పునర్యానం-43

చాలా ఏళ్ళ కిందట నేనొక కవిత చదివాను. బంగారు రామాచారి పుణ్యమా అని నలభయ్యేళ్ల తరువాత ఆ పుస్తకం మళ్ళా చూడగలిగాను. కె. సంతానం సంపాదకత్వంలో వచ్చిన ‘భారతీయ సాహిత్య సంకలనం’, తెలుగు అనువాదం (1979). అందులో అమియాచక్రవర్తి కవితకి ప్రొ. కొత్తపల్లి వీరభద్రరావు అనువాదం.

కలకత్తా

పెద్ద పెద్ద ఆకుల చెట్లకింద
వెచ్చని చందమామ ఆనందం పరుచుకొంటున్నది
తోటదడికి దూరంగా
ఇనుపగేటుమీద
కులాసాగాలికి పూలతీగె తలూపుతున్నది.
నా కళ్ళల్లో ఈ సుందర దృశ్యం కదులుతూనే ఉన్నది.
ఆ సందు చివరనడిచేదాకా
పియానో స్వరాలు, గాలిజోలి పట్టించుకోకుండా
వసంతాకాశాన్ని బాధతో నింపుతున్నాయి.
దక్షిణకలకత్తాలోని ఒక సందులో
మళ్ళీ ఎప్పుడైనా భూమిమీదకు తిరిగివస్తే
మళ్ళీ ఈ సందుగుండానే ఇంకోసారి నేను నడుస్తాను.
తళతళలాడే సూర్యకాంతిలో ఆ ద్వారాన్ని చూస్తాను
దానిపక్కనే పాటలకుసుమలతను
గుత్తులుగుత్తులుగా ఉన్న పూలను, పసుపురంగు పూలు,
అచ్చస్వచ్ఛమైన నీలాలు
దట్టంగా పరచిన పచ్చగడ్డి కంబళీ నా కన్నులకు విశ్రాంతినిస్తాయి
ఎవరిల్లో అది, ఎవరుంటారో అక్కడ
ఇవి మాత్రం నేనెరుగను-
కాని ఒంటరి పాంథుని విహ్వలపరిచే మధుమాస వ్యథాహృదయం
పియానో స్వరాలు వణికించే ఆ నిశ్చల ప్రశాంతత
ఒక్క క్షణకాలం నా కళ్ళను ఆనందంతో నింపుతుంది.

బైరాగి రాసిన ‘ఆడుకుంటున్న బాలిక’ కవిత కూడా దాదాపుగా ఆ రోజుల్లోనే చదివాను. ఈ రెండు కవితలూ నాలోపలకీ ఇంకిపోయాయి.

ఏళ్ళ మీదట నాకేమి అర్థమయిందంటే, కవిత్వం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి జాతికి సంభవించే మహానుభవాల్ని ప్రతిబింబించేది, లేదా ఒక జాతిని మహాశయాలవైపు నడిపించుకుంటూ పోయేది. అన్ని భాషల్లోనూ ఇతిహాసాలు చేసింది ఈ పనే. కాని మరొక తరహా కవిత్వం ఉంటుంది. అదేమీ చెయ్యదు. ఎవరిని ఎటువైపూ నెట్టదు, ఎవరినీ భూషించదు, దూషించదు, శ్లాఘించదు, శపించదు. అది చేసేదల్లా ఒక పిచుక చిన్న గడ్డిపోచలు తెచ్చుకుని గూడు కట్టుకున్నట్టుగా, చిన్న చిన్న క్షణాల్ని పట్టుకుంటుంది. ఇంకా చెప్పాలంటే, పిచుక గూడు అల్లుకునేటప్పుడు పక్కకి జారిపోయే గడ్డిపోచల్లాంటి క్షణాలన్నమాట. ఏముంటుంది అందులో? అది ఆ పిచుక బతికిన క్షణాలకి గుర్తు.

ఇది అటువంటి కవిత.


కాలనీని క్రికెట్‌తో నిద్రలేపారు పిల్లలు
వాళ్లాడుకుంటున్న మేర ఆదివారానికొక రూపమేర్పడింది.

ఒకరినొకరు పిల్చుకున్నారు, కొందరిని క్రికెట్‌ పిలిచింది
మాకు ట్రాఫిక్‌ కనబడుతున్న రోడ్డుమీద
వాళ్లకొక క్రీడామైదానం సాక్షాత్కరించింది.

అంత సులభం కాదు, అంత సౌకర్యమూ కాదు
కాలనీ రోడ్డుమీద క్రికెట్‌ ఆడటం
అం­నా ఆదివారాన్ని ఆదివారం చేయడం కోసం
ప్రతి వారం వాళ్లా ఉద్యమాన్ని సాగిస్తూనే ఉంటారు.

కొన్ని బంతులు తప్పిపోతాయి­, కొన్ని సందులో జారిపోతాయి
కొన్నిటిని ఎదురింటి గోడదాటి వెనక్కి తెచ్చుకోవడానికి
మందలింపుల కందకాన్నీదవలసివస్తుంది
ఒక్కొక్కసారి బంతి వెయ్యడానికి ఉత్సాహంతో రెండడుగులు
వెనక్కి వెళ్లి మరీ ముందుకు రాబోతున్నంతలో
అడ్డొస్తుందొక ఆటో, లేదా మోటారు సైకిల్‌
ఆటతో పాటే ఆత్మ నిగ్రహానికీ ప్రాక్టీసు జరుగుతుంది.

తప్పిపోతున్న పది బంతుల మధ్య ఒక్క బంతిని
బాటుతో మోదుతాడొకడు, ఎగురుతుందది, బౌండరీకావచ్చు
సిక్సర్‌ కావచ్చు, లేదా ఎవరన్నా ఇట్టే కాచ్‌ పట్టవచ్చు
వెలుగుతుందప్పుడు ఆట మొత్తం ఒక్కసారిగా
బంతిని కొట్టింది బాటా? పిల్లవాడా? మొ­త్తం ఆటగాళ్లా ?
క్రీడామైదానమా?

ఆ ఒక్క క్షణపు తుళ్లింతతో ఉలిక్కిపడుతుంది నగరం
ఆ సాఫల్యాన్ని ఏ ఒక్కరూ తమదంటే తమదని పోరాడుకోరు.

ఆరురోజుల పోటీజీవితపు గాయాలకి ఆ ఒక్క ఆట
ప్రేమగా పట్టీ కడుతుంది.

(పునర్యానం, 5.1.9)


With their cricket game, the children woke up the colony
Their play gradually shaped the Sunday.

They first called each other, then Cricket called everyone else
Where we find traffic, they found a playground.

Street cricket is neither easy nor comfortable
Yet they strive to make every Sunday a Sunday.

Some balls fall amiss, some slide, and
Occasionally, kids must swim across abuse.
Sometimes, a motor or auto comes in, and
As they play, they learn restraint.

Among ten misses,
One hit gets it declared.
With a shout, the play reverberates
Bat, kid, team, or playground?
Success for whom?

The entire city erupts in joy
All claim victory, but none owns it

It soothes all the wounds of the week
That one game on Sunday.

10-9-2023

12 Replies to “పునర్యానం-43”

  1. ఈ కవిత మీరు ముందు పబ్లిష్ చేసినపుడు చదివి చాలా ఆనందపడ్డానండీ. అదే exultant feeling ఇపుడు మరలా కలిగింది.మీ కలం ఇంద్రజాలం చేస్తుంది.నమస్సులు.

  2. ఎంత బాగున్నాయి కవితలు…. ఇది చాలదా…

    జీవితం అపురూపంగా కనిపిస్తోంది మరోసారి..thank you

  3. బతికిన క్షణాల కవిత.. lovely sir. మందలింపుల కందకం..

  4. చిన్న చిన్న క్షణాలని పట్టుకునే కవితకి విశ్వరూపంలా మీ కవిత సర్!
    ఉత్సాహంగా,ఎంతో strategy తో బాల్ వెయ్యబోతే ఏ ఆటోనో అడ్డురావటం…అయినా పట్టు వీడకుండా మళ్ళీ ప్రయత్నించటం…అది ఒక జీవిత పాఠమే.ఆదివారాన్ని ఆదివారం చెయ్యటం,అందరూ ఆ దారిలో ట్రాఫిక్ చూస్తుంటే ఆ పిల్లలు అక్కడ మైదానాన్ని చూడటం…..ఈ వ్యక్తీకరణ కవితాసౌరభాలని
    వెదజల్లింది.

  5. ప్రతివారం ఉద్యమాన్ని సాగించటం, మందలింపుల కందకాలు, ఆత్మనిగ్రహ ప్రాక్టీసు, సాఫల్యాన్ని తమది చేసుకోకపోవడం , పోటీ గాయాలకి ప్రేమ పట్టీ…. చాలా అర్థవంతంగా ఉన్నాయి. చదివిన తర్వాత చెప్పలేని ఆనందం.

Leave a Reply

%d bloggers like this: