
కరువు, కాటకం, దుర్భిక్షం, వర్షాభావం, అనావృష్టి-ఈ పదాలు మన భాషలో చాలా కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వీటి అర్థాన్ని పూర్తిగా సంశోధించగలిగిన రచయిత గాని, కవి గాని ఇప్పటిదాకా నాకు కనబడలేదు. ఎన్నో ఏళ్ళ కింద అమళ్లదిన్నెగోపీనాథ్ గారు రాయలసీమలోని డొక్కల కరువు గురించిన ఒక జానపద గీతం నాకు పాడివినిపించారు. ఆ గీతం విన్నప్పటికి కరువు అంటే ఎలా ఉంటుందో నేను చూడలేదు. కానీ మాటల్లో చెప్పలేని తీవ్రమైన విషాదం ఏదో ఆయన పాడుతున్నప్పుడు నాకు పొడగట్టకపోలేదు.
నేను శ్రీశైలం వెళ్లిన తొలి రోజుల్లో మా కమిషనర్ రెండు మూడు రోజులకు ఒకసారి ఫోన్ చేసి అడుగుతూ ఉండేవాడు, ‘హౌ ఈజ్ ది వెదర్? వానలు పడుతున్నాయా?’ అని అడిగేవాడు. లేదని చెప్పే వాణ్ణి. మూడునాలుగు వారాల తర్వాత ఆయన అడగడం మానేశాడు. నేను అక్కడికి వెళ్లడం మే నెలలో వెళ్ళాను. దాదాపు ఆగస్టు దాకా ఆ పల్లెలు, అడవులు, ఆ పొలాలు, ఆ మనుషులు నాకు అంతా ఏదో ఒక బీభత్సమయంగా ఉండే చలనచిత్రం చూస్తున్నట్టే ఉండేది. నేను అర్థం చేసుకోలేని ఏదో భాషలో రాసిన ఒక విషాద అధ్యాయాన్ని బొమ్మల్లో చూస్తున్నట్టుగా ఉండేది.
ఆ దృశ్యాల్లో చాలా దృశ్యాల్ని మరపు మింగేయగలిగింది. ఇంకా ఏమైనా మనోఫలకం మీద మిగిలి ఉంటే పిచ్చి గీతల్లాంటి కొన్నికొక్కిరి బిక్కిరి దృశ్యాలు మిగిలి ఉన్నాయి. అట్లాంటి ఒక దృశ్యం మీకు చెప్పాలని ఉంది.
ఒకరోజు నేను అమ్రాబాద్ నుంచి మారడుగు మీదుగా మద్దిమడుగు వెళుతున్నాను. అది పూర్వపుమహబూబ్ నగర్ జిల్లాలో పూర్తి లోతట్టు ప్రాంతం. జూన్ లోనో, జూలై లోని ఒకరోజు ఆ దారంట వెళుతున్నప్పుడు ఎర్రటి ఎండ కాస్తూ ఉంది. ఆకాశంలో చిన్న మబ్బుతునక కూడా లేదు. అక్కడ ఒక పొలంలో ఒక దృశ్యం నన్ను కట్టిపడేసింది. ఆ పొలంలో అప్పటికి రెండు వారాల కిందట పత్తి విత్తనాలు చల్లినట్టున్నారు. ఆ విత్తనాల్లోంచి ఎట్లానో లేత మొలకలు నేలని చీల్చుకుని పైకి రాగలిగాయి. అంటే అవి పైకి వచ్చే వేళల్లో ఒకటి రెండు వానలు పడి ఉంటాయి. ఆ తర్వాత వానల్లేవు. ఆ మొక్కలు మరింత పైకి ఎదగడానికి వీలు లేకుండా చుట్టూ నేల బిగిసిపోయింది. ఆ చిన్నారి మొక్కలకి ఊపిరి ఆడటం లేదు. ఒక ముసలామె చిన్న చిన్న బొరిగెతో ఒక్కొక్క మొక్క చుట్టూ బిగిసిపోయిన నేలను కొద్దికొద్దిగా గుల్ల చేస్తూ ఉంది. అట్లా పొలం మొత్తం అంతా ఆమె ఎప్పటికీ చేయగలిగేను? కొన్ని వందల మొలకలు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క మొక్కచుట్టూ నేల గుల్లపరుచుకుంటూ పోతున్న ఆ ముసలామె ఇప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆమె ఆ పని పూర్తి చేయగలిగిందా? ఏమో తెలియదు. మరికొన్నాళ్లదాకా నేనా దారిన పోవడానికి సాహసించలేకపోయాను.
సరే. ఆ పరిస్థితుల్తో ఎలా పోరాడేమో, ఎటువంటి వ్యూహాలు వెతుక్కున్నామో, ఏ ఏ శక్తులతో ఎట్లా తలపడ్డామో- అదంతా వేరే కథ. ఎప్పటికైనా వివరంగా రాసి తీరవలసిన కథ. కానీ పునర్యానంలో ఆ అధ్యాయం మాత్రం తప్పనిసరిగా ఉండాలని నాకు అనిపించింది. నా చిన్నతనంలో మా ఊళ్లో నేను చూసిన ఆ వసంత కాలానికీ, ఆ తీపి గాలులకీ, ఆ తేనెవాకలకీ ఇక్కడ నేను కళ్ళారా చూస్తున్న దుమ్ముకీ, దుఃఖానికీ మధ్య దూరం నా అంచనాకు అందలేదు.
కరువు దృశ్యాల్ని కవితలుగా మార్చటం నాకు చేతనైన పని కాదు. ఈ కవితలు కూడా ఎలా నిర్మించాలి అని ఆలోచించి రాసినవి కావు. ఒక frenziness లోంచి పుట్టుకొచ్చినవి అవి. ఎండిన చెట్టు బెరడులోంచి పొడుచుకొచ్చిన ముళ్ళలాగా.
నేల పొడుగునా మంటలు, నీళ్లు పొయ్యాలి,
దారులన్నిటా మంటలు, నీళ్లు పొయ్యాలి,
అడవి అంతటా మంటలు, నీళ్లు పొయ్యాలి,
చెలరేగిందొక పొగ గ్రామాల్లో, నీళ్లు పొయ్యాలి.
ఊరచెరువు మీద మంటలు, నీళ్లు పొయ్యాలి,
పత్తి చేల మీద మంటలు, నీళ్లు పొయ్యాలి,
ఇండ్ల కప్పుల మీద మంటలు, నీళ్లు పొయ్యాలి,
ఎండుడొక్కల మీద మంటలు, నీళ్లు పొయ్యాలి.
జూన్ నెలలో మంటలు, నీళ్లు పొయ్యాలి,
జూలై నెలలో మంటలు, నీళ్లు పొయ్యాలి,
ఆగష్టు నెలలో మంటలు, నీళ్లు పొయ్యాలి,
ఆకాశమంతటా మంటలు, నీళ్లు పొయ్యాలి.
(పునర్యానం, 2.4.12)
There’s fire on the land, get some water.
Fire all over the path, get some water
The forest is ablaze, get some water
Smoke engulfs the village, where’s the water?
The village tank is on fire, get some water
Cotton fields on fire, get some water
The roofs are burning, get some water
Fire in the stomachs, where’s the water?
There’s a fire in June, get some water.
There’s a fire in July, get some water.
There’s a fire in August, get some water.
A firestorm in the sky, where’s the water?
కరువు వాన కురిసింది,
చెరువు కట్టండి, కాలవ తియ్యండి,
దుక్కి దున్నండి,
కలుపు తియ్యండి.
కరువు పైరు పెరిగింది,
మంచె వెయ్యండి, కాపు కాయండి,
కుప్ప నూర్చండి,
తాలు దులపండి.
కరువు పంట పండింది,
ఎత్తండి దుమ్ము గోతాల్లో,
నింపండి అప్పు గాదెల్లో,
పాట పాడండి దెయ్యాల్తో.
(పునర్యానం, 2.4.13)
Famine is raining down
Dig canals, build tanks
Till the fields and
Take out the weeds.
Famine is in full bloom
Fence the crop, guard it
Shred the corn, and
Winnow the grain.
Time for famine harvest
Bag up the dust
Add debt to the granary, and
Join the chorus of devils.
28-8-2023
దుర్భర దృశ్యాలు చూసి నిస్సహాయ పరిస్థితిలో నిలబడినప్పటి వేదన వర్ణనాతీతం.అది ఎదలో రేపే మంట కార్చిచ్చు కన్నా ఎక్కువే .
ఆర్చలేని తీర్చలేని అశక్తత
వర్షాలు కురిపించలేని
ఆశలు మొలిపించలేని
ఉక్రోషం ఎవరిమీద చూపాలో తెలియని
దుస్థితి దుర్నిరీక్ష్యమై
గుండె అగ్ని పర్వతమైనప్పుడు
లావాలా దుఃఖోద్రేకం
రగులుతూ కణకణమండుతూ
నిప్పుద్రావకం నీగుండె నెత్తురై
స్రవించడం ఒక అత్యైక అనుభవ దృశ్యం
ఎన్నడో చల్లారడానికి తెల్లవారుతుంది
ఈ అక్షరాక్షర మానవీయబీజాలు
ఏ సారవంతపు లావా మైదాల్లోనో
పూలతోటలు విరబూయకపోవు
పళ్ల తోటలై ఫలదాతలు కాకపోవు
శ్రేయఃకాముడైన కవి కల నిజం రాకపోదు
ఆశా మేఘం ఆషాఢమేఘమై
ఆర్ద్రత కురిపించక పోదు
కవి క్రాంతదర్శి. మీ స్పందనకు నమోవాకాలు.
కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న కాలం కన్నీటి కవిత
ధన్యవాదాలు సార్
Bavundi sir
Thank you Rupa!