పునర్యానం-55

ఈ మధ్య ‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై పుస్తకం’ ప్రెస్ కాపీ సిద్ధం చేస్తున్నప్పుడు దాన్ని సరిచూసిన పండితులు ఒకాయన అందులో ఆండాళ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా తిరుప్పావైలో మూడో పాశురాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాననీ, అన్ని సార్లు పునరుక్తం చెయ్యడం అవసరమా అని ప్రశ్నించారు. మీరు బ్లాగులో రాసేటప్పుడు నాలుగైదుసార్లు విడివిడి వ్యాసాల్లో ప్రస్తావిస్తే ప్రస్తావించి ఉండవచ్చు. కానీ పుస్తకంగా వస్తున్నప్పుడు ఆ పునరుక్తి లేకుండా చూసుకోవడం మంచిది కదా అన్నాడు ఆయన.

నేనన్నాను: ఒక వ్యాఖ్యాత లేదా భావుకుడు తాను చదివిన, చదువుతూ ఉన్న ఎంతో సాహిత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకే కవినో లేదా ఒకే పద్యాన్నో లేదా ఒకే పద్యభాగాన్నో పదే పదే ప్రస్తావించకుండా ఉండలేకపోతే, ఆ సంగతి కూడా పాఠకులకి తెలియాలి కదా. ఎందుకని ఈ సాహిత్యారాధకుడు ఈ పద్యపాదాలకు ఇంతలా చుట్టుకుపోయాడు అని వాళ్ళు ఆలోచనలో పడాలి కదా. కాబట్టి, ఆ పునరుక్తిని, మామూలుగా దోషంగా భావించే పునరుక్తిని, నాలాంటి సాహిత్యపిపాసి విషయంలో గుణంగానే చూడవలసి ఉంటుంది అని. అనడమే కాదు, ఆ ప్రస్తావనల్లో ఒక్క వాక్యం కూడా తీసెయ్యకుండా అలానే అట్టేపెట్టాను.

ఎందుకంటారా? ఎందుకంటే, ఆ మూడో పాశురం మీరు మళ్లా చదవాలి. ఇరవయ్యేళ్ళ కిందట తిరుప్పావై మొదటిసారి చదువుతున్నప్పుడు, ఆ పాశురం చదవగానే నా ఒళ్ళు గగుర్పాటు చెందింది. నాకు వెంటనే గురజాడ ‘దేశభక్తి’ కవిత గుర్తొచ్చింది. ‘పాడిపంటలు పొంగిపొర్లే దారిలో నువు పాటుపడవోయ్’ అనే మహాకవి మాట గుర్తొచ్చింది. తన కన్నా దాదాపు వెయ్యేళ్ళ ముందు ఒక కవయిత్రి తన మాటలే మరొకపద్ధతిలో చెప్పిందని తెలిసి ఉంటే గురజాడ ఎంత పరవశించి ఉండేవాడో అనిపించింది.

ఆండాళ్ ఆ పాశురంలో ఏమంటుందంటే, మార్గశిరమాసంలో తెల్లవారకుండానే లేచి స్నానం చేసి మన వ్రతం పాటిస్తే, నెలకు మూడు వానలు పడతాయి. లోకంలోని మాలిన్యమంతా కొట్టుకుపోతుంది. నీళ్ళల్లో ఏపుగా పెరిగిన వరిపైర్ల మధ్య ఎర్రటిచేపలు ఎగిరిపడుతుంటాయి. బాగా విప్పారిన కలువపూలమీద తుమ్మెదలు మూగుతుంటాయి. మన ప్రార్థనల వల్ల దేశం సుభిక్షమవుతుంది. కొట్టాల్లో పాలు పితక్కుండానే గోవులు కళశాల్లో క్షీరధారలు కురిపిస్తాయి అని.

ఇందులో దేవుణ్ణీ, మార్గశిరమాసాన్నీ అలా ఉంచండి. ముందు ఆ వ్రతనియమాలు చూడండి. ఆ నెలరోజులూ ఒక్క పరుష వాక్యం కూడా మాట్లాడకూడదని వ్రతం! నిజంగా అలాంటి వ్రతం ఒకటి మనం పాటించగలిగితే! నెలరోజులు కాదు, కనీసం ఇరవైనాలుగ్గంటల పాటు! పరుషవాక్కు లేని ప్రపంచంలో నెలకు నాలుగు వానలు తప్పకుండా పడతాయన్న నమ్మకమైతే నాకుంది. ఆ నమ్మకానికి చేరుకున్నాక రాసిందే ఈ కవిత.


(మన ప్రార్ధనల వల్ల దేశం సుభిక్షమవుతుంది: అండాళ్‌)

తెలుసుకున్నాను విలువైన మూల్యాలు చెల్లించి, వీపుని కొరడాలకప్పగించి,
తెలుసుకున్నాను హృదయాల్ని రంపాలతో కోసి, కుత్తుకలు కత్తిరించి,
తెలుసుకున్నాను కొన్ని గృహదహనాలతో, కుమ్మరించిన శాపాలతో-
మార్చలేవని నువ్వు ప్రపంచాన్ని ద్వేషంతో, దూషణతో .

మారేదెవరు? అందరికన్నా ముందు నువ్వు మారకుండా,
ఏ ఒక్క హృదయం రగిలినా ద్వేషంతో, దహిస్తుందది మొత్తం ప్రపంచాన్ని.
దగ్ధమవుతూ నీకు నువ్వు, ఎవరికివ్వగలవని నమ్ముతున్నావొక ఆశ్రయాన్ని?
కోరడం లేదు, గ్రహించు, ప్రపంచం మరిన్ని ఆగ్రహాల్ని.

ఎదురు చూస్తున్నదని గుర్తించాను, అదొక మంచిమాట కోసం,
తనకొక నమ్మకాన్నిచ్చే వారి కోసం, తన నమ్మకాలకు నిలబడేవారి కోసం.
ఎదురుచూస్తున్నదని గ్రహించాను, ఆత్మీయ కరస్పర్శ నందించేవారి కోసం
ధీరత్వం వహించే వారి కోసం, దయతో ప్రార్ధించేవారి కోసం.

(పునర్యానం, 5.2.14)


(the vow will assure us unfailing prosperity..: Andal)

To learn this truth, I had to pay a high price.
The truth you find when you endure whippings,
Houses burning, hearts broken, and curses thrown-
That you can’t change the world through hatred.

Who will change? Unless change begins with you.
When one heart burns with hatred, the entire world burns.
How can you be kind when you’re burning with disgust?
Hold on, the world doesn’t need your anger anymore.

The world urgently needs a kind word, and
Those who stand by her and believe in her.
There has been a long wait for people
Who are firm in their love and pray for it.

26-9-2023

2 Replies to “పునర్యానం-55”

  1. ఆండాళ్ మూడవ పాశురం ప్రాధాన్యతని,గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు. అభినందనలు. మీ “నా కుటీరం ” చూస్తుంటే నాకు కీ.శే.ఎన్.టీ.రామారావు గారు జిల్లాల పర్యటనలకు వచ్చినపుడు వారు ఎస్. కోట లోను,గరివిడి లోనూ విడిదిచేసిన “కుటీరం” కంటికి కనిపిస్తుంది.

Leave a Reply

%d