జాతీయోద్యమ స్ఫూర్తి భద్రపరచుకోవాలి-1

భారత స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ రెండురోజుల సదస్సు ప్రారంభసమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మృణాళిని గారు, స్వాగత ప్రసంగం చేసిన అకాడెమీ కార్యదర్శి గౌరవనీయులు శ్రీనివాసరావుగారూ, గౌరవ అతిథిగా విచ్చేసిన తెలంగాణా రాష్ట్ర భాషా, సాంస్కృతిక సంచాలకులు హరికృష్ణగారూ, రఘుగారూ, దేవేంద్ర గారూ, మిత్రులారా!

‘జాతీయోద్యమంలో తెలుగు సాహిత్యం నిర్వహించిన పాత్ర’ అనే అంశం మీద రెండు రోజుల సదస్సు ఏర్పాటు చేసినందుకు సాహిత్య అకాడెమీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ విషయం పైన ఇటువంటి సదస్సు, సద్గోష్టి ఇవాళ చాలా అవసరం.

ఈ సందర్భంగా నాకో సంగతి గుర్తొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో నేను పాఠశాల విద్య డైరక్టరుగా ఉన్నప్పుడు ఒకరోజు రాజమండ్రిలో ఉన్న బి యి డి కాలేజి చూడటానికి వెళ్ళాను. ఆ కాలేజి మా శాఖ ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉండేది. అప్పటికి చాలా కాలంగా ఆ కాలేజికి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నప్పటికీ, చాలా ఆలస్యంగాగాని నాకు వీలు చిక్కలేదు. ఆ రోజు కాలేజి అంతా తిరిగి చూసాను. ఆ విద్యార్థులందరినీ ప్రిన్సిపాలు మేడ మీద సమావేశపరిచి వాళ్ళని ఉద్దేశించి నన్ను మాట్లాడమని అడిగాడు. నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా, నా పక్కనే ఉన్న పాఠశాల విద్య ఆర్‌.జె.డి, గోడ మీద ఉన్న ఒక పటం చూపిస్తూ, ఆయనెవరని పిల్లల్ని అడిగాడు. నేను కూడా నా చూపులు గోడమీదకు తిప్పాను. అది గరిమెళ్ళ సత్యనారాయణ ముఖచిత్రం. చాలామంది పిల్లలు ఆయన ఎవరో చెప్పలేకపోయారు. కాని మొత్తానికి ఒక పిల్లవాడు ఆయన పేరైతే చెప్పగలిగాడుగాని మరే వివరాలూ చెప్పలేకపోయాడు. ఆ పేరు మాత్రం నీకెలా తెలిసిందని అడిగాను. ‘ఎందుకంటే ఈ కాలేజికి ఆయన పేరే కదా పెట్టారు’ అని జవాబిచ్చాడు. నేను ఉలిక్కిపడ్డాను. అప్పటికి రెండేళ్ళుగా పాఠశాల విద్యా శాఖ కమిషనరుగా ఉన్నాను. కాని ఆ కాలేజికి గరిమెళ్ళ సత్యనారాయణ పేరుపెట్టారని నాకు తెలీదు. ఆ కాలేజి గేటుదగ్గరగాని, గోడమీద గాని ఆయన పేరు లేదు. చివరికి ఆ కళాశాల సిబ్బంది కూడా నాకు కాలేజి చూపిస్తూ, ఆ లైబ్రరీ, ఒకప్పుడు రాధాకృష్ణన్‌ కూర్చున్న కుర్చీ అన్ని చూపించారుగానీ, గరిమెళ్ళ సత్యనారాయణ ఊసే ఎత్తలేదు. నేను కిందకొచ్చాక మళ్ళా ప్రిన్సిపాలు రూములో అడుగుపెట్టి అక్కడ గోడమీదన్నా ఆ పేరు రాసి ఉందా అని చూసాను. పేరైతే రాసి ఉంది, కాని గరిమెళ్ళ సత్యనారాయణ అని కాదు, జి.ఎస్‌. కాలేజ్‌ ఆఫ్‌ కాంప్రహెన్సివ్‌ ఎడ్యుకేషన్‌ అని రాసి ఉంది!

గరిమెళ్ళ సత్యనారాయణ గురించి ఆ కళాశాల గుర్తుపెట్టుకోవలసినట్టుగా గుర్తుపెట్టుకోలేదు సరే, మనమేం చేస్తున్నాం అని ప్రశ్నించుకుంటే, సమాధానం చెప్పడం కష్టం. ఆయన సుబ్రహ్మణ్య భారతితో సమానమైన కవి అని ఆయన జీవితకాలంలోనే కొనియాడబడ్డవాడు. కాని భారతియార్‌ కి తమిళ దేశంలో దక్కిన అపురూపమైన గౌరవంతో పోలిస్తే గరిమెళ్ళకు మనమేమివ్వగలిగాం? ఆయన గీతాలకి ఇంగ్లిషు అనువాదం ఇప్పటికే వచ్చి ఉండాలి కదా. ‘మాకొద్దీ తెల్లదొరతనం’ గీతానికి ప్రకాశం గారు చేసిన ఇంగ్లిషు అనువాదం అందులో ముందు పుటల్లో ఉండాలి కదా. కనీసం భారతీయ సాహిత్య నిర్మాతలు సిరీస్‌ లో సాహిత్య అకాడెమీ ఇప్పటికే ఆయన మీద ఒక మోనోగ్రాఫు వెలువరించి ఉండాలి కదా!

సరే, ఆజాదీ కా అమృత మహోత్సవ్‌ మొదలైన తరువాతనైనా జాతీయోద్యమ వీరుల పట్ల, ఆ ఉద్యమాన్ని ఉత్తేజితుల్ని చేసిన కవుల పట్లా, రచయితల పట్లా జాతి సంస్మరణ ఏ విధంగా ఉందో చూద్దామని ఆజాదీ కా అమృతమహోత్సవ్‌ వెబ్‌ సైట్‌ తెరిచి చూసాను. అందులో History Corner లో Unsung Heroes of India’s Freedom Struggle అనే పేజీకి వెళ్లి చూసాను. అక్కడ రాష్ట్రాలవారీగా, జిల్లాల వారీగా స్వాతంత్య్ర సమరయోధుల వివరాలు పొందుపరచడానికి ఏర్పాటు చేసారు. అందులో ఇప్పటిదాకా, ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి 138,  తెలంగాణా నుంచి 61 మంది వివరాలు మాత్రమే ఉన్నాయి. ఇంతేనా? ఈ రెండు రాష్ట్రాలనుంచి జాతీయోద్యమంలో పాల్గొని తమ సమస్తం త్యాగం చేసిన వీరులూ, యోధులూ కనీసం రెండు వందల మంది కూడా లేరా? జాతీయోద్యమ కాలంలో ఒక్క తెలంగాణానుంచే ఇరవై రెండు వేల మంది సత్యాగ్రహులు జైళ్లకి వెళ్ళారని చరిత్రకారులు రాసారు. సత్యాగ్రహులు మాత్రమే. ఇక తక్కిన వివిధ మార్గాల్లో పోరాడినవాళ్ళని కూడా కలుపుకుంటే సుమారు యాభై వేలమందిదాకా ఉండరా? కాని, పొందుపరిచిన వివరాల మేరకు చూస్తే తెలంగాణా కాస్త నయమనిపించింది. అక్కడ కనీసం రాంజీగోండ్, తుర్రెబాజ్ ఖాన్ పేర్లేనా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ లో అకారాది క్రమంలో మొదటి జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా పేజి తెరిచి చూస్తే కనీసం సీతారామరాజు పేరు కూడా లేదక్కడ! సీతారామరాజు పోరాటంలో పాల్గొన్న గిరిజనుల వివరాలు ఈ మధ్య మా అన్నయ్య సుందర్రావు సేకరిస్తూ ఉన్నాడు. ఇప్పటికి ఎంతమంది లెక్కతేలారని అడిగితే సుమారు పదకొండు వందలమంది దాకా ఉన్నారని చెప్పాడు. సరే, ఆంధ్ర, రాయలసీమ, నైజాము మూడు ప్రాంతాల్లోనూ, రాజద్రోహ నేరం కింద అరెస్టయిన మొదటి జాతీయోద్యమ యోధుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావునైనా తలుచుకున్నారా అని  అని కర్నూలు జిల్లా వివరాలు తెరిచి చూసేను. ఆ ఊసే లేదక్కడ.

అంటే ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లోని స్వాతంత్య్ర యోధుల వివరాలు మనదగ్గర లేవా? ఎందుకు లేవు? హైదరాబాదు రాష్ట్రంలో స్వాతంత్య్రోద్యమ చరిత్రను సంకలితం చేయడానికి నియమించబడ్డ హైదరాబాదు స్టేట్‌ కమిటీ 1957 లోనే నాలుగు బృహత్సంపుటాలు వెలువరించింది. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌ లో జాతీయోద్యమ చరిత్ర మామిడిపూడి వెంకటరంగయ్య సంపాదకత్వంలో సంకలనం చేసినవి మరొక నాలుగు బృహత్సంపుటాలు 1974 లో వెలువడ్డాయి. మరి ఎక్కడ ఈ అగాధం ఉంది? విజ్ఞాన సర్వస్వాలుగా చెప్పదగ్గ ఆ ఎనిమిది సంపుటాల్లోని సమాచారమూ పుస్తకాలకీ, లైబ్రరీలకీ మాత్రమే పరిమితమైపోయిందా? తెలుగు జాతి స్మరణలో జాతీయోద్యమం అంటే గుర్తొచ్చేది ఆ 199 మందేనా?

అందుకనే, సాహిత్య అకాడెమీ ఈ రెండు రోజుల సదస్సు నిర్వహిస్తున్నదని తెలియగానే నాకెంతో సంతోషమనిపించింది. మహత్తరమైన మన జాతీయ వారసత్వానికీ, మన ప్రస్తుత పరిస్థితికీ మధ్య ఉన్న ఈ అంతరం గురించి ఈ సందర్భంగానైనా బిగ్గరగా మాట్లాడుకోవచ్చు కదా అనిపించింది. మహత్తరమైన మన జాతీయోద్యమం గురించి ఇవాళ్టి భారతదేశానికి చాలా తెలియదనే విషయం తెలిసే కొద్దీ చాలా దుఃఖంగానూ, దుర్భరంగానూ అనిపిస్తూ ఉంటుంది. ఈ దుస్థితికి కారణాలు ఏమేనా గానీ, ఈ చీకటి మధ్య ఎంత చిన్న దీపం వెలిగించినా అది గొప్ప విషయమే.

అసలు జాతీయోద్యమ స్మృతి పట్లనే ఇంత ఉదాసీనత ఉన్నప్పుడు, ఆ రోజుల్లో ఆ ఉద్యమం వల్ల పుట్టిన సాహిత్యం గురించీ, తిరిగి ఆ ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన సాహిత్యం గురించీ ఆసక్తి ఉంటుందని ఎలా అనుకోగలం? ఇప్పటికే స్వాతంత్య్రోద్యమ కాలం నాటి సాహిత్యాన్ని మనం ఎంతో పోగొట్టుకున్నాం. కొన్నాళ్ళు పోతే ఆ విషయాల గురించి సాధికారికంగా చెప్పే తరం కూడా కనుమరుగైపోతుంది. ఇక ఎక్కడేనా గ్రంథస్థంగా ఉన్నా అది కూడా అరకొరగానో, అసంపూర్తిగానో మిగిలిపోతుంది.

ఉదాహరణకి, అమృతమహోత్సవ్‌ సైటులోనే హిస్టరీ కార్నర్‌లో ‘స్వతంత్ర స్వర్‌’ అనే విభాగం కింద బ్రిటిష్‌ కాలంలో నిషేధించబడ్డ సాహిత్యం గురించిన వివరాలు పొందుపరిచారు. ఇండియన్‌ ఆర్కైవ్స్‌ డిపార్ట్‌ మెంటు వారు ప్రచురించిన కొన్ని పుస్తకాల పిడిఎఫ్‌ లు కూడా అందులో అందుబాటులో ఉంచారు. గొప్ప విషయం. తెలుగుకి సంబంధించి అందులో మూడు పుస్తకాల్లో కొంత సమాచారం ఉంది. ఆ పుస్తకాలు ఒక్కొక్కటీ చూద్దాం.

మొదటిది, Patriotic Poetry Banned by  Raj (1982) అనే చిన్న పుస్తకం. అందులో తెలుగు సాహిత్యానికి సంబంధించి నిషేధించిన పది పుస్తకాల జాబితా ఉంది. ఆ పదింటిలో ఒక పుస్తకాన్నే రెండు సార్లు లెక్కేసారు. కాని ప్రభుత్వమే ప్రచురించిన ఆ జాబితాలో చేరకుండా ఉండిపోయిన పుస్తకాలు కూడా తక్కువేమీ కాదు. మొదటిది, ‘మాలపల్లి’ నవల. 1922 లో ప్రచురించబడ్డ మాలపల్లి నవల ఏడాది తిరక్కుండానే నిషేధానికి గురయ్యాక, తిరిగి పూర్తి నవల మీద నిషేధం 1937 కి గాని తొలగిపోలేదు. అలాగే దామరాజు పుండరీకాక్షుడు రాసిన ‘పాంచాల పరాభవం’ లేదా ‘పంజాబు దురంతాలు’ అనే నాటకం తెలుగు నాట సంచలనం రేకెత్తించిన రచన. జలియనవాలా బాగు దురంతాల మీద పుండరీకాక్షుడు ఆ నాటకం రాసారు. ఆయన ఆ నాటకాన్ని జలియన వాలా బాగు గడ్డమీద ప్రతి రోజూ ఒక తపస్సులాగా నిష్టగా కూచుని రాసారట. 1921 లో రాసిన ఈ నాటకం వెంటనే నిషేధానికి గురయ్యింది. అంతేకాదు, ఆ నాటకం మీద బ్రిటిష్‌ పార్లమెంటులో చర్చ జరిగింది. ఆ నాటకాన్ని తొలిసారి ఇంగ్లాండ్‌ లో ప్రదర్శిస్తే, అందులో నటించినందుకు ఎన్‌.జి.రంగా అరెస్టయ్యాడు కూడా. ఇది మామూలు చరిత్ర కాదు. స్టేజీ మీద డయ్యర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు బ్రిటిష్‌ పార్లమెంటులో మంటలు పుట్టించిన నాటకం. ‘శ్రీ గాంధి నామం మరువాం, మరువాం, సిద్ధము జైలుకు వెరువాం వెరువాం’ అనే గీతాన్ని ఈ నాటకంలో హిందువులూ, ముస్లిములూ ఇద్దరూ కలిసి పాడతారు. ఆ తర్వాత ఇది తెలుగు నాట ఒక భజనగీతంగా మారిపోయింది. కాని నేను చెప్తున్నదంతా మౌఖిక చరిత్ర. చెదురుమదురుగా ఉన్న ఈ మాటలెక్కడా ఒక్కచోట గ్రంథస్థం కానేలేదు. చివరికి భారతప్రభుత్వం ముద్రించిన సమాచారంలో ఈ నాటకం పేరే లేదు.

అలాగే మరొక నాటకం ‘చిచ్చరపిడుగు’. ప్రపంచనాటక చరిత్రలోనే ఇదొక ప్రత్యేకమైన రచన. కొండావేంకటప్పయ్య శిష్యుడైన రామచంద్రుని వెంకటప్ప అనే రచయిత మంగళ్‌ పాండే మీద రాసిన ఈ నాటకాన్ని రచయిత పేరులేకుండా మద్దూరి అన్నపూర్ణయ్య ‘కాంగ్రెసు’ పత్రికలో ప్రచురించారు. ప్రభుత్వం ఆయన్ను కబురంపించి ఆ నాటక రచయిత పేరు చెప్పమని అడిగింది. పత్రిక నియమావళి ప్రకారం రచయిత పేరు తాను వెల్లడించలేనని అన్నపూర్ణయ్య జవాబిచ్చాడు. అయితే రచయిత బదులు సంపాదకుడే ఆ శిక్ష అనుభవించవలసి ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. అన్నపూర్ణయ్య సంతోషంగా తలూపాడు. ఆయనకు అయిదేళ్ళ కఠిన కారాగారశిక్ష పడింది. కాని రామచంద్రుని వెంకటప్పను ఆ విషయం బాధిస్తూనే ఉంది. చివరకి 1930 లో చొల్లంగి ఉప్పుసత్యాగ్రహంలో ఆయన ఆ నాటక రచయిత తానేనని బహిరంగంగా ప్రకటించాడు. ప్రభుత్వం అతణ్ణి అరెస్టు చేసి మరొక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. అలా ఒక నాటకానికి గాను ఇద్దరు శిక్ష అనుభవించవలసి వచ్చిన నాటకం అది. ఇప్పుడు ఆ నాటం ఎక్కడ దొరుకుతుంది?

ఇటువంటి రచనలు, రచయితలు తెలుగులో ఎన్నో ఉన్నాయి. మరికొన్నేళ్ళు పోతే ఈ మాటలు కూడా చెప్పేవాళ్ళుండరు. నేను చెప్తున్నది ఆంధ్ర ప్రాంతంలో నిషేధించబడ్డ రచనల గురించి. నైజాం ప్రాంతంలో నిషేధించబడ్డ రచనల గురించిన వివరాల జాబితా ఇటువంటిది ఏదీ ఇప్పటిదాకా ఎవరూ రూపొందించినట్లే లేదు.

అమృతోత్సవ్‌ సైట్లో ఉన్న మరొక పుస్తకం Patriotic Writings Banned by the Raj (1984)  అనేది. ఇందులో తెలుగు పుస్తకాలు ఇరవై దాకా లెక్కకొచ్చాయి. ‘మాలపల్లి’ నవల ఈ జాబితాలో చేరింది. కానీ వాసిరెడ్డి, సుంకర లు రాసిన ‘ముందడుగు’  (1945) నాటకం ఊసే లేదు. గోర్కీ అమ్మ నవలకు క్రొవ్విడి లింగరాజు గారి తెలుగు అనువాదంతో సహా మరెన్నో వామపక్ష రచనలు ప్రభుత్వ నిషేధానికి గురయ్యాయి. వాటి వివరాలు మనకెక్కడా ఒకచోట లభ్యం కావడం లేదు.

ఇక అమృతోత్సవ్‌ సైట్లో ఉన్న మూడవ పుస్తకం Publications Proscribed by the Government of India (1985) అనే సంకలనం. బ్రిటిష్‌ లైబ్రరీ ప్రచురణ. ఇందులో పన్నెండు పుస్తకాల జాబితా ఉంది. అందులో ఒకటి రెండు తప్ప తక్కినవన్నీ ముందు జాబితాల్లో ఉన్నవే.

ఈ మూడూ కాక, మరొక విలువైన పుస్తకం కూడా ఆ సైట్లో కనబడింది. నిషేధించబడిన పుస్తకాల్లోంచి ఎంపిక చేసిన తెలుగు గేయాలు, పద్యాలతో ‘స్వాతంత్య్ర స్వరము’ (1982) అనే పేరిట వెలువరించిన 88 పేజీల పుస్తకం. మీరెవరైనా ఆ పుస్తకం చూసారా? నేనయితే ఇదే మొదటిసారి చూడటం.

ప్రభుత్వం నిషేధించిన పుస్తకాల్లో వడ్డాది సీతారామాంజనేయులు, పూడిపెద్ది కాశీవిశ్వనాథ అనే వారలు సంకలనం చేసిన ‘స్వరాజ్య గీతామృతము’ (1921-23)  అనే ఒక పుస్తకం కూడా ఉంది. ఈ పద్యాల్లో కొన్ని ఆ పుస్తకంలోంచి కూడా తీసుకున్నారు. ఈ పుస్తకాన్ని నేనిప్పటిదాకా చూడలేదు. కొన్నాళ్ళు పోతే ఇటువంటి ఒక పుస్తకం వచ్చిందని కూడా మనకి చెప్పేవాళ్ళుండరు. ఇప్పుడేనా ఆర్కైవ్స్‌ నుంచి ఆ పుస్తకం మొత్తం సంపాదించి పునర్ముద్రించవలసిన అవసరం లేదంటారా?

జాతీయోద్యమ స్మృతి పట్ల నేడు ప్రజల కనవస్తున్న సమాచారలోపానికీ, నిరాసక్తతకీ ప్రధాన కారణం మన విద్యావ్యవస్థలోనూ, మన చరిత్ర రచనలోనూ ఉందని చెప్పవచ్చు. కాని జాతీయోద్యమ సాహిత్యం పట్ల మన అజ్ఞానానికి కారణమేమై ఉంటుంది?

నలభై ఏళ్ల కిందట, రాజమండ్రిలో ప్రసిద్ధ రంగస్థల ప్రయోక్త టి. జె. రామనాథం కోసం నేను ‘స్వాతంత్య్రోద్యమ శంఖారావం’ (1984) అనే ఒక నాటకం రాసిచ్చాను. అదొక డాక్యుమెంటరీ రూపకం. అందుకని జాతీయోద్యమకాలంలో ప్రజల నాలుకల మీద నానిన జాతీయ గీతాల్నీ, గేయాల్నీ అందులో సందర్భానుసారం వాడుకోవాలని అనుకున్నాం. అవెక్కడ దొరుకుతాయా అని గౌతమీ గ్రంథాలయాన్ని గాలిస్తే గురజాడ రాఘవశర్మ సంకలనం చేసిన ‘జాతీయ గీతాలు’ (1973) దొరికింది. దాదాపు ఏడువందల పేజీల ఆ బృహత్సంకలనం ఒక పెన్నిధిలాగా మా కంటబడింది. ఆవురావురుమంటూ ఆ పుస్తకం తిరగేస్తే, అందులో ఎన్నో పేర్లు, కొండపల్లి జగన్నాథ దాసు, మంగిపూడి, పూడిపెద్ది, చెరుకువాడ, బెల్లంకొండ చంద్రమౌళీశ్వర శాస్త్రి, చెన్నాప్రగడ లాంటివి అప్పటిదాకా మేము విని ఉండనివి కనబడ్డాయి. జాతీయోద్యమ కవులుగా ప్రసిద్ధి చెందిన చిలకమర్తి, గరిమెళ్ళ, రామిరెడ్డి, కవికొండల, బసవరాజు, త్రిపురనేని వంటి వారివి కూడా అప్పటిదాకా మేము చదివి ఉండని ఎన్నో గేయాలు ఆ పుస్తకంలో కనిపించాయి.

ఆ పుస్తకాన్ని మొదటిసారి చూసిన చాలా రోజుల దాకా నాలో చెప్పలేని అలజడి కలుగుతూనే ఉంది. ఇదేమిటిది? ఎందుకని ఈ కవుల గురించి ప్రధాన స్రవంతి సాహిత్య సంకలనాల్లో, సాహిత్య చరిత్రల్లో తెలియవలసినంతగా తెలియలేదు? ఏళ్ళ మీదట నాకేమి అర్థమయిందంటే, అసలు ఆధునిక తెలుగు సాహిత్యం గురించి మనం చెప్పుకుంటూ వస్తున్న నెరేటివ్‌ లోనే పెద్ద లోపం ఉందని. ముద్దుకృష్ణ ‘వైతాళికులు’, నారాయణరెడ్డి ‘ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు’, ఆరుద్ర ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం, నాలుగ సంపుటం’, వెల్చేరు నారాయణ రావు ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ లాంటి గ్రంథాలు చూడండి. వాటిలో జాతీయోద్యమ కవిత్వ యుగమంటూ ఏదీ కనిపించదు. ఎక్కడైనా దేశభక్తి కవిత్వం గురించిన ప్రస్తావన ఉన్నా అది భావకవిత్వం అనే విభాగంలో ఒక ఉపవిభాగంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ, అది నిజమేనా?

తెలుగు భావకవిత్వం పుట్టిందే 1920 ల తర్వాత. ఇంకా చెప్పాలంటే 1925 తర్వాత మాట. ఎందుకంటే, కృష్ణపక్షం అచ్చయ్యింది ఆ ఏడాది కాబట్టి. కాని అప్పటికే తెలుగులో జాతీయోద్యమ కవిత్వం నిప్పులు చిమ్ముతూ ఉంది. చిలకమర్తి ‘భరతఖండంబు చక్కని పాడియావు’, గరిమెళ్ళ ‘మాకొద్దీ తెల్లదొరనం’, మంగిపూడి ‘మేలుకొనుమీ భరతపుత్రుడ, మేలుకొనుమీ సచ్చరిత్రుడ’, కొండపల్లి జగన్నాథ దాసు ‘కనులనీరు కారునుగా కరుణలేక ఆ డయ్యరొనర్చిన వధ వినిన’, ఆయనదే మరొక సుప్రసిద్ధ గీతం ‘నిరాకరణమను మిఠాయి యిదుగో, బిరాన రుచి చూడండీ’ లాంటివి తెలుగునేలమీద దావానలంగా వ్యాపించి ఉన్నాయి. వాటిని మనం భావకవిత్వం కింద ఎలా లెక్కేయగలుగుతాం? వస్తువులో, భావనలో, స్ఫూర్తిలో భావకవిత్వం మరింత సూక్ష్మమైంది. అది రొమాంటిసిజం నుంచి ప్రేరణ పొందిన స్వేచ్ఛాగానం. కానీ జాతీయోద్యమ కవిత్వమో? నిజ జీవిత పోరాటాల్లోంచి, వీథుల్లోంచి, కారాగారాల్లోంచి, కొరాడాదెబ్బల మధ్యనుంచి పుట్టిన కవిత్వం. అది మన అసలైన నెత్తుటి రచన. కాని దాన్నెందుకని మనం మన సాహిత్య చరిత్రల్లోంచి తుడిచిపెట్టాం?

(ఇంకా ఉంది)

Featured image: Wikicommons

29-8-2023

8 Replies to “జాతీయోద్యమ స్ఫూర్తి భద్రపరచుకోవాలి-1”

 1. Telugu academy and websites have bias as to ask whom to update. If they approach right persons they would have been better. Happy that atleast this was brought forward by Mrunalini mam. I request you to please kindly take an initiative to strengthen our Telugus part in National movement.
  You are the most important and perfect link Sir, between the darkness and light. Many thanks for this unique piece. My salutations to you.

 2. చాలా ఉద్వేగ భరితంగా సాగింది. ప్రసంగ పాఠం చదువుతుంటే ఉద్విగ్నతకు లోనయ్యానా నేనైతే. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు నిర్వాహకులు స్థానిక సాహిత్య పిపాసువులకైనా తెలుయదేయాలి. మీ కార్యక్రమం అయిన తరువాత ఎవరో ఫార్వార్డు చేసిన ఇన్విటేషన్ చూడటం జరిగింది. మీరు ఇదంతా రాస్తుంటే నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు
  రాజోలు నుండి వచ్చిన వేమూరి వెంకటప్పయ్య సారు పాడిన పడాల రామారావు గీతం గుర్తుకు వచ్చింది.
  ఉప్పొంగి పొంగరా ఓ భరతవీరా
  భారత స్వాతంత్ర్య సమర రంగాన
  పల్లవి పెదవులపై ఆడింది. 1970 వరకు ఉన్న సవ్య విద్యా వ్యవస్థ ఒక్కసారిగా స్వార్థరాజకీయ దుమారంలో అస్తవ్యస్తమైంది. అంటరాని తనం మహా పాపం,కులమతాలు రూపు మాసిపోవాలి మానవులంతో ఒకటే వంటి ఆదర్శాలు స్వీయ చైతన్య దిశలో ఉన్న పరిస్థితి తల్లక్రిందులైంది.నా పాఠశాల జీవితం ఆదర్శ స్వప్నాలతో గడిస్తే , కళాశాలకు వచ్చేసరికి ప్రాంతీయ విద్వేషపు చిచ్చు మొదలై, తరువాత ఓటు బ్యాంకులకై కులోద్ధర ణలు,మతాసక్తులు పెంపొందించబడి దేశభక్తి వెలవెలబోయింది. ఇంతలో కార్చిచ్చు వలె కాన్వెంటు చదువులు ఇంగ్లీషు మీడియంలో బాల్యానికి మన సంస్కృతిని దూరం చేసాయ నడంలో ఎంత మాత్రం సందేహం లేదు. విద్యార్థులను మార్కుల విక్రమార్కులుగా చేయాలనే కార్పొరేటు కళాశాలల వ్వసస్థ’ దేశమంటే మట్టి కాదోయ్ ‘ అన్న గురజాడ మాటను ఖాతరు చెయ్యకుండా చేసింది. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్లు ఇప్పుడు ఎవరిని నిందించాలా తెలియని అయోమయ స్థితి.
  అప్పుడెప్పుడో రేడియో ప్రసంగ పరంపరకోసం కొన్ని దేశభక్తి గీతాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నవి సేకరించాను. కాని మన కంఠ శోష తప్పితే వినిపిం చుకోవలసిన యువత వినే పరిస్థితి చెయ్యి దాటిం ది. దీనికోసం తీవ్రతరమైన ఉద్యమ దీప్తి అవసరం సర్. ఇరవైఏళ్ళ నుండి గుండెలో గూడు గట్టుకున్న భావోద్వేగం ఇలా బద్దలైంది. మీ ప్రసంగం లో ఎన్నెన్నో వివరాలు చూసి ఆశ్చర్యమనిపించింది. మీకు నమస్సులు.

 3. గొప్ప సంగతి. ఇది ఎంతమంది చూస్తారో వారంతా తప్పక నోరెళ్ల బెడతారు. ఆరుద్ర గారు లాంటి వాళ్ళు కూడా గుర్తించని segment ఇది. మీరే మీలాంటి మరి కొందరిని గుర్తించి బృందంగా ఏర్పడితే కనీసం వందేళ్ల సందర్భం నాటికి కొంత ప్రయోజనం ఉంటుంది సర్. మీకు నమోవాకాలు.

Leave a Reply

%d bloggers like this: