పునర్యానం-42

చిన్నప్పణ్ణుంచీ మనకి ఈ లోకం పరిచయమవుతున్నకొద్దీ, మన ప్రపంచం విస్తారమవుతున్నకొద్దీ, మన రోల్ మోడల్స్ కూడా పెరుగుతుంటారు. జీవితపు ప్రతి మలుపులోనూ, మనకీ తెలిసినవాళ్ళల్లో ఎవరో ఒకరు మనకి ఆరాధనీయులుగా మారిపోతుంటారు. కొన్నాళ్ళకు ఆ రోల్ మోడల్స్ స్థానంలో కొత్తవాళ్ళు వచ్చి చేరుతుంటారు. ఒకప్పుడు మనల్ని ఉత్తేజపరిచి, ఉద్దీపన చేసినవాళ్ళు, ఎన్నో ఏళ్ళు గడిచాక, వెనక్కి తిరిగిచూసుకుంటే, వెలవెలపోతూండే సందర్భాలు కూడా తక్కువేమీ కాదు.

కాని నా చిన్నప్పణ్ణుంచీ నన్ను ప్రభావితం చేస్తూ ఉన్న ఆరాధనీయ కవుల్లో ప్రాచీన చీనాకవి తావోచిన్ మాత్రం అలానే ఉన్నాడు. పైగా నా వయసు పెరిగేకొద్దీ, ఈ ప్రపంచాన్ని మరింత దగ్గరగా చూస్తున్నకొద్దీ, ఆయన మరింత స్ఫూర్తిదాయకంగా కనిపిస్తో ఉన్నాడు.

నా ఇరవయ్యేళ్ళప్పుడు, ఏదో ఒక సాహిత్యసంపుటంలో ఆయన రాసిన కవిత ఒకటి చూసాను. అప్పటికి నాకు ఆయన గురించి ఎక్కువతెలీదు. కాని ఆ కవిత మాత్రం నన్ను చప్పున ఆకట్టుకుంది. దాన్ని తెలుగులోకి అనువదించుకోకుండా ఉండలేకపోయాను. నిర్వికల్పసంగీతం తెచ్చినప్పుడు, అందులో అనువాదవిభాగంలో, ఆ కవిత కూడా చేర్చుకున్నాను. మళ్ళా మూడేళ్ళ కిందట ఆ కవితనే మరోసారి అనువదించాను. ఈ అనువాదంలో ఆ కవిత చూడండి:

జనావాసాలకు దూరంగా నా కుటీరం కట్టుకున్నాను
బళ్ళు తిరగని చోటది, గుర్రాలు సకిలించని తావు.

అదెట్లా సాధ్యపడిందో తెలుసా నీకు? చూడు,
బెంగటిల్లే ప్రతి గుండె చుట్టూ ఒక సూక్ష్మలోకం.

నేనక్కడ తూర్పువేపు చామంతితోట పెంచుకుంటాను
దూరంగా వేసవి కొండల్ని తదేకంగా పరికిస్తుంటాను.

పొద్దున్నా, సాయంకాలం కొత్తగా వీచే కొండగాలి
జంటలు జంటలుగా గూటిదారి పట్టిన పక్షులు.

ఈ దృశ్యాల్లోనే ఏదో లోతైన అర్థం స్ఫురిస్తుంటుంది
తీరా చెప్పాలని చూస్తే మాటలు మూగబోతాయి.

ఈ కవిత నాకొక కొండగుర్తు. ఎప్పటికేనా అటువంటి తావు ఒకటి నా జీవితంలో వెతుక్కుని నా చేతుల్తోనే నేనొక కుటీరాన్ని కట్టుకోవాలన్న కోరిక నాలో నానాటికీ బలపడుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, అది నా యుటోపియా.

పునర్యానం, అయిదో అధ్యాయంలో, ఈ కవిత తావోచిన్ కి పూర్తి అనుకృతి అని చెప్పుకోడానికి నాకు గర్వంగానే ఉంటుంది.


నాకొక చిన్న తాటాకుల ఇల్లు కావాలని ఉంటుంది
ఆ ఇంటివెనక కొండలూ, లోయలూ పరుచుకునుంటాయి.

వెదురు కంచెతో ఇంటిచుట్టూ ఒక ఆవరణ నిర్మించుకుంటాను
కొంతపచ్చిక, కొన్ని చామంతులు, కంచెమీంచి ఇంటిమీద కొక
కాశీరత్నం పూలతీగ.

ఉదయసూర్యకాంతి పసుపుపూలతో నా ఇంటికప్పునల్లుకుంటుంది
మధ్యాహ్నం పూట ఉష్ణమండలదేశాల తీరికనిద్ర,
సాయంకాలం కాగానే సుదూరం నుంచీ పూర్వీకల్యాణి
గోధూళివెంబటే తేలుకుంటూ వస్తుంది.

రాత్రి ఆకాశం గూడులో చంద్రుడు వెచ్చగా కలలు కంటాడు
తెల్లవారగానే, కిటికీ తలుపులు తెరవగానే
మంచుకు తడిసిన పచ్చిక కిలకిలమంటుంది
నీకు తోడంటూ నికుంజం నుంచొక కూజితం వినవస్తుంది.

(పునర్యానం, 5.1.5)


My dream is to build a thatched hut,
Surrounded by hills and valleys.

Around the hut, I would raise a green fence,
Develop a small lawn, grow chrysanthemums, and
Plant a cypress vine.

Morning sunshine fills the roof with golden blooms
A siesta in the afternoons
As dusk falls, cattle return home.
As cow-dust swirls in, Raga Poorvi glides in.

The moon dreams in her nest at night.
Early in the morning, as you open the window
Fresh dew greets you on the grass
A forest barbet joins the chorus.

11-9-2023

9 Replies to “పునర్యానం-42”

  1. ఇది తెలతెలవారగానే నికుంజంనుండ్ వెలువడిన రమ్య కూజితమే. ముందు బొమ్మ చూడగానే కుటీరం అని స్ఫురించింది.కవితకు చిత్రశీర్షిక

  2. అవును కదా . మన ప్రపంచం విస్తారమయ్యేకొద్దీ కొత్త రోల్ మోడల్స్ వస్తూనే ఉంటారు.. పాత వాళ్ళు ఒక్కోసారి వెలవెల పోతుంటారు.. కొందరు మాత్రమే ఎప్పటికీ ఒక్క తీరుగా నిలుచుండి పోతారు అందనంత ఎత్తులో ప్రత్యేకమైన వ్యక్తిగా…

    మీరు రాసే ప్రతి పోస్టు… చాలా చాలా బాగుంటుంది అండి
    Thank you

      1. నాకు ఎప్పటికీ వెలవెలబోని ఆరాధనీయులు మీరు

  3. ఇలాంటి పరిసరాలు ఆ ఈశ్వరుడితో స్నేహితం చెయ్యటానికి కాక మరెందుకని అనిపిస్తుంది సర్..

  4. ఎన్నో,ఎన్నెన్నో భావాలు మనస్సులో పురుడుపోసుకుంటూనే ఉంటాయి.
    వాటిని ఆచరణ లోకి తెచ్చుకొనే వారు అదృష్టవంతులు జయతీ లోహితాక్షన్ గార్ల వలె.
    Keslapur లో ఉన్నప్పుడు నా మనసులోనూ ఇలాంటి ఊహలే
    వస్తూ ఉండేవి. నాగోబా దేవుని సన్నిధి లో ఒక కుటీరం వేసుకొని
    వుండాలని!

Leave a Reply

%d bloggers like this: