
భారతదేశం గ్రామాల్లో జీవిస్తున్నది అని చిన్నప్పుడు చదువుకున్నాం. 1950, 1980, 2000 తర్వాత భారతదేశం అత్యధికభాగం నగరాల్లో కూడా జీవించడం మొదలుపెట్టిందని మనకు తెలుసు. కాని దేశంలో ఏ ఒక్క నగరం కూడా సాధారణపౌరుడు జీవించడానికి అనుకూలమైన ప్రదేశం కాదు. తామరతంపరగా పెరుగుతున్న ఈ నగరాలకు నాగరికత లేదు. చెప్పుకోదగ్గ సంస్కృతి లేదు. అన్నిటికన్నా నన్ను తీవ్రంగా బాధించేది నగరాల్లోని చెత్త, మురికి, దుర్గంధం. ఏ ఒక్క పట్టణంలో కూడా ముక్కు మూసుకోకుండా అయిదు నిమిషాలు కూడా నడవగలిగే పరిస్థితి లేదు.
ఇది భారతీయ నగరాలకే పరిమితమైన పరిస్థితి అనుకుందామా అంటే, అమెరికాలోనూ ఇదే పరిస్థితి అని ఇంటర్నెట్ చెప్తోంది. అమెరికన్ సంస్కృతికి ప్రతినిధిగా చెప్పదగ్గ న్యూయార్క్ ఒక ట్రాష్ సిటీ అని ఎక్కడో చదివాను. దాదాపుగా బోస్టన్ దీ అదే పరిస్థితి. స్కాండినేవియన్ దేశాల్ని మినహాయిస్తే, యూరోప్ లోని చాలా నగరాలు అమెరికన్ నగరాల కన్నా అధ్వాన్నమని విన్నాను.
ఏ అంశంలో? పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రజాసదుపాయాలు- చౌకగానూ, సౌకర్యవంతంగానూ ప్రయాణించగల పౌరరవాణా, పబ్లిక్ టాయిలెట్లు, పౌర స్థలాల నిర్వహణ- ఇటువంటి ఏ అంశంలో చూసినా ఆధునిక మహానగరాలు మనుషులు సృష్టించుకున్న నరకాలనే చెప్పవలసి ఉంటుంది.
అయితే ఇది కాదు నన్ను బాధించేది, అది ఇంతకన్నా సూక్ష్మమైంది. ఒకప్పుడు జాన్ కెన్నెత్ గాల్బ్రైత్ private affluence and public sqaulor అనే పదప్రయోగం చేసాడు. ఆయన గత శతాబ్దంలో 50 ల్లోనే ఈ మాటలు వాడాడు. అప్పటికింకా నగరాలు ఇంత జనసమ్మర్దంతోనూ, ఇంత కాలుష్యభరితంగానూ, ఇంత అసమర్థనిర్వహణతోనూ లేవు. కాని ఆయన గమనించిన విషయం చాలా తీవ్రమైంది. అదేమంటే దేశంలో సంపద వృద్ధి చెందేకొద్దీ, మనుషులు సంపన్నులవుతున్నకొద్దీ, తమ ఇళ్ళు ఎంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకుంటారో తమ వీథుల్ని అంత అపరిశుభ్రంగా మార్చుకుంటూ ఉంటారు అని. ఇది ఇప్పటి భారతీయనగరాలకి మరింతగా వర్తించే మాట.
హైదరాబాదునే చూడండి. నేనిక్కడ 1995 నుంచీ ఉంటున్నాను. ఈ ముప్పై ఏళ్ళల్లో ఈ నగరం horizontal గానూ, vertical గానూ ఎంత విస్తరించిందో, అంతకంతగా అపరిశుభ్రనగరంగా మారిపోతూ ఉంది. ఈ అపరిశుభ్రతకి గల కారణాల్ని విశ్లేషించడం మొదలుపెడితే, ఒక సాంఘిక-రాజకీయ వ్యవస్థగా మనం ఎంత దిగజారుతూ ఉన్నామో, నానాటికీ ఎంత అసమర్థంగా తయారవుతున్నామో అదంతా వివరించవలసి ఉంటుంది.
ఈ మధ్య ఎవరో చెప్తున్నారు, హైదరాబాదులో దాదాపు పధ్నాలుగు వందల మురికి వాడలున్నాయని. ఆ మాట మరొక నగరనిపుణుడితో చెప్తే, ఆ సంఖ్య కేవలం నోటిఫైడ్ స్లమ్స్ కి మాత్రమే వర్తిస్తుందనీ, లెక్కకు రాని స్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయనీ చెప్పాడు. దాదాపుగా ప్రతి చిన్నపాటి పట్టణానికీ ఇప్పుడు హైదరాబాదే మోడల్. దేనిలో? స్లమ్స్ పెరగడంలో. భారతదేశం జీవిస్తున్నది గ్రామాల్లోనూ, నగరాల్లోనూ కాదు, స్లమ్స్ లో జీవిస్తున్నదని చెప్పాలిప్పుడు.
హైదరాబాదు వికసిస్తున్న నగరం అని చెప్పుకునేవాళ్ళు రియల్టర్లైనా కావాలి లేదా పాలకరాజకీయ పక్షానికి చెందినవాళ్ళేనా కావాలి. ఆ వికాసం వెనక నీడలో ఒక విధ్వంసం కూడా నడుస్తున్నదని మనం గుర్తుపట్టాలి. ఇది దేశంలో ప్రతి ఒక్క నగరానికీ, పట్టణానికీ కూడా వర్తించే మాటనే.
సంపదమాటున పొంచి ఉండే ఈ వికృతరూపాన్ని మూడు వేల ఏళ్ళకిందటి బైబిలు కవి ఎలా చూసాడో, వాల్మీకి కూడా అలానే చూసాడు. ముందు ఆకాశంలోంచి చూసినప్పుడు హనుమంతుడికి లంకా నగరం ‘ఆకాశంలో తేలియాడుతున్న నగరం’ లాగా కనిపించిందట. ఆ తర్వాత కొంత కిందకి దిగేటప్పటికి, ఆ నగరానికి నగరప్రాకారం నడుముగానూ, కందకాల్లోని నీళ్ళు వస్త్రాలుగానూ, శతఘ్నులూ, శూలాలూ కేశపాశంగానూ, కోటబురుజులు చెవిబుట్టలుగానూ కనిపించాయట. ఇక నగరంలో ప్రవేశించి కొంతదూరం సంచరించాక, పెద్ద పెద్ద సామాన్లు నిల్వచేసుకునే కొట్లూ, అంగడులూ చెవికమ్మలుగానూ, యంత్రాగారాలు వక్షోజాలుగానూ కనిపించాయట. చివరికి ఆ లంకాధిదేవత కనిపించేటప్పటికి ఆమె ‘దారుణం’ గానూ, ‘విరూపనయన’ గానూ కనిపించిందట. అదీ స్వర్ణలంక నిజరూపం.
ఇప్పుడు ప్రపంచమంతటా సంపదపోగుపడుతున్న ప్రతి ఒక్క నగరమూ ఒక స్వర్ణలంకగా మారిపోయే ప్రమాదం అంచునే ఉన్నది. ఆ కలవరపాటులోంచి వచ్చిన కవిత ఇది.
ఊషర క్షేత్రాల్ని నువ్వు చూసిందొక్క గ్రామాల్లో మాత్రమే కాదని చెప్పు, జీవితం
నిన్ను మోసం చేసిందొక్క పొలాల్లో మాత్రమే కాదని చెప్పు
నగరాలు నన్ను కలవరపరిచాయి, సంపదను పోగేసుకుంటున్న నగరాలు
నన్ను మరీ కలవరపరిచాయి.
తనని తాను అమ్మకానికి సిద్ధం చేసుకుంటున్న అంగడిలా మారింది నగరం
షాపింగ్ కాంప్లెక్సుల వక్షోజాలతో, సరికొత్త షోకేసుల చెవికమ్మలతో
నియాన్ దీపాల్ని పెదవులకు రాసుకుని
ఇప్పుడది ఒక ఈలకోసం ఎదురుచూస్తున్నది
రెండు నాణేలు చాలు, నీ ముందది మోకరిల్లుతుంది.
సరికొత్త పాకేజీ పెట్టెలా తనని తాను సింగారించుకుంటోంది నగరం
పైనా, కిందా, రెండు పక్కలా అందమైన బొమ్మల్ని తగిలించుకుంటే చాలని మురిసిపోతోంది
ఆ పెట్టెలోపల ఉన్నవిపుడు స్నేహం కాదు, సహజీవనం కాదు
ఎదురుచూడదదిప్పుడొక అతిధికోసం, ఒక వాక్యం కోసం, ఒక కిరణం కోసం.
అరవయి లక్షల మంది మనుషులతో ఒంటరిగా దుఃఖిస్తూన్నది నగరం
దాని చెంపల మీంచి అశ్రువుల బదులు మద్యం ప్రవహిస్తూన్నది
దాని ముద్దముద్ద మాటల్తో అన్ని టెలివిజన్ ఛానెళ్లలోంచి కారుతున్నది చొంగ
అప్పుడు ఆపుకుందామన్నా ఆగకుండా వచ్చేస్తుందొక అశ్లీలహావభావం
సరిగ్గా దాన్ని పట్టుకోవడానికే ట్రాలీల మీద కెమేరాల్ని పరిగెత్తిస్తున్నారు
యువదర్శకులు
తప్పతాగి ఏ మూడవజావ రాత్రినో అది భళ్లుమని వాంతి చేసుకుంటుంది
ఆ తాజాదనం చెదరకుండానే ఆ వికారాన్ని మూటగడుతున్నాయి దినపత్రికలు
పెట్రోలు తాగి పొగతిని బతుకుతున్న నగరాలు నన్ను కలవరపరిచాయి
పెట్రోలు చల్లుకుని తమను తాము కాల్చుకుంటున్న నగరాలు నన్ను కలవరపరిచాయి.
`
జీవరహితంగా ఎండిన కట్టెమాదిరి శోభిస్తోంది నగరం
ఇపుడు ప్రతి నగరమొక అర్ధరాత్రి లంక
ఇప్పుడొక గాలివార్త చాలు దాన్ని దగ్ధం చెయ్యడానికి
ఒక సంకేతం చాలు దానికి నిప్పంటించడానికి.
పురాతన కట్టడాలతో, సుందర ఉద్యానాలతో, సువిశాల రాజపథాలతో
నగరాలు నన్ను కలవరపరిచాయి.
మూత్రదుర్గంధంతో, ఎగురుతున్న చెత్తతో, పొంగిపొర్లుతున్న మురికికూపాలతో
నగరాలు నన్ను కలవరపరిచాయి
ఎక్కడికి వెళ్లు, ఏర్ పోర్డ్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, పబ్లిక్ గార్డెన్, మెయిన్ రోడ్
ఎక్కడికి వెళ్లు, ఏ కొత్తబేరం కోసమో వెయ్యికళ్ళతో వెతుకుతోందది
ఎదటి ఉన్నవాడిని పలకరించనివ్వకుండా మోగుతున్నాయి దాని సెల్ ఫోన్లు
ఏదో చాటిచెప్పుకుంటున్నాయి హోర్డింగులు
కక్కుతున్న ద్వేషంతో, రాసుకున్న కరపత్రాలతో
కిక్కిరిసిపోయాయి దాని వేదికలు
ఒక్క దూషణ విన్నప్పుడు మాత్రమే అదొక సంగీతాన్ని విన్నట్టు శాంతిస్తుంది
తనది తప్ప తక్కిందంతా జీవితం కాదని భ్రమిస్తోందది
ఎక్కడో పోరు జరుగుతోందని, ఏ అర్ధరాత్రో సాహసదళాలేవో తమని
విముక్తపరుస్తాయని
అక్కడి మేధావులు నిశ్చింతగా నిద్రపోతున్నారు.
నగరాలు నన్ను కలవరపరిచాయి
పగలంతా పోసిన చెత్తని అద్దెకి తెచ్చుకున్న చీపుళ్లకప్పగించి
మరునాటి చెత్త గురించి కలలుకంటున్న
నగరాలు నన్ను కలవరపరిచాయి
(పునర్యానం, 2.5.4)
It is not just villages that disturb me, nor only
Barren lands that upset me.
The cities also disturb me, cities sunken in wealth.
Cities are now shopping malls.
Storerooms as breasts and showcases as earrings
Using neon light for lipstick, she waits for a client
Give two cents, and she’s yours.
The city packages itself for sale
On all four sides, beautifully dressed mannequins.
What do you find in it? Friendship? No.
It no longer waits for the gods or guests.
With 60,00, 000 people, the city mourns alone.
Instead of tears, liquor flows down her cheeks.
Television channels drip with indistinct chatter
Tempting you to say something indecent.
The movie directors run the trolleys to catch that comment.
Wherever the city moves at night,
News and networking follow.
Cities that drink diesel and emit smoke disturb me
Cities that burn themselves with petrol disturb me.
Lifeless cities shine brighter.
Every city now is a Lanka
One rumor and it’s on fire
With just a slogan, it burns.
Beautiful gardens, monuments, and majestic roads disturb me
Overflowing drainage, stinking, and piles of dust upset me.
Airports, railway stations, bus stops, public parks, main roads,
Everywhere you turn, there is a market.
Hoardings and endless calls turned it into an auction house.
Its meeting halls are full of hate, and
Only slander is music to its ears
Her life is all that matters to her.
In their belief in a distant war and eventual liberation,
Its intellectuals sleep comfortably.
The cities disturb me, and
Cities that sink in litter disturb me even more.
2-9-2023
హైదరాబాదుని మరోకోణంలో పరిచయం చేసిన మీకు జేజేలు.అనామకుల,అసహాయుల,అన్నార్తుల ఆశలను అణగద్రొక్కి,ఆ శిధిలాలను మన పునాదులుగా చేసి వాపును బలుపనుకుని బ్రతుకుతున్నాము.
మీ స్పందనకు ధన్యవాదాలు మేడం
నగరాన్ని తనని తాను అమ్మకానికి పెట్టుకున్న మహిళగా వర్ణించటం కలవరపరచింది.ఎక్కడో పోరు జరుగుతోందని నిద్రపోతున్న మేథావుల గురించి చాలా చక్కగా చెప్పారు.అభినందనలు
మీ స్పందన నాకు ఎంతో విలువైనది.
అయ్యో…..మరి పరిష్కారం ఏమిటి సర్!
కవిత పని ఆలోచింపచెయ్యడం వరకే. పరిష్కారాలు ఎవరికి వారు వెతుక్కోవాలి.
హైదరాబాదు నగర పరిసరాలను మనసుకు తాకేలా కవిత్వీకరించారు. ప్రతి నగరవాసి ఆలోచించుకోవలసిన విషయం.
ధన్యవాదాలు సార్
“అరవై లక్షల మంది మనుషులతో
ఒంటరిగా దుఖిస్తున్నది నగరమిప్పుడు
దాని చెంపల మీద అశ్రువులకు బదులు
మద్యం ప్రవహిస్తున్నది”
మానవ సంబంధాలు మృగ్యం
దేవాలయాల చెంత భక్తుల రద్దీ మాటేమో కాని
వైన్ షాపుల వద్ద గుంపుల గుంపుల జనం
అచ్చెరువొందాను
ఇంత బానిస బ్రతుకులు ఎందుకు మోస్తున్నారని?
ఎవరిని ఉద్ధరిద్దామని?దేశాన్నా!
కనీసం తమ కుటుంబాన్నా!!
బాధ్యత ప్రజలదా? ప్రభుత్వాలదా!!??
అధికార దాహంతో అలమటించిపోతున్న
ప్రభుత్వాల నిర్వాకం కాదా!
ప్రజల ప్రాణాలను మద్యం దుకాణాల్లో తనఖా పెట్టి
సాగించే ఈ దుర్వినీతి అవస్థ వ్యవస్థ దే కాదా!!
మీ స్పందనకు ధన్యవాదాలు
నగరాల నిజ రూపం.. నిద్రిస్తున్న మేధావుల కలలోకి వచ్చి కలవర పరిచే లా ఉంది సార్.. మీ కవిత్వం.
ధన్యవాదాలు