పునర్యానం-60

పునర్యానం కావ్యం అయిదు అధ్యాయాలతో పూర్తయిపోయింది. మొదటి అధ్యాయంలో అన్నమే సమస్తం అనుకుని మొదలుపెట్టిన ప్రయాణం, ప్రాణం, మనస్సు, విజ్ఞానం, ఆనందం సమస్తం అని అనుకునేదాకా కొనసాగింది. ఆనందానుభవ ప్రకటనతో కావ్యం పూర్తయిపోవాలి, నిజానికి. కానీ ఉపనిషత్తు తన దర్శనానికి ఆశ్చర్యకరమైన ఒక ముగింపునిచ్చుకుంది. అన్నమే సత్యమని మొదలుపెట్టిన భృగువు చివరికి ఆనందమే సత్యమని గ్రహించాక, అక్కడితో ఆగిపోకుండా, తిరిగి మళ్ళా అన్నం దగ్గరకే వస్తాడు. అప్పుడు అతడిలా ఎలుగెత్తి చాటుతున్నాడు:

అహం అన్నం, అహం అన్నం, అహం అన్నం, అహం అన్నాదః, అహం అన్నాదః, అహం అన్నాదః, అహం శ్లోకకృత్, అహం శ్లోకకృత్, అహం శ్లోక కృత్, అహం అస్మి ప్రథమజా ఋతస్య, పూర్వం దేవేభ్యో అమృతస్య నాభా ఇ, యో మా దదాతి, స ఇదేవ మావాః అహం అన్నం అన్నం అదంతం ఆద్మి అహం విశ్వం భువనం అభ్యభవాం, సువర్ణ జ్యోతిః, య ఏవం వేదః ఇత్యుపనిషత్.

(నేను అన్నాన్ని, నేను అన్నాన్ని, నేను అన్నాన్ని, నేను అన్నం తినేవాణ్ణి, నేను అన్నం ఆరగించేవాణ్ణి, నేను అన్నం ఆరగించేవాణ్ణీ, నేను అన్నం ఆరగించేవాణ్ణి, నేను ఆ రెండింటినీ ఒక కవితతో కలిపేవాణ్ణి, ఆ రెండింటినీ ఒక పద్యంతో కలిపేవాణ్ణి, ఆ రెండింటినీ ఒక మంత్రంతో కలిపేవాణ్ణి. ప్రపంచాన్ని నిలబెడుతున్న ఈ ఈ ఋతంలో అందరికన్నా ముందుపుట్టినవాణ్ణి, దేవతలకన్నా ముందటివాణ్ణి, నేను అమృతత్వపు నాభిని. నాకు ఎవరు ఇస్తారో వారిని వారు రక్షించుకోగలుగుతున్నారు. నేను అన్నాన్ని, అన్నం తినేవాణ్ణి ఆరగించేవాణ్ణి, నేను ఈ ప్రపంచాన్ని దాటగలిగాను. నేను బంగారువెలుగుగా మారాను. ఇదే వేదం, ఇదే ఉపనిషత్తు.)

నేను మొదటిసారి ఈ దర్శన చరమవాక్యానికి చేరుకునేటప్పటికి సంభ్రమం ముంచెత్తింది నన్ను. మళ్ళీ ఎన్నిసార్లు చదివినా, ఇప్పుడు కూడా ఈ వాక్యాలు నన్నొక తేజోమయలోకంలోకి తీసుకుపోతాయి. ఏమి మాటలు! శ్లోకకృత్తు, అమృతపు నాభి, సువర్ణజ్యోతి. ఏమి దర్శనమిది! అన్నం, ప్రాణం, మనస్సు, జ్ఞానం, ఆనందం అనేవి వేరువేరు కావనీ, ఒకదానిలో ఒకటి ప్రతిష్ఠితమై ఉన్నాయనీ, అన్నం నుంచి ఆనందం దాకా ఒక చక్రమనీ, ఆనందలోకానికి చేరుకున్నాక నువ్వు తిరిగిమళ్ళా అన్నమయకోశంవైపు దిగి రావలసి ఉంటుందనీ ఋషి అంటున్నాడు. అంతేకాదు, ఆ స్థితికి చేరుకున్నాక ‘అన్నం న నింద్యాత్’ (అన్నాన్ని నిందించకండి), ‘అన్నం బహు కుర్వీత'(అన్నాన్ని విరివిగా అందించండి) అంటున్నాడు. ‘తద్ వ్రతం’ అంటే, అదే మన mission కావాలంటున్నాడు.

ఇప్పుడంతగా వినబడటంలేదుగానీ ఒకప్పుడు తెలుగు సాహిత్యంలో భావవాదం, భౌతికవాదం అనే రెండు మాటలు వినబడేవి. ఇప్పటి తరం అదృష్టవంతులు. వాళ్ళు ఆ మాటల ఉచ్చునుంచి తప్పించుకున్నారు. కాని నేను చాలా ఏళ్ళు ఆ రెండుమాటల్నీ అర్థం చేసుకోడానికి పెద్ద ప్రయత్నమే చేసాను. ఎందుకంటే, ఇంగ్లిషులో idealism అనే పదాన్ని భావవాదం అని అనువదించడం వల్ల వచ్చిన చిక్కు అది. ఆ రెండు మాటలూ నిజానికి ఐరోపీయ తత్త్వశాస్త్రం తాలూకు సమస్య, ప్లేటో, అరిస్టాటిల్ దర్శనాల మధ్య సమస్య, దేహానికీ, ఆత్మకీ మధ్య సమస్య. అసలు మొత్తం ఐరోపీయ తత్త్వశాస్త్రమే an eternal prisoner of binaries. కాని ఉపనిషత్తు, అదృష్టవశాత్తూ, అటువంటి పరస్పర విరుద్ధవైఖరుల్తో ప్రపంచాన్ని చూడలేదు. ఋషి దృష్టిలో భౌతికమనీ, భావమనీ వేరువేరుగా లేవు. అన్నమే ఆనందానికి కారణమవుతుంది. ఆనందమయుడైన మానవుడు తిరిగి మళ్ళా అన్నాన్ని వృద్ధి చెయ్యడానికి పూనుకుంటాడు. అలాగని అన్నమొక్కటే నిజమనిగాని, ఆనందమొక్కటే నిజమని గాని ఉపనిషత్తు అనలేదు. అలా అనకపోవడం వల్లనే హెన్రిక్ జిమ్మర్ తైత్తిరీయ ఉపనిషత్తుని universal communist manifesto అని అన్నాడు.

ఈ మంత్రాన్ని అనువదిస్తూ డా. రాధాకృష్ణన్ ఇలా రాస్తున్నాడు:

‘ఇది ఒక పరమానందగీతం. వివిధరూపాల్లో వ్యక్తమవుతున్న జీవితమంతా ఒకే ఒక సంగీతానికి అనుసంధానమవుతున్న వాక్కు. ఈ విశ్వాన్ని మహాపారవశ్యంతోనూ, కవితాత్మక భావోద్వేగంతోనూ కౌగిలించుకోవడమే దాని పరమఫలం. తానే ఆనందస్వరూపంగా మారిపోయిన విముక్తాత్మ, ఆ స్థితికి చేరుకునేటప్పటికి, విషయమూ, విషయీ అనే ద్వంద్వాన్ని అధిగమించి అన్నం ఆరగించేవాణ్ణీ, అన్నాన్నీ కూడా ఒకే సూత్రంతో కలపగలుగుతున్నాడు.’

ఈ స్థితికి చేరుకున్నాక ఎటువంటి కవిత్వం వస్తుందో నాకు తెలియదు. కాని కావ్యం రాసినందుకు ఫలంగా నేను ఆ క్షణాల్లో ఇటువంటి స్థితికి చేరుకున్నానని అప్పుడూ తెలుస్తూ ఉండింది. కాబట్టి అప్పుడు ఆ అనుభూతిని ఒక కృతజ్ఞతాసమర్పణగా మార్చడమే నేను చెయ్యగలిగింది.

ఈ కావ్యాన్ని దాదాపుగా అన్ని పత్రికలూ సమీక్షించాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ వచన కవిత పురస్కారం అందించింది. ఈ పుస్తకం మీద మిత్రుడు గంగారెడ్డి హైదరాబాదులో ఒక గోష్ఠి కూడా ఏర్పాటు చేసాడు. నా కావ్యం మీద మాట్లాడుతూ ఉండగా అక్కడ కూచోడం భావ్యం కాదనిపించి నేను ఆ సమావేశానికి వెళ్ళలేదు. ఆ రోజు వేగుంట మోహన ప్రసాద్ ఏం మాట్లాడేరో నాకు తెలీదుగానీ, చాలాకాలం తర్వాత ఆయన ‘మిసిమి’లో ఆ పుస్తకం గురించి రాసిన ఈ వాక్యాలు నాకు పరిపూర్ణమైన తృప్తి కలిగించాయి. ఆయన ఇలా రాస్తున్నాడు:

‘ఆధునిక జనజీవితపు తొక్కిడిలో, అలజడిలో, ఆందోళనలొ, అస్తిమితంలో ఓ మహాకావ్యనిర్మాణం జరగటమనేది ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన. దాన్ని నిజం చేసింది పునర్యానం. ఈ నిర్మాత చినవీరభద్రుడు. ఈయన రచనలన్నీ సహృదయునికి ప్రేమలేఖలే… తైత్తిరీయోపనిషత్తు భూమికగా ఈ ఆధునిక కవి ఏం ప్రవచిస్తున్నాడిందులో అని తెలుసుకోవాలంటే ఈ కావ్యాన్ని చాలా నిదానంగా, శ్రద్ధగా, భక్తితో, ప్రేమతో, రసైక్యభావనతో మాత్రమే చదువుకోవాలి. ‘


1

వాక్కుకి కృతజ్ఞతలు, మాటలకి కృతజ్ఞతలు, కళ్లు తెరిచినప్పటినుంచీ,
చెవి ఒగ్గి వినాలనిపించినవెన్నో మాటలు క్షేమ ప్రదాలు, అభయప్రదాలు,
ఐశ్వర్య ప్రదాలు, జ్ఞాన ప్రదాలు, ప్రేమాస్పదాలు
ప్రతి ఒక్క మాటకీ అక్షరమక్షరానికీ నా కృతజ్ఞతలు,

5

వదిలిపెట్టడాలకు కృతజ్ఞతలు, విసర్జనలకు కృతజ్ఞతలు, విమోచనాలకు
కృతజ్ఞతలు, తెంచుకున్నవారికి కృతజ్ఞతలు, తెంపివేసిన బంధాలకు కృతజ్ఞతలు,
తెగిపోయిన ప్రతి సందర్భానికీ కృతజ్ఞతలు, విడిపోయి­నవారికి కృతజ్ఞతలు,
తిరిగి మొహం చూడటానికి ఇచ్చగించనివారికి కృతజ్ఞతలు,
మాట్లాడటం మానినవారికి కృతజ్ఞతలు, మాటలతో నన్ను హింసించడం మానినవారికి కృతజ్ఞతలు, సంయోగవియోగాలకు కృతజ్ఞతలు,
అహంకార మమకారాలకు కృతజ్ఞతలు, దూషణభూషణాదులకు కృతజ్ఞతలు,
సత్కారఛీత్కారాలకు కృతజ్ఞతలు, ప్రశంసలకు కృతజ్ఞతలు,
అభిశంసనలకు కృతజ్ఞతలు, స్వీకారతిరస్కారాలకు కృతజ్ఞతలు,
యుక్తాయుక్తాలకు కృతజ్ఞతలు, యోగ్యాయోగ్యాలకు కృతజ్ఞతలు,
సుందరవిరూపాలకు కృతజ్ఞతలు,
అధారనిరాధారాలకు కృతజ్ఞతలు, ఆదానతిరోధానాలకు కృతజ్ఞతలు,
అయినవాళ్లకూ, కానివాళ్లకూ కృతజ్ఞతలు.

10

ప్రజలకు కృతజ్ఞతలు, గ్రామాలకి కృతజ్ఞతలు, నగరాలకి కృతజ్ఞతలు,
వీథులకి కృతజ్ఞతలు, నన్నాహ్వానించిన ఇళ్లకు కృతజ్ఞతలు,
నన్ను తిరస్కరించిన గృహాలకి కృతజ్ఞతలు,
వీరులకి కృతజ్ఞతలు, నేతలకి కృతజ్ఞతలు, కవులకి కృతజ్ఞతలు,
కళాకారులకి కృతజ్ఞతలు, క్రీడాకారులకి కృతజ్ఞతలు,
సత్సాంగత్యాలకి కృతజ్ఞతలు, సాహిత్యవేదికలకు కృతజ్ఞతలు,
సాహిత్య ప్రచురణలకు కృతజ్ఞతలు, ఆత్మత్యాగాలకు కృతజ్ఞతలు,
నవజీవనానికి కృతజ్ఞతలు, అధ్యాపకులకు కృతజ్ఞతలు, గురువులకు కృతజ్ఞతలు,
నన్నాదరించిన మిత్రులకి కృతజ్ఞతలు,
నా తప్పుల్నెత్తి చూపిన శత్రువులకి కృతజ్ఞతలు.

11

అమ్మకి కృతజ్ఞతలు, నాన్నకి కృతజ్ఞతలు, అక్కకి కృతజ్ఞతలు, అన్నలకు
కృతజ్ఞతలు, చెల్లెళ్లకు కృతజ్ఞతలు, నా సహచరికి కృతజ్ఞతలు, నా పిల్లలకు
కృతజ్ఞతలు, నా తోడు నిలిచిన హృదయాలకు కృతజ్ఞతలు,
నన్నాదరించిన స్త్రీలకి కృతజ్ఞతలు, పురుషులకు కృతజ్ఞతలు,
మనుషులు నన్ను ప్రేమించారు, వారికి నా కృతజ్ఞతలు,
నన్ను తమ అక్కున చేర్చుకున్నారు, తమ వాణ్ణి చేసుకున్నారు, వారికి
నా కృతజ్ఞతలు.


1

I’m grateful to the Vac for the words
Words have always drawn me
Protective, fearless, wise, loving and enriching words.
I’m grateful for every letter and every word.

5

Giving up, letting go, and being delivered, I am grateful for.
I am grateful for breakups and broken relationships, and
For all the farewells and leavers
I’m grateful to those who never wanted to see me again
Who have stopped talking to me, and who have stopped bothering me.
Thanks for all the meetings and wrap-ups, and
For people’s egos, blind love, praise, and abuse.
I’m grateful for both the honor and the ridicule, and
For both acceptances and rejections.
I’m grateful for the proprieties and improprieties, the eligibility and ineligibility
My gratitude for the beautiful and ugly
I am grateful for the support, lack of it, and giving and withdrawing, and
All those who took me as their own and those who didn’t.

10

I’m grateful to people, villages, cities
The streets and homes that welcomed me.
I’m thankful for the houses that shut their doors.
I’m grateful to the heroes, the leaders, and the poets
Artists and athletes.
I’m grateful for the good company, for those who promote literature and make sacrifices.
My gratitude to the youth, teachers, and Gurus.
I’m grateful for friends who appreciate me, and
Enemies who point out my faults.

11

I’m grateful to my mom, dad, sister, brothers, and small sisters.
I’m grateful to my wife, my children, and those who stood by me
I’m grateful to the men and women who were kind to me
Thank you all for loving me, for making me your own.

1-10-2023

14 Replies to “పునర్యానం-60”

  1. రోజు మీ రచన చదవడం చాలా అపురూపంగా ఉంది…
    చదివిన దానిలో నాకు ఎంత అర్థం అవుతుందో తెలియదు… కానీ చదవడం చాలా బాగుంది.. thank you

  2. మీరు పొందిన పైస్థాయి రుచి మాకు చూపిస్తున్నారు 👌👌👌

  3. మీ వ్యాసాలు ఎప్పుడూ గొప్ప స్ఫూర్తిని కలుగచేస్తాయండీ. అనేక ధన్యవాదాలు🙏

  4. ఈయన రచనలన్నీ సహృదయునికి ప్రేమలేఖలే…
    🙏

  5. ఎంత సహజంగా, సున్నితంగా ఉందంటే ఈ రచన, చదువుతుంటే స్వగతం చెప్పుకున్నట్లుంది.
    Really enjoyed.Thank you very much.

  6. ఎంత సహజంగా, సున్నితంగా ఉందంటే ఈ రచన ఎవరికి వాళ్ళు స్వగతం చెప్పుకున్నట్లుంది.Really enjoyed. Thank you very much.

Leave a Reply

%d