
రాజ్యం అనగానే కొందరికి పోలీసులూ, తుపాకులూ, జైళ్ళూ గుర్తొస్తాయి. నాకూ గుర్తొస్తాయి, మీకూ గుర్తొస్తాయి. కాని అవి రాజ్యం తాలూకు స్థూల చిహ్నాలు. లేదా చివరి ఆయుధాలు. రాజ్య హింసకు వ్యతిరేకంగా గళమెత్తే వాళ్ళు చాలామంది ప్రధానంగా వీటిమీదనే పోరాడుతుంటారు, కాబట్టి వీటితోటే పోరాడుతుంటారు కూడా.
కాని రాజ్యమంటే నిజానికి ఒక ప్రత్యేక సౌకర్యం. Privilege. తోటిమనిషికన్నా నిన్ను మరింత అధికస్థానంలో నిలబెట్టేదీ, అతడి జీవితం కన్నా నీ జీవితాన్ని మరింత సౌకర్యవంతం చేసేదీనూ. సాటిమనిషికి లేని అదనపు సౌకర్యాన్ని కోరుకోవడమే రాజ్యానికి పునాది. అటువంటి కోరిక ఎంత బలపడుతూ ఉంటే, అలా కోరుకునేవాళ్ళు ఎంత పెరుగుతూ ఉంటే రాజ్యం అంతగా బలపడుతుంటుంది.
కాబట్టే మహాత్ముడు బ్రిటిష్ వాళ్ళతో తలపడటానికి ముందు తన జీవితాన్ని క్షుణ్ణంగా పరీక్షకు పెట్టుకున్నాడు. తానెక్కడన్నా తోటిమనిషి కాయకష్టం మీద ఆధారపడుతున్నాడా, తాను చెయ్యడానికి ఇష్టపడని మలిన వృత్తులు చేయడం కోసం తోటిమనిషిమీద ఆధారపడుతున్నాడా అని చూసుకున్నాడు. ఆయన భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, ఇక్కడి జాతీయోద్యమ కారులు తమ తమ జీవితాల్లో తోటిమనుషుల పట్లా, స్త్రీలపట్లా, మలినవృత్తులు చెయ్యకతప్పని వారిపట్లా అణచివేతకు పాల్పడుతూ, తాము మాత్రం బ్రిటిష్ వారిని ధిక్కరించడంలోని అనౌచిత్యాన్ని ఖండించకుండా ఉండలేకపోయాడు.
ఇప్పుడు నా చుట్టూ ఉన్న సమాజంలో వివిధ ప్రాంతాలు, కులాలు, వృత్తులు మేల్కొన్న తర్వాత, వారు తమ మీద ఇంతదాకా సాగుతూ వస్తున్న అణచివేతను ధిక్కరించడం మొదలుపెట్టాక, వారిని కూడా ఒకసారి ఆత్మపరీక్ష చేసుకొమ్మని చెప్పడానికి ఏ మహాత్ముడూ మనమధ్య లేడిప్పుడు. తమ కన్నా బలహీనులైనవారిపట్ల- ఆర్థికంగానో, సామాజికంగానో, రాజకీయంగానో, లేదా సంఖ్యాపరంగానో-బలహీనులుగా ఉన్నవారి పట్ల యథేచ్ఛగా అణచివేతనూ, దోపిడీనీ కొనసాగించే రాజకీయ శక్తులున్నంతకాలం, ప్రభుత్వాలు మారవచ్చేమోగాని, రాజ్యం మారదు. అందుకనే, ప్రపంచవ్యాప్తంగా రాజ్యాలు మరింత oppressive గా, మరింత hegemonical గా మారుతుండటంలో ఆశ్చర్యం లేదు.
గ్లోబలైజేషన్ మొదలవుతున్న కాలంలో, చాలామంది దేశాల హద్దులు చెరిగిపోతాయనీ, modern nation state అంతరించిపోతుందనీ భావించారు. కాని గ్లోబలైజేషన్ వృద్ధి చెందేది కూడా వనరుల మీదనే కాబట్టి, వనరుల మీద ఆధిపత్యం స్థానిక ప్రభుత్వాలకే ఉంటుంది కాబట్టి, ఆధునిక జాతీయ రాజ్యాలు బలహీనపడకపోగా, మరింత బలపడుతున్నాయి. పారిశ్రామిక విప్లవం భౌతిక వనరుల మీద ఆధారపడ్డదికాగా, గ్లోబలైజేషన్ ప్రధానంగా మానవ వనరుల మీదా, సృజనాత్మకతమీదా, తెలివితేటల మీదా ఆధారపడ్డది కాబట్టి, మానవవనరుల్ని అనేక రకాల భావశృంఖలాలతో అణచి ఉంచే ప్రక్రియ కూడా మొదలయ్యింది. కాబట్టి, వనరుల్ని నియంత్రించే అధికారం కలిగినదానిగా రాజ్యం మరింతగా బలపడుతూనే ఉన్నది. ఇంకా చెప్పాలంటే, కలోనియలిజం రోజుల్లో, వలస రాజ్యాల ప్రభుత్వాలు ఇక్కడ పనిచేసేవి. ఇప్పుడు వలసరాజ్యాలకోసం మనమే ప్రభుత్వాలు నడుపుతున్నాం, ఆ ఖర్చు కూడా వాళ్లకి లేకుండా.
అందువల్ల, ముందు మనల్ని మనం ప్రక్షాళితం చేసుకోకుండా, రాజ్యాన్ని ప్రక్షాళితం చెయ్యాలని చూడటంలో అర్థం లేదు. మన పిల్లలు గూగుల్ లో, అమెజాన్ లో, మెగా లో పనిచేస్తూ లక్షలాది డాలర్లు సంపాదిస్తూ ఉండగా, మనమిక్కడ పౌర ఉద్యమాల్ని నిర్మించలేము. అందుకనే మహాత్ముడు తన పెద్ద కొడుకు బారిస్టరు చదువుతానంటే ఒప్పుకోలేదు. మంచి చదువు కావాలంటే కారాగారాలకన్నా గొప్ప కళాశాలలు ఉండవని చెప్పాడు ఆయన తన కొడుక్కి.
రాజ్యం నన్ను కలవరుస్తున్నదంటే దాని అర్థం మనుషుల్లోని సుఖాభిలాష, సౌకర్యాభిలాష నన్ను కలవరపరుస్తున్నాయని.
రాజ్యం నన్ను కలవరపరిచింది, మార్పుని
కోరుతున్న రాజ్యం నన్ను కలవరపరిచింది.
దాని వెనక సౌకర్యాల పరుపుదిళ్లు, క్యూలో నించోనక్కరలేని
ప్రత్యేక జీవితం కోసం పార్క్ చేసిన కార్లు, మనుషుల్ని
ఆర్డర్లీలుగా మార్చుకున్న మరలతో నడుస్తున్న రాజ్యాలు
మార్పుని మాట్లాడటం నన్ను కలవరపరిచింది.
దాని ఆదేశాలదెవరికీ బోధపడని భాష, దాని అనుచరుల్లో
ఒకరు మరొకర్ని నమ్మరు, ప్రతి అంతరంగంలోనూ
సుఖమయ జీవితాభిలాష, మనుషుల్ని వస్తువులుగా మార్చుకున్న
రాజ్యం మానవత్వం గురించి మాట్లాడటం నన్ను కలవరపరిచింది.
అత్యాధునిక పోలీస్ స్టేషన్లతో, సరికొత్త ఆయుధ సంపత్తితో
అశ్వాలతో, లాఠీలతో,
స్వదేశస్ధులు విదేశీపాలన సాగిస్తున్న రాజ్యాలు
స్వాతంత్య్రం గురించి మాట్లాడటం నన్ను కలవరపరిచింది.
జైళ్లతో, పెరుగుతున్న రోగులతో
ఉన్మాద హత్యలతో, వేధింపులతో అలరారుతున్న రాజ్యం
ప్రశాంత జీవితం గురించి మాట్లాడటం నన్ను కలవరపరిచింది.
(పునర్యానం, 2.5.5)
The state disturbs me, and
More disturbing is its talk of justice.
Whenever I hear the word state, I picture privileged individuals,
People who don’t need to follow the queue,
Spacious offices, sofas with cushions, the latest models of cars and computers.
As an enormous machine that converts people into bolts and nuts-
The state disturbs me, and
More disturbing is its talk of social change.
It is difficult to understand the state’s language, and
Its followers don’t believe one another.
In its unsatisfied desire to consume human minds and bodies-
The state disturbs me, and
More disturbing is its talk of humanity.
As I think of the state, I see a collage of modernized police stations,
ultra-modern weapons, tear gas, and baton charges.
As a foreign rule run by native people-
The state disturbs me, and
More disturbing is its talk of freedom.
When I think of the state, I picture long lines of hospital wards
Incarcerations, mob lynchings, and insane killings.
As an incubator of hate and bigotry-
The state disturbs me, and
Even more disturbing is its talk of peace.
4-9-2023
“స్వదేశస్ధులు విదేశీపాలన సాగిస్తున్న రాజ్యాలు…”
How true indeed!
My heart skipped a beat!
అందుకే అన్నారు…
Poets are unacknowledged legislators…indeed.
Great musings…Sir.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
“As an incubator of hate and bigotry.. ”
Excellent.. నిబిడాశ్చర్యం.. మీ ఆలోచనలు.. భావాలు.. ఆత్మలోకి తొంగి చూసుకునే మీ తాత్వీకత నా ఆలోచనలకు కొత్త సులోచనాలు పెడుతున్నాయి. మధురం..
ధన్యవాదాలు సార్
‘సాటిమనిషికి లేని అదనపు సౌకర్యాన్ని కోరుకోవడమే రాజ్యానికి పునాది.’ గొప్ప ఎరుకతో కూడిన మాట! ఏ ఆయుధాలు లేకుండా రాజ్యాన్ని జయించే మాట!!
ధన్యవాదాలు సార్