పునర్యానం-45

ఒక రచయితకి ఎంత మంది పాఠకులు తెలియాలి? నేననుకుంటాను, ఒక్క పాఠకుడు సరిపోతాడని. అది కూడా రచయిత ఏదో ఒకటి రాసినప్పుడు దాని వెంటనే జడ్జి చేయటానికి పూనుకోని పాఠకుడు. ముందు దాన్ని మనసుపెట్టి వినే పాఠకుడు లేదా శ్రోత.

మహాభారతం లాంటి అతి పెద్ద రచనకి కూడా మొదటి శ్రోత ఒకడే అని మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత ఆ రచనకు ఎంత మంది పాఠకులేనా రావచ్చు, బహుశా రాకపోవచ్చు కూడా. ఒక్కొక్కసారి రచయిత జీవిత కాలంలో ఒక్క పాఠకుడు కూడా దొరక్కపోవచ్చు లేదా కాఫ్కాలాగా తన రచనలు ఎవరు చదవకుండా వాటిని తగలబెట్టేయాలని కోరుకోవచ్చు కూడా. కానీ ఏ రచయితైనా ముందు తన కోసం తన రాసుకుంటాడు. తనలోని ఒక శ్రోతను ఉద్దేశించి తను చెప్పదలుచుకున్నది చెప్పుకుంటాడు. తనలోని శ్రోత కనుమరుగవుతూ బయట శ్రోతలు రావటం ఏ రచయితకీ, ఏ రచనకీ ఆరోగ్యకరం కాదు. ఎందుకంటే అప్పుడు రచయిత తన పట్ల తాను నిజాయితీగా ఉండకపోయే ప్రమాదం మొదలవుతుంది.

ఇటువంటి ఇంటరాక్టివ్ మీడియా అందుబాటులో లేని కాలంలో నలభై ఏళ్ల కింద నేను రచనలు చేయడం మొదలు పెట్టినప్పుడు ఎవరైనా ఇద్దరు ముగ్గురు మిత్రులకు వినిపించే వాడిని. వాళ్లు నచ్చిందనో నచ్చలేదనో చెప్పేవారు. కానీ వాళ్ళ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా నాకు మళ్లా ఎప్పుడు ఏది రాయాలనిపిస్తే అప్పుడు రాస్తూ ఉండేవాణ్ణి. నా కవితలు కూడా అలా రాసినవే. చాలా కవితలు మిత్రులకు ఉత్తరాలు రాసినప్పుడు ఆ ఉత్తరాల్లో రాసుకున్నవే. ఏవీ ఎప్పుడూ ఏ పత్రికీ పంపలేదు. నిర్వికల్ప సంగీతంలో నేను ప్రచురించిన కవితలన్నీ మొట్టమొదటగా ఆ పుస్తకంలో ప్రచురించినవే. ఆ తరువాత కూడా ఒకటి అరా తప్ప నా కవితలు ఎప్పుడూ ఏ పత్రికలూ పెద్దగా ప్రచురించింది లేదు. దానివల్ల నాకు మేలు జరిగిందనే భావిస్తాను.

తర్వాత రోజుల్లో ఇండియా టుడే పత్రిక నన్ను ఒక కాలం రాయమని అడిగినప్పుడు ఆ కాలం ఎంతకాలం రాయనిస్తారో నాకెప్పుడూ అనుమానంగానే ఉండేది. ఎందుకంటే ఆ కాలం చదివిన పాఠకులు ఎవరైనా నన్ను కలిస్తే అందులో నేనేం రాస్తున్నానో వాళ్లకు అర్థం కావటం లేదనో, భాష మరీ కఠినంగా ఉంటుందనో, ఆ భావాలు కూడా ఒక పట్టాన బోధపడట్లేదనో అనేవారు. కానీ వాళ్ళ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా నేను రాయాలనుకున్నదేదో రాస్తూ ఉండేవాడిని. అటువంటి కాలంలో నాకు ఒక శ్రోత లభించాడు.

ఆయన రావెల సోమయ్య గారు. ఆయన నేను ఏది రాసినా అది చదివి బావుంది అని చెప్పేవారు. ఎప్పుడూ ఏ రచన మీదా ఆయన ఎటువంటి విశ్లేషణా చేయలేదు. ఎటువంటి జడ్జిమెంట్ కి పూనుకోలేదు. ఆయన నా రచనలు చదివి చదివి బాగున్నాయి అని చెప్పిన ప్రతిసారీ నాకు అనుమానం కలుగుతూ ఉండేది. ఈయనకూ, నాకూ మధ్య ఉన్న అనుబంధం వల్ల ఆయన నాతో ఆ మాటలు చెబుతున్నారా లేక నా రచనలు నాతో నిమిత్తం లేకుండా ఆయనకు ఏదైనా ప్రత్యేకంగా తేటపరుస్తున్నాయా తెలిసేది కాదు. కానీ ఆయన నాకు ఫోన్ చేసిన ప్రతిసారి చాలా ధైర్యంగాను నమ్మకంగానూ ఉండేది. కనీసం ఒక్క పాఠకుడు వాటినిచదువుతున్నాడు చాలనిపించేది. అందుకనే ఆ కాలంలో రాసిన వ్యాసాల్ని పుస్తకంగా తెచ్చిప్పుడు ఆ పుస్తకానికి ‘సోమయ్యకు నచ్చిన వ్యాసాలు’ అని పేరు పెట్టాను.

ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తారంగా పాఠకులు, లైకులు, వ్యాఖ్యలు లభ్యం అవుతుండడం నా దృష్టిలో రచయితకు హానికరమే తప్ప ఏ విధంగానూ ప్రయోజనకరం కాదు. ‘ఆకులందున అణగి మణగీ కవిత కోకిల పలకవలెనోయ్’ అన్నాడు మహాకవి. రచయిత రచనతో తప్ప పాఠకుడికి రచయితతో నేరుగా సంభాషించే అవకాశం గాని, అతనితో తన అభిప్రాయాలు పంచుకునే మార్గాలు కానీ ఉండకూడదని నా అభిప్రాయం. అప్పుడే రచయిత తన పట్ల తాను మరింత నిజాయితీగా ఉండగలుగుతాడు.

అయినా ఏ బలహీనక్షణంలోనైనా శ్రోతలో, పాఠకులో కావాలి అనిపిస్తే ఒక్క శ్రోత చాలు. సోమయ్య గారిలాంటి శ్రోత.


రాసినప్పుడల్లా నేనేదో ఒకటి వస్తుందా ఫోన్‌ కాల్‌
‘మీరు రాసింది చదివాను, చాలా బాగా వచ్చింది’ అంటాడాయన.
నమ్రతతో చిరునవ్వుతాను, ‘మీకు నచ్చిందా’ అంటాను
ఇక మాట్లాడటానికుండవు మాటలు.

ఆలోచిస్తుంటాను, ఏమి స్ఫురించిందాయనకి ఆ రచనల్లోనని
కొన్ని నేను అగ్రహంతో రాసి ఉంటాను, కొన్ని సంతోషంతో
రాసి ఉంటాను, కొన్ని ఊరకనే రాసి ఉంటాను,
కొన్ని రాయకుండా ఉండలేక రాసి ఉంటాను.

అయి­నా, ప్రతి ఒక్క రచనకీ వస్తుందాయన ఫోన్‌ కాల్‌
‘మీరు రాసింది చదివాను, చాలా బాగా వచ్చిందంటాడాయన
వినగా, వినగా స్ఫురించింది ఆయన అంతర్యం,
అర్ధం చేసుకోవాలి ఆ మాటల్నిట్లా.

‘మీరు రాసింది చదివాను, మీరు కొన్ని క్షణాల పాటు నిజంగా జీవించారు
పూర్తి మానవుడిగా వికసించడానికి ప్రయత్నించారు, కావచ్చది ఆనందమో
అగ్రహమో, పంచుకోలేకుండా ఉండలేకపోయారది ప్రపంచంతో.
నచ్చింది నాకు, తెలిసింది నాకు మీరు జీవితాన్ని జీవిస్తున్నారని’

(పునర్యానం, 5.1.16)


I always get a call from him when I write something.
‘You wrote well,’ he says.
‘You’re welcome!’ I would smile politely.
Beyond that, I am at a loss for words.

It makes me wonder what caught his attention.
I write some to express joy and others to relive anger
I wrote a few more, as I couldn’t help myself.

Every time I write, he gets in touch
Every time, he says, it worked out well.

I pondered it for a long time.
Perhaps he meant this:

‘Your writings reveal the pursuit of fullness, a true life lived.
You share all your moments with everyone, happy and sad.
Every time I see this, I like it.

14-9-2023

8 Replies to “పునర్యానం-45”

  1. నచ్చడం ఒక్కటే కాదు, సర్.
    తెల్లవారడం కోసం ఎదురు చూస్తూ ఉంటాం.
    నమ్మండి. సర్.

  2. Rambhaskar Raju గారు అన్నది నిజమే సార్. కొందరం ఎదురుచూస్తూ ఉంటాము.

  3. నచ్చింది నాకు, తెలిసింది నాకు మీరు జీవితాన్ని జీవిస్తున్నారని

  4. 8 వ తరగతిలో ఉండగా మొట్ట మొదటిసారి చిత్తు notes లో నాన్న గుర్తుకు వచ్చి ఒక కవిత వ్రాసుకున్నాను. అది కవితో, తవికో నాకు కూడా తెలియదు కానీ ఆ తర్వాత నాన్న గుర్తుకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒకటి వ్రాసుకుంటూ భద్రాచలం గోదావరి ఒడ్డు మర్రి చెట్టు కింద కూర్చుని నేనే చదువుకుని చింపేసే దాన్ని.
    Hyd డిగ్రీ లో చేరాకా college magzine కు సరదాగా కొన్ని ఇచ్చేదాన్ని.ఒకసారి ఒక నేస్తం ఏదో పత్రికకు పంపితే వారు 25 రూపాయలు పారితోషికం పంపిస్తే ఇలా కూడా పంపుతారా అని ఆశ్చర్యపోయాను. కాలక్రమంలో నాన్న మీద బెంగతో పాటు కవితల్లో కూడాdepth తగ్గింది అని నాకు అనిపించి వ్రాయడం మానేశాను.ఏదైనా కథా వస్తువు మన హృదయాన్ని కదిలించేలా వుంటే అది కలకాలం నిలచి వుంటుంది.దానికి ఎవరి ప్రశంసలూ అవసరం లేదు.కానీ ఈ మధ్య మొక్కుబడి వ్రాతలకు కూడా వచ్చే పొగడ్తలు విడ్డూరంగా అనిపించినా తటస్థంగా వుండటం అలవరచు కొన్నాను.మీ లాంటి వారి రచనల్లో పటుత్వం హృదయానికి నేరుగా తాకుతూ ఉంటుంది.

Leave a Reply

%d bloggers like this: