పునర్యానం-46

చిన్నప్పుడే ఇల్లు వదిలిపెట్టాక, ఇప్పటిదాకా హాస్టళ్ళలోనూ, అద్దె ఇళ్ళల్లోనూ గడుస్తూ వచ్చింది జీవితం. ప్రతి అద్దె ఇంటినీ దేవుడిచ్చిన ఇల్లుగానే స్వీకరించడం అలవాటు చేసుకున్నాను. మొదట్లో ఆ ఇంట్లో ఏవో ఇబ్బందులు కనిపిస్తాయి. కొంత కాలం గడిచాక అందులో సౌకర్యం కూడా కనిపించడం మొదలవుతుంది. ఒక కిటికీనో లేదా ఇంటిముంగట కొబ్బరి చెట్టో, వేపచెట్టో లేదా ఇంటి పెరట్లో పడే వెన్నెలనో లేదా ఆ ఇంటి మేడమీదకి ఎక్కే మెట్లమీద మధ్యాహ్నాల వేళ చిక్కగా పరుచుకునే చెట్లనీడలో- ఏవో ఒకటి ఆ ఇంటిని ఆత్మీయంగా మారుస్తాయి.

కొన్నేళ్ల కిందట ఒక సెకండ్ హాండ్ బుక్ షాపులో Home, A Collection of Poetry and Art అనే పుస్తకం దొరికింది. Stan Tymorek అనే అతడు చేసిన సంకలనం. అందులో ఇళ్ళ మీద రాసిన కవితలున్నాయి, చిత్రలేఖనాలు కూడా. చాలామంది ప్రసిద్ధ కవుల కవితలున్నాయందులో. నెరుడా, యేట్సు, సీమస్ హీనీ, మిరొస్లోవ్ హోలబ్, పాట్రిక్ కావన్ గా- చిత్రమైన కవితలు, గొప్ప వాక్యాలు. ఉదాహరణకి, నెరుడా వాక్యాలు చూడండి:

I built the house..

It was a fable of
cement, iron, glass,
more valuable than wheat, like gold..

కాని అందులో నాకు నచ్చిన వాక్యాలు, సంపాదకుడు తన ముందుమాటలో కూడా గుర్తు చేసిన వాక్యాలు, Robert Creely అనే కవి రాసిన మాటలు-

Hold on, dear house, ..

You are my mind
made particular,
my heart in its place

కాని ఈ కవిత రాస్తున్నప్పుడు నేను ఇంటిగురించే రాస్తున్నాను అనుకున్నానుగాని, కవిత పూర్తయ్యేటప్పటికి, ఇది నా దేహం మీద రాసిన కవిత కాదు కదా అని అనుమానమొచ్చింది.


అద్దెకుంటున్న ఈ ఇంటిని నేను ఇష్టపడతాను, అందంగా
ఉంచుకోవడానికిష్టపడతాను, శుభ్రంగా నిలుపుకుంటాను,
కానీ మర్చిపోను, ఖాళీ చెయ్యాల్సిందే ఎప్పటికో ఒకప్పటికని.

మొదట్లో బాధించాయి దీని పరిమితులు, అసౌకర్యాలు
ఉండగా, ఉండగా గ్రహించాను అంతర్లీనంగా ఉన్న సదుపాయాలు
దీన్ని నిర్మించిన మృత్తిక నాది కాదు,
ఏ యుగాలమీంచో ఆకాశం నుంచి పాతాళం దాకా
సమస్తశక్తుల మీంచి తెచ్చుకున్న మట్టితో నిర్మించిందిది.

కొన్నాళ్లు భయంతో మూసుకునే ఉంచుకునేవాణ్ణి తలుపులు,
ఆత్మీయు­లెవరన్నా ప్రవేశిస్తే బాగుణ్ణనుకునేవాణ్ణి,
అయినా మర్చేవాణ్ణి, గుమ్మానికడ్డంగా నేనే నిల్చున్నానని
ఇప్పుడు బార్లా తెరిచిపెడుతున్నాను ద్వారాలు, కిటికీలు
నిండిపోతున్నదీ సూక్ష్మ ఆకాశం సుగంధాలతో, సుస్వరాలతో.

ప్రతి పండక్కీ పచ్చనితోరణం కట్టుకుంటాను, గడపకి
పసుపు రాసుకుంటాను, పిలుస్తానొకరినో ఇద్దరినో
మిత్రుల్నో, పరిచితుల్నో, అపరిచితుల్నో
కొన్ని క్షణాలక్కడ గడిపేక వాళ్లు
‘ప్రశాంతం నీ గృహం, ఒక చెట్టునీడన సేదదీరినట్టుందం’టారు.

(పునర్యానం, 5.1.17)

I’m liking my rental home lately
I try to keep it neat and pretty. Yet
I’ll never forget that I have to leave it someday.

When I first came here, I felt constrained.
Slowly, I became comfortable.

I did not build this, nor am I the owner.
Stardust kneaded the mud for ages,
Baking it into livable bread.

I mostly kept the doors closed at first
Even though I’d love to have some guests.
The obstacle was me, I realized at last.
My doors and windows are open now, and
Music and fragrance fill the house.

Every festive day, I decorate my house and
Friend or stranger, I’ll keep the door open.
Once people visit, they’ll say, “What a place!”
”Looks like cool shade in a summer grove!”

16-9-2023

6 Replies to “పునర్యానం-46”

  1. నిజంగానే శరీరం ఒక అద్దె ఇల్లు
    లాంటిదే.. నిగూఢంగా దాగి వున్న ఆధ్యాత్మికత అబ్బురపరిచింది.

  2. మీరు జీవితంలో అనుభవాలను చక్కగా కవిత ల గా వర్ణించారు. అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: