
‘ఏదీ, మళ్ళీ ఒకసారి చదువు ‘అన్నారు మాష్టారు, నా కవిత విని. 2004 లో విజయవాడ బుక్ ఫెస్టివల్ లో పునర్యానం ఆవిష్కరణకు వచ్చారు ఆయన. అప్పటికింకా ఆయన ఆరోగ్యం చక్కబడలేదు. అయినా నా మీద వాత్సల్యంతో అడిగిన వెంటనే కాదంకుండా వచ్చారు. ఆయనతో పాటు ఆ రోజు కాళీపట్నం రామారావుగారు కూడా ఆ మీటింగులో ఉన్నారు.
మాష్టార్ని పుస్తకం ఆవిష్కరించమని అడిగానేగాని ఆయనకు పుస్తకం పంపలేదు. ఆయన నా కవిత్వం చదివితే ఏమంటారో అన్న సంకోచంతో ఆ పుస్తకం ఆ రోజే ఆయనకు చూపించాను. మహాకవుల్ని చదివినవాడు, హృదయదఘ్నంగా నిలుపుకున్నవాడు నా కవిత్వం ఆవిష్కరించడానికి రావడమే గొప్ప భాగ్యం, ఇంక ఆ కవిత్వం ఆయన చదవాలని కూడా ఎలా ఆశించగలను?
‘కనీసం రెండు కవితలేనా వినిపించు’, అని అడిగితే, ఈ కవిత కూడా వినిపించాను. ఎందుకంటే, ఇది ఆయన మీదనే రాసాను కాబట్టి. ఆ కవిత వింటూనే ఆయన వదనం మీద చిలిపితనంతో కూడిన చిరునవ్వు ప్రత్యక్షమయ్యింది. ‘ఏదీ, మళ్ళీ మరోసారి చదివి వినిపించు’ అన్నారు.
‘ఇంతకీ ఆ నామదేవ్ ఎందుకొచ్చాడు?’ అని అడిగారు ఒకటి రెండు నిమిషాలు గడిచేక.
అప్పుడు నేను విన్న కథ చెప్పాను. నామదేవ్ కొన్నాళ్ళు విశోబా కేచార్ ప్రభావంలో ఉండేవాడు. విశోబా విగ్రహారాధనకి వ్యతిరేకి. నామదేవ్ ఒకసారి ఆయన్ని కలుసుకోడానికి వెళ్తే, అతడు శివాలయంలో శివలింగం మీద కాళ్ళు చాపుకుని కూచుని కనబడ్డాడు. ‘అయ్యో, ఎంత అపరాధం! శివలింగం మీద కాళ్ళు పెట్టారు’ అన్నాడు నామదేవ్. అలాగా, శివుడు ఏ దిక్కున లేడో చెప్పు, నా కాళ్లు అటు తిప్పుకుంటాను’ అన్నాడు విశోబా. నామదేవ్ కూడా తక్షణమే విగ్రహారాధన వదిలిపెట్టేసాడు. జ్ఞానేశ్వర్ కి ఇదంతా తెలుస్తూ ఉంది. కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. కాని నామదేవ్ లో అహం తలెత్తిందని ముక్తాబాయి గుర్తుపట్టింది. అతణ్ణెలాగేనా దాన్నుంచి బయటపడెయ్యాలనుకుంది. ఒకరోజు అందరూ గోరాకుంభార్ దగ్గరికి వెళ్ళారు. ఆయన విఠ్ఠలభక్తుల్లో ముందు వరుసలో ఉండేవాడు. కుమ్మరి కాబట్టి ఏ కుండ కాలిందో, ఏది సరిగ్గా కాలలేదో గుర్తుపట్టడం అతడి వృత్తి. ముక్తా అతణ్ణి అడిగింది, ‘ఇదుగో, నీముందున్నామే, ఘటాలం, మాలో ఏ ఘటం పక్వమైందో, ఏది పక్వం కాలేదో చెప్పవా’ అనడిగింది. గోరా ఒక కట్టెతో అందరి తలలమీదా తట్టి చూసాడు. నామదేవ్ తలమీద తట్టగానే ‘ఈ ఘటం ఇంకా పచ్చిగా ఉంది’ అన్నాడు. నామదేవ్ గర్వం దిగిపోయింది.
నీ జీవితంలో నీకు తారసపడే మిత్రులు, గురువులు, అనుభవాలు- ప్రతి ఒక్కటీ కూడా నువ్వెంత పరిణతి చెంది ఉంటే ఆ మేరకే నిన్ను ఉత్తేజపరచగలుగుతాయి. లేదా మరోలా చెప్పాలంటే నువ్వు పరిణతి చెందనంతకాలం నీ పరిచయాలూ, స్నేహాలూ, అనుభవాలూ కూడా అపరిణతంగానే ఉంటాయి.
నువ్వు ఎదిగే కొద్దీ నీ కలయికలు కూడా ఎదుగుతుంటాయి. నువ్వు కలుసుకునే మనుషులు ఉన్నతులైనకొద్దీ నువ్వు కూడా ఎదుగుతూ ఉంటావు.
(నా స్తోమతుని బట్టి మన కలయిక : నామదేవ్)
రెండు దృశ్యాలు : అప్పుడాయన పైన మేడ మీంచి పిలిచాడు
ఆకాశం మీంచి వినవచ్చినట్లుందా పిలుపు, ఊహించలేకపోయాను
ఆయన నా కోసమెదురు చూస్తూంటాడని, కలిసి ఒక కవిత
చదువుకోవాలనుకుంటున్నాడని, బదులు పలకలేదు నేను.
నది మీంచి గాలులు వీచిపోతున్నాయి, వదల్లేకపోయానా స్నేహాల్ని
ఒక సిగరెట్ కాల్చుకోవడాన్ని, కొంత వృథాప్రసంగాల సంతోషాన్ని.
పిలిచి పిలిచి వెళ్లిపోయాడాయన లోపలకి, ఆగ్రహిస్తాడన్న
భయంతో ఆయన్ని మరికొన్నాళ్ళు చూడలేకపోయాను.
రెండవ దృశ్యం వెళ్లానిప్పుడు : నా అంతట నేనే, మేడ
మెట్లెక్కి ఆయన కోసం, అడిగాను నా అంత నేనే, వినిపించమనొక
శ్లోకాన్ని. ముంచెత్తుతున్న వరదలో చేజిక్కించుకున్నానొక ఆశ్రయాన్ని.
ఎంత కరుణామయం జీవితం, చూస్తూండగానే నా స్తోమతుని పెంచింది
(పునర్యానం, 5.2.19)
(As is my lot, so shall we meet: Namdev)
Two scenes: He called me from the terrace.
As if it came from above. I hadn’t expected,
That he was waiting for me, eager to read
A poem with me. I didn’t respond.
Over the river, idle breezes. I couldn’t give up,
The friendships, the smoking, and the gossip.
As he called and called, he went inside.
For a long time, I was afraid he’d get angry.
Second scene: On my own, I visited him.
On my own, I requested him to read a poem.
It was like getting a hold of a raft in a flood.
Life is truly merciful. It’s enhanced my lot.
28-9-2023
“ నా స్తోమతుని బట్టి మన కలయిక : నామదేవ్”
Super sir!
One has to be ready to get hold of that raft.
ధన్యవాదాలు మాధవీ!
“ నా స్తోమతుని బట్టి మన కలయిక : నామదేవ్”
Super sir! One has to be ready to get hold of that raft. 🙏🏽🙏🏽🙏🏽
As is my lot, so shall we meet:
అద్భుతమైన Statement.
ధన్యవాదాలు మేడం
నువ్వు కలుసుకున్న మనుషులు ఉన్నతులైన కొద్ది నువ్వు ఎదుగుతుంటావు.. గొప్ప మాట.
ధన్యవాదాలు సార్
‘పరిణతి – అపరిణతి’ “స్క్రీన్ షాట్ తీసి పెట్ట”మంది రాజశ్రీ. ‘రెండు దృశ్యాల అనుభవం’ మా బాపుతో అచల బోధ విషయంలో ఉండింది
ధన్యవాదాలు సార్.