పునర్యానం-47

పునర్యానం రాసినప్పుడు నేను నవోదయ కాలనీలో 77 ఇంట్లో ఉండేవాణ్ణి. అది సెల్లారు. ఆ ఇల్లు తప్ప మరొకటి దొరకలేదా నీకు అని అడిగేవారంతా. ఏమో, అది దేవుడిచ్చిన కానుక అనుకున్నాను, అలానే అయిదేళ్ళు గడిపేసాను ఆ ఇంట్లో.

రోడ్డు కన్నా కిందకి ఉండటంతో మేముంటున్న పోర్షన్ లో సూర్యకాంతి నేరుగా పడేది కాదు. ఆ ఇంట్లో హాల్లో పెద్ద కిటికీ ఒకటి ఉండేది. ఆ ఇంటివాకిట్లో పెద్ద కొబ్బరి చెట్టు ఉండేది. పొద్దున్నే ఆ చెట్టుమీద పడ్డ సూర్యకాంతిని ఆకుపచ్చా-పసుపూ కలిసిన ఆ కొబ్బరాకులు వడగట్టి ఆ కిటికీ మీద వొంపుతుండేవి. మధ్యాహ్నాల వేళల్లో చిక్కటి నిశ్శబ్దం ఒకటి ఆ గదులంతటా పరుచుకుని ఉండేది. అప్పటికింకా ఈ కాలనీలో బహుళ అంతస్థుల భవనాల్ని అనుమతించలేదుకాబట్టి, సాయంకాలాల్లో బంగారు రంగు సంజ వెలుతురు ఏటవాలుగా ఇంట్లోకి ప్రవహించేది.

బహుశా ఆ కిటికీ లేకపోయుంటే నేను ఆ ఇంట్లో అన్నేళ్ళు ఉండగలిగి ఉండేవాణ్ణి కానేమో. ఈ ఊళ్ళోనూ ఉండేవాణ్ణి కానేమో. కనకనే, ఆ కిటికీ లేకపోతే నాకీ నగరం కూడా లేదని రాసుకున్నాను.


ఆ కిటికీ లేకపోతే నాకీ నగరం లేదు
తెరుచుకున్న ఆ వెలుతురు సందులేక సంరంభం లేదు
చూస్తుంటాను, పొద్దుట పదిగంటలవేళ
ఉదయకాంతి పుంజం మధ్య ఆకుపచ్చని నీడలు.

మధ్యాహ్నం కాగానే, కమ్ముకుంటుందొక నిశ్శబ్దం
మాఘ ఫాల్గుణ అపరాహ్ణ కాననాల మహామౌనం
సంధ్యవాలుతుండగా వినవస్తుందొక సంధిప్రకాశరాగం
చీకటి పడగానే ఆగి పలకరించి పోతుందా నెలవంక.

ఎవరు కావాలి నీకు? ఎవరి మాటలూ రుచించని
సంగీత మహాసమారోహమేదో సాగుతుంటుందక్కడ
కొన్నాళ్ల పాటు గడుస్తుందిట్లా, వెళ్లిపోతానిక్కణ్ణుంచి కూడా, బహుశా
మాయవు ఆ కాంతులెప్పటికీ, మూసుకోదు ఆ గవాక్షమెన్నటికీ.

(పునర్యానం, 5.1.20)

If I didn’t have that window, I wouldn’t have a city
Without that creek of light, there is no elation.
As each day starts,
The morning light filters down to green hues.

In the afternoon, silence envelops the room,
Silence reminiscent of winter forests.
Evening ragas tune in when dusk falls, and
Night comes, and the crescent smiles.

Waiting for whom? A great concert happens every day.
You want nothing else. Like this, days pass by.
Perhaps I will also leave someday.
Yet the window never shuts, and the light never dims.

16-9-2023

4 Replies to “పునర్యానం-47”

  1. ఈ కవిత మీ మొత్తం సారస్వతానికి తెరిచిన కిటికీ

Leave a Reply

%d bloggers like this: