫిస్టులు మాత్రం తక్కువున్నారా, ఉదాహరణకి వాళ్ళల్లో అందరూ గొప్పగా చెప్పుకునే ప్రోడికస్ చూడు, హెర్క్యులస్ మీదా తక్కిన వీరులమీదా ఎంత వచనం రాసాడు, కాని ఇంకా చిత్రమేమిటంటే, ఉప్పు ఎంత అవసరమో గొప్ప వక్తృత్వపటిమతో వివరించే తత్త్వశాస్త్ర రచన కూడా ఒకటి ఒకటి లేకపోలేదు. అలాంటివే ఘనతపొందిన మరెన్నో విషయాలు కూడా. అంటే వాటిపట్ల మనకి ఆసక్తిపుట్టడంకోసం రాసిన రచనలన్నమాట. కాని ఇప్పటిదాకా ప్రేమని స్తుతిస్తూ మటుకు ఒక్క పద్యం కూడా ఎవరూ రాయడానికి ముందుకురాలేదంటే ఏమనాలి? నిజంచెప్పాలంటే ఈ దేవాధిదేవత పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాడు అని అంటుంటాడు ఫేద్రోస్. అతగాడి ఈ మాటల్లో సత్యముందనే అనిపిస్తుంది నాకు. అందుకని నేనీ సందర్భంగా అతడికొక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మనమంతా ఇక్కడ సమావేశమైన ఈ సమయంలో ప్రేమదేవతను గౌరవించడం కన్నా గొప్ప కర్తవ్యం మనకి మరోటి ఉండబోదు. మీరు నా మాటలు ఒప్పుకుంటేగనుక, మాట్లాడుకోడానికి మనకి చాలినంత విషయం దొరికినట్టు. అందుకని మనలో ప్రతి ఒక్కరం, ఎడమవైపు నుంచి కుడివైపుగా, వరసగా, ప్రతి ఒక్కరం ప్రేమదేవత గౌరవార్థం, ప్రసంగించడం మొదలుపెడదాం. ఎవరికి వారు తమ శక్త్యానుసారం మాట్లాడదాం. ఇప్పుడు మనలో ఎడమ వైపు అందరికన్నా ముందు ఫేద్రోస్ కూచున్నాడు కాబట్టి, ఈ ఆలోచన అతడితోటే మొదలయ్యింది కాబట్టి, అతడే మొదటి ప్రసంగం చేస్తే బావుటుంది’ అని అన్నాడు.

‘నీ మాట ఎవరు కాదంటారు ఎరిక్సిమేకస్’ అని అన్నాడు సోక్రటీస్. ‘ప్రేమగురించి తప్ప మరి దేనిగురించీ తెలియదని చెప్పుకునే నీ ప్రతిపాదనని నేనెలా కాదనగలను? నేనేకాదు, అగధాన్, పౌసనియస్ లు కూడా కాదంటారనుకోను. అలానే అరిస్టొఫెనీజ్ కూడా. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఆలోచించేదే డయోనిసస్, ఆఫ్రొడైట్ల గురించి. వీళ్ళే కాదు, ఇక్కడున్నవాళ్ళల్లో ఎవరూ కూడా నీ మాటకాదనరు.  నీ ప్రతిపాదన మాలాగా మరీ చివరికి కూర్చున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చుగాని, దానికేముంది, మా వంతు వచ్చేలోపు మేము మంచి ప్రసంగాలు వినగలిగితే మాకదే చాలు. కాబట్టి ప్రేమస్తుతి ఫేద్రోస్ తో నే మొదలుకానివ్వు. అతడికి నా శుభాకాంక్షలు’ అని అన్నాడు. తక్కిన మిత్రబృందం కూడా ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

5

సోక్రటీస్ చెప్పినదానికి కూడా వారు అంగీకారం తెలిపారు.

ఆ రోజు ఎవరెవరు ఏం మాట్లాడేరో అరిస్టొడెమస్ కి పూర్తిగా గుర్తులేదు. అలాగే అతడు నాకు చెప్పిందంతా నాక్కూడా గుర్తులేదు. కాని ఆ గోష్ఠిలో గుర్తుపెట్టుకోతగిందీ, ప్రధానవక్తలు మాట్లాడిందీ మాత్రం నేన్నీకు చెప్తాను.


వివరణలు

ప్లేటో (క్రీ.పూ.428-348): సోక్రటీస్ శిష్యుల్లో అగ్రగణ్యుడు. ఆయన సోక్రటీస్ సంభాషణలపేరిట దాదాపు 35 సంభాషణలు రాసాడు. వాటిల్లో రిపబ్లిక్ పది అధ్యాయాలతోనూ, Laws పన్నెండు అధ్యాయాలతోనూ సుదీర్ఘ సంభాషణలు. తక్కినవన్నీ ఒకొక్క అధ్యాయం నిడివి కలిగిన సంభాషణలు. ఉపనిషత్తుల్లాగా, బుద్ధుడి దీర్ఘసంభాషణల్లాగా ప్లేటో సంభాషణలు కూడా ప్రశ్నోత్తరాల రూపంలో తాత్త్విక చర్చ చేపడతాయి. అయితే అప్పటికే గ్రీకు నాటకం ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల ఈ సంభాషణల్లో కూడా సజీవ పాత్రలు, నాటకీయ సన్నివేశాలు, సాహిత్యచర్చలు చోటుచేసుకున్నాయి. కాబట్టి, ఇవి తాత్త్వికంగా ఎంత విలువైనవో, సాహిత్యపరంగా కూడా అంతే విలువైన రచనలు.

సింపోజియం: సింపోజియం అనే పదం symposion అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. విద్యావంతులు చేపట్టే పానగోష్ఠి అని దానికి అర్థం. పూర్వకాలపు గ్రీసులో ఒక విందు తర్వాత, తర్పణలూ, ప్రార్థనలూ ముగిసాక పానగోష్ఠి మొదలయ్యేది. దానిలో భాగంగా సంగీతం, నృత్యం, శాస్త్రచర్చలు కొనసాగేవి.

హోమర్: క్రీ.పూ. ఎనిమిదవ శతాబ్దానికి చెందిన గ్రీకు మహాకవి. ఆయన ఇలియడ్, ఒడెస్సీ అనే రెండు ఇతిహాసాలతో పాటు, కొన్ని స్తోత్రాలు కూడా రాసాడు. సోక్రటీస్ హోమర్ అభిమాని. ఆయన సంభాషణల్లో హోమర్ కవిత్వం నుంచి ఎన్నో పంక్తులు ప్రస్తావనకి వస్తూ ఉంటాయి.

యురిపిడిస్ (క్రీ.పూ480-406): గ్రీకు విషాదాంత నాటకకర్తల్లో ఒకడు. మానవదుఃఖాన్ని, ముఖ్యంగా స్త్రీ దుఃఖాన్ని గాఢంగా చిత్రించాడు. కఠోరమైన జీవితవాస్తవాన్ని అత్యంత వాస్తవికంగా చిత్రించినందువల్ల ఆధునిక ఐరోపీయ నాటకం యురిపిడిస్ కి ఎంతో ఋణపడి ఉందని చెప్తారు. మెలనిప్పి యురిపిడిస్ నాటకశకలంలోని ఒక పాత్ర.

ఆగమెమ్నాన్, మీనిలాస్: ఆగమెమ్నాన్, మీనిలాస్ అన్నదమ్ములు. హోమర్ రాసిన ఇలియడ్ లో పాత్రలు. మినీ లాస్ భార్య హెలెన్ కోసమే ట్రోజన్ యుద్ధం జరిగింది. ఇక్కడ సంభాషణలో అతణ్ణి తక్కువ స్థాయి వీరుడిగా చూపించినప్పటికీ హోమర్ అలా చిత్రించలేదు. వారిద్దరూ ఆ తర్వాత ఎస్కిలస్, సోపోక్లిస్, యురిపిడిస్ రాసిన నాటకాల్లో కూడా పాత్రలుగా కనిపిస్తారు.

డయోనిసస్, ఆఫ్రొడైట్: డయోనిసస్ గ్రీకు స్వర్గాధినేత జ్యూస్ పుత్రుడు. గ్రీకు దేవతానీకంలో ప్రధాన దేవత. సంక్లిష్టమైన దేవత కూడా. ఎందుకంటే ఏకకాలంలో అతడు  సంతానక్రతుదేవత, సుఖాధిదేవత, పానాధిదేవత, సస్యాలకూ, ఫలాలకూ, తోటలకూ దేవత. అలాగే ఉన్మత్తతకీ, దివ్యావేశానికీ, క్రతుసంతోషానికీ కూడా అధిదేవత. అందువల్ల కళలకీ, రంగస్థలానికీ కూడా అధిదేవత. ఆఫ్రోడైటు ప్రాచీన గ్రీకు దేవతల్లో శృంగారరసాధిదేవత. ప్రేమకీ, సౌందర్యానికీ, మోహానికీ, ఇంద్రియసంతోషానికీ అధిదేవత.

ప్రోడికస్: ప్రోడికస్ సియోస్ కి చెందిన సోఫిస్టు. ఏథెన్స్ కి రాయబారిగా వచ్చాడు. ప్లేటో అతడి పట్ల తన రచనల్లో ప్రత్యేకమైన గౌరవం చూపిస్తాడు.

నాటకానికి బహుమతి: ప్రాచీన గ్రీసులో డయోనిసస్ కి ఆరాధనగా అయిదు రోజుల నాటకమహోత్సవాలు జరిగేవి. అందులో భాగంగా నాటకకర్తలు నాటకాలు రాసి ఏథెన్సు ప్రజలముందు ప్రదర్శించేవారు. న్యాయనిర్ణేతల బృందాలు ఆ నాటకాల్ని పరిశీలించి ఉత్తమ నాటకాలకి బహుమతులు ప్రకటించేవారు. అయితే న్యాయనిర్ణేతల్ని లాటరీ పద్ధతిలో ఎంచుకునేవారు. ఆ నాటకాలు మోదాంతాలు, విషాందాంతాలు, ప్రహసనాలు అని మూడు రకాలుగా ఉండేవి.

ప్రేమ: గ్రీకు పదాలు ఇంగ్లిషు అనువాదాల్లోకి వచ్చినప్పుడు వాటి నిర్దిష్టతను పోగొట్టుకుని సార్వత్రిక పదాలుగా మారిపోయాయి. వాటిల్లో Eros కూడా ఒకటి. ఈ సంభాషణ మొత్తం ఎరోస్ గురించిన చర్చ. గ్రీకుల దర్శనం ప్రకారం ఎరోస్ పూర్తిగా మనిషి కాదు, పూర్తిగా దేవత కాదు, కొన్నిసార్లు అది ఒక భావన, ఒక శక్తి, ఒక సంకల్పం కూడా. గ్రీకుల సృష్టి దర్శనం ప్రకారం మొదట అవ్యవస్థ, దాన్నుంచి పృథ్వి (Gaea), ప్రేమ(Eros) రెండూ పుట్టుకొచ్చాయి. ఈ ప్రేమ ఒకరకంగా సంకల్ప శక్తి, ప్రజనన శక్తి కూడా. అంటే ఆ కోరికలోంచి సమస్త అస్తిత్వం పుట్టుకొచ్చిందని చెప్పవచ్చు. ‘సో కామయత, ద్వితీయో మ ఆత్మజాయేతేతి’ అని ఉపనిషత్తు (బృహదారణ్యకం, 1.2.4) మాట్లాడిన కామ్యత అది. అలాగని ఎరోస్ ని మనం కామదేవత అని అనువదిస్తే, అప్పుడు అది గ్రీకు నిర్దిష్టతను పోగొట్టుకుని ‘కామం’ అనే మాటలోని నిర్దిష్టతను సంతరించుకునే ప్రమాదం ఉంది. ఈ అర్థాలన్నిటికీ మధ్యస్థంగా ఎరోస్ ను God of Desire  అనవచ్చుగానీ, నేను బెంజమిన్ జోవెట్ దారిలోనే ‘ప్రేమ’ అనే అంటున్నాను. ఆ ‘ప్రేమ’ ఏమిటో, ఆమెని సోక్రటీస్ ఏ విధంగా దర్శించాడో ముందు ముందు ఈ సంభాషణలో ఎలానూ చూడబోతున్నాం.

Featured image: PC: https://fineartamerica.com/featured/alcibiades-symposium-anselm-feuerbach.html

9-10-2023

4 Replies to “ప్రేమగోష్ఠి-2”

  1. ప్లేటో ని చదువుతుంటే నాకానాడు కలిగిన అనుభూతి ఏమిటంటే, నేను సోక్రటీస్ శిష్యబృందంలో అజ్ఞాతంగా ఉన్నట్టు.
    శతాబ్దాల దీర్ఘ కాలాన్ని దగ్గర చేసేదేదో ఆ రచనలలో వుంది. మీ అనువాదం కూడా అంతే సరళంగా ఉందండీ.

  2. విదేశీ సాహిత్యం చదువలేని బాధ లేదు ఇక

Leave a Reply

%d