పునర్యానం-39

పునర్యానంలోని మూడు, నాలుగు అధ్యాయాలు మనోమయకోశంలోకి, విజ్ఞాన మయ కోశంలోకీ ప్రయాణాలు. ఆ రెండు అధ్యాయాలూ కూడా సర్గలుగానూ, విడి కవితలుగానూ ఉన్నప్పటికీ, విడిగా ఏ ఒక్క కవితను పరిచయం చెయ్యాలన్నా మొత్తం అధ్యాయాన్నంతటినీ పరిచయం చెయ్యవలసి ఉంటుంది. మనసుకీ, జ్ఞానానికీ ఉన్న సమస్యే అది. అవి గడ్డివేళ్ళలాగా అల్లుకుపోయి ఉంటాయి. ఆ దుబ్బులో ఒక్క వేరుని పెళ్ళగించాలనుకున్నా దాన్ని అంటిపెట్టుకుని మొత్తం దుబ్బంతా కదిలి వస్తుంది.

తైత్తిరీయ ఉపనిషత్తులో భృగువల్లిలో చివరి కోశం ఆనందమయ కోశం. అది అన్నం నుంచి ప్రాణానికీ, ప్రాణం నుంచి మనస్సుకీ, మనస్సునుంచి విజ్ఞానానికీ ప్రయాణించేక మనిషి చేరుకోవలసిన చివరిమెట్టు.
ఆనందమంటే ఏమిటి? ఆనందాన్ని ఉపనిషత్తు మళ్ళా రెండుగా విడదీసింది. ఒక ఆరోగ్యవంతుడైన యువకుడు తన జీవితంలో తన ఇంద్రియాలతో, తన సంకల్పాలతో, కార్యాలతో, విజయాలతో పొందే ఆనందం ఒకటి. ఉపనిషత్తు దాన్ని మానుషానందం అంది. కాని దానికన్నా ఎన్నో రెట్లు అధికమైంది దివ్యానందం. అది ఈ ప్రపంచం నుంచే పొందేదేగానీ, ఈ ప్రపంచపు కొలతలకు అందేది కాదు. అది సాఫల్య, వైఫల్యాలకు అతీతమైంది. అన్ని రకాల లెక్కలకీ అవతలది. కబీరు అంటాడే ‘నువ్వు వెళ్ళబోయే దేశంలో సంతలూ, దుకాణాలూ ఉండవు’ అని. అట్లాంటి దేశానికీ, లోకానికీ చెందిన అనుభూతి అది.

పునర్యానంలో రెండు, మూడు అధ్యాయాల్లో నేను ఈ లోకంలో అనుభవించిన నరకాన్ని ఏదో ఒక రూపంలో కవిత్వంగా మార్చడానికి ప్రయత్నించాను. ఆ దుఃఖానికి కారణాల్ని నాలుగో అధ్యాయంలో అన్వేషించడానికి ప్రయత్నించాను. అప్పటికి నేను చదివిన ప్రపంచ తత్త్వశాస్త్రాలన్నిటినీ ఆ అధ్యాయంలో తడిమిచూసాను. అందుకనే, ఆ కావ్యాన్ని సమీక్షిస్తూ మిత్రుడు జి.ఎస్. రామ్మోహన్ తన సమీక్షకి ‘వీరభద్రుడి విశ్వరూపం’ అని పేరుపెట్టాడు. కాని ఆ పుస్తకాలూ, ఆ తత్త్వశాస్త్రాలూ ఏవీ నాకు సమాధానాన్నివ్వలేదు. నాకు ఈ లోకం పట్ల నమ్మకం కలిగించే తావులకోసం, జ్ఞాపకాల కోసం, మనుషుల కోసం, మాటలకోసం వెతుక్కుంటో అయిదో అధ్యాయాన్ని మొదలుపెట్టాను.

మొదటి నాలుగు అధ్యాయాలూ పృథ్వి, అగ్ని, రసం, మరుత్తులకి సంకేతం కాగా, అయిదో అధ్యాయానికి ఆకాశాన్ని సంకేతంగా తీసుకున్నాను. ఆనందమూ, ఆకాశమూ పర్యాయపదాలుగా నన్ను బతికించే క్షణాలకోసం వెతుక్కున్నాను. ఎందుకంటే ఉపనిషత్కారుడే అన్నాడు ‘ఆకాశః పరాయణమ్’ (ఆకాశమే దిక్కు) అని.

ఆ అధ్యాయంలో మొదటి సర్గలో మొదటి కవిత ఇది.


సుప్రభాతం మేల్కొల్పుతున్నది నగరాన్ని, తుడిచిపెడుతున్నది మిగిలిన చీకట్లని
వేకువ సమాజుతో సర్వేశ్వరుణ్ణి మేలుకొల్పుతున్నదాకాశం
ఎవరి ప్రార్ధనలతో వారు తమ మహత్వాన్ని మేలుకొలుపుకుంటున్నారు,
ఒకరి ప్రార్ధనతో మరొకరిని మేల్కొల్పుతున్నారు

ప్రత్యూషపవనాలమీద పయనిస్తున్న ప్రార్ధనలతో
కొత్తరోజు మొదలవుతున్నది, ప్రారంభమిది
మరొక సమాగమానికి, నిన్న మిగిలిపోయి­న కొంతపనిని
పూర్తి చేసుకోవడానికి; ప్రారంభమిది, రేపటికోసం
కొత్త పని మొ­దలుపెట్టడానికి; పిల్లలకోసం
ప్రపంచాన్ని మరికొన్నాళ్లు పొడిగించడానికి; నివేదనతో
వినయంగా మోకరిల్లడంతో

ఒక హారతితో, ఒక శంఖధ్వానంతో మొదలుపెట్టుకుంటున్నది
తన జీవితాన్ని నగరం; మేలుకొనమని అర్ధిస్తున్నది
తనలోని దైవత్వాన్ని; ఇక నెమ్మదిగా తాజా కూరగాయలతో,
ఫలాలతో, పూలమాలలతో నగరం నిండిపోతుంది.

తమ తమ బంధువుల కోసం, స్నేహితుల కోసం రైల్వే స్టేషన్లలో
పొద్దుటిపూట ఆగే రైళ్లనుంచి ప్రేమతో, కుశలప్రశ్నలతో
దిగుతున్నారెందరో, నగరాకాశం మీద తొలి అరుణరేఖ
మంగళవా­ద్యంలా అవరించింది; పరిశుభ్రవేళ ఇది,
నిష్కల్మష సందర్భమిది, మనుషులు తమకోసం తామొక
పరిశుద్ధ జీవితాన్ని వాగ్ధానం చేసుకుంటున్న శుభము­హూర్తమిది

(పునర్యానం, 5.1.1)


As morning breaks, the city wakes up and
Dusting off the last traces of night.
The prayers of Fazr awaken the Almighty.
Everyone is awakening their inner heart, and
The prayers of each are waking up the other.

Morning breezes carry kind thoughts
Time to complete yesterday’s work and begin anew.
This ancient world gets one more day.

With burning incense, blowing conchs, and kneeling before the sky,
The city awakens the God within.
Slowly, vegetables, fruits, and flowers begin to fill the streets.

As people arrive on trains, planes and buses in the morning,
With smiles and flowers, friends and family greet them.
Like the sound of the temple drum
An orange glow filled the sky.

An hour of promised piety, unfettered time, and
Moments of purity.

9-9-2023

10 Replies to “పునర్యానం-39”

 1. ఒక నమాజు ఒక సుప్రభాతం ఒక ప్రార్థన
  వేకువ కడ మోకరిల్లిన దృశ్యం అనుభూతి సాంద్రం.
  సహజోదయ సన్నివేశాలు గృహాలు వీథులు ప్రయాణ ప్రాంగణాలు ఉదయపు ఉడుపుల
  ఉద్వేగాల్లో మనసంతా ఒకనాటి ఉదయాన్ని
  నింపారు కవితలో .
  ‘ఎవరి ప్రార్ధనలతో వారు తమ మహత్వాన్ని మేలుకొలుపుకుంటున్నారు,
  ఒకరి ప్రార్ధనతో మరొకరిని మేల్కొల్పుతున్నారు’
  అద్భుతమైన విశ్లేషణ. 🙏

 2. అబ్బ…ఏమి వర్ణన.
  అవును. నిజమే.
  వీరభద్రుడి విశ్వరూపం!

 3. మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తోంది. పునర్యానం ఒక అద్భుతం.
  అయాచితంగా అందిన అపురూపమైన కానుక.

  మీరిట్లా నేపథ్యాలు చెప్తుంటే, మంత్ర రహస్యాలు విన్నట్టుంది.
  Thank You!

 4. అబ్బ! ఎంత అమోఘం అపూర్వం అద్భుతం! నా గుండె పట్టడం లేదు. డాబా మీద గట్టిగా కాదు గాఆఆఆఆఆఠఠ్ఠిగా….అరిచాను.ఆనందంతో మూర్ఛిల్లాను.

 5. ప్రతి ఒక్కరూ తమలోని దానవత్వాన్ని తమలోనే
  సంహరించుకొని
  తమలోని దైవత్వాన్ని మాత్రమే మెల్కొల్పు కోవాలి.
  అప్పుడే లోకానికి సుఖమూ,శాంతి.
  అంతులేని అమృతానందం.

  ఒక ఉదయానికి మేల్కొలుపు ఎంత గొప్పగా పాడారు sir.
  కడుపు నిండిపోయింది. కలం (కరం) లో ఉంది
  సిరా కాదు అమృతం.
  నమోనమః 🙏🙏🙏🌹🌹🌹

Leave a Reply

%d bloggers like this: