
సాధారణంగా సాహిత్యసృజనకు పూనుకునేవారు రెండు విధాలుగా ఉంటారు. ఒకరు తమ జీవితంలో తాము గ్రహించిన సత్యాన్ని నలుగురితో పంచుకోడానికి సాహిత్యసృష్టి చేసేవారు. వారికి తాము ఏమి రాయబోతున్నారో ముందే స్పష్టంగా తెలిసి ఉంటుంది. తెలుగు రచయితల్లో కొడవటిగంటి కుటుంబరావు ఈ తరహా రచయిత. చాలామంది తెలుగు రచయితలు ఆయన దారినే అనుసరిస్తూ ఉంటారు. ఒక సంపాదకులు నాతో ‘మీరు ఇప్పుడు ఏదీ కొత్తగా తెలుసుకోడానికి రాయకండి, మీకు ఏది తెలుసో అదే రాయండి’ అని నాకు సలహా కూడా ఇచ్చారంటేనే ఆ ధోరణి తెలుగులో ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోగలం.
కాని నాది ఆ తరహా కాదు. నేను రెండవకోవకి చెందిన రచయితని. నేను లోనైన అనుభవాన్ని ఆధారం చేసుకుని ఒక జీవితసత్యాన్ని అన్వేషించడానికి రచనకు పూనుకుంటాను. తనకి లభించిన జీవపదార్థాన్ని సాంపిల్ గా తీసుకుని లాబరేటరీలో పరీక్షలకు పూనుకునే జీవశాస్త్రవేత్తలాంటివాణ్ణి నేను. ఆ జీవపదార్థ చరిత్ర గురించి నాకు కొంత ఎరుక ఉంది. కాని నా పరిజ్ఞానాన్ని మించి ఆ జీవపదార్థపు పోకడలు కనిపిస్తున్నప్పుడు, నాకు తెలిసిన పరిజ్ఞానం మీంచి తెలియని సత్యాన్ని చేరుకోడానికి ప్రయోగాలు కొనసాగిస్తాను. దాదాపుగా నా రచనలన్నీ ఇంతే. కేవలం అనుభవాల్నే రచనలుగా మార్చడం మీద నాకు ఆసక్తి లేదు. ఆ అనుభవాలు నా గురించో, ప్రపంచం గురించో ఏదో ఒక కొత్త సత్యానికి చేర్చగలవన్న నమ్మకం ఉంటేనే వాటిని కథలుగానో, కవితలుగానో మార్చడానికి పూనుకుంటాను.
పునర్యానం కావ్యం కూడా అలా రాసిందే. అందులో అయిదో అధ్యాయం చివరి అధ్యాయం. ఆ అధ్యాయంలో రెండే సర్గలున్నాయి. రెండవ సర్గ చివరి సర్గ. ఆ సర్గలో మొత్తం 27 కవితలున్నాయి. మొత్తం కావ్యంలో అది పతాకస్థాయికి చేరుకున్న భాగం. ఆ కవితలకు వచ్చేటప్పటికి, నా జీవితంలోనూ, సాహిత్యంలోనూ కూడా నా కళ్ళముందు గొప్ప కాంతి ప్రత్యక్షమయ్యింది. అప్పటిదాకా నాకు కొంత వెలుగు కనిపిస్తూ ఉన్నా, మాటిమాటికీ చీకట్లో దారి తప్పుతూనే ఉండేవాణ్ణి. అప్పటిదాకా నా పూర్వమహాకవులు, సమకాలిక కవుల్లో నేను అభిమానించే కవులూ నన్ను తలోవేపుకీ లాక్కుపోతుండేవారు. మొదటిసారిగా నాకు నా దారి దొరికింది. నా గొంతు దొరికింది. జీవితంలో నేనేది దర్శిస్తున్నానో నాకు తేటపడింది. నా కావ్యం ముందు నన్ను నా అగమ్యం నుంచి బయటపడేసింది.
నిర్వికల్ప సంగీతం రోజులనుంచీ కూడా నాకొక దారి లీలగా కనిపిస్తుండకపోలేదు. కాని దానిలో నిస్సంకోచంగా ముందుకుపోగల ఆత్మవిశ్వాసం అప్పుడు నాకు చిక్కలేదు. అది పునర్యానం తర్వాతనే సాధ్యపడింది. మరీ ముఖ్యంగా, ఈ చివరి 27 కవితల్లోనూ. అందులో 12 కవితలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాటిలో మొదటి కవిత ఇది.
గుర్తుందా, అప్పుడప్పుడు వేసవిలో ఆ ఊళ్లో అగ్నిప్రమాదాలొచ్చేవి
నడిరాత్రి వేళల్లో ఏదో ఒక ఇల్లు అగ్నికాహుతయ్యేది
పరుగెత్తేవారు ఊరంతా చేతికందింది తీసుకుని
ఆ మంటనార్పడానికి, నీళ్లతో, మట్టితో, హాహాకారాల్తో
ఆ మధ్యలోనే తమ ఇళ్లల్లోంచి కూడా
ఏదో ఒకటి బయటకు తెచ్చుకునేవారు, ఏ మాత్రం ఆ అగ్ని
తమ ఇంటిని చుట్టబెట్టినా విలువైనవి కొన్నయినా మిగలాలని.
నాన్న తెచ్చుకునేవాడు బయటకి తన ప్రభుత్వకాగితాల దస్త్రాల్ని
అప్పుడే పుట్టిన లేగల్ని అమ్మ బయటకు తెచ్చేసేది
బామ్మగారు నీ చెల్లెళ్లనీ, భగవద్గీతనీ తెచ్చుకునేవారు బయటకి
సిద్ధపడేవుండేవారప్పుడు మానసికంగా
తమ ఇంటిని, తమ నీడని, తమ ఆశ్రయాన్ని
తావ కూడా బహుశా కోల్పోవలసి ఉంటుందని.
అప్పుడు వాళ్లు ఆకాశం వంకే చూసేవారు
వ్యాపించినంతమేరకు మంటల ఎర్రదనం వ్యాపించగా
మిగిలిన ఆకాశం అంధకారబంధురం
ఆ రామకోవెల అరుగుమీదనే అట్లా కూచుని రామనామస్మరణ
చేసుకుంటుండేవారు.
నెమ్మదిగా దర్శనమిచ్చేవి తారలొక్కక్కటే
దూరాకాశాల మీంచి పయనించీ వస్తున్న మేఘమాలికలొక్కొక్కటే.
ప్రపంచం దగ్ధం కావడం చూస్తున్నావు, నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు
జలప్రళయం కమ్మేసింది కనుచూపుమేర దిగంతాన్ని
ఏది నీ విలువైన సామగ్రి? దేన్ని భద్రపరచుకోవాలనుకుంటున్నావు?
నీ లేగలేవి? నీ శిశువులెవరు? నీ పారాయణగ్రంథమేది?
ఏ ఆకాశమిప్పుడు నీకు బాసటగా నిలిచింది?
ఏరి తెచ్చుకో,
ఆ విలువైన క్షణాల్ని, నువ్వు నీవని చెప్పదగిన సమయాల్ని
నిండుగా జీవించిన సన్నివేశాల్ని,
నిన్ను నువ్వెక్కడెక్కడ దర్శించావో ఆ శుభసాక్షాత్కారాల్ని.
(పునర్యానం, 5.2.1)
Remember those days? Fires in that village in summer.
Houses used to get caught in fires and burn down
People used to run around quenching it with water and sand and screaming.
Having their homes at risk was also scary.
Your father used to pull out government records to keep them safe
Your mother used to take newly born calves outside
With her copy of the Gita, your grandma escorted your younger sisters.
If the fire spreads, they’d lose their house.
Sheltering in the temple, they stared blankly at the sky,
A dark sky except for the glow of a burning house.
Till the fire subsided, they would chant Ram Nam.
Slowly, stars and clouds would fill the sky.
A fire engulfed the world now. You spare no effort to save it.
There is a deluge flooding the horizon.
What are your valuables? What do you plan to preserve?
Who are your calves, who are your kids, and what is your holy book?
Where is the sky now that stands by you?
Don’t let them slip away. Collect them.
Things you can call your own.
Times where you have truly lived, and
Moments in which you were yourself.
19-9-2023
ప్రపంచం దగ్ధమౌతే పరిరక్షించుకోవాల్సిన పవిత్ర వస్తువులేవి అన్న ప్రశ్న ఎంత గొప్పగా ఒక కవిత సంకేతించిందో 🙏
ధన్యవాదాలు సార్
‘విలువ’యిన కవిత
ధన్యవాదాలు సార్
ఒక ఆనందం. నాకో దారి దొరికింది. కొన్ని పదాలు నన్నూ ఒక కొత్త లోకం లోకి తీసుకుపోయాయి. అక్కడ మాత్రం మా నాన్నగారు ఆఫీస్ నుంచి వస్తూ ఒక దస్త్రం తెచ్చుకుని తన బల్లమీద పెట్టి… మర్నాడు తెల్లవారుజామున లేచి పరిశీలించడం. నేను నిశ్శబ్దంగా నన్నగారినే చూస్తూ ఉండడం. మీరు రాసిన ఒక్కో పదం ఒక్కో ఆణిముత్యం.
ధన్యవాదాలు మేడం