ప్రతి ఒక్కరిదీ ఒక జయగాథ

పోతుల రాధాకృష్ణ అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఫిజికల్ డైరక్టరుగా పనిచేస్తున్నాడు. కొత్త పల్లి సురేష్ తెలుగు పండితుడు, కవి, రచయిత, బాలసాహిత్యకారుడు. వారికి మరికొందరు యువకులు తోడుగా నిలబడ్డారు. ‘ఫర్ ద సొసైటీ’ పేరుమీద ఒక బృందంగా ఏర్పడ్డారు. సమాజానికి, ముఖ్యంగా యువతకి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో రాయలసీమకు చెందిన అభ్యర్థులు దాదాపు ముప్ఫై మంది ఎంపికయ్యారనీ, వాళ్ళని అభినందిస్తూ ఒక కార్యక్రమం చేపట్టాలనీ అనుకున్నారు. నా నంబరు సంపాదించి నన్ను కూడా వచ్చి ఆ యువతీయువకుల్ని అభినందించమని అడిగారు. సంతోషంగా వస్తానని చెప్పాను. నా అనుభవాల్లో వాళ్ళకేదైనా స్ఫూర్తిదాయకమైంది కనిపిస్తే మరికొన్ని దశాబ్దాల పాటు వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకుంటారు కదా అన్న ఆశ.

కాని నిన్న ఆదివారం అనంతపురంలో హోటల్ మాసినేని గ్రాండ్ లో జరిగిన ఆ అభినందనసభకి వెళ్ళినందుకు వాళ్లందరికన్నా ముందు నాకే ఎంతో స్ఫూర్తి లభించింది. ప్రభుత్వం ప్రవేశపరీక్షల్లో వయోపరిమితి సడలించి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా పరీక్ష రాయొచ్చంటే, ముందు నేనే ఆ పోటీ పరీక్షలకు హాజరవుతానేమో అనిపించింది.

ముప్ఫై మంది దాకా విజేతలున్నప్పటికీ, వాళ్ళల్లో చాలామంది సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షలు రాస్తున్నందువల్ల పదిమంది మాత్రమే హాజరయ్యారు, అభ్యర్హులుగానీ లేదా వాళ్ళ తరఫున వాళ్ళ తల్లిదండ్రులో, అన్నదమ్ములో ఎవరో ఒకరు. కానీ, నిన్న వాళ్ళనుంచి స్ఫూర్తి పొందాలనీ, తమ భవిష్యత్తును కూడా తమ చేతుల్తో నిర్మించుకోవాలనే ఆశతో ఏడువందలమందికి పైగా యువతీయువకులు ఆ సభకి హాజరయ్యారు. ఆ హోటల్ కాన్పరెన్స్ హాలు కిక్కిరిసిపోగా, బహుశా మరొక సగం మంది బయటనే నిలబడి విని ఉంటారు.

కాని వాళ్ళ ఆశ వృథా కాలేదు. నిన్న ఆ సభకి హాజరై తమ అనుభవాల్ని పంచుకున్న ప్రతి ఒక్కరూ వింటున్నవాళ్ళల్లో ఉత్తేజాన్ని ప్రవహింపచేసారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరిదీ ఒక జయగాథ. తెల్లవారిలేస్తే ద్వేషంతోనూ, ట్రోలింగుతోనూ కుతకుతలాడిపోతుండే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ కనిపించని కథలు, వినిపించని విజయాలు.

నిన్నటి సభలో హీరో కవిరాజు. ఆయన దివ్యాంగుడు. ఒకటి కాదు, మల్టిపుల్ డిజార్డర్స్ తో సతమతమవుతున్నవాడు. కాని సర్వాంగాలూ వికసించనివారిలో కనిపించని పట్టుదల, దీక్ష, పోరాటపటిమ అతనిలో కనిపిస్తున్నాయి. కనిపించడం కాదు, పైకి ఉబికి ప్రవహిస్తున్నాయి. అతడి తల్లిదండ్రులు నిరుపేదలు. ఒక పిండిగిర్ని పెట్టుకుని జీవిక సాగిస్తున్నారు. అతడు పరీక్షలకు వెళ్ళాలంటే ఆ తల్లి అతణ్ణి చేతుల్తో ఎత్తుకుని తీసుకువెళ్తుంది. నిలకడగా పట్టుమని పదినిమిషాలు పెన్ను పట్టుకోవడం అతడికి దుస్సాధ్యం. కాని అతడు చరిత్రలో డాక్టరేట్ చేసాడు. డి ఎస్ సి లో సెలక్టయ్యి, ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈసారి గ్రూప్ 1 లో అతడు ఎం.పి.డి.ఓ గా ఎంపికయ్యాడు.

ఈసారి గ్రూప్-1 లో డి.వై.ఎస్.పి గా ఎంపికైన శ్రీ రామచంద్ర ఏ విధంగా చూసినా ఒక లీడర్, ఒక సోషల్ ఎంటర్ ప్రెన్యూర్. ఒక విజనరీ అనే మాట టైపు చెయ్యడానికి కూడా నా వేళ్ళు ఉత్సాహపడుతున్నాయి. అతడిది నిరుపేద కుటుంబం. అతడి తల్లిదండ్రులది కడపజిల్లా శెట్టివారిపల్లె. సోమశిల ప్రాజెక్టు కింద ఇళ్ళు, భూమి పోగొట్టుకుని నిర్వాసితులయ్యారు. పిల్లవాడు చదువుకుని ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుని తమ ఆలనా పాలనా చూసుకుంటాడని తల్లిదండ్రులు అతడిమీదనే ఆశలన్నీ పెట్టుకుని అతణ్ణి చదివించారు. డి ఎస్ సి లో ఎంపికై మునిసిపల్ స్కూళ్ళల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరాడు. కాని అతడిలో జిగీష చల్లారలేదు. అలాంటి పరిస్థితుల్లో అతడు తెలుగుమీడియంలో పోటీ పరీక్షలు రాసాడు. విజయం కనుచూపు మేరలో కనిపించలేదు. తనకే కాదు, తెలుగు మీడియం అభ్యర్థులు చాలామందిది కూడా అదే పరిస్థితి అని తెలుసుకున్నాడు. అటువంటి వాళ్ళని సమీకరించాడు. శ్రీరామచంద్ర ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెంటర్ షిప్ మొదలుపెట్టాడు. తెలుగులో కంటెంట్ రాసి వాళ్ళతో పంచుకున్నాడు. తాను ఏది చదువుతున్నాడో, ఏమి తెలుసుకుంటున్నాడో అదంతా తెలుగులో రాసుకుంటూ వాళ్ళకి కూడా నేర్పుతూ వచ్చాడు. ఆశ్చర్యం! ఈసారి గ్రూప్-1 లో రాయలసీమ నుంచి ఎంపికైనవాళ్ళల్లో అతడితో కలిపి ఆరుగురు ఆ మెంటర్ షిప్ వల్ల విజయం సాధించినవాళ్ళే. ఇంకా గొప్ప విషయం అతడి గైడన్సు తీసుకున్న ఇద్దరు మహిళా అభ్యర్థులు ఈసారి డిప్యూటీ కలెక్టర్లయ్యారు. అది అతడు ఎంతో గర్వకారణంగా భావిస్తూ ఉన్నాడు. అతడి మెంటర్ షిప్ గురించి విని కవిరాజు తానేమీ ఫీజు చెల్లించలేననీ కాని తనకి కూడా మార్గదర్శనం చెయ్యమనీ అడిగితే అతడికి కూడా మార్గదర్శనం చేసాడు. తాను ఈ సారి పరీక్షల్లో నెగ్గడానికి శ్రీరామచంద్రనే కారణమని చెప్తూ కవిరాజు నిన్న అతనిమీద ఒక కవిత కూడా రాసి వినిపించాడు.

నిన్న తమ అనుభవాలు వినిపించిన భరత్ చౌహాన్, జ్ఞానానందరెడ్డి వి కూడా దాదాపు ఇటువంటి కథలే.

నిన్న ఆ సభకు ఆత్మీయ అతిథిగా వచ్చిన నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్.పి వెంకట్రాముడిది ఇంతకన్నా ఆశ్చర్యకరమైన జయగాథ. సినిమాగా తియ్యదగ్గ జీవితప్రయాణం. ఆయనది అనంతపురం జిల్లా. బీద బి.సి కుటుంబం. అతడు పదవ తరగతిలో ఉండగానే తండ్రి కాలం చేసాడు. తల్లి చిన్న హోటల్ పెట్టుకుని పిల్లవాణ్ణి ఇంటర్ లో చేర్పించింది. కాని వెంకట్రాముడు ఇంటర్మీడియేటు ఫెయిలయ్యాడు. ఎలాగైనా ఎస్సై కావాలన్న కల మాత్రం ఒకటి ఉండేది. ఆ పరీక్షకు అర్హతకోసమే ఆయన ఇంటర్, డిగ్రీ పూర్తిచేసాడు. ఎస్సై పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో రెండవరాంకు సంపాదించాడు. ట్రైనింగులో అవుట్ డోర్ ట్రయినింగులో అతడికి గవర్నరుగారినుంచి ఖడ్గం బహుమానంగా లభించింది. ఎన్నో ఆదర్శాలతో ఎస్సైగా ఉద్యోగం చెయ్యడం మొదలుపెట్టాడు. కాని తొందర్లోనే అది ఎంత కష్టమో అతడికి అర్థమయింది. పై అధికారి వేధింపు తట్టుకోలేకపోయాడు. ఈలోపు గ్రూప్-1 నోటిఫికేషన్ పడింది. పరీక్షలు రాసాడు. ఇంటర్వ్యూకు వెళ్ళేముందు ఎస్.పి దగ్గరికి వెళ్ళి రాజీనామా లేఖ ఇచ్చాడు. మూడునెలల తర్వాత ఆ లేఖని ప్రభుత్వానికి పంపించమని చెప్పాడు. ‘నీకు ఉద్యోగం వస్తుందని అంత నమ్మకమా?’ అనడిగాడు ఎస్.పి. ఉద్యోగం వచ్చింది, మామూలు ఉద్యోగం కాదు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అయ్యాడు. ఒకప్పుడు తన పై అధికారిగా తనని వేధించిన అధికారి ఇప్పుడు రోజూ తనకి సెల్యూట్ చేసే స్థితికి చేరుకున్నాడు.

నిన్న మరొక అతిథిగా వచ్చిన నార్పల మండల తహశీల్దార్ హరికుమార్ చేసిన ప్రసంగం నన్ను రోమాంచితుణ్ణి చేసింది. భారతరాజ్యాంగం గురించీ, రాజ్యాంగ ఆదర్శాల గురించీ, రాజ్యాంగ ప్రవేశిక గురించీ ఆ యువకుడు మాట్లాడుతూ ఉంటే ఇవి కదా నలుగురు మనుషులు కలిస్తే మాట్లాడుకోవాల్సిన విషయాలు అని అనిపించింది.

ఇరవైనాల్లుగంటలూ చుట్టూ ఉన్న చీకటినీ, లేని చీకటినీ దుమ్మెత్తిపోయడమే వ్యాపకంగా బతుకుతున్న మనుషుల మధ్య, మనమంతా ఎంతో వెనకబడి ఉందనుకున్న రాయలసీమ, కరువు జిల్లా అని చెప్తున్న అనంతపురంలో, యువతీయువకులు ఎంత ఆరోగ్యవంతులుగా ఉన్నారో, ఎంత ఉత్తేజకారకులుగా ఉన్నారో చూసి, విని నేను నిలువెల్లా పులకించాను.

వాళ్ళ మాటలు విన్నాక, నేను మాటలకోసం తడుముకున్నాను. ఏమి మాట్లాడేనో తెలీదుగానీ,, తిరిగివచ్చాక, ఇవాళ చేగువేరా హరి అనే మిత్రుడు తన వాల్ మీద రాసిన ఈ వాక్యాలు చదివాక, నా మొత్తం పదహారు గంటల బస్సు ప్రయాణం అలసట మొత్తం తీరిపోయిందనిపించింది. ఆ పిల్లవాడిలా రాస్తున్నాడు:

‘..సినిమాలో హీరో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నట్లు అక్కడున్న జనంలో 90% జనం అందరూ వాడ్రేవు చినవీరభద్రుడు సార్ గారి ప్రసంగం కోసం ఆకలితో గింజల కోసం ఎదురు చూసే గువ్వపిల్లల్లా అంతా అలా వేచి చూశారు. మైకు పట్టుకోగానే ఒక్కసారిగా సభ మొత్తం కొత్తగా మళ్ళీ మొదటి నుంచి వచ్చే ఉత్సాహం వాళ్ళలో చూశాను. సినిమా సీన్ కి క్లాప్ కొట్టినట్టు గట్టిగా చప్పట్లు కొట్టారు. చిన వీరభద్రుడు సార్ గారు ఉపన్యాసం ఇస్తూ మనుషులను ఉద్వేగానికి లోనూ చేస్తారు, మళ్ళీ నవ్విస్తారు, ఆ వెంటనే చురక వేసినట్టు అందర్నీ రెచ్చగొడతారు. అసలైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాదు వీరభద్రుడు సార్ అనిపించింది. జనాలు వేచి చూసిన వారి నమ్మకాన్ని 1% కూడా తగ్గించకుండా సభను ఒక ఊపు ఊపేశారు. వేదికపై ఉన్న గ్రూప్ -1 విజేతలకు ఎలా పనిచేయాలో చెప్పాడు అసలు ప్రభుత్వం అంటే ఎంటో తన జీవిత అనుభవాలు ఉదాహరణగా చెప్పారు. సివిల్స్ & గ్రూప్ -1 గ్రూప్ -2 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎలా ప్రిపేర్ కావాలో చెప్పారు. అక్కడున్న వాళ్ళందరికీ ఆకాశమంత స్ఫూర్తిని నింపారు. నాక్కూడా! కొన్ని నిజజీవిత సంగతులను, సంఘటనలను చెప్తూ ఎందరో మనుషులను, వారి మనసులను గెలుచుకున్నారు. నిజంగా నాకైతే మానవ మాటలబాంబులా అనిపించింది. ఒక మనిషి ఇంత అనర్గళంగా ఎలా మాట్లాడగలరు, ఇంత నాలెడ్జ్ ఎక్కడ నుండి వచ్చిందా అసలు అనిపించింది. వీరభద్రుడు సార్ చదివిన దానికంటే జీవితానుభవ పాఠాలలోంచి చాలా నేర్చుకున్నారు, మా అందరికీ కూడా అవన్నీ నేర్పించారు.నిజంగా ఈ మనిషి మేధస్సు ఎంతగొప్పదో అనిపించింది నాకు. మనిషి అనుకుంటే ఏమైనా సాధించవచ్చు, ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో, పట్టుదల ఎలా ఉండాలో, మనం ఏమి చదవాలో, సమాజంలో ఎలా బ్రతకాలో చెప్పిన ఒక మహాశక్తే చిన వీరభద్రుడు సార్. రియల్లీ హాట్స్ ఆఫ్ టూ యూ సార్.👏🙏’

18-9-2023

17 Replies to “ప్రతి ఒక్కరిదీ ఒక జయగాథ”

  1. Sir మీ అమ్మ నాన్న గార్ల గురించి వ్రాసిన కవితలు ఉంటే పెట్టండి sir

    1. తప్పకుండా. ‘నీటి రంగుల చిత్రం’లో కవితలు పరిచయం చేసినప్పుడు ఆ కవితలు తప్పకుండా పరిచయం చేస్తాను.

  2. “ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో, పట్టుదల ఎలా ఉండాలో, మనం ఏమి చదవాలో, సమాజంలో ఎలా బ్రతకాలో చెప్పిన ఒక మహాశక్తే చిన వీరభద్రుడు సార్.”

    ఇదే మాట ప్రతి చోట ఉన్న wall of kindness లో కూడానూ.

    Congrats…Sir

  3. రాధాకృష్ణ గారి కోరికను మన్నించి సమావేశానికి శ్రమ అనుకోకుండా హాజరు అయ్యారు. మీ శ్రమ వృధా కాలేదు. మీరు రగిలించిన స్ఫూర్తి మరింతమంది సివిల్స్ , గ్రూప్ వన్ అధికారులను చేయబోతోంది. ఈరోజు కరువు నేలలోని యువతకు మీలాంటి వారు దిశా నిర్దేశం చేయాలి సార్! చేగువేరా హరి ప్రస్తుతం గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు.

  4. మేము కుడా అంతే సార్, శిశిరంలో అన్నిటిని దులిపేసుకొని వసంతం కోసం ఎదురు చూస్తే చెట్టులా.. మీ అక్షర పరిమళం కోసం 🛐

  5. ఇప్పటి యువత లో మీరింత స్ఫూర్తిని నింపుతున్నారు అంటే, మనసు నిండిపోతుంది.
    మీ మాటలలో ఆసభలో నేనూ ప్రత్యక్షంగా వున్నట్లు వుంది.
    అభినందనలు సర్. 💐💐💐

Leave a Reply

%d bloggers like this: