
కొన్ని వాక్యాలుంటాయి. మహావాక్యాలు. ‘సత్యమే జయిస్తుంది, అనృతం కాదు’, ‘పనిచేస్తున్నవాళ్ళంతా ఏకమవ్వండి, మీరు పోగొట్టుకునేదేమీ లేదు, మీ సంకెళ్ళు తప్ప’, ‘మనిషి పుట్టడం స్వతంత్రుడిగా పుట్టాడు’ లాంటివి- ఆ వాక్యాలు వినగానే ఒక్కసారిగా సూర్యోదయమైనట్టు ఉంటుంది. అప్పటిదాకా చుట్టూ ఆవరించిన చీకటి ఒక్కసారిగా విచ్చిపోయినట్టు ఉంటుంది. మనకి గొప్ప ధైర్యం కలుగుతుంది. ఇదుగో, ఈ వాక్యం కూడా అటువంటిదే-
‘నువ్వెటునుంచి వస్తే అటే ప్రవేశం.’
ఇది మామూలు వాక్యం కాదు. యుగయుగాలుగా మనిషిని లోపలా, బయటా కూడా బంధిస్తూ వచ్చిన సంకెళ్ళను తుంచేసే వాక్యం.
కబీరు ఈ ఒక్క మాటతో, అప్పటిదాకా అర్హతల గురించీ, అధికారాల గురించీ మతాలు మాట్లాడుతూ వచ్చినవాటన్ననిటినీ పక్కకు తోసేసాడు. భగవంతుడి సన్నిధికి మనిషి చేరుకోవాలంటే జన్మ, కులం, జ్ఞానం, సంపద, సాధన- ఏవీ ముఖ్యం కాదు. నువ్వెటునుంచి ఆయన్ని చూడాలని అడుగేస్తే అక్కడే ఆయన భవన ప్రవేశ ద్వారం! ఎన్నో ఏళ్ళుగా తపసు చేస్తున్నవాళ్ళకీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడే ప్రవేశం. ఇవేళ హటాత్తుగా నిద్రలేచి, దేవుడెక్కడున్నాడో చూద్దామని అడుగేస్తే, వాళ్లకీ అక్కడే ప్రవేశం. చదువుకున్నవాళ్లకీ, చదువుకోనివాళ్ళకీ, దారివెతుక్కునేవాళ్ళకే కాదు, చివరకు నువ్వు దారితప్పావా, అయితే, అక్కడకూడా ఆ తలుపు నీకోసం తెరిచే ఉంటుంది.
నేనొకసారి ఒక ప్రసంగంలో వివరంగా చెప్పాను. కబీరు ఈ మాట ఎక్కణ్ణుంచి తెచ్చుకున్నాడో చూద్దామంటే ఆయనముందు మరెందరో ఈ మాటనమ్మినవాళ్ళున్నారని. చర్యాగీత గవులు, అవధూత గీత రాసిన అజ్ఞాత ఋషి, రూమీ, చివరికి, పవిత్ర ఖొరాన్ లో కూడా ఇటువంటి భావన కనిపిస్తుందని విన్నాను.
నువ్వు ఎక్కడ అడుగుపెడితే అక్కడల్లా ఆకాశం ఉన్నట్టుగా, నీ ప్రతి అడుగులోనూ భగవంతుడి అభయం ఉంది, అనుగ్రహం ఉంది. కావలసిందల్లా, ఆ వెలుగుని చూడగలగడం. అంతే.
మనకు టాగోర్ గీతాంజలి అంతగా నచ్చడానికి కారణం, ఆయన అడుగడుగునా భగవంతుడి సౌధం తలుపులు తెరుచుకుని ఉండటం చూసాడు కాబట్టి. కృష్ణశాస్త్రి ఎందుకు నచ్చుతాడంటే ‘అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది’ అన్నాడు కాబట్టి.
నీకు ఎదురవుతున్న ప్రతి ఒక్క అనుభవం, నువ్వు పొందగలిగినవీ, పొందలేనివీ, ప్రతి ఒక్కదాన్నీ నువ్వొక తెరిచిన తలుపుగా చూడగలిగినరోజు, నువ్వే భగవంతుడి పల్లకిగా మారతావు.
(నువ్వెటు నుంచి వస్తే అటునుంచే ప్రవేశం : కబీర్)
అప్పుడు మనం హోటల్‌కి వెళ్లాం, ఆ రోజు మనకెంతో
ఇష్టమైన రోజు, అప్పుడేం చేసారక్కడి వెయిటర్లు
రొట్టెను కేకు చేసి, కేండిల్ ఒత్తి చేసి
వెలిగించారొక దీపం, జరిపారొక ఉత్సవం.
మలినపడ్డ వస్త్రంలా అడుగుపెట్టానప్పుడు ఆ ప్రాంగణంలో
తెలియని అపరాధమేదో కుంగదీస్తోంది నన్ను.
పరమ అపవిత్రాలు నా హస్తాలనుకుంటున్నానా
పిలిచారెవరో : దేవుడి పల్లకీకి మీ భుజమివ్వండని.
రోజంతా పనిభారంతో అలిసిపోయి, ఇంటిదారి పట్టాలనుకునేవేళ
వచ్చాడతడు, కొద్దిసేపు నీతో కలిసి గడపాలని,
విసిగిఉన్నావు, సొలసిఉన్నావు, అయినా ఇవ్వాలని
ప్రయత్నించావు, నీ హృదయాన్నతనికి ఊతమివ్వాలని.
పిల్లవాడు బొమ్మలు తెమ్మన్నాడు, పని ఒత్తిడి నీకది
పడనివ్వలేదు, ఆలస్యపు గృహాగమనవేళ
ఎదురుచూస్తున్న పసికళ్ల ముందు వంగి వాలి
అన్నావు కదా : ‘నాన్నా, ఇదిగో నీ కోసం నేనే ఒక గుర్రం బొమ్మ’
(పునర్యానం, 5.2.23)
(Wherever you are there is an entry: Kabir)
The day was special; we went to a hotel.
The servers did what?
They turned the bread into cake and lit a candle
In our honor.
Even as I entered the temple yard that night,
A feeling of guilt gripped me as I felt sinful.
As I sat in the gloom, someone asked me
To carry the temple palanquin with my hand.
It’s been a long day, and you’re tired, and
He stopped by to chat for an hour.
Although you were exhausted,
You gave your best and shared your time.
You promised your kid you’d bring a toy.
Couldn’t find the time. It was late at night.
The kid was waiting for you.
You just bent down so you could be a horse for him.
29-9-2023
చైతన్య స్రవంతి కవిత.
కదిలే యవనికల వెనుక కనిపించీ కనుపించని దృశ్యానుభూతులు. ‘నువ్వెటునుంచి వచ్చావో అదే ప్రవేశం’-వెంటాడే మహా వాక్యం.
“నాన్నా, ఇదిగో నీ కోసం నేనే ఒక గుర్రం బొమ్మ…”
కన్నీళ్ళతో కడిగిన మాట!
అంత తక్కువలో ఎంత ఎక్కువ………….!
ధన్యవాదాలు సార్