పునర్యానం-59

పునర్యానం అయిదవ అధ్యాయంలో చివరి కవిత దగ్గరకు చేరుకున్నాం. కథ వరకూ, కవి జీవితప్రయాణం వరకూ, ఈ కవితతో కావ్యం ముగిసిపోయింది. కాని ఇది కావ్యానికి ముగింపు కాదు. కావ్యంలో చివరి అధ్యాయం, కృతజ్ఞతా సమర్పణ మిగిలి ఉంది.

టాగోర్ ఒక మాట రాసాడు. కావ్యానికి సమాప్తిలోనే సమాప్తి లేదు అని. ఎందుకంటే, కావ్యం చదవడం ముగించగానే, అది పాఠకుడి హృదయంలో జీవించడం మొదలుపెడుతుంది. అది తన సున్నితంగా తన హృదయం మీద చేసే ఒత్తిడికి పాఠకుడు మళ్ళా మళ్లా ఆ కావ్యాన్ని తెరుస్తూనే ఉంటాడు. మళ్ళా ఏదో ఒక పేజీలో ఏదో ఒక వాక్యం కొత్తగా కనిపించడం మొదలుపెడుతుంది.

సాధారణంగా చిత్రకారుల్ని వేధించే ఒక సమస్య, తాము చిత్రిస్తున్న చిత్రం చిత్రించడం ముగిసిందని తెలియడం ఎలాగు? ఏ క్షణాన, తన ఊహకి తగ్గట్టుగా చిత్రలేఖనం పూర్తయిందని చిత్రకారుడికి తెలుస్తుంది? చాలాసార్లు చిత్రకారులకి ఆ చివరిక్షణమేదో తెలియక, చిత్రించిన బొమ్మ మీద మళ్ళా రంగులు పులుముతూనే ఉంటారు. మరి కావ్యం ముగిసిందని ఎలా తెలియడం? నేను రాయాలని సంకల్పించిన కావ్యం ఈ కవితతోటే ముగిసిందని నాకు ఎలా తెలిసింది? చెప్పలేను.

చిత్రలేఖనం ముగిసిందని మీకు ఎలా తెలుస్తుందని ఒక చిత్రకారుణ్ణి అడిగితే, అతడు గమ్మత్తైన జవాబు చెప్పాడు. ‘నా చేతుల్లో ఉన్న పెద్ద కుంచె పక్కన పెట్టి చిన్న కుంచె చేతుల్లోకి తీసుకున్న క్షణం నాకు తెలుస్తుంది, ఆ చిత్రం చిత్రించడం పూర్తయిపోయిందని’ అని. ఆయన అన్న మాటలో ఒక సత్యం లేకపోలేదు. అదేమంటే, చిత్రకారుడు తాను చిత్రించవలసిన దృశ్యాన్ని చిత్రించాక కూడా ఇంకా ఏదో అసంతృప్తి వెంటాడి, ఇంకా ఏవో సూక్ష్మ వివరాలు చిత్రించడం మిగిలిపోయిందనే ఉద్దేశ్యంతో చిన్న కుంచె చేతుల్లోకి తీసుకుంటాడన్నమాట.

పునర్యానం నా ప్రయాణానికి సంబంధించిన కావ్యం. నేను నడిచిన వచ్చిన దారిని స్మరించుకున్నంత స్మరించాక, ఇంకా ముందు మిగిలి ఉన్న ప్రయాణాన్ని తలచుకోగానే, ఆ దారీ, ఆ మలుపులూ, ఆ గమ్యమూ ఏవీ కూడా నేను సంకల్పించినట్టు జరిగేవి కావనే మెలకువ కలిగిన క్షణమే, కావ్యం పూర్తయిపోయిందనిపించింది నాకు.


(అతడే నా రచయిత : గురునానక్‌)

కథలు రాయాలనుకున్నప్పుడల్లా ఎత్తుగడ ఒక కవ్వింత
ఎక్కణ్ణుంచిమొదలుపెడతావన్నదొక ఉత్కంఠ
ఎక్కడ ముగిస్తావన్నదొక రహస్యం, కథనకుతూహలం
రేకెత్తిస్తూ సాగుతున్నదొక అనాది కథక పరంపర

అనూహ్యం అన్నాకెరినినా కథ ఎత్తుగడ, అట్లానే ముగింపు,
ఆ రైలు పట్టాలు, యవ్వనభారం మెయ్యలేని ఆ బాలిక, ఎరగడు
టాల్ స్టాయి­ తన కథ కూడా ము­గిసిందొక
రైలు స్టేషన్‌ వెయిటింగ్‌ రూమ్‌లోనేనని.

ప్రేమించాను నేను కూడా కథల్ని, కథనాల్ని
జీవించాను సుదీర్ఘకాలం పాటు కథకుడిగా.
తెలుసుకున్నానిప్పుడు, ఎత్తుగడలు నావి కావని
మలుపులు నావి కావని, ము­గింపులు నావి కావని.

(పునర్యానం, 5.2.27)


(He writes our pleasure and pain: Gurunanak)

Telling stories is hard; where do you start?
It’s exciting just to start.
Endings are a mystery, and
That’s what keeps storytellers alive.

See Anna Karenina, first few sentences and last scene
That railway track, the poor girl who couldn’t handle love.
And Tolstoy didn’t even know his story
Ended in a railway waiting room.

Storytelling is also something I love.
But it took me some time to realize:
Nothing happens as planned
Beginning to end.

29-9-2023

4 Replies to “పునర్యానం-59”

  1. విచికిత్స విస్మయం
    కథనకుతూహల కవితారాగం

  2. నావి కాని ఎత్తుగడలు,
    మలుపులు, ము­గింపులు …

Leave a Reply

%d