
తెలంగాణలో గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్న జిల్లాల్లో అదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే నేను క్షేత్రస్థాయిలో పనిచేశాను. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో నాకు ప్రత్యక్షంగా పనిచేసే అవకాశం దొరకలేదు. కానీ వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా గిరిజనులతో కలిసి తాము పనిచేసిన అనుభవాలు సివి కృష్ణారావు గారి ద్వారా, మా డిపార్ట్మెంట్లో సీనియర్ అధికారీ, యాంత్రొపాలజిస్టూ డా. వి ఎన్ వి కే శాస్త్రి గారి ద్వారా వినేవాడిని. ఇక భద్రాచలం ఐటిడిఏ గురించి విద్యాసాగర్ గారు రాసిన భద్రాచలం మన్యం కథలు ఎలానూ ఉండనే ఉన్నాయి.
1987లో నేను గిరిజన సంక్షేమ శాఖలో చేరినప్పటికి అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఐటిడిఏల పనితీరు గురించి దేశమంతా చెప్పుకునేవారు. ఆ రోజుల్లో అస్సాం ముఖ్యమంత్రీ, అస్సాం గణపరిషత్ అధ్యక్షుడూ, యువకుడూ ప్రఫుల్ల కుమార్ మహంత అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని కలుసుకోవడానికి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కార్యక్రమాల్ని క్షేత్రస్థాయిలో చూడాలని ఉందని ఆయన రామారావుతో చెప్పాడు. ఎన్ టి ఆర్ ఆయన్ని ఏటూరునాగారం, ఉట్నూరు వెళ్లి చూసి రమ్మని చెప్పాడు. ఏటూరు నాగారంలో సి.వి.ఎస్.కె. శర్మ అనే ఆయన, ఉట్నూరులో ఎం.వి.పి.సి. శాస్త్రి అనే ఆయన ప్రాజెక్ట్ అధికారులుగా పని చేసేవారు. వారి నిరాడంబర జీవన విధానం, ఇరవైనాలుగ్గంటలూ గిరిజనులతో మమేకమై పనిచేసే పద్ధతి మా శాఖలో కథలుగా చెప్పుకునేవారు.
ఇక వీరిద్దరూ కాక మా డిపార్ట్మెంట్లో హుస్సేన్ గారనే ఒక కురువృద్ధుడు ఉండేవాడు. ఆయన 1956లో సోషల్ ఎడుకేషన్ అధికారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. తెలంగాణ గిరిజన జీవన పరిణామానికి ఆయన ప్రత్యక్ష సాక్షి. ఏళ్ల తరబడి గిరిజనులతో కలిసిమెలిసి పనిచేసిన అనుభవం లోంచి తనకు కలిగిన వివేకాన్ని ఆయన తన తర్వాతి తరం అధికారులకు వీలైనంతగా అందివ్వడానికి ప్రయత్నించేవాడు.
కాబట్టి 2000లో నేను హైదరాబాద్ కేంద్ర కార్యాలయానికి వచ్చిన తర్వాత వీలైనన్ని సార్లు ఆ జిల్లాల్లో పర్యటించాలని అనుకునేవాడిని. కాని అవకాశం కుదిరేది కాదు. 2001లో ఏటూరునాగారం ఐటిడిఏ కి ఒక యువ ప్రాజెక్ట్ అధికారి వచ్చినప్పుడు అతనికి కొంత మార్గదర్శనం చేయమని నన్ను ఆ జిల్లాకు మా కమిషనర్ లైజన్ అధికారి గా నియమించాడు. ఆ అవకాశం వల్ల 2001లో మొదటిసారి ఏటూరు నాగారం అడవులు చూడగలిగాను. ఏటూరునాగారం, తాడవాయి, మేడారం లాంటి ప్రాంతాల్ని చారిత్రక స్థలాల్ని చూసినంత విభ్రమతోనూ, ఆసక్తితోనూ చూశాను.
గిరిజన సంక్షేమంలో సివి కృష్ణారావు గారు నాకు ఒక రోల్ మోడల్. ఫణికుమార్ ‘గోదావరి గాథలు’ పుస్తకానికి రాసిన ముందుమాటలో కృష్ణారావు గారు తన ఉద్యోగ జీవితంలో తాను తిరుగాడిన కొన్ని స్థలాల్ని ప్రస్తావించారు. పసర, ఉట్నూరు, లవ్వాల బందాల పంకెన, మార్లవాయి, గిన్నెధరి, బాబేఝరి, మహదేవపూర్, కనకనూరు, కొయిదా, కిండ్ర, గుర్తేడు వంటి గ్రామాల గురించి ఆయన రాసిన మాటలు నా హృదయం మీద శిలాక్షరాలుగా నాటుకుపోయాయి.
అందుకని ఆ జిల్లాలకు ఎప్పుడు వెళ్ళినా ముందు ఆయన రాసిన గ్రామాలను పనిగట్టుకు చూడటం మొదటి ప్రాధాన్యతగా పెట్టుకునేవాడిని. ఆయన రాసినందువల్లా, వి ఎన్ వి కే శాస్త్రి గారు చెప్పినందువల్లా తుపాకుల గూడెం నా దృష్టిలో గిరిజన ప్రేమికుల యాత్రా స్థలాల్లో ఒకటిగా మారిపోయింది. అందుకని మొదటిసారి ఏటూరు నాగారం వెళ్ళినప్పుడు పనిగట్టుకుని తుపాకుల గూడెం వెళ్లి చూశాను. ఏముంది అక్కడ? అన్ని గిరిజన గ్రామాల్లో ఏముందో అక్కడా అదే ఉంది. ఏమి లేదక్కడ ? ప్రతి ఒక్క గిరిజన గ్రామంలోనూ ఏది లేదో అక్కడా అదే లేదు. అయినా అక్కడ ఒక ఇంటి అరుగు మీద కూర్చుని తుపాకుల గూడెం చూశాను అని నాకు నేను చెప్పుకున్నాను.
తిరిగి వచ్చాక, నా వరంగల్ పర్యటనలో నేను చూసిన కొన్ని ముఖ్యమైన స్థలాల మీద, ఒక్కొక్క దాని మీద ఒక కవిత రాశాను. వాటిని గుడిపాటికి పంపిస్తే ఆయన వార్త పత్రికలో అచ్చేసాడు. ఆ కవితల్లో రెండు కవితలు ఇవి. వీటిని పునర్యానం నాలుగో సర్గలో చేర్చకుండా ఎలా ఉంటాను?
నడచినంత మేరా నల్లని కరువు ఛాయ
మేఘం లేని ఆకాశం అన్నం లేని పాత్రలా ఉంది
పోరాటం ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు
ఎప్పుడు ముగుస్తుందో తెలియదు.
కరువు బియ్యం కోసం జనం గుమికూడుతూనే ఉన్నారు
మొక్కజొన్న అంబలి నా చేతులకందిస్తున్నప్పుడు ఆ తల్లి
మున్నెన్నడో ఒక అన్న కోసం అడవిలో
అక్షయపాత్రని తడిమిన అక్కని తలపించింది.
(పునర్యానం, 2.4.14)
A dark shadow follows you wherever you go
Like a pot without food, the sky is cloudless
No one knows when the hardship began,
When it ends.
In the villages, people are lining up for free rice.
As she handed me a bowl of maize soup, I recalled
The legend of her who shared the last morsel
With her brother in the forest.
అడవిదారిన నా కన్నా ముందు నడిచిన వాళ్ల
అడుగుజాడలు.
అవే బాధలు, అదే ఆగ్రహం,
అంతే నిర్లిప్తత.
వినిపించకపోతున్న ఆ పాటలింక వినజాలను.
అదే ఆకలి, అవే చావులు
ఆగని పోరు.
మద్ది చెట్ల అడవిలో వైశాఖగానం లేదు
అడుగడుగునా మందుపాతర్లు.
కృష్ణారావుగారూ,
ఇప్పుడది
నిజంగానే తుపాకుల గూడెం.
(పునర్యానం, 2.4.16)
On the forest path,
I’m tracing the footsteps of those before me.
Misery and anger remain the same, and
Indifference remains the same.
No more unheard melodies
Hunger continues, hunger deaths continue, and
The fight continues.
Yellow green all around, but no spring
It’s a Claymore every step.
Krishna Rao Sir,
Finally, I saw the village of guns.
28-8-2023
“మేఘం లేని ఆకాశం అన్నం లేని పాత్రలా ఉంది“
అడివినీ, గిరినీ, గిరిజనాన్ని, పువ్వునీ, చెట్టునీ, అన్నాన్ని, నీళ్ళనీ, ఆకలినీ, మీ ప్రయాణాన్ని పట్టుకుని మీ కవితల్లోంచీ, రచనల్లోంచీ, చిత్రరచనల్లోంచీ మాకు చూపిస్తున్నందుకు feeling grateful, sir. 🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
వరంగల్ జిల్లాలో 6సంవత్సరాలు పనిచేశాను.ఆ గిరిజన గ్రామాలు,రామప్ప, మేడారం జాతర సందర్శనం లాంటి మంచి అనుభవాలతో పాటు 2001 లో తుఫాకులగూడెం లో చేసిన ఎలక్షన్ డ్యూటి లాంటి చేదు అనుభవం కూడా ఉంది.
మీ కవిత మీ రైటప్ చాలా జ్ఞాపకాలను రేపాయి.
ప్రపంచం చాలా చిన్నది. ఊహించని మిత్రులు ఊహించని స్థలాల్లో కలుస్తారు.
‘మేఘం లేని ఆకాశం అన్నం లేని పాత్రలా ఉంది’.. celluloid image.
ధన్యవాదాలు సార్
సినారె ఆధ్వర్యంలో 1999 లోజరిగిన వచన కవితా శిబిరంలో ఒకరోజు అభ్యాగత కవి మాకు కవిత రాయమని ఇచ్చిన శీర్షిక ‘దారి’.అప్పుడు నేను ఈ దారి కవిత్వమెప్పుడైంది అని ఓ ఆశావహ కవిత రాసినట్లు గుర్తు. కాని ఇప్పుడీ కవితలు చదివిన తర్వాత నడచిన దారి ఎలా కవిత్వమౌతుందో , చేసుకోవాలో తెలుస్తున్నది. నలభై ఏళ్లు ఆ జిల్లాలో పనిచేసినా వారి గురించి ఎక్కువగా తరచి చూచే అవకాశం కల్పించుకోనందుకు నా మీద నాకే కోపం వస్తుంది. చివరి మజిలీ కౌటాల మండలం బోదంపల్లి కావడం చితికిన బతుకుల జాడలు కొన్ని చూసాను.వారికి ఏమీ చేయలేకపోయినా పదవీ విరమణరోజు ఊరందరి అభిమానం కొండంత మూటగట్టుకున్మ అనుభవం మాత్రం మిగిలింది.
మీ మానేరు ముచ్చట్లు చదివిన తర్వాత మీరు చాలానే చేశారని అర్థమవుతుంది.
🙏
ములుగు, ఏటూరునాగారం మధ్య ఉన్న కొన్ని గ్రామాల్ని చూసాను… ఎంతో నిషబ్దం ఆ మట్టి లో ఏదో ఎదురుచూపు కనిపించాయి… అక్కడి మనుషుల్ని చూసాక మాత్రం వారి కళ్లలో ప్రశ్నపూరిత వాతావరణం మాత్రం ఇంకా మనసులో అలాగే వుంది సర్… మీ అనుభవ పాఠాల్లో అలా ప్రయాణించాల్సిందే. So nice
ధన్యవాదాలు మేడం
సర్గూ ,తుపాకుల గూడెం.చూసే అవకాశం నాకూ లభించింది. ఒకప్పుడు అన్నల తుపాకులు కడుపులో దాచుకుని తుపాకుల గూడెం అయింది. ఇప్పుడిప్పుడే ప్రపంచం వైపు అడుగులు వేస్తుంది.
అవును మేడం
సర్,తుపాకుల గూడెం.చూసే అవకాశం నాకూ లభించింది. ఒకప్పుడు అన్నల తుపాకులు కడుపులో దాచుకుని తుపాకుల గూడెం అయింది. ఇప్పుడిప్పుడే ప్రపంచం వైపు అడుగులు వేస్తుంది.