ప్రేమగోష్ఠి-1

పదిహేనేళ్ళ కిందటి మాట. అప్పట్లో డా. రఘురామ రాజు చండీదాస్ Desire and Liberation మీద పుస్తకం రాస్తున్నారు. ఆ సందర్భంగా desire అనే భావనని అర్థం చేసుకోవడం కోసం ఆయన ఛాందోగ్య ఉపనిషత్తునీ, ప్లేటో సింపోజియాన్నీ అధ్యయనం చేస్తో ఉన్నారు. మేము కలుసుకున్నప్పుడల్లా ఆ రెండు గ్రంథాల గురించీ ఎప్పటికప్పుడు కొత్తగా లోతైన ఆలోచనలు పంచుకుంటూ ఉండేవారు. నేను కూడా అప్పటికి ఆ రెండు గ్రంథాలూ చదివి ఉన్నాను కాబట్టి నాకు స్ఫురించిన భావాలు నేను కూడా చెప్తుండేవాణ్ణి. ఆ రెండింటినీ తెలుగు చెయ్యమనీ, ఆ రెండింటితోపాటు చండీదాస్ రచన కూడా తెలుగు చెయ్యగలిగితే, మూడింటినీ కలిపి ఒక పుస్తకంగా తెద్దామనీ అనేవారు.

‘సింపోజియం’ ప్లేటో రచనలన్నిటిలోనూ అత్యుత్తమ రచన. కావ్యత్వాన్ని అందుకున్న రచన. విద్యావంతుడైన ప్రతి ఒక్కడూ చదివితీరవలసిన రచన. అగధాన్ అనే ఒక శిష్యుడికి నాటక రచనలో బహుమతి వచ్చిన సందర్భంగా మిత్రులంతా అతణ్ణి అభినందించడానికి కలుసుకుంటారు. ఆ సమావేశానికి సోక్రటీస్ కూడా వస్తాడు. ఆ సందర్భంగా ఏదైనా విషయం మీద అందరూ మాట్లాడితే బాగుంటుందని ఎవరో ప్రతిపాదిస్తారు. అప్పుడంతా ప్రేమ గురించి ప్రసంగిస్తారు. ఒకరి వెనక ఒకరు అయిదుగురు వక్తలు ప్రేమ గురించి అద్భుతంగా ప్రసంగించాక సోక్రటీస్ వంతు వస్తుంది. ఆయన ఎప్పటిలానే తనకి ప్రేమ గురించి ఏమీ తెలియదని మొదలుపెడతాడుగానీ, తన భాగ్యవశత్తూ డయోటిమ అనే ఒక స్త్రీ ద్వారా ప్రేమజ్ఞానం లభించిందని చెప్తాడు. ఆమె చెప్పినమాటలు వాళ్ళకి చెప్తున్నట్టుగా సోక్రటీస్, సోక్రటీస్ ద్వారా ప్లేటో, ప్రేమ గురించి ఒక అజరామర ప్రసంగం చేస్తారు.

ప్రేమ మొదట దేహాల్ని ఆలంబన చేసుకునే ప్రభవిస్తుందనీ, అయితే ఆ క్రమంలో చివరికి మనం దేహాతీతమైన, కాలాతీతమైన ఒక మహాసౌందర్యసాక్షాత్కారానికి చేరుకుంటామనీ, ఆ సౌందర్య దర్శనం లభించడమే మానవజన్మకి సార్థక్యమనీ ఆ స్త్రీ తనకి బోధించిందని సోక్రటీస్ వారికి చెప్తాడు. సోక్రటీస్ ప్రసంగం ముగించగానే ఆల్సిబయాడిస్ అనే ఒక సుందరయువకుడు, ప్రజాభిమానాన్ని చూరగొన్న ఏథెన్సు పౌరుడు, సోక్రటీస్ శిష్యుడు, తాను ప్రేమ గురించి కాక, సోక్రటీస్ గురించే మాట్లాడతానంటూ, సోక్రటీస్ గుణగానం చేస్తాడు. అతడు ఆవిష్కరించిన సోక్రటీస్ అంతకు ముందు సోక్రటీస్ ఎటువంటి ప్రేమదర్శనం గురించి మాట్లాడేడో, ఆ దర్శనానికి నిలువెత్తు నిరూపణగా కనిపిస్తాడు.

ఒక్క ఛాందోగ్యమే కాదు, చాలా అంశాల్లో, సింపోజియం మనకి బృహదారణ్యకాన్నీ, తైత్తిరీయాన్ని కూడా స్ఫురింపచేస్తూంటుంది. ఫీడో లో సోక్రటీస్ తత్త్వశాస్త్రమంటే మృత్యువుని అధ్యయనం చేసే శాస్త్రమంటాడు. కానీ సింపోజియానికి వచ్చేటప్పటికి తత్త్వశాస్త్రం అమరత్వ చర్చగా మారిపోయింది.

డా. రఘురామరాజుతో మాట్లాడినప్పుడల్లా ఉత్సాహం పొంగుకొచ్చి ఆ ఉత్సాహంలో ‘పానగోష్ఠి’ పేరిట సింపోజియాన్ని తెలుగు చెయ్యాలనుకున్నానుగానీ, నేను చెయ్యలేకపోయిన ప్రాజెక్టుల్లో అది కూడా ఒకటిగా మిగిలిపోయింది. 2016 లో ఆ ముచ్చట అంతా రాసుకొచ్చి ‘ఇప్పుడు మళ్ళా ఉత్సాహం కలుగుతోంది. కాని ఈ సారి ‘పానగోష్ఠి’ అని కాదు, ‘ప్రేమ గోష్ఠి’ అని చెయ్యాలనుంది’ అని రాసాను. కాని ఆ తర్వాత కూడా ఆరేడేళ్ళు గడిచిపోయాయి. ఎట్టకేలకు, సింపోజియాన్ని ఇదుగో ఇలా ప్రేమగోష్ఠి పేరిట మీకు అందచేయాలని కూచున్నాను.

సింపోజియానికి ఇంగ్లిషులో చాలా అనువాదాలున్నాయి. వాటిల్లో బెంజమిన్ జోవెట్ అనువాదాలు సుప్రసిద్ధమే కాక, పబ్లిక్ డొమైన్ లో ఉన్నవి కూడా. అందుకని నా తెలుగుసేతకు ఆయన అనువాదాన్ని ఎంచుకున్నాను.


ప్రేమగోష్ఠి


సంభాషణలో పాల్గొన్నవారు: అపోల్లోదోరస్, అతడు అరిస్టోడెమోస్ ద్వారా తాను విన్న సంభాషణలను తన సహచరుడికి తిరిగి చెప్తాడు. తిరిగి మళ్ళా గ్లోకన్ కు మరోసారి చెప్తాడు. అతడు కాక ఈ సంభాషణలో పాల్గొన్న తక్కిన వారు, ఫేద్రోస్, పౌసీనియస్, ఎరిక్సిమేకస్, అరిస్టోఫెనీస్, అగధాన్, సోక్రటీస్, ఆల్సిబయాడిస్, మరికొందరు పానోన్మత్తులు.

స్థలం: అగధాన్ ఇల్లు


నువ్వడిగిన సంగతుల గురించి చెప్పడానికి నా దగ్గర ఎంతోకొంత సమాచారం లేకపోలేదు. మొన్న సాయంకాలం నేను నా ఇంటిదగ్గరినుంచి నగరంలోకి వస్తున్నప్పుడు నాకు తెలిసినవాడొకడు నన్ను వెనకనుంచి చూసి గుర్తుపట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ‘అపొల్లోదొరోస్, ఆగు ఆగు’ అంటో గట్టిగా అరిచాడు. నేను ఆగాను. అప్పుడతను నాతో ‘అపొల్లోదొరోస్! నేను నీ కోసమే వెతుక్కుంటున్నాను, అగధాన్ ఇచ్చిన విందులో ప్రేమని కీర్తిస్తూ సోక్రటీస్ చేసిన ప్రసంగం గురించి నిన్ను అడగాలని నీకోసమే వెతుక్కుంటున్నాను. ఆ విందులో ఆల్సిబయాడిస్ తో పాటు ఇంకా చాలామంది ఉన్నారట కదా. ఇదంతా ఫిలిప్పు కొడుకు ఫోనిక్స్ ఎవరికో చెప్తే వాడు నాకు చెప్పాడు. కానీ వాడు చెప్పింది నాకేమీ అంత అర్థం కాలేదు. అయితే ఈ వివరాలన్నీ నీకు తెలుసని నాతో చెప్పాడు. అందుకని నేరుగా నువ్వు చెప్తే వినాలని నీ దగ్గరకొచ్చాను. నీ స్నేహితుడి చేసిన ప్రసంగం గురించి నువ్వు కాక ఇంకెవరు బాగా చెప్పగలుగుతారు? అన్నిటికన్నా ముందు ఒక సంగతి చెప్పు, మా వాడు చెప్పినట్టుగా, నువ్వు ఆ గోష్ఠిలో ఉన్నావా?’

ఆ మాటలు విని నేనతడితో ‘ గ్లోకెన్, నువ్వు చెప్పేది మరీ కలగాపులగంగా ఉంది. మొదటిదేమిటంటే ఆ విందు ఏదో నిన్న మొన్న జరిగినట్టు ఊహించుకుంటున్నావు, రెండోది నేనక్కడున్నట్టుగా అనుకుంటున్నావు’ అని అన్నాను.

‘ఏం? ఎందుకని? నువ్వక్కడ ఉండే ఉంటావనుకున్నాన్నేను’.

‘అస్సల్లేదు’ అన్నాను. ఇంకా ఇలా చెప్పాను ‘నీకు తెలీదా, చాలా ఏళ్ళబట్టీ అగధాన్ ఏథెన్సులో ఉండటం లేదనీ, నాకు సోక్రటీస్ పరిచయమై, నా నిత్యజీవితంలో ఆయన భాగమై  మూడేళ్ళు కూడా కాలేదనీ. నా జీవితంలో కూడా ఒక సమయముండేది, అప్పట్లో నేను ఏదో పెద్దపనివ్యవహారంలో తలమునకలయి ఉన్నవాడిలాగా, కానీ నిజానికి, ఏ పనీ లేకుండా, ఇదుగో నువ్వు తిరుగుతున్నావే, అలా ఊరికినే పొద్దుపుచ్చుతూ ఉండేవాణ్ణి.  ఆ రోజుల్లో నేనేదో ఒకటవ్వాలని అనుకునేవాణ్ణిగాని, తత్త్వవేత్తను కావాలని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకోలేదు’.

‘సరిలే, ఈ వేళాకోళం మాటలకేంగానీ, ఇంతకీ ఆ గోష్ఠి ఎప్పుడు జరిగిందో చెప్పు’.

‘నా కౌమార దినాల్లో’ అని అన్నాను. ‘అప్పట్లో అగధాన్ తాను రాసిన విషాదాంత నాటకానికి బహుమతి గెల్చుకున్న మరుసటి రోజున, తను, తన నాటకబృందంతో కలిసి ఆ విజయాన్ని వేడుకగా జరుపుకోడానికి ఒక విందు ఏర్పాటు చేసినప్పుడు.’

‘అలా అయితే అది చాలా కాలం కిందటన్నమాటే. మరి ఆ సంగతులున్నీ నీకెవరు చెప్పారు? సోక్రటీసునా?’

‘కానేకాదు, నిజానికి ఆ ముచ్చట్లు ఫోనిక్సుకి ఎవరు చెప్పారో ఆయనే నాకూ చెప్పాడు. సిడతేనియం కి చెందిన డెమి నుంచి వచ్చిన అరిస్టోడెమొస్. ఆయన కూడా అప్పటికి చిన్నపిల్లాడే. కాళ్లకి చెప్పులు కూడా తొడుక్కునేవాడు కాడు. అగధాన్ ఇచ్చిన విందులో ఆయన కూడా ఉన్నాడు.  ఆ రోజుల్లో సోక్రటీస్ కి ఆయన్ని మించిన మరొక ఆరాధకుడు లేడనిచెప్పుకునేవారు. ఆయన్నుంచి ఆ సంగతులు విన్నాక ఆ కథనంలో కొన్ని భాగాలు నిజమేనా అని సోక్రటీస్ అని అడిగాను. సోక్రటీస్ అవి నిజమే అన్నాడు’ అని అన్నాను. ‘అలా అయితే ఆ కథంతా మరోసారి మనం చెప్పుకుందామా’ అనడిగాడు గ్లోకెన్. ‘ఏథెన్సులో రహదారులు ఉన్నది ఇటువంటి కథనాల కోసమే కదా ? అప్పుడు మేము ఆ ప్రేమగోష్ఠి గురించి మాట్లాడుకుంటో నడవడం మొదలుపెట్టాం. కాబట్టి నేను నీతో ముందేచెప్పినట్టుగా నువ్వడిగినదానికి జవాబివ్వడానికి నా దగ్గర సమాచారం లేకపోలేదు. నువ్వడిగావు కాబట్టి మరోసారి ఆ కథనమంతా నెమరేసుకుందాం. ఎందుకంటే తత్వశాస్త్రం గురించి వినడమన్నా, మాట్లాడడమన్నా నాకు చాలా చాలా ఇష్టం. అది లాభసాటి అవునా కాదా అన్న ఆలోచన నాకెప్పటికీ తోచదు. అదే మరో రకమైన సంభాషణలనుకో, అంటే మీలాగా డబ్బున్నవాళ్ళూ, వ్యాపారస్థులూ మాట్లాడుకునేమాటలన్నమాట- అవి వినడానికి నాకు చాలా రోతపుట్టిస్తాయి. అందులోనూ మీలాంటి సహచరుల్ని తలుచుకుంటే నాకు జాలేస్తుంది. మీరేదో చేస్తూ ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారుగాని నిజానికి మీరు చేసేదేమీ ఉండదు. అయితే నాకు ఈ సంగతి కూడా తెలుసు. నేను మిమ్మల్ని చూసి జాలిపడ్డట్టే మీరు కూడా నన్ను చూసి వీడో తృప్తి లేని ప్రాణి అని అనుకుంటూ ఉంటారని కూడా తెలుసు. బహుశా మీరలా అనుకోడంలో తప్పులేకపోవచ్చు కూడా. కాని ఒక తేడా ఉంది. మీరు నా గురించి అనుకునేది వట్టి ఊహ మాత్రమే. కాని నేను మీగురించి అనుకునేది వట్టి ఊహ కాదు, జ్ఞానం.’

సహచరుడు: అపొల్లోదోరస్, నువ్వెప్పట్లానే నీ గురించీ, పక్కవాళ్ళ గురించీ కూడా వేళాకోళంగా మాట్లాడుతునే ఉంటావు. నీకు మనుషులంటే ఎందుకో చాలా జాలీ, చిన్నచూపూను, ఒక్క సోక్రటీస్ పట్ల తప్ప. నిన్ను పిచ్చివాడని ఎందుకంటారో నాకర్థం కాదు. ఎందుకంటే ఒక్క సోక్రటీస్ ని మినహాయిస్తే నీకు నీతో సహా ప్రతి ఒక్కళ్ళ పట్లా ఎందుకో చెప్పలేనంత అసహనం.

అపొల్లోదోరస్: నిజమే, మిత్రమా, నన్ను పిచ్చివాడనడానికి, ఇదిగో, ఇప్పుడు చెప్పానే, నా గురించీ నీ గురించీ నా అభిప్రాయాలు, అవి చాలు, వేరే సాక్ష్యాలక్కర్లేదు.

సహచరుడు: సరే, ఆ మాటలింక కట్టిపెట్టి నేను అడిగినట్టు ఆ సంభాషణ నాకోసం మరో సారి తిరిగి వినిపించు.

అపొల్లోదోరస్: మంచిది. ఆ ప్రేమకథ ఎలా నడిచిందంటే- కాని అసలు ఆ చర్చంతా ఎక్కడ మొదలయ్యిందో అక్కణ్ణుంచీ చెప్పడం మంచిదనుకుంటాను. అరిస్టొడెమస్ చెప్పిన మాటల్లో సరిగ్గా చెప్పాలంటే-

అతడు సోక్రటీసుని చూడ్డానికి వెళ్ళేటప్పటికి సోక్రటీసు అప్పుడే స్నానం చేసి చెప్పులు తొడుక్కుంటూ ఉన్నాడట. ఆయన చెప్పులు తోడుక్కోడం మామూలుగా కనిపించే దృశ్యం కాదుకాబట్టి మావాడు సోక్రటీసుని ఏమట్లా పెళ్ళికొడుకులాగా తయారై ఎక్కడికి బయల్దేరారు అని అడిగాడట. అప్పుడు సోక్రటీస్-

‘అగాధాన్ ఇవ్వబోతున్న విందుకి వెళ్తున్నాను’ అని చెప్పాడు. ‘అతడు సాధించిన విజయాన్ని వేడుకచేసుకోడం కోసం ఆ విందుకి రమ్మని పిలిస్తే నిన్న నేను రానని చెప్పాను. ఎందుకంటే నిన్న అక్కడ బాగా తొడతొక్కిడిగా ఉంటుందని భయపడ్డాను. అందుకని ఇవాళ వస్తానని చెప్పాను. మరి ఆయనలాంటి పెద్దమనిషి విందు ఏర్పాటుచేసినప్పుడు నేను కూడా చక్కగా తయారవ్వాలి కదా. సరే, వాళ్ళు నిన్ను పిలవలేదుగానీ, నాతో పాటు రాడానికి నీకేమన్నా అభ్యంతరమా?’

‘మీరు రమ్మంటే వస్తాను అన్నాన్నేను.’

‘అయితే రా, పోదాం. అదేదో సామెత ఉందే, దాన్నివ్వాళ పూర్తిగా రద్దుచేసిపారేద్దాం. ఆ సామెత గుర్తుంది కదా: తక్కువవాళ్ళిచ్చే విందుకి గొప్పవాళ్ళు పిలవకుండా పోకూడదు అని. ఆ సామెత బదులు మనమో కొత్త సామెత మొదలుపెడదాం: ‘మంచివాళ్ళిచ్చే విందుకి మంచివాళ్ళు పిలవకున్నా పోతారు’ అని

‘ఈ సామెతని నేను మారుస్తున్నాను అనుకునేవు, లేదు హోమర్ కూడా ఈ మాటలు ఒప్పుకుని తీరతాడు. ఆయనైతే పాతసామెతని ముక్కలు చేసి పక్కన పారేసి కొత్త సామెతని కవిత్వంలో చెప్తాడు కూడా. గుర్తుందా, ఆగమెమ్నాన్ ని మనుషుల్లో వీరాధివీరుడిగా చిత్రించేక, ఆగమెమ్నాన్ ఇచ్చే విందుకి దుర్బలవీరుడైన మీనిలాస్ కూడా పిలవకుండానే వచ్చినట్టు చెప్తాడు. బలుల్తోనూ, నైవేద్యాలతోనూ ఇచ్చే ఆ విందుకి చిన్నవాళ్ళదగ్గరికి పెద్దవాళ్ళు వచ్చినట్టుకాదు, పెద్ద వాళ్ళదగ్గరికి చిన్నవాళ్ళే వచ్చినట్టన్నమాట.’

‘కానీ సోక్రటీస్ చూడబోతే ఇది నా గురించే చెప్పినట్టుంది.ఎందుకంటే హోమర్ మీనిలాస్ గురించి చెప్పినట్టుగా నేనిక్కడ చిన్నవాణ్ణి, కాబట్టి-

‘పెద్దవాళ్ళిచ్చే విందుకి పిలవకుండానే వెళ్ళినట్టు.’

కాని నన్ను పిలిచింది నువ్వు. కాబట్టి దీన్ని నువ్విట్లా మార్చవలసి ఉంటుంది:

‘ఇద్దరూ కలిసి వెళ్ళినట్టు.’

8-10-2023

6 Replies to “ప్రేమగోష్ఠి-1”

  1. పెద్దవాళ్లిచ్చే విందు- ఇలాగే ఉంటుంది. నాకు ముందు గానే కడుపు నిండినంత సంతృప్తి గా వుంది. ఇక రోజూ ఎదురు చూపులే!🙏

  2. ఒక్కసారిగా సోక్రటీసు కాలానికి వెళ్లటం, ఆ పాత్రలను మనసుకు అన్వయించుకోవడం వెంటనే జరిగే పనికాకపోవచ్చు. కానీ మీరు అవన్నీ ఊహించి సాధియమైనంతవరకు స్పష్టంగానే రాసారు. ఆ సాహిత్యంతో పరిచయం లేని నీలాంటా వాళ్లకు ఒకటికి రెండు సార్లు చదువుకుంటూ పాత్రలను ప్రతిష్ఠించుకోవటమే
    చేయవలసిన పని.
    దొంగల చేతికి దొరకనిది దానము చేసిన తరగనిది
    పాట గుర్తొస్తుంది ‘జ్ఞానదాతాస్సుఖీభవ ‘

  3. మీ వంటి మిత్రులు ఉండటం మా అదృష్టం. విలువైన సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఆ సారాన్ని మాకు విందుగా వడ్డిస్తున్నారు . ధన్యవాదాలు!

Leave a Reply

%d