పునర్యానం-33

రకరకాల సర్వేల ప్రకారం, రకరకాల కాలవ్యధుల్లో లెక్కగట్టిన ఆత్మహత్యల వివరాల ప్రకారం గత ముప్పై ఏళ్ళల్లో భారతదేశంలో సుమారు నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో మూడవవంతు మహారాష్ట్రకి చెందినవాళ్ళు కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలోనూ, గత పదేళ్ళుగా, ఆంధ్ర, తెలంగాణా, మూడు నాలుగు స్థానాల్లోనూ నిలబడుతున్నాయి. ఒక ఏడాది అటూ ఇటూ కావచ్చు. 2017 తర్వాత తెలంగాణాలో ఆత్మహత్యలు తగ్గి ఉండవచ్చు. కాని ఈ రెండు రాష్ట్రాలూ మొదటి అయిదు స్థానాల్లోనే కొనసాగుతున్నాయి. రైతుల ఆత్మహత్యల సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించకముందే చప్పున మన దృష్టిని పట్టుకునే ఒక విషయం, ఈ ఆత్మహత్యల్లో అధికభాగం దేశంలో బీద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లోకాక, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దక్కన్ రాష్ట్రాల్లో సంభవిస్తూ ఉండటం. ఈ రాష్ట్రాల్లోనే నగరీకరణ శరవేగంతో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రాల్లోనే ఐ టి హబ్బులు అనూహ్యంగా పుట్టుకొచ్చాయి. పూణె, బెంగళూరు, హైదరాబాదు- రైతులు మరణిస్తున్నది కూడా ఈ నవనవోన్మేష నగరాల పృష్ఠభూముల్లోనే.

నేతకారులదీ అదే దారి. ఇప్పుడు కొత్తగా విద్యార్థుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. తెలంగాణాలో గత అయిదేళ్ళలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టిన సంతోషంకన్నా, విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న వార్త కలిగించే కలవరపాటే ఎక్కువ.

కాని నాకు తెలిసి ఒక్క నాటకంగాని, ఒక్క కావ్యంగాని, ఒక్క నవలగాని, ఒక్క సినిమా గాని, కనీసం ఒక టెలివిజన్ సీరియల్ గాని రైతుల ఆత్మహత్యల మీద వచ్చినట్టు నాకు తెలియదు. బహుశా వచ్చి ఉండవచ్చు. కాని కన్యాశుల్కం అనే దురాచారం మీద నాటకం వచ్చినట్టుగా, ఒక వరవిక్రయం మీద నాటకం వచ్చినట్టుగా- ఏదేనా నాటకం వచ్చిందా?

నేననుకుంటాను, ఇందుకు కారణం, ఈ విషయాలు వార్తల స్థాయిని దాటి, సర్వేల, నివేదికల, రాజకీయ ఆరోపణల స్థాయిని దాటి మనలో అంతర్మథనం కలిగించకపోడమే.

శోకం నీ ఆత్మని నిలదీస్తేనే అది శ్లోకంగా మారుతుంది. విలాప గీతాలే తీసుకోండి. అందులో ఉన్న ఆక్రోశం ఒక వ్యక్తికో, ఒక గ్రామానికో, లేదా ఒక దేశానికో చెందింది కాదు. అది ఒక జాతికీ, భగవంతుడికీ మధ్య ఉన్న ఒప్పందాన్ని నమ్మిన విశ్వాసంలోంచి పుట్టిన కవిత్వం. అంత శక్తిమంతమైన కవిత్వం రావాలంటే, ముందు నీలో అంత విశ్వాసం దృఢపడి ఉండాలి, దేవుడి పట్లా, మనిషి పట్లా కూడా. నీ కట్టెదుట విధ్వసం సంభవిస్తున్నప్పుడు అది నీ ఆత్మలో విధ్వంసంగా పరిణమించాలి. మనిషిలోనో, భగవంతుడిలోనో నీ నమ్మకం కూకటివేళ్ళు తెగిపోయేటంతగా నువ్వు చలించిపోవాలి. ఏమి చేసి నిన్ను నువ్వు నిలబెట్టుకోగలవా, నీ ఆత్మని కాపాడుకోగలవా అని కొట్టుకుపోవాలి.

తెలుగు కవిత్వంలో సమాజంగురించీ, మనుషుల గురించీ, చుట్టూ జరుగుతున్న విధ్వంసం గురించీ చాలా కవిత్వం వచ్చింది. గొప్ప కవిత్వమే. కాని ఒక్క కవిత కూడా అయిదు విలాప గీతాల్లోని ఒక్క గీతానికి కూడా సరితూగదు. ఎందుకంటే ఇక్కడ ఆక్రోశం మాత్రమే ఉంది తప్ప, అంతర్మథనం లేదు. ఆక్రందన ఉంది తప్ప, ఆత్మను నిలదీసుకోడం లేదు. తోటి మనిషి కష్టాలకు కరిగి కన్నీరు కార్చడం ఉంది తప్ప, ఆ కష్టాల వెనక, మనిషి స్వయంకృతాపరాధం కూడా ఉందన్న మెలకువ లేదు. ఏమి? ఒక బీదవాడికి అన్నం దొరక్కపోతే అందులో అతడి స్వయంకృతాపరాధం ఏముంది అని మీరు నన్ను అడగవచ్చు. కాని ఒక అన్నార్తుడి ఆకలికి మనమంతా కూడా బాధ్యులమే అని గుర్తుపట్టగలిగితే, గుర్తుపెటుకోగలిగితే, అప్పుడు మనం శత్రువు మీద ఎంత ధిక్కారం ప్రకటిస్తామో, మన ఆత్మవంచన పట్ల కూడా అంతే ధిక్కారం ప్రకటిస్తాం.

అందుకే అనుకుంటాను, పునర్యానం రెండో అధ్యాయంలో అయిదవ సర్గలో రాసిన కవితలు బహుశా సమాజాన్ని ప్రశ్నించడంతో మొదలైనప్పటికీ, చివరికి నన్ను నేను ప్రశ్నించుకోడం దగ్గరికే వచ్చి ఆగిపోయాయి. ఆ వరసలో ఈ కవిత కూడా ఒకటి.


గ్రామాలు నన్ను కలవరపరిచాయి­,
రైతుల ఆత్మహత్యల గ్రామాలు నన్ను మరీ కలవరపరిచాయి­.

ఇప్పుడా పొలాల నెర్రెల్లో ప్రాణ సంగీతం వినిపించడం లేదు,
కనవస్తూన్నదొక స్తబ్ధత, ఇతమిత్ధం కాని ఆరాటం
ఇప్పుడక్కడి మృత్తికలో కలలు ప్రసవించడం లేదు
గాలుల్లో లేవు సుగంధాలు
వినవచ్చేదేదో డేగల రెక్కల చప్పుడు.

పాలల్తో తడిసిన ఒకప్పటి వీథులు కావని, నవ్య వస్త్రాల్ని నేసిన
ఒకనాటి పల్లెలు కావవి
ఇప్పుడక్కడ గోతాము­ల్లో మనుషుల్ని కుక్కుతున్నారు
ఒక జెండా చాలక్కడ నేడు మనుషుల్ని మందల్లా తోలడానికి
ఒక లారీ చాలు వాళ్లని తరలించడానికి, వేలం వెయ్యడానికి.

ప్రతి రోడ్డు మీద ప్రతి గోడనెత్తినా ఎవరో ఒకరు ఏదో నినాదం రాసే ఉన్నారు
ప్రతి నినాదానికీ స్పందించి ఇప్పుడవి అలసిపోయాం­
సినిమా పోష్టర్ని తప్ప మరిదేన్నీ అవి మన్నించలేవిప్పుడు.

ఇప్పుడక్కడ చెట్లకి రబ్బరు తొడుగులు పూస్తున్నాయి
లేవు తోటలు, తోటల్లో పాటలు
ఇప్పుడక్కడ పువ్వులు పుకార్ల పిందెతొడుగుతున్నాయి­
వాటికి కొత్త దాస్యాల పండ్లు పండుతున్నాయి.

గ్రామాలు నన్ను కలవరపరిచాయి
నేత కార్మికుల ఆత్మహత్యల గ్రామాలు నన్ను మరీ కలవరపరిచాయి

(పునర్యానం, 2.5.3)


Villages disturb me, and
Villages where farmers kill themselves, even more.

In those lands, life is gone, and anguish reigns
The farms are empty of dreams
The fragrance is gone, and
In the silence, vultures flap their wings.

The streets are no longer filled with milk, and
The houses no longer weave linen.
Right now, they pack corpses.
A single flag can drive people wild, and
Once sold, all fit in one truck.

Walls are also tired of slogans.
Only movie posters work now.

In the villages, only squalor grows.
The gardens are lost, and the melodies are lost.
The barren fields ripen into politics, and
Slavery is their harvest.

Villages disturb me.
Villages where weavers kill themselves, even more.

1-9-2023

6 Replies to “పునర్యానం-33”

 1. “ఒక అన్నార్తుడి ఆకలికి మనమంతా కూడా బాధ్యులమే అని గుర్తుపట్టగలిగితే, గుర్తుపెటుకోగలిగితే…”

  ఇలా కాకపోతే మనం మనిషిగా భ్రమ చెందే పని లేదు. “మని ఛీ”

  అమానవీయతకు అద్దం పట్టిన తీరు అపూర్వం…సర్.

  బుద్ధ దేవుని భూమిలో పుట్టినా…
  సహజమగు నీతి మనలో చచ్చెనేమి?!

 2. నమస్తే సర్, మీరన్నది నిజం. ఈ సమాజపు కదలిక దేన్నీ పట్టించుకోనంత వేగంగా వెళ్తుంది.ఇది ఎంత ప్రమాదకరం..విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది. కళాకారుల గురుతర బాధ్యత ఈ మార్పును పట్టుకొని దిశానిర్దేశం చేయడమే..దాన్ని మీరు గుర్తు చేశారు..

 3. ‘మనమంతా కూడా బాధ్యులమే’.. ఎన్నింటికో

Leave a Reply

%d bloggers like this: