పునర్యానం-32

పునర్యానం రెండో అధ్యాయంలో అయిదవ సర్గ చివరిది. అది పూర్తిగా సమకాలిక ప్రపంచం గురించిన నా కలత, కలవరపాటుల చిత్రణ. సమకాలికం అంటే, పుస్తకం రాసినప్పటికి. అంటే 2000-2003 నాటి పరిస్థితి అన్నమాట. అప్పటికి గ్లోబలైజేషన్ ప్రపంచమంతా అనుభవంలోకి వస్తూ ఉంది. అది ఏకకాలంలో నిర్మాణాత్మకం, విధ్వంసాత్మకం కూడా. ఇండస్ట్రియలైజేషన్ లానే అది కూడా ఒక పాత ప్రపంచాన్ని, ముఖ్యంగా పారిశ్రామికీకరణ, కలోనియలిజం ల మీద ఆధారపడ్డ ఆధునిక ప్రపంచాన్ని ధ్వంసం చేసే సరికొత్త సాంకేతిక- వాణిజ్య పరిణామం. అది ప్రధానంగా సాంకేతికం. కాని ఇండస్ట్రియలైజేషన్ లో సంభవించినట్టే, ఈ సరికొత్త సాంకేతిక విప్లవాన్ని కూడా వాణిజ్య శక్తులే చేతుల్లోకి తీసుకుని ప్రపంచాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడం మొదలుపెట్టాయి. అయితే ఒక తేడా ఉంది. పారిశ్రామిక విప్లవంలో యూరోప్ ది పైచేయికాగా, గ్లోబలైజేషన్ లో ప్రతి ఒక్క దేశంలోనూ ఒక అమెరికా, ఒక ఆఫ్రికా రూపొందడం మొదలుపెట్టాయి. ప్రపంచ కార్మికులు ఏకం కాకుండానే ప్రపంచ పెట్టుబడిదారులంతా ఏకం కావడం మొదలుపెట్టారు.

ఆ కల్లోలాన్ని చిత్రించడానికి నాకు సరైన భాష, నమూనా లేవు. ఒక మూలన కూచుని మూలుగుతూండే లాంటి కవిత్వం సరిపోదు దానికి. విట్మన్ లాగా, నెరుడా లాగా ఎలుగెత్తి, బిగ్గరగా, బాహువులూ రెండూ విశాలంగా చాపి పలకవలసిన కవిత్వం. కాని విట్మన్ ఆధునిక యుగోదయం నాటి కవి. కాబట్టి ఆ కవిత్వమంతా ఒక సెలబ్రేషన్. నెరుడా ఆధునిక యుగ ఉచ్చదశకు చేరుకున్నప్పటి కవి. కాబట్టి అతడి కవిత్వమంతా ఒక ఆగ్రహం. కాని ఆధునిక యుగం పతనావస్థకు చేరుకున్న కాలంలో నేనున్నాను. ఇది ఉత్సవసందర్భం కాదు, ఉద్రేకప్రకటనా నడవదు. ఇప్పుడు పలికేది ఒక ఆక్రందన, గుండెలు బాదుకోడం మాత్రమే. దానికి ఎక్కడ? ఏ కవిత్వం నుంచి నేను స్ఫూర్తి పొందగలనని ఆలోచించాను.

ఆలోచించగా నాకు పాతనిబంధనలోని Lamentations అధ్యాయం గుర్తొచ్చింది. పాతనిబంధనలోని విలాపాల నుంచి విట్మన్, నెరుడా కూడా స్ఫూర్తి పొందారు. అది దైవనగరం ధ్వంసమవుతున్నప్పుడు ఒక విశ్వాసి ఎలుగెత్తి పాడిన కన్నీటిపాట. ఆ గీతాల్లో ప్రతి ఒక్క గీతం ‘పరాజితులకొక పాట’. చాలాకాలం పాటు ఆ గీతాలు ప్రవక్త జెర్మియా రాసాడని అనుకునేవారు. కాని ఆ అయిదు గీతాలూ అయిదుగురు అజ్ఞాత కవుల రచనలని ఆధునిక బైబిలు చరిత్రకారులు భావిస్తున్నారు. అంతేకాదు ఆ గీతాలు ప్రాచీన మెసపొటేమియా శోకగీతాల స్ఫూర్తితో రాసినవని కూడా భావిస్తున్నారు. అంటే అయిదు వేల ఏళ్ళుగా, ప్రపంచం ధ్వంసమవుతున్నప్పుడలా ఇలా విలపించే కావ్య సంప్రదాయం ఒకటున్నదన్నమాట. ఇటువంటి నమూనాకి మన సాహిత్యం నుంచి మనం గుర్తుచేసుకోదగ్గది, రాముడు వనవాసానికి వెళ్ళినట్లు తెలియని భరతుడు, అయోధ్యకు వస్తున్నప్పుడు, చూసిన నగరదృశ్యాలు.

2000 లోనో లేదా 2001 లోనో నేను అదిలాబాదు వెళ్ళాను. అప్పటికి ప్రభుత్వం గ్రామగ్రామానా జన్మభూమి కార్యక్రమం నడుపుతూ ఉంది. ప్రజల్ని స్వావలంబన వైపుగా నడపడానికి ఉద్దేశించిన ఆ కార్యక్రమం విజ్ఞప్తుల జాతరగా మారిపోవడం కనిపించింది. తిరిగి రాగానే రాసిన కవిత ఇది. దీన్ని ఏదో పత్రిక ప్రచురించినట్టు కూడా గుర్తు. ఈ కవిత బీజంగా, విలాపగీతాల దారిలో, అయిదో సర్గలో కవితలు ఒక వేడినీటిబుగ్గలాగా పొంగుకొచ్చాయి. ఈ సర్గలో కవితలన్నీ మనిషిగా నా కలవరపాటుని చిత్రించేవే అయినా, కవిగా నాకు ఉపశమనానిచ్చాయి.

ఈ మధ్య విజయవాడలో ఎవరో యువకుడు నన్ను కలిసి, మాట్లాడుతూ, ‘తెలుగు సాహిత్యంలో ప్రపంచీకరణ మీద పి హెచ్ డి చేసాను. చూడబోతే మీరు ప్రపంచీకరణ మీద ఏమీ రాసినట్టే లేదే’ అన్నాడు. నేను చిరునవ్వాను. ‘నా పునర్యానం కావ్యం మీరు చూసినట్టు లేదు’ అని మాత్రమే అనగలిగాను.


అడివి నన్ను కలవరపరిచింది
ఆకులు రాలుతున్నప్పటి అడివి
నన్ను మరీ కలవరపరుస్తుంది.

ఎలా గడిచిపోయినవో
ఎప్పుడు దాటిపోయినవో
ఆ రోజులు, ఆ రాత్రులిక తిరిగి రావు.
ఫాల్గుణ మాసపు వెన్నెల రాత్రుల్లో
కాము­ని పున్నమికై ఇంక ఆ ఉరుకుల్లేవు
ఆ పరుగుల్లేవు.

పొగలు చిమ్ముతున్న నడి మధ్యాహ్నపు
ఆకాశాన్ని వీపున మోస్తో
ఎడతెగకుండా రాలుతున్న ఎండుటాకుల మధ్య
దారి వెతుక్కొంటో
తిండి కోసం బయల్దేరారా తల్లులూ, పిల్లలూ.

నేటి దాకా బతికిన రోజులన్నీ
రంగులు చల్లుకున్న పూలగొట్టాలు
ఇప్పుడు వాటిని పక్కన పారేసారు.
ముందు ముందు బతకవలసిన రోజులు
ఇంక ఎక్కుపెట్టక తప్పని శరాలు, ధనువులు.

మండుతున్న దిగంతాలు సరిహద్దులుగా
బీదల రాజ్యానికి జెండాలయి
మంకెనలు విరబూసినవి.

గ్రామగ్రామానా ఇప్పుడు
విజ్ఞప్తుల జాతర జరుగుతున్నది
వాళ్లు జీపుల్తో, కార్లలో, ట్రాక్టర్లలో
రిపోర్టులు, ప్రకటనలు, ప్రణాళికలు పట్టుకొచ్చేరు
వైర్‌ లెస్‌లలో, ఫాక్స్‌లపై, పేజర్లపై
సందేశాలు చకచక సాగుతున్నవి.

ఈ సరికొత్త కామదేవుని ముందు సాగిలపడి
బీదవాళ్లు తిండి కోసం ప్రార్ధిస్తున్నారు
బీదవాళ్ల నాయకులు వాగ్దానాలకై ప్రార్ధిస్తున్నారు
బీదవాళ్ల కవులు అందలం కోసం ప్రార్ధిస్తున్నారు.

అడివి నన్ను కలవరపరిచింది
ఆకులు రాలుస్తున్న అడివి నన్ను మరీ కలవరపరిచింది.

(పునర్యానం, 2.5.2)


The forest disturbed me, but
The fall disturbed me even more.

I don’t know how or when they passed
Those days and nights will never return,
Those moonlit nights and fireside songs.

Bearing the burden of fiery noon
Mothers and children
Set out for food in the forest.

Colors and flowers are gone, discarded.
It’s time to draw the bows and arrows.

In full bloom, the Palash.
Like the flag of the kingdom of the meek,
The flowers shine towards the horizon.

There is a ritual of petitions in every village.
A procession of jeeps, cars, and tractors arrive
Bringing plans, reports, and announcements.
It’s all wireless, fax, and pagers.

Kneeling before the new God of Desire
The poor, pray for food.
Their leaders for promises, and
Their poets for praise.

The forest disturbed me, but
The fall disturbed me even more.

28-8-2023

10 Replies to “పునర్యానం-32”

 1. ప్రపంచీకరణ ప్రభావంలో అడవి దృశ్యం. నేపథ్య వివరణ తో మరింత స్పష్టత చేకూరింది. మూలానువాదాలు పరస్పర విశదీకరణ సహాయకాలు.ఆంగ్ల భాషకు అంతగా అలవడిపోయామా,తెలుగు నుండి ఆంగ్లానికి వచ్చే సరికి అనివార్యంగా కొంత కవిత్వం పుప్పొడిలా రాలిందా తెలియదు కాని ఆంగ్లమే సులభంగా ఉందేమో అనిపించడం నాకేనా ఇంకెవరికైనా కూడానా ? నా అజ్ఞానం కూడా కారణం కావచ్చు. లేక తెలుగు ముందు చదివి ఆంగ్లంలో చదవటమా
  ఏది ఏమైనా ప్రపంచీకరణ అంటే ఉన్న అస్పష్టత తొలగి ఒక అవగాహన చేకూర్చింది. నా మట్టుకు నా కైతే కవిత్వలోకపువ ప్రధాన ద్వారం ఇప్పుడిప్పుడే కనిపిస్తుందనిపిస్తుంది. మిడి మిడి కవిత్వానికి ,మిసిమి కవిత్వానికీ తేడా తెలుస్తుంది. సహజ స్పందనానుభవానికి , అనుభవ క్షీరసాగర మథనానికి ఆంతర్యం తెలుస్తుంది. విశ్వకవిత్వ ఋతుపవన ప్రభావం ఇప్పుడిప్పుడే విశదమౌతుంది. ధన్యవాదాలు సర్.

  1. తెలుగు కవిత్వం లో పదాల బరువు ఇంగ్లీష్ అనువాదంలో పక్కకు పోయి సూటిగా ఉండటం వల్ల మీకు నచ్చుతున్నదనుకుంటాను.

   1. నాకు నచ్చడం మీ తెలుగు పదాల బరువే. దాన్నే నిశితంగా పరిశీలిస్తున్నాను.తేలిక పదాలలోనే గంభీర భావం ఎలా చొప్పించగలుగుతున్నారా అని? ముఖ్యంగా కవిత్వీకరణకు మీరెన్నుకునే ధోరణి.అనువాదం భావం ఉన్నదున్నట్టుగా చెప్పగలదు కానీ తెలుగుతనం ఎలా చూపగలదు.
    అందుకే గీతాంజలి రవీంద్రునిస్వీయ ఆంగ్లానువాదమైనా మూల బెంగాలీ భాషలో ఎలా ఉండి ఉంటుందోనన్న కుతూహలం అలాగే ఉంది.బెంగాలీ భాష ఒంట పడితే కాని ఆ మాధుర్యం తెలియదు. భాష మీద పట్టున్న ఏ రచయిత ఐనా తన కవితల స్వీయానువాదం
    అంతకంటే బాగా చేయలేనన్నంతగా చేస్తారు. మీదీ అంతే సర్. మూలం చదివిన వెంటనేమీ అనువాదం చదువగానే చాలా బాగా అంటే ముఖ్యంగా ఆ ఎమోషన్ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అసలు ఒక్కోసారి తెలుగును మించుతుంది కూడా ఎమోషన్. ఎందుకంటే నిజ జీవితంలో చాలా సహజంగా ఎమోషనల్ కాగానే ఆంగ్లం దూసుకు వస్తుంది. ఎందుకో కృతజ్ఞతా భావం పొడమగానే థ్యాంక్స్ అనే పదం పెదిమలను తడుముతూంది.
    అది తెలుగులో వాచ్యంలో కాకుండా హావభావ ప్రకటనలో ఉంటుంది. ఒకచూపు లో కృతజ్ఞత గోచరిస్తూంది. నవ్వుగా విరబూస్తుంది . ఇవన్నీ అనుభవైకవేద్యాలు.
    మీ రచనలన్నీ నాకు నిత్య పాఠాలు సర్.

 2. ఆకలు రాలుస్తున్న అడవి నన్ను మరీ కలవర పరచింది.ఈ ఒక్కవాక్యంలో కొన్ని వేల అర్థాలు గోచరించాయి నాకు.

  1. ధన్యవాదాలు మేడం.

   మొత్తానికి ఈ బ్లాగులో కామెంట్ పెట్టడంలో ఎదురవుతున్న సమస్యను అధిగమించారు. మీ సంకల్పశక్తి చాలా గొప్పది.

 3. ఏ వ్యవస్థలోనైనా,పరిపాలనలోనైనా జరిగే అద్భుతాలనీ,అకృత్యాలనీ కూడా ఆ పరిసరాలలోని దృశ్యాలు ఎలా ప్రతిబింబింపజేస్తాయో చక్కగా చెప్పారు సర్.

 4. ‘బీదవాళ్ల కవులు అందలం కోసం ప్రార్ధిస్తున్నారు.’ ఇప్పటికీ ..

Leave a Reply

%d bloggers like this: