పునర్యానం-44

నువ్వుంటున్న ఊరు గురించో, నగరం గురించో కవిత రాయకుండా ఉండటం కష్టం. అందులోనూ చాలా ఏళ్ళుగా ఉంటున్న స్థలంతో నీకు తెలీకుండానే ఒక అనుబంధం ఏర్పడుతుంది. నా జీవితంలో చాలా చోట్ల చాలా ఏళ్ళపాటు గడిపాను. ప్రతి ఊరూ నేను అక్కణ్ణుంచి వచ్చేసేటప్పుడు తన సుగంధం నాకు కొంత మూట గట్టి ఇస్తూనే ఉంది. కాని ఏ ఊరూ నా పుట్టిన ఊరుని మరిపించలేకపోయింది. తీరా చూస్తే నా జీవితంలో అత్యధికకాలం గడిపింది హైదరాబాదులో. నాకేమీ కాని ఈ నగరంలోనే గత ఇరవయ్యేళ్ళకు పైగా గడుపుతూ ఉన్నాను. ఏళ్ళ మీదట నెమ్మదిగా ఈ నగరం తన అంతరంగాన్ని నాతో పంచుకుంటున్నది అని అనిపించిన కొన్ని క్షణాలు ఉన్నాయి. కాని ఆ నగరం నలుగురికీ తెలిసిన నగరం కాదు. గజాల లెక్కన మనుషులు బేరమాడుకుంటున్న నగరం అస్సలు కాదు. అది మరొక నగరం. ఆ రెండో నగరంతో నాకు తెలీకుండానే నేను ప్రేమలో పడ్డానని తెలిసినప్పుడు రాసిన కవిత ఇది. ఇక ఆ నగరం నాకు మాత్రమే చూపిస్తూ వచ్చిన దృశ్యాల్ని తర్వాత రోజుల్లో చాలా కవితల్లో చిత్రించాను.

ఈ కవితలో చివరి పంక్తులు రాస్తున్నప్పుడు అమీర్ ఖుస్రో నా మనసులో ఉన్నాడు. సుప్రసిద్ధమైన ఆయన దోహా:

గోరీ సోవై సేజ్ పర్, ఔర్ ముఖ్ పర్ డారే కేస్
ఛల్ ఖుస్రూ ఘర్ ఆపనే, రైన్ భయీ చహు దేశ్

(సుందరి తన వదనాన్ని శిరోజాలతో కప్పుకుని శయ్యమీద మేను వాల్చింది. ఖుస్రూ, పద ఇంటికి పోదాం, నాలుగు దిక్కులా చీకటి కమ్మింది)

ఖుస్రో గురువూ, మహనీయ సూఫీ సత్పురుషుడూ నిజాముద్దీన్ ఔలియా ఈ లోకాన్ని విడిచినప్పుడు ఖుస్రో ఈ దోహా చెప్పాడని ప్రతీతి. నాలుగు దిక్కులా చీకట్లు పరుచుకోవడాన్ని అందమైన యువతి తన కేశపాశంతో తన వదనాన్ని కప్పుకోవడంతో పోల్చిన ఆ కవి ప్రతిభకి నేను ఘటించగల నివాళి ఆ పోలికని నా కవితలో వాడుకోవడమే.


నగరంలో రెండు మహానగరాలున్నాయని నాకొక్కసారిగా తెలియరాలేదు
మహాకావ్యంలో సాధారణార్ధమే ముందుగా తెలిసినట్టు
తెలియవచ్చింది మహాభవనాల, ప్రాసాదాల, ఆకాశహర్మ్యాల
ఇనుము-ఉక్కు, కాంక్రీటు నగరం అన్నిటికన్నా ముందు.

కనిపించదు అసలైన నగరం ఆ ట్రాఫిక్‌లో, ఆ సమ్మర్దంలో,
మహావాక్యంలో దాగిన కవి అంతరంగంలా, పువ్వులో దాగిన పిందెలా
వెతికిపట్టుకోవాలి దాన్ని కొన్ని సంకేతాల్లో
చీకటి గదిలో వెలుతురు పాకే సందుల్లో, కట్ట వెనక దాగిన జలాశయ రహస్యంలో.

మొ­దటిది : పండగలు వచ్చినప్పుడు చూడు దాన్ని, తెలంగాణా కన్యలా,
అప్పుడే ప్రసవించిన బాలెంతలా, దాచుకోలేదు తన పసిమిని
చేతినిండుగా గాజులు తొడుక్కున్న బంజారా వనితలా
ముస్తాబవుతుంది నిండుగా, కప్పుకున్న మేలిమి వస్త్రంలో కప్పలేని మిసిమిలా
పొంగిపొర్లే ఆనందం దానిది.

రెండవది : ఇంకా తెల్లవారని తొలి ప్రత్యూషవేళల్లో చూడు, ఎక్కడెక్కడి
పక్షులతో ముచ్చట్లాడుతుంది నగరం, శయ్యమీద సోమరిగా
లతలు దిద్దిన తలగడకు తలాన్చుకుని పక్కకు ఒత్తిగిలి
శిశువుతో ము­ద్దుమాటలాడే తల్లిలా కనిపిస్తుందప్పుడు.

ఇక మూడవ క్షణం : కరెంటు పోయి­నప్పుడు మేడ ఎక్కి చూడు, కనిపించవప్పుడు
వాహనాలు, ప్రాసాదాలు, ఫాక్టరీలు, పొగగొట్టాలు
చూడగలిగినంతమేరా ప్రశాంత దక్కన్‌ పీఠభూమి పరుచుకుని ఉంటుంది
ఇక అప్పుడు గ్రహిస్తావు నువ్వు చూడలేని
భాగాన్ని ఆకాశం తన కురులతో కప్పేసిందని.

(పునర్యానం, 5.1.10)


Unknown to me earlier, this city contains two cities.
As one grasps the literal meaning first
It was only buildings, towers, and skyscrapers I saw earlier.
A city of steel, iron, and concrete.

Traffic and rush don’t reflect the true city
A few signs point the way, just like
A tender fruit within a flower or
The light that creeps in through a door.

First: watch the city’s joy during festive times.
Her eyes glow like a Telangana girl.
As with a newly delivered child, the luster is too strong to hide.
Like a banjara woman wore bangles full of arm,
Her beauty cannot be hidden even if she tries.

Second: observe the city in the early morning.
It speaks to birds from all over the world, like
A mother reclining on pillows with laced flowers and
Caressing her child.

Finally, whenever there is a power outage, look out from the terrace.
No cars, mansions, factories, or chimneys. Only
The serene Deccan plateau stretches to the horizon, and
On the other side, the sky spreads its dark hair.

13-9-2023

6 Replies to “పునర్యానం-44”

 1. వహ్ అనిపించే కవిత్వం .
  మనసును ఉల్లాసపరిచే భావపరిమళం. అనువాదం దీటుగా సాగింది.
  ఇది చదివిన వారికి ఇకపై రెండు భాగ్ నగరాలు
  …….
  అమీర్ ఖుస్రో కవిత చూడగానే
  మాత్రా ఛందస్సులో మనసు పరుగెత్తింది.
  “పడతి పడకపై పడుకొని ఉన్నది
  పరచెను ముఖమున నీలాలు
  పద ఖుస్రూ పద ఇంటికి పోదాం
  చీకటి క్రమ్మెను నలు దెసల”
  🙏

 2. “ప్రతి ఊరూ నేను అక్కణ్ణుంచి వచ్చేసేటప్పుడు తన సుగంధం నాకు కొంత మూట గట్టి ఇస్తూనే ఉంది.“ ఎంత నిజం!!
  కవిత లాంటి painting, painting లాంటి కవిత చాలా బాగున్నాయి, సర్. 🙏🏽

 3. “కప్పుకున్న మేలిమి వస్త్రం లో కప్పలేని మిసిమి తో
  పొంగిపొర్లే ఆనందం దానిది.”
  నగరపు సౌందర్యాన్ని నేత్ర పర్వంగా వర్ణించారు.

Leave a Reply

%d bloggers like this: