
మొన్న ఆదిత్య నా కవితలో ఒక పదప్రయోగాన్ని ఎత్తిచూపుతూ అటువంటి పదబంధాలు సంఘటనల్లాంటివి, ఒక ధూమకేతువు ప్రత్యక్షం కావడం లాంటిది, చూపరులు ఆ సందర్శానికి నిశ్చేష్టులైపోతారు అని రాసాడు. కొన్ని కవితావాక్యాలు నా జీవితంలో నాకెదురైనవి అటువంటివి ఉన్నాయి. నా జీవితంలో నాకు తారసపడిన అత్యంత శక్తిమంతులూ, అత్యంత దయామయులూ అయినవారితో సమానంగా, అవి నన్ను ముందు విభ్రాంతికి గురిచేసి, ఆ తర్వాత చేరదీసుకుని, జీవితకాలం పాటు నాతో నడిచి వచ్చేవి.
‘ఆయన ఉనికి కన్య స్నేహం వంటిది’ అని బసవణ్ణ కూడలసంగమదేవుడి గురించి చెప్పిన మాట అటువంటిది. ఆ మాట నాతో ఇరవయ్యేళ్ళ కిందట ఈ కవిత రాయించడమే కాదు, ఈ ఏడాది ఒక నవల కూడా రాయించింది. గొప్ప కవులు, ఋషిత్వం పొందినవాళ్ళు పలికే ఒక్కొక్కమాట ఒక్కొక్క బీజాక్షరంగా నీ హృదయంలో నాటుకుంటుంది. నువ్వు మొదట్లో గుర్తుపట్టలేవుగానీ, అది నెమ్మదిగా మొక్కై, వృక్షమై, నీ అంతరంగంలో ఒక శాంతతరుచ్ఛాయని పరుస్తూనే ఉంటుంది.
నా జీవితంలో నేనొకప్పుడు చాలా వైల్డ్ గా ఉండేవాణ్ణి. వయొలెంట్ గా కూడా ఉండేవాణ్ణి. నా విశ్వాసాలకీ, నా ప్రిన్సిపుల్స్ కీ తగరనిపిస్తే వాళ్ళ మొహం చూడటానికి కూడా ఇష్టపడేవాణ్ణి కాను. ఆ హింస నా ప్రవర్తనలో అనేక రూపాలు ధరించేది. ‘నా జీవితం తెరిచిన పుస్తకం’ అనీ, నా స్నేహాన్ని కోరుకునేవారెవరూ నా దగ్గర ఏదీ దాచకూడదనీ పట్టుబట్టేవాణ్ణి. వాళ్ళ అంతరంగంలోని ప్రతి ఒక్క నీడా నాకు వెల్లడికావాలని అనుకునేవాణ్ణి. ఎంత మూర్ఖత్వం! ద్వేషం వల్ల తలెత్తే హింసకన్నా, ప్రేమ వల్ల తలెత్తే హింస మరింత ప్రమాదకరం. అందులోనూ, నువ్వు చాలా నిజాయితీపరుడవనీ, నీకేవీ రహస్యాలు లేవనీ, నీ నిస్వార్థత లాంటిది ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తుందనీ అనుకోవడం మొదలుపెట్టగానే నీకు తెలీకుండానే నువ్వు రాక్షసుడిగా మారతావు.
కాని నన్ను ఆ అగాధంలోకి పూర్తిగా జారిపోకుండా కాచి రక్షించిన ఆ దైవం ఎంత దయామయుడు! ఎంత ప్రేమమయుడు!
ఆధునిక కవి ఆస్తికుడు కాకూడదని మనకేదో ఒక రహస్య అవగాహన ఉందనుకుంటాను. అందుకనే ఆధునిక తెలుగు కవుల్లో భగవంతుడి ఉనికినీ, ప్రేమనీ నిస్సంకోచంగా ప్రకటించిన కవులు చాలా అరుదు, ఎవరో చలంగారి లాంటివారు తప్ప. కాని ఇంగ్లిషులో, ఇతర పాశ్చాత్య సాహిత్యాల్లో ఆధునిక కవులు చాలామంది ఆస్తికులు. విశ్వాసులు. తమ విశ్వాసానికి తామెట్లా చేరుకున్నారో చెప్పుకోవడంలో వారికి గొప్ప సాంత్వన. ఈ కవితకు వచ్చేటప్పటికి నేను నా సంకోచాలనుంచి పూర్తిగా బయటపడ్డాను. చిన్నప్పుడే మహాభక్తవిజయం చదివి, పోతన్నని కంఠస్థం చేసినా కూడా, విశ్వాసం కుదురుకోవాలంటే ఇంత జీవితం సాగి ఉండాలా అనిపిస్తుంది. నేను విశ్వాసిని అని చెప్పుకోడానికి ఇప్పుడు నాకేమీ సందేహం లేదు. కాని ఆ విశ్వాసం దృఢపడేముందు ఎంత నరకం చూసానని!
(ఆయన ఉనికి కన్య స్నేహం వంటిది : బసవణ్ణ)
దేవా, ఎటువంటి మొరటుతనాన్ని బయటకు తీసావు నాలో
అంధకారకాననాల అర్ధరాత్రుల్ని కుక్కిపెట్టావు ఆత్మలో.
వెల్లడి, వెల్లడి, వెల్లడి కావాలన్నాను ప్రతి ఒక్కటీ
ప్రకటించి తీరాల్సిందేనన్నాను ప్రతి ఒక్క రహస్యం.
బాహాటంగా కనిపిస్తే తప్ప నమ్మనన్నాను, బహిరంగం
నా జీవితం, తెరిచిన పుస్తకమని ప్రగల్భాలు పలికాను
ఎంత వెల్లడిగా పరచిచూపావాకాశాన్ని, అయినా
నిరాకరించాను చూడటానికి, నీ మాటలకడ్డుపడ్డాను.
ఎగిసిపడ్డాను, మిడిసిపడ్డాను, పెద్దపెద్ద మాటలు మాట్లాడేను,
వాదించేను, తర్కించేను, ఎదటివాళ్ల నోరు మూసేసాను
అప్పుడు, నా ప్రతి ఒక్క దర్పిత క్షణంలో కూడా, నిన్ను
నోరెత్తనివ్వనప్పుడు కూడా, ఉన్నావక్కడే వివిక్తంగా, విస్పష్టంగా.
(పునర్యానం, 5.2.16)
( He is there like the love in a maiden’s heart: Basavanna)
Oh my God! What rudeness you’ve uncovered in me
What kind of dark forests have I carried within me
I kept insisting on revealing the whole story.
My exhortation was to disclose every secret.
To believe it, I needed everything to be explicit.
I boasted that my life was an open book.
What a huge sky you’ve spread out there
But I didn’t accept it, cutting you off.
Blathered, bragging, strutted, and swaggered.
All I’ve done is argue, rant, and silence everyone else.
And yet, even in my most arrogant moment,
You were there, both visible and invisible.
27-9-2023
🙏
ధన్యవాదాలు సార్
మీ వాక్యాలు గీతాంజలిని స్పురింపచేస్తున్నాయి. మీరో తెలుగు రవీంద్రుడు! కుంచె, కలం ఝళిపిస్తున్నారు!
ధన్యవాదాలు సార్.
ఎంత బాగా చెప్పారు సార్. నమస్కారాలు.
ధన్యవాదాలు సార్
ఈ మీ కుటీరం అలాంటి ఒక శాంతతరుచ్ఛాయనే, సర్, మాకు.
ధన్యవాదాలు సత్యకృష్ణా!