పునర్యానం-36 & 37

ఇరవై ఏళ్ళ కింద నన్ను కలవరపరిచిన దృశ్యాల జాబితా ఇది. కాలం గడిచే కొద్దీ, ఈ జాబితా పెరుగుతోందే తప్ప, తగ్గడం లేదు.


శాసనసభలు నన్ను కలవరపరిచాయి, వార్తా పత్రికలు నన్ను కలవరపరిచాయి­.

విమానాశ్రయ లౌంజుల్లో సీట్లకానుకుని పళ్లు కుట్టుకుంటున్న
ప్రొఫెసర్లు నన్ను కలవరపరిచారు
కళాశాలలు నన్ను కలవరపరిచాయి, ఉపాధ్యాయుల మీద పొంగిపొర్లే
వెకిలిహాస్యం నన్ను కలవరపరిచింది.

వృథాగా ప్రవహిస్తున్న నదులు నన్ను కలవరపరిచాయి­,
సాగులేక ఒదిలిపెట్టిన బీడుభూములునన్ను కలవరపరిచాయి
బాధ్యతారహితమైన బాంకులు నన్ను కలవరపరిచాయి.

దుర్గంధభూయి­ష్టాలు అన్ని పబ్లిక్‌ స్ధలాలు నన్ను కలవరపరిచాయి­
సంఘానికి, దైవానికి జవాబునివ్వనక్కర్లేని ప్రైవేటు స్ధలాలు
నన్ను కలవరపరిచాయి­.

వివాహవేడుకలు నన్ను కలవరపరిచాయి­, విశ్వవిద్యాలయాలు
నన్ను కలవరపరిచాయి
మేధావుల మాటలు నన్ను కలవరపరిచాయి­, కవుల రాజకీయాలు
నన్ను కలవరపరిచాయి.

ఎండుతున్న గ్రామాలు కలవరపరిచాయి­, అంతరిస్తున్న అడవులు
కలవరపరిచాయి­
అంతులేని వలసలు నన్ను కలవరపరిచాయి­, అదుపులేని నగరాలు
నన్ను కలవరపరిచాయి

(పునర్యానం, 2.5.13)


Legislative houses disturbed me, and newspapers disturbed me
Professors chatting idly in airport lounges disturbed me.

Slogans disturbed me, and power-hungry movements disturbed me.
Colleges disturbed me, and crude jokes about teachers disturbed me.

Rivers that ran waste disturbed me, and barren land disturbed me.
Irresponsible banks disturbed me, stinking in public places disturbed me.

Private places that are unafraid of god and society disturbed me.
Wedding parties disturbed me, university campuses disturbed me.

The talk of intellectuals disturbed me, as did poetry politics.
Drought-ravaged villages disturbed me, thinning forests disturbed me.

Unbridled urban expansion and endless migration disturbed me.


నా మిత్రులు నన్ను కలవరపరిచారు, నా బంధువులు నన్ను కలవరపరిచారు
నా సహచరులు నన్ను కలవరపరిచారు, నా సహోద్యోగులు
నన్ను కలవరపరిచారు,
బాంధవ్యానికి బదులు బేరసారాల గురించి ఆతృత పడుతున్న
మనుషులంతా నన్ను కలవరపరిచారు.

అందమైన అక్షరాలతో ఎవరన్నా ఒక పెళ్లి శుభలేఖ
నీ చేతుల్లో పెట్టి ‘మీరు తప్పకుండా రావాలి, మీకు తెలిసినవాళ్లని కూడా
పిలవాలి’ అన్నారనుకో
నాకెందుకో తగలబడుతున్న నవవధువులు గుర్తొస్తారప్పుడు.

హోటల్లో కూచుంటారు, మధుర భక్ష్యాలేమేమో అర్డరిస్తారు
నన్ను కూడా తమతో చేరమంటారు, నాకప్పుడు
ఎక్కడో పేవ్మెంట్ల మీద అడుక్కుంటున్న పిల్లలు గుర్తొస్తారు,
వాళ్లకందవలసినదేదో, మన అవసరాన్ని మించి, మనమారగిస్తున్నామనిపిస్తుంది.

అమెరికా నుంచి పిలుపొచ్చిందని బయలుదేరుతారు మిత్రులు
వ­రిసిపోతారు తమ తమ ప్రావీణ్యాలకు గుర్తింపు లభించిందని
అప్పుడు నాకు మా వీథిలో చెత్త ఎత్తుకుంటున్న పిల్లలు గుర్తొస్తారు.

ఇండియాలో అమెరికా పక్కనే ఆఫ్రికా కూడా నివసిస్తోందని నివ్వెరబోతాను.

కవిత్వాలు చదవమని పిలుస్తారు, వేదికలు సిద్ధం చేస్తారు, పిలుస్తారు రమ్మని, పోలేను
వాళ్ల కలల వెనుక రహస్యద్వేషాలెన్ని మార్లో నన్ను కలవరపరిచాయి.
సంగీతం నన్ను కలవరపరిచింది, సాహిత్యం నన్ను కలవరపరిచింది,
సంతోషం నన్ను కలవరపరిచింది, జీవితమొ­క వ్యాపారంగా
మారిన కాలం నన్ను కలవరపరిచింది.

(పునర్యానం, 2.5.14)


Friends disturbed me, relatives disturbed me
Colleagues disturbed me, and my companions disturbed me.
Whenever people favor tinsel over truth, they disturb me.

When someone invites me to a wedding
Bride burnings and dowry deaths come to mind.

When I am invited to dinner in a hotel, and
If I see children begging outside, I am disturbed.

Seeing my friend’s children leaving for abroad,
My mind is haunted by children picking dust.

Having an Africa and an America within India dismayed me.

People often ask me to recite poetry, but I can’t,
Their envy and prejudice disturbed me.
Literature disturbed me, and music disturbed me.
Even joy disturbed me as life became merchandise.

6-9-2023

12 Replies to “పునర్యానం-36 & 37”

  1. ఈ కలవరపాటు పెరుగుతోంది.మీరు అన్నట్టు ఈ లిస్ట్ పెరుగుతోంది. అంచేత ఈ క్షణాన్ని ఆనందించ లేక పోతున్నాం. ఇది మీ లాంటి సుమనస్కుడి వేదన.ప్రపంచం బాధ మన బాధ అయితే ఇలాగే ఉంటుందేమో. 🙏🙏

  2. నాటి ఋషుల తపన తప
    -స్సుగ మారిన దిందుకే
    సహజీవుల యమయాతన
    తొలగించేటందుకే

    పెరుగుతుంది విజ్ఞానం
    పయోనిధుల మించి
    అడుగున పడుతుంది. మాన
    వత్వ మవధి మించి

    స్వాతంత్ర్యం జన్మహక్కు
    రోజులు పోయాయి
    స్వార్థం నా సర్వహక్కు
    ఘడియలు వచ్చాయి

    మండిపడేవాడే రవి
    వెండి వెలుగు రేడే శశి
    తోటివారి దైన్యానికి
    ఉలికిపడేవాడే కవి

    కలలు వరాలౌతాయని
    ఆశించుట సహజం
    కలవరాలు మిగిలినపుడు
    విలపించుట కవిజం

  3. వేదనా భరితమైనవి. కలవరానికి గురిచేసినవి. ఎందుకో దుఃఖాన్ని ఆపుకోలేక పోతున్నాను.

  4. అనుక్షణం అంతరాత్మ మాటగా జీవించేవారికి
    ఇటువంటి వేదన తప్పనిసరి అనిపిస్తుంది సర్

  5. అవును సర్, రహస్య ద్వేషాలు మాట పెగలకుండా చేయడం నిజం..

Leave a Reply

%d bloggers like this: