
ఉపనిషత్తుల సారాంశమంతా మూడు మాటల్లో చెప్పవచ్చు: అభయం, అమృతం, ఆనందం. అయితే వీటికొక క్రమం కూడా ఉంది. తైత్తిరీయ ఉపనిషత్తు దృష్టిలో అభయానికి ముందు ఆనందం ఉంది. ఉపనిషత్తు ఇలా చెప్తోంది:
‘యతో వాచో నివర్తంతే, అప్రాప్య మనసా సహ, ఆనందం బ్రహ్మనో విద్వాన్ న బిభేతి కుతశ్చన’ (2.9.1)
(ఏ సత్యాన్ని వివరించలేక మనసుతో కలిసి వాక్కు వెనుతిరుగుతుందో ఆ సత్యమే ఆనందమని తెలుసుకున్నవాడికి దేన్నుంచీ భయం ఉండదు)
అంటే భయరహిత స్థితికి ఆనందసంజ్ఞానం మూలమన్నమాట. మరి ఆనందానికి ఆధారమేది? వేదం ఇలా అంటున్నది:
‘న కర్మణా న ప్రజయా న ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః
పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రజతే తధ్యతయో విశంతి’
పూర్ణకుంభ మంత్రంలోని ఈ మొదటి శ్లోకాన్ని వల్లించని పండితులు ఉండరు. కాని దీని సారాంశాన్ని వంటబట్టించుకున్నవారు ఎక్కడో అరుదుగా కనిపిస్తారు. కాని ఒకసారి ఆ సారాంశాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నవాళ్ళని యతులని లోకం సులువుగా గుర్తుపట్టగలుగుతుంది.
వేదం చెప్తున్నదేమిటంటే, అమృతత్వం కర్మల వల్లా, బాధ్యతల వల్లా, సంతానం వల్లా, సంపదలవల్లా వచ్చేది కాదు, అది త్యాగం వల్ల మాత్రమే లభిస్తుంది. అది స్వర్గానికి అవతల ఉండేది. కర్మలు చేసేవాళ్ళు స్వర్గసుఖాల్ని ఆశించి చేస్తారు. కాని ఆనందం స్వర్గానికి ఆవలి సీమ. ఎవరు తమ హృదయంలో ఒక వెలుగుగా దాన్ని దర్శిస్తారో ఆ యతులు మాత్రమే అమృతత్వం పొందగలుగుతారు.
ఇక్కడ త్యాగం అని చెప్తున్నది కర్మల్ని త్యాగం చెయ్యమనా లేక కర్మఫలితాన్ని త్యాగం చెయ్యమనా లేక కర్మపట్ల ఆసక్తిని త్యాగం చెయ్యమనా అన్నదానిమీద భారతీయవేదాంతులు సముద్రమంత సాహిత్యాన్ని సృష్టించారు. మనకిప్పుడు దాంతో పనిలేదు. గమనించవలసిందేమంటే అమృతత్వానికి కూడా ఆధారం ఆనందమే. ఆనందానుభవం పొందగలిగినవాడికి అభయం, అమృతం రెండూ సిద్ధిస్తాయి.
ఆనందమంటే ఏమిటి? చావులేకపోవడం, భయం లేకపోవడం అని కూడా చెప్పవచ్చు. భయం ఎందుకొస్తుంది? నీకన్నా అన్యమైంది మరొకటి ఉందంటే నీకు భయం కలుగుతుంది. రెండున్నర వేల ఏళ్ళుగా యూరప్ self ని గురించి మాత్రమే పట్టించుకుంటో, other ని చూసి భయపడుతూ ఉందనీ, presence గురించి మాత్రమే ఆలోచిస్తో, absence ని గుర్తించడానికి నిరాకరిస్తో ఉందనీ, పోస్ట్ స్ట్రక్చరలిస్టులు, పోస్ట్ మాడర్నిస్టులు గత డెబ్భై ఏళ్ళుగా ఘోషిస్తో ఉన్నారు. అంతే కాదు, other అంటో వేరే లేదు, మొత్తం ఉన్నదంతా self మాత్రమే అనే దృష్టిలో కూడా గొప్ప హింస, విపత్తు ఇమిడి ఉన్నాయని డెరిడా హెచ్చరించాడు. ఎందుకంటే, ఉన్నది ఒక్కటి మాత్రమే అనే దర్శనం తాత్త్వికంగా అఖండతని ఆరాధిస్తో, రాజకీయంగా, అదర్ ని నిర్మూలించే నియంతృత్వంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు.
ఈ ఆలోచనల సందర్భంలో వైదిక ఋషి వాక్కుని లోతుగా పరిశీలిస్తే, ఆయన ఎక్కడా self మాత్రమే ఉంటుందని అన్నట్టుగా కనిపించదు. నిజానికి దాన్ని కూడా వదిలిపెడితేనే నువ్వు ఆనందసీమలోకి అడుగుపెట్టగలుగుతావు అంటున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ త్యాగం అంటే కర్మల్ని వదిలిపెట్టడం కాదు, ‘నేను’ అనే భావనని వదిలిపెట్టడం. అలాగని అదర్ ని సంభావించమని కూడా ఆయన చెప్పడం లేదు. ఉన్నది ఒకటే, అదే self, అదే other. పరస్పర విరుద్ధంగా ఉండే ఈ రెండు పార్శ్వాల్నీ నీ అనుభవంలో సమన్వయపరుచుకోవడం ఎలా? ఈశావ్యాస్య ఉపనిషత్తు చక్కటి మాట చెప్పింది. ‘తేన త్యక్తేన భుంజీథాః’ అని. ‘వదులుకోవడం ద్వారా అనుభవించు’ అని. దేన్ని వదులుకోవడం ద్వారా? ‘తేన’.’నిన్ను’. లేదా ‘నన్ను.’
పైకి విరోధాభాసగా కనిపించే ఈ వాక్యాల్లోని సత్యం నా జీవితంలో కొన్ని క్షణాలేనా అనుభవంలోకి వచ్చిందనడానికి గుర్తుగా ఈ కవిత రాసుకున్నాను. మరొకరి ఉనికి, మరొకరి ముఖం, మరొక స్థలం- ఇవి ఎప్పటికీ భయకారకాలే, ఎంతదాకా? అవీ, నువ్వూ అంటూ వేరువేరుగా లేవని తెలిసేదాకా. అలా తెలిసిన తరువాత, ఎవరుంటారు? Self? కాదు, ఆ self ని కూడా వదిలిపెట్టు, అప్పుడే నీకు ఆనందమంటే ఏమిటో తెలుస్తుంది అంటున్నాడు ఉపనిషత్కర్త. నిజమా? నిజమేనని కొన్ని క్షణాలేనా నాకు అనుభవంలోకి వచ్చింది. కాబట్టే ఈ కవిత రాయగలిగాను. ఇందుకు నా జీవితం ధన్యమైందని భావిస్తున్నాను.
ఎందుకంటే, నీటిప్రవాహంలో పైకిలేచిన నీటిబుడగ ఈ జీవితం. అది ఛిన్నమైందా నష్టమేమీ లేదు. అది మళ్ళా ఆ నీటిలోనే కలిసిపోతుంది. మరొకచోట మరొక బుడగగా పైకి లేస్తుంది. ఇంతేనా? వందలాది ఏళ్ళుగా చెప్పుకుంటున్న ఈ ఉపమానానికి మించి మన జీవితంలో మరేమీ లేదా? నేను, నా ప్రతిభ, నా ప్రత్యేక గుణగణాలు, నా అద్వితీయత, నా అస్తిత్వంలో మాత్రమే ప్రకటితమయ్యే ఆ ప్రత్యేక జీవశక్తి- ఇవన్నీ వట్టినీటిబుడగలేనా? కాదు. కాని అవి కూడా ఆ నీటిలక్షణాలే, ఆ బుడగ రూపొందడంలో సంతరించుకుంటున్న అద్వితీయతనే. ఆ నీటిప్రవాహం వినా నువ్వంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఉన్నావన్న భావన విడిచిపెట్టు. ఉండు, కాని ఉండకు. నీటిగా ఉండు, బుడగగా ఉండు. కాని ఆ నీటిబుడగ ప్రత్యేకమని మాత్రం అనుకుంటూ ఉండకు.
ఈ మాటలు ఇలా ఎంతరాసినా, ఈ స్ఫురణ అనుభవంలోకి రాకపోతే ఏమి చెప్పీ, ఆ అనుభవాన్ని పంచుకోలేం. కాని కాలం నీమీదకు విసిరింది కరవాలమో, వరమాలనో, ఏదైనా కానీ, నీకు సంప్రాప్తించేదేదో అది సమస్తసృష్టికీ సంప్రాప్తించేదే అనే నిశ్చింత కలిగితే ఆ జీవితం నిజంగా ధన్యం.
ఎన్ని కొత్త ఊళ్లల్లో అడుగుపెట్టాను, ఎన్ని కొత్త
ప్రదేశాలకు పయనమయ్యాను, ఎన్ని గృహాలకు
అతిథినయ్యాను, ఎన్ని ప్రవాసాలబాధననుభవించాను
ఎక్కడికి వెళ్లు; అదే అభయం, అదే ఆకాశం.
ప్రతికొత్త వదనం వెంట తెస్తుందొక అస్పష్ట సంజ్ఞ
నీకన్నా భిన్నమేమో, అన్యమేమోనని రగులుతుందొక చింత
ఒక్క క్షణం గుండె చిక్కబట్టుకుని చూస్తావాకాశాన్ని
ఎవరు కనబడనీ; అదే అభయం, అదే ఆకాశం.
ప్రతి కొత్త సన్నివేశంలో పొంచి ఉంటుందొక ఉత్కంఠ
దాగి ఉన్నది కరవాలమా, వరమాలా; తేలదొక పట్టాన
కంపించే పెదవులతో మోకరిల్లుతావాకాశానికి
ఏది తటస్తించనీ; అదే అభయం, అదే ఆకాశం.
(పునర్యానం, 5.2.7)
My journey has taken me to many new places
Visited many new stations, and stayed in many homes.
My exile torments were also many.
Wherever you are, the skyline keeps you calm.
Each new face would signal something new
Afraid of what it might be, you feel frightened.
You’d look at the sky to reassure yourself.
Whatever you see, the skyline keeps you calm.
Suspense surrounds every new moment in life
You’re not sure what it is: a garland or a guillotine
Your lips tremble as you kneel before the sky.
Whatever happens, the skyline keeps you calm.
22-9-2023
విశ్వోపనిషద్విలసిత కవిత
వివేచనాలోచన వైదుష్యం
అభయానందామృత రసాస్వాదనం
అనుభవైకవేద్యం అనిర్వచనీయం 🙏
ధన్యవాదాలు సార్!
అచలతత్వాన్ని సరళమయం చేశారు. ఆనందంగా ఉంది
ధన్యవాదాలు సార్
తరచి చూస్తే ఆకాశం ఎప్పుడూ అమృత బిందువులు రాల్చే తారల తేనె తుట్టి లా దర్శన మిస్తుంది! మీ చేతిలో ఓ పెద్ద మధు చషకం ఉన్నట్టు ఉంది! ప్రతి వాక్యం లో అమృత బిందువులతడి తాకినట్టుగా ఉంటుంది
ధన్యవాదాలు సార్