పునర్యానం-25

పునర్యానం రెండో అధ్యాయంలో మూడో సర్గలో నా ఉద్యోగజీవితపు మొదటి ఏళ్ళల్లో నేను పొందిన అనుభవాలను కవితలుగా మార్చానని చెప్పాను. గిరిజన సంక్షేమ శాఖలో చేరిన తర్వాత మొదటి ఎనిమిదేళ్ళల్లో నేను పూర్వపు విజయనగరం, విశాఖపట్టణం, అదిలాబాదు, కర్నూలు జిల్లాల్లో పనిచేసాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లోనూ పనిచేసే అవకాశం లభించింది నాకు. దండకారణ్యం, నల్లమల, గోడ్వానా అడవుల్లో తిరిగే అవకాశం దొరికింది. ఆ కాలమంతటా ఆ ప్రాంతాల్లో నేను చూడగలిగినన్ని గిరిజనగ్రామాలు చూసేను. తిరగగలిగినన్ని కొండదారుల్లో, అడవిదారుల్లో నడిచేను. నాతో పాటు సర్వీసు కమిషను సెలక్టు చేసిన నా మిత్రులెవ్వరూ నేను తిరిగినన్ని రాళ్ళదారుల్లో నడిచినవాళ్ళు కారు. ఆ భాగ్యం నాకు మాత్రమే దక్కిందని అనుకుంటూ ఉండేవాణ్ణి.

ఆ ఎనిమిదేళ్ళ అనుభవాలూ ‘నా కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ లో విపులంగా రాసాను కాబట్టి, పునర్యానంలో కూడా వాటిని ఎక్కువ ప్రస్తావించలేదు. ఆ రోజుల్ని తలుచుకుంటే ఇవాళ నా కళ్ళముందు కదలాడేది ఆ సంతలూ, ఆ వేడుకలూ, ఆ బాజాలూ, ఆ రంగులూ, ఆ నాట్యాలూ మాత్రమే కాదు, ఆ ఒలిసె పూలూ, ఆ ఇప్పచెట్లూ, ఆ మామిడిపూతా, ఆ గుగ్గిలంచెట్లనీడలూ, ఆ తేనెపెరలూ, ఆ చంద్రవంకలూ, ఆ సూర్యకాంతులూ కూడా. నా హృదయానికి ఇంకా అంటుకుని ఉండిపోయిన కొంత పరాగాన్ని మూడవసర్గలో పంచడానికి ప్రయత్నించేను. ఇక ఆ సర్గ చివరికి చేరుకున్నాక ఈ కవిత రాసాను.

ఒక మనిషి తన జీవితంలో తాను ఏమి వెతుక్కున్నాడు, ఏమి పొందాడు అనేది ఒక ప్రశ్న. ‘నువ్వెలా గడిపేవో, నువ్వేమి చేసావో గుర్తు తెచ్చుకో’ అంటుంది ఈశోపనిషత్తు. కాని ఈ సర్గ చివరికి చేరుకునేటప్పటికి నాకు స్ఫురించిన ప్రశ్న: ‘నువ్వేమి వెతుక్కున్నావు? ఏమి పొందావు?’ అన్నది కాదు. ‘నువ్వు నడిచిన దారుల్లో నిన్ను ప్రేమించినవాళ్లకోసం నువ్వేమి ఇచ్చావు? వాళ్ళేం తీసుకున్నారు’ అన్నది. ‘నువ్వు ఏమిచ్చావు’ అని కూడా కాదు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ‘నీ ద్వారా వాళ్ళకి అందిందేమిటి?’ అనాలి.

ఈ సమయాన నాకో సంఘటన గుర్తొస్తోంది. నేను కర్నూలు జిల్లాలో పనిచేస్తుండగా చెంచు గూడేల బాగోగులు చూసి ఎప్పటికప్పుడు తనకి చెప్పమని కలెక్టరు గారు అడుగుతుండేవారు. నేను ఏదేనా గూడేనికి వెళ్ళి అక్కడ ఏదన్నా సమస్య కనిపిస్తే, అది నా స్థాయిలో పరిష్కరించగలిగేది కాకపోతే, వెంటనే తిరిగొచ్చాక, కలెక్టరుగారికి చెప్పేవాణ్ణి. చెప్పవలసిన పని కూడా లేదు. ఒక తెల్లకాగితం మీద నోటు రాసి, ఆ సమస్యని ఫలానా విధంగా పరిష్కరిద్దాం అని ప్రతిపాదిస్తూ ఫైలు పంపిస్తే, ఇలా వెళ్ళిన ఫైలు అలా ఆయన ‘యెస్’ అనే మాటతో తిరిగి వచ్చేది. ఆయన నేను ఏ ఫైలు పెట్టినా ‘యెస్’ అని రాస్తాడని తెలిసిన నా కొలీగ్ ఒకాయన, ‘చూడబోతే నువ్వు ఆయనకు బాస్ లాగా ఉన్నావు, ఆయన నీకు యెస్ మాస్టర్ గా ఉన్నాడే’ అని జోక్ చేసాడు కూడా. కలెక్టరుగారికి చెంచువాళ్ళ పట్ల ఉన్న ప్రేమ అటువంటిది అని అతడికి కూడా తెలుసు.

అటువంటి రోజుల్లో పంచాయతీ రాజ్ శాఖకి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఒకాయన నాకు ఫోన్ చేసి తనకి మంజూరైన స్కూలు బిల్డింగుల్లో ఇంకా పది పన్నెండు బిల్డింగులు మిగిలి ఉన్నాయనీ, చెంచుగూడేల్లో ఏదైనా అవసరమైతే చెప్తే తాను మంజూరు చేయిస్తాననీ చెప్పాడు. అప్పట్లో ఆ గూడేల్లో దాదాపు ఇరవై దాకా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండేవి. వాటికి వేటికీ సొంతబిల్దింగులు లేవు. అవి గొడ్లపాకల్లోనో లేదా పాడుపడ్డ గుడిసెల్లోనో, లేదా చెట్టుకిందనో నడిచేవి. పది పన్నెండు బిల్డింగులంటే ఆ రోజు లెక్కల్లో కోటిరూపాయల మాట. అసలు ఒక పెద్దమనిషి తనంతట తను ఫోన్ చేసి బిల్డింగులు కావాలా అని అడగడం కోట్ల కన్నా విలువైన మాట.

ఆయన చెప్పినట్టే ఫైలు పంపాను. బిల్దింగులు మంజూరయ్యాయి. నేనక్కడ ఉండగానే ఆ స్క్కూళ్ళు కొత్త బిల్డింగుల్లో నడవడం మొదలుపెట్టాయి కూడా.

కాని ఆయన అలా ఫోన్ చెయ్యగానే ముందు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, జిల్లాపరిషత్తులోనూ, మండల పరిషత్తుల్లోనూ బిల్డింగులు కావలసిన స్కూళ్ళేవీ తక్కువ లేవు. వాటిని వదిలిపెట్టి గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలకు బిల్డింగులు ఇవ్వడానికి పంచాయత్ రాజ్ శాఖ కి చెందిన ఏ ఇంజనీరు కూడా ముందుకు రాడు. అదీకాక, ఆయన నాకు చేసిన ఫోన్ కాల్ ఏ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలకో చేసి ఉంటే, వాళ్ళు ఎగిరి గంతేసి ఉండేవారు, ఆయన్ని నెత్తిమీద పెట్టుకుని ఉండేవారు. మరెప్పుడేనా ఆయనకి ఏదైనా పని పడితే తోడునిలబడి ఉండేవారు. పోనీ ఇ ఇ గారు చెంచువారి మీద ప్రేమతోటే ఆ ప్రతిపాదన చేసాడనుకున్నా, ఆయన ఆ మాటేదో నన్ను అడగడానికి బదులు నేరుగా కలెక్టరుగారితోటే చెప్పి ఉంటే, కలెక్టరు దృష్టిలో ఆయన విలువ మరింత పెరిగి ఉండేది. కాని ఆ రెండు మార్గాలూ వదిలిపెట్టి, ఇ ఇ గారు, తనకి ఏ విధంగానూ ఉపయోగపడని, నాకు ఎందుకు ఫోన్ చేసినట్టు?

ఆలోచిస్తే ఒకటనిపించింది. ఆయన నన్ను అప్పటికే కొన్ని నెలలుగా చూస్తున్నాడు. నా పని చూస్తున్నాడు. నా మీద నమ్మకం కుదిరింది. నా పనిలో తాను కూడా ఏదో ఒక విధంగా భాగస్వామి కావాలనుకున్నాడు. ఆ మంచి పని ఏదో నా పేరుమీదనే జరిగితే బాగుణ్ణని అనుకున్నట్టున్నాడు. అదీకాక, అది తన ప్రతిపాదనగా కలెక్టరు ముందు పెడితే, ఏమో, ఏమి చెప్పగలం? కలెక్టరుకి మరేవైనా ప్రాధాన్యతలు ఉండి ఉంటే? అదే చెంచుగూడేల కోసమని నేను ఫైలు పంపితే ఆయన మరింకేమీ ఆలోచించకపోవచ్చు.

ఒక మనిషి రాళ్ళ మధ్యా, ముళ్ళ మధ్యా ఎంతదూరమేనా నడిచి ఉండవచ్చుగాక. నడిచినంతసేపూ ఎంత నరకమేనా అనుభవించి ఉండవచ్చు గాక, కాని, ఆ రోజులన్నీ గడిచిపోయేక, ఎప్పుడేనా, ఆ కాలం మరొకసారి కళ్ళముందు కదిల్తే, చివరికి మిగిలేది, ఇదుగో, ఇటువంటి గుర్తులు.


ముగిద్దాం అధ్యాయాన్ని పిల్లల నవ్వుల్తో, పసుపు పువ్వుల్తో
నవ్వుల్తో, నాట్యాల్తో,
ప్రయత్నాలతో, గాయాలతో కిక్కిరిసిన అధ్యాయాన్ని
ఎడతెగని ప్రయాణాల్ని, ఆ కొండ దారుల్ని, ఆ వాగువంకల్ని చంద్రవంకల్ని.

నడుస్తున్నప్పుడు తక్కిన ప్రపంచమంతా వివిధ పథాల
నడిచావు నువ్వు అడివిదారుల,
‘ఏం వెతుక్కున్నావు? ఏం పొందావు?’’
ఆకాశమే నా ముందు కనుగీటి అడుగుతోంది.

ఆకాశమా, అడగవలసిందది కాదు
అడగవలసిన ప్రశ్న ఇది:
‘నువ్వు నడిచిన దారుల్లో నిన్ను నమ్మినవాళ్ల కోసం
నువ్వేమిచ్చావు? వాళ్ళేం తీసుకున్నారు’

(పునర్యానం, 2.3.20)


We are at the end of a chapter full of fights and wounds.
Children’s smiles and yellow flowers will close it, as will a dance and laughter.
The journeys, the paths, the rivers, and the moonlit nights are over.

As the rest of the world went about its business,
You walked along a rocky path.
The sky is winking at me now, probing me-
‘In the midst of it all, what did you long for and what did you find?’

I don’t think it’s this way, dear-
Possibly, you should ask like this:
‘Along the way, what have you given to your people, and
What have they received?’

26-8-2023

13 Replies to “పునర్యానం-25”

  1. ఒక మనిషి రాళ్ళ మధ్యా, ముళ్ళ మధ్యా ఎంతదూరమేనా నడిచి ఉండవచ్చుగాక. నడిచినంతసేపూ ఎంత నరకమేనా అనుభవించి ఉండవచ్చు గాక, కాని, ఆ రోజులన్నీ గడిచిపోయేక, ఎప్పుడేనా, ఆ కాలం మరొకసారి కళ్ళముందు కదిల్తే, చివరికి మిగిలేది, ఇదుగో, ఇటువంటి గుర్తులు.
    నమస్సుమాంజలి.

  2. ఈ కవితను “కొన్ని కలలు-కొన్ని మెలకువలు”లో చూసానా? మిమ్మల్ని నాకు ఆత్మీయంగా పరిచయం చేసిన పుస్తకం అది.

  3. “నువ్వు నడిచిన దారుల్లో నిన్ను
    నమ్మినవాళ్ల కోసం నువ్వేమిచ్చావు!వాళ్లేం తీసుకున్నారు”

    అపారమైన ప్రేమానురాగాలు
    చదువు సంస్కారాలు
    ఇంకా ఏం కావాలి భోగ భాగ్యాలు
    నాలుగు అక్షరాలు నేర్పగలిగినా
    అవి వారి కి లభించిన అక్షయ పాత్రలే కదా!

  4. మీరు నమ్మకాన్నే ఇచ్చారు, వారు నమ్మకాన్నే మిగిల్చుకున్నారు…సర్

  5. నేనేమివ్వడానికి ప్రయత్నించానో నాకు తెలుసు కాని వారికి ఏమందిందో నాకు తెలియదు సర్.

Leave a Reply

%d bloggers like this: