బయటపడాలి

చాలా ఏళ్ల కిందటి మాట. అప్పట్లో ఒక ఇంటర్నేషనల్ ఎన్జీవో ప్రభుత్వంతో కలిసి ఒక ప్రాజెక్టు చేపట్టారు. అందులో నాకు ఒక ముఖ్యమైన పొజిషన్ ఆఫర్ చేశారు. నేను మా కమిషనర్ దగ్గరికి వెళ్లి నాకు ఇట్లా ఒక ఆఫర్ వచ్చిందనీ, అప్పుడు నాకు వచ్చే జీతం కన్నా కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉందనీ, అందుకని ఉద్యోగం నుంచి సెలవు మీదనో, డెప్యటేషన్ మీదనో అందులో చేరాలని అనుకుంటున్నాను అని చెప్పాను. కానీ ఆయన నేను చెప్పిందంతా విని పెదవి విరిచాడు. ‘మీకు కాంపెన్సేషన్ ఎక్కువ వస్తుంది అని అంటే నేనేమీ చెప్పలేను గానీ ప్రభుత్వం కన్నా బయట ఉండి మాత్రం మీరు చేయగల సేవ ఏమీ ఉండదు. ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా ఎక్కువ అవకాశాలూ, ఎక్కువ అధికారాలూ బయట ఉండే అవకాశం లేదు’ అని అన్నాడు.

కానీ చాలా ఏళ్ల తర్వాత మరొక ఎన్జీవో గిరిజనుల కోసం నడుపుతున్న ఒక పెద్ద పాఠశాలను వెళ్లి చూసినప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేరి పొరపాటు చేశానా అనిపించింది. ఎందుకంటే నా సర్వీసు మొత్తం మీద నేను అంతకన్నా ఎక్కువ కృషి చేశాను. అంతకన్నా ఎక్కువ సమయాన్నీ, జ్ఞానాన్ని వ్యయపరిచాను. కానీ నా సేవలు ఏళ్ల మీదట diffused గానే మిగిలిపోయాయి అనిపించింది. కానీ అదే ఆ పాఠశాల నడుపుతున్న సంఘ సేవకుడు తన జీవితకాలపు కృషిని focussed గా పెట్టగలిగాడు అనిపించింది.

ఒక ప్రభుత్వ అధికారి తన వల్ల సమాజంలో ఈ మార్పు సంభవించింది అని ఏ ఒక్కదానిమీదా వేలు పెట్టి చూపించుకోలేడు. అది సమష్టి కృషి. స్వచ్ఛంద సంస్థ నడిపే నాయకుడు కూడా తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం సమష్టి కృషి ద్వారానే తాను అనుకున్నది చేయలిగినప్పటికీ తమ విజయాన్నీ, తాను సమాజంలో ఏ మార్పుకు శ్రీకారం చుట్టాడో ఆ మార్పుని తనదే అని చెప్పుకోవడానికీ లేదా ఆ దారి తను వేసాను అని చూపించుకోవడానికీ, అతనికి ఎప్పటికీ ఒక అవకాశం ఉంటుంది.

కానీ ఈ రెండు దశలు దాటాక ఇప్పుడు మూడో దశలో నాకు ఏమనిపిస్తోందంటే అసలు ఒక మనిషి- ప్రభుత్వం కానీ, ప్రభుత్వ సంస్థ కానీ, రాజ్యం కానీ, రాజ్యానికి ఆవల సంస్థలు కానీ ఏదైనా సరే ఒక సంస్థాగతమైన ప్రయత్నం ద్వారానో, కృషి ద్వారానో ఏదో ఒక మార్పు తీసుకురాగలిగానని ఎంత చెప్పుకున్నప్పటికీ అసలు వ్యవస్థాగతమైన ప్రతి ప్రయత్నంలోనూ అంతర్లీనంగా ఎంతో కొంత violence తప్పకుండా ఉండి తీరుతుందని.
ఒక మనిషి జీవితకాలం పోరాడిన తర్వాత కూడా, లేదా నిర్మాణాలు చేపట్టిన తర్వాత కూడా, తాను తన తోటి మనిషితో అహింసాత్మకంగా జీవించిన తావులు ఏవో, క్షణాలు ఏవో వాటి గురించి మాత్రమే తృప్తిగానో, శాంతి గానో మాట్లాడుకోగలడు అని అనిపించింది. చివరికి మిగిలేదీ, చివరికి నిన్ను సేద తీర్చేదీ, మరొక మనిషితో నువ్వు సమరసపూర్వకంగా జీవించిన క్షణాలు మాత్రమే.

మనం ఎంత మాట్లాడినా మన దర్శనం వైపుగానో, మన ఆదర్శాల వైపుగానో తక్కిన మనుషుల్ని నడపడంలో తప్పనిసరిగా ఒక హింస ఉండి తీరుతుంది. ఆదర్శాలూ, ఆచరణా ఎంత గొప్పవేనా గానీ, నువ్వు చేయవలసి వచ్చే పోరాటంలో తప్పనిసరి అయిన ఈ హింస గురించి మనిషి తొలి కాలం నుంచి రకరకాల సమాధానాలు చెప్పుకుంటూ ఉన్నాడు. అటువంటి సమాధానాల్లో ప్రసిద్ధమైన ఒక సమాధానం భగవద్గీత అని మనకు తెలుసు. నువ్వు ఏది చేసినా నీ విధి నిర్వహణలో భాగంగా చేస్తున్నాను అని అనుకుని చేస్తే నీకు సమస్య ఉండదు అని గీత చెప్పిందని మనకు తెలుసు.

కానీ సమస్య- నువ్వు ఏదైనా ఒకటి చేయటమో, చేయకపోవడమో కాదు. నిజానికి కురుక్షేత్ర యుద్ధం సంభవించడంలో లేదా కురుక్షేత్రం వైపు కౌరవ పాండవులు ప్రయాణించవలసిరావటంలో అర్జునుడి పాత్ర చాలా తక్కువ. కానీ ఆ యుద్ధం గురించిన నైతికమైన విచికిత్స అర్జునుణ్ణి ఎందుకు పట్టుకుంది? కురుక్షేత్రం మధ్య ఆ విచికిత్సకి నిజంగా లోను కావలసింది ఎవరైనా ఉంటే అది ధర్మరాజు కానీ అర్జునుడు ఎందుకు లోనయ్యాడు?

ఎందుకంటే భగవంతుడు అతడికి సారథిగా నిలబడ్డాడు కాబట్టి.

నీ జీవితంలోనూ, నా జీవితంలోనూ కూడా ఒక సమయం వస్తుంది. అప్పుడు నీ పక్కన ఈశ్వరుడు నిలబడడం గమనిస్తావు. నీ ఎదురుగా నీ మిత్రుడో, శత్రువో ఎవరో నిలబడి ఉంటారు. నువ్వు ఎదుర్కొనే నైతిక సమస్య ఏమిటంటే ఈశ్వరుడు నా పక్కన నిలబడి ఉన్నా కూడా నేను ఈ అనివార్యమైన హింసలో భాగం కాక తప్పదా అన్నది. ఈశ్వరానుగ్రహం పొందిన తర్వాత కూడా నేను ఈ పోరాటం చేయక తప్పదా అనేదే అసలు పోరాటం. అంతే కాదు ఏదో ఒక వ్యవస్థలో భాగంగా ఇంకా నేను కొనసాగుతూ ఉండక తప్పదా అనేదే అప్పుడు నిన్ను బాధించే సమస్య.

వ్యవస్థలో భాగంగా కొనసాగడంలోని తప్పనిసరి హింసనే మనవాళ్లు భవసాగరం అన్నారు. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడం లేదా వ్యాపారం నడపడం లేదా ఉద్యమాలు చేపట్టడం లేదా పుస్తకాలు రాయటం ప్రసంగాలు చేయడం ఏదైనా కూడా నువ్వు ఒక వ్యవస్థలో భాగంగా చేయడంలో నిస్సందేహంగా భయానకమైన హింస ఉంది. నీ తోటి మనిషి నుంచి నిన్ను దూరంగా తీసుకువెళ్లిపోయే ఒక జిగీష ఉంది. ముఖ్యంగా నువ్వు నీ తోటి మనిషిని నీ ప్రయత్నాల్లో ఒక భాగంగా స్వీకరిస్తున్న ప్రతిసారీ ఏదో ఒక రూపంలో అతణ్ణి నియంత్రించడానికి పూనుకుంటావన్న ఎరుక కలగగానే అది నిన్ను పెట్టే ఆత్మ హింస సాధారణంగా ఉండదు.

ఉదాహరణకి టాల్ స్టాయి ని తీసుకోండి. 19వ శతాబ్ది రష్యాలో ఎన్నో సౌకర్యాలు ఆయనకు పుట్టుకతోటే సంక్రమించాయి. కులీనుడు, భూస్వామి, లెక్కలేనంత మంది దాసదాసీ జనం. వేల ఎకరాల ఎస్టేట్. కానీ ఆయన తనలోని ఈశ్వరుణ్ణీ, తనలోని ఈశ్వర సామ్రాజ్యాన్నీ గుర్తుపట్టడం మొదలుకాగానే వీటిలో ప్రతి ఒక్కటీ ఆయనకు సంకెళ్లుగా కనిపించడం మొదలుపెట్టాయి. చివరికి తను అంటే టాల్ స్టాయి అనే రచయిత కూడా టాల్ స్టాయి అనే మానవుడికి అడ్డుపడుతున్నట్టుగా ఆయన భావించాడు. తనలోని సృజనాత్మక రచయిత తనని తోటి మనుషులకి సన్నిహితుడిగా తీసుకుపోతున్నట్లుగా పైకి కనిపించినా నిజానికి అది తన తోటి మనిషి నుంచి తనని ప్రత్యేకంగా ఒకింత ఉన్నత స్థానంలో నిలబెట్టే కార్యకలాపంగానే అతని కనిపించింది. అందుకనే తన యాభైవ ఏడు తర్వాత దాదాపు పాతికేళ్లు ఆయన సృజనాత్మక రచనల బదులు నీతి కథలు రాసుకోవడం మీదనే ఎక్కువ ఆసక్తి చూపించాడు.

ఈ ప్రపంచంలో ఒక నైతిక మానవుడు ఎదుర్కొనే ఈ predicament ఇదే. అంటే తాను ఏదో ఒక కర్మ చేయకుండా ఉండలేడు, కానీ ఆ కర్మ అది ఎంత నిష్కళంకమైనదైనా, ఎంత నిరాసక్తితో చేసినా దానిలో తప్పనిసరిగా ఒక హింస ఉండి తీరుతుంది. చివరికి చెట్టున పండిన పండుని తెంపుకోవడంలో కూడా హింస ఉంది. కాబట్టి ప్రాచీన భారతదేశంలోని శ్రమణుల్లాగా, ఆలోచనాపరుడైన మానవుడికి, సున్నితమైన హృదయం కలిగిన మానవుడికి చివరికి మిగిలే కర్తవ్యం పరివ్రాజకుడు కావటమే అన్న భావనకి ఆయన చేరుకున్నాడు అని మనకి అర్థం అవుతుంది.

మొన్న The Last Station (2009) సినిమా చూస్తున్నంత సేపు నా మనసు ఇటువంటి భావాలతో సంచలితమవుతూనే ఉంది. అది టాల్ స్టాయి జీవితంలోని చివరి ఏడాది సంఘర్షణని చిత్రించిన సినిమా. చివరి రోజుల్లో టాల్ స్టాయి తన భార్యకీ, తన శిష్యులకీ మధ్య జరిగిన సంఘర్షణలో నలిగిపోయాడు. శిష్యులు టాల్ స్టాయి రచనలన్నీ ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి రావాలనీ, వాటి వల్ల ప్రజలు మరింత చైతన్యవంతులు అవుతారనీ వాదిస్తూ వచ్చారు. కాని టాల్ స్టాయి భార్య ఆ రచనల పైన కాపీరైట్ తనకి తన పిల్లలకి చెందాలనీ, వాటిని పబ్లిక్ డొమైన్ లో పెట్టడం అంటే తన పిల్లలకు తిండి లేకుండా చేయటమే అవుతుందని గొడవ పడింది. టాల్ స్టాయి తన శిష్యుల్ని సమర్థిస్తూ వచ్చినప్పటికీ, వారి అభీష్టం మేరకే వీలునామా రాసినప్పటికీ అతనికి తన భార్య ఆవేదనలో అర్థం లేకపోలేదు అని అనిపిస్తుంది కూడా.

హింస అంటే అది. అంటే నీ పెళ్లి వల్ల, నీ ఆస్తి వల్ల, చివరికి నీ సృజనాత్మక శక్తి వల్ల కూడా ఒక preveliged human being గా నిలబడవలసి రావటం, ఆ ప్రివిలేజ్ వల్ల సంభవించే సంఘర్షణ, హింస. చివరికి ఆయన ఆ ఇంట్లో ఉండలేక ఒక రాత్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడో ఒక రైల్వే స్టేషన్ లో తలదాచుకున్నాడు. అక్కడ చలిలో నిమోనియాతో కన్నుమూశాడు. అతడికి చర్చిలో నమ్మకం లేదు కాబట్టి అతడికి చర్చి ప్రకారం లభించవలసిన అంతిమ ఆశీస్సులు ఏవీ లభించలేదు. కులీనుడు, రాజ బంధువు, భూస్వామి, సంపన్నుడు, మహా రచయిత టాల్ స్టాయి చివరికి ఎక్కడో ఒక అనాథగా కన్నుమూశాడు. కానీ అతడు జీవితకాలమంతా చేస్తూ వచ్చిన పోరాటంలో చివరికి మరణం ద్వారా విజయం సాధించగలిగాడు. భవసాగరంలో మునిగిపోతున్న టాల్ స్టాయి ని పరివ్రాజకుడైన టాల్ స్టాయి ఎట్టకేలకు జుట్టు పట్టుకుని పైకి లేపగలిగాడు. ఆయనే రాసిన ‘స్వామి సెర్గేయ్’ కథలో లాగ.

నువ్వు ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు బాగా సేవ చేయగలవు, రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు దారి చూపించగలవు లేదా ప్రభుత్వాలకు అవతల పని చేస్తే లేదా ఉద్యమాల్లో పని చేస్తే మరింత బాగా నీ శక్తి వినియోగించగలవు- ఇటువంటి ఆలోచనలు దాదాపుగా అర్ధరహితమనే స్థితికి నేను ఈనాటికి చేరుకోగలిగాను.

అలాగని పరివ్రాజకుడిని కావాలి అంటే గృహపరిత్యాగం చేయటమే మార్గమని కూడా అనుకోలేకపోతున్నాను. ఇంతకీ గృహమంటే-నువ్వు అందులో ఉండేది కాదు, అది నీలో ఉండేది. నీలో గూడు కట్టుకున్న గృహం నుంచి బయటపడడమే నిజమైన గృహపరిత్యాగం. సొంత ఆస్తి పట్ల నాకు ఎప్పుడూ మక్కువ లేదు కానీ ఆస్తికన్నా మించిన మరేవో అంశాల పట్ల మనకు తెలియకుండానే మనలో ఒక possessiveness, ఒక లోభం గూడుకట్టుకోవడం మొదలు పెడుతుంది. అదేమిటో కనుక్కోవాలి. దాన్నుంచి బయటపడాలి.


Images courtesy: Wikimedia commons

5-10-2023

9 Replies to “బయటపడాలి”

  1. Insightful Sir. Thank you very much for the post. I felt calm, thoughtfulness while reading through the post.

Leave a Reply

%d