పునర్యానం, 26 & 27

గిరిజనసంక్షేమాధికారిగా జిల్లాల్లో పనిచేసినతర్వాత రెండేళ్ళు హైదరాబాదులో కేంద్ర కార్యాలయంలో పనిచేసాను. అనుకోని కారణాల వల్ల హటాత్తుగా శ్రీశైలంలో ఉన్న సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థకి ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించవలసి వచ్చింది. నల్లమల అడవుల్లోనూ, ఆ అడవులకి ఆనుకుని ఉన్న గ్రామాల్లోనూ నివసిస్తున్న చెంచువారి అభివృద్ధికోసం ఏర్పాటైన ఐటిడిఎ అది. ఒక గిరిజన తెగకోసం భారతదేశంలోనే ఒక గిరిజన తెగకోసం ప్రత్యేకంగా ఏర్పాటైన మొదటి ఐటిడిఎ అది. అక్కడ మూడేళ్ళు ఉన్నాను. ఆ అనుభవాల్ని ఇంకా గ్రంథస్థం చెయ్యవలసి ఉంది.

పునర్యానం నాలుగవ సర్గలో అప్పటి అనుభవాలన్నిటి బదులు, ముఖ్యంగా ఆ కరువురోజుల జ్ఞాపకాల్ని కవితలుగా మార్చగలనా అని చూసాను. నా జీవితంలో అప్పటిదాకా కరువు ఎలా ఉంటుందో నాకు తెలియదు. సకాలంలో వర్షాలు పడకపోతే, వ్యవసాయ పనులు మొదలవకపోతే, అడవిలో చెట్లు పూయకపోతే, తేనెటీగలు తేనె సేకరించకపోతే, అడవిమీదా, గ్రామాల్లో రైతులమీదా ఆధారపడ్డ అన్నార్త మానవసమూహాలు ఎలా విలవిల్లాడిపోతాయో ఆ రోజుల్లో నేను కళ్ళారా చూసాను. అటువంటి అనుభవాల్ని తెలుగులో చిత్రించిన రచనలు కూడా అప్పటిదాకా నేనేమీ చదవలేదు. నేను కళ్ళతో చూసిన ఆ దృశ్యాల్ని ఎలా చిత్రించాలో, వాటికి ఎటువంటి పదజాలం కావలసి ఉంటుందో నాకు తెలియదు. అటువంటి నమూనాలు కూడా ఏవీ నా ముందు లేవు. అయినా ప్రయత్నించాను. నల్లమల అడవుల్లో మాత్రమే కాక, ఆ తర్వాత రోజుల్లో తెలంగాణా గిరిజనప్రాంతాల్లో, వరంగల్, అదిలాబాదు అడవుల్లో చూసిన దృశ్యాల్ని కూడా ఆ సర్గలో కొన్ని కవితలుగా మలచడానికి ప్రయత్నించాను.

మొదటి సర్గల్లో కవితల్లో లేతపసుపు, నారింజ, గులాబీ ఎరుపు, లేతాకుపచ్చ లాంటి రంగుల్ని వాడితే, ఈ కవితల కోసం నలుపు, ధూసరవర్ణం, ముదురు ఇటుకరంగు, బూడిదరంగు, ఎండిపోయి నెర్రెలు విచ్చిన మట్టిరంగుల్ని వెతుక్కున్నాను.

కాని నేను పూర్తిగా సఫలమయ్యానని చెప్పలేను. 1997 జూన్, జూలై నెలల్లో నేను చూసిన కరువు దృశ్యాల్తో నాకు ఒక్కసారిగా వార్థక్యం ముంచుకొచ్చినట్టనిపించింది. ఎన్నో గ్రంథాలు, ఆర్థికశాస్త్రాలు, విశ్లేషణలు ఇవ్వలేని వివేకం ఒకటి రెండు సంఘటనలతోనే జీవితం నాకు పూర్తిగా నూరిపోసిందనిపించింది. అటువంటి ఒక సంఘటన మీకు చెప్పాలని ఉంది.

పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో అమ్రాబాద్ మండలంలో తాటిగుండాల ఒక చిన్న చెంచుపెంట. మొత్తం గూడెమంతా కలిపి పది పన్నెండు గుడిసెలు. ఆ ఎండిపోయిన అడవిలో ఆ గుడిసెలు కూడా ఎండిపోయిన పొదల్లానే ఉన్నాయి. తాటి ఈదన్న ఆ గూడేనికి పెద్దమనిషి. అతను నన్ను తన గూడేనికి రమ్మని పిలిస్తే వెళ్ళాను. అతడు తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇల్లంటే ఇలా అది? బోర్లించిన పెద్ద గాబులాగా ఉంది. అతడూ, అతడి భార్యా, ఒకరో ఇద్దరో పిల్లలు. అందరూ జీవిస్తున్నది ఆ జానెడు నీడలోనే. ఆ కుటిలో ఒక పక్కన రెండు గాదెలున్నాయి. గాదె అంటే మరేమీ కాదు, పొడుగ్గా ఉండే ఒక వెదురు గంప. అందులో ఒకదానిలో నిండా, మరొకదానిలో సగం దాకా మొక్కజొన్న గింజలున్నాయి. ఆ గంపలో చెయ్యి పెట్టి ఆ గింజలు చేతుల్లోకి తీసుకుని చూసాను. గింజలో సగం తాలు.

ఈదన్న నన్ను బయటికి తీసుకొచ్చాడు. చెట్టుకింద నిలబడ్డాం. అప్పుడతను నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. ‘సామీ, లోపల మా ఆడమనిషి వింటుందని బయటికి తీసుకొచ్చాను. ఒక మాట చెప్పాలి నీకు. మా గూడెంలో ఎవరికీ తిండిలేదు. అల్లాడిపోతున్నారు. వానల్లేవు. పనుల్లేవు. నేను గూడేనికి పెద్దమనిషిని కాబట్టి నాకేసి చూస్తున్నారు. నేనేం చెయ్యగలను? ఇదుగో, నువ్వు చూసావు కదా, ఆ రెండు గంపల్లో మక్క. అదొక్కటే నా దగ్గరుంది. అది రోజూ కాచి గంజిపోస్తే మా వాళ్ళు బతుకుతారు. కాని మా ఆడమనిషికి ఇష్టంలేదు. ఉన్నదంతా ఊళ్ళోవాళ్ళకి దానం చేసేస్తే నీ పిల్లలెట్లా బతికేది? అనడుగుతుంది. ఏం చెయ్యమంటావు చెప్పు? నాకు నువ్వే ఏదో ఒక దారి చూపించాలి’ అన్నాడు.

ఆ క్షణాన నాకు అమ్రాబాదులో ఒక చెంచుగూడెంలో ఉన్నాననిపించలేదు. ఏదో ఒక ఆఫ్రికన్ దేశంలో, ఒక పురాతన గిరిజన తెగ మధ్య, ఆ గిరిజనుల పాట్రియార్క్ ముందు నిలబడ్డట్టుగా అనిపించింది. అటువంటి ఒక జీవితం ఉందనీ, అటువంటి ఒక సమస్య వాళ్లని ముంచెత్తగలదనీ, అప్పటిదాకా ఏ రచయితలూ, ఏ రాజకీయనాయకులూ, ఆ వార్తాపత్రికలూ నాకు చెప్పలేదు. తన కుటుంబాన్నీ, పిల్లల్నీ కూడా పక్కనపెట్టి ఉన్న నాలుగుగింజలూ తన మనుషులకోసం ధారపోయడానికి సిద్ధంగా ఉన్న ఆ పితృప్రభువుని వర్ణించాలంటే బహుశా ఒక డేవిడ్ డియోప్, ఒక సెంఘార్, ఒక చినువా అచెబె లాంటి వాళ్ళు మళ్ళా పుట్టుకు రావాలేమో!

అదృష్టవశాత్తూ, సరిగ్గా అప్పుడే భారతప్రభుత్వం గ్రెయిన్ బాంక్స్ స్కీము మంజూరు చేసింది. అందులో ఒక గ్రెయిన్ బాంకు ఆ గూడెంలో కూడా తెరిపించాం. ఆ వానాకాలానికి వాళ్లు ఆ కరువునుంచి బయటపడ్డారు. ఆ వైనమంతా మా కమిషనరుకి చెప్పాను. ఆయన ఏమీ మాట్లాడలేదు. సరిగా వినలేదేమో అనుకున్నాను. కాని ఆ తర్వాత జరిగిన ప్రాజెక్టు అధికారుల సమావేశంలో ఆ సంగతంతా వాళ్లకి చెప్పి’నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు subsistence economies గురించి చదివాను గాని, ఇదుగో, మనవాడు ఈ సంగతి చెప్పాకనే ఆ సబ్జెక్టు ఇప్పుడు నాకు క్షుణ్ణంగా అర్థమయ్యింది’ అన్నాడు!


కరువు కమ్మినప్పుడు పంట పంటగా బతకడం కష్టం
కరువు కమ్మినప్పుడు నేల నేలగా బతకడం కష్టం
కరువు కమ్మినప్పుడు ఊరు ఊరుగా బతకడం కష్టం
కరువు కమ్మినప్పుడు మనిషి మనిషిగా బతకడం కష్టం.

వేల యోజనాల దూరంలో ఉన్నా
పసిగట్టడం కష్టం కాదు కరువొచ్చిందని-
బుజాన్నెత్తుకుని అప్పటిదాకా ఆడిస్తున్న తల్లి
పడతోసి కిందకు నిందిస్తుంది పిల్లని:
‘నువ్వు బిడ్డవి కావే, శాపానివి’

(పునర్యానం, 2.4.7)


In times of famine, crops cannot remain as crops
In the shadow of famine, earth cannot remain earthly
Villages are no longer villages when famine spreads, and
In the face of famine, man cannot remain human.

Even a hundred miles away, famine is evident:
As mothers rock their babies,
They suddenly throw them down, and
Heap curses upon them.


తిండిలేని పిల్లలున్న గ్రామాల్లో
పువ్వులు నల్లగా ఉంటాయి.
పిల్లలకు తిండి లేని గ్రామాల్లో
చెట్లు రాళ్లల్లా ఉంటాయి.

తిండిలేని పిల్లలున్న గ్రామాల్లో
పాలు నల్లగా ఉంటాయి.
పిల్లలకు తిండిలేని దేశాల్లో
రొట్టెలు రాళ్లల్లా ఉంటాయి.

తిండిలేని పిల్లలున్న గ్రామాల్లో
పాటలు నల్లగా ఉంటాయి.
పిల్లలకు తిండి లేని లోకంలో
మాటలు రాళ్లల్లా ఉంటాయి.

(పునర్యానం, 2.4.11)


In villages without food,
Flowers appear dark.
When children starve,
Trees become stones.

In countries without food,
Milk turns dark.
When children starve,
Bread becomes stone.

In a world without food,
Songs sound dark.
When children starve,
Poems become stones.

27-8-2023

16 Replies to “పునర్యానం, 26 & 27”

  1. పేదలకు తిండి లేని దేశములో
    నరకసుడి గౌడనల్లో మగ్గిపోతుంటాయి
    🙏🙏

  2. జ్ఞాపకాల దారుల్లో పయనం…
    కలమే కుంచెగా మారిన వైనం!

  3. గుండె పిండినట్లయిందని చాలాసార్లు చదివాను. ఇప్పుడు అనుభవించాను. చదువుకూ ప్రత్యక్షాధ్యయనానికీ తేడా మీ పైఅధికారి నోట వినడం మీ ప్రగాఢ కార్యనిమగ్నతకు చిహ్నం. మీరు ఆదిలాబాదు ఐటిడిఎ లో పని చేసినప్పుడు మీ పరిచయం అనేక మంది ఉపాధ్యాయుల నోటివెంట విన్న రోజులు గుర్తుకు వస్తున్నాయి .ఇప్పటికీ మిమ్మల్ని హృదయదఘ్నంగా అభిమానించే ఉపాధ్యాయులు నాకు తెలుసు. అందుకే నేను నా జీవిత చరిత్ర రాయకపోయినా అందులో మీ పరిచయం ముందు పూర్వభాగం పరిచయం తరువాత ఉత్తరభాగమౌతుంది.
    వజ్రసంకల్ఫజన్ములు కొందరే ఉంటారు తరానికి. అదేదో ఉపనిషత్తులో చెప్పినట్లు వారి వల్లనే లోకం కొనసాగుతుంది. అలాంటి వారిలో మీరొకరు. నమస్సులు.

  4. కన్నీరు ఒక్కటే దీనికి సమాధానం

  5. కన్నీటినీ తాగేసిన కరువు..
    చార్కోల్ ను గుర్తుపట్టగలిగాను!

  6. ఏడ్చేనంటే మీరు నమ్ముతారా సార్?!

  7. నల్లబడ్డ పువ్వుల్ని , పాలని, పాటల్ని చూసీ పరితపించని పాలనా నలుపే…సర్

  8. కరువులో కూడా.. నలుగురి గురించి ఆలోచించే ఆలోచన ఆ అడవికే అద్భుతం

Leave a Reply

%d bloggers like this: