శ్రీకృష్ణలీలా తరంగిణి

ఉయ్యూరులో శ్రీవిద్యానిలయం వారు ప్రతి ఏటా మహాశివరాత్రి, శ్రీకృష్ణాష్టమి వేడుకలు చేస్తుంటారు. కృష్ణాష్టమికి కృష్ణసంబంధమైన ప్రసంగాలు, సంకీర్తన కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఆ నిలయాన్ని స్థాపించిన శ్రీరామ్ గారు పరమాచార్య శిషులు. పరిత్యాగి. నేను వారి దృష్టిలో ఎలా పడ్డానోగాని, ఇరవయ్యేళ్ళ కిందట నన్ను ఒక ప్రసంగం చేయమని పిలిస్తే వెళ్ళాను. ఆ రోజు మధురభక్తి గురించి మాట్లాడేను. మళ్లా పదేళ్లకిందట మరొకసారి పిలిచారు. చాలా కాలం తర్వాత మళ్లా ఈ కృష్ణాష్టమికి కూడా అహ్వానిస్తే నిన్న వెళ్ళాను. శ్రీకృష్ణలీలా తరంగిణి కావ్యం గురించి మాట్లాడేను.

ఇలాంటి ఆహ్వానాలు, అవకాశాలు అన్నిటికన్నా ముందు నా మనః ప్రపంచాన్ని మరింత ప్రక్షాళనం చేసుకోడానికీ, మరింత రస్మమయమొనర్చుకోడానికీ పనికొస్తాయి. ఎందుకంటే, నారాయణ తీర్థులు తన కావ్యం గురించి చెప్పుకుంటూ ‘కలి కల్మష నాశనం, కామిత ఫలనిదానం, నారాయణీయ చరితం, నారాయణ తీర్థగీతం’ అని రాసుకున్నారు. ఒకప్పుడు జయదేవుడు కూడా తన గీతగోవింద కావ్యం గురించి ‘శ్రీ జయదేవ భణిత హరిరమితం, కలి కలుషం జనయతు పరిశమితం’ అని అన్నాడు. ఇద్దరు వాగ్గేయకారులూ కలి కల్మషం అణచేవిగా తమ కావ్యాల్ని పేర్కోవడంలో అణుమాత్రం కూడా అతిశయోక్తి లేదని, ఆ గీతపఠనం చేసిన ప్రతిసారీ నాకు మళ్ళీ మళ్ళీ స్ఫురిస్తూనే ఉంటుంది.

ఇంతకీ కలి అంటే ఏమిటి? మసక. నీ ఆలోచనల మీద, నీ అనుభూతి మీద, నీ సంకల్పాల మీద పరుచుకునే నల్లని నీడ. పొద్దున్న లేచినప్పటినుంచి మన అనుభవం ఏమిటి? ముక్కలు ముక్కలు అవుతూ ఉండటం. ఎవడో ఏదో అంటాడు, ఎవరో ఏదో రాస్తారు, నీ ప్రమేయం లేకుండానే నిన్నెవరో ఏదో గ్రూపులో చేరుస్తారు. అక్కడేదో ద్వేషపర్వం నడుస్తూ ఉంటుంది. అసలు మీడియాకీ, సోషల్ మీడియా కీ ఉన్న లక్షణమేమింటే అవి నిన్ను provoke  చేస్తాయి. నువ్వు ఏదో ఒకటి అనేలాగా చేస్తాయి. ప్రశాంతంగా ఉన్న సరసులోకి ఎవరో ఒక రాయి విసిరినట్టుగా నువ్వు చెల్లాచెదురైపోతావు. సరిగ్గా ఇలాంటి కావ్యాల సాన్నిధ్యం మనకి ఇలాంటప్పుడే అవసరం. అవి శకలాలుగా చిట్లిపోయిన మనల్ని ఒద్దిగా, ఓపిగ్గా తిరిగి దగ్గరకు చేరుస్తాయి. మసకబారుతున్న మన మనసునీ, హృదయాన్నీ ఒక గుడ్డపెట్టి తుడిచి మనల్ని మళ్లా చక్కదిద్ది మనకి మనల్ని అప్పగిస్తాయి.

ఇదే చెప్పాను, నిన్న. ఎందుకంటే, ఈ noise ని దాటిన music ఒకటి విన్నారు వాళ్ళు, శ్రీమద్భాగవతకర్త, జయదేవుడు, లీలాశుకుడు, ముకుందమాల, నారాయణీయాలు రాసిన కవులు, అలాగే నారాయణ తీర్థులు కూడా. నిజంగానే బృందావనంలో ఆ రెల్లుపొదలమధ్యనుంచి వినవచ్చే ఆ వేణుగానాన్ని విని గోపికలెట్లా సమస్తం విడిచిపెట్టి, ఆ నవనీతచోరుడి వెనక పడ్డారో, ఈ కవులు కూడా అట్లానే ఒక మురళీసంగీతం వెనక పడ్డారు. అది వాళ్ళ జీవితాల్ని వెలిగించింది. ఇప్పుడు, ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా, ఆ కావ్యాల్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకున్నా వాళ్ళ జీవితాల్ని కూడా వెలిగిస్తుంది. తన కావ్యం ముగిస్తూ నారాయణ తీర్థులు ఇలా అన్నారు:

కామదా కామినామేషా ముముక్షూణాం చ మోక్షదా
శృణ్వతాం గాయతాం భక్త్యా కృష్ణలీలా తరంగిణీ

(ఈ కృష్ణలీలా తర్గంగిణి కావ్యాన్ని విన్నా, పాడుకున్నా కూడా కోరికలున్నవాళ్ళకి కోరికలు తీరతాయి, కోరికలనుంచి బయటపడాలనుకున్నవాళ్ళకి విడుదల దొరుకుతుంది)

నిజమే. ఈ గీతాలు నీకు జీవితం పట్ల ఇష్టాన్నేనా పెంపొందిస్తాయి లేదా ఈ ఇష్టాయిష్టాల్ని దాటిన స్థితికేనా ప్రయాణిస్తాం. గొప్ప కవిత్వానికంతటికీ ఈ మాటలు వర్తిస్తాయి. ‘ఈ ప్రపంచానికి దగ్గర కావడానికేనా లేదా ఈ ప్రపంచం నుంచి విముక్తం కావడానికేనా కవిత్వమే శరణ్యం’ అని గొథే అన్నాడని డి.జె. ఎన్ రైట్ రాసిన వాక్యాలు నలభయ్యేళ్ళకిందట చదివినవి నేనెప్పటికీ మరవలేను.

నిన్న మళ్ళా కృష్ణలీలా తరంగిణి మీద మాట్లాడటానికి కూచున్నప్పుడు గీతగోవింద కావ్యం లో కన్నా కూడా అందులో విస్తృతీ, వైవిధ్యం మరింత ఉన్నాయనిపించింది. ఆ మాటే చెప్పాను అక్కడ. గీతగోవింద కావ్యానికి జీవితకాల ఆరాధకుడిగా నేనా మాటలు చెప్పడం నాకే ఆశ్చర్యమనిపించింది. కానీ ఏం చెయ్యను? కృష్ణలీలాతరంగిణి మహిమను నేనిన్నాళ్ళూ గుర్తించవలసినట్టుగా గుర్తించలేదేమో అనిపించింది.

గీతగోవిందం రాధాకృష్ణ ప్రణయగీతం. మధురభక్తి శాస్త్రం. అందులో మొత్తం పన్నెండు సర్గలు, ఇరవై రెండు గీతాలు, డెబ్భై రెండు శ్లోకాలు ఉన్నాయి. రాగాలు మొత్తం ఇరవైకి మించి లేవు. ఆ కావ్యమంతా కేశవకేళి రహస్యం. కృష్ణాకర్ణామృతం బాలకృష్ణ లీల. కానీ కృష్ణలీలాతరంగిణి కృష్ణజననంతో మొదలై రుక్మిణీ కల్యాణందాకా మొత్తం దశమస్కంధమంతటినీ కావ్యంగా మార్చిన రచన. అంటే కృష్ణకర్ణామృతం, గీతగోవిందాలు కలిపినా కూడా ఇంకా గానం చేసిన చరిత్ర చాలానే ఉందన్నట్టు. అందుకనే ఆ కావ్యంలో మొత్తం 156 కీర్తనలు, 267 శ్లోకాలు (కొందరి లెక్కలో 348), ఇవి కాక, 30 దరువులు, 30 గద్యలు, సంభాషణలు, సంవాదాలు. దాదాపు 39 రాగాలు. బహుశా శ్రీకృష్ణలీలా సర్వస్వం అని చెప్పవచ్చు. ఇంత విస్తృతమైన, ఇంత వైవిధ్యంతో కూడిన సంగీత కావ్యం భారతీయ సాహిత్యాల్లోనే మరొకటి లేదని చెప్పవచ్చు.

అంతేనా? అదొక యక్షగానం. ఆ కావ్యం మీద ఉన్న తెలుగుముద్ర అది. ఆయన తెలుగు వాడు. కృష్ణాతీరవాసి. కాజ ఆయన పుట్టిన ఊరు. మరాఠాల ఏలుబడిలో ఉన్న తంజావూరు ఆయన్ని ఆహ్వానించింది. తిరువయ్యారు దగ్గర వరాహూరు వేంకటేశ్వరుడు ఆయన్ని తన దగ్గరకు రప్పించుకున్నాడు. ఈ కల్యాణకావ్యాన్ని ఆయన కావేరి ఒడ్డున రాసాడు. కాని ఆ గీతాల్లో ప్రవహిస్తున్నవి కృష్ణాజలాలే.

అసలు అన్నిటికన్నా ముందు నన్ను ఆశ్చర్యపరిచేది వ్యాసుడు, జయదేవుడు, లీలాశుకుడు వంటి సంస్కృత కవులు గానం చేసాక, ఎర్రన, సోమన, పోతన, రామకృష్ణకవి, అన్నమయ్యలాంటి కవులు తెలుగులో అపారకావ్య, గీత సాహిత్యం సృష్టించి ఉన్నాక, మళ్ళా ఆయన ఎంత ఆత్మవిశ్వాసం లేకపోతే, ఆయన పారవశ్యానికి ఎంత అవధిలేకపోతే, అటువంటి కావ్యరచనకు పూనుకుని ఉంటాడు!

త్యాగరాజ స్వామికి దారి చూపిన కవి అని సంగీత కారులు కొనియాడుతున్నారు గాని, సాహిత్యకారులు, రసజ్ఞులు కృష్ణలీలాతరంగిణిని ఒక కావ్యంగా చర్చించడం నేను చూడలేదు. ఈ ‘నవనీత చోరబాలకచరిత’ లో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, నాట్యం ఉంది, నాటకం ఉంది, నామజపం ఉంది, నివ్వెరపరిచే ప్రయోగాలు ఉన్నాయి. కాని లేనిదల్లా, దానికి సాహిత్యవారసులు. గీతగోవింద కావ్యం గురించి రాస్తూ బార్బరా స్టోలర్ మిల్లర్ ఒక మాట అంది. అప్పటికి దాదాపుగా కొనప్రాణానికి చేరుకున్న వైష్ణవానికి గీతగోవిందం ప్రాణం పోసి నవ్యవైష్ణవంగా మార్చేసిందని. ఆ తర్వాత చైతన్యమహాప్రభువునుంచి రామకృష్ణ పరమహంస దాకా ఒక భావుక పరంపర ఆ కావ్యారాధనలో మునిగితేలారు. అటు బృందావనంలో, ఇటు పూరీలో, దక్షిణాదిన గురువాయురప్ప దేవాలయంలో, అష్టపదులు వినిపించనిదెక్కడని? కాని కృష్ణలీలాతరంగిణి ని కూచిపూడి భాగవతులు తప్ప మరెవ్వరూ నెత్తిన పెట్టుకున్నవాళ్ళు లేరు. ఇప్పుడు దక్షిణాదిన వరహూరులోనూ, తిరుపుందుర్తిలోనూ నారాయణతీర్థ ట్రస్టులు ఏర్పాటయ్యాక యేసుదాసు లాంటివారు ఆ గీతగానం మొదలుపెట్టకపోలేదు. కాని ఆ గీతాలు ముందుపాడుకోవలసింది మనం కదా!

సంగీతం సరే, అందులో సాహిత్యం గురించి మాట్లాడుకోవాలి కదా. నారాయణ తీర్థులు ఆ గీతాల్లో తనని తాను ‘వరనారాయణతీర్థ’, ‘శివనారాయణతీర్థ’, ‘యతి నారాయణతీర్థ’, ‘ముని నారాయణతీర్థ’, ‘భక్త నారాయణతీర్థ’, ‘శివనారాయణతీర్థ’, ‘సరస నారాయణ తీర్థ’, ‘నందిత నారాయణ తీర్థ’ -ఇలా పలువిధాలుగా వర్ణించుకున్నాడు. కాని ఎక్కడా కవి నారాయణ తీర్థ అని చెప్పుకోలేదు. కవి అంటే ఏముంది? ఒక శ్లోకం రాస్తే చాలు, కవి. కాని నిజమైన కవి లోనుకాగల సకలావస్థలకీ ఆయన లోనయ్యాడు కాబట్టే, అన్ని విశేషణాలు చెప్పుకున్నాడు. కావ్యాంతానికి వచ్చేటప్పటికి ఎంత స్పష్టంగా చెప్పుకుంటున్నాడో చూడండి:

శ్రీ గోపాల ఘనాదపార కరుణాపీయూషధారా సృతా
యా నారాయణతీర్థ భూధర పరిక్షిప్తా సమస్తా తదా
సంభూయాచ్యుత భక్తభూమిషు వహంత్యానందయంతీ జగత్
పావిత్య్రం విధునోతు కృష్ణవిలసల్లీలా తరంగిణ్యసౌ.

(శ్రీకృష్ణుడే మేఘం వర్షించిన దయామృతధార నారాయణతీర్థుడనే పర్వతం మీద పడింది. అక్కణ్ణుంచి అది కృష్ణలీలావర్ణనమనే నదిగా మారి లోకాన్ని ఆనందింపచేస్తూ విష్ణుభక్తులనే పొలాలమీద ప్రవహిస్తున్నది. ఆ నదిని ఎవరు చేరుకుంటే వారి మలినాలు తొలగిపోవు గాక!)

నిన్న నా ఎదట ఉన్న శ్రోతలకి ఆ కావ్యంలోని సాహిత్యమాధుర్యాన్ని ఎలా వివరించాలో తెలియలేదు. నేనొక గాయకుణ్ణి కానందుకు ఎంతో చింతించాను. కాని పదే పదే ఒక్కమాట చెప్పాను – కృష్ణలీలా తరంగిణి సంస్కృతంలో రాసినట్టుండే తెలుగు కావ్యం అని. అది పోతన్న పద్యాల్ని కీర్తనలుగా చదువుతున్నట్టుంటుంది. అదే సునాదమాధురి, అదే యమకాలంకారం- నేను చెప్తున్నది సుబోధకంగా ఉండటానికి, ఈ కీర్తన చదివి వినిపించాను. చూడండి:

కృష్ణం కలయసఖి, సుందరం
బాలకృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం గతవిషయ తృష్ణం జగత్ప్రభ
విష్ణుం సురారిగణ జిష్ణుం సదా
బాలకృష్ణం కలయసఖి సుందరం

నృత్యంత మిహముహు రత్యంత మపరిమిత
భృత్యానుకూల మఖిల సత్యం సదా
బాలకృష్ణం కలయసఖి సుందరం

ధరం భవజలధి పారం సకలవేద
సారం సమస్తయోగి తారం సదా
బాలకృష్ణం కలయసఖి సుందరం

శృంగారరసభర సంగీత సాహిత్య
గంగాలహరీ ఖేల సంగం సదా
బాలకృష్ణం కలయసఖి సుందరం

రామేణ జగదభిరామేణ బలభద్ర
రామేణ సహావాప్తకామేన సదా
బాలకృష్ణం కలయసఖి సుందరం

రాధారుణాధర సుధాపం సచ్చిదానంద
రూపం జగత్త్రయ భూపం సదా
బాలకృష్ణం కలయసఖి సుందరం

దామోదర మఖిల కామాకరం ఘన
శ్యామాకృతిమసుర భీమం సదా
బాలకృష్ణం కలయసఖి సుందరం

అర్థం శిథిలీకృతానర్థం శ్రీనారాయణ
తీర్థపరమపురుషార్థం సదా
బాలకృష్ణం కలయసఖి సుందరం

మనం గాయకులం, నర్తకులం కాకపోయినా పర్వాలేదు. సంస్కృత పదాలకి అర్థం తెలియకపోయినా పర్వాలేదు. ఆ గీతాలు గట్టిగా చదువుకుంటే చాలు. తన గీతాల గురించి చెప్తూ జయదేవుడు-

శ్రీ జయదేవ భరితమిదమధికం యది మనసా నటనీయం
హరి విరహాకుల పల్లవ యువతి సఖీ వచనం పఠనీయం

అని అన్నాడు. ఆ మాట కృష్ణలీలా తరంగిణి కి కూడా వర్తింపచెయ్యవచ్చు. ఆ గీతాల్ని గొంతెత్తి చదువుకున్నా చాలు, మన మనోవేదిక పైన ఒక యక్షగానం మొదలైనట్టే ఉంటుంది.

8-9-2023

17 Replies to “శ్రీకృష్ణలీలా తరంగిణి”

 1. “ఈ ప్రపంచానికి దగ్గర కావడానికేనా లేదా ఈ ప్రపంచం నుంచి విముక్తం కావడానికేనా కవిత్వమే శరణ్యం”…

  ఎన్నో పుస్తకాలు చదివిన అనుభవసారం!
  కవిత్వాన్ని ఔపోషన పట్టిన నీరాజనం!!

  శుభోదయం…సర్.

 2. మీ లేఖినికి కొత్తదనం సహజంగా వచ్చినట్లుంది.

 3. ఆ యక్షగానాన్ని మాకు ప్రత్యక్ష గానం చేసారు
  కృష్ణం కలయసఖి సుందరం

 4. మీ వ్యాసం చదివితే కూడా చూపు స్పష్టమవుతుంది!
  గీతగోవిందం, కృష్ణ కర్ణామృతం, కృష్ణ లీలాతరంగిణి… మూడిటినీ పోల్చి చూపుతూ రాయడం బావుంది వీరభద్రుడుగారూ! పిల్లలతో కలసి తమిళనాడు నుంచి కర్ణాటకకు కారులో ప్రయాణిస్తూ మీ వ్యాసం పైకి చదివాను. శ్రద్ధగా విన్నారు. మీకు ధన్యవాదాలు!

 5. మధురం. మీ రాత లో ఏవో తరంగాలు ఉయ్యాలలూపుతాయి. గతంలో మీరు కాజ లోని నారాయణ తీర్ధుల దేవాలయాన్ని సందర్శించి రాసినట్లు గుర్తు.
  ‘మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్’ అన్నట్లు ముందే నిర్ణయించేసుకుని బ్రతకడం చూస్తే బాధగా ఉంటుంది. కలి కల్మషం మన వాళ్ళకే ఎక్కువ. వొకడు నానాచావు చచ్చి ఆస్కార్ అవార్డు సాధిస్తే ’80 కోట్లు ఉంటే ఎవడైనా ఆస్కార్ తేవచ్చు ‘ అనగల భావ దారిద్ర్యపు గుండె ధైర్యం మనవాళ్ళ సొంతం. త్యాగరాజ భాగవతార్ కు ఇతరులు చేసే సేవ చూసి కూడా అంతకంటే కాస్త తక్కువ చేసే సంగీత రసికులు మనవాళ్ళు.
  కాకతీయ ‘జాయ సేనాపతి’ ఎంతటి ప్రతిభా మూర్తి.. రుద్రమ మగ వేషానికి పిల్లనిచ్చిన తండ్రిగా ఆయనను చూపడం ఎంత ఘోరం..
  ఇలా చెప్పుకుంటూ పోతే.. వందల ఉదాహరణలు చెప్పవచ్చు. మీ ప్రయత్నం గొప్పది. నారాయణ తీర్థులు వారిని పోతన తో పోల్చడం మధురం సర్.

 6. గోరకవి కృష్ణ సంపత్ కుమార్ గారు వారి వంశపారంపర్యంగా కృష్ణ లీలా తరంగాలను గానం చేస్తూ, జన బాహుళ్యానికి దగ్గర చేస్తున్నారు. నా పూర్వజన్మ సుకృతం కొలదీ వారి వద్ద ఇప్పుడు ఈ లీలా తరంగాలను నేర్చుకునే భాగ్యం కలిగినది.

  అద్భుత మనో రంజకమైన సాహిత్యం

  మీ వర్ణనలో మరింత శోభాయమానంగా ప్రకాశిస్తున్నది

  ధన్యోస్మి మాష్టారు

 7. ఎన్నో విలువైన,అపురూపమైన విషయాలు తెలుపుతున్న మీకు 🙏🙏🙏సర్!

 8. శ్రీ కృష్ణ లీలాతరంగిణి గురించి చాలా వివరంగా చెప్పారు ధన్యవాదములు.

 9. శ్రీ కృష్ణ లీలాతరంగిణి గురించి వివరాలు చాలా చక్కగా చెప్పారు. అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: