ఉండవల్లి గుహల దగ్గర

ఒక స్కెచ్ బుక్కు చేతిలో పట్టుకుని ఔట్ డోర్ స్కెచింగ్ కి వెళ్ళాలని ఈ మధ్య చాలాసార్లు అనిపిస్తూ ఉంది. అందుకని మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు మా అక్కనీ, మా మేనల్లుడు రాజానీ ఉండవల్లి గుహలదగ్గరకి తీసుకువెళ్ళమని అడిగాను. మేం వెళ్ళేటప్పటికి పొద్దు నడినెత్తిమీదకి వచ్చింది. మళ్లా ఆ మధ్యాహ్నం మూడింటికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మీటింగ్ లో పాల్గోవాల్సి ఉంది.

ఆ ఉన్న కొద్దిసేపట్లోనే నాలుగైదు స్కెచ్చులు గీసాను. ఏదైనా ఒక దృశ్యాన్ని బొమ్మ గియ్యడంలో ఉండే మరో ఆనందమేమిటంటే, ఆ దృశ్యంలోని వంపులు, రేఖలు, లోతు, నిడివి, టెక్చర్ ఒక్కొక్కటీ మళ్ళా నువ్వు చేత్తో తాకినట్టు ఉంటుంది. అక్కడ పూర్తిగా శిథిలమైపోగా మిగిలిన ఒక ఏనుగు ముఖాకృతిలో ఉండే స్తంభాన్ని గియ్యబోతే, ఆ ఏనుగూ, దాని కుంభస్థలమూ, ఆ నేత్రమూ, ఆ దంతమూ- కొన్ని శతాబ్దాల కిందట ఆ శిల్పి వాటిని తీర్చిదిద్దినప్పుడు, అతడి వేళ్ళకి ఏ సౌకుమార్యం అనుభూతికి వచ్చి ఉంటుందో అది మళ్ళా నా వేళ్ళకి కూడా అందినట్టనిపించింది.

ఔట్ డోర్ స్కెచ్చింగుకి వెళ్ళినప్పుడు ఆ నోటుబుక్కులో ఆ వాతావరణాన్నీ, ఆ క్షణాల్నీ, ఆ వేళల్నీ గుర్తుచేస్తుండే నోట్సు రాసుకొమ్మని చెప్తారు. అక్కడి టిక్కెట్లో, మరేవైనా గుర్తులో ఉండే వాటిని కూడా ఆ స్కెచ్చుబుక్కులో అతికించుకొమ్మని చెప్తారు.

ఉండవల్లి గుహలు మొదట్లో బౌద్ధ గుహలు. తర్వాత వాటిలో వైదిక దేవతలు వచ్చి చేరారు. కాని ఆ మతపరిణామాల్ని దాటి, ఆ తొలిరోజుల ప్రశాంతి ఆ గుహల్ని ఇంకా అంటిపెట్టుకుని ఉందనిపించింది.

టెక్స్టుబుక్కుల్లో చెప్పినట్టు ఔట్ డోర్ స్కెచ్చింగు చెయ్యాలని కదా వెళ్ళాను. అందుకని పైన స్కెచ్చి గియ్యగానే కిందన ఇలా రాసుకున్నాను.

‘మధ్యాహ్నవేళ ఆ గుహాలయంలో నిశ్శబ్దం ప్రత్యేకంగా ఉంది. శతాబ్దాల కింద బౌద్ధ భిక్షువుల ప్రార్థనలు ఆ గుహని పునీతం చేసినట్టుగా ఉంది.’

ఆ ఎండవేళ, ఆ గుహల్లో అడుగుపెట్టగానే గొప్ప చల్లదనం వంటిని తాకింది. ఎదురుగా పొలాల్లో రెల్లు ప్రత్యక్షమయింది. వర్షాకాలం వెనకబడుతూనే నదీతీరాల్లోనూ, పొలాల్లోనూ రెల్లు కనిపిస్తే మనసుకి ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేను. ఈ దృశ్యం హైదరాబాదులో కనిపించేది కాదు. ఆ దృశ్యాన్ని స్కెచ్చి గీసుకోగానే ఇలా రాసుకున్నాను.

‘ఉండవల్లి గుహాలయాల దగ్గర, మలివర్షాకాలపు ఉదయం. దూరంగా అరటి, కొబ్బరి తోటలు, రెల్లుపొదలు. కాలువల్లో నీరు తేటపడుతున్నది.’

7-10-2023

2 Replies to “ఉండవల్లి గుహల దగ్గర”

Leave a Reply

%d