
ఈ మాట రవీంద్రకుమార శర్మ తరచూ చెప్తుండేవారు. భారతీయ సౌందర్య దృష్టిగురించి చెప్తూ, ఆ సౌందర్య దృష్టి భారతీయ జీవనవిధానాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో చెప్పేవారు. అదేమంటే, ఒకటి ఉంటే ఎక్కువ అనిపించకూడదు, ఒకటి లేకపోతే తక్కువ అనిపించకూడదు అని. ఆయన మన పూర్వకాలపు మట్టి అరుగుల ఇళ్ళ గురించి చెప్పేవారు. పేడతో అలికిన ఆ మట్టి అరుగుల మీద నువ్వొక చాప పరిచావా, దానిమీద రత్నకంబళి పరిచావా, అందమే, ఏమీ పరవలేదా, అతిథుల్ని ఆ మట్టి అరుగుమీద అలానే కూచోమంటూ ఆహ్వానించేవా, అదీ సంతోషమే. చాపవల్లా, కంబళివల్లా ఆ అరుగులకి వన్నె పెరగదు, అవి లేకపోతే వన్నె తరగదు. అలా తన ప్రసంగం కొనసాగించేక, చివరలో చెప్పేవారాయన: ఒక పూల చెట్టుమీద పక్షి వాలిందా, అందమే, ఏ పక్షీ వాలనే లేదా, ఆ పూలకొమ్మ అయినా ఆ పూలకొమ్మ అందమే.
ఇరవయ్యవ శతాబ్దంలో ఎగ్జిస్టెన్షియలిస్టులు చెప్పిందేమంటే, మనిషి ఉనికి, అంటే అతడి బీయింగ్ లో, ప్రాథమికంగానే ఒక వేదన ఉందని. మనం ఉంటున్నామంటేనే ఏదో చెప్పలేని వేదనకి, నిస్పృహకి లోనవుతున్నామని, దాన్ని ఏదో విధంగా పూరించడానికే అన్ని ప్రయత్నాలూ చేపడుతుంటామని. ఇంకా చెప్పాలంటే మనం ఒక dread కి లోనవుతూ ఉంటాము అని అంటారు వాళ్ళు. దాన్నుంచి తప్పించుకోవడానికే మనం అన్ని రకాల కార్యకలాపాలకీ పూనుకుంటాము అని చెప్తారు. కాని ఉపనిషత్తు దృష్టిలో అస్తిత్వసారాంశం ఆనందం. నువ్వు ఉంటున్నావంటేనే ఒక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నావని అర్థం. దీన్నే మరోలా చెప్పాలంటే, ఎప్పుడు నీ ఆత్మ ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేకపోతోందో, అప్పుడు నువ్వు ఉండటం లేదన్నట్టు. అది మృతి. ఉపనిషత్తు అమృతం గురించి మాట్లాడింది. అమృతం అంటే చావు లేకపోవడం కాదు, అసలు చావు గురించిన భయం లేకపోవడం. నీ దగ్గర మరణించడానికి మరేమీ మిగలకపోవడం.
మనందరికీ మన జీవితాల్లో కొన్ని క్షణాలు లభ్యమవుతాయి. అప్పుడు మనకి మరే స్పృహా ఉండదు. జీవితాన్ని నిండుగా జీవించిన ఒక తృప్తి మనలోపల ఆవరించడం మనం అనుభవంలో గ్రహిస్తాం. అటువంటి క్షణాలు తెంపులేకుండా నీ జీవితమంతా పరుచుకోగలవు, చూడు అనే ఉపనిషత్తు చెప్తుంది. బహుశా అందుకు కావలసింది, ‘అదే నేను’ అనే మెలకువ. ‘నేను తప్ప మరొకటి లేదు’ అనే ఎరుక. నేను తప్ప రెండవది మరొకటి లేదని నిశ్చయమైనప్పుడు దేన్ని చూసి భయపడవలసి ఉంటుంది?
తైత్తిరీయ ఉపనిషత్తులో ఆనందవల్లి గురించి రాస్తూ డా.రాధాకృష్ణన్ సుత్తనిపాతంలోని రతన సుత్తలో బుద్ధుడు చెప్పిన మాట ఒకటి ఉదాహరించాడు. ‘నిబ్బుతిం భుంజమానా..’ అనే వాక్యం. అంటే ఎవరు తృష్ణ నుంచి బయటపడతారో వారు నిర్వాణాన్ని ఆస్వాదిస్తారు అని. గొప్ప మాట. ఆనందానికి ఒకటే దారి, దేని మీదా ఆధారపడకపోవడమే. దేని గురించీ ఎదురుచూడకపోవడమే. అలాగని ప్రతి ఒక్కటీ దూరంపెట్టాలని కాదు, నీ గృహాంగణాన్ని శూన్యం చేసుకోవాలని కాదు. ఎవరేనా వచ్చేరా, సంతోషమే, రాలేదా, సంతోషమే. సుందర శాఖాగ్రాన పక్షి వచ్చి వాలిందా, సుందరమే. ఏ పక్షీ వచ్చి వాలలేదా, అయినా సుందర శాఖాగ్రం సుందరమే, కించిత్తు కూడా దాని శోభ కొరవడదు.
ఇటువంటి మెలకువలు కలిగిన క్షణాలే పునర్యానం అయిదో అధ్యాయంలో కవితలన్నీ.
ఈ ఉదయమింకా ఎవరో రావలసి ఉంది,
తలుపులు తెరిచిపెట్టుకున్నాను, ఇంకా రాత్రి దీపాన్నట్లానే వెలగనిస్తున్నాను.
కొమ్మల్లో మొగ్గలు కళ్లు విప్పుకుంటున్నాయి
బాటకిరువైపులా చెట్లమీద గాలులెప్పుడో మేల్కొన్నాయి.
రావలసిన వారెవరో తప్పక రావలసే ఉంది, వారొస్తారు
తప్పక నా కోసమని పదే పదే చెప్పుకున్నాను.
పరిశుద్ధ స్వప్నాలతో, గాఢ సుషుప్తితో
రాత్రి నా జీవితాన్ని ఫలప్రదం చేసింది.
ఇప్పుడెవరి మీదా ఫిర్యాదులు లేవు, ఎవరి పట్లా
అపార్థాలు లేవు, ఏ కొత్త సంతోషాన్నో ఇంకా
ఎవరో ఇవ్వకుండా దాచిఉంచారన్న నిట్టూర్పు లేదు.
ఎవరూ నాకేదీ బకాయి పడలేదని, నేనెవరికీ
ఇంకేదీ ఋణపడిలేనని నిశ్చయమయింది నాకు.
రావలసినవారు వచ్చారా, వేకువకు మరింత శోభ చేరుతుంది.
సుందరశాఖాగ్రాన ఒక చిలకవాలడం లాంటిదది,
ఎవరూ రానేలేదా, వేకువ వన్నె తరగదని కూడా నిశ్చయమయింది నాకు.
విహంగం వాలకపోయినా సుందరశాఖాగ్రం సుందర శాఖాగ్రమే.
(పునర్యానం, 5.1.2)
This morning, someone has yet to arrive,
My doors were left open, and I left the night lamp on.
Buds are opening up on branches, and
Trees are already waking up to the breeze.
People who should have come would come, and
They will, I told myself.
Pure dreams and deep sleep filled the night
No more grudges, no misunderstandings.
I no longer complain about being denied happiness.
There is nothing I owe and no one owes me anything.
The mornings are sweeter when the expected arrives,
Like a parrot reaching for a flowering tree.
The morning is still beautiful even if no one comes.
Even if the bird doesn’t perch,
The tree looks as lovely as ever.
10-9-2023
పరిశుద్ధ స్వప్నాలు!!!
ఏం మాట! ఏం మాట!
నిద్ర ఒక్కటీ సరిగా ఉన్నా నీ జీవితం ఫలప్రదం అవుతుంది అనగల కవి కి…వందనం! వందనం!
Sir, I am your fan!
ధన్యవాదాలు మానసా!
అమృతం అంటే చావు లేకపోవడం కాదు, అసలు చావు గురించిన భయం లేకపోవడం. నీ దగ్గర మరణించడానికి మరేమీ మిగలకపోవడం.
మీరు రోజూ రాస్తూ ఉన్నది నాకు ఒక ఉపనిషత్తు లాంటిదే గురువుగారు…💐
ధన్యవాదాలు సోమ భూపాల్!
ఈ రోజంతా మీ మాటల మాధుర్యం నన్ను ఆవహించి ఉంటుంది. ఎన్ని చకితం చేసే భావనలు.. పదాలు.. వాక్యాలు.. great సర్ 👍
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
క్రమం తప్పకుండా చదివేలా చేస్తున్నాయి మీ postings.
ధన్యవాదాలు మేడం
భారతీయ సౌందర్య దృష్టిని నిక్షిప్తం చేస్తూ రాసిన కవిత అనుభూతి పుటలకెక్కింది. అనువాదం అన్యాపదేశ శిక్షణను అలవరుస్తుంది. అభినందనలు.
ధన్యవాదాలు సార్
సుందరశాఖాగ్రం
ధన్యవాదాలు సార్
ఎవరూ నాకేదీ బకాయి పడలేదని….ఈ భావం
చాలేమో నిరంతర ఆనందానికి.
అద్భుతమైన విషయాలను వివరించి చెబుతున్న మీకు ధన్యవాదములు సర్!
ధన్యవాదాలు మేడం
I still await someone to come
I kept the door open , night lamp lit .
Buds on the plants lazily yawn
Waking up to a new dawn .
Trees are making music in the
Morning breeze.
Couldn’t resist . Active voice gives a personal tone Sir 🙏
Thank you so much
“ ఎవరూ నాకేదీ బకాయి పడలేదని, నేనెవరికీ
ఇంకేదీ ఋణపడిలేనని నిశ్చయమయింది నాకు”
“కురై ఒండ్రుం ఇల్లై” phrase గుర్తొచ్చింది.
Thank you for this post, sir.
ధన్యవాదాలు మాధవీ!