నవ్యానందం

కబీరు గీతాలకి నేను వచనంలో చేసిన అనువాదానికి సుష్మగారి స్వరాలాపనకి మిత్రులనుంచి చాలా మంచి స్పందన వచ్చింది. అయితే సుష్మ గారు ఈ గీతాలాపనని నాకు పంపకముందే పెన్మెత్స శ్రీనివాస రాజు మరొక యూట్యూబ్ పోస్టుపంపారు. అది టాగోర్ గీతాంజలికి చలం చేసిన అనువాదంలోంచి నాలుగైదు గీతాలకి సుష్మగారి గానం.

అనువాదం లానే గానం కూడా ఒక కావ్యానికి కొత్త తలుపు తెరుస్తుంది. అంతవరకూ మనం ఎన్ని సార్లు చదివి వున్నా కూడా మన దృష్టి నిలవని ఏ పంక్తిమీదనో, పదబంధం మీదనో అకస్మాత్తుగా వెలుగు పడుతుంది. మళ్ళా ఆ కావ్యం మనకి మరింత సన్నిహితమవుతుంది. అంతకు ముందు ఎన్నో సార్లు దృష్టి నిలిచిన వాక్యాలు కూడా మళ్లా కొత్తగా వినిపిస్తాయి. ఉదాహరణకి ఈ గితాలు వినడం మొదలుపెట్టగానే మొదటి గీతంలోనే-

యుగయుగాలు గడిచినా యింకా వర్షిస్తోనే వుంటావు
ఇంకా నా దోసిలిలో స్థలం మిగులుతుంది

అనే వాక్యాలే చూడండి. వందసార్లేనా చదివిఉంటాను ఈ తెలుగు వాక్యాల్నిప్పటికి. కానీ ఈ గానంలో వినగానే ఏవో అద్భుతమైన కొత్త వాక్యాల్లాగా, శరత్కాలపు తొలిసూర్యకాంతిలాగా నన్ను నవ్యానందంతో ముంచెత్తాయి.

ఆ గానం వినగానే నాకు అన్నిటికన్నా ముందు గీతాంజలి పట్లా, టాగోర్ పట్లా మళ్ళా గొప్ప ప్రేమా, గౌరవం కలిగాయి. ఆ గీతాల్లో ఏమి మహత్తు ఉందోగాని, వాటిని అనువాదాలుగా, చిత్రలేఖనాలుగా, గీతాలుగా, నాట్యాలుగా ఎన్ని విధాలుగా భావుకులు గత వందేళ్ళకు పైగా తమతమ పద్ధతుల్లో interpret చేస్తో ఉన్నారు! బహుశా రామాయణం తర్వాత ఇంత గౌరవం దక్కింది గీతాంజలికేనేమో అనిపించింది.

తెలుగులో అటువంటి గ్రంథమేదైనా ఉందా అని ఆలోచించాను. కొంత వరకూ మహాప్రస్థానం కనిపిస్తోంది. ఆ గీతాల్ని కూడా భావుకులు పాటలుగా, బొమ్మలుగా, నాట్యాలుగా, రూపకాలుగా వ్యాఖ్యానిస్తోనే ఉన్నారు. ఆ తర్వాత కొంత వరకూ ఎంకిపాటలు కనిపిస్తున్నాయి. కాని బహుశా తెలుగులో గీతాంజలికి లభించినన్ని సృజనాత్మక వ్యాఖ్యానాలు శ్రీ శ్రీకీ, ఎంకికీ ఇంకా రావలసే ఉంది. కాని వారిద్దరేనా? కృష్ణపక్షం, కిన్నెరసానిపాటలు, అమృతం కురిసిన రాత్రి- ఇంకా ఎందరు కవులు, ఎన్ని కావ్యాలు- భావుక హృదయాల తలుపుల దగ్గరే నిలబడిపోయి ఉన్నాయో కదా! కాని మన సంగీతకారులకి, గీతకారులకీ కూడా సినిమాపాట పట్ల ఉన్న మక్కువ సినిమాకి ఆవల ఉన్న సాహిత్యానికి తమదైన హృదయావిష్కరణ చెయ్యడం పట్ల లేదు.

కాని ఇటువంటి వ్యాఖ్యానాలు వస్తేనే ఒక జాతి సజీవంగా ఉన్నట్టు. గీతాంజలి కావ్యానికి డా.రొంపిచర్ల భార్గవి గారి అనువాదం, ఆ గీతాలు కొన్నిటికి గిరిధర్ గౌడ్ నీటిరంగుల అనువాదాలూ చూసినప్పుడు నాక్కూడా రెక్కలొచ్చినట్టు అనిపించింది. గీతాంజలి గీతాల్ని తాను కూడా అనువదించుకుని జింకా నాగరాజు గారు వాటికి రకరకాల మాధ్యమాల్లో చిత్రానువాదాలు చేసినప్పుడు, ఆ బొమ్మల్ని చూస్తుంటే, ఆ కవితలు మళ్ళా కొత్తగా కనిపించడం మొదలుపెట్టాయి. ఇప్పుడు సుష్మ గానాన్ని కూడా ఆ కోవలో చేర్చుకుంటున్నాను.

ఒక జాతికి నిజంగా సాంస్కృతిక పునరుజ్జీవనం ఎప్పుడు సంభవించిందంటే, ఇదుగో, ఈ గాయిక లాగా తమ హృదయాన్ని కదిలించిన దృశ్యాన్ని చిత్రించినప్పుడు, తమ నేత్రాల్ని సంతోషభరితుల్ని చేసిన దృశ్యాల్ని గీతాలుగా మార్చినప్పుడు, ఆ గీతాలకి గజ్జెకట్టినప్పుడు, ఆ నాట్యాల్ని శిల్పాలుగా చెక్కినప్పుడు.

వినండి.

https://youtu.be/Ju1Q3tCV41U?si=xm7b_5BBFVVRXvT2

3-10-2023

Leave a Reply

%d