
నేను తొలిరోజుల్లో రాసిన కవితలు రాత్రివేళల్లోనో,అర్థరాత్రుల్లోనో, జీవితం పట్ల గొప్ప అలసట, వేసట కలుగుతున్న క్షణాల్లోనో రాసినవి. అసలు జీవితంలో ఏదో ఒకదానిపట్ల ఏదో ఒక ఆశాభంగం లేకుండా ఒక మనిషి కవి కాలేడని నమ్మిన రోజులవి. చివరికి మా మాష్టారు కూడా కవికి ఒక గాయం ఉంటుందని, ఆ గాయమే అతడితో కవిత్వం పలికిస్తుందని చెప్పేవారు. చివరికి సామాజిక అసమానతల గురించి గొంతెత్తిన అభ్యుదయ కవులు కూడా ఏదో ఒక రూపంలో రొమాంటిక్ సంప్రదాయాన్ని కొనసాగించినవారే. కాని మొదటిసారి సుదర్శనంగారి దగ్గర విన్నాను, మనిషి తన ఆనందాన్ని ప్రకటించడానికి కవిత్వం రాస్తాడనీ, ఉపనిషత్తులు మాట్లాడింది అటువంటి స్థితి గురించేనని. నా ఇరవయ్యేళ్ళ ప్రాయంలో ఆ మాటలు విన్నప్పుడు నమ్మలేకపోయాను. ఎందుకంటే, జీవితానందానికి ఎడమైనప్పుడే మనిషి కవిగా మారతాడనే రొమాంటిసిస్టు ధోరణిలో, అప్పట్లో, పీకలదాకా మునిగి ఉన్నాను కాబట్టి. కాని ఋషి కానివాడు కవి కాలేడని మన పెద్దలు చెప్పారంటే దాని అర్థం, నీకు దుఃఖం తెలియదని కాదు, ఆ దుఃఖ ప్రభావాన్ని నువ్వు దాటిపోగలిగితేనే ఋషిగా మారతావనీ, అప్పుడు చెప్పే కవిత మాత్రమే మంత్రంగా మారుతుందనీ.
కాని పునర్యానం రాస్తున్నప్పుడు, ముఖ్యంగా, చివరి అధ్యాయంలోని కవితలు రాస్తున్నప్పుడు ప్రభాతవేళల మహిమ ఎటువంటిదో నాకు మొదటిసారిగా అనుభవంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచీ నేను ప్రత్యూషవేళల్లో తప్ప మరొకవేళ కవిత్వం రాయలేదు. రాయడం సాధ్యం కాదు కూడా నాకిప్పుడు.రాబర్ట్ బ్లై కూడా ప్రభాతవేళల్లో కవిత్వం రాయడం సాధన చేసాడనీ, అలా రాసిన కవితల్ని Morning Poems(1998) అని సంపుటంగా వెలువరించాడనీ తర్వాత రోజుల్లో తెలిసినప్పుడు నాకు చాలా సంతోషమనిపించింది.
కావ్య ప్రయోజనం గురించి మమ్మటుడు చెప్పిన మాటల్లో ‘కావ్యం యశసే, అర్థకృతే..'(కావ్యప్రకాశం, 1.2) కవులు మొదటి రెండు మాటలూ, యశస్సూ, అర్థమూ- ఆ రెండిటి దగ్గరే ఆగిపోయారు. ఇప్పుడు కవిత్వం ఆర్థికంగా ఎలానూ ప్రయోజనకరం కాదు. కాబట్టి తన కవిత్వం ద్వారా ఎంతోకొంత యశస్సు మూటగట్టుకోవాలన్నదే ప్రతి కవీ కోరిక గా మారింది. ఇక మమ్మటుడు చెప్పిన మూడవ మాట ‘వ్యవహార విదే’ అన్నదానిలో సామాజిక ప్రయోజనం గురించీ, సామాజిక స్పృహ గురించీ చెప్పుకునే మాటలన్నీ వస్తాయి. కాని ఎవరు చెప్పినా ఆ మూడు మాటలతోటే ఆగిపోతారు. కాని ముఖ్యమైన మాట ఆ తర్వాత ఉంది. కావ్యప్రయోజనం ‘శివేతరక్షతి’ అన్నమాట. ఎంత గొప్ప మాట! శివేతరం అంటే శుభప్రదం కానిది, మంగళప్రదం కానిది- కావ్యం దాన్ని నశింపచేస్తుందని అలంకారికుడు చెప్తున్నాడు. ‘శివేతర క్షతి’. నిజానికి ప్రతి ఒక్క కవీ కోరుకోవలసింది ఇదే. అది శ్రోతతాలూకు అమంగళాన్ని పోగొట్టడం కన్నా ముందు కవి జీవితంలోని అమంగళాన్ని పోగొట్టాలి. ఒక కవిత అలా నాలోని శివేతరమైనదాన్ని క్షాళితం చేస్తుందని తెలిసిన తర్వాత, ఇక నేను కవిత్వ చరణాలు పట్టుకుని ఒక్కరోజు కూడా వదిలింది లేదు.
కవిత్వం నీ సంకల్పాల్ని శివసంకల్పాలుగా మారుస్తుంది. అది నీకొక లోకాతీత సన్నిధిని పరిచయం చేస్తుంది. కాబట్టే, ఎమిలి డికిన్ సన్ ఇలా అనగలిగింది:
The only news I know
Is bulletins all day
From Immortality.
నువ్వు కవివి కావడమంటే ఆ భగవత్సాన్నిధ్యపు వార్తాహరుడిగా మారడం. మరే వార్తలూ నీ చెవికెక్కకపోవడం.
ఒక కవిత రాయడమంటే మేల్కొల్పడం ప్రపంచాన్ని
ఇంకా ఎవరూ లేవకముందే నువ్వు నిద్రలేవడం
నిన్ను నువ్వు పరిశుభ్రపరుచుకోవడం, సమాయత్తపరుచుకోవడం
నీ ఆరాధ్యదేవతల్ని మేల్కొల్పడం, ప్రపంచానికి
మరికొంత ప్రాణశక్తిని ధారపొయ్యడం.
చీకట్లు ఇంకా విచ్చక ముందే నగరమధ్యంలో నిలబడి
బిగ్గరగా ప్రకటించడం, తెల్లవారుతోందని హెచ్చరించడం
సరికొత్త జీవితాన్ని ఆకాంక్షించడం
ఒక కవిత రాయడమంటే నిన్ను నువ్వు మేల్కొల్పుకోవడం
నిద్రపోతున్న ప్రపంచంతో రాజీపడకపోవడం
తిరిగి నీ పాతనిద్రకు జారిపోకపోవడం, లేవడం,
నడవడం, వెలిగించడం, మోకరిల్లడం, పదేపదే జపించినట్టుగా
తెల్లవారింది, తెల్లవారిందని నీకు నువ్వు చెప్పుకోవడం
ఓపిగ్గా ఒక కిరణం కోసం ఎదురుచూడటం
వెలుతురు చిందగానే పెన్నిధి దొరికినట్టు మురిసిపోవడం
ఒక కవిత రాయడమంటే మళ్లీమళ్లీ పుట్టడం
నువ్వు పుట్టి కొత్త ప్రపంచాన్ని స్వాగతించడం
(పునర్యానం, 5.1.4)
Poetry is a way of waking up the world, and
Rising up before everyone else.
Self-cleansing, getting ready, awakening your gods, and
Sharing some of your energy with the world.
Reaching the town square before dawn,
Ringing the morning bell, and
Beginning anew.
It’s about waking yourself up and
Keeping the world from sleeping.
Poetry is about staying awake;
Getting up, walking, kneeling, and
Repeating the morning mantra.
A poem is waiting for a light, and
The feeling of finding a treasure.
When you write a poem, you are born again, and
Everyone is born into a better world.
10-9-2023
మమ్మటుడి కావ్య ప్రయోజన శ్లోకం
కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేతర క్షతయే
సద్యః పర నిర్వృతయే కాంతాసమ్మితయోపదేస యుజే.
మొదటి సారి , ఆ తరువాత ఎన్నో సార్లు మా నారాయణ గౌడుగారి నోటి వెంట వింట వినియున్మాను. కానీ ఈ సుప్రభాతవేళ మనసులోని జ్ఞాన కోశాన్ని ఈ రోజు సవిస్తరంగా జాగృతం చేసింది.ఉషఃకాల నైర్మల్య చిత్తం గురించి బాపు చిన్నప్పుడు ‘మబ్బుల చదివితె మనసుకెక్కుతది’ అన్న మాట గుర్తు చేశారు. తెలిసినట్లనిపించడం వేరు. తెలియడం వేరు. అది మీవల్ల నెరవేరుతుంది. మీ కవిత లోని కావ్య ప్రయోజనం
“చీకట్లు ఇంకా విచ్చక ముందే నగరమధ్యంలో నిలబడి
బిగ్గరగా ప్రకటించడం, తెల్లవారుతోందని హెచ్చరించడం”
ఒకటి నిజం చదవటం ఒక ఎత్తైతే చదివిన వాళ్లను వినటం మరొక ఎత్తు. అది ‘గురుబుద్ధిర్విశేషతః’
శుభమంగళ సుప్రభాతం
ధన్యవాదాలు సార్. పరిపరి.
సరె,కవిత్వపు పుట్టుక సమయం సందర్భమూను
మరి ఆ కవిత్వం పాఠకుడికి ఎప్పుడు చేరువవుతుంది?
నిన్న మావూలు గా ఉన్న ఈ కవిత ఇప్పడు ప్రకంపనలు ఎందుకు తెప్పిస్తుంది.
కవి ఏ వేళలో ఏ ఉద్దేశంతో ఒక కవిత రాశాడో దాన్ని పాట కూడా చదవగానే ఆ వేళలూ, ఆ ఉత్తేజమూ కూడా అతనికి అందుతాయి.
ఒక మంచి కవిగా, మీరు కవితలు రాసే విధానం, మీరు పొందిన అనుభూతులను చాలా వివరంగా చెప్పారు ధన్యవాదములు.
ధన్యవాదాలు సార్
ఒక కవిత రాయడమంటే….ఎంత అద్భుతంగా
చెప్పారు సర్!
ధన్యవాదాలు మేడం